సాక్షి, అమరావతి: సమాజంలో ప్రతి ఒక్కరు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, ఎలాంటి రసాయన అవశేషాల్లేని సముద్ర మత్స్యఉత్పత్తులను కూడా సేంద్రియ ఉత్పత్తులుగానే పరిగణించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భూమి ఆర్గానిక్స్ సహకారంతో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో మూడురోజులు నిర్వహించే 2వ దక్షిణ భారత స్థాయి సీఫుడ్ ఫెస్టివల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నంబర్–1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వినియోగం ఎనిమిది కిలోలకు మించడం లేదన్నారు. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర–ఫిట్ ఆంధ్ర బ్రాండింగ్‌తో హబ్స్ అండ్ స్పోక్స్ మోడల్‌లో పెద్ద ఎత్తున మార్కెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్వాహబ్, దానికి అనుబంధంగా రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 1,400 అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశామని, మరో రెండువేల అవుట్‌లెట్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఔత్సాహికులు ముందుకొస్తే 40 నుంచి 60 శాతం సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేయడమేగాక ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని రకాల చేయూత అందిస్తామని తెలిపారు. ఔత్సాహికులను ప్రోత్సహించడం, మాంసాహార ప్రియుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సీఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరాల్లో నిర్వహించిన ఫెస్టివల్స్‌కు అనూహ్య స్పందన లభించిందన్నారు.
విజయవాడలో నిర్వహిస్తున్న ఫెస్టివల్‌లో రూ.699కి అన్‌లిమిటెడ్ సీఫుడ్ బఫెట్ ఇస్తున్నట్లు చెప్పారు. త్వరలో విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు వంటి నగరాల్లో సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫిష్ ఆంధ్ర ఆన్‌లైన్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఏఎఫ్‌సీవోఎఫ్ చైర్మన్ కె.అనిల్‌బాబు, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ అంజలి, జేడీలు వి.వి.రావు, హీరానాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment