రూ.60,524 కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల ఎగుమతి
వీటిలో రూ.40 వేలకోట్ల విలువైన రొయ్యలు, రూ.5,510 కోట్ల విలువైన చేపలు
ఎగుమతుల్లో అమెరికా, చైనా, జపాన్‌లకే ఎక్కువ
2023–24లో ఎగుమతుల వివరాలను ప్రకటించిన ఎంపెడా
సాక్షి, అమరావతి: సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు 2023–24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) చైర్మన్ డి.వి.స్వామి వెల్లడించారు. ఘనీభవించిన రొయ్యలు, చేపలు అమెరికా, చైనా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వివరాలను ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు.
2022–23తో పోలిస్తే ఎగుమతి పరిమాణం 2.67 శాతం పెరిగింది. 2022–23లో రూ.63,969.14 కోట్ల (8,094.31 మిలియన్ డాలర్ల) విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023–24లో రూ.60,523.89 కోట్ల (7.38 బిలియన్ డాలర్ల) విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయి. ఘనీభవించిన రొయ్యల పరిమాణం, విలువ రెండింటి పరంగా ప్రధాన ఎగుమతి ఉత్పత్తిగా నిలిచింది.
గతేడాది తీవ్రమైన మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ 7.38 బిలియన డాలర్ల విలువైన 17,81,602 టన్నుల సముద్రపు ఆహారాన్ని రవాణా చేయడం ద్వారా ఆల్ టైమ్ గరిష్ట ఎగుమతులను నమోదు చేసినట్లు ఎంపెడా ప్రకటించింది. ప్రపంచస్థాయి వాణిజ్యరంగంలో భారతదేశ సముద్ర ఆహార దిగుమతుల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 2,549.15 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికా నుంచి భారత్ ఆర్జించింది.
గతేడాదితో పోలిస్తే 34.53 శాతం వృద్ధిరేటు సాధించింది. ఆ తర్వాత మన మత్స్య ఉత్పత్తుల దిగుమతిలో చైనా రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. ఈ ఏడాది 1,384.89 మిలియన్ డాలర్ల విలువైన 4,51,363 టన్నుల మత్స్య ఉత్పత్తులు చైనాకు ఎగుమతి అయ్యాయి. 25.33 శాతం వృద్ధి రేటు నమోదైంది. చైనా తర్వాత స్థానాల్లో జపాన్, వియత్నం, థాయలాండ్, కెనడా, స్పెయిన్, బెల్జియం దేశాలున్నాయి.
రొయ్య ఎగుమతుల్లో అగ్రస్థానం అమెరికాకే
ఎగుమతుల్లో 7.16 లక్షల టన్నులతో ఘనీభవించిన రొయ్యలు మొదటిస్థానంలో నిలిచాయి. వీటిద్వారా దేశానికి రూ.40,013.54 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా 2,97,571 టన్నులు అమెరికాకు ఎగుమతి కాగా.. చైనాకు 1,48,483 టన్నులు, యూరోపియన్ దేశాలకు 89,697 టన్నులు, సౌత్ ఈస్ట్ ఏషియాకు 52,254 టన్నులు, జపాన్‌కు 35,906 టన్నులు, మిడిల్ ఈస్ట్ దేశాలకు 28,571 టన్నులు ఎగుమతి అయ్యాయి.
ఆ తర్వాత ఘనీభవించిన చేపలు రెండో అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. వీటిద్వారా రూ. 5,509.69 కోట్ల ఆదాయం లభించింది. చేప, రొయ్యల ఆహారం, పొడి దాణా ఉత్పత్తులు ఎగుమతిలో మూడో అతిపెద్ద ఉత్పత్తిగా నిలిచింది. వీటి ద్వారా దేశానికి రూ.3,684.79 కోట్ల ఆదాయం వచ్చింది. ఘనీభవించిన స్క్విడ్ నాలుగో అతిపెద్ద ఎగుమతిగా నిలిచింది. దీనిద్వారా రూ.3,061.46 కోట్ల ఆదాయం లభించింది.
సురిమి, సురిమి అనలాగ్స్‌కు చెందిన ఉత్పత్తులు ఐదోస్థానంలో నిలిచాయి. ఇవి రూ.2,414.43 కోట్ల విలువైన 1,35,327 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత రూ.2,252.63 కోట్ల విలువైన 54,316 టన్నుల ఎగుమతితో ప్రోజిన్ కాటిల్ ఫిష్ ఆరోస్థానంలో నిలిచింది. చిల్డ్ ఐటమ్స్, ఆక్టోపస్ ఎగుమతులు ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment