ముంబై: కరోనా వచ్చిన దగ్గర్నుంచి విమానయాన రంగం (ఎయిర్‌లైన్స్) కోలుకోకుండా ఉంది. కరోనా మూడో విడత రూపంలో విస్తరిస్తూ ఉండడం, పెరిగిన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద ఎయిర్‌లైన్స్‌కు రూ.20,000 కోట్ల నష్టాలు రావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–21)లోనూ ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.13,853 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి.
వీటితో పోలిస్తే నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం మేర పెరగనున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. దీంతో ఈ రంగం కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంచనా వేసింది. 2022–23 ఆర్థిక సంత్సరం తర్వాతే రికవరీ ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా 75 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్‌ఇండియా గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది.
దేశీయ మార్కెట్ కోలుకుంది..
కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో విమాన సర్వీసులు దేశీయంగా చాలా పరిమితంగా నడిచాయి. 2021 డిసెంబర్ నాటికి కానీ ప్రయాణికుల రద్దీ కోలుకోలేదు. కరోనా పూర్వపు నాటి గణాంకాలతో పోలిస్తే 86 శాతానికి పుంజుకుంది. కానీ మరో విడత కరోనా ఉధృతితో 2022 జనవరి మొదటి వారంలో 25 శాతం రద్దీ తగ్గిపోయినట్టు క్రిసిల్ తెలిపింది. కరోనా రెండో విడతలో 2021 ఏప్రిల్–మే నెలలోనూ ఇదే మాదిరి 25 శాతం మేర క్షీణత నమోదైనట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి తర్వాతే ప్రారంభం కావచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (విమానంలో ప్రయాణికుల భర్తీ) 2021 మే నెలలో 50 శాతంగా ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 80 శాతానికి పెరిగింది.
ఆరు నెలల్లో రూ.11,323 కోట్ల నష్టం
‘మూడు ప్రధాన ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.11,323 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. కాకపోతే దేశీయ విమాన సర్వీసులు బాగా పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగైన ఆదాయం కొంత వరకు నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు మద్దతుగా నిలిచాయి.
కానీ, కరోనా మూడో విడత కారణంగా వచ్చిన ఆంక్షల ప్రభావంతో నాలుగో త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) నష్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం’ అని క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ తెలిపారు. ఏటీఎఫ్ ధర 2021 నవంబర్‌లో లీటర్‌కు గరిష్టంగా రూ.83కు చేరింది. 2020–21లో సగటు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.44గానే ఉంది. ఇంధన ధరలు రెట్టింపు కావడం, ట్రాఫిక్ తగ్గడం నష్టాలు పెరిగేందుకు కారణంగా క్రిసిల్ వివరించింది. దీంతో ఎయిర్‌లైన్స్ రుణ భారం కూడా పెరిగిపోతుందని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment