సాక్షి, హైదరాబాద్: కోవిడ్.. ఈ పేరు వింటేనే ప్రపంచం హడలిపోతోంది. పొరుగుదేశం చైనాను అతలాకుతలం చేసిన ఈ వైరస్ తొలిరోజుల్లో కేరళకు వచ్చినా, దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. తాజాగా హైదరాబాద్‌లో ఆ మహమ్మారి జాడ బయటపడటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, ప్రజలెవరూ భయాందోళనలకు గురికావొద్దని.. అప్రమత్తంగా ఉంటే చాలని ప్రభుత్వం సూచిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రించొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
దగ్గరగా ఉంటేనే సోకుతుంది
మిగతా వైరస్‌ల తరహాలో కోవిడ్–19 కూడా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. అయితే, ఎక్కడో దూరంగా ఉన్న బాధితుడి నుంచి ఇతరులకు వచ్చే అవకాశం ఉండదు. ఆ వైరస్ సోకినవారికి చేరువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ వైరస్ వస్తే, అదే ఇంట్లో ఉండే మిగతావారికి కూడా ఇది సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బాధితుడితో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించినా, సినిమాహాళ్లు వంటి ప్రదేశాల్లో కలిసి ఉన్నా, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నా.. ఈ వైరస్ అతడి నుంచి సంక్రమించే చాన్స్ ఉంటుంది.
- జ్వరం: దీని తొలి సంకేతం జ్వరం రావడం. సాధారణ పరిస్థితిలో వచ్చే తరహాలోనే ఈ వైరస్ సోకినవారికి జ్వరం ఉంటుంది. దాని తీవ్రతలో పెద్ద మార్పంటూ ఏమీ ఉండదు.
- జలుబు: సాధారణ జలుబు లక్షణాలుంటాయి. ముక్కు కారుతుంటుంది.
- పొడి దగ్గు: జలుబుతోపాటు పొడి దగ్గు కూడా ఇబ్బంది పెడుతుంది.
- శ్వాసలో ఇబ్బంది: ఈ వైరస్ సోకినవారు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఊపిరి అందనట్టుగా అనిపిస్తుంది.
- కొంతమందిలో కండరాల నొప్పులు, అయోమయంగా ఉండటం, తీవ్ర తలనొప్పి, గొంతు బొంగురుపోవటం, ఛాతీలో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చైనాలోని వూహాన్‌లో తొలుత వైరస్ బారినపడ్డ 99 మంది లక్షణాలను ఇటీవల అక్కడి ఆసుపత్రి విడుదల చేసింది. వీరిలో జ్వరంతో వచ్చినవారు 83 మంది ఉండగా మిగతా వారిలో పై లక్షణాలు కూడా కనిపించాయి.
- అదుపులోకి రాకుంటే ప్రమాదమే
కోవిడ్ సోకిన వెంటనే చికిత్స మొదలుపెడితే వెంటనే అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మన దేశంలో తొలుత ముగ్గురు కేరళ వాసులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వెంటనే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వారికి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స ప్రారంభించింది. ఫలితంగా వారు వెంటనే కోలుకోగలిగారు. అయితే, సకాలంలో చికిత్స అందకపోతే వ్యాధి తీవ్రత పెరిగితే చేయి దాటే ప్రమాదం ఉంటుంది. అలాంటివారిలో కొందరికి శ్వాస తీసుకోవటంలో అత్యంత తీవ్రమైన ఇబ్బందులు(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) ఏర్పడతాయి. న్యుమోనియా, కిడ్నీలు దెబ్బతినే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఇవి చివరకు మరణానికి దారి తీస్తాయి.
వెంటనే గుర్తించాలి
మన దేశంలో సాధారణ జలుబు, జ్వరం, దగ్గు సహజంగా వస్తుంటాయి. వీటికి డాక్టర్ వద్దకు వెళ్లకుండా సొంతంగా మందులు వేసుకుంటూ ఉంటారు. కానీ, ప్రస్తుతం పొడి దగ్గు, జలుబుతో కూడిన జ్వరం ఉంటే మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పరిశుభ్రతే మందు
కోవిడ్ సోకిన తర్వాత చికిత్స కోసం పరిగెత్తడం కంటే అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఈ వైరస్‌కు ప్రత్యేక చికిత్స లేకపోవటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
- చేతులు కడుక్కుంటూ ఉండాలి: కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఇతరులు తిరిగిన ప్రాంతాల్లో చేతులు ఉంచినప్పుడు వెంటనే శుభ్రం చేసుకోవాలి. ఆ ప్రాంతంలో అంతకుముందు ఎవరైనా తుమ్మినప్పుడు వారి నోటి నుంచి వెలువడ్డ వైరస్ అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. బస్సుల్లో ప్రయాణించినప్పుడు ఎక్కువ మంది చేతులు ఉంచిన చోటనే మనం కూడా చేతులు ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో చేతులు తిరిగి మొహంపై పెట్టుకునేలోపు శుభ్రం చేసుకోవాలి.
- కరచాలనం వద్దు: మనకు తెలియకుండానే చేతులతో ఏవేవో పనులు చేస్తుంటాం. గోక్కోవటం, ముక్కు, నోట్లో వేళ్లు పెట్టుకోవటం వంటివి చేసినప్పుడు వైరస్ చేతుల్లోకి చేరుతుంది. ఇతరులతో కరచాలనం చేసినప్పుడు వారికి కూడా ఆ వైరస్ సోకుతుంది. అందుకే కరచాలనానికి పూర్తి దూరంగా ఉండాలి.
- తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకునే అలవాటు చేసుకోవాలి.
- జనసమ్మర్థం ఉండే ప్రాంతాలైన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మార్కెట్లకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్క్‌లు ధరించటం ఉత్తమం. కనీసం కర్చీఫ్ అయినా కట్టుకోవాలి.
- అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకు దూరంగా ఉండాలి.
- చాలా రకాల వైరస్‌లు జంతువుల నుంచే వస్తాయి. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో విదేశాల నుంచి వచ్చే మాంసాన్ని భుజించటం సరికాదు.
- వైరస్‌లు తొలుత గొంతు భాగంలో సెటిల్ అయి.. తర్వాత విస్తరిస్తాయి. దీనిని నివారించేందుకు అల్లం, తులసి, పసుపు, మిరియాలు, దాల్చిన చెక్కలాంటివి (ఏదైనా ఒకటి) అవసరమైనంతమేర నీటిలో వేసి ఉడికించి తాగాలి.
24 రోజుల వరకు బతికుంటుందట..
కోవిడ్ శరీరంలోకి చేరిన రెండు రోజుల నుంచి 12 రోజుల్లో ప్రభావం చూపుతుంది. అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన తర్వాత 12 రోజుల వరకు దాని లక్షణాలు నిర్ధారణ కాకుంటే, ఇక ఆ వైరస్ ప్రభావం లేదని తేలినట్టే. అయితే, అతి ప్రమాదకర వ్యాధులతో బాధపడేవారిలో మాత్రం దాదాపు 24 రోజుల వరకు వైరస్ బతికే ఉంటుందని, ఆలోపు ఎప్పుడైనా అది వారిపై ప్రభావం చూపించొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment