ప్రైవేటు ఆస్పత్రుల ఆదాయం11% వృద్ధి | Revenue to grow in double-digit for private hospitals | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రుల ఆదాయం11% వృద్ధి

Published Sat, Mar 25 2023 5:04 AM | Last Updated on Sat, Mar 25 2023 5:04 AM

Revenue to grow in double-digit for private hospitals - Sakshi

ముంబై: ప్రైవేటు దవాఖానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)తోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ (2023–24) 10–11 శాతం మేర ఆదాయంలో వృద్ధిని చూస్తాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. దేశీయంగా వైద్యం కోసం డిమాండ్‌ పెరగడానికి తోడు, వైద్యం కోసం వచ్చే పర్యాటకుల్లోనూ పెరుగుదల ఉందని క్రిసిల్‌ నివేదిక వెల్లడించింది. హాస్పిటళ్లలో బెడ్ల భర్తీ రేటు పెరుగుతుందని, ఒక్కో బెడ్‌ వారీ వచ్చే సగటు ఆదాయం అధిక స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. 2021–22లో ప్రైవేటు ఆస్పత్రులు ఆల్‌టైమ్‌ గరిష్ట నిర్వహణ లాభాన్ని నమోదు చేశాయని.. కరోనా చికిత్సల మద్దతుతో నిర్వహణ లాభం 19 శాతంగా ఉందని తెలిపింది.

కరోనా కాలంలో నిలిచిపోయిన సాధారణ చికిత్సల కోసం ముందుకు వచ్చే వారితో డిమాండ్‌ కొనసాగుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. దీంతో వైద్య సేవలకు దేశీయంగా డిమాండ్‌కుతోడు వైద్య పర్యాటకం కూడా పుంజుకుంటోంది. పడకలు పెరిగినప్పటికీ, వాటి భర్తీ రేటు 60 శాతం స్థాయిలోనే (గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఉన్నట్టు) కొనసాగొచ్చు’’ అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేతి తెలిపారు. గత ఐదేళ్లలో కేవలం కరోనా మొద టి విడత లాక్‌డౌన్‌ కాలంలోనే ఆస్పత్రుల్లో పడకల భర్తీ రేటు 53 శాతానికి తగ్గినట్టు సేతి చెప్పారు.  

పెద్దగా రుణాలు అవసరం లేదు..
ప్రైవేటు ఆస్పత్రులకు మెరుగైన నగదు ప్రవాహాలు ఉన్నందున.. అవి చేపట్టే విస్తరణ ప్రణాళికల కోసం పెద్దగా రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని క్రిసిల్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. దీంతో ఆస్పత్రుల రుణ భారం ఆరోగ్యకర స్థాయిలోనే ఉంటుందని, ఇది వాటి క్రెడిట్‌ రిస్క్‌ ప్రొఫైల్‌ను స్థిరంగా ఉంచుతుందని విశ్లేషించింది.  

బీమా అండతో నాణ్యమైన వైద్యం
బీమా కవరేజీ పెరుగుతుండడం ఆస్పత్రులకూ కలిసొస్తోంది. నాణ్యమైన వైద్యాన్ని పొందేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్న అంశాన్ని క్రిసిల్‌ రేటింగ్స్‌ ప్రస్తావించింది. బీమా వల్ల నాణ్యమైన వైద్యం వారికి అందుబాటులోకి వచ్చినట్టుగా పేర్కొంది. భర్తీ అయిన ఒక్కో పడకపై ఆదాయం 2021–22లో 20 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. కరోనాకి ముందు ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య పర్యాటకుల రూపంలో 10–12 శాతం మేర ఆదాయం వచ్చేదని, నాటి స్థాయికి క్రమంగా> తిరిగి ఆస్పత్రులు చేరుకుంటున్నాయని క్రిసిల్‌ నివేదిక తెలిపింది. తక్కువ చికిత్సల వ్యయాలు, అధునాతన సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, విమానయాన సేవల అనుసంధానత పెరగడం అన్నవి వైద్య పర్యాటకం తిరిగి కరోనా ముందు నాటి స్థాయికి పుంజుకునేందుకు సానుకూలతలుగా వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement