Alltime record
-
సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డు
సాక్షి, అమరావతి: సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు 2023–24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) చైర్మన్ డి.వి.స్వామి వెల్లడించారు. ఘనీభవించిన రొయ్యలు, చేపలు అమెరికా, చైనా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వివరాలను ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. 2022–23తో పోలిస్తే ఎగుమతి పరిమాణం 2.67 శాతం పెరిగింది. 2022–23లో రూ.63,969.14 కోట్ల (8,094.31 మిలియన్ డాలర్ల) విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023–24లో రూ.60,523.89 కోట్ల (7.38 బిలియన్ డాలర్ల) విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయి. ఘనీభవించిన రొయ్యల పరిమాణం, విలువ రెండింటి పరంగా ప్రధాన ఎగుమతి ఉత్పత్తిగా నిలిచింది. గతేడాది తీవ్రమైన మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ 7.38 బిలియన డాలర్ల విలువైన 17,81,602 టన్నుల సముద్రపు ఆహారాన్ని రవాణా చేయడం ద్వారా ఆల్ టైమ్ గరిష్ట ఎగుమతులను నమోదు చేసినట్లు ఎంపెడా ప్రకటించింది. ప్రపంచస్థాయి వాణిజ్యరంగంలో భారతదేశ సముద్ర ఆహార దిగుమతుల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 2,549.15 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికా నుంచి భారత్ ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 34.53 శాతం వృద్ధిరేటు సాధించింది. ఆ తర్వాత మన మత్స్య ఉత్పత్తుల దిగుమతిలో చైనా రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. ఈ ఏడాది 1,384.89 మిలియన్ డాలర్ల విలువైన 4,51,363 టన్నుల మత్స్య ఉత్పత్తులు చైనాకు ఎగుమతి అయ్యాయి. 25.33 శాతం వృద్ధి రేటు నమోదైంది. చైనా తర్వాత స్థానాల్లో జపాన్, వియత్నం, థాయలాండ్, కెనడా, స్పెయిన్, బెల్జియం దేశాలున్నాయి.రొయ్య ఎగుమతుల్లో అగ్రస్థానం అమెరికాకే ఎగుమతుల్లో 7.16 లక్షల టన్నులతో ఘనీభవించిన రొయ్యలు మొదటిస్థానంలో నిలిచాయి. వీటిద్వారా దేశానికి రూ.40,013.54 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా 2,97,571 టన్నులు అమెరికాకు ఎగుమతి కాగా.. చైనాకు 1,48,483 టన్నులు, యూరోపియన్ దేశాలకు 89,697 టన్నులు, సౌత్ ఈస్ట్ ఏషియాకు 52,254 టన్నులు, జపాన్‌కు 35,906 టన్నులు, మిడిల్ ఈస్ట్ దేశాలకు 28,571 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత ఘనీభవించిన చేపలు రెండో అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. వీటిద్వారా రూ. 5,509.69 కోట్ల ఆదాయం లభించింది. చేప, రొయ్యల ఆహారం, పొడి దాణా ఉత్పత్తులు ఎగుమతిలో మూడో అతిపెద్ద ఉత్పత్తిగా నిలిచింది. వీటి ద్వారా దేశానికి రూ.3,684.79 కోట్ల ఆదాయం వచ్చింది. ఘనీభవించిన స్క్విడ్ నాలుగో అతిపెద్ద ఎగుమతిగా నిలిచింది. దీనిద్వారా రూ.3,061.46 కోట్ల ఆదాయం లభించింది. సురిమి, సురిమి అనలాగ్స్కు చెందిన ఉత్పత్తులు ఐదోస్థానంలో నిలిచాయి. ఇవి రూ.2,414.43 కోట్ల విలువైన 1,35,327 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత రూ.2,252.63 కోట్ల విలువైన 54,316 టన్నుల ఎగుమతితో ప్రోజిన్ కాటిల్ ఫిష్ ఆరోస్థానంలో నిలిచింది. చిల్డ్ ఐటమ్స్, ఆక్టోపస్ ఎగుమతులు ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. -
ప్రైవేటు ఆస్పత్రుల ఆదాయం11% వృద్ధి
ముంబై: ప్రైవేటు దవాఖానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)తోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ (2023–24) 10–11 శాతం మేర ఆదాయంలో వృద్ధిని చూస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయంగా వైద్యం కోసం డిమాండ్ పెరగడానికి తోడు, వైద్యం కోసం వచ్చే పర్యాటకుల్లోనూ పెరుగుదల ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. హాస్పిటళ్లలో బెడ్ల భర్తీ రేటు పెరుగుతుందని, ఒక్కో బెడ్ వారీ వచ్చే సగటు ఆదాయం అధిక స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. 2021–22లో ప్రైవేటు ఆస్పత్రులు ఆల్‌టైమ్ గరిష్ట నిర్వహణ లాభాన్ని నమోదు చేశాయని.. కరోనా చికిత్సల మద్దతుతో నిర్వహణ లాభం 19 శాతంగా ఉందని తెలిపింది. కరోనా కాలంలో నిలిచిపోయిన సాధారణ చికిత్సల కోసం ముందుకు వచ్చే వారితో డిమాండ్ కొనసాగుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. దీంతో వైద్య సేవలకు దేశీయంగా డిమాండ్‌కుతోడు వైద్య పర్యాటకం కూడా పుంజుకుంటోంది. పడకలు పెరిగినప్పటికీ, వాటి భర్తీ రేటు 60 శాతం స్థాయిలోనే (గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఉన్నట్టు) కొనసాగొచ్చు’’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. గత ఐదేళ్లలో కేవలం కరోనా మొద టి విడత లాక్డౌన్ కాలంలోనే ఆస్పత్రుల్లో పడకల భర్తీ రేటు 53 శాతానికి తగ్గినట్టు సేతి చెప్పారు. పెద్దగా రుణాలు అవసరం లేదు.. ప్రైవేటు ఆస్పత్రులకు మెరుగైన నగదు ప్రవాహాలు ఉన్నందున.. అవి చేపట్టే విస్తరణ ప్రణాళికల కోసం పెద్దగా రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. దీంతో ఆస్పత్రుల రుణ భారం ఆరోగ్యకర స్థాయిలోనే ఉంటుందని, ఇది వాటి క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌ను స్థిరంగా ఉంచుతుందని విశ్లేషించింది. బీమా అండతో నాణ్యమైన వైద్యం బీమా కవరేజీ పెరుగుతుండడం ఆస్పత్రులకూ కలిసొస్తోంది. నాణ్యమైన వైద్యాన్ని పొందేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్న అంశాన్ని క్రిసిల్ రేటింగ్స్ ప్రస్తావించింది. బీమా వల్ల నాణ్యమైన వైద్యం వారికి అందుబాటులోకి వచ్చినట్టుగా పేర్కొంది. భర్తీ అయిన ఒక్కో పడకపై ఆదాయం 2021–22లో 20 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. కరోనాకి ముందు ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య పర్యాటకుల రూపంలో 10–12 శాతం మేర ఆదాయం వచ్చేదని, నాటి స్థాయికి క్రమంగా> తిరిగి ఆస్పత్రులు చేరుకుంటున్నాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. తక్కువ చికిత్సల వ్యయాలు, అధునాతన సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, విమానయాన సేవల అనుసంధానత పెరగడం అన్నవి వైద్య పర్యాటకం తిరిగి కరోనా ముందు నాటి స్థాయికి పుంజుకునేందుకు సానుకూలతలుగా వివరించింది. -
రూపాయి మరింత ఢమాల్! మున్ముందు మరింత కష్టం
సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో మరోసారి కుదేలైంది. మంగళవారం 78.59 వద్ద తొలుత రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతకుముందు నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ప్రతి ఒక్కటి రికార్డు స్థాయిలో ముగిసిన రూపాయి తాజాగా 78.74 వద్ద సరికొత్త ఆల్ టైమ్ ఇంట్రా-డే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆర్థిక మందగమన భయాలు, అంతర్జాతీయ మార్కెట్లు, చమురు ధరలు, ఎఫ్ఐఐల నిరంత అమ్మకాల కారణంగా ఇటీవల ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి జారిపోతున్న రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 78.53 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అనంతరం మరింత క్షీణించి 51 పైసల నష్టంతో 78.74 స్థాయికి చేరింది. మునుపటి సెషన్లో రూపాయి నాలుగు పైసలు క్షీణించి 78.37 వద్ద రికార్డు ముగింపును నమోదు చేసింది. మరోవైపు దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐల (ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) నిరంతర విక్రయాలు కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి తెలిపారు. రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు ప్రపంచ ఇంధన ధరలకు ఊతమిస్తాయని, దీంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై ఒత్తడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
డాలరు మారకంలో దిగజారుతున్న రూపాయి విలువ
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి రోజురోజుకి క్షీణిస్తూ బుధవారం మరో కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. గ్లోబల్ మార్కెట్ల ఒడిదుడుకులు, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పుంజుకోవడంతో పాటు భారతదేశ కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం ఆందోళలు, తదితర కారణాల రీత్యా రూపాయి డాలర్‌తో బుధవారం 78.40 వద్ద ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఇంట్రా-డేలో గరిష్టంగా 78.13 కనిష్ట స్థాయి 78.40 మధ్య కదలాడింది. 78.13 వద్ద నిన్న(మంగళవారం) కనిష్ట స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎఫ్ఐఐల అమ్మకాలు జోరు, దేశీయ ఈక్విటీలలో నష్టాల కారణంగా బుధవారం 27 పైసలు క్షీణించిన రూపాయి 78.40 (తాత్కాలిక) వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. 2011 తర్వాత మొదటిసారిగా 3శాతం దిగువకు పడిపోయింది. ఓవర్సీస్లో బలమైన గ్రీన్బ్యాక్ కూడా రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఆరు కరెన్సీల గ్రీన్బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.05 శాతం బలపడి 104.48కి చేరుకుంది. ఇదిలా ఉంటే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత వరుసగా ఎనిమిదో నుంచి తొమ్మిది నెలల నుంచి దేశం నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం కూడా దేశీయ కరెన్సీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. జూన్‌లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు రూ. 38,500 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జూన్ 10, 2022తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 4.59 బిలియన్ డాలర్లు క్షీణించి 596.46 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ డేటా వెల్లడించింది. -
రూ. 50,000 దాటిన పది గ్రాముల పసిడి
సాక్షి, న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు బుధవారం భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్టస్ధాయికి పెరగడంతో దేశీ మార్కెట్లోనూ పసిడి ఆల్‌టైం హైకి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా 500 రూపాయలు పెరిగి తొలిసారిగా రూ .50,026కు ఎగిసింది. బంగారం బాటలోనే దూసుకెళ్లిన వెండి ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి ఏకంగా 60,844కు ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరగడంతో పాటు అమెరికన్ డాలర్ బలహీనపడటంతో యల్లోమెటల్‌కు గిరాకీ పెరిగింది. ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి అమెరికాలో మరో భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారనే అంచనాలు కూడా హాట్‌మెటల్స్‌కు డిమాండ్ పెంచాయి. అనిశ్చిత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి దీటుగా సురక్షిత రిటన్స్ అందిస్తాయనే నమ్మకంతో మదుపరులు బంగారం, వెండివంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులుపేర్కొంటున్నారు. చదవండి : గోల్డ్‌మేన్.. మూతికి బంగారు మాస్కు -
వాణిజ్య పన్నుల శాఖ ఆల్‌టైం రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆదాయ రాబడిలో వాణిజ్య పన్నుల శాఖ ఆల్‌టైం రికార్డు సృష్టించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ.45 వేల కోట్లు దాటిందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒక్క మార్చిలోనే రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్టు తెలు స్తోంది. మార్చిలో ఎస్జీఎస్టీ కింద రూ.1,275 కోట్లు వచ్చింది. అయితే, ఇప్పటివరకు అత్యధికంగా ఫిబ్రవరిలో 1,041 కోట్ల ఆదాయం ఎస్జీఎస్టీ కింద రాగా, ఈ నెలలో అంతకు మించి ఆదాయం రావడం గమనార్హం. రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చడంలో కృషి చేసిన శాఖ సిబ్బందిని, అధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ అభినందించారు. సమస్యలు పరిష్కరించండి: టీఎస్‌టీఈఏ వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం గత ఏడాది కన్నా 20 శాతం పెరగడంపట్ల ఆ శాఖ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాఖ సిబ్బంది, అధికారులు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమయిందని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం (టీఎస్‌టీఈఏ) గౌరవాధ్యక్షుడు టి.వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు కె.ఎం.వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సచివాలయంలో శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి అభినందనలు తెలిపారు. శాఖాపరంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించి మరింత ఆదాయం సమకూర్చేలా చేసి ఉద్యోగులు, సిబ్బందికి చేయూతనివ్వాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు సోమేశ్‌కుమార్ సానుకూలంగా స్పందించినట్టు టీఎస్‌టీఈఏ నేతలు తెలిపారు. -
సరికొత్త గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ
-
సరికొత్త గరిష్టాలకు సెన్సెక్స్, నిఫ్టీ
సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో లాభాలతో దూసుకుపోతున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ సరికొత్త గరిష్టాన్ని తాకింది. తొలిసారి 37వేల మార్క్‌ను అధిగమించింది. అలాగే 11171 వద్ద నిఫ్టీ కూడా మరో రికార్డ్ హైని టచ్ చేసింది. సెన్సెక్స్ 128, నిఫ్టీ 27పాయింట్లు పుంజుకుని కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆటో షేర్లు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇంకా బ్యాంకింగ్, సిమెంట్ షేర్లు ర్యాలీ అవుతున్నాయి. హీటో మోటో కార్ప్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, అంబుజా, ఏసీసీ, బీఓబీ, టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. టెక్ మహీంద్ర, బాష్, బీపీసీఎల్, వేదాంతా నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి. -
లోక్ అదాలత్ రికార్డు
కరీంనగర్ లీగల్ : రెండో జాతీయ లోక్‌అదాలత్‌లో భా గంగా శనివారం జిల్లాలో 33 వేలకు పైగా కేసులను పరిష్కరించినట్లు జిల్లా జడ్జి బి.నాగమారుతీశర్మ తెలిపారు. ఇది ఆల్‌టైమ్ రికార్డ్‌గా ప్రకటించారు. 182 మోటార్ వాహన ప్రమాద కేసులలో రూ.3.36 కోట్ల పరిహారాన్ని బాధితులకు ఇప్పించామని, తొలిసారిగా 70 సివిల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. కేసులను పరిష్కరించుకోవటం ద్వారా కక్షిదారులకు శ్రమ, ఖర్చు, సమయం ఆదా అవుతాయన్నారు. సివిల్ కేసులో కక్షిదారులు కోర్టుకు చెల్లించిన ఫీజులను కూడా వాపసు తీసుకునేందుకు అవకాశముందన్నారు. ఎస్పీ శివకుమార్మాట్లాడుతూ బేషజాలకు పోకుండా కక్షిదారులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవటానికి ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు వాసుదేవరావు, వెంకటకృష్ణంరాజు, న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి బాల భాస్కర్ రావు, సీనియర్ సివిల్ జడ్జిలు రంజన్‌కుమార్, భవానీ చంద్ర, మేజిస్ట్రేట్లు అప్రోజ్ ఆఖ్తర్, అజర్ హుస్సేన్, ప్రవీణ్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోపు మధుసూదన్‌రెడ్డి, బి.రఘునందన్‌రావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేసుల పరిష్కారం కోసం కృషి చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పీ శివకుమార్ ప్రసంశపత్రాలను అందజేశారు. సమస్యలను స్థానికంగా చర్చించుకోవాలి గంగాధర: భూతగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలను స్థానికంగానే పరిష్కరించుకోవాలని, కోర్టు వరకూ తేవొద్దని జడ్జి బి.నాగమారుతీశర్మ కోరారు. మండలంలోని తాడిజెర్రి గ్రామాన్ని నేరరహితంగా ప్రకటించిన సందర్భంగా గ్రామంలో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. లోక్‌అదాలత్ నిర్వహించి మూడు కేసుల్లో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ పంథాలకుపోయి కోర్టుల చుట్టు తిరిగితే డబ్బులు వృథా అవుతాయన్నారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ గ్రామం నుంచి పోలీస్‌స్టేషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడం మంచి మార్పు అని కొనియాడారు. వివాదాలకు దూరంగా ఉంటామని గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. శాంతిసూచకంగా జడ్జి, ఎస్పీలు పావురాలను ఎగురవేశారు. హిమ్మత్‌నగర్, తాడిజెర్రి, బూర్గుపల్లి గ్రామ రక్షక దళాలకు వాలీబాల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచు మ్యాక రామమ్మ, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ఎం.భాస్కర్, పెద్దపెల్లి డీఎస్పీ మల్లారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల శ్రీలత, చొప్పదండి సీఐ సత్యనారాయణ, గంగాధర ఎస్సై రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. భీంరాజ్‌పల్లి చరిత్రలో నిలవాలి గొల్లపల్లి : మండలంలోని మారుమూల పల్లె భీంరాజ్‌పల్లి నేరరహిత గ్రామంగా గుర్తింపు పొందిందని, ఇలాగే కొనసాగిస్తూ.. చరిత్రలో నిలవాలని జిల్లా జడ్జి నాగమారుతీశర్మ, ఎస్పీ వి.శివకుమార్ అన్నారు. గ్రామంలో రెండు క్రిమినల్ కేసులు నమోదు కావడంతో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జడ్జి, ఎస్పీ హాజరయ్యారు. వారికి గ్రామస్తులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. వేదికవద్ద భీంరాజ్‌పల్లికి చెందిన కేసుల్లో కక్షిదారులు రాజీకి ఒప్పుకోవడంతో వాటిని కొట్టివేసి నేరరహిత గ్రామంగా ప్రకటించారు. చెందోళికి చెందిన రెండు కేసుల కక్షిదారులు రాజీపడటంతో అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నచిన్న తగాదాలను కోర్టు వరకు తీసుకెళ్లకుండా స్థానికంగా పరిష్కరించుకోవాలని, లేకుంటే నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ‘ఓడినవారు కోర్టులో ఏడిస్తే.. గెలిచినవారు ఇంటికెళ్లి ఏడ్చాడట..’ అనే సామెతను గుర్తు చేశారు. శాంతిమార్గమే బెటర్ : ఎస్పీ సమస్యలు వస్తాయని, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ శివకుమార్ అన్నారు. అందరు సహకరిస్తే నేర రహిత జిల్లాగా తప్పక మారుతుందని పేర్కొన్నారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన ఎస్సై నిరంజన్‌రెడ్డి, సీఐ వెంకటరమణను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సింగారపు ఎల్లవ్వ, ఎంపీటీసీ నాగవ్వ, సింగిల్‌విండో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, జగిత్యాల జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్సైలు బిల్లా కోటేశ్వర్, దేవయ్య, నరేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. లీగల్ సెల్ సిబ్బందికి ప్రశంసపత్రాలు కరీంనగర్ క్రైం : జాతీయస్థాయి లోక్‌అదాలత్ ముగింపు సందర్భంగా జిల్లాలో ఎక్కువ శాతం కేసుల్లో రాజీ కుదిర్చి పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించిన జిల్లాలోని పోలీస్ విభాగం లీగల్ సెల్ కోర్టు కానిస్టేబుళ్లకు ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి నాగమారతీశర్మ, ఎస్పీ శివకుమార్, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి బాలభాస్కర్ సీఐ సంపత్, ఎస్సైలు వలీబాబా, కృష్ణారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ గోవర్ధన్, అనందం, ఎండీ రఫూఫ్, ప్రకాశ్‌రెడ్డి, సత్తయ్య, కానిస్టేబుళ్లు చేరాలు, తిరుపతి, శ్రీనివాస్, గోపీ, రాజ, వంశీకిరణ్, రవి, సతీష్‌కుమార్, దేవేందర్, సందీప్‌కు ప్రశంసపత్రాలు అందించారు.