సాక్షి, అమరావతి: స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా విజయవాడలో 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నం.1 స్థానంలో ఉన్న రాష్ట్రంలో స్థానిక వినియోగం 8 శాతానికి మించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కానీ వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని చెప్పారు.
మిగిలిన రొయ్య అంతా ఎగుమతి అవుతోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎదురైతే రాష్ట్రంలోని రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే డొమెస్టిక్ మార్కెట్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సీ ఫుడ్ వినియోగదారులు పెద్ద ఎత్తున ఉన్నా.. డిమాండ్‌కు తగ్గట్టుగా రిటైల్ షాపులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందన్నారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘ఫిష్ ఆంధ్రా’ బ్రాండ్‌తో స్థానిక వినియోగం పెంచేలా ఆక్వా హబ్స్ అండ్ స్పోక్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1,500 అవుట్ లెట్స్‌ను ఏర్పాటు చేయగా.. 15 హబ్స్ నిర్మాణంలో ఉన్నట్టు చెప్పారు. మరిన్ని హబ్స్, అవుట్ లెట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించడం, వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
మూడు రోజుల పాటు నిర్వహించే ఫెస్టివల్‌లో 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఫెస్టివల్‌లో రోజూ రూ.699తో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్‌ను అందిస్తున్నామన్నారు. సీ ఫుడ్‌పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2కే రన్ నిర్వహంచనున్నట్టు తెలిపారు. ఇలాంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖ, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ బ్రోచర్‌ను కమిషనర్ కన్నబాబు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment