Fishery
-
సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డు
సాక్షి, అమరావతి: సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు 2023–24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) చైర్మన్ డి.వి.స్వామి వెల్లడించారు. ఘనీభవించిన రొయ్యలు, చేపలు అమెరికా, చైనా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వివరాలను ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. 2022–23తో పోలిస్తే ఎగుమతి పరిమాణం 2.67 శాతం పెరిగింది. 2022–23లో రూ.63,969.14 కోట్ల (8,094.31 మిలియన్ డాలర్ల) విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023–24లో రూ.60,523.89 కోట్ల (7.38 బిలియన్ డాలర్ల) విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయి. ఘనీభవించిన రొయ్యల పరిమాణం, విలువ రెండింటి పరంగా ప్రధాన ఎగుమతి ఉత్పత్తిగా నిలిచింది. గతేడాది తీవ్రమైన మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ 7.38 బిలియన డాలర్ల విలువైన 17,81,602 టన్నుల సముద్రపు ఆహారాన్ని రవాణా చేయడం ద్వారా ఆల్ టైమ్ గరిష్ట ఎగుమతులను నమోదు చేసినట్లు ఎంపెడా ప్రకటించింది. ప్రపంచస్థాయి వాణిజ్యరంగంలో భారతదేశ సముద్ర ఆహార దిగుమతుల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 2,549.15 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికా నుంచి భారత్ ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 34.53 శాతం వృద్ధిరేటు సాధించింది. ఆ తర్వాత మన మత్స్య ఉత్పత్తుల దిగుమతిలో చైనా రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. ఈ ఏడాది 1,384.89 మిలియన్ డాలర్ల విలువైన 4,51,363 టన్నుల మత్స్య ఉత్పత్తులు చైనాకు ఎగుమతి అయ్యాయి. 25.33 శాతం వృద్ధి రేటు నమోదైంది. చైనా తర్వాత స్థానాల్లో జపాన్, వియత్నం, థాయలాండ్, కెనడా, స్పెయిన్, బెల్జియం దేశాలున్నాయి.రొయ్య ఎగుమతుల్లో అగ్రస్థానం అమెరికాకే ఎగుమతుల్లో 7.16 లక్షల టన్నులతో ఘనీభవించిన రొయ్యలు మొదటిస్థానంలో నిలిచాయి. వీటిద్వారా దేశానికి రూ.40,013.54 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా 2,97,571 టన్నులు అమెరికాకు ఎగుమతి కాగా.. చైనాకు 1,48,483 టన్నులు, యూరోపియన్ దేశాలకు 89,697 టన్నులు, సౌత్ ఈస్ట్ ఏషియాకు 52,254 టన్నులు, జపాన్‌కు 35,906 టన్నులు, మిడిల్ ఈస్ట్ దేశాలకు 28,571 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత ఘనీభవించిన చేపలు రెండో అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. వీటిద్వారా రూ. 5,509.69 కోట్ల ఆదాయం లభించింది. చేప, రొయ్యల ఆహారం, పొడి దాణా ఉత్పత్తులు ఎగుమతిలో మూడో అతిపెద్ద ఉత్పత్తిగా నిలిచింది. వీటి ద్వారా దేశానికి రూ.3,684.79 కోట్ల ఆదాయం వచ్చింది. ఘనీభవించిన స్క్విడ్ నాలుగో అతిపెద్ద ఎగుమతిగా నిలిచింది. దీనిద్వారా రూ.3,061.46 కోట్ల ఆదాయం లభించింది. సురిమి, సురిమి అనలాగ్స్కు చెందిన ఉత్పత్తులు ఐదోస్థానంలో నిలిచాయి. ఇవి రూ.2,414.43 కోట్ల విలువైన 1,35,327 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత రూ.2,252.63 కోట్ల విలువైన 54,316 టన్నుల ఎగుమతితో ప్రోజిన్ కాటిల్ ఫిష్ ఆరోస్థానంలో నిలిచింది. చిల్డ్ ఐటమ్స్, ఆక్టోపస్ ఎగుమతులు ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. -
సేంద్రియ మత్స్య ఉత్పత్తులను ప్రోత్సహించాలి
సాక్షి, అమరావతి: సమాజంలో ప్రతి ఒక్కరు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, ఎలాంటి రసాయన అవశేషాల్లేని సముద్ర మత్స్యఉత్పత్తులను కూడా సేంద్రియ ఉత్పత్తులుగానే పరిగణించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భూమి ఆర్గానిక్స్ సహకారంతో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో మూడురోజులు నిర్వహించే 2వ దక్షిణ భారత స్థాయి సీఫుడ్ ఫెస్టివల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నంబర్–1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వినియోగం ఎనిమిది కిలోలకు మించడం లేదన్నారు. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర బ్రాండింగ్‌తో హబ్స్ అండ్ స్పోక్స్ మోడల్లో పెద్ద ఎత్తున మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్వాహబ్, దానికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1,400 అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశామని, మరో రెండువేల అవుట్‌లెట్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఔత్సాహికులు ముందుకొస్తే 40 నుంచి 60 శాతం సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేయడమేగాక ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని రకాల చేయూత అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులను ప్రోత్సహించడం, మాంసాహార ప్రియుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సీఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరాల్లో నిర్వహించిన ఫెస్టివల్స్‌కు అనూహ్య స్పందన లభించిందన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న ఫెస్టివల్లో రూ.699కి అన్లిమిటెడ్ సీఫుడ్ బఫెట్ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు వంటి నగరాల్లో సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫిష్ ఆంధ్ర ఆన్లైన్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఏఎఫ్సీవోఎఫ్ చైర్మన్ కె.అనిల్‌బాబు, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ అంజలి, జేడీలు వి.వి.రావు, హీరానాయక్ పాల్గొన్నారు. -
World Fisheries Day: మత్స్యకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో డీజిల్‌పై సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ‘‘మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుంచి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇక పైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.’’ అని సీఎం ట్వీట్ చేశారు. చదవండి: ఆ ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. డీజిల్ సబ్సిడీ నుండి మత్స్యకార భరోసా వరకూ, కొత్త హార్బర్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు అందించడంలోనూ ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా నిలిచింది. ఇకపైనా మీ సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది.#MatsyakaraDinotsavam — YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2021 -
ఏపీ రొయ్య.. మీసం మెలేసింది!
సాక్షి, అమరావతి: దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. 2020–21 ఆరి్థక సంవత్సరంలో దేశ రొయ్యల ఉత్పత్తిలో ఏపీ 75.84% వాటాతో దూసుకుపోయినట్లు మెరైన్ ప్రోడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా) తెలిపింది. 2020–21లో దేశవ్యాప్తంగా 8,43,633 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే అందులో ఏపీలోనే 6,39,894 టన్నులు ఉత్పత్తి అయినట్లు ఎంపెడా జాయింట్ డైరెక్టర్ జయబాల్ తెలిపారు. ఇందులో అత్యధికంగా వనామి రకం రొయ్యలు 6,34,672 టన్నులు ఉత్పత్తి అయ్యిందని, బ్లాక్ టైగర్ రొయ్యలు వాటా 5,222 టన్నులని చెప్పారు. సముద్ర ఉత్పత్తుల్లో కూడా ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. 2021లో రాష్ట్రం నుంచి 2,90,859 టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని వీటి విలువ రూ.16,733.81 కోట్లని వివరించారు. పెరిగిన సాగు, ఉత్పత్తి... అంతకుముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో రొయ్యల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019–20తో పోలిస్తే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంలో 15.41%, ఉత్పత్తిలో 24.91% వృద్ధి నమోదైంది. 2019–20లో 64,559.94 హెక్టార్లలో సాగు చేయడం ద్వారా 5,12,244.4 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయితే 2020–21లో సాగు విస్తీర్ణం 74,512 హెక్టార్లకు పెరిగి ఉత్పత్తి 6,39,894 టన్నులకు చేరింది. దేశవ్యాప్తంగా రొయ్యల సాగు విస్తీర్ణంలో రాష్ట్ర వాటా 44.69%గా ఉన్నట్లు ఎంపెడా పేర్కొంది. రాష్ట్రంలో 188 మండలాల్లో 1,553 గ్రామాల్లో 53 వేల చెరువుల్లో ఆక్వా చెరువు సాగు జరుగుతోంది. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతుదారులు 154 మంది ఉండగా, 97 ప్రోసెసింగ్ యూనిట్లు, 97 శీతల గిడ్డంగులు ఉన్నట్లు ఎంపెడా పేర్కొంది. రాష్ట్రంలో ఆక్వా ఎగుమతులు ప్రోత్సహించడానికి ఎంపెడా కృషి చేస్తోందని, ఇందుకోసం కాల్‌సెంటర్ నంబర్ 18004254648ను కేటాయించినట్లు తెలిపారు. -
మత్స్య సంపదకు డ్రై ప్లాట్ ఫారమ్స్
డ్వామా పీడీ రాజకుమారి అల్లవరం (అమలాపురం) : మత్స్య సంపదను ఆరబెట్టేందుకు డ్రై ప్లాట్ ఫారమ్స్ ఉపాధి నిధులతో నిర్మిస్తున్నామని డ్వామా పీడీ రాజకుమారి అన్నారు. బెండమూర్లంక, బోడసకుర్రు, ఎస్.పల్లిపాలెం, ఓడలరేవు, గుండెపూడి గ్రామాల్లో ఏడుచోట్ల డ్రై ప్లాట్ ఫారమ్స్ నిర్మాణానికి రూ.22.73 లక్షలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం బోడసకుర్రులో డ్రై ప్లాట్ ఫారమ్స్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావుతో కలసి పరిశీలించారు. డ్వామా పీడీ మాట్లాడుతూ డ్రై ప్లాట్‌ఫారమ్స్ నిర్మాణానికి 48 మత్స్యకార గ్రామాలకు రూ.80 లక్షల చొప్పున ఉపాధి నిధులు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకూ 20 పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు బండ్ ప్లాంటేషన్, హోమ్ ప్లాంటేషన్, పట్టు పురుగుల పెంపకం, వన సంరక్షణ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం ఉపాధి హామీ నిధులతో చేపడుతున్నామన్నారు. జిల్లాలో 400 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్మాణాలు చేపట్టామని, 46 పూర్తయ్యాయని, 141 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510 కిలోమీటర్ల పొడవునా సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఉపాధి కూలీలకు వేతనాలు బ్యాంకు ఆకౌంట్లో జమ కాకపోవడానికి ఆధార్ లింక్ చేయకపోవడమే కారణమన్నారు. ఆధార్ లింక్ కాని ఉపాధి కూలీలకు బ్యాంకు అకౌంట్లో జమ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. పీడీ వెంట ఏపీడీ భానుప్రకాష్, ఎంపీడీఓ వి.శాంతామణి, సర్పంచ్ దొమ్మేటి శ్యాంప్రకాష్ ఉన్నారు. డిసెంబర్ నాటికి మినీ హార్బర్ అంతర్వేదిలో రూ. 30 కోట్లతో నిర్మిస్తున్న మినీ హార్బర్ డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు అన్నారు. బోడసకుర్రులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఓడలరేవులో రూ.5.3 కోట్లతో జెట్టీ నిర్మాణం జరుగుతోందన్నారు. -
మత్స్య సంపద అభివృద్ధికి చర్యలు
ఏలూరు (మెట్రో) జిల్లాలో మత్స్యసంపదను అభివృద్ధి చేయడానికి 20 ఎకరాలను రైతుల వద్ద లీజుకు తీసుకుని పండుగప్ప, పీతల పెంపకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ మత్స్యశాఖాధికారి డీడీ యాకుబ్ పాషాను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయం, పశుసంవర్దక, ఉద్యానవనం, ఎపీ డెయిరీ, మార్కెటింగ్, ఆత్మ, బిందు సేద్యం తదితర ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో నూతన రకాల చేపల ఉత్పత్తికి పశ్చిమ ఎంతో అనుకూలమైనదని తక్కువ పెట్టుబడితో అధిక లాభార్జించడానికి అవకాశం ఉన్నందున పండుగప్ప, పీతల పెంపకానిన ప్రయోగాత్మకంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు రైతులకు సరైన అవగాహన కలిగించడం వలన ఏడాదిలో పండుగప్ప, పీతలకు చెందిన 20 ఎకరాల చేపల చెరువులను లీజుకు తీసుకుని వాటిని పెంచాలని ఈ పెంపకం వలన అధిక ఆదాయం లభిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పండుగప్ప, పీతల పెంపకాన్ని ప్రొత్సహించాలన్నారు. బియ్యపుతిప్ప గ్రామంలో హార్బర్ ఏర్పాటు విషయంపై ఇకపై వారం వారం సమీక్షిస్తానని తాను కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నాల్గవ రోజునే బియ్యప్పతిప్ప గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో మత్స్య హార్బర్ నిర్మాణానికి చర్యలు చేపట్టానని హార్బర్ ఏర్పాటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు లభించడంలో కొంత జాప్యం జరుగుతోందన్నారు. 25 వేల హెక్టార్లలో ఈ సంవత్సరం బిందు సేద్యం లక్ష్యం కాగా ఇప్పటివరకు 4 వేల హెక్టార్లలో మాత్రమే పూర్తి చేయడం జరిగిందని 5 నెలల కాలకంలో 21 వేల హెక్టార్లలో బిందు సేద్యం ఎలా చేయగలుగుతారని కలెక్టరు ప్రశ్నించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వరి విత్తనాలను మనమే ఉత్పత్తి చేసేందుకు అనువుగా వెయ్యి విత్తన సొ సైటీలు ఏర్పాటు చేసి జిల్లాకు అవసరమయ్యే విత్తనాలను రైతులే పండించుకుని రైతులకు విక్రయించుకునేలా చర్యలు చేపట్టాలని ఆత్మ పీడీ అనంతకుమారిని కలెక్టరు ఆదేశించారు. సమవేశంలో ఏజేసీ ఎంహెచ్.షరీఫ్, సీపీఓ బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మిశ్వరి, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆత్మ పీడీ ఆనందకుమారి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక, ఉద్యానవన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
రుణమాఫీ భారాన్ని ప్రభుత్వాలు భరిస్తే తప్పేంటి?
హైదరాబాద్: చేపల పెంపకం వైపు దృష్టి సారించాలని వ్యవసాయ రైతులకు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. 17వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని 60వేల కోట్లకు రూపాయలకు పెంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. వెసులుబాటున్న రైతులు రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోండి అని ప్రత్తిపాటి విజ్క్షప్తి చేశారు. కొత్త రుణాలు ఇవ్వలేమన్న ఆంధ్రాబ్యాంక్‌కు లేఖ రాశామని ఓ ప్రశ్నకు సమాధానామిచ్చారు. రుణమాఫీ భారాన్ని వచ్చే ప్రభుత్వాలు భరిస్తే తప్పేముందన్నారు. బ్యాంకుల నుంచి వివరాలు వచ్చాక రుణమాఫీ ప్రక్రియ ఆరంభమవుతుందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.