ముందుంది ముప్పు.. చేయద్దు తప్పు.. గమనించగలరు | Hyderabad: Third Wave Of Covid 19 Precautions Needed Safe | Sakshi
Sakshi News home page

ముందుంది ముప్పు.. చేయద్దు తప్పు.. గమనించగలరు

Published Thu, Oct 28 2021 7:31 AM | Last Updated on Thu, Oct 28 2021 12:08 PM

Hyderabad: Third Wave Of Covid 19 Precautions Needed Safe - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లోనే కాదు..గ్రేటర్‌ జిల్లాల్లోనూ కరోనా కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ అనేక మంది కోవిడ్‌ పరీక్ష కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయినా జనం వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. కోవిడ్‌ నిబంధనల్ని యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. మాస్క్‌ను, భౌతిక దూరాన్ని మర్చిపోయారు.

లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయడం..వ్యాక్సిన్‌ వేసుకున్నామన్న ధీమాతో చాలా మంది వీకెండ్‌ పార్టీలు, ఫంక్షన్లు, మార్కెట్ల పేరుతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఫలితంగా మళ్లీ వైరస్‌ బారినపడుతున్నారు. గతంతో పోలిస్తే..ప్రస్తుతం చికిత్సకు పడుతున్న సమయం రెట్టింపైంది. రికవరీ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుండటంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రోజుకు సగటున వందకు పైనే కేసులు నమోదవుతున్నాయి. ఇదే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే..భవిష్యత్తులో థర్డ్‌వేవ్‌ రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.       

సరిహద్దులో ఉన్న చైనా సహా ఇతర ప్రపంచదేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ తరహాలో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి ఫీవర్‌ సర్వే నిర్వహించి, టీకాల కార్యక్రమం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించింది.  

విద్యా సంస్థల్లో కన్పించని భౌతికదూరం
కేసులు తగ్గక పోయినప్పటికీ..విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను పునఃప్రారంభించింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించాలని సూచించింది. అయినా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్కో గదిలో 40 నుంచి 60 మంది విద్యార్థులను కూర్చొబెట్టి పాఠాలు బోధిస్తున్నాయి. తరగతి గదులను కనీసం శానిటైజ్‌ చేయడం లేదు.

విద్యార్థులే స్వయంగా శానిటైజర్లను వెంటతెచ్చుకుని వారు కూర్చొనే ప్రదేశాన్ని శానిటైజ్‌ చేసుకుంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు పారిశుధ్యలోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను మున్సిపాలిటీ, గ్రామపంచాయితీలకు అప్పగించినప్పటికీ అక్కడి పారిశుధ్య కార్మికులు ఇందుకు నిరాకరిస్తుండటం ఆందోళన క లిగిస్తుంది. 

రెండో డోసు కోసం తప్పని నిరీక్షణ.. 
►  ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్‌ జిల్లాల్లో ఇప్పటి వరకు 1,05,98,603 మందికి టీకాలు వేయగా, వీరిలో 43,17,778 మంది రెండు డోసులు పూర్తి చేసుకోగా, మరో 75,32,946 మంది ఫస్ట్‌ డోసు పూర్తి చేసుకుని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు.

►  మొదట్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 720 కేంద్రాల్లో టీకాలు వేశారు. ప్రస్తుతం వీటి సంఖ్యను వందలోపునకే కుదించారు. ఫలితంగా ఇప్పటికే ఫస్ట్‌ డోసు వేసుకుని, రెండు డోసు గడువు సమీపించిన వారికి నిరీక్షణ తప్పడం లేదు.

► ఏ సెంటర్‌లో ఏ టీకా వేస్తున్నారో తెలియక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాదు మొదట్లో 364 కేంద్రాల్లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే...ప్రస్తుతం వంద కేంద్రాల్లోనే చేస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. 

నవంబర్‌ 3 వరకు వందశాతం పూర్తి 
కోవిడ్‌ నియంత్రణ, టీకాల వేగవంతం కోసం గ్రామస్థాయిలో మల్టీ లెవల్‌ డిసిప్లీనరీ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుల్లో ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయితీ కార్యదర్శులు, వీఆర్‌ఏలను సభ్యులుగా నియమిస్తున్నాం. వీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి, ఇప్పటి వరకు టీకా తీసుకోని వారితో పాటు ఎవరెవరు ఎన్ని డోసులు టీకా తీసుకున్నారో గుర్తించి ఆ మేరకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా చూస్తారు. జిల్లా అదనపు కలెక్టర్లు సహా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ను స్వయంగా పర్యవేక్షించనున్నారు.  
- డి.అమయ్‌కుమార్, కలెక్టర్

రంగారెడ్డి జిల్లా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి.. 
ఆగస్టు, సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య కొంత పెరుగుతున్నట్లు కన్పిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలి. లేదంటే మళ్లీ ప్రమాదం తప్పదు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు టీకా తీసుకోని వారు 45 వేల మంది ఉన్నట్లు గుర్తించాం. ఒకటి రెండు రోజుల్లో వీరందరికీ టీకాలు వేయిస్తాం.    
- డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి 

చదవండి: Giant Owl:150 ఏళ్ల క్రితం అంతరించిపోయిందనుకున్న పక్షి, మళ్లీ ప్రత్యేక్షం
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement