Fisheries Department
-
చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలే
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది 90 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. అయినా అందులో సగం లక్ష్యాన్ని కూడా చే రుకోలేకపోయారు అధికారులు. టెండర్లు ఆలస్యంగా ఖరారు కావడమే దీనికి ప్రధాన కారణం. అక్టోబర్ నెలలోనే ఉచితంగా చేప పిల్లల పంపిణీ ప్రా రంభించినా, డిసెంబర్ నెలలో సగం రోజులు పూర్తవుతున్నా పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ ఆశయానికి కాంట్రాక్టర్లు, మత్స్యశాఖ అధికారులు నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లెక్క ఎట్లా..? మొదట ఒక గ్లాస్లో ఎన్ని చేప పిల్లలు పడతాయో లెక్కిస్తారు. ఆ తర్వాత ఆ గ్లాస్‌ను నింపుతూ ప్లాస్టిక్ కవర్లలో పోస్తారు. అంటే మొదట ఎన్ని వచ్చాయో అన్నే ఉన్నాయని కాంట్రాక్టర్ల లెక్క అన్నమాట. గ్లాస్లో తక్కువ నింపుతూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా చేప పిల్లల పంపిణీ పూర్తి పారదర్శకంగా ఉండేలా వీడియో, ఫొటోలు తీయాలి. ఆ నిబంధనలేమీ పాటించకుండా పోశామా.. ఇచ్చామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సమయం మించిపోవడంతో వచి్చంది చాలులే అన్నట్టుగా మత్స్యకారులు తీసుకుంటున్నారు. 90 కోట్ల చేప పిల్లల పంపిణీ ఎక్కడ? 2024–25 సంవత్సానికి 34 వేల చెరువుల్లో విడతల వారీగా 90 కోట్ల ఉచిత చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌లో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో టెండర్లు దాఖలు చేయలేదు. మూడుసార్లు టెండర్లు పిలిచినా, ఎవరూ రాకపోవడంతో మత్స్యశాఖ స్వయంగా రంగంలోకి దిగి కాంట్రాక్టర్లను ఒప్పించింది. ఎట్టకేలకు సెపె్టంబర్ చివరి నాటికి టెండర్లు ఖరారు చేసి, అక్టోబర్‌లో చేప పిల్లల పంపిణీ ప్రారంభమైంది. ఈ ఏడాది భారీ వర్షాలతో దాదాపు అన్ని చెరువులు నిండినా, సరైన సమయంలో చేప పిల్లలు వదలలేదు. ఏడాది చివరిలో వదిలే చేప పిల్లలకు వృద్ధి ఉండదు ఏడాది చివరిలో వదిలే ఏ రకమైన చేప పిల్లలైన ఎదుగుదల సరిగా ఉండదు. డిసెంబర్ ఆ తర్వాత వదిలే చేప పిల్లలు బక్కచిక్కి బరువు తక్కువగా ఉంటాయి. వీటికి వినియోగదారులు కొనడానికి ఇష్టపడరు. చేపలు పట్టడానికి కూలీ, రవాణా ఖర్చు మత్స్యకారులపై పడి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఉచిత చేప పిల్లల పంపిణీ తక్షణమే పూర్తి చేయాలి ప్రభుత్వం విడుదల చేసే ఉచిత చేప పిల్లల పంపిణీ తక్షణమే పూర్తి చేయాలి. వచ్చే ఏడాది ముందుగానే టెండర్లు పిలిచి సకాలంలో చేపలను చెరువుల్లోకి వదలాలి. లేకుంటే మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తోంది. దీనిపై మత్స్యశాఖ దృష్టి సారించాలని, ఆ దిశగా అడుగులు వేయాలి. – మత్స్యకారులు సుదర్శన్, గౌటే గణేష్ -
ఉచిత రొయ్య పిల్లల పంపిణీ లేనట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ఉచిత రొయ్య పిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. అసలు ఈ ఏడాది రిజర్వాయర్లు, చెరువుల్లో రొయ్య పిల్లలు వదులుతారో, లేదో.. తెలియని పరిస్థితిల్లో మత్స్యశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించినా మత్స్యశాఖ నిర్లక్ష్యంతో పథకం నిర్విర్యం అవుతోందని విమర్శలు వస్తున్నాయి. అక్టోబర్ నెల మూడో వారం అయినా రొయ్యల పంపిణీపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో మత్య్సకారులు ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్నారు. మత్య్సకారుల ఆర్థికాభివృద్ధి కోసం గత ఆరేళ్ల నుంచి మత్స్యశాఖ ఉచితంగా రొయ్య పిల్లలను రిజరాయర్లు, చెరువుల్లో వదులుతోంది. 2017లో ప్రారంభమైన ఈ పథకం దశల వారీగా పెరుగుతూ వచ్చి0ది. ఈసారి టెండర్లు పిలవకపోవడంతో అసలు రొయ్య పిల్లల పంపిణీ ఉంటుందా? ఉండదా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రొయ్య పిల్లల పంపిణీపై మత్స్యశాఖ డైరెక్టర్ వివరణ కోసం ప్రయత్నించగా ఆమె స్పందించకపోవడం గమనార్హం. -
నేటి అర్ధరాత్రి నుంచి ‘మత్స్య’ వేట నిషేధం అమలు
సాక్షి, అమరావతి: రెండు నెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకోనున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్యసంపదను స్వాదీనం చేసుకోవడంతో పాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దీకరణ చట్టం 1994 సెక్షన్ (4)కింద శిక్షార్హులని తెలిపారు. జరిమానా విధించడమే కాకుండా డీజిల్ ఆయిల్ రాయితీతో పాటు అన్ని రకాల సౌకర్యాలను నిలిపేస్తామని పేర్కొన్నారు. నిబంధనలు అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్‌గార్డు, కోస్టల్ సెక్యురిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. ఐదేళ్లలో రూ.538 కోట్ల మత్స్యకార భృతి రాష్ట్రంలో తడ మొదలుకుని ఇచ్చాపురం వరకు 974కిలో మీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కు పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సాంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధ కాలం ముగియకుండానే ప్రతీ ఏటా మే నెలలోనే వారి ఖాతాలకు నేరుగా జమ చేస్తూ గంగపుత్రులకు అండగా నిలిచింది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందిస్తే, గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం 5.38లక్షల మందికి రూ.538.01 కోట్ల భృతిని అందించింది. అలాగే డీజిల్ సబ్సిడీ కింద టీడీపీ ఐదేళ్లలో రూ.59.42 కోట్లు అందించగా, ఈ ప్రభుత్వ హయాంలో రూ.148 కోట్లు అందించింది. ఐదేళ్లూ మత్స్యకార భృతినందుకున్నా.. నాకు తెప్పనావ ఉంది. 20 ఏళ్లుగా ఈ నావే జీవనాధారం. గతంలో వేట విరామ çసమయంలో జీవనాధారం లేక చాలా ఇబ్బంది పడేవాళ్లం. కానీ ప్రస్తుతం భృతిని రూ.10వేలకు పెంచడమే కాదు నిషేధ సమయంలోనే అందిస్తున్నారు. ఐదేళ్లుగా మత్స్యకార భృతిని అందుకున్నా. – కోడా లక్ష్మణ్, బోటు యజమాని, దొండవాక, అనకాపల్లి జిల్లా మత్స్యకారులంతా జగన్ వెంటే.. స్వాతం్రత్యానంతరం మరే ప్రభుత్వం చేయలేని రీతిలో మత్స్యకారుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా పాటుపడిన మరో నాయకుడు లేరనే చెప్పాలి. వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా నిషేధ సమయంలోనే అర్హులైన ప్రతీ మత్స్యకారుని అందించి అండగా నిలిచారు. మత్స్యకారులతో పాటు ఆక్వారైతులు జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటారు. – లంకె వెంకటేశ్వరావు, మెకనైజ్డ్ బోటు యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కృష్ణా జిల్లా -
విజయవాడలో సీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, అమరావతి: స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాల కల్పనే లక్ష్యంగా విజయవాడలో 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా 50 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో దేశంలోనే నం.1 స్థానంలో ఉన్న రాష్ట్రంలో స్థానిక వినియోగం 8 శాతానికి మించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. కానీ వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని చెప్పారు. మిగిలిన రొయ్య అంతా ఎగుమతి అవుతోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైతే రాష్ట్రంలోని రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని తెలిపారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే డొమెస్టిక్ మార్కెట్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో సీ ఫుడ్ వినియోగదారులు పెద్ద ఎత్తున ఉన్నా.. డిమాండ్‌కు తగ్గట్టుగా రిటైల్ షాపులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘ఫిష్ ఆంధ్రా’ బ్రాండ్‌తో స్థానిక వినియోగం పెంచేలా ఆక్వా హబ్స్ అండ్ స్పోక్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1,500 అవుట్ లెట్స్‌ను ఏర్పాటు చేయగా.. 15 హబ్స్ నిర్మాణంలో ఉన్నట్టు చెప్పారు. మరిన్ని హబ్స్, అవుట్ లెట్స్ ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించడం, వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఫెస్టివల్లో 20 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఫెస్టివల్లో రోజూ రూ.699తో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్‌ను అందిస్తున్నామన్నారు. సీ ఫుడ్‌పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2కే రన్ నిర్వహంచనున్నట్టు తెలిపారు. ఇలాంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖ, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోనూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ బ్రోచర్‌ను కమిషనర్ కన్నబాబు విడుదల చేశారు. -
విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, అమరావతి: మత్స్య సంపద వినియోగాన్ని దేశీయంగా పెంచేందుకు, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృత పర్చాలనే లక్ష్యంతో విజయవాడలో మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ నెల 28 నుండి 30 వ తేదీ వరకు విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో భూమి ఆర్గానిక్స్ సౌజన్యంతో ప్రభుత్వం ఎంతో ఘనంగా ఈ ఫెస్టివల్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సాలీనా 50 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తితో రాష్ట్రం ఆక్వా హబ్ గా పేరుగాంచినప్పటికీ దేశీయ వినియోగం చాలా తక్కువగా ఉందన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మత్స్య సంపదను రాష్ట్రంలో సాలీనా ఒక వ్యక్తి కేవలం 8 కే.జి.లకు మించి వినియోగించుకోవడం లేదన్నారు. ఒకప్పుడు రొయ్యలను బ్రెజిల్ పూర్తిస్థాయిలో ఎగుమతి చేసేదని, అయితే డొమెస్టిక్ మార్కెట్ పెంచుకోవడం వల్ల స్థానికంగానే రొయ్యలను వినిగించుకునే స్థాయికి బ్రెజిల్ ఎదిగిందన్నారు. అదే స్థాయిలో మన రాష్ట్రం కూడా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 75 శాతం మేర రొయ్యలు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంటే, వాటి వినియోగం మాత్రం రాష్ట్రంలో కేవలం 5 శాతం లోపే ఉందన్నారు. మిగిలిన రొయ్య అంతా రాష్ట్రం నుండి ఎగుమతి అవుతున్నదని, అంతర్జాతీయ మార్కెట్ పై ఆధార పడి ఆ రొయ్యరేటు ఉంటుందని, అక్కడ ఏమన్నా తేడా వస్తే మన రైతులు నష్టాలకు గురి కావాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులను అదిగమించేందుకు డొమెస్టిక్ మార్కెట్ ను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని మత్స్యకారులకు మరియు మత్స్య సంపదను సాగు చేసే రైతులకు మేలు చేసే విధంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పర్చాలని రెండేళ్ల క్రింద రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాను ప్రకారం తక్షణ చర్యగా ‘ఫిష్ ఆంధ్రా’ అనే ఒక బ్రాండ్‌ను గత ఏడాదిన్నర్ర కాలం నుండి విస్తృతంగా ప్రోత్సహించడం జరుగుచున్నదన్నారు. సీ ఫుడ్ వినియోగదారులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రిటైల్ షాపులు అందుబాటులో లేకపోవడం కూడా ఒక సమస్యగా మారిందన్నారు. బహిరంగ మార్కెట్ లో చికెన్, మటన్, గుడ్లు విస్తృత స్థాయిలో అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ సమయం నిలువవుండని చేపలు, రొయ్యలు, పీతలు తదితర సీ ఫుడ్ ను అందుబాటులో ఉంచడమనేది సవాలుతో కూడుకున్న విషయమన్నారు. ఈ సమస్యను అదిగమించి తాజాగా గానీ, ప్యాక్డు రూపంలో గానీ సీ ఫుడ్ ను వినియోగదారులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో హబ్ అండ్ స్పోక్ విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తేవడం జరిగిందన్నారు. ఇందులో బాగంగా సుమారు 1,500 అవుట్ లెట్స్ ను ఏర్పాటు చేయగా 26 హబ్స్ ను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించడమైందన్నారు. మొత్తం 26 హబ్స్ లో 15 హబ్స్ నిర్మాణంలో ఉన్నాయని, మూడు ఆపరేషన్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్న చోట మరిన్ని హబ్స్, అవుట్ లెట్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మరియు వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ ను వేదికగా చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్లో ఆక్వా రైతులు, మత్స్యకారులు, సీ ఫుడ్ ప్రాసెసింగ్, ప్రమోటింగ్ యూనిట్స్ ప్రతినిధులు మరియు సాదారణ పౌరులు మొత్తం దాదాపు 20 వేల మంది సందర్శకుల వరకూ పాల్గొనే అవకాశం ఉందన్నారు. మత్స శాఖ పరంగా పది స్టాళ్లను, నాలెడ్జు పార్టర్ అయిన భూమి ఆర్గానిక్స్ వారు కూడా పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రూ.699/- లతో అపరిమితమైన సీ ఫుడ్ బఫెట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీ ఫుడ్ పై వంటల పోటీలు, వైద్యులు, పోషకాహార నిపుణులతో సెమినార్లు, 2K రన్ ను కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ లో నిర్వహించడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. విజయవాడతోనే ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ అగిపోదని, ఇటు వంటి సీ ఫుడ్ ఫెస్టివల్స్ విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదే విధంగా రానున్న రోజుల్లో జిల్లా కేంద్రాలతో పాటు హైద్రాబాదు, బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించనున్నామన్నారు. భూమి ఆర్గానిక్స్ ప్రతినిది రఘురామ్ మాట్లాడుతూ మానవునికి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చే ఒమెగా 3 ఫాటియాసిడ్స్ చేపలో సమృద్దిగా ఉన్నాయని, ఇతర మాంసాహారాల కంటే చేపల వినియోగం ఎంతో మంచిదని అన్నారు. ఆరోగ్య కరమైన ఆహారాన్ని వినియోగదారులు పెద్దఎత్తున ఉపయోగించుకునేందుకు తమ సంస్థ పెద్ద ఎత్తున కృషిచేస్తున్నట్లు తెలిపారు. -
ఫిష్.. ఫిష్ హుర్రే!
సాక్షి, అమరావతి: ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఆదరణ మరింత పెరుగుతోంది. ‘ఫిష్ ఆంధ్ర’ అవుట్‌లెట్స్‌కు ఏ రోజు వెళ్లినా కావాల్సిన మత్స్య ఉత్పత్తులు తాజాగా దొరుకుతాయన్న నమ్మకం మాంసాహార ప్రియుల్లో ఏర్పడింది. దీంతో వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. తమకు జీవనోపాధి లభించడంతోపాటు తమ ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించగలుగుతున్నామని అవుట్‌లెట్స్ నిర్వాహకులు చెబుతుంటే.. శుభ్రమైన వాతావరణంలో తాజా మత్స్య ఉత్పత్తులు లభిస్తున్నాయని వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వినియోగం పెంచే లక్ష్యంతో.. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట ప్రభుత్వం బ్రాండింగ్ చేసి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేల అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో జిల్లాకు ఒకటి చొప్పున ఆక్వా హబ్, వాటికి అనుబంధంగా 4 వేల అవుట్‌లెట్స్, స్పోక్స్, డెయిలీ, సూపర్, లాంజ్ యూనిట్స్‌తో పాటు త్రీవీలర్, 4 వీలర్ కియోస్‌్కలను 60 శాతం సబ్సిడీపై నిరుద్యోగ యువతకు మంజూరు చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,250 అవుట్‌లెట్స్, 70 త్రీ వీలర్, 84 ఫోర్ వీలర్ వెహికల్స్, 62 డెయిలీ, 50 సూపర్, 11 లాంజ్ యూనిట్స్ కలిపి మొత్తంగా 1,527 యూనిట్స్ ఏర్పాటయ్యాయి. తొలుత నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా దొరికే చేపలు, రొయ్యలతోపాటు సముద్ర మత్స్య ఉత్పత్తులు సైతం లభిస్తుండటంతో వీటిని కొనేందుకు ఎగబడుతున్నారు. స్పందన చాలా బాగుంది ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేసేవాడిని. నెలకు రూ.15 వేలు జీతం వచ్చేది. ప్రభుత్వ ప్రోత్సాహంతో కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్ట్ సెంటర్లో 60 శాతం సబ్సిడీతో ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ పెట్టుకున్నా. ఆదివారం 200–300 కిలోలు, మిగిలిన రోజుల్లో 50నుంచి 100 కేజీల వరకు మత్స్య ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. నాకు ఉపాధి లభించడంతోపాటు మరో నలుగురికి ఉపాధి చూపిస్తున్నా. కాకినాడ నుంచి సముద్ర చేపలు, రొయ్యలు, పీతలు సైతం వస్తున్నాయి. సీ ఫుడ్స్ కోసం క్యూ కడుతున్నారు. సాయంత్రం పూట చేప, రొయ్య తదితర వంటకాలతో వాల్యూ యాడెడ్ యూనిట్ నడుపుతున్న. స్పందన చాలా బాగుంది. సిబ్బంది జీతభత్యాల కింద రూ.56 వేలు చెల్లిస్తున్నా. రూ.60 వేలకు పైగా ఈఎంఐలు కడుతున్నా. అయినా రూ.50 వేల వరకు మిగులుతోంది. – బట్టు రాజశేఖర్, ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ నిర్వాహకుడు, కర్నూలు చాలా తాజాగా ఉంటున్నాయి ప్రతి ఆదివారం ఫిష్ ఆంధ్ర అవుట్లెట్కు వస్తున్నా. ఇక్కడ గోదావరిలో మాత్రమే దొరికే చేపలతో పాటు సముద్ర చేపలు, రొయ్యలు కూడా దొరుకుతాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి. – జి.శ్రీనివాసరావు, పోరంకి, విజయవాడ హైజీనిక్‌గా ఉంటున్నాయి అవుట్లెట్కు ఏరోజు వచ్చినా అన్నిరకాల చేపలు దొరుకుతున్నాయి. చాలా తాజాగా ఉంటున్నాయి. హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తున్నారు. – కె.రామయ్య, ఈడుపుగల్లు, పెనమలూరు ఆదరణ పెరుగుతోంది స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్ర పేరిట నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటికే మూడు హబ్‌లతో పాటు 1,500కు పైగా అవుట్‌లెట్స్, ఇతర యూనిట్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. గతంతో పోలిస్తే స్థానిక వినియోగం గణనీయంగా పెరిగింది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
ఆర్బీకేల ద్వారా చేప పిల్లలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నాణ్యమైన చేపల సీడ్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్బీకేల ద్వారా చేప, రొయ్య మేతలను రైతులకు అందిస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నాణ్యమైన చేపల సీడ్‌ను కూడా సరఫరా చేయబోతోంది. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలు ఉండగా.. ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లోని ఆర్బీకేలలో 734 మంది మత్స్య సహాయకులు సేవలందిస్తున్నారు. ఈ–ఫిష్ ద్వారా ఆక్వా సాగు నమోదుతో పాటు ఆక్వా చెరువులకు లైసెన్సులు సైతం జారీ చేస్తున్నారు. దిగుబడుల్లో నాణ్యత పెంచేందుకు చెరువుల్లో శాంపిల్స్ సేకరించి వాటర్ క్వాలిటీ టెస్ట్‌లు కూడా చేస్తున్నారు. ఆక్వా సాగులో కీలకమైన ఇన్పుట్స్ కూడా ఆర్బీకేల ద్వారానే సరఫరా అవుతున్నాయి. ఇప్పటికే 25 ఫీడ్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్న మత్స్య శాఖ ఆర్బీకేల ద్వారా 2,736 టన్నుల చేప, రొయ్యల మేతలను రైతులకు సరఫరా చేసింది. 54 సీడ్ ఫామ్స్‌తో అనుసంధానం ఇకపై చేపల రైతులకు నాణ్యమైన, ధ్రువీకరించిన సీడ్ సరఫరా చేసేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం మత్స్య సహాయకులకు ఇచ్చిన ట్యాబ్స్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసింది. ఈ–మత్స్యకార యాప్ ద్వారా రాష్ట్రంలోని 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌ను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సాగునీటి వనరుల్లో నాణ్యమైన మత్స్య దిగుబడులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్‌లో పెద్దఎత్తున చేప పిల్లలను ఉత్పత్తి చేస్తుంటుంది. వీటిని ఆర్బీకేల ద్వారా లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఆర్బీకేల ద్వారా బుకింగ్ చేసి జిల్లాల వారీగా లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఫిష్ ఫామ్స్‌తో పాటు రైతుల ద్వారా 10.13 కోట్ల సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో 1,817 లైసెన్స్డ్ రిజర్వాయర్లు ఉండగా.. వాటికి 10.10 కోట్ల సీడ్ అవసరమని అంచనా వేశారు. ఇప్పటివరకు 3.09 కోట్ల ఫిష్ సీడ్‌ను ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. వీటిని ఆయా ప్రాంతాల్లో లైసెన్స్ పొందిన మత్స్యకారులు వేటసాగిస్తూ జీవనోపాధి పొందనున్నారు. మలి దశలో రైతులకు కావాల్సిన ఫిష్ సీడ్ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాణ్యమైన చేప పిల్లల సరఫరాయే లక్ష్యం ఆర్బీకేల ద్వారా నాణ్యమైన చేప పిల్లలను సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం ఆర్బీకేల ద్వారా లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు సరఫరా చేస్తున్నాం. మలిదశలో రైతులకు సరఫరా చేసేలా ఏర్పాట్లు సన్నాహాలు చేపట్టాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ -
చేపలు పట్టడం కాదు, చేపల శాస్త్రం చదవండి, ఉద్యోగాలు కొట్టండి
ముత్తుకూరు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆక్వా రంగంలో బోధన, పరిశోధన, విస్తరణ అనే మూడు సూత్రాలతో ముత్తుకూరులో మత్స్య శాస్త్ర కళాశాల ఏర్పడింది. రాష్ట్రంలోని ఏకైక కళాశాలగా 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నీలి విప్లవాన్ని దృష్టిలో పెట్టుకుని 1991 ఆగస్ట్ 31వ తేదీన నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారు. 1992 డిసెంబర్లో బీఎఫ్ఎస్సీ (బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిషరీ సైన్స్) నాలుగు సంవత్సరాల కోర్సు 20 సీట్లతో ప్రారంభమైంది. 1995 మార్చి 10వ తేదీన ఈ కళాశాలకు నూతన భవనం ఏర్పడింది. పీహెచ్డీ స్థాయికి.. దేశంలో మొత్తం 28 మత్స్య కళాశాలున్నాయి. ముత్తుకూరులోని మత్స్య కళాశాల తొలుత తిరుపతిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉండగా, తర్వాత శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. తొలుత బీఎఫ్ఎస్సీ కోర్సులతో మొదలై క్రమంగా ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ స్థాయికి ఎదిగింది. శాస్త్రవేత్తలుగా.. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు మత్స్య శాస్త్రాన్ని బోధిస్తూ విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారు. బోధనతో సరిపెట్టకుండా పరిశోధనలు చేయిస్తూ, సముద్ర ఉత్పత్తులపై సంపూర్ణ అవగాహన కలిగిస్తున్నారు. ఈ కళాశాలకు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో 73 ఎకరాలు, ఎగువమిట్టలో 47 ఎకరాల భూములున్నాయి. ఎగువమిట్ట భూముల్లో చేపల పెంపకం జరుగుతోంది. విద్యార్థులు ఇక్కడ తరచూ శిక్షణ పొందుతున్నారు. విశాలమైన క్రీడా మైదానం, అనేక దేశ, విదేశీ పుస్తకాలతో లైబ్రరీ, ల్యాబ్, సమావేశ మందిరం, హాస్టళ్లు తదితర సౌకర్యాలతో ఈ కళాశాల యూనివర్సిటీ స్థాయిని సంతరించుకుంది. క్షేత్ర సందర్శన తరగతి గదుల్లో మత్స్య శాస్త్రాన్ని అభ్యసించడమే కాకుండా ఆక్వా సాగు, రైతుల కష్ట, నష్టాలు స్వయంగా తెలుసుకునే నిమిత్తం BFSc నాలుగో సంవత్సరం చదివే విద్యార్థులు ‘ఫివెప్’ (ఫిషరీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 110 రోజులపాటు గ్రామాల్లో నివాసం ఉంటూ రొయ్యలు, చేపల పెంపకం, చెరువుల యాజమాన్యం, మేత వినియోగం, అనారోగ్య సమస్యలు, నివారణ పద్ధతులు, పట్టుబడి తదితర అంశాలపై అవగాహన పెంచుకుంటారు. దీనిపై ఒక నివేదిక రూపొందిస్తారు. అలాగే, ‘ELP’ (ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం) అనే కార్యక్రమంలో పాల్గొంటారు. 12 వారాల ఈ కార్యక్రమంలో ఫైనలియర్ విద్యార్థులు రంగు చేపల పెంపకం చేసి, అమ్మకాలు చేస్తారు. చేపలు, రొయ్యల ఊరగాయలు, వడియాలు తయారు చేసి, అమ్మకాలు చేస్తారు. భవిష్యత్‌లో పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. కోర్సు సబ్జెక్ట్‌లు BFMSc - విద్యార్థుల సంఖ్య - 154 8 MFMSc - విద్యార్థుల సంఖ్య - 12 6 PHd - 7 3 మెండుగా ఉద్యోగావకాశాలు విద్యార్థులకు బోధనతోపాటు, శిక్షణ, క్షేత్ర సందర్శన చాలా ముఖ్యం. మత్స్య కళాశాలలో చదువు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడి కళాశాలలో చదివిన విద్యార్థులు చాలామంది దేశ, విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. – డాక్టర్ రామలింగయ్య, అసోసియేట్ డీన్ ప్రతిపాదన ఉంది మన రాష్ట్రంలో మరో రెండు మత్స్య కళాశాలలు అవసరం. తమిళనాడులో నాలుగు, మహారాష్ట్రలో మూడు మత్స్య కళాశాలలున్నాయి. ఈ కోణంలో మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, నరసాపురంలో రెండు మత్స్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. – డాక్టర్ డి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఫిషరీస్ డీన్ -
పశు వైద్యానికీ పటిష్ట వ్యవస్థ
వైద్య ఆరోగ్య శాఖలో ఒక సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. అదే రీతిలో పశు సంవర్థక శాఖలో కూడా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగా గ్రామ స్థాయిలో పశు సంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలి. ఆర్బీకేల్లో పని చేస్తోన్న పశు సంవర్థక సహాయకుల సమర్థతను మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ స్థాయిలో పనిచేసే ఒకరిద్దరు వలంటీర్లను ఈ సేవల్లో భాగస్వాములను చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘నాణ్యమైన, మెరుగైన పశు వైద్య సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేసే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పని చేసేలా హేతుబద్ధమైన వ్యవస్థ ఉండాలి. తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. యూనిఫార్మిటీ తీసుకురావడం ద్వారా నాణ్యమైన సేవలు అందుబాటులోకి తీసుకు రావచ్చు. ఇందుకోసం తగిన మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై బుధవారం ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూగ జీవాలకు అందిస్తోన్న సేవల్లో దేశానికి మనం మార్గనిర్దేశంగా నిలిచామని, దాన్ని ఇదే రీతిన కొనసాగించాలన్నారు. మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్థ నుంచి ఆర్బీకేల్లో ఉన్న పశు సంవర్థక సహాయకులకు పూర్తి స్థాయి మద్దతు, సహకారం ఉండేలా చూడాలని చెప్పారు. దీనివల్ల సంతృప్త స్థాయిలో పశువులకు తగిన వైద్య సేవలుు అందించడానికి వీలవుతుందన్నారు. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) తయారు చేయాలని ఆదేశించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు విషయంలో ఏం చేయాలో నిర్ధిష్టమైన విధానాన్ని నిర్ధేశించుకున్న తర్వాత నాడు – నేడు కింద మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పర్యవేక్షణ కోసం హెల్త్ కార్డు ► ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్ కార్డు జారీ చేయాలి. వాటి ఆరోగ్య పరిస్థితి, పోషకుల వివరాలు ఆ కార్డులో పొందుపర్చాలి. ఈ కార్డుల జారీ వల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుంది. ► పశువులకు నూరు శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి. నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకుని పని చేయాలి. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వ చేయడానికి ప్రతి ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. ► పశు సంవర్థక శాఖలో అన్ని రకాల సేవల కోసం ఒకే నంబరు వినియోగించాలి. పశు పోషకుల వద్ద కాల్ సెంటర్ నెంబర్ ఉండాలి. పశువుల అంబులెన్స్‌ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎస్ఓపీ రూపొందించాలి. పశు సంవర్థక శాఖ ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ వివక్ష లేకుండా అర్హులందరికీ అందేలా చూడాలి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేసే దిశగా కృషి చేయాలి. పాడి రైతుల జీవనోపాధిపై దృష్టి ► గడిచిన రెండేళ్లుగా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చాం. ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగు పరచడానికి, ఆ మార్గాలను బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పనపై దృష్టి సారించాలి. ► పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాల కోసం అవసరమైన రుణాలు మంజూరు విషయంలో అధికారులు దృష్టి సారించాలి. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరిగేలా శ్రద్ధ వహించాలి. రసాయనాలకు తావులేని పశు పోషణ విధానలపై అవగాహన పెంచాలి. ఆ దిశగా పాడి రైతులకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన మిల్క్ సొసైటీల వద్ద అమూల్ భాగస్వామ్యంతో శిక్షణ ఇవ్వాలి. చిత్తూరు డెయిరీని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలి. డెయిరీ పునరుద్దరణకు రెండు మూడు వారాల్లో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు ► ఆక్వా రైతులకు మేలు చేసేందుకే ఫీడ్, సీడ్ రేట్లపై నియంత్రణ కోసం చట్టాలను తీసుకొచ్చాం. వీటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఎలా తీసేశామో అదే రీతిలో ఆక్వా ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి. – ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయాలి. అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. సహకార రంగంలో డెయిరీలు ఏర్పాటు చేస్తున్నట్టుగానే ఆక్వా రంగంలో కూడా సహకార పద్ధతిలోనే కొత్త ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలి. ఆక్వా సాగయ్యే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలి. ► ఫిషింగ్ హార్బర్ల పనులు వేగవంతం చేయాలి. నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యేలా చూడాలి. అప్పుడే మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ నుంచి ఏటా కనీసం రూ.వెయ్యి కోట్లకు పైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుంది. ఉపాధి కోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతమాత్రం ఉండదు. ► ఈ సమావేశంలో పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, పశు సంవర్థక, పాడి పరిశ్రామిభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్, మత్స్య శాఖ కమిషనర్ కే.కన్నబాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ అహ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు. రెండో ఫేజ్ హార్బర్లకు పర్యావరణ అనుమతులు ► రెండవ ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్ని రకాల అనుమతులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ► మొదటి ఫేజ్‌లో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 92.5 శాతం పూర్తయ్యాయని, ఫిబ్రవరి 15 నాటికి మిగిలిన పనులు పూర్తవుతాయని చెప్పారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ప్రతి 3 నెలలకొకటి చొప్పున డిసెంబర్‌కల్లా మొదటి ఫేజ్ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ.3,520.57 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ► ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళకు చెందిన అధికారులు రాష్ట్రాన్ని సందర్శించి వెళ్లారని, ఆయా రాష్ట్రాల్లో ఏపీ మోడల్లోనే పశు అంబులెన్స్‌ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు. ► ఆర్బీకే స్థాయిలో ఖాళీగా ఉన్న 4,765 పశు సంవర్థక సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జగనన్న పాల వెల్లువ కింద 2.6 లక్షల మంది రైతులు సభ్యులుగా చేరారని, వారి నుంచి ఇప్పటి వరకు 6.06 కోట్ల లీటర్ల పాలను సేకరించామన్నారు. వచ్చే 2 నెలల్లో మరో 1,422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. -
ఆక్వా రైతులకు మేలు జరగాలి... మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ది, మత్స్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశం సందర్భంగా పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల్లో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. వైద్య, ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్‌సీలు, అలాగే ప్రతి సచివాలయానికి ఒక విలేజీ క్లినిక్స్ ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నాం. అలాగే పశు సంవర్థక శాఖలో కూడా ఈ తరహాలోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలి. యూనిఫార్మిటీ (ఏకరూపత) తీసుకురావడం ద్వారా మంచిసేవలు అందుబాటులో తీసుకురావొచ్చు. ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు–నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి ఒక హేతుబద్ధత ఉండాలి. దీనికోసం ఒక మార్గదర్శక ప్రణాళికను తయారుచేయాలి. పశువులకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలి. లక్ష్యాలు నిర్దేశించుకుని.. ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలి. ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్, అందులో ఏఎన్ఎం, అండగా ఆశావర్కర్లు ఇలా ఒక వ్యవస్థ జనరేట్ అయ్యింది. అలాగే ఆర్బీకేల్లో ఉన్న పశుసంవర్థక విభాగాన్ని బలోపేతం చేయాలి. యానిమల్ హస్బెండరీ అసిస్టెంటు సమర్ధతను పెంచాలి. గ్రామస్థాయిలో ఒకరిద్దరు వాలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. దీనికోసం ఎస్ఓపీ తయారుచేయాలన్నారు. ప్రతీ మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్ధ నుంచి ఆర్బీకేల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంటుకు పూర్తిస్థాయి మద్దతు, సహకారం ఉండాలి. దీనివల్ల సంతృప్తస్థాయిలో పశువులకు తగిన వైద్యం సహా పోషణ సేవలను అందించడానికి వీలవుతుంది. పశుపోషణ చేస్తున్న వారి వద్ద కాల్‌సెంటర్ నంబర్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నంబర్లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలి. దీనివల్ల వాటికి అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుందని సీఎం జగన్ తెలిపారు. పశుసంవర్థక శాఖలో ఏ స్కీం అమలు చేసినా అర్హులందరికీ అది అందాలి. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే.. అందరికీ ఆ స్కీంలు అందజేయాలి. వివక్ష లేకుండా అందరికీ స్కీంలు అందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏర్పాటు చేసిన మిల్క్ సొసైటీల వద్ద అమూల్ భాగస్వామ్యంతో పాడిరైతులకు శిక్షణ ఇప్పించాలి. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి. పాల నాణ్యత పెరగాలి. రసాయనాలకు తావులేని పశుపోషణ విధానలపై అవగాహన పెంచాలి. పశుసంవర్థక శాఖలో అన్ని రకాల సేవల కోసం ఒకే నంబరు వినియోగించాలి. పశువుల అంబులెన్సులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. దీనికోసం ఎస్ఓపీ రూపొందించాలి. పశువులకు సేవల్లో దేశానికి మార్గనిర్దేశంగా నిలిచామని, దాన్ని కొనసాగించాలన్న సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏపీలో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న అంబులెన్స్ విధానంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రానికి పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కేరళకు చెందిన అధికారులు వచ్చి సందర్శించి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించాలని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే రెండు సంవత్సరాలపాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్క చెల్లెమ్మలకు ఏడాదికి రూ.18,750 చొప్పున ఇచ్చాము. ఈ డబ్బు వారి జీవనోపాధి మార్గాలను మెరుగుపరచడానికి, ఆ మార్గాలను బలోపేతంచేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాలకోసం అవసరమైన రుణాలు మంజూరు చేయించడంలో కూడా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వచేయడానికి ప్రతీ ఆర్బీకేలో ఫ్రిజ్ సహా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 4,765 ఏహెచ్ఏ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. జగనన్న పాలవెల్లువ సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. 2.6 లక్షల మంది రైతులు పాలవెల్లువ కింద పాలు పోస్తున్నారన్న సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. 606 లక్షల లీటర్లను ఇప్పటివరకూ సేకరించాము. వచ్చే రెండు నెలల్లో మరో 1422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం వెళ్తుంది. చిత్తూరు డైయిరీ పునరుద్ధరణకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీంతో, మరో రెండు మూడు వారాల్లో శంకుస్థాపనకు అన్నీ సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపైనా సమీక్ష.. మొదటి విడతలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వేగంగా పనులు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. జువ్వలదిన్నెలో ఇప్పటికే 92.5శాతం పనులు పూర్తి అయినట్టు తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి జువ్వలదిన్నె పనులు పూర్తి అవుతాయన్నారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ప్రతీ త్రైమాసికానికి ఒకటి చొప్పున డిసెంబర్ నాటికి మొదటి ఫేజ్ ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు.. సీఎం జగన్‌కు తెలిపారు. రెండో ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్నిరకాలుగా అనుమతులు మంజూరు అయ్యాయని అధికారులు వెల్లడించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇక, మొత్తం 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 3,520.57 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల జీడీపీ పెరుగుతుంది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతుంది. దీని వల్ల ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఫిషింగ్ హార్భర్ నుంచి ఏడాదికి వేయి కోట్ల రూపాయలకుపైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని సీఎం జగన్ అన్నారు. ఇది పరోక్షంగా ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఉపాధి కోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్న సీఎం జగన్ ఆకాంక్షించారు. ఆక్వా రైతులకు మేలు జరగాలి. దీనికోసం ఫీడు, సీడు రేట్లపై నియంత్రణ కోసం చట్టాలను తీసుకువచ్చామన్నారు. వీటిని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ఆక్వా రంగంలో కూడా మధ్యవర్తుల ప్రమేయాన్ని తీసివేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. దీని ద్వారా ఆర్బీకే వ్యవస్థను బలోపేతం చేయాలని, ఈ సీజన్లో అధికారులు దీన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. దీనిపై అధికారులు యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోవాలన్నారు. ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్ సెంటర్లపైనా దృష్టిపెట్టాలన్నారు. సహకార రంగం మాదిరిగా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ,పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసీ) వై మధుసూధన్‌రెడ్డి, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు తదితరులు హాజరయ్యారు. -
పులసను మించి క్రేజ్.. ‘రామలు’ రాలేదేంటో!
‘రామలు’.. గోదావరి జిల్లాల్లో పులసలకు మించి క్రేజ్ ఉండే చిన్నపాటి చేపలివి. 9 అంగుళాల పొడవున.. పాము ఆకారంలో ఉండే ఈ జాతి చేపలు ఏ ప్రాంతంలో ఉన్నా.. నదుల ద్వారా ప్రయాణం సాగించి సీతారాముల కల్యాణం (శ్రీరామనవమి)లోగా భద్రాచలం చేరి తరిస్తాయన్నది ఓ కథనం. అందుకే వీటికి ‘రామ’లు అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ ఏడాది ఎక్కడా రామల జాడ కనిపించలేదు. సీజన్ ముగిసిపోతున్నా గోదావరి ఏ పాయలోనూ వాటి ఆచూకీ నేటికీ లభించలేదు సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే అరుదైన చేప జాతుల్లో ఒకటైన ‘రామలు’ జాడ ఈ ఏడాది ఎక్కడా కనిపించకపోవడంతో మాంసాహార ప్రియులు అల్లాడిపోతున్నారు. సముద్ర తీరాన గోదావరి పరీవాహక ప్రాంతంలోని మడ అడవులు, ఉప్పునీటి ఏరుల్లో మాత్రమే ఇవి అరుదుగా లభిస్తాయి. వీటికి సుడపోక్రిప్టస్, ఇలాంగాటస్ అనే శాస్త్రీయ నామాలు ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లభించే ఈ అరుదైన చేపలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది ప్రియులున్నారు. కోనసీమ జిల్లా రాజోలు దీవిలోని గూడపల్లి, కాట్రేనిపాడు, గోగన్నమఠం, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు తదితర ప్రాంతాలు రామలకు ప్రసిద్ధి. అక్టోబర్, నవంబర్ నెలల్లో రామలు లభిస్తాయి. నాచునే ఆహారంగా తీసుకుంటాయి. పులసను మించి క్రేజ్ ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే పులసలకు మించిన క్రేజ్ రామలకు ఉంది. రుచిలో మరే చేపలకు లభించని ఆదరణ వీటి సొంతం. రామల కూరకు ఈ ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది. మసాలా దట్టించి ఇగురు.. అదే సీజన్లో కాసే లేత చింతకాయలతో కలిపి పులుసు పెడితే ఆహా ఏమి రుచి అంటూ మాంసాహార ప్రియులు లొట్టలేసుకుని వీటిని ఆరగిస్తారు. చింతకాయలతో కలిపి వీటిని కూర వండితే ఆ వాసన ఊరి పొలిమేర దాటాల్సిందే. సీజన్ ముగిసిపోతున్నా గోదావరిలో ఏ పాయలోనూ రామలు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. రామ సైజును బట్టి ధర పలుకుతుంది. సాధారణంగా రామ సైజు 9 అంగుళాల వరకు ఉంటుంది. ఒక్కో రామ ధర రూ.40 నుంచి రూ.50 పలుకుతుంది. సైజు చిన్నవైతే తక్కువ పరిమాణంలో ఉంటే రామ ఒక్కొక్కటీ రూ.18 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తారు. ఈ ఏడాది వీటి జాడ లేదు కొంతకాలంగా రామలు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది గోదావరి, సముద్ర తీరం చెంతన ఎలాంటి జల వనరుల్లోనూ వీటి జాడ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో చేపల చెరువుల్లోనూ రామలను పెంచుతున్నారు. అయితే, గోదావరి వెంట సెలయేరులు, బోదెల్లో సహజంగా పెరిగే రామలకు ఉండే రుచి వీటికి రావడం లేదు. చేదు కట్టుకు డిమాండ్ ఎక్కువ సాధారణంగా చేపలలో ఉండే చేదు కట్టును తొలగించాకే వంటకు వినియోగిస్తారు. అయితే, రామలను చేదు కట్టుతోనే కూర వండుతారు. రామలలో ఉండే చేదు కట్టు జీర్ణాశయానికి, శరీర పటుత్వానికి ఉపయోగపడుతుందని మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు చెబుతున్నారు. ఇంటికొచ్చే వరకు బతికే ఉంటుంది అక్టోబర్ నుంచి డిసెంబర్ మొదటి వారంలోపు మాత్రమే రామలు లభిస్తాయి. పులసలు మాదిరిగానే ఇవి రుచిలో మేటిగా ఉంటాయి. ఇటీవల వీటి జాడ తగ్గిపోయింది. అక్కడక్కడా చెరువుల్లో పెంచుతున్నా వాటికి పెద్దగా రుచి ఉండదు. చేప ఒకసారి రుచి చూస్తే ఇక వదలరు. రామలను నీటిలోనే ఉంచి విక్రయిస్తారు. ఇంటికి తీసుకువెళ్లే వరకు బతికి ఉండే అరుదైన చేప ఇది. – చిట్టూరి గోపాలకృష్ణ, శాస్త్రవేత్త, మత్స్యశాఖ రామలు అంతరించిపోతున్నాయి రామలు అంతరించిపోతున్నాయి. మాకు రామల సీజన్లో ఆదాయం బాగా వచ్చేది. వాటి ఆవాసాలకు ఇబ్బంది కలగడంతోపాటు చైనా గొరకలు విపరీతంగా పెరిగి ఇలాంటి చేపలను తినేస్తున్నాయి. దీనివల్ల అరుదైన రామల చేప అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. – ఓలేటి అమావాస్యరాజు, మత్స్యకారుడు, గోగన్నమఠం -
ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) కాకినాడ)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎస్‌ఐఎఫ్‌టీలోని ఆక్వా లేబొరేటరీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆక్వా ల్యాబ్‌ల నైపుణ్యతను పరీక్షించేందుకు అమెరికాకు చెందిన ఆరిజోనా యూనివర్సిటీ నిర్వహించే రింగ్ టెస్ట్‌లో ఎస్‌ఐఎఫ్‌టీ అత్యుత్తమ ప్రతిభను కనబర్చింది. ఇందులో 14 దేశాలకు చెందిన 29 ఆక్వా ల్యాబ్‌లతో పాటు భారత్ తరఫున ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్ పాల్గొంది. రొయ్యలలో తెల్లమచ్చల వ్యాధి, ఎంట్రోసైటోజూన్ హైపాటోపెనై (ఈహెచ్‌పీ) వ్యాధి కారకాలను నిర్ణీత కాలవ్యవధిలో అత్యంత సమర్థవంతంగా పరీక్షించి గుర్తించగలగడంతో ఎస్‌ఐఎఫ్‌టీలోని ఆక్వా ల్యాబ్ విజయం సాధించింది. ల్యాబ్, పరీక్షల నిర్వహణ, వ్యాధి కారకాల గుర్తింపులో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్న ల్యాబ్‌గా ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌ను ఆరిజోనా యూనివర్సిటీ గుర్తించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 61 పరీక్షలు 2001లో కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీలో ఏర్పాటైన రియల్ టైం పాలీమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) ఆక్వా ల్యాబ్‌కు 2017లో ఐఎస్ఓ సర్టిఫికేషన్ రాగా, గతేడాది బోర్డ్ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు కూడా లభించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 61 రకాల పరీక్షలు చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ యాక్ట్ (అప్సడా) నియమావళి ప్రకారం వివిధ రకాల మేతలు, సీడ్ నాణ్యతలను పరీక్షించి ధృవీకరించేందుకు ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వాకల్చర్ ల్యాబ్ రాష్ట్ర రిఫరల్ ల్యాబ్‌గా పనిచేస్తోంది. అలాగే, నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు సాధించడమే లక్ష్యంగా రూ.50.30 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఆక్వా ల్యాబ్స్‌ను ఆధునీకరించడంతోపాటు కొత్తగా 27 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటుచేస్తోంది. 35 ల్యాబ్‌లలో స్థానిక అవసరాలను బట్టి 14 చోట్ల మేతల నాణ్యత విశ్లేషణ, 17 చోట్ల పీసీఆర్, 14 చోట్ల క్వాలిటీ కంట్రోల్æ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లుచేశారు. ఆక్వా రైతులు వినియోగించుకోవాలి ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్‌ను ఆరిజోనా యూనివర్సిటీ కూడా గుర్తించడం ద్వారా మన ల్యాబ్ అంతర్జాతీయ ప్రమాణాలు కల్గిన ల్యాబ్‌గా ఖ్యాతిని గడించింది. ఆక్వా రైతులు, హేచరీలు ఈ ల్యాబ్ సేవలను సద్వినియోగం చేసుకుని సుస్థిర సాగుతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాలి. – పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్, ఎస్‌ఐఎఫ్‌టీ -
మత్స్యకారుల వెలుగులదిన్నె
అదంతా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం.. అపార మత్స్య సంపదకు నిలయం.. కానీ వేటకు అనువుగా లేని వైనం.. ఈ లోపాన్ని సరిదిద్దితే గంగపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగు నింపడం ఖాయం.. ఉపాధి వలసలకు చెక్ పెట్టడం తథ్యం.. గత పాలకులు ఈ విషయాన్ని నిర్లక్ష్యంతో విస్మరిస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాధ్యతగా, ప్రతిష్టగా తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒకటి. ఇది పూర్తయితే మత్స్యకారుల పాలిట ఇది వెలుగులదిన్నెగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో ‘సాక్షి’ అటు వైపు తొంగి చూసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సముద్ర తీరాన విలువైన మత్స్య సంపద ఉన్నప్పటికీ, అది గంగపుత్రుల దరి చేరడం లేదని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సంపదను వారి దరికి చేర్చే దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వివిధ పథకాల ద్వారా వారిని ఓ వైపు ఆదుకుంటూనే, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా తొలి దశలో నాలుగింటిని నిర్మిస్తున్నారు. ఇందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే నిర్దేశిత గడువుకంటే ముందే ఇది అందుబాటులోకి వచ్చేలా ఉంది. గత ఏడాది మార్చి 19వ తేదీన దీని నిర్మాణం ప్రారంభమైంది. రెండేళ్లలో అంటే 2023 మార్చికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం 250 మంది రేయింబవళ్లు పని చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. పెద్ద పడవలు సముద్రంలో నుంచి హార్బర్‌కు వచ్చేందుకు ఉపయోగపడే కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. బ్రేక్ వాటర్ ప్రాంతం పూడిపోకుండా నిర్మించే బ్రేక్ వాటర్ వాల్స్‌ను సుమారు 3 లక్షల టన్నుల రాతితో పటిష్టం చేశారు. ఈ గోడలను సిమెంట్‌తో నిర్మించిన ట్రైపాడ్స్‌తో నింపుతున్నారు. అలల ఉధృతిని తట్టుకోవడానికి నిర్మించే 7 వేల ట్రైపాడ్స్ (త్రికోణాకారంలో ఉన్న సిమెంట్ దిమ్మెలు)లో 5 వేల ట్రైపాడ్స్ నిర్మాణం పూర్తయ్యింది. పెద్ద బోట్లు రావడానికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 7 లక్షల క్యూబిక్ మీటర్లను వెలికి తీశారు. 1,250 బోట్లు నిలిపే 919 మీటర్ల జెట్టీ పునాదుల ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబర్ నాటికి జెట్టీ కాంక్రీట్ పనులు పూర్తి చేసి, బోట్లను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు మార్చిలోగా పూర్తి చేయనున్నారు. ఏటా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద 72 ఎకరాల్లో రూ.260 కోట్లతో నిర్మిస్తున్న ఈ హార్బర్ ద్వారా ఏటా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 6,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇంతకాలం పెద్ద బోట్లు నిలిచే అవకాశం లేక 25 నాటికల్ మైళ్ల దూరం దాటి, వేట చేపట్టలేకపోయేవాళ్లమని.. ఈ హార్బర్ వస్తే ప్రభుత్వ సహకారంతో పెద్ద మెకనైజ్డ్ బోట్లు కొనవచ్చని స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా నష్టం ఇలా.. హార్బర్లు, ఇతర సౌకర్యాలు లేనందున రాష్ట్ర మత్స్యకారులు సాధారణ బోట్లతో తీరంలో కొద్ది దూరంలోనే వేట సాగిస్తున్నారు. దీంతో అనుకున్న రీతిలో మత్స్య సంపద లభించడం లేదు. దీంతో పలువురు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద మెకనైజ్డ్ బోట్లు రాష్ట్ర తీరంలోని మత్స్య సంపదను తరలించుకుపోతున్నాయి. 60 వేల కుటుంబాలకు ఉపాధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా రూ.3,622.36 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తొలిదశ కింద రూ.1,204.56 కోట్లతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, బాపట్ల జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, కాకినాడ జిల్లా ఉప్పాడ హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. తొలి దశలోని నాలుగు హార్బర్లను వచ్చే మార్చి నాటికి, రెండో దశలోని ఐదింటిని 2024లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొమ్మిదీ అందుబాటులోకి వస్తే 10,000కు పైగా మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మన సంపద మనకే ఇంతకాలం సౌకర్యాలు లేకపోవడంతో పెళ్లాం బిడ్డలను ఇక్కడే వదిలేసి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసపోయే వాళ్లం. తమిళనాడుకు చెందిన కడలూరు, నాగపట్నం, తూతుకూడిల మత్స్యకారులు వచ్చి మన తీరంలో చేపలు పట్టుకుపోతున్నారు. జువ్వల దిన్నె హార్బర్ వస్తే తమిళనాడు మత్స్యకారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. మన తీరంలో మత్స్య సంపదను మనమే పొందొచ్చు. – శీనయ్య, మత్స్యకారుడు, జువ్వలదిన్నె ఇక్కడే ఉపాధి.. చేపల వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేవాడిని. ఇక్కడ ఫిషింగ్ çహార్బర్ వస్తే నాకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లతో పాటు వాటికి అవసరమైన మౌలిక వసతులు కూడా అభివృద్ధి చేస్తుండటం చాలా సంతోషం. – కుందూరు గోవిందయ్య, మత్స్యకారుడు, జువ్వలదిన్నె సెప్టెంబర్ నాటికి జెట్టీ నిర్మాణం పూర్తి రూ.260 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే బ్రేక్‌వాటర్, డ్రెడ్జింగ్, ట్రైపాడ్స్ నిర్మాణం, జెట్టీ పిల్లర్స్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్, శీతల గిడ్డంగి, వేలం కేంద్రం వంటి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. ఈ సెప్టెంబర్ నాటికి జెట్టీని అందుబాటులోకి తెస్తాం. – కృష్ణమూర్తి, పీఎంయూ, ఏపీ అర్బన్ దేశ చరిత్రలో ఇదే ప్రథమం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,623 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ఉపాధి పొందేలా చూడాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. దీనికి అనుగుణంగా హార్బర్ల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నాం. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
దివ్య ఔషధం.. 'కచిడి'.. 25 కిలోల చేప ఖరీదు రూ.4 లక్షలు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కచిడి’.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే.. ఇక మగ చేపలు ఔషధాల తయారీలో, ఖరీదైన వైన్‌ను శుభ్రం చేయ డంతోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కచిడి చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. గోదావరి జిల్లాల్లో కనిపించే ఈ చేప మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. అదృష్టవంతులకే ‘గోల్డ్ ఫిష్’ తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి, అద్దరిపేట నుంచి సఖినేటిపల్లి, పల్లిపాలెం, పశ్చిమగోదావరి జిల్లాలోని పేరుపాలెం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులలో అదృష్టవంతుల వలకే కచిడి చేప చిక్కుతుందంటుంటారు. ఈ కచిడి చేపను బ్లాక్ స్పాటెడ్ (క్రోకర్) లేదా సీగోల్డ్, గోల్ ఫిష్‌గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం.. ప్రోటోనిబియా డియాకాన్తస్. ఇండో ఫసిఫిక్, బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే కచిడీ జీవిస్తోంది. ఈ రకం చేపలకు ప్రకృతి ప్రసాదించిన వాయుకోççశం (ఎయిర్ బ్లాడర్) ఉండటంతో సముద్రాలను ఈదడంలో ఇవి మహా నేర్పరులు. కచిడీ కోసం ఎగుమతిదారుల క్యూ.. ఈ చేపలను కాకినాడ, ఓడలరేవు, ఉప్పాడ, పల్లిపాలెం తదితర ప్రాంతాల్లో స్థానిక మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ఈ చేపలకున్న డిమాండ్ దృష్ట్యా వీటి కొనుగోలుకు అటు ఉత్తరాంధ్ర.. ఇటు నెల్లూరు జిల్లా నుంచి ఎగుమతిదారులు స్థానిక మార్కెట్ల్లకు క్యూ కడుతున్నారు. ఈ చేప 40 కిలోల వరకు బరువు ఉంటోంది. 10 కిలోలు దాటితే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది. బాగా తక్కువలో తక్కువగా అంటే రూ.50 వేలు ఉంటుంది. 25 కిలోల మగ చేప రూ.4 లక్షలకు అమ్ముడుపోయిందంటే వీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. శస్త్రచికిత్సల్లోనూ.. కచిడీ చేపలో కొలాజిన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి రుచి, వాసన ఉండదు కానీ ఘనపదార్థాలను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుంది. దీనిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే శ్రేష్టమైన జెలాటిన్‌ను ఆహార ఉత్పత్తులు, మందుల తయారీ, కాస్మెటిక్స్, విలువైన పదార్థాల ప్యాకింగ్‌లో వినియోగిస్తున్నారు. అలాగే కాప్యూల్స్ (మందు గొట్టాలు) పైన ఉపయోగించే ప్లాస్టిక్‌లాంటి పదార్థంలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. విదేశాల్లో పొట్ట భాగంలో శస్త్రచికిత్స అనంతరం కుట్లు వేసేందుకు వినియోగించే దారం తయారీ, ఖరీదైన వైన్‌ను శుభ్రం చేసేందుకు కూడా వినియోగిస్తున్నారు. మగచేప కండ, శరీర భాగాలు, పొట్ట భాగం, పొలుసుకు కూడా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. చెన్నై, కోల్‌కతాల నుంచి విదేశాలకు ఎగుమతి కచిడీ చేపలను మన రాష్ట్రం నుంచి చెన్నై, కోల్‌కతా రేవులకు తరలించి.. అక్కడ ప్రాసెసింగ్ చేసి యూరప్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, జపాన్, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఈ చేపల విక్రయాలకు ముందే (ఆడ, మగ) గ్రేడింగ్ చేస్తారు. మగ చేప పొట్ట భాగాలను ఎగుమతికి అనుగుణంగా ప్యాకింగ్ చేస్తారు. మగ చేప చిన్న రెక్కలతో గరుకుగా, బంగారు రంగులో ఉండటంతో వాటిని విదేశాలకు పంపుతారు. పొట్ట భాగం ఆడ చేప కంటే మగ చేపకు గట్టిగా ఉంటుంది. ఈ లక్షణాలున్న చేపలను ఎగుమతి కోసం వేరు చేస్తారు. ఔషధ గుణాలతోనే డిమాండ్ కచిడీ చేపకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో యూరప్ తదితర దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ చేప సముద్రపు లోతుల్లో ఎక్కువగా ఉంటుంది. కచిడీలో సహజంగా ఉండే కొలాజిన్తోపాటు పొట్ట, వాయుకోశాలను పలు ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. మగ చేపల్లో వాయుకోశం పెద్దవిగా ఉండటంతో కచిడీ చేపలకు డిమాండ్ ఎక్కువ. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కోనసీమ పులసలను మించి.. గోదావరి జిల్లాల్లో వరదలప్పుడు సీజనల్‌గా వచ్చే పులస చేపలను ఈ కచిడి చేప అధిగమిం చేస్తోంది. అద్భుతమైన రుచిని ఇచ్చే కచిడి చేపను ధనవంతులు కూడా కొనలేరంటే అతిశయోక్తి కాదు. ఇక మగ చేప ఖరీదు వింటే గుండె గుభేల్మనడం ఖాయం. మగ చేపలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అటువంటివి మరి. అందుకే విదేశాల్లో ఈ చేపకు విపరీతమైన డిమాండ్. ఎన్ని లక్షలైనా లెక్క చేయకుండా మగ చేపను కొనుక్కుపోతున్నారు. మగ, ఆడ చేపల మధ్య ధరల్లో, డిమాండ్‌లో చాలా వ్యత్యాసం ఉంది. సముద్రపు లోతులే కచిడి చేపల ఆవాసం. -
మత్స్యకారులకు రెట్టింపు ఆదాయం
సాక్షి, అమరావతి: మత్స్యకారులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఫలిస్తున్నాయి. మత్స్యకారులే కాదు.. వివిధ సామాజికవర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో రెట్టింపు ఆదాయం ఆర్జనే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు కేంద్ర సముద్ర మత్స్య ఉత్పత్తుల పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతికతను అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నారు. అతిపెద్ద సముద్ర తీరాన్ని కలిగిన రాష్ట్రంలో సముద్ర సాగును విస్తరించేందుకు అపార అవకాశాలున్నాయని సీఎంఎఫ్ఆర్ఐ గుర్తించింది. ఆ దిశగా కల్చర్ చేయతగ్గ జాతుల సంఖ్య, విత్తనోత్పత్తి పెంపొందించడంతో పాటు ఆదాయం పెరిగేలా సాంకేతికతను జోడిస్తోంది. మెరైన్, మారీ కల్చర్‌లో పరిశోధన, శిక్షణపై ప్రత్యేకదృష్టి సారించింది. సంప్రదాయ వ్యవసాయ పంటలకు ప్రత్యామ్నాయంగా కేజ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తోంది. అందుబాటులో ఉన్న ఉప్పునీటి ప్రాంతాల్లో కేజ్ కల్చర్ ద్వారా ఎక్కువ దిగుబడులను సాధించేలా సాంకేతికను అభివృద్ధి చేసింది. కేజ్ కల్చర్ ద్వారా ఇండియన్ పాంపినో, ఆసియన్ సీ బాస్, ఆరంజ్ స్పాటెడ్ గ్రూపర్ వంటి సముద్ర మత్స్య ఉత్పత్తులను ఎస్సీ, గిరిజన సబ్ ప్లాన్ కార్యక్రమాల ద్వారా మత్స్యకారులతో పాటు భూమిలేని ఆక్వా రైతులకు పరిచయం చేసింది. తక్కువ విస్తీర్ణం, తక్కువ పెట్టుబడితో రైతులకు రెట్టింపు ఆదాయం (డీఎఫ్ఐ)పై ప్రత్యేక ప్రొటోకాల్ రూపొందించి శిక్షణ ఇస్తోంది. సముద్రపు ఫిష్‌ల కేజ్ కల్చర్‌పై సాంకేతిక పరిజ్ఞానం, కేజ్ ఫాబ్రికేషన్, ఇన్స్టలేషన్ సహా కేజ్ కల్చర్, దాణా, వ్యాధులు, తెగుళ్లు, ఆర్థిక వనరుల నిర్వహణపై ఇస్తున్న శిక్షణ సత్ఫలితాలనిస్తోంది. సీఎంఎఫ్ఆర్ఐ సాంకేతికతతో సముద్ర జలాల్లో చేపల పెంపకం ద్వారా ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో వేలాది కుటుంబాల జీవనప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో గుర్తించారు. గతంతో పోలిస్తే భారీగా పెరిగిన ఆదాయంతో వారిలో పొదుపు, కొనుగోలు శక్తిసామర్థ్యాలు పెరిగినట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఇప్పుడు సీఎంఎఫ్ఆర్ఐ అభివృద్ధి చేసిన సాంకేతికతతో తమ రాష్ట్రాల్లో మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సంకల్పంతో తీరప్రాంత రాష్ట్రాలు సీఎంఎఫ్ఆర్ఐతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నాయి. అప్పులన్నీ తీర్చేశాం మాది ఉమ్మడి కుటుంబం. యానాది (ఎస్టీ) తెగకు చెందిన వాళ్లం. చేపలు పట్టడం తప్ప మాకు ఏమీ చేతకాదు. ఇంటిల్లపాది ఇదేపని చేస్తాం. తీర ప్రాంతంలో ఉప్పునీటి కయ్యల్లో చేపలు పట్టుకుని జీవిస్తుండేవాళ్లం. ఎంత కష్టపడినా నెలకు రూ.ఏడెనిమిది వేలకు మించి వచ్చేది కాదు. ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు సీఎంఎఫ్ఆర్ఐ వారిచ్చిన శిక్షణ వల్ల నేడు రెండు బోనుల్లో పండుగప్ప (సీ బాస్) సాగుచేస్తున్నాం. 10 క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చింది. కిలో రూ.300 చొప్పున అమ్మగా రూ.మూడు లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.రెండు లక్షలు మిగిలాయి. మా ఆదాయం ఏకంగా మూడింతలు పెరిగింది. అప్పులన్నీ తీర్చేశాం. చాలా ఆనందంగా ఉంది. – గంధం నాగరాజు, కాంతమ్మ, పెద్దింటమ్మ, లక్ష్మీపురం, కృష్ణాజిల్లా రూ.3 లక్షలు మిగులుతున్నాయి నేనో రియల్ ఎస్టేట్ వ్యాపారిని. బాగుంటే నాలుగు డబ్బులొచ్చేవి. లేకుంటే నెలల తరబడి ఖాళీగా ఉండాల్సి వచ్చేది. చేపల సాగుపై నాకు ఎలాంటి అవగాహన లేదు. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం, సీఎంఎఫ్ఆర్ఐ అందించిన సాంకేతిక సహకారంతో సముద్రపు చేపల చెరువుల పెంపకంపై దృష్టిసారించా. కేజ్ కల్చర్‌లో ఇండియన్ పాంపినో సాగుచేస్తున్నా. ఏటా రూ.తొమ్మిది లక్షలు ఆర్జిస్తున్నా. ఖర్చులు పోను రూ.మూడు లక్షలు నికరంగా మిగులుతున్నాయి. – ఎస్.టి.కృష్ణప్రసాద్, కొమరిగిరిపట్నం, తూర్పుగోదావరి రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నారు సీఎంఎఫ్ఆర్ఐ అభివృద్ధి చేసిన సాంకేతికతను ప్రభుత్వ సహకారంతో క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు తీసుకెళ్తున్నాం. ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని తీరగ్రామాల్లో వందలాది మంది మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాం. సీఎంఎఫ్ఆర్ఐ సాంకేతికతతో సాగుచేస్తున్న రైతులు రెట్టింపు ఆదాయం ఆర్జిస్తున్నట్టుగా మా అధ్యయనంలో గుర్తించాం. – డాక్టర్ సుభదీప్ ఘోష్, హెడ్, సీఎంఎఫ్ఆర్ఐ -
ఇక చేపలతో పాటు రొయ్యలు!
సాక్షి, అమరావతి: సహజ మత్స్య సంపదను వృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంచినీటి వనరుల్లో పెద్ద ఎత్తున చేప పిల్లలను వదలగా.. ఈ ఏడాది తొలిసారి రొయ్య పిల్లలనూ వదిలింది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండగా, 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. రాష్ట్రంలో పెద్ద రిజర్వాయర్ల విస్తీర్ణం 3.10 లక్షల ఎకరాలు కాగా, చిన్న, మధ్య తరహా రిజర్వాయర్ల విస్తీర్ణం మరో 4.02 లక్షల ఎకరాలుగా ఉంది. మత్స్య సాగుకు అనువైన మైదాన ప్రాంతంలో 11 శాతంలో ఆక్వా కల్చర్ ఉండగా, మరో 11 శాతం విస్తీర్ణంలో పంచాయతీ, మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి. ఇక రిజర్వాయర్ ప్రాంతం 9% ఉండగా, నదులు, కాలువలు 63 శాతం మేర విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం 1.86 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద రిజర్వాయర్లు, 402 ఎకరాల్లో చిన్న, మధ్య తరహా రిజర్వాయర్లలో మాత్రమే చేపల పెంపకం సాగుతోంది. వీటిలో మత్స్య దిగుబడులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో పట్టుబడి ద్వారా 2018–19లో 13.42 లక్షల టన్నుల దిగుబడి రాగా, 2019–20లో 15.91 లక్షల టన్నులు, 2020–21లో 18.46 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. గతేడాది పశ్చిమ గోదావరి జిల్లాలో 5,88 లక్షల టన్నులు, నెల్లూరులో 3.06 లక్షల టన్నులు, తూర్పుగోదావరి జిల్లాలో 1.96 లక్షల టన్నులు, విశాఖలో 1.77 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు పట్టుబడి చేయగలిగారు. ఇలా సహజ సిద్ధంగా పెరిగే మత్స్య ఉత్పత్తుల దిగుబడులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన రిజర్వాయర్లలోకి 6.66 లక్షల రొయ్య పిల్లలు ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 రిజర్వాయర్లలో 2.08 కోట్ల చేప పిల్లల(బొచ్చెలు, ఎర్రమోసు, శీలావతి)ను వదిలారు. అత్యధికంగా వెలుగొండ రిజర్వాయర్‌లో 29 లక్షలు, గోదావరి బ్యారేజ్‌లో 15.25 లక్షలు, ఏలేరు రిజర్వాయర్‌లో 14.39 లక్షలు, ఆరానియార్ రిజర్వాయర్‌లో 12 లక్షలు, వెలిగాలు, పేరూరు రిజర్వాయర్లలో 11.45 లక్షలు, నాగార్జున సాగర్, ప్రకాశం రిజర్వాయర్లలో 10 లక్షల చొప్పున చేప పిల్లలను వదిలారు. ఇక తొలిసారి 5.66 లక్షల వెనామియా జాతికి చెందిన రొయ్య పిల్లలను ప్రధాన రిజర్వాయర్లలో వదిలారు. శ్రీకాకుళం జిల్లాలో 51,450, విజయనగరం జిల్లాలో 1,80,180, విశాఖలో 1,20,120, తూర్పుగోదావరిలో 83,400, ప్రకాశం జిల్లాలో 1.31 లక్షల చొప్పున రొయ్య పిల్లలను వదిలారు. వీటి కోసం ఇప్పటి వరకూ కోటిన్నర వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. -
గిరి సీమల్లో సిరుల సేద్యం
కొండవాలు ప్రాంతాల్లో సంప్రదాయ పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న అడవి బిడ్డలు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తూ తమ సుస్థిరాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ పరిశోధనా ఫలితాలను పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వం తరఫున వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటునిస్తోంది. దీంతో వారు సాగులో మెళకువలు, సాంకేతిక శిక్షణ పొందుతూ సంతృప్తికర స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటూ పిల్లలనూ బాగా చదివించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సాగులో సాధిస్తున్న విజయాలపై ప్రత్యేక కథనం.. సాక్షి, అమరావతి: సమగ్ర వ్యవసాయ విధానంలో వరి ఆధారిత పంట–పాడి–మత్స్య సాగు చేసేందుకు కృషి విజ్ఞాన కేంద్రం అడవి బిడ్డలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా జీడి మామిడి అంటు కట్టు విధానం, అపరాలు, చేపల సాగు, రబ్బర్, చిరు ధాన్యాలు, జీడి మామిడి ప్రాసెసింగ్, మేకలు, గొర్రెలు, పెరటి కోళ్లు, తేనెటీగలు, పుట్ట గొడుగులు, నర్సరీ పెంపకంతో పాటు పనసతో సహా వివిధ రకాల పంటల విలువాధారిత ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్ తయారీపై గడిచిన మూడేళ్లుగా గిరిజనులకిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నాయి. ఎంతలాగంటే.. మత్స్య సంపద ద్వారా 57 శాతం, వరి సాగు ద్వారా 24 శాతం, ఉద్యాన పంటల ద్వారా 5.13 శాతం, మేకల పెంపకం ద్వారా 4.8 శాతం ఆదాయాన్ని వీరు ఆర్జిస్తున్నారు. రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న శిక్షణతో ఏజెన్సీలో చిరుధాన్యాల సాగు రెండేళ్లలో గణనీయంగా పెరిగింది. వీటిని ప్రాసెస్ చేసి అమ్మడం ద్వారా గిరిజనులు ఏటా రూ.27వేల ఆదాయాన్ని అదనంగా ఆర్జించగలుగుతున్నారు. అలాగే.. ► రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు కేవీకే ద్వారా సాగులో మెళకువలపై అధికారులు రెండేళ్లుగా శిక్షణనిస్తూనే రబ్బర్ టాపింగ్, ప్రాసెసింగ్ పరికరాలు సమకూర్చుతున్నారు. దీంతో నేడు ఎగుమతి చేయదగ్గ నాణ్యమైన రబ్బర్ షీట్లను ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఆరునెలల పాటు సేకరించే రబ్బర్ పాల ద్వారా ఒక్కో రైతు రూ.2.5 లక్షలు ఆర్జిస్తున్నారు. తేనెటీగల పెంపకం యూనిట్లో ఉత్పత్తిని పరిశీలిస్తున్న గిరిజన రైతులు ► అటవీ ప్రాంతంలో విరివిగా లభించే అడ్డాకుల ద్వారా గిరి మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలన్న సంకల్పంతో మారేడుమిల్లి మండలం బోధగండి పంచాయతీ మంగంపాడు గ్రామంలో విస్తరాకుల పరిశ్రమను ఏర్పాటుచేశారు. ఫలితంగా నేడు ఒక్కో మహిళ రూ.3వేల పెట్టుబడితో నెలకు రూ.18వేలు ఆర్జిస్తోంది. ► పెరటి కోళ్ల పెంపకం ద్వారా మరింత ఆదాయం ఆర్జించేందుకు వీలుగా హైదరాబాద్‌లోని జాతికోళ్ల పరిశోధనా కేంద్రం నుంచి శ్రీనిధి, వనశ్రీ, వనరాజా, గాగస్, అశీల్, కడక్‌నాథ్ వంటి మేలు జాతి కోడి పిల్లలను అధికారులు తెప్పించి పంపిణీ చేస్తున్నారు. వీటి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ఇలా ప్రతిఏటా 2వేల కోళ్లను 200 గిరిజన మహిళలకు అందజేస్తుండడంతో ఇళ్ల వద్దే ఉంటూ గిరిజన మహిళలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► మేకలు, గొర్రెల పెంపకాన్ని లాభసాటిగా మార్చేందుకు హింగోలిలో కేవీకే అభివృద్ధి చేసిన అధిక వ్యాధి నిరోధకశక్తి కలిగిన ఉస్మానాబాది రకం మేకలను ఒక్కొకరికి మూడు చొప్పున ఇస్తున్నారు. 10–12 నెలల వయస్సు వరకు పెంచిన తర్వాత ఒక్కోదాన్ని రూ.8వేల నుంచి రూ.10వేల విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ► ఇక పనస విలువాధారిత ఉత్పత్తుల తయారిపైనా శిక్షణనివ్వడంతో గిరిజనులు ప్రతినెలా రూ.12వేల అదనపు ఆదాయం పొందుతున్నారు. ► తేనెటీగల పెంపకంపైనా శిక్షణనివ్వడంతో సొంత పొలాలతో పాటు అటవీ ప్రాంతంలో కూడా విలువాధారిత తేనె ఉత్పత్తును తయారుచేస్తున్నారు. తద్వారా ఏటా రూ.40 వేల అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ► అంతేకాదు.. పుట్ట గొడుగుల పెంపకం యూనిట్లను ఏర్పాటుచేసి పాల పుట్ట గొడుగులు, గులాబీ, తెలుపు ముత్యపు చిప్ప పుట్ట గొడుగుల పెంపకంపై తర్ఫీదు ఇస్తున్నారు. గిరిజన రైతులకు మేకల యూనిట్‌ను అందజేస్తున్న అధికారులు పెట్టుబడి పోనూ 50వేలు మిగులుతోంది నేను పదో తరగతి చదువుకున్నా. నాకున్న రెండున్నర ఎకరాల్లో వర్షాధారంపై ఆధారపడి కొర్రలు, రాగులు పండించి సంతలకుపోయి అమ్ముకుంటే పెట్టుబడి పోను రూ.17,500 మిగిలేది. ప్రభుత్వం మినీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అందించింది. ప్రాసెసింగ్ చేసి ఎలా అమ్మాలో స్థానిక కేవీకే ద్వారా శిక్షణ పొందాను. ఇప్పుడు అదనంగా మరో రూ.32,300 ఆదాయం వస్తోంది. మొత్తం మీద రూ.49,800 మిగులుతోంది. – పల్లలబొజ్జ్డి నారాయణరెడ్డి, బొద్దగుంట, వై.రామవరం మండలం మేకల పెంపకంతో అదనపు ఆదాయం గతంలో నాలుగు ఎకరాల్లో వరి, మినుము, కందులు సాగుచేసేవాడిని. పంట పండితే నాలుగు డబ్బులు లేకుంటే పస్తులుండాల్సి వచ్చేది. స్థానిక కేవీకే ద్వారా ఉస్మానాబాదీ రకానికి చెందిన రెండు మేకలు, ఓ మేకపోతు తీసుకున్నా. ఈతకు రెండు పిల్లల చొప్పున ఏడాదికి నాలుగు పిల్లలు వస్తున్నాయి. మరోవైపు.. వ్యవసాయం ద్వారా ఏటా రూ.55వేల ఆదాయం.. ఏటా 3–4 మేకలను అమ్ముకోవడం ద్వారా అదనంగా మరో రూ.24వేలు వస్తోంది. – కంగల రామస్వామి దొర, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం నెలకు రూ.11,500 ఆదాయం రెండేళ్ల క్రితం మాకు శ్రీనిధి, వనశ్రీ, గఘస్ కోళ్లను అందించారు. పొలం పనులు చేసుకుంటూ వాటిని పెంచుకుంటున్నా. ఏడాది వయస్సున్న కోడిని రూ.500 నుంచి రూ.600లకు అమ్ముతున్నా. గుడ్లు, కోళ్ల అమ్మకాల ద్వారా నెలకు రూ.11,500 నికర ఆదాయం వస్తోంది. – కాలుం రామతులసి, ఐ.పోలవరం, రంపచోడవరం మండలం సొంతంగా మార్కెటింగ్ మూడేళ్ల క్రితం తేనెటీగల పెంపకాన్ని చేపట్టా. శిక్షణ, సాంకేతిక సలహాలతో సొంత పొలంతో పాటు అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకం యూనిట్లు పెట్టా. 3 నెలలకోసారి 60 కేజీల తేనె, 20 కేజీల మైనం తీస్తున్నా. వాటి ద్వారా నెలకు రూ.16వేల చొప్పున ఆర్జిస్తున్నా. గతేడాది నుంచి తేనె విలువా«ధారిత ఉత్పత్తులైన మురబ్బ, అల్లం తేనె, విప్పపువ్వు తేనేలతో పాటు మైనంతో తయారుచేసిన క్రాక్‌క్రీమ్, లిప్‌బామ్ వంటి ఉత్పత్తులను తయారుచేసి ‘గిరిమధుర నేచురల్ ప్రొడక్టŠస్’ పేరిట మార్కెటింగ్ చేస్తున్నా. – జగతా భావన కృష్ణ, రంపచోడవరం సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం ప్రభుత్వాదేశాల మేరకు గిరిజనుల్లో ఆదాయ వనురులను పెంపొందించడమే లక్ష్యంగా ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున విస్తరణ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో మాదిరిగానే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు శిక్షణతో పాటు ఆర్థిక తోడ్పాటునూ అందిస్తున్నాం. – డాక్టర్ టి. జానకీరామ్, వైస్ చాన్సలర్, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం ఇంటి వద్దే జాతి కోళ్లు పెంచుకుంటున్న గిరిజనులు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం మర్రివాడ గ్రామానికి చెందిన ఎం. సావిత్రి కుటుంబ సభ్యులు 13మంది సంఘంగా ఏర్పడి వరి, జీడి మామిడి పంటలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక సామాజిక చెరువులో బొచ్చు, గడ్డిమోసు, శీలావతి వంటి చేçపలను సాగుచేస్తున్నారు. ఇలా ఏటా ఆహార ధాన్యాల ద్వారా రూ.34వేలు, కూరగాయల సాగు ద్వారా రూ.24 వేలు, మత్స్యసాగు ద్వారా రూ.73వేలు ఆర్జిస్తున్నారు. కడక్‌నాథ్, గాఘస్ కోళ్ల పెంపకం ద్వారా మరో రూ.16,800 ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి మండలం పందిరిమామిడి గ్రామానికి చెందిన కత్తుల సోమిరెడ్డి. గతంలో వీళ్లు 70మంది కలిసి కూరగాయలు పండిస్తే ఒక్కొక్కరికి రూ.7వేలకు మించి వచ్చేది కాదు. కానీ, ఇప్పుడు వీరంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రబ్బరు సాగు, ప్రాసెసింగ్‌లో శిక్షణ పొంది ప్రాసెసింగ్ యూనిట్ తీసుకున్నారు. ఇప్పుడు నాణ్యమైన రబ్బరును ఉత్పత్తి చేస్తూ ఓ సంఘంగా ఏర్పడ్డారు. కేరళ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా.. గడిచిన ఆర్నెల్లలో 1,200 కేజీల రబ్బరును ప్రాసెస్ చేసి ఎగుమతి చేయడంద్వారా ఒక్కొక్కరం రూ.2.5 లక్షలు ఆర్జించామని.. ఖర్చులు పోనూ ఒక్కో రైతుకు రూ.1.50 లక్షలు మిగులుతోందని సోమిరెడ్డి చెబుతున్నాడు. -
సాగునీటి వనరుల్లో మత్స్య సిరులు
సాక్షి, అమరావతి: సాగునీటి వనరుల్లో సహజ మత్స్య సంపద క్రమేపీ పెరుగుతోంది. ఏడేళ్లలో సహజ మత్స్య దిగుబడులు రెండున్నర రెట్లు పెరిగాయి. 2014–15లో సహజ మత్స్య దిగుబడి 12 లక్షల టన్నులు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2020–21 నాటికి 29.75 లక్షల టన్నులకు పెరిగింది. దీనిని మరింతగా పెంపొందించేందుకు మత్స్యకార సొసైటీలను బలోపేతం చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అపారమైన వనరులు రాష్ట్రంలో ఉన్న మంచినీటి వనరుల్లో చేపల, రొయ్యల పెంపకం (ఆక్వా కల్చర్) 11 శాతం కాగా.. పంచాయతీ, మైనర్ ఇరిగేషన్ చెరువులు 11 శాతం, రిజర్వాయర్లు 9 శాతం, నదులు, కాలువలు 63 శాతం మేర విస్తరించి ఉన్నాయి. పంచాయతీ చెరువులు మినహాయిస్తే 1,24,151 హెక్టార్లలో రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం 74,491 హెక్టార్లు (60%) విస్తీర్ణంలో మాత్రమే సహజ మత్స్య సిరులు లభ్యమవుతున్నాయి. హెక్టారుకు 100 కేజీల చొప్పున ఏటా 7,449 టన్నుల సహజ మత్స్య సిరులను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కేవలం 2,555 టన్నులు మాత్రమే దిగుబడులు వస్తున్నాయి. ఇక మధ్యస్థ, పెద్ద రిజర్వాయర్ల ప్రాంతం 1,60,907 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 161 హెక్టార్లలో మాత్రమే సహజ మత్స్య ఉత్పత్తి లభిస్తోంది. అందుబాటులో ఉన్న రిజర్వాయర్ విస్తీర్ణాన్ని బట్టి ఏటా మరో 1,93,088 టన్నుల ఉత్పత్తిని ఒడిసిపట్టే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. 1,771 సొసైటీలు.. 1.72 లక్షల మంది మత్స్యకారులు గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పంచాయతీ చెరువులు, సాగునీటి చెరువులు, రిజర్వాయర్లలో మేత, మందులు వేయకుండా సహజ మత్స్య పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలుగా ఏర్పడిన స్థానిక యువతకు లీజు పద్ధతిన పంచాయతీల ద్వారా చెరువులను కేటాయిస్తారు. వీటిలో చేప పిల్లలను సహజసిద్ధంగా పెంచుకొని జీవనోపాధి పొందేలా అవకాశం కల్పిస్తారు. కాగా, జల వనరుల శాఖ అధీనంలో ఉన్న సాగు నీటి చెరువులను మత్స్య శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహించి ఎంపిక చేసిన వారికి లీజు పద్ధతిలో కేటాయిస్తుంటారు. ఈ విధంగా రాష్ట్రంలో 1,771 మత్స్యకార సహకార సంఘాల్లో 1,72,141 మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారు. వీరిలో 601 మహిళా మత్స్యకార సహకార సంఘాలు కూడా ఉన్నాయి. వాటి పరిధిలో 32,826 మంది సభ్యులున్నారు. ఆక్వా హబ్‌లతో సొసైటీలు బలోపేతం మత్స్యకార సొసైటీలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ గ్రామంలో ఎన్ని సొసైటీలున్నాయి, వాటి పరిధిలో ఎంతమంది మత్స్యకారులు, నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారో గుర్తిస్తున్నారు. ఆ వివరాలను మత్స్య శాఖ వెబ్సైట్లో పొందుపరుస్తోంది. సొసైటీలకు అవసరమైన ఆర్థిక చేయూత ఇవ్వడంతో పాటు సాగులో మెళకువలపై మత్స్య సాగు బడిలో శిక్షణ ఇస్తోంది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సొసైటీల్లో ఉండే మత్స్యకారులకు అవసరమైన వలలు, ఇతర పరికరాలను అందిస్తోంది. సహజ మత్స్య సంపదను ఆక్వాహబ్‌ల ద్వారా రిటైల్ అవుట్‌లెట్స్, కియోస్క్‌లకు సరఫరా చేసేందుకు మ్యాపింగ్ చేస్తోంది. గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సొసైటీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. వీరిలో ఆసక్తి చూపే వారికి మినీ ఫిష్ అవుట్ లెట్స్, కియోస్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక చేయూత ఇస్తోంది. -
చుక్క గొరక.. సాగు ఎంచక్కా!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం పెద్దలంకలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఎఫ్ఆర్ఐ) సహకారంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘చుక్క గొరక’(పెరల్ స్పాట్) చేపల సాగు విజయవంతమైంది. రాష్ట్రంలో మొట్టమొదటి హేచరీని మత్స్యశాఖ నాగాయలంకలో ఏర్పాటు చేసింది. చేపల సాగును ఇతర ప్రాంతాలకు విస్తరించేలా సీఎంఎఫ్ఆర్ఐ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఆక్వాలో అధిక దిగుబడులు, దేశీయ వినియోగంతో పాటు, విదేశీ ఎగుమతులకు అనువైన చేపల సాగుకు పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం అందిస్తోంది. దీనిలో భాగంగా కేరళలో పేరుగాంచిన కరమీన్ చేపల సాగు(స్థానికంగా చుక్క గొరక అంటారు) ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టి.. సాగుదారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇలా సాగు చేశారు.. నాగాయలంక మండలం పెద్దపాలెం యానాది తెగల గ్రూపునకు చెందిన చెరువులో పెరల్ స్పాట్ చేపల పెంపకాన్ని చేపట్టారు. 20 గ్రాముల పరిమాణం గల ఐదు వేల చేప పిల్లలను ఓ ఎకరం చెరువులో పెంచారు. తక్కువ ఖరీదైన చేపల మేత, బియ్యం ఊక కలిపి వాటికి మేతగా వాడారు. ఈ చేపలు పది నెలల తర్వాత సరాసరి 120 గ్రాముల పరిమాణానికి చేరుకున్నాయి. మొత్తంగా 83 శాతం చేప పిల్లలు బతగ్గా.. 510 కిలోల చేపల దిగుబడి వచ్చింది. కిలో రూ.225 చొప్పున అమ్మగా రూ.1.1 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ఇందులో చేప పిల్లలకు, మేత ఇతర నిర్వహణ ఖర్చులకు దాదాపు రూ.55 వేలు పోగా, నికరంగా రూ.60 వేల వరకు లాభం వచ్చింది. తక్కువ వాడకంలో ఉన్న భూముల్లో అతి తక్కువ ఖర్చుతో చుక్క గొరక చేపల పెంపకాన్ని చేపట్టవచ్చని, అలాగే గణనీయమైన ఆదాయాన్ని పొందొచ్చని సాగుదారులు నిరూపించారు. వెనుకబడిన వర్గాల ఆర్థిక అభివృద్ధికి, ప్రత్యామ్నాయ జీవనోపాధికి ఈ చుక్క గొరక చేపల సాగు తోడ్పడుతుందని వారు నిరూపించారు. యానాది తెగల సమూహానికి సీఎంఎఫ్ఆర్ఐ శిక్షణ ఇచ్చి చుక్క గొరక చేపల సాగును విజయవంతం చేసింది. ఈ చేపకు కేరళ రాష్ట్రంలో చాలా గిరాకీ ఉంది. 150 గ్రా పరిమాణం గలవి కిలో రూ.320 దాకా పలుకుతున్నాయి. మంచి నీరు, ఉప్పు నీటిలో జీవించే ఈ రకం చేప ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది.« వీటి పిల్లలు కాలువల్లో దొరుకుతాయి. వాటినే చేపల పెంపకానికి ఉపయోగిస్తారు. తక్కువ అలలు, ఎక్కువ నీటి పరిమాణం గల ఉప్పునీటిలో ఈ చేపల పెంపకానికి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు అనుకూలం. లాభదాయకం.. గతంలో మేము చేపలు, పీతల వేటకు వెళ్లే వాళ్లం. రోజూ కేవలం రూ.100–150 మాత్రమే వచ్చేవి. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. సీఎంఎఫ్ఆర్ఐ వారు స్పెరల్ స్పాట్ సీడ్ ఇచ్చారు. వాటిని సాగు చేసి మంచి లాభాలు సాధించాం. మా లాంటి వారికి శిక్షణ ఇచ్చి, చేప పిల్లలను ఇస్తే.. వాటిని పెంచుకుని జీవనోపాధి పొందుతాం. – భవనారి లక్ష్మీపవన్‌కుమార్, వి.కొత్తపాలెం, కోడూరు మండలం, కృష్ణా జిల్లా -
విరివిగా మత్స్యసంపద
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో 974 కి.మీ. తీర ప్రాంతం విస్తరించి ఉండటంతో మత్స్య సంపద విరివిగా ఉత్పత్తి అవుతోంది. వెనామీ రొయ్యలు, పండుగప్ప వంటి ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మత్స్య పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు. మత్స్య పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనివ్వడంతో పాటు దానికి మరింత భద్రత కల్పించేలా ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ(ఏపీఎస్ఏడీఏ) చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఆక్వా పరిశ్రమకు గుర్తింపునిచ్చి రైతులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ఈ చట్టం చేసింది. దీని ప్రకారం ఆక్వా సాగు కోసం చెరువులు, ఉత్పత్తికి, విక్రయానికి, ఐస్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు తప్పనిసరిగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మత్స్యశాఖా ధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. లైసెన్స్‌లు పొందితే.. బినామీలు, నకిలీల బెడద తప్పుతుంది. నాణ్యమైన ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే.. ఇప్పటి వరకు 90 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు చేసి లైసెన్స్‌లు జారీచేశారు. మరింత పెంచేలా.. గతం కంటే బాగా మత్స్యసాగు పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే దీనికి కారణం. వేట నిషేధ భృతి, సబ్సిడీ డీజిల్ తీర ప్రాంత మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మత్స్య సంపదను మరింత పెంచేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. – లాల్ మహమ్మద్, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. పెద్ద బోట్లు(మెకనైజ్డ్)కు నెలకు 3,000, చిన్న బోట్లు(మోటరైజ్డ్)కు నెలకు 300 లీటర్ల డీజిల్‌ను సబ్సిడీపై అందిస్తున్నారు. టీడీపీ హయాంలో లీటర్‌కు రూ.6.03 పైసలే సబ్సిడీ ఇచ్చేవారు. ఆ డబ్బులూ సకాలంలో వచ్చేవి కావు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లీటరుకు రూ.9 సబ్సిడీ ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారుగా రూ.7.12 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం బోటు యజమానులకు అందిస్తోంది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇస్తోంది. ఏటా వేసవిలో 60 రోజుల పాటు సముద్రంపై వేట నిషేధాన్ని అమలు చేస్తారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే జీవన భృతిగా ఇచ్చారు. ఆ పంపిణీ విధానం కూడా సరిగా లేకపోవడంతో వాటిని దాదాపుగా దళారులే మింగేసేవారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జీవన భృతిని రూ.10 వేలకు పెంచి.. మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తోంది. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం సాయం చేయడం వల్ల రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తి పెరిగింది. 2014–15 నాటికి రాష్ట్రంలో 103 లక్షల మెట్రిక్ టన్నులుంటే.. 2020–21 నాటికి 150 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మత్స్య సంపదలతో పోలిస్తే.. ప్రస్తుతం 31 శాతం వాటా మన రాష్ట్రానిదే కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని మత్స్యకారులు చెబుతున్నారు. -
మీసం మెలేసేందుకు ‘టైగర్’ రెడీ
సాక్షి, అమరావతి: రెండు దశాబ్దాల క్రితం వరకు అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన ‘ఆంధ్రా టైగర్’ రొయ్యలకు పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాధిరహిత (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని.. వాటిద్వారా సీడ్ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతి లభించింది. వీటినుంచి డిమాండ్‌కు సరిపడా సీడ్ అందుబాటులోకి రానుండడంతో సమ్మర్ క్రాప్ (వేసవి పంట)లో కనీసం 50 వేల ఎకరాల్లో టైగర్ రొయ్యలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో 5 హేచరీలకు అనుమతి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ అభివృద్ధి చేసిన ఎస్పీఎఫ్ బ్రూడర్స్ దిగుమతికి పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం వాటిని కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) ద్వారా నెల్లూరులోని వైష్ణవి ఆక్వాటెక్, తమిళనాడులోని యూని బయో (ఇండియా) హేచరీలకు ఇచ్చేందుకు అనుమతించింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన సీడ్‌తో గతేడాది గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించడంతో వనామీ రొయ్యల సాగుకు టైగర్ ప్రత్యామ్నాయంగా మారింది. డిమాండ్‌కు తగ్గ సీడ్ అందుబాటులో లేకపోవడంతో రెండో పంట సమయంలో నకిలీల బారినపడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైల్డ్ బ్రూడర్స్ (సముద్రంలో సహజసిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తోపాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్ బ్రూడర్ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన సీఏఏ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాల్సి వచ్చింది. నకిలీలకు చెక్ పెట్టడంతోపాటు టైగర్ రొయ్యల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతో మరిన్ని హేచరీలకు అనుమతి ఇవ్వాలని సీఏఏ నిర్ణయించింది. కొత్తగా ఏపీకి చెందిన రెండు హేచరీలు, రెండు లార్వా రేరింగ్ హేచరీలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టైగర్ బ్రూడర్స్ దిగుమతి, సీడ్ ఉత్పత్తి కోసం అనుమతి పొందిన హేచరీల సంఖ్య మూడుకు చేరింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన నౌప్లీ (లార్వా) నుంచి సీడ్ ఉత్పత్తి చేసే రెండు యూనిట్లకు కొత్తగా అనుమతినివ్వడంతో టైగర్ సీడ్ ఉత్పత్తి, సాగులో దేశంలోనే ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతుంది. ప్రస్తుతం అనుమతి పొందిన హేచరీలన్నీ వంద మిలియన్ సీడ్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవే. అయితే, నిబంధనలకు లోబడే ఇవన్నీ సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సీఏఏ అనుమతి లేకుండా ఇతర హేచరీల్లో సీడ్ ఉత్పత్తి చేసినా, అమ్మినా లైసెన్సులు రద్దు చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. బ్రూడర్స్ దిగుమతి.. సీడ్ ఉత్పత్తికి అనుమతి పొందిన హేచరీలివీ.. యూని బయో (ఇండియా) హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ముగైయూర్, తమిళనాడు వైష్ణవి ఆక్వా టెక్, దుగరాజపట్నం, వాకాడు మండలం, నెల్లూరు జిల్లా మున్నంగి హేచరీస్, రామచంద్రరావుపేట పంచాయతీ, నెల్లూరు జిల్లా గాయత్రి బయో మెరైన్ యూనిట్–2, కొత్త ఓడరేవు, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా శ్రీ వైజయంతీ హేచరీస్ ఎల్ఎల్పీ, కారేడు, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా బీకేఎంఎన్ ఆక్వా, రాముడుపాలెం, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా -
శ్రీలంక నేవీ అదుపులో 55 మంది తమిళ జాలర్లు
రామేశ్వరం: తమిళనాడుకు చెందిన 55 మంది జాలర్లతోపాటు 8 మర పడవలను శ్రీలంక నావికాదళం ఆదివారం అదుపులోకి తీసు కుంది. ఈ నెల18న రామేశ్వరం నుంచి కట్చ తీవు దీవికి 500 బోట్లలో వెళ్లిన మత్స్య కారుల్లో 43 మందిని, 6 బోట్లను శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుందని మత్స్యశాఖ తెలిపిం ది. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దౌర్యన్యాలు ఎక్కువయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు. జాలర్లందరినీ వెంటనే విడిపించాలని, ఇప్పటి వరకు శ్రీలంక ఆధీనంలో ఉన్న మొత్తం 73 పడవలను విడుదల చేయించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. తమ వారిని విడు దల చేసే వరకు నిరాహార దీక్ష చేపడతామని మత్స్యకారుల సంఘం హెచ్చరించింది. -
మత్స్యరంగ వృద్ధికి పాలసీ
సాక్షి, హైదరాబాద్: మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్రపాలసీ తయారు చేయాలని అధికారులను మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. రానున్న రోజుల్లో మంచినీటి చేపలను ప్రపంచానికి అందించేస్థాయికి అభివృద్ధి సాధించాలని సూచించారు. శనివారం ఇక్కడి పశు సంవర్థక శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఇరిగేషన్, మత్స్య శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. మత్స్యశాఖ పరిధిలో 15 కోట్ల చేపపిల్లల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 23 కేంద్రాలున్నాయని, మిగిలిన చేపపిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వివరించారు. పలు రిజర్వాయర్ల వద్ద మత్స్యకారులు పట్టి న చేపలను గ్రేడింగ్, ప్యాకింగ్, నిల్వ చేసుకునేం దుకు, వలలు, పడవలు భద్రపర్చుకునేందుకు ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలని ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్‌ను కోరారు. తమ పట్టాభూముల్లో చేపల చెరువులను నిర్మించుకొనేందుకు ముందుకొచ్చే రైతులకు సింగిల్ విండోవిధానంలో తక్షణ మే అనుమతులివ్వాలని సూచించారు. కేజ్ కల్చర్ విధానంలో చేపలను పెంచితే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మత్స్య సంపద లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 5 వేల హెక్టార్లలో 8.3 లక్షల కేజ్‌లను ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపట్టే అవకాశముందని, వీటిద్వారా సుమారు 15 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నామని, వీటివిలువ సుమారు రూ.15 వేల కోట్లు ఉంటుందని అన్నారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, జాయింట్ సెక్రెటరీ భీమప్రసాద్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ అధికారులు పాల్గొన్నారు. -
మూడు ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రతిష్టాత్మక ఆక్వా ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం ఉపయోగించే బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) నాణ్యతను కాపాడేందుకు, వాటినుంచి ఎలాంటి రోగాలు లేని సీడ్‌ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే ఆక్వాటిక్ క్వారంటైన్ కేంద్రాన్ని రూ.36.55 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనుంది. ఇలాంటి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం. మరోవైపు పండుగప్ప పిల్లల ఉత్పత్తికి రూ.23.78 కోట్లతో హేచరీ, పసుపు పీత పిల్లల ఉత్పత్తి కోసం రూ.14.20 కోట్లతో మరో హేచరీ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు 2023 మార్చి నాటికి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేవిధంగా చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ (ఏక్యూఎఫ్‌సీ) ఏర్పాటు కాబోతుంది. ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎపిడ్యూజిస్ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు సంక్రమించని బ్రూడర్స్ నుంచి మాత్రమే సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. వాటికి వ్యాధులు లేవని నిర్ధారించే పరీక్షలు నిర్వహించే కేంద్రమే ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్. ప్రస్తుతం దేశంలో చెన్నైలో మాత్రమే ఈ కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే 560 హేచరీలుండగా.. వాటిలో 389 హేచరీలు ఏపీలోనే ఉన్నాయి. సీడ్ ఉత్పత్తి కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బ్రూడర్స్‌ను క్వారంటైన్ చేసేందుకు హేచరీలన్నీ చెన్నై కేంద్రం వద్ద నెలల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బంగారమ్మ పేట వద్ద 30 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి 1.25 లక్షల బ్రూడర్స్‌ను పరీక్షించే సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ కేంద్రంలో 625 బ్రూడర్స్‌ను క్వారంటైన్ చేయ్యొచ్చు. పరసావారిపాలెం వద్ద రెండు హేచరీలు ఏపీలో ప్రస్తుతం 12వేల హెక్టార్లలో సాగవుతున్న పండుగప్ప (సీబాస్), పసుపు పీత (మడ్ క్రాబ్) సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి సీడ్ కోసం మన రైతులు తమిళనాడుపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిíస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పరసావారిపాలెంలో రూ.14.20 కోట్లతో పసుపు పీతల హేచరీ, రూ.23.78 కోట్లతో పండుగప్ప హేచరీ ఏర్పాటు చేస్తోంది. ఆక్వారంగ విస్తరణకు ఊతం బ్రూడర్స్ సకాలంలో క్వారంటైన్ కాకపోవడంతో సీజన్లో డిమాండ్‌కు తగిన స్థాయిలో రొయ్యల సీడ్‌ను హేచరీలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏర్పాటు చేయబోతున్న ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఆక్వారంగ విస్తరణకు దోహదపడుతుంది. – ఐపీఆర్ మోహన్‌రాజు, అధ్యక్షుడు, జాతీయ రొయ్య రైతుల సమాఖ్య ప్రతిష్టాత్మక ప్రాజెక్టులివి ఆక్వా ఉత్పత్తుల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీలో ఆక్వా రంగ సుస్థిరతకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయి. అక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ చాలా కీలకమైనది. దేశంలో మరెక్కడా ఈ సెంటర్ లేదు. పసుపు పీత, పండుగప్ప హేచరీల ఏర్పాటుతో రాష్ట్రంలో ఆక్వారంగం మరింత విస్తరిస్తుంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
ఆంధ్రా ఆక్వా అంటే.. అమెరికాలో లొట్టలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రా రొయ్యలు, చేపలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎనలేని డిమాండ్ ఉందని మరోసారి రుజువైంది. ఇక్కడి మత్స్య ఉత్పత్తులంటే అమెరికా వాసులు లొట్టలేసుకుని తింటారు. విస్తీర్ణంలోనే కాదు.. దిగుబడుల్లోనూ నంబర్ 1గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో అదే స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఆంధ్రా నుంచి ఆక్వా ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే జరుగుతున్నాయని ఎంపెడా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఆక్వారంగంపై 2020–21 మొదట్లో కరోనా ప్రభావం కాస్త తీవ్రంగానే చూపినప్పటికీ ద్వితీయార్థంలో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. దీంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది దేశం నుంచి రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2019–20తో పోలిస్తే పరిమాణంలో 10.81 శాతం, విలువలో 6.31 శాతం తగ్గుదల నమోదైంది. రూ.15,832 కోట్ల విలువైన 2,93,314 టన్నుల ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులతో ఏపీ దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. గతేడాదితో పోలిస్తే పరిమాణంలో 4.54 శాతం, విలువలో 2.15 శాతం తగ్గుదల నమోదైంది. చదవండి: భలే ఫిష్.. ఆల్ ఫ్రెష్ ఎగుమతుల్లో 36 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే దేశ ఎగుమతుల పరిమాణంలో 36 శాతంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 13 శాతంతో తమిళనాడు, కేరళ, 10 శాతంతో గుజరాత్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల విలువ పరంగా చూసినా 24 శాతంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 18 శాతంతో గుజరాత్, 14 శాతంతో కేరళ, 10 శాతంతో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఎగుమతుల పరిమాణంలోను, విలువలోను ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో కూడా లేవు. ఏపీ ఎగుమతుల్లో మూడొంతులు అమెరికాకే మన దేశం నుంచి జరిగిన ఆక్వా ఎగుమతుల్లో 25 శాతం అమెరికాకు, 19 శాతం చొప్పున చైనా, దక్షిణ తూర్పు ఆసియా దేశాలకు, 13 శాతం యూరోపియన్ దేశాలకు, 8 శాతం జపాన్‌కు, 4 శాతం మిడిల్ ఈస్ట్ దేశాలకు, 12 శాతం ఇతర దేశాలకు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగిన ఎగుమతుల్లో 70.74 శాతం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (యూఎస్ఏకు), 12.74 శాతం చైనాకు, 4.54 శాతం యూరోపియన్ దేశాలకు, 3.51 శాతం మిడిల్ ఈస్ట్ దేశాలకు, 2.92 శాతం సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు వెళ్లాయి. ఇక ఫ్రోజెన్ చేసిన రొయ్యల ఎగుమతుల్లో 97.20 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరగడం గమనార్హం. చదవండి: కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను వనామీలోనే 77 శాతం ఏపీదే రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న మన రాష్ట్రం మరోసారి సత్తా చాటుకుంది. 2020–21లో వనామీ రొయ్యల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 1,08,526.27 హెక్టార్లలో సాగవుతున్న ఆక్వాకల్చర్ ద్వారా 8,15,745 టన్నుల వనామీ రొయ్యల ఉత్పత్తి జరిగింది. మన రాష్ట్రంలో 71,921 హెక్టార్లలో 6,34,672 టన్నుల వనామీ రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. దేశంలో వనామీ రొయ్యల ఉత్పత్తిలో 77.80 శాతం ఏపీ నుంచే జరగడం గమనార్హం. 28 శాతం ఎగుమతి వైజాగ్ పోర్టు నుంచే దేశంలో 10 పోర్టుల ద్వారా రూ.43,717.26 కోట్ల విలువైన 11,49,341 టన్నుల ఎగుమతులు జరిగాయి. వాటిలో రూ.16,124.92 కోట్ల విలువైన 2,80,687 టన్నుల మత్స్య ఎగుమతులు ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టుల నుంచే జరిగాయి. అంటే మొత్తం ఎగుమతుల్లో 24 శాతం విలువైన 37 శాతం ఆక్వా ఉత్పత్తులు మన రాష్ట్ర పరిధిలోని పోర్టుల నుంచే వెళ్లాయి. ప్రధానంగా రూ.12,362.71 కోట్ల (28.28 శాతం) విలువైన 2,16,457 టన్నుల(18.83 శాతం) ఎగుమతులతో వైజాగ్ పోర్టు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. రూ.5112.77 కోట్ల (11.70 శాతం) విలువైన 1,16,419 టన్నుల (10.13 శాతం) ఎగుమతితో కోల్‌కతా పోర్టు, రూ.4,994.75 కోట్ల (11.43 శాతం) విలువైన 1,43,552 టన్నుల (12.49 శాతం) ఎగుమతితో కొచ్చి పోర్టు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రూ.3,762.21 కోట్ల (8.61 శాతం) విలువైన 64,230 టన్నుల (5.59 శాతం) ఎగుమతులతో రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టు జాతీయస్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో మనమే టాప్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని ఆధిక్యతను కొనసాగిస్తోంది. 2020–21 మొదట్లో కరోనా కొంత ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థంలో ఎగుమతులు అనూహ్యంగా పుంజుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు చేయగలిగాం. నంబర్ 1గా నిలవగలిగాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
భలే ఫిష్.. ఆల్ ఫ్రెష్
పెదగంట్యాడ (గాజువాక): వినియోగదారులకు నాణ్యమైన చేపలను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర మినీ అవుట్లెట్ల ఏర్పాటుకు రాష్ట్ర మత్స్యశాఖ శ్రీకారం చుట్టింది. నాణ్యమైన చెరువు చేపలు, సముద్రంలో పెరిగే మత్స్య రాశులను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులోని మార్వెల్ స్కూల్ ఎదుట వినాయక చవితి రోజున దీనిని ప్రారంభించారు. మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ బాలాజీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ కె.కన్నబాబు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు లక్ష్మణరావుమతదితరులు అవుట్ లెట్‌ను ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అందుబాటులోకి తేనున్నారు. అందుబాటులో ఉండే చేపలివే.. సముద్రంలో పెరిగే వంజరం, చందువా, రొయ్యలు, పీతలు, పండుగొప్ప.. చెరువుల్లో పెరిగే శీలావతు, బొచ్చె, రూప్‌చంద్, మోసు, కొర్రమీను, రాగండి, కట్ల తదితర చేపలు. ప్రభుత్వమే ఈ అవుట్ లెట్లకు చేపలను సరఫరా చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా మినీ ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లను తీసుకువచ్చింది. మన చేప–మన ఆరోగ్యం కింద ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో లబ్ధిదారుడు కేవలం రూ.30 వేలు డిపాజిట్ చేస్తే మిగిలిన సొమ్మును బ్యాంకులు అందజేస్తాయి. దీంతో అవుట్లెట్ పెట్టుకుని సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. -
ఆహా.. ఆక్వా హబ్‌లు!
సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచి ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న ఆక్వా హబ్‌లు సిద్ధమవుతున్నాయి. దేశంలో తొలిసారిగా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్రా’ పేరిట వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. బతికి ఉన్న చేపలే కాదు.. ఐస్‌లో భద్రపర్చిన ఫ్రెష్ ఫిష్‌తో పాటు దేశంలోనే తొలిసారిగా వ్యాక్యూమ్ ప్యాక్డ్ ఫిష్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కూరగాయలు, చికెన్ మాదిరిగా అన్ని వేళల్లో అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. దేశంలో తొలిసారిగా చేపలు, రొయ్యల పచ్చళ్లతోపాటు నేరుగా వండుకునేందుకు మసాలాతో దట్టించి చేసిన మత్స్య ఉత్పత్తులను కూడా అందించబోతున్నారు. వంద ఆక్వా హబ్‌లు.. ఏటా దాదాపు 46.23 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏపీలో వార్షిక తలసరి వినియోగం కేవలం 8.07 కిలోలు మాత్రమే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా 2022 కల్లా రాష్ట్రవ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి విడతగా డిసెంబర్ నెలాఖరులోగా రూ.325.15 కోట్లతో 25 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా పులివెందులతో పాటు పెనమలూరులో ఏర్పాటు చేస్తోన్న హబ్‌లను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హబ్‌ల్లో ప్రత్యేకతలెన్నో హబ్‌ల్లో 20 టన్నుల సామర్థ్యంతో ప్రాసెసింగ్ యూనిట్, 3 టన్నుల సామర్థ్యంలో చిల్డ్, కోల్డ్ స్టోరేజీలు, టన్ను సామర్థ్యంతో 2 లైప్ ఫిష్ ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. ఆక్వా, సముద్ర ఉత్పత్తులను సేకరించే ముందు తొలుత శాంపిళ్లను ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌కు పంపి పరీక్షించిన తర్వాత హబ్, రిటైల్ అవుటలెట్స్కు తరలిస్తారు. హబ్‌ల్లో కోల్డ్ చైన్ సప్లై సిస్టమ్ ద్వారా చేపలు, రొయ్యలను వృథా కాకుండా కట్ చేసి కనీసం వారం రోజుల పాటు నిల్వచేసే విధంగా వ్యాక్యూమ్డ్ ప్యాకింగ్ చేస్తారు. వాటిని రోటోమోల్డెడ్ ఐస్ బాక్సుల్లో రిటైల్ అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. నేరుగా వండుకునేందుకు వీలుగా మసాలాలు దట్టించిన ఉత్పత్తులను ఇక్కడ నుంచి అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. బతికి ఉన్న చేపలను చెరువుల నుంచి హబ్‌లతో పాటు రిటైల్ అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. రెస్టారెంట్ మాదిరిగా .. హబ్‌కు అనుబంధంగా పట్టణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రదేశాల్లో సర్వే చేసి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో వాల్యూయాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బతికున్న చేపలతో పాటు రోటోమోల్డెడ్ ఐస్ బాక్సుల్లో వేస్ట్ లేకుండా కట్ చేసిన చేపలు(ఫ్రెష్ ఫిష్)లతో పాటు ఫ్రోజెన్ ఫిష్, మ్యారినెట్ చేసిన చేపలను కూడా అందుబాటులో ఉంచుతారు. రెస్టారెంట్ మాదిరిగా ఓ వైపు డైనింగ్ ఫెసిలిటీ కల్పిస్తారు. తమకు నచ్చిన చేపలను కోరుకున్నట్లుగా వండుకుని తినే అవకాశం కల్పిస్తారు. ఇక్కడ నుంచి నేరుగా బతికున్న చేపలతో పాటు మ్యార్నెట్ చేసిన వాటిని తీసుకెళ్లే సదుపాయం ఉంటుంది. లైవ్ ఫిష్ యూనిట్లలో బతికున్న చేపలను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేస్తారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే కియోస్క్‌లో కూడా తక్కువ సామర్థ్యంతో లైవ్షిఫ్ను అందుబాటులో ఉంచుతారు. మొబైల్ ఫిష్ వెండింగ్ ఫుడ్ కోర్టుల్లో తినేందుకు వీలుగా చేపలు, రొయ్యలతో తయారైన స్నాక్స్ అందుబాటులో ఉంచుతారు. ఈ– కార్ట్స్ ద్వారా కూరగాయల మాదిరిగా తాజా నాణ్యమైన చేపలను ప్రజలకు ఇళ్ల వద్దే విక్రయిస్తారు. సచివాలయానికొకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న మినీ రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు అందుబాటులో ఉంచుతారు. ఈ అవుట్‌లెట్స్ ద్వారా డోర్ డెలివరీ చేస్తారు. ఈ కామర్స్ సిస్టమ్ ద్వారా ప్రతీ వినియోగదారుడి నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకు తగ్గట్టుగా మత్స్య ఉత్పత్తులను సరఫరా చేస్తారు. సచివాలయానికో మినీ రిటైల్ అవుట్లెట్ నాలుగు వేల చదరపు అడుగుల వీస్తీర్ణంలో రూ.1.67 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్‌లకు అనుబంధంగా ప్రతి హబ్ పరిధిలో రూ.50 లక్షల ఖర్చుతో వ్యాల్యూ యాడెడ్ యూనిట్, రూ.20 లక్షల అంచనాతో ఐదు లైవ్ ఫిష్ యూనిట్లు, రూ.10 లక్షల వ్యయంతో 8 ఫిష్ కియోస్క్‌లు, రూ.10 లక్షలతో మొబైల్ ఫిష్ వెండింగ్ ఫుడ్ కోర్టులు, బజార్లలో విక్రయించేందుకు రూ.3 లక్షల అంచనాతో 10 ఎలక్ట్రికల్ ఈ కార్ట్స్ వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఇక హబ్‌కు అనుబంధంగా సచివాలయానికి ఒకటి చొప్పున ఒక్కొక్కటి రూ.1.45 లక్షల అంచనా వ్యయంతో 100–120 మినీ రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తారు. -
కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను
సాక్షి, అమరావతి బ్యూరో/కైకలూరు: తెల్ల చేప రకాల్లో గోదావరి పులసకు ఎంత పేరుందో.. నల్ల చేప రకాల్లో ఒకటైన కొర్రమీనుకూ అంతే గుర్తింపు ఉంది. అందులోనూ కొల్లేరు సరస్సులో పెరిగే కొర్రమీనుకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడా కొల్లేరు కొర్రమీనులకు కష్టకాలం దాపురించింది. సరస్సులో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలు, పంట కాలువలు, గుంతలు, వరి చేలల్లో కొర్రమీను చేపలు పుట్టి పెరుగుతుంటాయి. ప్రాంతాలను బట్టి పూమేను, కొర్రమీను, మట్టమీను, బురద మట్ట వంటి పేర్లతో పిలుచుకునే ఈ జాతి చేపలు సహజంగా నీటి అడుగున బురదలో జీవిస్తుంటాయి. నీరు లేనప్పుడు భూమి పొరల్లోకి కూడా చొచ్చుకుపోయి అక్కడి తేమను ఆధారం చేసుకుని జీవించగలిగే మొండి జాతి ఇది. కాలుష్యమే అసలు సమస్య కొల్లేరు సరస్సులోకి చేరుతున్న వ్యర్థ జలాలు సరస్సు గర్భంలో పురుడు పోసుకుంటున్న సహజ నల్ల జాతి చేపల ఉసురుతీస్తున్నాయి. స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కొల్లేరు నీరు కాలకూట విషంగా మారింది. సరస్సులో ఉప్పు శాతం ప్రమాదకర స్థాయికి చేరడం అందోళన కలిగిస్తోంది. సరస్సులోకి ఏటా 17 వేల టన్నుల వ్యర్థ జలాలు చేరుతున్నట్టు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనా వేసింది. కేవలం పెద్ద కర్మాగారాల నుంచే రోజుకు 7.2 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు కొల్లేరులో కలుస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి చేరుతున్న వ్యర్థ రసాయనాలు మత్స్య సంపదపై మృత్యు పాశం విసురుతున్నాయి. దీనికి తోడు సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోంది. కొర్రమీను చేప ‘జీరో’ సెలినిటీ (ఉప్పు శాతం లేని) మంచినీటిలో పెరిగే చేప. ప్రస్తుతం కొల్లేరులో ఉప్పు శాతం 3–15 శాతంగా ఉంది. దీంతో సరస్సులో చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత నీటి కాలుష్యం వల్ల కొర్రమీను ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ (ఈయూఎస్) వ్యాధులకు గురవుతోంది. దీనివల్ల శరీరంపై పుండ్లు, రక్తస్రావం కావడం, ఎదుగుదల లోపించడం, సంతానోత్పత్తి నశించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కొల్లేరులో బొమ్మిడాయి, మట్టగిడస, గురక, ఇంగిలాయి, మార్పు, జెల్ల వంటి నల్ల చేప జాతులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు మొండి జాతి రకమైన కొర్రమీను సైతం వాటి జాబితాలో చేరుతోంది. నీటి కాలుష్యాన్ని అరికట్టాలి కొల్లేరు సరస్సులోకి ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ జలాలు రాకుండా నియంత్రించాలి. కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన నీటిని మాత్రమే విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఎండీ ఆసిఫ్‌పాషా, జాతీయ ఉత్తమ చేపల రైతు, కైకలూరు కృత్రిమ సాగు మేలు కొర్రమీను రకం చేపలను కృత్రిమ పద్ధతిలో సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. కొర్రమీను సీడ్‌ను కొల్లేరు సరస్సుతోపాటు, కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరిస్తున్నారు. కొర్రమీను సాగుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ప్రోత్సాహకాలు అందిస్తోంది. – పి.ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు -
మత్స్యకారులకు 'కొత్త ఉపాధి'
సాక్షి, అమరావతి: చేపల వేటపైనే ఆధారపడి జీవనోపాధి సాగించే మత్స్యకార కుటుంబాలకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఎలాంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే సముద్ర నాచు (సీవీడ్స్)సాగులో మత్స్యకార మహిళలను ప్రోత్సహించాలని సంకల్పించింది. సముద్రగర్భంలో సహజసిద్ధంగా పెరిగే నాచుమొక్కల ద్వారా వచ్చే కెర్రాజీనన్, అల్జిన్, అల్జినేట్స్, ఆగర్ వంటి ఉప ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని కొన్ని రకాల పరిశ్రమలతో పాటు మందులు, మద్యం, కాస్మోటిక్స్, బేకరీ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్ టన్నుల సముద్ర నాచు ఉత్పత్తి జరుగుతుండగా, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మూడు వైపులా సముద్రతీరంతో పాటు అపారమైన మంచినీటి వనరులున్న భారతదేశంలో 10 లక్షల టన్నుల (మిలియన్) ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. కానీ సాగుపట్ల అవగాహన లోపం, కొరవడిన ప్రభుత్వ సహకారం వల్ల కేవలం 25వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. దీంట్లో నాల్గోవంతు తమిళనాడులోనే సాగవుతోంది. ఈ నాచుకున్న ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీర ప్రాంత రాష్ట్రాలతో కలిసి సీవీడ్ సాగును ప్రోత్సహించాలని సంకల్పించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎం ఎస్‌వై) కింద 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూతనివ్వనున్నాయి. తద్వారా రానున్న ఐదేళ్లలో దేశంలో 17లక్షల టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశిస్తే మన రాష్ట్రంలో కనీసం 1.50లక్షల టన్నులు ఉత్పత్తి చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ రెండు రకాలకే డిమాండ్ 970 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతమున్న మన రాష్ట్రంలోని సీ వెడ్ సాగుకు అపారమైన అవకాశాలున్నాయని 1979–82లో నిర్వహించిన పరిశోధనల్లో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) గుర్తించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 19 ప్రాంతాలు అనువైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. తీర ప్రాంతంలో 78 రకాల సీవీడ్స్ ఉన్నప్పటికీ వాటిలో ‘కప్పాఫైకస్, గ్రాసిలేరియా’కు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. మూడురకాలుగా సాగు .. రాప్ట్, ట్యూబ్, మోనోలైన్ పద్ధతిలో వైర్లకు ద్రాక్ష తీగల మాదిరిగా మొక్కలను కడతారు.ఒక్కోదానికి 45–60 కేజీల వరకు సీవీడ్స్‌ను కట్టి అలల తాకిడి, పూడిక, చిక్కదనం లేని తీరప్రాంతంలో 6–8 మీటర్ల లోతులో వీటిని అమర్చి సాగు చేస్తారు. రూ.1.50లక్షల పెట్టుబడి.. రూ.6లక్షల ఆదాయం మార్కెట్లో కిలో నాచు రూ.60 పలుకుతోంది. 15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్ పరిధిలో 1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే 6లక్షల వరకు ఆదాయం వస్తుంది. పైగా పెట్టుబడిలో 60 శాతం సబ్సిడీ ఇస్తారు. రూ.1.86 కోట్లతో 7,200 యూనిట్లు రాష్ట్రానికి ఈ ఏడాది 7,200యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలో రూ.1.12కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా, 74.40లక్షలు లబ్ధిదారులు భరిస్తారు. ఇప్పటికే జిల్లాలకు 55.80 లక్షలు విడుదల చేశారు. మార్కెటింగ్ కోసం పలు కంపెనీలు–సాగు దారుల మధ్య ఒప్పందం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సముద్ర నాచు సాగు లాభాలెన్నో తీర ప్రాంత మండలాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుçపర్చే లక్ష్యంతో సముద్ర నాచుసాగును ప్రోత్సహిస్తున్నాం. రానున్న 5 ఏళ్లలో 1.50లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశాం.రిస్క్ చాలా తక్కువ. పైగా కచ్చితమైన ఆదాయం. మత్స్యకార మహిళలు ముందుకు రావాలి. –కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
మీనమే వస్తుంది... మన ఇంటికి..
సాక్షి, అమరావతి: పోషక విలువలున్న మత్స్యసంపద వినియోగాన్ని రాష్ట్రంలో పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. మత్స్యసంపద ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రం ఆ ఉత్పత్తుల్ని వినియోగించడంలో మాత్రం చివరిస్థానంలో ఉంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక, తలసరి వినియోగాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తోంది. వీటిని ప్రజల ముంగిటకు చేర్చేందుకు రూ.325.15 కోట్లతో ప్రణాళికలు రూపొందించి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. తోపుడు బండ్లపై తాజా కూరగాయలను విక్రయిస్తున్నట్టుగా మత్స్య ఉత్పత్తులు కూడా ప్రజల ముంగిటకు వచ్చేలా ఆక్వాహబ్‌లు, ఫిష్ కియోస్క్‌లు, రిటైల్ అవుట్‌లెట్స్, లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్లు, ఫిష్ వెండింగ్ కమ్ ఫుడ్ కార్టులు, ఈ–రిక్షాలు, వాల్యూయాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. మత్స్యసంపదతో వండిన ఆహార ఉత్పత్తులను కూడా ఆన్లైన్ ద్వారా సరఫరా చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. వీటి ఏర్పాటు ద్వారా ఇటు రైతులకు మంచి ధర లభించడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన మత్స్య ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. 2025 నాటికి తలసరి వినియోగం 22.88 కిలోలకు పెంచాలని లక్ష్యం రాష్ట్రంలో 2014–15లో 20 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తులు 2020–21లో 46.23 లక్షల టన్నులకు పెరిగాయి. స్థానిక వినియోగం 4.36 లక్షల టన్నులు (10 శాతంకన్నా తక్కువ) కాగా తలసరి వినియోగం 8.07 కిలోలు. 2025 నాటికి స్థానిక వినియోగాన్ని కనీసం 30 శాతానికి తలసరి వినియోగాన్ని 22.88 కిలోలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా రైతు, మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో 100 ఆక్వాహబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్‌ల నుంచి సరఫరా చేసే లైవ్ ఫిష్, తాజా, డ్రై, ప్రాసెస్ చేసిన చేపలు, రొయ్యలు, పీతలను జనతా బజార్లు, రిటైల్ పాయింట్లకు సరఫరా చేసేందుకు సప్లై చైన్‌ను రూపొందించారు. ఒక్కో హబ్ పరిధిలో ఒక వాల్యూయాడెడ్ యూనిట్, 5 లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లు, 8 ఫిష్ కియోస్క్‌లు, 10 ఫిష్ వెండింగ్ కార్టులు, 2 ఫిష్ అండ్ ఫుడ్ వెండింగ్ కార్టులు, సచివాలయానికి ఒకటి చొప్పున 100 మినీ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో హబ్ పరిధిలో రోజుకు 15 టన్నుల వంతున మత్స్యసంపదను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. తొలివిడతగా ఏర్పాటు చేస్తున్న 25 హబ్‌లు, అనుబంధ యూనిట్ల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిద్వారా మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చడమేగాక ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చురుగ్గా లబ్ధిదారుల ఎంపిక తొలిదశకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 20 ఆక్వాహబ్‌ల ఏర్పాటుకు ఆక్వా ఫార్మర్ సొసైటీలను ఎంపికచేశారు. కడప, కర్నూలు, అనంతపురం, తెనాలి, నంద్యాల ఆక్వాహబ్‌లకు సొసైటీల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. రిటైల్ అవుట్‌లెట్స్ కోసం 621 మందిని, మినీ రిటైల్ అవుట్‌లెట్స్ కోసం 1,145 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు ఆక్వాహబ్, దాని పరిధిలోని స్పోక్స్, మినీ రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఈనెలాఖరులో ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తీసుకురానున్నారు. పెనమలూరు, పులివెందుల ఆక్వాహబ్‌లు, వాటి పరిధిలోని స్పోక్స్, మినీ రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఆగస్టు 15న, మిగిలిన 23 ఆక్వాహబ్‌లు, వాటి పరిధిలోని 3,335 స్పోక్స్, మినీ రిటైల్ అవుట్‌లెట్స్‌ను అక్టోబరు 2న ప్రారంభించనున్నారు. ప్రతిపాదించిన మరో 75 ఆక్వాహబ్‌లను వచ్చే జనవరి 26న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలో గొరక చేపల హేచరీలు
సాక్షి, అమరావతి: గొరక (తిలాపియా).. అత్యంత చౌక, ముళ్లు తక్కువగా ఉండే కాలువ చేప. రోడ్ సైడ్ రెస్టారెంట్లలో విరివిగా వాడే ఈ చేపలకు అమెరికా, సింగపూర్, చైనా, యూరోపియన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో వీటి వినియోగం తక్కువే. మన రాష్ట్రం నుంచి ఎక్కువగా విదేశాలకు పిల్లెట్స్ రూపంలో ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చేపల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చేపపిల్లల ఉత్పత్తి కోసం ముందుకొచ్చే ప్రైవేటు హేచరీలకు అనుమతివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీచేశారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో సీఐఎఫ్ఏ విజయవాడ రీజనల్ సెంటర్ సైంటిస్ట్ ఇన్చార్జి, ఎంపెడా విజయవాడ రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ప్రిన్సిపల్‌తో పాటు కృష్ణాజిల్లా మానికొండలోని ఆర్‌జీసీఏలోని తిలాపియా సెంటర్ ప్రాజెక్టు మేనేజర్ సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే తిలాపియా హేచరీ ఏర్పాటు కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆనంద గ్రూప్ దరఖాస్తు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత హేచరీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఇతర జిల్లాల నుంచి కూడా ఈ హేచరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. -
Cage Culture: కేజ్ కల్చర్‌తో యువతకు ఉపాధి
సాక్షి, అమరావతి: కేజ్ కల్చర్ (పంజరంలో చేపలసాగు)ను మరింత ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) అభివృద్ధి చేసిన ఈ వినూత్న సాగు కేజ్ కల్చర్‌ను 2007లో రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ సాగుకు గజం భూమి కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా నీరు పెట్టక్కర్లేదు. తరచూ నీరు మార్చాల్సిన పనిలేదు. విద్యుత్ అవసరం అసలే లేదు. కూలీల భారం పెద్దగా లేనేలేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఆర్జించే ఈ సాగు సముద్రం, నదుల్లోనే కాదు.. అన్ని రకాల రిజర్వాయర్లలో ప్రోత్సహించే అవకాశం ఉన్నా గత ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదు. దీంతో మన రాష్ట్రంలోకంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ సాగుకు మంచి ఆదరణ లభించింది. ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన ఈ కల్చర్ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేజ్ తయారీ వినూత్నం.. 6 మీటర్ల వృత్తంతో 4 మీటర్ల లోతున ప్రత్యేకంగా తయారు చేసిన పంజరంలో సాగుచేస్తారు. ఇది తేలడానికి పంజరం కింద డ్రమ్‌లు, లోపల చేపలు పెంచేందుకు ఓ వల, బయట రక్షణ వలయంగా మరో వల ఏర్పాటు చేస్తారు. కనీసం 5 మీటర్ల లోతున్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీటిని వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. విశాఖ సముద్ర తీరంలో 30, సూర్యలంకబీచ్‌లో 10 మెరైన్ కేజ్‌లు, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లాల్లో 110 బ్యాక్‌వాటర్ కేజ్‌లు ఉన్నాయి. అత్యధికంగా 70కు పైగా కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉండడంతో కేజ్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఆ ప్రాంతం నిలిచింది. ఈ సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన (పీఎంఎంఎస్వై) ద్వారా 60ః40 నిష్పత్తిలో ఈ సాగుకు చేయూతనిస్తున్నాయి. ఖర్చులు పోను మెరైన్ కేజ్ ద్వారా ఏటా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు, బ్యాక్‌వాటర్ కల్చర్ ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. కేజ్ కల్చర్ విస్తరణకు ఏపీ అనువైన ప్రాంతం ఏపీలో కేజ్ కల్చర్ విస్తరణకు అవకాశాలున్నాయి. సుదూరమైన సముద్రతీర ప్రాంతంతోపాటు పొడవైన కృష్ణా, గోదావరి బ్యాక్‌వాటర్ ప్రాంతం ఉంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున రిజర్వాయర్లున్నాయి. ప్రత్యేకంగా కేజ్ కల్చర్ పాలసీని తీసుకొస్తే అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సీఎంఎఫ్‌ఐఆర్ సిద్దంగా ఉంది. – డాక్టర్ సుభాదీప్‌ఘోష్, సీఎంఎఫ్ఆర్ఐ విశాఖ రీజనల్ సెంటర్ హెడ్ త్వరలో కొత్త పాలసీ బ్యాక్‌వాటర్‌తో పాటు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ విస్తరణకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. త్వరలో కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ 12 కేజ్‌లు ఏర్పాటు చేశా.. కేజ్ కల్చర్ ఎంతో లాభదాయకం. నేను 2 కేజ్‌లతో ఈ సాగు ఆరంభించా. ప్రస్తుతం 12 కేజ్‌లకు విస్తరించగలిగా. ఒక్కో కేజ్‌కు రూ.50 వేలు పెట్టుబడిపెడితే రూ.లక్ష ఆదాయం వస్తోంది. చెరువులు అవసరం లేకుండా చేపలు పెంచే ఈ విధానం నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగం. – తలశిల రఘుశేఖర్, కేజ్ కల్చర్ రైతు, నాగాయలంక ముందుకొచ్చే వారికి శిక్షణ కేజ్ కల్చర్‌ను మరింత మెరుగుపర్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కల్చర్‌కు ముందుకొచ్చే వారికి పంజరం తయారీలో శిక్షణనిస్తున్నాం. సీడ్, ఫీడ్ అందిస్తున్నాం. సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ శేఖర్ మేఘరాజన్, సీనియర్ శాస్త్రవేత్త, సీఎంఎఫ్ఆర్ఐ -
Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ కోవిడ్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని తక్కువ ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దళారుల ఉచ్చులో పడి అయినకాడికి అమ్ముకోవద్దని ఆక్వా రైతులను కోరుతోంది. సీ ఫుడ్ ఎగుమతిదారుల అసోసియేషన్ నిర్ధారించిన ధరలకే అమ్ముకోవాలని సూచిస్తోంది. రాష్ట్రంలో మొదటి పంట ప్రస్తుతం మార్కెట్లోకి వస్తోంది. రోజుకు ఐదు నుంచి ఆరువేల టన్నుల రొయ్యలు జూన్ వరకు మార్కెట్‌కు వస్తాయి. ప్రస్తుతం కౌంట్‌ను బట్టి కిలో రూ.200 నుంచి రూ.340 వరకు ధర పలుకుతోంది. రోజుకు 15–20 టన్నుల చొప్పున కృష్ణపట్నం, విశాఖ, కాకినాడ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి మార్కెట్లో రేటు పడిపోయిందని, లాక్డౌన్ విధిస్తే ఎగుమతులు నిలిచిపోతాయంటూ కొంతమంది దళారులు, వ్యాపారులు దుష్ప్రచారం చేస్తూ రైతుల వద్ద కిలోకి రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించి కొంటున్నారు. దీంతో దళారులు, వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సర్కార్ నిర్ణయించింది. ఇదే సమయంలో ఆందోళనకు గురికాకుండా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మీడియా ద్వారా ధరలపై విస్తృత ప్రచారం: కమిషనర్ కన్నబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు ఆదివారం ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, కోస్తా జిల్లాల ఆక్వా రైతులు, మత్స్యశాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు కౌంట్ వారీగా నిర్ధారించే ధరలను మీడియా ద్వారా సీఫుడ్ ఎగుమతిదారుల అసోసియేషన్ విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసే వ్యాపారుల సమాచారం జిల్లా మత్స్యశాఖాధికారులకు ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు నిలకడగా ఉన్నాయని, తగ్గే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. -
70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బర్డ్ ప్లూ వైరస్ బతకదు
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూ వ్యాధిని కలుగజేసే వైరస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 30 నిముషాలకు మించి బతకదని పరిశోధనల్లో నిర్ధారౖణెనట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. పూర్తిగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదని, ప్రజలు లేనిపోని వదంతులు నమ్మకుండా వాటిని ఆహారంగా తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి బాగా విస్తరిస్తున్నందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనూహ్య రీతిలో కోళ్లు మరణిస్తే వెంటనే స్థానిక పశు వైద్యాధికారులకుగానీ, సమీప ఆర్బీకేలు, సచివాలయాలకుగానీ సమాచారం ఇవ్వాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వ్యాధి ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. -
రొయ్యల క్రయవిక్రయాలపై ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: రొయ్యల క్రయ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. క్రయవిక్రయాలు రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశిస్తూ అధికారులు పాటించాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. వారం రోజులుగా హేచరీస్ నిర్వాహకులు, ఎగుమతిదారులు కొనుగోళ్లు నిలిపివేయడం, ఒకవేళ కొనుగోలు చేసినా కిలోకు రూ.80 వరకు తక్కువ రేటును చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్న ప్రాంతాలకు ఇద్దరేసి అధికారులను నియమించింది. వారి మొబైల్ నంబర్లు రైతులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల్లోని కంట్రోల్ రూమ్‌లు పనిచేయనున్నాయి. రైతులు తమ సమస్యలను ఈ కంట్రోలు రూమ్‌లకు తెలిపితే అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రేట్లకే ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు
సాక్షి, అమరావతి : మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెడతానని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు తులిపారు. ఆయన ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, ఆక్వా కల్చర్ కొత్త అథారిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ఆక్వా అథారిటీతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్లో 700 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామని వివరించారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే ఉద్దేశంతో.. ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. (వైఎస్ జగన్ భిక్షతోనే మీరు ఎంపీ అయ్యారు) -
పండు‘గొప్ప’
సాక్షి, మచిలీపట్నం: సముద్ర తీరానికి ఆనుకుని ఉండే మారుమూల పల్లె. 150 ఇళ్లు.. 750 మంది జనాభా గల ఆ గ్రామంలోని గంగపుత్రులు ఒకప్పుడు వేటకు వెళ్తే కాని పూట గడవని పరిస్థితి. వారి జీవితాల్లో ఓ చేప పిల్ల పెనుమార్పు తెచ్చింది. ఆ పల్లె కథేమిటో తెలుసుకోవాలంటే.. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి కూతవేటు దూరంలో ఉన్న గరాలదిబ్బ వెళ్లాల్సిందే. సముద్ర చేపల్లో రారాజుగా.. ఆసియా ‘సీ బాస్’గా పేరొందిన పండుగప్ప చేప పిల్లల పెంపకంలో గరాలదిబ్బ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇలా మొదలైంది.. ► సముద్రంలో వేట లేక.. వ్యవసాయం కలసి రాక 20 ఏళ్ల క్రితం ఓ రైతు తన స్నేహితుని సాయంతో తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లా సిర్కాలిలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ (ఆర్జీసీఏ) నుంచి 20 రోజుల వయసు గల పండుగప్ప సీడ్ తెచ్చాడు. ► వాటిని నెల రోజుల పాటు పెంచి చుట్టుపక్కల చేపల రైతులకు విక్రయించగా.. మంచి లాభాలొచ్చాయి. ► ఆ తర్వాత గ్రామస్తులంతా అదే బాటలో నడిచారు. బయటి ప్రాంతాల్లో 25 నుంచి 30 శాతానికి మించి బతకని ఈ చేప పిల్లలు ఇక్కడి నేల స్వభావం వల్ల 60 నుంచి 70 శాతం బతికి రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ డిమాండ్ ► గ్రామంలో ప్రస్తుతం 200 ఎకరాల్లో పండుగప్ప పిల్లల పెంపకం సాగుతోంది. 100 మందికి పైగా రైతులు దీనిపై ఆధారపడుతున్నారు. ► ఇంకా కళ్లు కూడా తెరవని చేప పిల్లల్ని తీసుకొచ్చి కనీసం 45 రోజులపాటు చెరువుల్లో పెంచుతారు. వీటికి కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా, తమిళనాడు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ► ఒక్కో పిల్లను రూ.4 చొప్పున కొంటారు. 4 అంగుళాల సైజు పెరిగిన తర్వాత రూ.25 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తారు. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రూ.35 కూడా ధర పలుకుతుంది. ► ఆ పిల్లల్ని 7 నెలల నుంచి ఏడాది వరకు పెంచితే ఒక్కో చేప ఐదారు కేజీలకు ఎదుగుతుంది. పెరిగిన చేప ధర మార్కెట్లో కిలో రూ.350కి పైగా పలుకుతోంది. 75 శాతం సీడ్ ఇక్కడికే.. ► ఆర్జీసీఏలో ఏటా 35 లక్షల పండుగప్ప సీడ్ ఉత్పత్తి అవుతుంటే.. 75 శాతం అంటే 25 లక్షల సీడ్ గరాలదిబ్బ రైతులే కొనుగోలు చేయడం విశేషం. గరాలదిబ్బకు అంతర్జాతీయ ఖ్యాతి పండుగప్ప చేప పిల్లల పెంపకంలో గరాలదిబ్బకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. గ్రామం మొత్తం ఇదే సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ బతికినట్టుగా ఈ చేపపిల్ల ఏపీలో మరెక్కడా బతకడం లేదు. ఉప్పు నీటిలోనే కాదు.. మంచినీటిలో కూడా ఈ చేపల సాగు చేయొచ్చు. రొయ్యల సాగుకు ప్రత్యామ్నాయంగా పండుగప్పసాగు మేలు. – డాక్టర్ పి.సురేష్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ -
వలేసి పట్టేద్దాం!
మానికొండ గణేశ్, సాక్షి, అమరావతి: పది గ్రాముల పిత్తపరిగి మొదలు 25 కేజీల ట్యూనా చేపలను వేటాడేందుకు, ఉప్పాడ వంటి మారుమూల గ్రామం నుంచి ఉత్తర అమెరికా వరకు సముద్ర మత్స్య సంపద ఎగుమతికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా రాష్ట్రంలోని మత్స్యకారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడి సముద్ర జలాల సరిహద్దులు దాటి పాకిస్తాన్‌కు చిక్కి బాధలు పడిన మత్స్యకారుల పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వీటిని నిర్మించనుంది. హార్బర్ల ద్వారా ఇకపై కోస్తా తీరాన్ని సంపదలకు నెలవుగా, ఉపాధి అవకాశాలు కల్పించే కల్పతరువుగా రూపు మార్చనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణం కానున్నాయి. ► దాదాపు రూ.2,639 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయనుంది. వీటిలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల నిర్మాణాలకు నాబార్డు రూ.450 కోట్లను ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద (ఎఫ్ఐడిఎఫ్) రుణం ఇవ్వనుంది. ► ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, నాబార్డుకు చెందిన ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, మచిలీపట్నం, నిజాంపట్నాల్లోని ఫిషింగ్ హార్బర్ల రెండో దశ నిర్మాణాలకు, ఉప్పాడ ఫిషింగ్ హార్బరు నిర్మాణాలకు రూ.1,015.219 కోట్లతో అంచనాలు తయారు చేసింది. ఇందులో నిజాంపట్నం హార్బరు నిర్మాణానికి రూ.379.17 కోట్లు, మచిలీపట్నం హార్బరు నిర్మాణానికి రూ.285.609 కోట్లు, ఉప్పాడ నిర్మాణానికి రూ.350.440 కోట్లు అవసరవవుతాయని అంచనా. ► వీటిల్లో ఒక్కోదానికి ఎఫ్ఐడీఎఫ్ కింద లభించే రూ.150 కోట్ల రుణం పోను మిగిలిన ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం 90% నిధులను ఎన్ఐడీఐ (నాబార్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్) రుణం ద్వారా సమకూర్చనుంది. మిగిలిన 10% నిధులను రాష్ట్రం ఖర్చు చేయనుంది. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ రూ.288.80 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ ► నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బరు నిర్మాణానికి రూ.288.80 కోట్లతో అంచనాలు తయారు చేయగా, సాగరమాలలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్, బీఆర్) కింద కేంద్రం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించనున్నాయి. ► మొదటి విడతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.18 కోట్లు విడుదల చేశాయి. ఇటీవల అప్పటి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి, ఆ జిల్లా శాసన సభ్యులు రేవు నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. ► శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం హార్బరుకు రూ.332.09 కోట్లు, విశాఖ జిల్లా పూడిమడక హార్బరుకు రూ.353.10 కోట్లు, ప్రకాశం జిల్లా కొత్తపట్నం హార్బరుకు రూ.325.16 కోట్లతో అంచనాలు తయారయ్యాయి. ► ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) పథకం కింద ఒక్కో హార్బరుకు రూ.120 కోట్ల రుణం విడుదల కావాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప హార్బరు నిర్మాణానికి అవసరమైన నివేదికను బెంగళూరుకు చెందిన సీఐసీఈఎఫ్ (సైసెఫ్) ఇవ్వాల్సింది. ► మొదట్లో దీనిని ఫిష్ ల్యాండింగ్ సెంటరుగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, హార్బరుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.300 కోట్లతో అంచనాలు రూపొందించారు. హార్బర్ల నిర్మాణాలతో ఎన్నో ప్రయోజనాలు ► కొత్తగా నిర్మించనున్న హార్బర్ల వల్ల అదనంగా 11,280 ఫిషింగ్ బోట్లకు లంగరు వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా ట్యునా చేపలు శుభ్రం చేయడానికి, నిల్వ చేయడానికి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ► వీటి ద్వారా 76,230 మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే ఐస్ప్లాంట్లు, ప్రీప్రాసెసింగ్ సెంటర్లు, చేపల రవాణా, మార్కెటింగ్ ఇతర అనుబంధ సంస్థల్లో పనులు చేయడానికి మత్స్యకారులకు అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హార్బర్లలోని పనుల నిర్వహణకు మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటవుతాయి. వీటి ద్వారా వినియోగ రుసుములను వసూలు చేసి హార్బర్ల నిర్వహణ ప్రభుత్వానికి భారం కాకుండా చూస్తాయి. ► రొయ్యలు, చేపలకు మంచి రేటు వచ్చే వరకు హార్బరులోనే నిర్మించే కోల్డు స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీని వల్ల మత్స్యకారులు, మర పడవల నిర్వాహకులకు లబ్ధి చేకూరడమే కాకుండా విదేశీ ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది. ► సాలీనా 4.22 లక్షల టన్నుల చేపలు, రొయ్యల పట్టుబడి అదనంగా జరుగుతుంది. ► తుపానులు, ప్రకృతి వైపరీత్య సమయాల్లో మర పడవలు సురక్షితంగా హార్బర్లలో లంగరు వేసుకునే సౌకర్యం లభిస్తుంది. ► వేట విరామ సమయాల్లో మత్స్య కార్మికులు హార్బరులో నిర్మించే భవనాల్లో వలలు, ఇతర పరికరాల మరమ్మతులు చేసుకునే సౌకర్యం ఏర్పడుతుంది. మొగ వద్ద ఇసుక మేటలతో ఇక్కట్లు మొగ (సముద్ర ముఖ ద్వారం) దగ్గర ఇసుక మేటలు వేస్తోంది. సముద్ర అలల వేగం వల్ల మా ఊళ్లో అనేక బోట్లు దెబ్బ తిన్నాయి. వాటిని బాగు చేయించుకోవాలంటే ఓనర్లు లక్షలు పోయాల్సిందే. ఇక్కడి హార్బర్ నుంచి మొగ దగ్గరకు వెళ్లే కాల్వ లోతు పెంచక పోవడం వల్ల ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇందువల్లే చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు పోతున్నాం. ఇన్నాళ్లూ మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం జగన్ మా సమస్యపై దృష్టి పెట్టారు. మొగ వద్ద ఇసుక మేటలు తొలగించాకే మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. – మల్లికార్జునరావు, గిలకలదిండి, కృష్ణా జిల్లా బోట్లు పెరుగుతుంటే లంగరుకు చోటేదీ? హార్బరులో బోట్లు పెరుగుతున్నాయి. మంచి సీజనులో గిలకలదిండి, నరసాపురం నుంచి బోట్లు వస్తాయి. అప్పుడు ఒడ్డుకు ఎవరు ముందు వస్తే వాళ్లు జట్టీలకు బోట్లు కట్టుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా తీరానికి దగ్గరలోని చెట్లకు తాళ్లతో కట్టుకుంటున్నారు. భారీ వర్షాలు, గాలులు వచ్చినప్పుడు చెట్లకు కట్టిన తాళ్లు తెగి బోట్లు గల్లంతవుతుంటాయి. అలలకు కొట్టుకుపోతాయి. కొన్నిసార్లు వలలు, ఇంజన్లను దొంగలెత్తుకెళ్తారు. వాటిని కొనుక్కుని వేటకు వెళ్లాలంటే నెల పడుతుంది. ఈ సమస్యలన్నీ తీరాలంటే జట్టీల సంఖ్య పెంచాలి. – ఆర్.రాము, నిజాంపట్నం, గుంటూరు జిల్లా విస్తారమైన అవకాశాలు హార్బర్ల ద్వారా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి విస్తారమైన అవకాశాలున్నాయి. పెద్ద పెద్ద బోట్ల ద్వారా సముద్రలోతుల్లో మత్స్య సంపదను పట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాలు లేక రాష్ట్రంలోని పెద్ద పడవల నిర్వాహకులు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఈ పడవలకు హార్బర్లలో అన్ని సౌకర్యాలు సమకూర్చితే రాష్ట్ర ప్రభుత్వానికి సముద్ర సంపద ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. పోషక విలువలు కలిగిన సముద్ర జాతి వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. – కన్నబాబు, ఫిషరీస్ కమిషనర్ ఫిషింగ్ హార్బర్లు ► పెద్ద పెద్ద పడవలు మత్స్య సంపదను సముద్ర ఒడ్డుకు తేవడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. సముద్రపు ఒడ్డున లోతు ఎక్కువగా ఉండేలా వీటిని నిర్మించడం వల్ల మత్స్యకారులకు ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎగుమతులకు వీలుంటుంది. ► జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్త పట్నం, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ► వేటాడి తెచ్చిన చేపలను అన్లోడ్ చేయడానికి వీలుగా వీటిని నిర్మిస్తారు. విక్రయాలకూ అవకాశం ఉంటుంది. ► మంచినీళ్లపేట, బీమిలీ, నక్కపల్లి, చింత పల్లిలో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మంచి నీళ్లపేటలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.11.95 కోట్లు కేటాయించింది. పనులను చేపట్టేందుకు నిర్మాణ సంస్థను కూడా ఖరారు చేసింది. మాకు కష్టాలు తప్పుతాయి.. మా జువ్వలదిన్నెలో చేపలరేవు కడతామని చంద్రబాబు అనేకసార్లు చెప్పాడు. మాట నిలుపుకోలేదు. సీఎం జగన్ మా జిల్లాకు వచ్చినప్పుడు మా రేవు నిర్మాణం గురించి హామీ ఇచ్చారు. మొన్నీమధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా మా ఊరొచ్చి రేవు కట్టడానికి అనువైన ప్రాంతాన్ని చూశారు. వెంటనే రేవు కడతారంట. నిధులు కూడా వచ్చేశాయని మా ఓనర్లు చెబుతున్నారు. ఇక్కడ రేవు కడితే మద్రాసు, గుజరాత్ వెళ్లక్కర్లేదు. బాధలు తప్పుతాయి. ఇక్కడి నుంచే చేపల వేటకు వెళ్లడానికి అవకాశం ఏర్పడుతుంది. – కొమరిరాజు, తుమ్మలపెంట, కావలి మండలం, నెల్లూరు జిల్లా -
ఆ పీతలు ఫ్లయిటెక్కుతాయ్
తూర్పు గోదావరి జిల్లా యానాం–కాకినాడ మధ్యన ఉండే ఓ మత్స్యకార పల్లె ‘పెదవలసల’. ఆ చిన్న గ్రామం తాతల కాలం నుంచీ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. కృష్ణా, గోదావరి నదీపాయల ముఖ ద్వారాలు, కోరంగి, నాగాయలంక ప్రాంతాల్లోనూ పీతలు లభ్యమవుతున్నా.. పెదవలసల ప్రాంత పీతలకు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే.. అక్కడి మడ అడవుల్లో దొరికే పీతలు రుచిలో మేటిగా పేరొందాయి. ఇక్కడి మండ పీతలు, పసుపు పచ్చ పీతలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికా, చైనా, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల ప్రజలు వీటిని ఇష్టంగా తింటారు. ఈ గ్రామం నుంచి ప్రతినెలా సుమారు 20 టన్నుల పీతలు విదేశాలకు విమాన యానం చేస్తున్నాయి. పొద్దుపొడవక ముందే వేటకు.. ► తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల, పెదవలసల, చినబొడ్డు వెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం, గాడిమొగ, రామన్నపాలెం, పండి, పోర, కొత్తపాలెం గ్రామాల మత్స్యకారులు తరతరాలుగా పీతల వేటలో ఉన్నా.. పెదవలసల పీతలు విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. పదేళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి భైరవపాలెం, భైరవలంక తదితర ప్రాంతాల్లో పీతలను వేటాడి మధ్యాహ్నానికి తిరిగొస్తారు. ► దేశీయ బోటులో ముగ్గురు లేదా నలుగురు మత్స్యకారులు బృందంగా వెళ్లి 10 కిలోల వరకు పీతలను వేటాడతారు. కిలో రూ.250 వంతున రోజుకు సుమారు రూ.2,500 వరకు సంపాదిస్తారు. ► సాధారణ పీతలను సమీపంలోని స్థానిక మార్కెట్లలోనే విక్రయిస్తారు. గ్రేడింగ్ చేసిన పీతలను వెదురు బుట్టల్లో కాకినాడ మార్కెట్‌కు తరలించి.. ఎగుమతిదారులకు విక్రయిస్తారు. ఆ రెండు రకాలకే డిమాండ్ ► పీతలు ఆర్థోపోడా వర్గం, కష్టేసియన్ తరగతికి చెందినవి. వీటిలో 300 రకాలున్నా.. సవాయి, చుక్క, శిలువ, మండ, పసుపు పచ్చ, గుడ్డు పీతలు రుచిలో ప్రత్యేకమైనవి. ► ‘సిల్లా’ జాతికి చెందిన మండ పీతలు, పసుపు పచ్చ, గుడ్డు పీతలు కేజీ వరకూ పెరుగుతాయి. గుడ్డు పీతలను కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు రవాణా చేస్తుంటారు. ► మండ, పసుపు పచ్చ పీతలను గ్రేడింగ్ చేసి వాటిలో నాణ్యమైన వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ► వీటి ధర విదేశాల్లో కేజీ రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పలుకుతుంది. ► విదేశీ మార్కెట్‌కు చేరే వరకు బతికి ఉండేలా.. పీతలను గోనె సంచులు, ప్లాస్టిక్ బాక్సుల్లో పెడతారు. దీనివల్ల వాటికి గాలి తగిలి కనీసం వారం రోజుల వరకు బతికే ఉంటాయి. అమెరికా వయా చెన్నై.. కోల్‌కతా ► పెదవలసల పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యే పీతలను కాకినాడ ప్రాంత కొనుగోలుదారులు రైళ్లలో చెన్నై, కోల్‌కతా నగరాలకు తరలిస్తారు. ► అక్కడ నుంచి విమానంలో అమెరికా, చైనా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ► కరోనా కారణంగా ప్రస్తుతం విదేశీ ఎగుమతులకు బ్రేక్ పడటంతో ఒడిశా,కర్ణాటక మార్కెట్లకు తరలిస్తున్నారు. నల్ల జిగురు మట్టి వల్లే ఆ రుచి సముద్ర తీరంలో పీతలను వేటాడే ప్రాంతాలు ఇసుక, బొండు ఇసుకతో ఉంటాయి. పెదవలసల మడ అడవుల్లో మాత్రమే సముద్రం మొగ వద్ద నల్ల జిగురు మట్టి ఉంటుంది. అందుకే ఇక్కడి పీతలకు అంత రుచి ఉంటుంది. – పోతాబత్తుల నూకరాజు, పీతల వ్యాపారి, పెదవలసల పీతల్లో ఔషధ గుణాలు ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతులు పెరిగే కోరంగి అభయారణ్యం పరిసరాల్లోని పీతలు రుచిగా ఉంటాయి. పీతలు తినడం వల్ల శరీరానికి రాగి, పాస్ఫరస్ రక్తం బాగా పడుతుంది. శరీరంలో ఎముక గట్టిపడటానికి దోహదపడుతుంది. ఒమేగా–3 ఉండటంతో గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.పెద్ద వయసులో అల్జీమర్స్ (మతిమరుపు) లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. అందుకే విదేశీయులు ఇక్కడి పీతలను అమితంగా ఇష్టపడుతున్నారు. – సీహెచ్ గోపాలకృష్ణ, మత్స్యశాఖ అధికారి, అమలాపురం మూడు తరాలుగా ఇదే వృత్తి మూడు తరాలుగా మేమంతా పీతలను నమ్ముకునే బతుకుతున్నాం. తెల్లారిగట్లే మడ అడవుల్లోకి వెళ్లి మధ్యాహ్నం తిరిగొస్తాం. మిట్టమధ్యాహ్నం వరకూ కట్టపడితే ఆరేడు వందలు వత్తాయి. ఒక్కోసారి గుడ్డు పీత కేజీ, కేజీన్నరది కూడా పడతాది. – చక్కా సత్యనారాయణ, పెదవలసల పెద్దవి దొరికితే పండగే.. 30 ఏళ్ల నుంచి పీతలు కొని అమ్ముతున్నా. గుడ్డు పీత, పసుపు పీత కేజీ నుంచి కేజీన్నర సైజు ఉంటే విదేశీయులు తింటారు. అందుకే ఎక్కువ రేటుకు కొంటారు. అలాంటిది ఒక్కటి దొరికినా ఆ రోజు పండగే. – కామాడి రాఘవ, పెదవలసల -
మత్స్య శాఖలో అవినీతి తిమింగలం
ఒకటి కాదు... రెండు కాదు... సబ్సిడీల రూపంలో గంగపుత్రులకు అందాల్సిన సుమారు కోటి రూపాయలను అన్నీ తానై మింగేశాడు... ఒకరు కాదు ఇద్దరు కాదు... సుమారు వందమంది వరకు సాగర మత్స్యకారులకు సంఘంలో దశాబ్దకాలంపాటు సభ్వత్వాలు దక్కకుండా చేసేశాడు... టీడీపీ ముఖ్యనేతల అండదండలతో ఆనాడు అక్రమాలు కొనసాగించాడు.. ఇప్పుడు బండారం బయటపడడంతో దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు... జిల్లా మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మైలపల్లి నరసింగరావు అవినీతి బాగోతమిది.. టీడీపీ నేతల అండదండలతో గంగపుత్రుల ఆశలతో ఆటలాడుకున్నాడు. ఏళ్ల తరబడి అక్రమాలకు పాల్పడిన ఈయనకు.. మత్స్యశాఖలో ఓ కీలక అధికారి ప్రోత్సాహం, సహకారం అందజేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో ఈయన గారి వ్యవహారంపై కూడా నేరుగా జిల్లా కలెక్టర్ నివాస్‌కే ఫిర్యాదులు అందాయి. మైలపల్లి అక్రమాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏపీపీఎస్ 1964 చట్టం ప్రకారం ‘51 విచారణ’కు ఆదేశించారు. అయితే ఈ విచారణ నివేదికను కూడా బుట్టదాఖలు చేసేలా కొందరు మత్స్యశాఖ అధికారులు పావులు కదుపుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అరసవల్లి: శ్రీకాకుళం రూరల్ మండలం గణగళ్లపేట సమీపంలో నరసయ్యపేట మత్స్యకార సొసైటీ అధ్యక్షునిగా (ఎంఎఫ్‌సీఎస్) తెరమీద కొచ్చిన మైలపల్లి నరసింగరావు... రాజకీయ పలుకుబడితో జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షునిగా (డీఎఫ్‌సీఎస్) ఎన్నికై ఓ వెలుగు వెలిగారు. తెలుగుదేశం పారీ్టకి అనుబంధ సభ్యుడిగా పనిచే స్తూ... స్థానిక నియోజకవర్గ నేతల అండదండలతో మత్స్యశాఖలో కీలకంగా వ్యవహారాలు నడిపారు. సాగర మత్స్యకార సంఘంలో పేరు నమోదు కావాలంటే ఓ రేటు.. వారికి సబ్సిడీ దక్కాలంటే మరో రేటు ఫిక్స్ చేసి అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలున్నాయి. అలాగే సబ్సిడీపై మత్స్యకారులకు ఇచ్చే లక్షలాది రూపాయల డీప్ సీ వలలు, ఇంజిన్ బోట్లు, మోటార్లు, నాలుగు చక్రాల రవాణా వాహనాలు.. ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ రాయితీ పథకాల్లోనూ తనదైన శైలిలో అక్రమాలు చేస్తూ అర్హులకు ఒక్క పథకం కూడా అందకుండా రాజకీయం నెరిపారు. బ్లాక్ మార్కెట్లో ప్రభుత్వ పథకాలు మత్స్యకార సొసైటీలో సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాల్లో రాయితీలకు అవకాశముంటుంది. తమకు అనుకూలంగా ఉండేవారికి మాత్రమే సభ్వత్వాలను ఇస్తూ.. వారి పేర్ల మీద వచ్చిన పథకాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించేలా నరసింగరావు అక్రమాలకు తెగబడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రతి ఏడాది సుమారు నాలుగు వేలమంది వరకు పలు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఉండేవారు. అన్నీ తప్పుడు పేర్లు, తప్పుడు అడ్రస్‌లతో పథకాలను పక్కదారి పట్టించారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం తరపున పంపిణీ చేస్తున్న డీప్ సీ వల ఒక్కటి సుమారు రూ.1.75 లక్షలు, ఇంజిన్ ధర రూ.70 వేలు, 75 శాతం సబ్సిడీతో ఫోర్ వీలర్ యూనిట్ ధర రూ.8 లక్షలు, మోటరైజ్డ్ బోటు రూ.5 లక్షలు, నాటు బోటు రూ. 60 వేలు... వీటిని పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయించారని తోటి మత్స్యకారులే అంటున్నారు. ఇలాంటి అక్రమాలతో పాటు సంఘంలో సభ్యత్వం కల్పించకుండా నిజమైన అర్హులను తొక్కిపెడుతున్నారంటూ నరసయ్యపేట, రాజారాంపురం వంటి గ్రామాల నుంచి మత్స్యకారులు జిల్లా కలెక్టర్‌కు ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఆఖరికి జిల్లా రెడ్ క్రాస్ తరపున ఇచ్చిన ఐస్ బాక్స్‌లను కూడా బ్లాక్ మార్కెట్లో పలు మండలాలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. గణగళ్లపేటకు చెందిన కొమర గురుమూర్తి అనే బాధితుడు జిల్లా కలెక్టర్ నివాస్‌కు గతేడాది జూన్‌లో స్పందనలో ఫిర్యాదు చేశారు. దీని ప్రభావంతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 51 విచారణకు ఇన్చార్జ్ జాయింట్ డైరక్టర్ వి.వి.కృష్ణమూర్తి ఆదేశాలను జారీ చేశారు. విచారణను అడ్డుకుంటున్నారా....!..? మైలపల్లి నరసింగరావు అక్రమాలపై 51 విచారణ చేసేందుకు గతేడాది ఆగస్టులోనే ఎఫ్‌డీవో డి.గోపికృష్ణను విచారణాధికారిగా నియమించారు. ఈ విచారణ పూర్తయి... నరసింగరావు అక్రమాలన్నీ నిజమే అని నిర్ధారణ అయినప్పటికీ మత్స్యశాఖకు చెందిన కొందరు అధికారులు నివేదికను తొక్కిపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి కీలక వ్యవహారం తమ హయాంలో బయటకు వస్తే తలనొప్పులనే భావనలో కీలక అధికారులు వ్యవహారం నడుపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విచారణ ఫైలు ఊసెత్తకపోతే మంచిదనేలా ఓ వర్గం అధికారులు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇలాంటి 51 విచారణను కేవలం మూడు నెలల గరిష్ట కాలంలో పూర్తి చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది. అయితే నరసింగరావు విషయంలో మాత్రం ఓ ఉన్నతాధికారి అభయ హస్తం అందిస్తుండడంతో విచారణ ఫైల్‌ను తొక్కిపెట్టేలా వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీనిపై జిల్లా కలెక్టర్ నివాస్ స్పందించి తగు విధంగా చర్యలు చేపడితే తమ సమస్యలు పరిష్కారమవుతాయని, అర్హులందరికీ సభ్యత్వాలు నమోదై ప్రభుత్వ పథకాలన్నీ అందుతాయని మత్స్యకారులు కోరుతున్నారు. విచారణ పూర్తి చేశాం మైలపల్లి నరసింగరావుపై వచ్చిన వివిధ రకాల ఆరోపణలపై జేడీ ఆదేశాల మేరకు 51 ఎంక్వైరీ చేపట్టాను. దాదాపుగా ఆరోపణలన్నింటిపై బహిరంగ విచారణ చేశాం. నరసింగరావుతోపాటు బాధితులతో కూడా మాట్లాడి రికార్డు చేశాం. నివేదికను కొద్ది నెలల క్రితమే ఉన్నతాధికారులకు అందజేశాను. – డి.గోపికృష్ణ, విచారణాధికారి అక్రమాలపై ఫిర్యాదు చేశాం 12 ఏళ్లుగా సముద్రంలో వేటకు వెళ్తున్నాం. అయినప్పటికీ మాలో చాలామందికి ఎంఎఫ్సీఎస్లో సభ్యత్వం లేదు. మైలపల్లి నరసింగరావు ఉద్దేశపూర్వకంగా మాకు సభ్యత్వాలు ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. గతంలో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. – కొమర గురుమూర్తి, గణగళ్లపేట, శ్రీకాకుళం రూరల్ నిజాలని తేలితే క్రిమినల్ చర్యలే... మైలపల్లి నరసింగరావుపై ఆరోపణలపై విచారణకు ఆదేశించాం. ఇంకా విచారణ రిపోర్టు రాలేదు. ఆరోపణలు నిర్ధారణ అయితే క్రిమినల్ చర్యలు చేపడతాం. విచారణ అధికారి నుంచి అసిస్టెంట్ డైరక్టర్‌కు.. అక్కడ నుంచి నాకు ఈ ఫైలు చేరాల్సి ఉంది. విచారణ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు. – వి.వి.కృష్ణమూర్తి, మత్స్యశాఖ ఇన్చార్జ్ జేడీ అక్రమార్కులకు శిక్ష పడాల్సిందే.. గతంలో సొసైటీ పేరు చెప్పుకుని లక్షలాది రూపాయలు అక్రమంగా దోచేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నాడు జరిగిన అక్రమాలతో వందలాదిమందికి సంఘంలో సభ్యత్వం రాలేదు. పథకాలన్నీ పక్కదారి పట్టాయి. గత అక్రమాలపై చర్యలు చేపడితే అర్హులకు న్యాయం జరుగుతుంది. – కోనాడ నరసింగరావు, డీఎఫ్‌సీఎస్ అధ్యక్షుడు -
బోటుండేది ఒకరి పేరున.. వేటాడేది మరొకరు
పిఠాపురం: బోటుండేది ఒకరి పేరున.. వేటాడేది మరొకరు.. ప్రభుత్వ పథకం మాత్రం వేటాడే వారికి కాకుండా బోటున్న వారికే చెందుతుండడంతో నిజంగా వేటాడి జీవనం సాగించే సగటు మత్స్యకారులు నష్టపోతున్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందజేసే డీజిల్ సబ్సిడీ, వేట నిషేధ పరిహారం, బోట్ల సబ్సిడీ, ఇతర వేటాడే పరికరాల సబ్సిడీలను బోటు రిజిస్ట్రేషన్ ఆధారంగానే లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే కొందరు అనర్హులకు ఈ పథకాలు అందుతున్నట్టు అధికారులు గుర్తించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరూ నష్టపోకూడదన్న దృఢసంకల్పంతో బోటు ఉన్న నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మత్స్యశాఖాధికారులు జిల్లాలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అధికారికంగా వెయ్యిబోట్లు పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 1000 బోట్లు అధికారికంగా మత్స్యశాఖలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాటిలో ఎంత మంది అర్హులైన యజమానులు ఉన్నారనే విషయంపై మత్స్యశాఖ సిబ్బంది ఇటీవల తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో రెండు పర్యాయాలు తనిఖీ నిర్వహించారు. ప్రతి బోటును క్షుణ్ణంగా తనిఖీ చేసి అన్ని వివరాలు సేకరించారు. పేరు మార్చుకోపోవడం వల్లే.. ప్రభుత్వం అందజేసే పథకాలను కొందరు నకిలీ యజమానులు తమ సొంతం చేసుకుంటున్నారు. ఒకసారి బోటు తయారు చేయించుకున్న యజమానులు తర్వాత కొంతకాలానికి దానిని అమ్మేస్తున్నారు. ఆ బోటును ఇతర మత్స్యకారులు ఉపయోగించుకుంటూ వేట సాగిస్తుంటారు. కానీ పాత యజమాని పేరుమీదే ఆ బోటు రిజిస్టర్ అయ్యి ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల లబ్ధి పాత యజమానికే దక్కుతోంది. నిజంగా బోటుపై వేట సాగించే మత్స్యకారులకు అందడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ నకిలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అర్హులు నష్టపోతున్న విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అవగాహనా లోపం వల్లే ఇలా జరుగుతుందన్న విషయంపై అధికారులను అప్రమత్తం చేయడంతో పేరు మార్పుపై మత్స్యకారుల్లో అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. నకిలీల వేటలో అధికారులు ప్రభుత్వ ఆదేశాలతో అసలైన బోటు యజమానులను గుర్తించే పనిలో మత్స్యశాఖాధికారులు నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సుమారు 20 మంది మత్స్యశాఖ సిబ్బంది తనిఖీ చేపట్టారు. ఐదు బృందాలుగా ఏర్పడి ఉప్పాడ, కోనపాపపేట, అమీనాబాద తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రతి ల్యాండింగ్ ప్రదేశంలోను ఒక్కో అధికారి 20 బోట్ల చొప్పున తనిఖీ చేశారు. ప్రతి బోటుకు సంబంధించిన వివరాలు రెండు సీట్లపై తీసుకున్నారు. బోటు యజమాని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, యజమాని బోటు రిజిస్ట్రేషన్ నంబర్, లైసెన్స్ వివరాలు సేకరించారు. యజమానిని బోటు వద్ద ఉంచి ఫొటోలు తీసుకుని వివరాలు నమోదు చేశారు. ఇప్పటి వరకూ రెండు దఫాలు ఈ సర్వే నిర్వహించారు. ఇప్పటికీ ఎవరైనా బోటు యజమానులు తమ వివరాలు నమోదు చేసుకోలేకపోతే మత్స్యశాఖాధికారులను సంప్రదించాలి. అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకే.. ఎవరైనా బోటు కొనుగోలు చేస్తే వెంటనే పాత యజమాని పేరున ఉన్న బోటును తమ పేరుపై మార్చుకోవాలి. అలా కాకపోతే అర్హత లేనట్టుగా పరిగణిస్తాం. నేమ్ ట్రాన్స్‌ఫర్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందరూ తమ బోట్లకు తమ పేరున రిజిస్ట్రేషన్ మార్చుకోవాలి. బోటు ఉండి అర్హత ఉన్న వారిని మాత్రమే గుర్తిస్తాం. బోటు ఒకరి పేరున ఉండి మరొకరు దానిని ఉపయోగిస్తుంటే నకిలీగా గుర్తిస్తాం. ప్రతి బోటు యజమాని తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, బోటు రిజిస్ట్రేషన్ నంబర్, లైసెన్స్ వివరాలు అందజేయాలి. అర్హులైన మత్స్యకారులందరికీ లబ్ధి చేకూర్చాలనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. – పి.జయరావు, మత్స్యశాఖ జేడీ, కాకినాడ -
ఆక్వా ఉత్పత్తులకు ముందే ధరల నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఆ ఉత్పత్తులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుగానే కొనుగోలు ధరలను నిర్ణయించారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. వీటి ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వీటి ధరలను ప్రకటించారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్ణయం తీసుకోలేదని, ఇదే మొదటిసారని వెల్లడించారు. ఆక్వా, పౌల్ట్రీ, పాడి రంగాలపై తీసుకున్న నిర్ణయాలను శనివారం సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు. సమీక్షలో వ్యవసాయశాఖ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ సోమశేఖర్, ఎంపెడా జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మోపిదేవి తెలిపిన వివరాలివీ.. - ఈనెల 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. - కరోనా వైరస్ కారణంగా ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. - రాష్ట్రంలోని మొత్తం ఆక్వా ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. - రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని కలిగిస్తున్న ఈ రంగ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నాం. - ఎగుమతులకు ఆటంకం కలగకుండా చూస్తాం. ఐదారు రోజులుగా ఆక్వా రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో సమీక్షిస్తున్నాం. - కరోనాతో సంబంధం లేకుండా ఆక్వా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకు వచ్చిన ఎగుమతిదారులను సీఎం అభినందించారు. - కరోనా పేరు చెప్పి దళారులు రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం. వీరిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఎంపెడాకు అప్పగిస్తున్నాం. - ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు సంబంధించిన ఎక్స్‌పోర్టు ఇన్స్పెక్షన్ అథారిటీ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ అందించే ఏర్పాటు చేస్తున్నాం. - మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌ను ప్రతీ జిల్లాకు నోడల్ అధికారిగా నియమించాం. - విదేశాల నుంచి మేత తయారీకి సంబంధించిన ముడిపదార్థాల దిగుమతికి వీరు సహకరిస్తారు. - చికెన్, గుడ్లు మార్కెట్ల్లో అమ్ముకోడానికి రవాణాకు అన్ని చర్యలు తీసుకున్నాం. - సీఎం సహాయ నిధికి పౌల్ట్రీ రంగం రూ.60 లక్షలు అందజేసింది. -
చేప సూపర్!
కవాడిగూడ: దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్ మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఇందులో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ, తెలంగాణ మత్స్య సహకార సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఫిష్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్‌ను మంత్రి ప్రారంభించి, చేపల వంటకాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గంగపుత్ర, బెస్త, ముదిరాజ్‌ల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నగర ప్రజలకు చేపలు అందుబాటులో ఉండేందుకు, మత్స్యకారుల ఉపాధి కోసం త్వరలో ఔట్లెట్లను ప్రారంభిస్తామన్నారు. బేగంబజార్, రాంనగర్ చేపల మార్కెట్‌వాసులు అంగీకరిస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో పెద్ద మార్కెట్‌ను కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎన్ఎఫ్డీబీ జనార్థన్, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
36 ఏళ్ల వివాదం.. ఏపీ ప్రభుత్వం చొరవతో చర్చలు
నడి సంద్రంలో సినిమాటిక్‌ను తలపించేలా ఫైట్లు.. మారణాయుధాలతో.. పెద్ద బోట్లతో దాడులు.. ఆస్తుల ధ్వంసం.. మత్స్య సంపదను కొల్లగొట్టడం.. ఇది దశాబ్దాలుగా తమిళ జాలర్లు ఆంధ్రా మత్స్యకారులపై సాగిస్తున్న యుద్ధకాండ.. కొన్ని సందర్భాల్లో మన జాలర్లు వారిని ఎదుర్కొని నిర్బంధించి పోలీసులకు అప్పగించడం.. సాగరంలో సమరం నిత్యకృత్యంగా మారింది. మత్స్య సంపద కోసం వేటకు వెళ్లేందుకు సైతం భయపడే పరిస్థితి. సంద్రంలో సరిహద్దు వివాదానికి ముగింపు పలకడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ముందడుగేస్తోంది. 13 ఏళ్ల క్రితం అసంపూర్తిగా మిగిలిన చర్చలను మళ్లీ మొదలుపెట్టి సమస్య పరిష్కారం కోసం కార్యాచరణను సిద్ధం చేసింది. పులికాట్ సరస్సులో ఆంధ్రా– తమిళనాడు రాష్ట్రాల మధ్య 1983 నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాద పరిష్కారానికి తమిళనాడు ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న భేటీ కానుంది. చెన్నై సైదాపేటలోని పనగల్ బిల్డింగ్‌లోని ఫిషరీస్ కమిషనరేట్ సమావేశానికి వేదిక కానుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం తీరంలో చిక్కుకున్న తమిళ స్టీల్బోటు సాక్షి, నెల్లూరు: జిల్లాలో 169 కిలో మీటర్ల మేర సముద్రం విస్తరించి ఉంది. 12 మండలాల్లోని 118 గ్రామాల్లో దాదాపు 59 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 45 వేల మంది పూర్తిగా చేపల వేటనే ప్రధానంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. తమిళనాడు జాలర్లతో వివాదాలు, దాడుల ఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. పులికాట్ సరస్సు ఆంధ్రా–తవిుళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 620 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన సరస్సు ఆంధ్రాలో 480 చదరపు కిలో మీటర్లు, తమిళనాడు పరిధిలో 140 చదరపు కిలో మీటర్ల మేర ఉంది. పులికాట్ సరస్సులో చేపల వేటను ఆధారంగా చేసుకుని అనేక కుప్పాల్లో జాలర్లు ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలోని పులికాట్‌కు పూడిక తీత తీయకపోవడంతో ముఖ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయి వేసవిలో నీరు ఉండని పరిస్థితి. ఇదే సమయంలో ఏటా క్రమం తప్పకుండా తమిళనాడు వైపు ఉన్న పులికాట్లో ఆ రాష్ట్రం పూడిక తీయడం వల్ల 365 రోజులు నీరు ప్రవాహం ఉండడంతో చేపల వేట కొనసాగే పరిస్థితి ఉంది. తమిళ జాలర్ల దాడిలో దెబ్బతిన్న వలను చూపుతున్న కొండూరుపాళెం మత్స్యకారుడు ఇవీ వివాదాలు 1983 నుంచి పులికాట్ సరస్సులో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఆంధ్రా పరిధిలోని ఇరకం దీవికి సమీపంలో ఉన్న కురివితెట్టు, తెట్టు పేట ప్రాంతాల తమదనేది తమిళనాడు వాదన. అయితే ఆ ప్రాంతం పూర్తిగా భౌగోళికంగా ఆంధ్రాలో సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోనే ఉంది. 1985లో ఆంధ్రా జాలర్ల సంఘం పులికాట్లో సర్వే నిర్వహించేందుకు వీలుగా రూ.లక్ష ప్రభుత్వానికి చెల్లించారు. అయితే తమిళనాడు ప్రభుత్వం సహకరించకపోవడంతో అది పూర్తిగా జరగలేదు. ఈ క్రమంలో తమిళనాడు జాలర్లు సముద్రంలో తాటిచెట్లు నాటి సరిహద్దును వారికి వారే ఏర్పాటు చేసుకున్నారు. ఏటా మార్చిలో పులికాట్లో ఉత్తరం వైపు నీరు పూర్తిగా తగ్గిపోయి దక్షిణం వైపు ఉన్న కురివితెట్టు, తెట్టుపేటలో బాగా నిలిచి ఉంటుంది. సముద్రం నుంచి వచ్చేది కావడంతో పాటు ఇక్కడ నీరు బాగా చల్లగా ఉండటంతో చేపలు ఎక్కువగా దొరికే పరిస్థితి. దీంతో ఏటా మార్చి నుంచి జూన్ వరకు తమిళనాడు జాలర్లు ఈ ప్రాంతంలోకి వచ్చి మన జాలర్ల పడవలు తగులబెట్టడం, దాడులు చేయడం పరిపాటిగా మారింది. తమిళనాడులోని పులికాట్ పరిధిలోని చినకనమాంగాడు కుప్పం, పెద్ద మాంగాడు కుప్పం, కీరపాకపొదు కుప్పం, మెదుకుప్పం, సునానంబుభోళం, తదితర కుప్పాలకు చెందిన జాలర్లు మన వైపు ఉన్న కురివితెట్టు, తెట్టుపేటకు వచ్చి చేపలు పట్టుకుంటారు. అడ్డుకోవడానికి యత్నించే జాలర్లపై భౌతిక దాడులకు దిగుతుంటారు. జిల్లాలో సుమారు 5 వేల వరకు లైసెన్స్ బోట్లు ఉన్నాయి. రాష్ట్ర మత్స్యకారులవి 10, 30 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్ బోట్లు కాగా, తమిళనాడు మత్స్యకారులవి హైస్పీడ్ బోట్లు. ఈ క్రమంలో తరచూ మన మత్స్యకారులపై దాడి చేసి బోటు ధ్వంసం చేసి మత్స్యసంపదను తమిళనాడు బోట్ల ద్వారా అక్కడి జాలర్లు కొల్లగొడుతున్నారు. గతంలో ఇక్కడి జాలర్లపై దాడి చేసి, 30 పడవలు, 200 వలలను సముద్రంలో తగులబెట్టారు. బాట కుప్పం గ్రామంపై రాత్రి వేళ విరుచుకుపడి జాలర్ల ఇళ్లు తగులబెట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. 13 ఏళ్ల తర్వాత తొలి అడుగు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 13 ఏళ్ల క్రితం అప్పటి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారుల బృందం, తమిళనాడు మత్స్య శాఖ మంత్రి, అధికారుల బృందం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నంలో మూడు సార్లు సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. అనంతరం ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా విస్మరించడంతో సమస్య అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఈ సమస్యపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శాసనసభలో ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య ప్రభుత్వానికి విన్నవించడంతో మళ్లీ చర్చల దిశగా అడుగులు పడ్డాయి. కలెక్టర్ శేషగిరిబాబు, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు చర్చల దిశగా కసరత్తు చేయటంతో ఈ నెల 18న చెన్నైలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమయ్యాయి. తమిళనాడు జాలర్లు చేస్తున్న దాడులు, సరిహద్దు వివాద పరిష్కారమే లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. -
ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదు
సాక్షి, అమరావతి: ‘‘పాక్ జైలుకెళ్లాక మా ఊరికి ప్రాణాలతో వెళతామన్న ఆశ లేకపోయింది. మా బతుకులు ఇక్కడే తెల్లారుతాయనుకున్నాం. మాచేత ఇష్టానుసారం పనులు చేయించేవాళ్లు. అన్నం సరిగ్గా ఉండేది కాదు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలసి గోడు చెప్పుకున్నామని, తప్పక విడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారని మావాళ్లు వర్తమానం పంపారు. జగన్ అధికారంలోకి వచ్చారన్న విషయం తెలిసి సంతోషించాం. విడిపించడమే కాదు, ప్రతి జాలరికి రూ.2 లక్షలిస్తామని కూడా ఆయన చెప్పారని విన్నాం. అన్నట్లుగా జగన్ మమ్మల్ని విడిపించడమేగాక ఊహించిన దానికంటే ఎక్కువగా రూ.5 లక్షలు సాయం చేశారు. ఈ డబ్బుతో ఏదైనా పని చేసుకుని బతుకుతాం. ఈ జీవితం ఆయనదే..’’ అంటూ పాక్ చెర నుంచి విడుదలైన నక్కా అప్పన్న కన్నీటి పర్యంతమయ్యాడు. హుద్‌హుద్ పెను తుపానుతో సర్వం కోల్పోవడంతో బతుకుతెరువుకోసం ముక్కుపచ్చలారని కొడుకు ధన్‌రాజ్(14)తో కలసి గుజరాత్లో చేపల వేటకు వెళ్లిన విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అప్పన్న పొరపాటున పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడంతో పాక్ నావికాదళ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. ఫలితంగా ఇతర మత్స్యకారులతోపాటు పాకిస్థాన్ జైలులో 14 నెలలపాటు దుర్భర జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఎట్టకేలకు జగన్ సర్కారు చొరవతో ఇతర మత్స్యకారులతోపాటు పాక్ చెర నుంచి బయటపడిన వారిద్దరూ బుధవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. అనంతరం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము పడిన ఇక్కట్లను వివరించారు. హుద్‌హుద్ తుపాను వల్ల రూ.8 లక్షల విలువచేసే ఆస్తి మొత్తం కొట్టుకుపోగా రూ.1.5 లక్షల అప్పు మిగిలిందని, సాయం కోసం అప్పటి ప్రభుత్వం వైపు ఆశగా చూస్తే విదిల్చింది రూ.20 వేలేనని, దీంతో బతుకుతెరువు కోసం గుజరాత్ బోట్లల్లో చేపలు పట్టేందుకు తండ్రీకొడుకులు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. ఇంట్లో పరిస్థితి బాగోలేక.. డబ్బుల్లేక.. అమ్మానాన్న పడుతున్న బాధ చూడలేక అయ్యకు తోడుగా తాను కూడా వెళ్లాల్సి వచ్చిందని ధన్‌రాజ్ చెప్పాడు. ఎట్టకేలకు జగన్ సర్కారు చొరవతో తాము విడుదలయ్యామని వారు ఆనందం వెలిబుచ్చారు. ఈ జీవితం జగన్ భిక్షే: ‘‘జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఈరోజు మళ్లీ బతికి వచ్చామంటే ఆయన పెట్టిన భిక్షే. కొత్త జీవితం ప్రసాదించడమే కాదు, బతకడానికి ఆర్థిక సాయమూ చేశారు. జీవితాంతం రుణపడి ఉంటాం’’ అని పాక్ చెర నుంచి విముక్తుడైన శ్రీకాకుళంకు చెందిన మరో జాలరి దూడంగి సూర్యనారాయణ అన్నారు. మా కుటుంబాల్లో వెలుగులు నింపారు.. పులి నోట్లోకి వెళ్లి తిరిగొచ్చిన మా 20 మంది జాలర్లది పునర్జన్మే. సీఎం వైఎస్ జగన్ రుణం జన్మజన్మలకు తీర్చుకోలేం. పాక్‌లో ఎన్నో బాధలు పడ్డాం. పాదయాత్ర సందర్భంగా నా భార్య సురాడ ముగతమ్మ వైఎస్ జగన్‌ను కలసి గోడు వెళ్లబోసుకుంది. జగనన్న ఆరోజు మాట ఇచ్చారు. నిలబెట్టుకుని మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. – సురాడ అప్పారావు, జాలరి, ఎచ్చెర్ల దేవుడు జగన్ రూపంలో కాపాడాడు.. పాక్ జైల్లో ఆహారం తినలేక పోయేవాళ్లం. ఉదయం టీ, రెండు రొట్టెలిచ్చి పనిలోకి పంపేవారు. మధ్యాహ్నం రెండు రొట్టెలు నీళ్ల సాంబారు.. తినలేక పస్తులుండేవారం. ఎప్పుడు ఇంటికి చేరుస్తావ్ దేవుడా అని రోజూ ప్రార్థన చేసేవారం. దేవుడు సీఎం వైఎస్ జగన్ రూపంలో కాపాడాడు. ఆయన లేకుంటే మేమే లేం. మేం లేకుంటే మా కుటుంబాలు ఉండేవి కావు. – బాడి అప్పన్న, బడివానిపేట జైల్లోనే చనిపోతామనుకున్నా.. పాక్ ప్రభుత్వం వదలదు. మా జీవితాలు ఇక్కడే ముగుస్తాయి. ఇక ఇండియాను, సొంత ఊరిని, కన్నవారిని చూడలేం అనుకున్నాం. 14 నెలలు నరకం చూశాం. పనులకు వెళ్లకపోతే కొట్టేవారు. జబ్బు చేస్తే సరైన మందులిచ్చేవారు కాదు. మా ఇంట్లో దేవుని స్థానంలో సీఎం వైఎస్ జగన్ ఫొటో పెట్టుకొంటా. – కేశం ఎర్రయ్య, డిమత్స్యలేశం గ్రామం, శ్రీకాకుళం జిల్లా చావు దగ్గరకు వెళ్లి వెనక్కు వచ్చా.. చావు దగ్గరకు వెళ్లి వెనక్కు వచ్చాను. 2018 నవంబర్ 27న ఉదయం 7.30 గంటలకు పాకిస్తాన్ వారికి చిక్కాం. ఒక రోజంతా నీటిలోనే ఉంచారు. రాత్రి ప్రయాణం చేశాం. 28న పోలీసు కస్టడీకి అప్పగించారు. 29న ఉదయం 10.30కి జైలుకు తరలించారు. మేమంతా ఏడుపులు, పెడబొబ్బలు పెట్టుకున్నాం. మాకు ప్రాణం పోసింది జగనన్నే. – కొండా వెంకటేశ్, బడివానిపేట, శ్రీకాకుళం జిల్లా జగన్ గెలవాలని ప్రార్థించా.. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన చూశాం. ఆయన కుమారుడు వైఎస్ జగన్ పార్టీ గెలిస్తే మాకు పునర్జన్మతోపాటు జీవితాల్లో వెలుగులు వస్తాయనుకున్నాం. అనుకున్నట్లే జరిగింది. 14 నెలల కష్టాలు సీఎం జగన్‌ను చూడగానే మటుమాయమయ్యాయి. ఎవ్వరెన్ని చెప్పినా, ఏమన్నా జగన్ పార్టీకి జీవితాంతం సేవ చేస్తా. ఆయన రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా. – గంగాళ్ల రామారావు, ఎచ్చెర్ల జగన్ గెలిచారనగానే నమ్మకం కల్గింది సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిచారనగానే నమ్మకం కల్గింది. అది నిజమైంది. మమ్మల్ని జగనన్న ఎప్పుడు విడిపిస్తారా అని చూశా. ప్రార్థన ఫలించి వచ్చి జగనన్న ఎదురుగా నిలబడ్డా. రూ.5 లక్షలు పారితోషికం ఇవ్వటం ఎంతో సంతోషాన్నిచ్చింది. మా విడుదలకు కృషి చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. – వాసుపల్లి శామ్యూల్, ఎచ్చెర్ల -
సముద్రంలో చేపల వేట ప్రోత్సాహానికి ఆర్థిక సాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నీలి విప్లవం పథకం కింద సముద్ర జలాల్లో చేపల వేటను ప్రోత్సహించడానికి పలు విధాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మత్స్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సాంప్రదాయిక చేపల పడవలను ఆధునీకరించుకోవడానికి, మత్స్యకారులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ చేయడానికి, ఫైబర్ గ్లాస్ ప్లాస్టిక్ బోట్లు, ఇన్సులేటెడ్ ఐస్ బాక్స్‌లు సమకూర్చుకోవడానికి, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టడానికి, మత్స్యకారులు సముద్ర జలాల్లో సుదూరంగా వేటను కొనసాగించడానికి ట్రాలర్లను లాంగ్‌లైనర్స్ కింద మార్చుకోవడం వంటి కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తీర ప్రాంత భద్రతను పటిష్టపరచేందుకు ఏర్పాటైన జాతీయ కమిటీ సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షిస్తుందని చెప్పారు. కూలీల వేతన సవరణకు కొత్త ప్రాతిపదిక మహాత్మాగాంధీ నరేగాలో కూలీలకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు ఇచ్చేందుకుగాను.. వినియోగదారుల ధరల సూచి–రూరల్ ఆధారంగా వేతనాలను సవరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం వినియోగదారుల ధరల సూచి (వ్యవసాయ కార్మికులు)ని ప్రాతిపదికగా తీసుకుంటున్నామని, అయితే సంబంధిత కమిటీ చేసిన తాజా సిఫారసును ఆర్థిక శాఖ సహా ఇతర శాఖలు పరిశీలిస్తున్నాయని వివరించారు. 3 జిల్లాల్లోని 24 బ్లాక్‌లకు మహిళా శక్తి కేంద్ర నిధులు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా శక్తి కేంద్ర (ఎంఎస్కే) స్కీమ్ ద్వారా మహిళా సాధికారత కోసం ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లాల్లోని 24 బ్లాకులకు నిధులు విడుదల చేసినట్టు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో మంత్రి సమాధానం ఇచ్చారు. ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆయుష్ డిస్పెన్సరీలు, సబ్ హెల్త్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను నెలకొల్పనున్నట్లు కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద యశోనాయక్ లోక్‌సభకు తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, డాక్టర్ బి. వెంకటసత్యవతి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏపీ నుంచి ఈ తరహా ప్రతిపాదనలు 42 రాగా రూ. 3.87 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. మైనింగ్‌కు అనుమతి ఇవ్వలేదు నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో రేడియో ధార్మికత వెలువరించే ఎటువంటి మెటీరియల్ తవ్వకాలకూ అనుమతి ఇవ్వలేదని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఒకవేళ అనుమతి ఇస్తే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ భూములు నష్టపోయిన మేరకు పరిహారంగా అటవీయేతర భూములను, లేదా రెట్టింపు డీగ్రేడ్ అటవీ భూములను తీసుకుంటామని స్పష్టం చేశారు. పశుగ్రాసంగా వినియోగించండి దేశంలో పశుగ్రాసం, ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నందున వరి గడ్డిని పొలాల్లో కాల్చకుండా పశువులకు గ్రాసంగా, ఎరువుగా వినియోగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కేంద్రానికి సూచించారు. 193 నిబంధన కింద ‘వాయు కాలుష్యం’పై లోక్‌సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పంట వ్యర్థాల నిర్వహణ ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో పనిచేస్తున్న కాలుష్య నియంత్రణ మండళ్లు నామమాత్రంగా ఉన్నాయని, వాటి పనితీరు మెరుగుపరచాలని కోరారు. -
ఆర్ఏఎస్ పద్ధతి బాగుంది
బాలానగర్ (జడ్చర్ల): రీ–సైక్లింగ్ ఆక్వా సిస్టం (ఆర్ఏఎస్) బాగుందని మేఘాలయ మత్స్యశాఖ మంత్రి కురమన్ ఉరియా అన్నారు. సోమవారం బాలానగర్ మండలం గుండేడ్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు విశ్వనాథరాజు తక్కవ నీటితో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలను ఎలా పెంచాలనే దానిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, ఇదే పద్ధతిని గౌహతి వద్ద అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ, మేఘాలయ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఐతిమోలాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
చేపా.. చేపా ఎందుకురాలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జలకళ ఉట్టిపడుతోంది. జలాశయాలు, చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నా యి. ఇటువంటి పరిస్థితుల్లో చేప పిల్లలను జలాశయాల్లోకి విడుదల చేయడంలో మత్స్యశాఖ విఫలమైందన్న ఆరోపణలున్నాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారంటే నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. నీరు సమృద్ధిగా ఉన్న జలాశయా ల్లోనూ కేవలం లక్ష్యంలో 59.38 శాతం మాత్రమే చేప పిల్లలను వదలడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది 22,203 జలాశయాల్లో 82.28 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. 12,778 జలాశయాల్లోకి మాత్రమే నీరు వచ్చిందని, అందులో 55.60 లక్షల చేప పిల్లలు అవసరమని నిర్ధారించారు. ఆ ప్రకారం చూసినా ఇప్పటివరకు కేవలం 9,283 జలాశయాల్లో 33.02 కోట్ల చేప పిల్లలను మాత్రమే విడుదల చేసినట్లు మత్స్యశాఖ నివేదిక వెల్లడించింది. అంటే కేవలం 59.38 శాతం మాత్రమే విడుదల చేశారు. సూర్యాపేటలో 11.44 శాతమే.. ప్రభుత్వం మూడేళ్లుగా మత్స్యకార సొసైటీల ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని మొదలుపెట్టింది. 2016–17లో 27.85 కోట్ల చేప పిల్లలను, 2017–18లో 51 కోట్లు, 2018–19లో 49.15 కోట్ల చేప పిల్లలను వదిలిపెట్టింది. ఈసారి భారీ వర్షాలు కురిసినా లక్ష్యాన్ని చేరుకోవ డంలో అధికారులు తంటాలు పడుతున్నా రు. సూర్యాపేట జిల్లాలో 3.14 కోట్ల చేపపిల్లలను వదలాలని నిర్ణయించ గా, 36 లక్షల చేప పిల్లలను విడుదల చేయడంపై విమర్శలొచ్చాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 94.49 శాతం, ఖమ్మం జిల్లాలో 94.07%, వరంగల్ రూరల్ జిల్లాలో 93.66 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 89.14 శాతం, వరంగల్ అర్బన్ జిల్లాలో 88.99 శాతం చేప పిల్లలను వదిలారు. చాలా జలాశయాల్లో వరదల కారణంగా నీరు బయటకు పోవడంతో అప్పటికే వేసిన చేప పిల్లలు కూడా వెళ్లిపోయాయని సొసైటీల ప్రతినిధులు చెబుతున్నారు. -
ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మూడు మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మచిలీపట్నాన్ని మేజర్ పోర్టుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పశుసంవర్థక, మత్స్య శాఖలపై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణాలపై సీఎం అధికారులతో చర్చించారు. వీటి నిర్మాణాలను ప్రణాళికా బద్ధంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో దాదాపు 12 జెట్టీల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. గుజరాత్లో 25వేల తెలుగు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయని, వారంతా ఉపాధి లేక వలస వెళ్లారన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వేటకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొనడంతో.. ఆ దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. పనుల్లో పారదర్శకత ఉండేలా చూసుకోవాలని సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, మత్సశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ....‘ చేపలు, రొయ్యలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్, రైతులకు అవగాహన కల్పించడానికి వర్క్‌షాపుల ఏర్పాటు జనవరి నాటికి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. సీడ్, ఫీడ్‌ల్లో కచ్చితంగా నాణ్యత ఉండాలి. ఎక్కడా కూడా కల్తీ ఉండకూడదు. కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపండి. ఆక్వా ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సంబంధిత రంగానికి చెందిన వారిని ఉద్యోగులుగా తీసుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి, రైతులకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు. ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి.. ‘తూర్పు గోదావరి జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు గతంలో అనుమతి ఇచ్చారు. దీనివల్ల కాలుష్యం అంతా సముద్రంలోకి వెళ్తుంది. ఇదే ప్రాంతంగుండా నేను పాదయాత్ర చేశాను. ఒక ప్రాంతాన్ని పలానా జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ వేరే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, కలుషితం చేయడం కరెక్టు కాదు. ఈ అంశంపై పూర్తిగా అధ్యయనం చేసి... ఒక విధానాన్ని రూపొందించండి అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆక్వా పంట చేతికి వచ్చే సరికి రేటు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి..ఇది మనకు పెద్ద సవాలు.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. ఈ విషయంపై కూడా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి’ అని సూచించారు. ‘రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత మనదే. ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడంలేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, సహకారం తీసుకోండి. వారి బ్రాండును వినియోగించుకునేలా ప్రణాళికలు తీసుకురండి. మేనేజ్మెంట్లో ప్రతిభావంతుల సహకారం తీసుకోండి. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరుగుతాయి. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. జనవరిని రిక్రూట్మెంట్ నెలగా చేసుకోండి. ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి. వెటర్నరీ ఆస్పత్రులు, క్లినికులల్లో సదుపాయాలను కల్పించాలి. ఇందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను బాగా వినియోగించుకోండి’ అని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశువులకూ హెల్త్ కార్డులు.. సీఎం జగన్ మాట్లాడుతూ... పశువులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాల్సిన ఆవశ్యకవత ఉందన్నారు. దీనివల్ల క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘పశువుల పెంపకంలో సంప్రదాయ పద్ధతులకు పెద్దపీట వేయాలి. ఏ కార్యక్రమం చేపట్టినా వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలి. పశువుల మందుల కొనుగోలులో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలి. ఏపీకార్ల్‌కు నేరుగా నీటిని తెప్పించుకునేలా నీటిపారుదల శాఖతో మాట్లాడాలి. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని పేర్కొన్నారు. ఏపీ కార్ల్‌ను లక్ష్యాలకు అనుగుణంగా నడపాలని ఆదేశించారు. అదే విధంగా....పులివెందులలో ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికోసం బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కరువు పీడిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్య లేకుండా చేయడానికి స్థిరమైన, శాశ్వతమైన విధానాలు తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దాణా కొరత రాకుండా ఉత్తమ విధానాలు అనుసరించాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి పశువుల వైద్యంకోసం 102 వాహనాలు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. -
చేప విత్తనాలు.. కోటి
సాక్షి, రంగారెడ్డి: చెరువులు, కుంటల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలు వేసేందుకు జిల్లా మత్స్యశాఖ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ సారి కోటి విత్తనాలను చెరువుల్లో వదలాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ నిర్దేశించుకుంది. చేప పిల్లల కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకు తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. భారీ వర్షాలు కురిసి చేరువుల్లోకి నీరు చేరగానే చేప విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చేప విత్తనాలను వందశాతం సబ్సిడీపై ఇస్తున్నారు. జిల్లాలో 90 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా.. వీటి పరిధిలో 5వేల మంది మత్స్యకారులు నమోదయ్యారు. సగం నీళ్లుంటేనే.. జిల్లాలో ఇరిగేషన్ శాఖ పరిధిలో 116, పంచాయతీరాజ్ విభాగం పరిధిలోని 250 చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. వీటిలోకి నీరు చేరగానే మత్స్యశాఖ అధికారులు పరిశీలిస్తారు. చేప విత్తనాలు వదలడానికి.. చెరువుల్లో కనీసం 50 శాతం నీళ్లు ఉండాలి. ఇలా ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. సుదీర్ఘకాలం సరిపడా నీరు ఉంటేనే పిల్లలు ఎదుగుతాయి. ఇలా సాధ్యాసాధ్యాలను పరిశీలించి నీటి పరిమాణానికి అనుగుణంగా చేప విత్తనాలను వేస్తారు. ఏదేని చెరువులో విత్తనాలు వదలాలంటే స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యుల అనుమతి తప్పనిసరి. ఇందుకు సంబంధించిన తీర్మానం తీసుకున్నాకే అధికారులు విత్తనాలను నీటి వనరుల్లో వదులుతారు. రెండో వారంలో శ్రీకారం.. ఈనెల 15వ తేదీలోపు జిల్లాలో కొన్ని చెరువుల్లో విత్తనాలను వదిలేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం శంషాబాద్, కోకాపేట, మదీనాగూడ తదితర పది చెరువుల్లో నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత వీటిలో ముందుగా విత్తనాలను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈలోగా వర్షాలు భారీగా కురిస్తే మిగిలిన చెరువుల్లోనూ వదులుతారు. కైకలూరు నుంచి విత్తనాలు.. కొన్ని రోజుల క్రితమే విత్తనాల టెండర్ పూర్తికాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ టెండర్‌ను దక్కించుకున్నారు. విడతల వారీగా కోటి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను రూ.60 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. 35 నుంచి 40 మి.మీ పరిమాణం గల చేప విత్తనానికి 52.50 పైసలు చొప్పున, 80 నుంచి 100 మి.మీ ఉన్న విత్తనాన్ని ఒక రూపాయి 19 పైసలకు చొప్పున సరఫరా చేయనున్నారు. నాలుగు రకాల విత్తనాలు.. ఎప్పటిలాగే ఈసారి కూడా నాలుగు రకాల విత్తనాలను వేయనున్నారు. బొచ్చ, రవ్వ, బంగారుతీగ, మోసు రకాలను ఎంచుకున్నారు. నీటి వనరులను సీజనల్ చెరువులు, ఎల్లప్పుడు నీటి లభ్యత గల చెరువులుగా విభజిస్తారు. సీజనల్ చెరువుల్లో కనీసం ఆరు నెలలపాటు నీరు అందుబాటులో ఉండాలి. ఇటువంటి చెరువుల్లో బొచ్చ, రవ్వ, బంగారుతీగ విత్తనాలను 35:35:30 నిష్పత్తిలో వదులుతారు. వీటి సైజు 35 నుంచి 40 మిల్లీమీటర్లు ఉంటుంది. 9 నెలలపాటు నీటి లభ్యత ఉండే చెరువుల్లో బొచ్చ, రవ్వ, మోసు రకాల విత్తనాలను 40:50:10 నిష్పత్తిలో వేస్తారు. ఇవి 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు ఉంటాయి. వేసిన ఆరు నుంచి 8 నెలల్లోపు ఇవి ఎదుగుతాయి. సైజు.. చెరువును బట్టి చెరువు రకం, చేప విత్తనాలను బట్టి చెరువుల్లో వదిలే విత్తనాల పరిమాణంలో స్వల్ప తేడాలు ఉంటాయి. చెరువు విస్తీర్ణంలో 50 శాతం విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. సీజనల్ వారీగా నీరు లభ్యత ఉండే చెరువుల్లో ఎకరానికి తక్కువ సైజు ఉన్న 3వేల చేప విత్తనాలను వదులుతారు. ఎక్కువకాలం నీళ్లు నిల్వ ఉండే చెరువుల్లో 80 నుంచి 100 మి.మీ సైజు గల విత్తనాలను ఎకరానికి 2వేలు వేస్తారు. అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది జిల్లాకు అవసరమైన కోటి చేప విత్తనాలను సరఫరా చేసేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. టెండర్లు దక్కిన వారి నుంచి ఒకటి రెండు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోనున్నాం. చెరువుల్లోకి నీరు చేరగానే.. సానుకూలతను బట్టి విత్తనాలను వేస్తాం. విత్తనాలను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందజేస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు వచ్చి చేరితే.. మత్స్యకారులకు ఈ ఏడాది మంచి రోజులు వచ్చినట్లే. – సుకీర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారిణి -
అక్రమ చెరువుల దందా
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి) : జిల్లాలో తాగునీటి కాలుష్యానికి మూలకారణమైన రొయ్యల చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. అనుమతులు లేనిదే చెరువులు తవ్వితే కఠినచర్యలు తీసుకుంటామని రెవెన్యూ, మత్స్యశాఖాధికారులు హెచ్చరిస్తున్నా చెరువుల తవ్వకం ఆగకపోవడం వెనుక కొంతమంది అధికారుల మామూళ్ల వసూళ్లు, రాజకీయ నాయకుల ఒత్తిడే కారణంగా చెబుతున్నారు. జిల్లాలో గత ఏడాది కాలంగా చెరువుల తవ్వకానికి అనుమతులివ్వడం లేదు. ఇటీవల కాళ్ల మండలంలో చెరువుల తవ్వకం ప్రారంభం కాగా అక్కడి ఎమ్మెల్యే మంతెన రామరాజు అధికారులపై కన్నెర్ర చేశారు. జిల్లాలో రొయ్యల సాగుకు అనుమతులు తక్కువే జిల్లాలో తీరప్రాంతంలో తప్ప మరెక్కడా రొయ్యల సాగుకు అనుమతులు లేవు. వరిసాగుతో రైతులకు తీవ్ర నష్టాలు, కష్టాలు తప్పకపోవడంతో నెమ్మదిగా రొయ్యల సాగు చేపట్టారు. ముందుగా నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఆకివీడు వంటి మండలాల్లో ప్రారంభమైన రొయ్యల సాగు క్రమేణా జిల్లా అంతటా చేపలు, రొయ్యల సాగు విస్తరించింది. సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తుండగా దాదాపు 50 వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు చేస్తున్నట్లు అనధికారిక అంచనా. రొయ్యలు, చేపల చెరువుల్లోని కలుషిత నీరు డ్రయిన్లలోకి వెళ్లే అవకాశం లేకున్నా.. యథేచ్ఛగా చెరువులు తవ్వి ఆక్వా సాగు చేపట్టి నీటిని పంట కాలువల్లోకి వదలడం వల్ల తాగునీరు కలుషితమవుతోంది. అంతేగాకుండా రొయ్యల సాగుకు బోర్ల సాయంతో ఉప్పునీటిని ఉపయోగించడం వల్ల భూగర్భజలాలు ఉప్పగా మారి డెల్టా ప్రాంతంలో తాగునీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. గతంలో అనేక గ్రామాల్లో తాగునీటి అవసరాలకు బోరు నీటిని ఉపయోగించుకోగా నేడు అలాంటి అవకాశం లేకుండా పోయింది. రొయ్యల సాగుకు తోడు వాటిని స్టోరేజ్ చేయడానికి ఎక్కడికక్కడ స్టోరేజీలు ఏర్పాటుచేయడం, రొయ్యలను కెమికల్స్‌తో శుభ్రం చేసిన నీటిని కాలువల్లోని వదలడం వల్ల నీటి కాలుష్యంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. చేపల సాగంటూ చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ముడుపుల మత్తులో అధికారులు చర్యల తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. రొయ్యల సాగు వల్ల డెల్టా ప్రాంతం ఉప్పునీటి కయ్యగా మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా పక్కనున్న సారవంతమైన భూములు కూడా వరిసాగుకు పనిచేయడం లేదంటూ అనేకమంది రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువుల తవ్వకానికి అనుమతులు నిలిపివేశారు. అయితే కాళ్ల మండలంలో చెరువుల తవ్వకాల విషయం బయటపడింది. గతంలో చేపల చెరువుల పేరుతో రొయ్యలు సాగుచేస్తున్న రైతులపై కూడా చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని ప్రాంతంలో రొయ్యల సాగును నిలుపుదల చేయాలని వరి పండించే రైతులు కోరుతున్నారు. -
కన్నూరులో కన్నాలెన్నో!
హన్మకొండ చౌరస్తా: మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అక్రమార్కులకు వరంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకునేందుకు రాయితీపై వాహనాలను సైతం అందిస్తోంది. అర్హులైన మత్స్యకారులకు మోపెడ్, లగేజీ ఆటోలు, బొలెరో వాహనాలను అందించేందుకు గత ఏడాది వరంగల్ జిల్లాకు రూ.23 కోట్లు మంజూరు చేసింది. ఈక్రమంలో నిబంధనలకు నీళ్లొదిలిన మత్స్యశాఖ అధికారులు ఉమ్మడి వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని ఓ పెద్ద మనిషితో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు మత్స్యశాఖలోని అవినీతి చేపలను ఏరివేయాలని కోరుతూ గత సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ సభ్యులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందన రాకపోవడంతో నేరుగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కలిసి అవినీతి జరిగిన తీరును తెలియజేసినట్లు సభ్యులు చెబుతున్నారు. దీనికి తోడు భవిష్యత్‌లో అవినీతి జరగకుండా ఉండేందుకు సొసైటీ సభ్యులు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసేందుకు వెళ్లారు. అంతకుముందు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. ఫోర్జరీ సంతకాలతో తీర్మాణం? 8లక్షల రూపాయలకు పైబడిన వాహనాన్ని మంజూరి చేయాలంటే సొసైటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మాణం చేయాల్సి ఉంటుందని, అయితే తమ సొసైటీ సభ్యుడు నూనె శంకర్ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేశాడని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాల తీర్మాణం తో సదరు వ్యక్తి కి వాహనాన్ని మంజూరి చేసిన మత్స్యశాఖ అధికారులు, అందుకు సహకరించిన మత్స్య సహాకార సంఘం పెద్ద మనిషి పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. సొసైటీలోని సభ్యులందరికీ ఉపయోగపడాల్సిన వాహనం ఒక్క సభ్యుడికి ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. దాదాపు రూ.23 కోట్ల నిధులు వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 91 పురుష మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 10,24 మంది మత్స్యకారులు సభ్యులుగా కొనసాగుతున్నారు. 23 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 1,414 మంది సభ్యులు ఉన్నారు. గత ఏడాది మత్స్య సమీకృత అభివృద్ధి పథకం ద్వారా చేపల విక్రయాలు, చేపల పట్టేందుకు ఉపయోగపడే పరికరాలను రాయితీపై అందించేందుకు ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సొసైటీ సభ్యుడై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి 75శాతం రాయితీపై వాహనాలను అందించారు. విచారణ చేపడితే మరిన్ని వెలుగులోకి? డ్రైవింగ్ లైసెన్సు ఉండి సొసైటీ సభ్యుడైతే చాలు దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి టీవీఎస్ ఎక్సెల్(మోపెడ్) అందజేశారు. లగేజీ ఆటోల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సొసైటీ సభ్యులందరినీ ఒక చోటకు చేర్చి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందించారు. ఇక భారీ వాహనాలను సైతం ఇదే పద్ధతిలో అందించామని అధికారులు చెబుతుండగా సొసైటీలు మాత్రం ఏకగ్రీవ తీర్మానం ఆధారంగానే మంజూరు చేశారని చెబుతున్నారు. అయితే, మత్స్యశాఖ అధికారులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పెద్దలు కుమ్మక్కై వాహనాల మంజూరులో సిండికేట్‌గా ఏర్పడి అవినీతికి తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే నిజాలు వెలుగు చూస్తామని పలువురు మత్స్యకారులు చెబుతున్నారు. రూ.500 నుంచి రూ.లక్ష వరకు వసూలు టీవీఎస్ ఎక్సెల్ కోసం వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 1,987 మంది దరఖాస్తు చేసుకోగా 1673 మందికి, లగేజీ ఆటోల కోసం 656 మంది దరఖాస్తు చేసుకోగా 126 మందికి అందజేసినట్లు తెలుస్తోంది. అలాగే, హైజెనిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాల కోసం జిల్లా వ్యాప్తంగా ఎనిమిది దరకాస్తులు రాగా.. నలుగురు వాహనాలను అందుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మోపెడ్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు, లగేజీ ఆటోలకు రూ.5వేల నుంచి రూ.10వేల రూపాయల వరకు వసూలు చేయగా బొలోరా వాహనాలకు రూ.లక్ష వరకు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫోర్జరీకి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి మా ఊరి సొసైటీ సభ్యులకు తెలియకుండా దొంగతనంగా తీర్మాణంలో మా సంతకాలను ఫోర్జరీ చేసి నూనె శంకర్ బొలోరో వాహ నం తీసుకున్నాడు. దీనికి సహకరించిన మత్స్యశాఖ అధికారులు, మత్స్య పారిశ్రామిక సహాకార సంఘం పెద్దలపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సార్‌ను కలిస్తే విచారణ జరిపి వాహనాన్ని స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. –నూనె సంపత్, కన్నూర్, కమలాపూర్ ఉద్యోగులకు సభ్యత్వాలు ఇచ్చారు.. మా ఊరి సొసైటీలో ప్రస్తుతం 153 మంది సభ్యులు ఉన్నారు. పాత సభ్యులు 80 మంది కాగా గత ఏడాది కొత్త సభ్యత్వాలను ఇచ్చారు. ఇందులో 18 ఏళ్లు నిండని వ్యక్తులు, ప్రభుత్వం ఉద్యోగులకు సైతం స్థానం కల్పించారు. ఇదేమిటని అడిగితే అధికారులు, సొసైటీ పెద్ద మనుషుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. అనర్హులకు వాహనాలను మంజూరు చేసేందుకే అర్హత లేని వారికి సభ్యత్వాలు ఇచ్చారు. కల్పించారు. సభ్యత్వాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. – కిన్నెర మొగిలి, కన్నూర్, కమలాపూర్ ఎఫ్డీఓ భాస్కర్‌కు నోటీసులు ఇచ్చాం కమలాపూర్ మండలం కన్నూర్‌కుచెందిన అంశంపై ఎఫ్డీఓ భాస్కర్‌కు నోటీసులు జారీ చేశాం. ఆ గ్రామ సొసైటీ తీర్మానం చేసిన కాపీని భాస్కర్ నాకు అందించారు. తీర్మానం కాపీలో సొసైటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేశారన్న విషయం నాకు తెలియదు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఎఫ్‌డీఓను నివేదిక కోరాను. ఆ నివేదిక ఆధారంగానే నూనె శంకర్‌కు బొలోరో వాహనాన్ని మంజూరు చేశాం. అయితే లబ్ధిదారుల ఎంపికలో సొసైటీల తీర్మాణం తప్పనిసరి అనే అంశం ప్రభుత్వం మాకు సూచించిన నిబంధనలలో ఎక్కడా పొందుపర్చలేదు. ఈ విషయం తెలియక కన్నూర్ సొసైటీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. – డి.సతీష్, అసిస్టెంట్ డైరక్టర్,మత్స్యశాఖ, వరంగల్ అర్బన్ జిల్లా -
ఆకలి..‘ అల’మట
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : సుముద్రంలో వేట నిషేధం గడువు శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. 61 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం గంగపుత్రులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సముద్రంలోకి అడుగుపెట్టనున్నారు. చేపల పునరుత్పత్తి సీజన్ కావడంతో ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సముద్రంలో వేట నిషేధం అమలవుతూ ఉంటుంది. రెండు నెలలుగా ఖాళీగా ఉన్న మత్స్యకారులు ఆకలితో అలమటించారు. మళ్లీ వేటకు సిద్ధమవుతున్నారు. బోట్లను సముద్రంలోకి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వలలు, ఇతర వేట సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది సవ్యంగా వేట సాగాలని గంగమ్మ తల్లిని మొక్కుకుంటూ వేటకు సన్నద్ధమవుతున్నారు. బంగాళాఖాతానికి దగ్గరగా ఉండే నరసాపురం తీరంలో మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలకు చెందిన 100 వరకూ బోట్లు రోజూ వేట సాగిస్తాయి. వేట నిషేధ సమయం ముగియడంతో బోట్లు ఒక్కొక్కటీ చేరుకుంటున్నాయి. గతేడాది కష్టాల వేట నిజానికి గత ఏడాది వేటకు ప్రకృతి సహకరించింది. తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులు పెద్దగా చుట్టుముట్టలేదు. అయినా వేట సవ్యంగా సాగలేదు. మత్స్యసంపద ఎక్కువగా దొరికే జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా పెద్దగా మత్స్య సంపద లభ్యంకాకపోవడంతో జాలర్లు దిగాలు పడ్డారు. అంతకు ముందు రెండు సంవత్సరాలు 2017, 2018లలో ప్రకృతి విపత్తులు ఎక్కువగా రావడంతో మత్స్యకారులకు వేట విషయంలో ఎదురుదెబ్బలు తగిలాయి. అందని వేట నిషేధ సాయం నరసాపురం తీరంలో వేట నిషేధ సాయాన్ని గతపాలకులు అరకొరగా అందించారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేట నిషేధ కాలంలో 2017లో కేవలం 104 మందికి సాయం అందించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం 2018లో 173 మందిని లబ్ధిదారులుగా గుర్తించి రూ. 4వేలు చొప్పున అందించింది. ఈ ఏడాది 375 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే వేట నిషేధ సమయం ముగిసినా ఇంకా లబ్ధిదారులకు సొమ్ము చెల్లించలేదు. ఎన్నికల సమయం కావడంతో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.నిజానికి 19 కిలో మీటర్ల మేర తీరప్రాంతం ఉన్న నరసాపురంలో దాదాపుగా 2వేల మంది వరకూ పూర్తిగా వేటనే నమ్ముకుని బతుకుతున్నారు. వారిలో పెద్దబోట్లపై పనిచేసేవారి సంఖ్య 700 వరకూ ఉంటుంది. కేవలం 375 మందిని ఎంపికచేసి మత్స్యశాఖ చేతులు దులుపుకోవడంపైనా మత్స్యకార సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పైనే ఆశలు అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ.10వేలకు పెంచుతామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆయనపైనే గంగపుత్రులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తారా? వచ్చే ఏడాది నుంచి ఇస్తారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సీజన్ కలిసొస్తే బాగుండు వేట లేకపోవడంతో రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు వేటకు వెళుతున్నాం. మంచి సీజన్. చేపలు ఎక్కువగా పడతాయి. ఈ ఏడాది బాగుంటుందని అనుకుంటున్నాం. తుపాన్లు పట్టకపోతే నాలుగు డబ్బులు వస్తాయి. దేవుడిపై భారం వేసి వేటకు వెళుతున్నాం. అంతా మంచే జరుగుతుందని ఆశ. – మైలా శ్రీనివాస్, బోటు కార్మికుడు, పెదమైనవానిలంక సొమ్ము త్వరలో జమ ఈ ఏడాది రూ.4 వేలు సాయం 375 మందికి ఇస్తున్నాం. గత ఏడాది 173 మందికే ఆర్థిక సాయం అందించాం. ఈ ఏడాది బోట్ల సంఖ్య పెరగడంతో లబ్ధిదారులు పెరిగారు. పెద్దబోట్లపై పని చేసే వారికే రూ.4 వేల సాయం అందుతుంది. సాయం రూ.4వేలు ఇస్తారా? రూ.10 వేలు పెంచి ఇస్తారా అనేది ఇంకా తేలలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లబ్ధిదారుల వివరాలు ఉన్నతాధికారులకు పంపించాం. – కె.రమణకుమార్, మత్స్యశాఖ అధికారి, నరసాపురం -
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఏటా మృగశిర కార్తె సందర్భంగా అందజేసే చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని నాంపలి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం 6 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించనుంది. ఇందుకోసం 1.65 లక్షల కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ అందుబాటులో ఉంచింది. ఆదివారం సాయంత్రం వరకు బత్తిని సోదరులు, వారి కుటుంబ సభ్యులు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఆ తరువాత 10, 11 తేదీల్లో వారి ఇళ్ల వద్ద చేప ప్రసాదంపంపిణీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి భారీగా ఆస్తమా బాధితులు తరలి రానున్నారు. గతేడాది సుమారు 70 వేల మందికి పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య లక్ష వరకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా 40 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సుమారు 1,500 మందితో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా, నిరంతర విద్యుత్, తాగునీరు సదుపాయం కల్పించనుంది. చేప ప్రసాదం కోసం టోకెన్లు పంపిణీ చేయనున్నారు. జీహెచ్ంసీ ఆధ్వర్యంలో 100 మొబైల్ టాయిలెట్లను, 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, 6 వైద్య బృందాలు, 3 మొబైల్ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. బత్తిని కుటుంబం ప్రత్యేక పూజలు... మృగశిర కార్తె ప్రవేశం రోజున వంశపారంపర్యంగా తమ కుటుంబ సభ్యులు ఆస్తమా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బత్తిని హరినాథ్‌గౌడ్, బత్తిని శంకర్‌గౌడ్‌లు తెలిపారు. హైదరాబాద్ దూద్‌బౌలిలోని బత్తిని నివాసంలో శుక్రవారం ఉదయం సత్యనారాయణస్వామి పూజ నిర్వహించి చేప మందు పంపిణీకి ఏర్పాట్లను చేపట్టారు. చేప మందు పంపిణీ కార్యక్రమంలో బత్తిని హరినాథ్ గౌడ్‌తోపాటు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. 171 ఏళ్లుగా బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన మూడో తరం పంపిణీ చేస్తోంది. ఇతర వివరాల కోసం 9391040946, 8341824211, 9989989954 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఏసీబీ వలలో మత్స్య శాఖ జిల్లా అధికారి
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్ ‘బి’ బ్లాకులోని జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో మంగళవారం సబ్సిడీ నిధుల కోసం ఒక లబ్ధిదారురాలి నుంచి రూ.10 వేలు తీసుకుంటున్న సంబంధిత జిల్లా అధికారి వెంకటేశ్వర రావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని శివపూర మహిళా మత్స్య సహకార సంఘం సభ్యురాలు అనురాధ తమ సంఘానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3 లక్షల సబ్సిడీ నిధులను విడుదల చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా జిల్లా మత్స్యశాఖ కార్యాలయం చుట్టు తిరుగుతోంది. ఆ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్రావు రూ.10 వేలు ఇస్తేనే సబ్సిడీ నిధులు విడుదల చేస్తానని చెప్పడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఏసీబీ అధికారుల సూచనమేరకు మంగళవారం జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో వెంకటేశ్వర్రావుకు ఆమె రూ.10 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేశ్వర్రావును అదుపులోకి అదుపులోకి తీసుకున్నామని, బుధవారం చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
ఏసీబీ వలలో మత్స్యశాఖ అవినీతి చేప
కరీంనగర్‌క్రైం: ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ డబ్బులు అందించడానికి రూ.10 వేల లంచం తీసుకుంటూ కరీంనగర్ మత్య్స శాఖ కార్యాలయం సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివ మంగళవారం ఏసీబీకి చిక్కారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన మత్య్స కార్మికుడు పిల్లి స్వామి 1.25 లక్షలు బ్యాంక్‌లో చెల్లించి సబ్సిడీలో టాటాఏస్ వాహనం కొనుగోలు చేశాడు. తరువాత సబ్సిడీలోన్ కోసం కరీంనగర్ మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 3.75 లక్షల రుణం మంజూరైంది. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు మత్య్సశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ బంది వెంకటేశ్వర్లు రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా వినలేదు. చివరకు రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. మొదట రూ.5వేలు తీసుకున్న వెంకటేశ్వర్లు మళ్లీ రూ. 10వేలు ఇస్తేనే మంజూరైన రుణాన్ని ఇస్తానని తెగేసి చెప్పాడు. పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన పిల్లి స్వామి ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు కరీంనగర్ మానేరు డ్యాం వద్ద ఉన్న మత్య్సశాఖ కార్యాయలంలో మంగళవారం రూ.10వేలు అందించేందుకు వచ్చాడు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివ ద్వారా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం రికార్డులను ఏసీబీ ఆఫీస్‌కు తరలించారు. నిందితులను నేడు ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నామని డీఎస్పీ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. -
చేపా చేపా 'ఎక్కడికెళ్లావ్?'
రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ ఏడాది 74.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా 15 శాతానికి మించి పంపిణీ జరగలేదు. రాష్ట్రంలోని 21 వేల నీటి వనరులకుగాను 3 వేల చెరువులు, కుంటల్లోనే చేపలను వదిలారు. మిగిలిన కోట్లాది చేపల్ని ఎప్పుడు వదులుతారో స్పష్టత లేదు. నీటిపారుదల వర్గాల లెక్కల ప్రకారం ఇటీవలి భారీ వర్షాలకు అనేక జలాశయాలు, చెరువులు, కుంటల్లోకి అవసరమైన స్థాయిలో నీరొచ్చింది. కానీ ఆ సమయంలో అధికారులు మేలుకోకపోవడంతో పూర్తిస్థాయిలో చేపలను వదలలేకపోయారని ప్రజలు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఈసారి 74.73 కోట్లు మత్స్యకారులను ఆర్థి కంగా బలోపేతం చేసేందుకు మత్స్యకార సొసైటీల ద్వారా ‘ఉచిత చేప పిల్లల పంపిణీ’కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రెండేళ్లుగా చేప పిల్లలలను ఉచితంగా పం పిణీ చేస్తూ వస్తోంది. పథకంతో 4 లక్షల మత్స్య కార కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనేది సర్కారు సంకల్పం. ఈ ఏడాది 74.73 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 21,569 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటివరకు 3,147నీటి వనరుల్లో 11.40 కోట్ల చేప పిల్లలనేవదిలినట్లు ప్రభుత్వానికి మత్స్య శాఖ వెల్లడించింది. అంటే లక్ష్యంలో 15.25 శాతమే. ఆ జిల్లాల్లో .. కొన్ని జిల్లాల్లో దారుణంగా చేప పిల్లల పంపిణీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో అక్కడి 160 నీటి వనరుల్లో 99.68 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలనుకున్నారు. కానీ 6 నీటి వనరుల్లో 7.67 లక్షలనే వదిలారు. భద్రాద్రి జిల్లాలోనూ కుండపోత వర్షాలు కురిశాయి. ఆ జిల్లాలో 702 నీటి వనరుల్లో 2.03 కోట్ల చేపలను వదలాలనుకున్నారు. కానీ 2 నీటి వనరుల్లో 3.82 లక్షల చేపలనే వదిలిపెట్టారు. కొమురంభీం జిల్లాలో 242 నీటి వనరుల్లో 1.14 కోట్ల చేపలను వదలాలనుకున్నా కేవలం ఒకే నీటి వనరులో 70 వేల చేపలను వదిలారు. గతం లో ఆలస్యంగా అక్టోబర్ వరకు చేప పిల్లల పంపిణీ జరగడంతో అప్పటికే అనేకచోట్ల మత్స్యకారులు సొంతంగా చేపలను కొన్నారు. దీంతో ఈసారి ఆగస్టు మూడు లేదా చివరి వారంలోనే చేపలను వదలాలని అనుకున్నా.. గడువులోగా చేయలేకపోయారు. దీంతో మిగిలిన చేప పిల్లలను పంపిణీ చేయడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందోనని చర్చ జరుగుతోంది. ఏటికేడు లక్ష్యం పెంపు 2016– 17లో చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. రూ. 22 కోట్లు ఖర్చు చేసి 27 కోట్ల చేప పిల్లలను వదిలింది. 2017–18లో రూ. 44 కోట్లతో 51 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. గతేడాదితో పోలి స్తే ఈసారి 23.72 కోట్లు అదనంగా 74.73 కోట్ల చేపల పంపిణీకి సిద్ధ మైంది. ఇలా ఏటికేడు పంపిణీ లక్ష్యం పెరుగుతోంది. కానీ సకాలంలో చేపలను వదలడంలోనే అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు విని పిస్తున్నాయి. -
సంక్షేమానికి మత్స్య అభివృద్ధి పథకం
ఖమ్మంవ్యవసాయం : మత్స్యరంగ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం మత్స్య సహకార సంఘాల సమాఖ్య ద్వారా సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా మత్స్య శాఖ అభివృద్ధి అధికారి ఎన్.హన్మంతరావు తెలిపారు. నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని మత్స్య సహకార సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై అవగాహన కార్యక్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి ప్రభు త్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు రూ.30కోట్ల మేర కు నిధులు కేటాయించే అవకాశం ఉందన్నా రు. ఆ నిధులను ప్రాథమిక మత్స్య సహకార సంఘాలకు, మహిళా మత్స్య సహకార సంఘాలకు, మత్స్యకార మార్కెటింగ్ సహకార సంఘాలకు, ఆయా సంఘాల సభ్యుల ప్రయోజనానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపా రు. చేప పిల్లల ఉత్పత్తిని పెంచటం, చేపల వేటకు పరికరాలు అందించటం, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌కు సహాయం అందించటం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ పథకాన్ని వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత లబ్ధిదారులకు చేపల అమ్మకానికి ద్విచక్ర వాహనం, ప్లాస్టిక్ చేపల క్రేట్లు, వలలు, క్రాప్టు లు, లగేజీ ఆటోతో చేపల అమ్మకం, సంచార చేపల అమ్మకం వాహనం, కొత్త చేపల చెరువుల నిర్మాణం, రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ యూనిట్, అలంకరణ చేపల యూనిట్, విత్తన చేపలపెంపకం చెరువులకు దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. వీటికి ప్రభుత్వం 75నుంచి 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు. లబ్ధిదారులు రూ.4వేల నుంచి రూ.25లక్షల వరకు కూడా రుణాలు పొందవచ్చని తెలిపారు. గ్రూపులకు రూ.4లక్షల నుంచి రూ.76లక్షల వరకు సబ్సిడీపై పరికరాలు, రుణాలు ఇస్తున్న ట్లు తెలిపారు. సహకార సంఘాల స్థాయిలో, జిల్లా సంఘం స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సబ్సిడీపై రుణాలు, పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన మత్స్యకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు యడవల్లి చంద్రయ్య, నీలాల గోపి, ఖమ్మం, వైరా మత్స్య అభివృద్ధి అధికారులు వరదారెడ్డి, శివప్రసాద్, మత్స్యకారులు పాల్గొన్నారు. -
సమీకృత సేంద్రియ సేద్య పతాక.. తిలగర్!
సముద్ర తీర ప్రాంతాల్లో రైతులకు తమిళనాడుకు చెందిన వృద్ధ రైతు తిలగర్ (60) ఆచరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య పద్ధతి రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. తిలగర్ నాగపట్టినం జిల్లా సిర్కజి తాలూకా కొడంకుడిలో తనకున్న ఎకరం పావు పొలంలో దశాబ్దాలుగా రసాయనిక పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నా.. పెద్దగా నికరాదాయాన్ని కళ్ల జూసిన సందర్భాల్లేవు. బోరు నీటి ఆధారంగానే సేద్యం చేస్తున్న తిలగర్ ఈ నేపథ్యంలో.. సమీకృత సేంద్రియ వ్యవసాయాన్ని చేపట్టారు. వరుసగా మూడేళ్లు కరువు వచ్చినా మెరుగైన నికరాదాయాన్ని పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయోద్యమకారుడు దివంగత నమ్మాళ్వార్ చూపిన బాటలో మూడేళ్ల క్రితం నుంచి సేంద్రియ పద్ధతిని అనుసరిస్తున్నారు. వ్యవసాయ పనులన్నీ తిలగర్ కుటుంబ సభ్యులే చేసుకుంటారు. చెరువు.. కోళ్ల షెడ్డు.. వరి పొలం.. పావెకరంలో చెరువు తవ్వారు. అది చేపల చెరువు మాత్రమే కాదు, పక్కనే ఉన్న ఎకరం వరి పొలానికి నీరందించే నీటి కుంట కూడా. చెరువులో పూరి పాకను నిర్మించి, చుట్టూ ఇనుప మెష్ ఏర్పాటు చేసి కోళ్ల ఫామ్‌గా మార్చారు. ఆ కోళ్ల పెంట నేరుగా చెరువు నీటిలోకి పడుతుంది. చెరువు నీటిలో బొచ్చె, బంగారుతీగ వంటి 3 రకాలకు చెందిన వెయ్యి మంచినీటి కార్పు చేప పిల్లలను వదులుతుంటారు. కోళ్ల పెంట వల్ల చెరువు నీటికి చేపలకు అవసరమైన ప్లవకాలను ప్రకృతిసిద్ధంగా అందుబాటులోకి తెస్తున్నాయి. దీనికి తోడు అడపా దడపా పంచగవ్యను చల్లుతూ ఉంటారు. కాబట్టి, చేపల కోసం ప్రత్యేకంగా మేత అంటూ ఏమీ వేయడం లేదు. 2016లో సేకరించిన గణాంకాల ప్రకారం.. వెయ్యి చేపపిల్లలను వదిలిన 8 నెలల్లో 600 కిలోల చేపల దిగుబడి వచ్చింది. తిలగర్ ప్రత్యేకత ఏమిటంటే.. చేపలను సజీవంగా తన చెరువు వద్దనే నేరుగా వినియోగదారులకు అమ్ముతూ ఉంటారు. కిలో రూ. 150 చొప్పున.. రూ. 90 వేల ఆదాయం పొందుతున్నారు. చేపల చెరువు నీటితో వరి సాగు చేపల చెరువులోని నీటిని పక్కనే ఉన్న వరి పొలానికి పారిస్తున్నారు. వరి పొలానికి పంచగవ్య తప్ప మరేమీ ఎరువు వేయటం లేదు. ఎకరానికి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి పొందుతున్నారు. తిలగర్ తన పొలం వద్దనే దేశీ ఆవుతోపాటు మేకలు, బాతులను పెంచుతున్నారు. గట్ల మీద కొబ్బరి, మామిడి, జామ చెట్లను పెంచుతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. వ్యవసాయం, పశుపోషణ పరస్పర ఆధారితమైనవి కావడంతో వ్యవసాయ, అనుబంధ రంగాల శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడు.. సమీకృత సేంద్రియ సేద్యం ప్రధానంగా చిన్న కమతాలుండి సొంత రెక్కల కష్టంపైనే ఆధారపడి వ్యవసాయం చేసుకునే చిన్న, సన్నకారు రైతులకు ఆహార, ఆదాయ భద్రత లభిస్తుందనడంలో సందేహం లేదు. సేంద్రియ సర్టిఫికేషన్ ఇవ్వబోతున్నాం జిల్లా కలెక్టర్ పళనిస్వామి స్వయంగా తిలగర్ క్షేత్రాన్ని సందర్శించి అభినందించడంతోపాటు ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించారు. ఇతర రైతులను సైతం సమీకృత సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేయమని అధికారులను ఆదేశించారు. తిలగర్ వ్యవసాయోత్పత్తులకు పీజీఎస్–ఇండియా కింద సేంద్రియ సర్టిఫికేషన్‌ను అందించబోతున్నాం. – ఆర్. రవిచంద్రన్ (094440 63174, 095007 82105)మత్స్య శాఖ సహాయ సంచాలకుడు,నాగపట్టినం, తమిళనాడు -
మత్స్య రహస్యం!
‘‘ అధికారి గారు.. జిల్లాలో ఏ పథకం అమలవుతుంది..వాటి వివరాలు ఏమైనా చెబుతారా’’ అని అడిగితే..అన్ని పథకాలు అమలవుతున్నాయి’’ అన్న సమాధానం వస్తోంది. ‘‘ఏయే పథకాలో వివరంగా చెబుతారా’’..అని మళ్లీ అడిగితే..‘‘అన్ని పథకాలు అని చెప్పాముగా..ఇంకేం కావాలి.’’ అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది. ఇదండీ జిల్లా మత్స్యశాఖ పరిస్థితి. ఇక్కడ అంతా రహస్యమే. ఏ పథకం కింద ఎవరు లబ్ధిపొందుతున్నారో సమాచారం ఇవ్వరు. అసలు పథకంకింద లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారో..చేయడం లేదో తెలియని పరిస్థితి. నల్లగొండ టూటౌన్ : మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచితంగా చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టి వారికి అన్ని విధాలా మేమున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు భిన్నంగా జిల్లా మత్స్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న మత్స్యకార్మికులకు తెలియజేయకుండా ఏ ఒక్క పథకంపైనా సంబంధిత అధికారులు నోరు విప్పకుండా వింత పోకడపోతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాల నుంచి ఏయే పథకాలు వస్తున్నాయన్న వివరాలను కూడా మత్స్యకారులకు తెలియనీయకుండా కార్యాలయంలోని కొంతమంది అధికారులు తమకు నచ్చినవారికి మాత్రమే సమాచారం ఇచ్చి ‘చేతులు చాచుతున్నారు’ అనే విమర్శలు ఉన్నాయి. ఫలానా పథకం మంజూరైంది..ఇన్ని యూనిట్లు ఉన్నాయి..అర్హులు దరఖాస్తు చేసుకోవాలి అన్న సమాచారాన్ని కనీసం పత్రికల ద్వారా కూడా ప్రకటన జారీ చేయకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ఈ శాఖలో ప్రభుత్వ పథకాలు గడప దాటడంలేదు. ఎందుకింత రహస్యం? ప్రభుత్వ పథకాలపై క్షేత్రస్థాయిలో కా ర్మికులందరికి తెలియజేసే బాధ్యతను మత్స్యశాఖ అధికారులు విస్మరించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి పథకం గురించి మీడి యా ద్వారా ప్రచారం కల్పించాల్సి ఉన్నా ఆ విధంగా చేసిన దాఖలాలు ఒక్కటి కూడా లేవు. జిల్లాలో 147 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా సభ్యులు 25 వేల మంది వరకు ఉన్నారు. మొత్తం మత్స్యకారుల సంఖ్య సుమారు 90 వేల పైబడే ఉన్న ట్లు తెలుస్తుంది. వీరి సంక్షేమానికి ప్ర భుత్వం టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్ మోపెడ్ బైక్‌లు, చేపలు పట్టే వలలు, మహిళా సభ్యులకు స బ్సిడీ రుణాలు, ఐస్ బాక్సులు, త దితర వా టిని సబ్సిడీపై అందజేస్తుంది. ఆయా పథకాలపై సంబందిత అధికారులు మ త్స్యకారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై పలు అ నుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త మకు నచ్చిన వారికి మాత్రమే తె లి సేలా సంఘం అధ్యక్షుడికి, లేదంటే వా రికి అనుకూలంగా ఉండే సభ్యులకు మాత్రమే సమాచారం చేరవేస్తున్నారనే పలువురు మత్స్యకార్మికులు ఆరోపిస్తున్నారు. మూలన పడిన బడ్జెట్ ... 2016–17 సంవత్సరానికి సంబంధించి మత్స్యకార్మికుల కోసం ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. దాదాపు రూ.కోటికి పైగా బడ్జెట్ ఉన్నా అర్హులైన వారికి నేటికీ పథకాలు అందించలేదు. చేపల విక్రయానికి టాటా ఏసీ ట్రాలీ వాహనాలు, టీవీఎస్ మోపెడ్లు కార్మికులకు ఎంతో అవసరం ఉన్నా వాటి గురించి అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదనే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లు దాటినా పథకాలు అబ్ధిదారులకు ఇవ్వడానికి అధికారులకు తీరిక లేదా, వారికి కావాల్సినవి ముట్టలేదా అనే ఆరోపణలు వస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరితను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు అందించడానికి లబ్ధిదారుల జాబితా తయారు చేశామన్నారు. 2016–17 సంవత్సరంలో మాత్రమే వాహనాల బడ్జెట్ వచ్చిందని, సిబ్బంది ద్వారా మత్స్యకారులకు తెలియజేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అందిస్తామని తెలిపారు. -
మత్స్యకారులకు చేపల పంట
సాక్షి, హైదరాబాద్: సర్కారు చేప పెరిగి పెద్దదైంది. ప్రభుత్వం ప్రారంభించిన చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం మత్స్యకారులకు లబ్ధి చేకూర్చింది. 2016 వర్షాకాలంలో 27.85 కోట్ల చేప పిల్లలను 3,939 చెరువులు, రిజర్వాయర్లలో ప్రభుత్వం వదిలింది. అందుకు రూ.22 కోట్లు ఖర్చు చేసింది. ఆ చేప పిల్లల ద్వారా 83,552 క్వింటాళ్ల చేపలు ఉత్పత్తి అవుతాయని.. వాటి నుంచి రూ. 501 కోట్లు మత్స్యకారులకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు 55 వేల టన్నుల చేపలను మత్స్యకారులు విక్రయించారని, రూ. 350 కోట్ల ఆదాయం సమకూరిందని మత్స్య శాఖ వర్గాలు తెలిపాయి. 28 వేల టన్నులకుపైగా చేపలు పట్టడానికి సిద్ధంగా ఉన్నాయని.. వాటి ద్వారా మరో రూ.150 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి మత్స్య శాఖ నివేదిక అందజేసింది. అందుబాటులోకి 2.83 లక్షల టన్నులు సర్కారు చేప అందుబాటులోకి రాకముందు రాష్ట్రం లో ఏటా 2 లక్షల టన్నుల చేప ఉత్పత్తి అయ్యేది. రాష్ట్ర జనాభాలో 3 కోట్ల మంది చేపలు తింటారని, వారంతా ఏడాదికి సరాసరి 3 కేజీలు కొనుగోలు చేస్తారని అంచనా. ఆ ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి లక్ష టన్నుల చేపలు వినియోగం అవుతుంటాయి. మిగిలిన లక్ష టన్నులు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రతీ వ్యక్తి ఏటా 8–10 కేజీల చేపలు తినాలి. ఆ ప్రకారం ఏడాదికి 2.50 లక్షల టన్నుల చేపలు రాష్ట్రా నికి అవసరం అవుతాయని మత్స్య సమాఖ్య జనరల్ మేనేజర్ శ్రీనివాస్ వెల్లడించారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకా రం 50 వేల టన్నులు కొరత ఉండేదని.. సర్కారు చేపతో 2.83 లక్షల టన్నుల చేప అందుబాటులోకి వచ్చిందన్నారు. పూర్తి స్థాయిలో చేప అందుబాటులోకి వచ్చినా వినియోగం లేదన్నారు. ముళ్లు తీసే పరిజ్ఞానం ఏదీ..? చేపల ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి కోల్‌కతాకు ఏటా లక్ష టన్నుల చేపలు ఎగుమతి అవుతుండటంతో ధరలు తగ్గడంలేదని చెబుతున్నారు. మరోవైపు బాయి లర్ కోళ్లు కొనేందుకు వీధివీధినా దుకాణా లుండగా.. రాష్ట్రంలో కేవలం 33 చేపల మార్కెట్లు ఉన్నాయి. ఔత్సాహిక యువకులు చేపల వ్యాపా రం చేయాలనుకున్నా అవసరమైన రిఫ్రిజిరేటర్లు, సరఫరా వ్యవస్థ లేదు. సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేనేలేదు. పైగా ముళ్లు తీసి విక్రయించే పరిజ్ఞా నం రాష్ట్రంలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇటీవల కొచ్చిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సంస్థ చేప ముళ్లు లేకుండా ముక్కలు చేసే యంత్రాన్ని తీసుకొచ్చింది. ఆ యంత్రం ఖరీదు రూ. 2.50 లక్షలని, ప్రయోగాత్మకంగా ఒకటి కొనుగోలు చేస్తామని శ్రీనివాస్ చెబుతున్నారు. -
మత్స్యశాఖలో కోల్డ్‌వార్!
నల్లగొండ టూటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లల వ్యవహారం ఆ శాఖ అధికారుల మధ్య కోల్డ్‌వార్‌కు తెరలేపింది. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి పోటీపడుతున్నారు. ఎవరి పని వాళ్లు చేయకుండా ఇతరుల సెక్షన్లో వేలు పెట్టడమే వీరి మధ్య విభేదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మత్స్యశాఖ సొసైటీల బాధ్యులతో రహస్య మంతనాలు జరిపి ‘ముడుపులు నాకు ఇస్తే చేప పిల్లల సరఫరా అంతా నేనే చూసుకుంటాను ... ఏది ఉన్నా నన్ను కలిస్తే సరిపోతది ..? ఏదీ కావాలన్నా నేను పనిచేసి పెడతా .. ఇక్కడ అంతా నాకు బాగా తెలుసు’’ అని మత్య్సకారులకు ఓ ఉద్యోగి చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఇతర ఉద్యోగులకు ముడుపులు అందకుండా అతనొక్కడే అందినకాడికి నొక్కుతున్నారనే విషయంలో వారి మధ్య బేదాభిప్రాయాలు పొడిచూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగుల ఆధిపత్యంతో మత్స్యకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముడుపులిచ్చిన వారికే ముందు ... ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు ఇస్తుంది. కానీ ఇక్కడ తతంగం వేరే నడుస్తోంది. ముడుపులు ఇచ్చిన వారికే ముందుగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచితంగా చేపపిల్లలు పొందుతున్న మత్స్యకారుల వద్ద కొంతమంది ఉద్యోగులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలకు ఇటీవల జరిగిన పరిణామాలే బలం చేకూరుస్తున్నాయి. ఈ శాఖ ఉద్యోగులు ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఓ లాడ్జి గదిలో కాంట్రాక్టర్లతో బేరాసారాలకు దిగడం సంచలనం సృష్టించింది. వైరి వర్గం ఉద్యోగులే ఫోన్లో ఇది భయపడే విధంగా చేశారని సదరు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన ఉద్యోగుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయంటే పరిస్థితి ఎంతతీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బహిరంగంగానే తిట్ల పురాణం ..! మత్స్యశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తీరు చూసి మత్స్యకారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇచ్చిన కాసులు తీసుకొని చడీ చప్పుడు లేకుండా ఉండకుండా వీరెందుకు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటన్నారని అనుకుంటుండడం విశేషం. ఉన్నతస్థాయి ఉద్యోగులపై కిందిస్థాయి వారు నోరు పారేసుకోవడం, మరికొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు సైతం కార్యాలయంలో ఓ ఉద్యోగి అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని బహిరంగంగానే చర్చించుకోవడం పెద్ద దుమారం రేపుతోంది. ఉన్నత ఉద్యోగిపై సైతం కార్యాలయ కింది స్థాయి సిబ్బంది వినే విధంగా ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో తిట్ల పురాణం ఎటు వైపు దారి తీస్తుందోనని కార్యాలయంలోని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించడం గమనార్హం. మత్స్యకారుల ఇబ్బందులు .. అధికారులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా జిల్లాలోని మత్స్యకారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పనికోసం వచ్చిన కార్మికులకు సరైన సమాధానం చెప్పడంలోనూ అధికారులు వైఫల్యం చెందుతున్నారు. నచ్చిన వారికి సమాచారం ఇవ్వడం, మిగతా వారికి నాకు తెలియదు మరో అధికారిని కలవండి అని చెప్పడం లాంటి ఘటనలతో మత్సకార్మికులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వంనుంచి వస్తున్న సంక్షేమ పథకాలపై కార్మికులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
చేపల మృతికి కారణమైన కంపెనీలపై కేసులు
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుంటే.. పలు కంపెనీలు కలుషిత జలాలు చెరువులోకి వదిలి చేపల మృతికి కారణమవుతున్నాయని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అలాంటి కంపెనీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని శుక్రవారం హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గండిచెరువు లోకి కలుషిత నీటిని వదిలిన కంపెనీలను గుర్తించి వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ జిల్లా అధికారులను ఆదేశించారు. 287 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గండిచెరువులో పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు కలవడం వలనే రూ.1.50 కోట్ల విలువైన చేపలు మృతిచెందాయని పేర్కొన్నారు. -
ఉచితంగా రొయ్య పిల్లలు
కొత్తగా 9 జలాశయాల్లో రొయ్యల పెంపకానికి సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది నుంచి చేప విత్తనాన్ని లబ్ధిదారులకు ఉచి తంగా పంపిణీ చేసి చెరువులు, జలాశ యాల్లో పెంచుతున్న సర్కారు... ఈ ఏడాది నుంచి రొయ్య విత్తనాన్ని కూడా ఉచితంగా ఇచ్చి తొమ్మిది జలాశయాల్లో పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఒకవైపు చేపలు, మరోవైపు రొయ్యలను రాష్ట్ర మార్కెట్లో దింపాలని భావిస్తోంది. జలాశయాల్లో 1.51 కోట్ల రొయ్య పిల్లల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తోంది. రొయ్య విత్తనాన్ని కొనుగోలు చేసేందుకు త్వరలో టెండర్లు పిలుస్తామని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి కూడా ఇచ్చిందన్నారు. రొయ్యల ఉచిత పంపిణీకి రూ. 2 కోట్ల మేరకు ఖర్చు కానుందని అంచనా వేశామన్నారు. రాష్ట్రం లో గతేడాది 5,189 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయినా వాటిల్లో ఎక్కువ భాగం ఎగుమతి అయ్యాయి. మిగిలిన వాటిని నెల్లూరు తదితర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. స్థానిక ప్రజలు ఏపీ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రొయ్యలను కొను గోలు చేసి తింటున్నారు. దీంతో ఈ ఏడాది 9 జలాశయాల్లో రొయ్యలను పెంచాక లాభనష్టాలను అంచనా వేసి వచ్చే ఏడాది నుంచి అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లోనూ పెంచుతామని అధికారులు తెలిపారు. -
జాలర్లపై దాడి
ఇన్నాళ్లు బంగాళాఖాతంలో శ్రీలంక సేనలు తమిళ జాలర్ల మీద విరుచుకు పడుతుంటే, తాజాగా అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన కన్యాకుమారి జాలర్లను ఇంగ్లాండ్ సేనలు బందీగా పట్టుకు వెళ్లాయి. సాక్షి, చెన్నై: తమిళ జాలర్ల మీద శ్రీలంక సేనలు సృష్టిస్తున్న వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం దాడులు, బందీలుగా పట్టుకెళ్లడం సర్వసాధారణం. ఇప్పటి వరకు వందకు పైగా పడవలు, పదుల సంఖ్యలో జాలర్లు ఆ దేశ చెరలో ఉన్నారు. వీరిని విడిపించేందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం, జాలర్ల సంఘాలు తీవ్రంగానే ఒత్తిడి తెస్తున్నా ఫలితం శూన్యం. ఇన్నాళ్లు శ్రీలంక సేనల నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందనుకుంటే, తాజాగా ఇంగ్లాండ్(బ్రిటీష్)దేశ సేనలు సైతం ప్రతాపం చూపించడం జాలర్లలో ఆందో ళనకు దారి తీస్తోంది. బంగాళా ఖాతంలో భద్రత కరువుతో కన్యాకుమారి జాలర్లు అరేబియా సముద్రం వైపుగా వేట సాగిస్తూ వస్తున్నారు. కేరళ సరిహద్దుల్లోని తమిళ గ్రామాల్లోని జాలర్లు కొచ్చి మీదుగా తమ చేపల వేట సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోకన్యాకుమారి జిల్లా నిత్ర విలై సమీపంలోని ఇరువి బుద్ధన్ గ్రామానికి చెందిద్ధాల్బర్ట్ పడవలో డేని, ప్రడీ, సోని, జోషప్, ఆంటోని, షాజీలు, కొచ్చికి చెందిన మరొకరి బోటులో కుమరికి చెందిన మరి కొందరు ఆదివారం వేటకు వెళ్లారు. అరేబియా సముద్రంలో ఓ దీవులకు సమీపంలో వేటలో ఉన్న వీరిని బ్రిటీషు నావికాదళం చుట్టుముట్టింది. నాలుగైదు పడవల్ని, 32 మందిని బందీలుగా పట్టుకెళ్లింది. ఈ సమాచారం కొచ్చిలోని మత్స్య శాఖ వర్గాల ద్వారా కన్యాకుమారికి సమాచారం చేరింది. కన్యాకుమారికి చెందిన జాలర్లు పదిహేను మందికి పైగా ఇంగ్లాండ్ సేనల వద్ద బందీలుగా ఉన్న సమాచారంతో ఆందోళన బయల్దేరింది. తమ వాళ్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీలంకతో పాటుగా ఇతర దేశాల చెరలో ఉన్న తమిళ జాలర్లను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. పదవిని కాపాడుకునే ప్రయత్నంలో జాలర్లను విస్మరించ వద్దు అని సీఎంకు హితవు పలికారు. -
పశు, మత్స్యశాఖలకు నిధులు పెంచుతాం
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో పశు, మత్య్స శాఖలకు భారీగా నిధులు కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ శాఖలు ఎంతో ప్రాధాన్యత కలిగినవిగా గుర్తింపు సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సచివాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీయన్స్ అసోసియేషన్ డైరీని సోమవారం ఆయన ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. పశుసంవర్థక, మత్స్యశాఖల అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. 161 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లను నియమించామని, త్వరలో మరో 180 మంది నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. -
ఆ జాలర్ల జాడేది?
► కుటుంబాల్లో ఆందోళన ► కాశిమేడులో ఉత్కంఠ ► ఆచూకీ కోసం అన్వేషణ ► వర్దా తాండవంలో గల్లంతయ్యారా... పొట్ట కూటి కోసం సముద్రంలోకి వెళ్లిన పది మంది జాలర్ల ఆచూకీ లభించ లేదు. అసలు వీళ్లు ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. వర్దా తుపాన్ కు ముందే సముద్రంలోకి వెళ్లిన తమ వాళ్లు ఎక్కడో ఓ చోట సురక్షితంగా ఉంటారని భావించిన కుటుంబాల్లో రోజులు గడిచే కొద్ది ఆందోళన అధికమవుతోంది. తమ వాళ్లను వర్దా మింగేసిందా..? అన్న ఆవేదనతోకన్నీటి పర్యంతం అవుతున్నారు. మంగళవారం మత్స్య శాఖ మంత్రి డి జయకుమార్ దృష్టికి సమాచారం రావడంతో ఆచూకీ కోసం అన్వేషణ మొదలైంది. సాక్షి, చెన్నై: వర్దా తుపాన్ ఈనెల ఐదో తేదీన చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. 120 నుంచి 130 కీ.మీ వేగంతో వీచిన గాలుల దాటికి పెను నష్టం తప్పలేదు. రూ. 22 వేల కోట్ల మేరకు నష్టాన్ని చవి చూశామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రకటించడమే కాదు, ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. నష్టం అపారమే అయినా, పెను ప్రాణ నష్టాన్ని ముందస్తు చర్యలతో అడుకున్నారని చెప్పవచ్చు. వర్దా ధాటికి 24 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పది మంది జాలర్ల ఆచూకీ కానరాకపోవడంతో ఆందోళన నెలకొంది. పది మంది ఎక్కడ: వర్దా తుపాన్ ప్రభావం తొ లుత ఆంధ్రా వైపుగా అత్యధికంగా ఉంటుందన్న సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి , మూడో తేదీ ఉదయం కాశిమేడు నుంచి జాలర్లు కడలిలోకి వెళ్లారు. మూడో తేదీ రాత్రికి వర్దా చెన్నై వైపుగా ముంచుకొస్తున్న సమాచారంతో సాగరంలోకి వెళ్లిన జాలర్ల తిరుగు పయనం కావాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఓ వైపు కోస్ట్ గార్డ్, నౌకాదళం ద్వారా, మరో వైపు రేడియోల ద్వారా సమాచారాలు సముద్రంలోని జాలర్లకు పంపించారు. జాలర్లందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టేనని భావించారు. వర్దా ధాటి నుంచి తమ పడవల్ని రక్షించుకునేందుకు జాలర్లు తీవ్రంగానే శ్రమించారు.ఈ సమయంలో పది మంది జాలర్ల ఆచూకీ కన్పించడం లేదన్న సమాచారంతో, వారు ఎక్కడున్నారో, ఏమయ్యారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. కన్నీటి పర్యంతం: కాశిమేడుకు చెందిన పది కుటుంబాలు, వారి ఆప్తులు, బంధువులు కన్నీటి పర్యంతంతో అక్కడి మత్స్యశాఖ కార్యాలయం వద్దకు పరుగులు తీశారు. ఈనెల రెండో తేదీ అర్ధరాత్రి వేటకు వెళ్లిన తమ వాళ్లు, ఆంధ్రా వైపుగా లేదా, నాగపట్నం , పాండిచ్చేరిల వైపుగా వేటకు వెళ్లి ఉంటారని భావించామని పేర్కొన్నారు. తుపాన్ తీరం దాటి వారం రోజులు అవుతున్నా, తమ వాళ్ల నుంచి ఇంత వరకు ఎలాంటి ఫోన్ కూడా రాలేదని ఆ కుటుంబాలు కన్నీటి పర్యంతంతో విలపిస్తున్నాయి. వర్దా ధాటికి వీరు గల్లంతయ్యారా..? లేదా, ఎక్కడైనా చిక్కుకుని ఉన్నారా..? అన్న ఆందోళనలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాళ్ల ఆచూకీ కనిపెట్టాలని అధికారుల్ని వేడుకున్నారు. అక్కడి నుంచి నే రుగా మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ను కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఆ పది మంది ఆచూకీ కోసం అన్వేషన్ మొదలెట్టారు. సముద్రంలోకి వెళ్లి ఆచూకీ గల్లంతైన వారిలో మాధవన్, వెంకటరామన్, అంతోని రాజ్, రవి, రాజేం ద్రన్, శివ, నిర్మల్ రాజ్, వినోద్, మల్లికార్జునలతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్: శివార్లలో జన జీవనం మెరుగు పడుతోంది. క్రమంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు ఆగమేఘాలపై సాగుతున్నాయి.. కొన్ని చోట్ల కాసేపు విద్యుత్ సరఫరా అందిస్తుండగా, మరి కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో విద్యుత్ అందుతున్నది. మరికొన్ని చోట్ల రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు తగ్గ చర్యలతో అధికారులు ముందుకు సాగుతున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు గాను సాంకేతిక పరంగా తాము పూర్తి సహకారం అందిస్తున్నామని, రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ప్రజలకు అందుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మంగళవారం ప్రకటించారు. ఇక, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తంగమణి అధికారులతో కలిసి పనుల్ని పరిశీలిస్తూ వేగవంతం చేయించే పనిలో నిమగ్నం అయ్యారు. కాగా, ఈ వర్దా ధాటికి తాంబరం సమీపంలోని టీబీ ఆసుపత్రికి భారీ నష్టం జరిగింది. రూ.ఐదు కోట్ల మేరకు ఈ నష్టం ఉండడం గమనార్హం. వదంతులు నమ్మోద్దు: తుపాన్ వదంతుల్ని నమ్మవద్దు అని ప్రజలకు వాతావరణ శాఖ సూచించిం ది. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో నె లకొన్న అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరా ల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి స్టెల్లా తెలిపారు. ఆ ద్రోణి బలపడే విషయంగా పూర్తి సమాచారం లేదని, తుపాన్ ముంచుకొస్తుందన్న ఆందోళన వద్దు అని సూచించారు. -
మత్స్యశాఖ ఆధ్వర్యంలో పుష్కర పర్యవేక్షణ
-
ఏసీబీ వలలో జూ. అసిస్టెంట్
నిజామాబాద్ : నిజామాబాద్‌లోని మత్స్యశాఖ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 5 వేలు లంచం తీసుకుంటు జూ. అసిస్టెంట్ రూపేందర్ సింగ్‌ను పట్టుకున్నారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. ఆ తర్వాత అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. -
దూసుకొచ్చిన మృత్యువు
గోదారిలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి జలసమాధి మరొకరి గల్లంతు, మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు యానాం టౌన్: బంధువుల ఇంటికని కారులో బయల్దేరిన ఓ కుటుంబాన్ని మృత్యువు వేటాడింది. మూడు తరాలకు చెందిన ఐదుగురిని కబళించింది. గమ్యం చేరకుండానే గోదావరిలో శవాలై కనిపించారు. యానాం-దరియాలతిప్ప రోడ్డులోని దరియాలతిప్ప వద్దనున్న దర్టీ కంపెనీ సమీపంలో శనివారం ఉదయం గోదావరిలో కనిపించిన ఓ కారులో ఐదుగురి మృతదేహాలున్నారుు. వారిని కాకినాడ తూరంగి ప్రాంతంలోని రాఘవేంద్రపురానికి చెందిన మత్స్యశాఖ విశ్రాంత ఉద్యోగి కొప్పాడ సత్తిరాజు (65), ఆయన భార్య ధనలక్ష్మి (60), కోడలు పార్వతి (30), మనవరాళ్లు హర్షిత (7), రిషిత (5)గా గుర్తించారు. సత్తిరాజు కుమారుడు పవన్ కుమార్(35) గల్లంతైనట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. బంధువుల ఇంటికని చెప్పి.. మత్స్యశాఖలో రికార్డ్ అసిస్టెంట్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన కొప్పాడ సత్తిరాజు రాఘవేంద్రపురంలో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు పవన్‌కుమార్ కాకినాడలోని కోరమాండల్ ఫర్జిలైజర్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాట్రేనికోనలో ఉంటున్న సత్తిరాజు చిన్నకుమార్తె వద్దకు వెళ్తున్నామని ఇరుగుపొరుగుకు చెప్పి.. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఏపీ05వీ4201 నంబర్ ఇండికా కారులో ఆరుగురు బయల్దేరారు. పవన్‌కుమార్ పెద్దకుమార్తె స్వీటీ రమణయ్యపేటలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉండడంతో వారితో వెళ్లలేదు. కాట్రేనికోన చేరాల్సిన ఆ కుటుంబ సభ్యులు దరియాల తిప్ప దర్టీ కంపెనీ సమీపంలోని గోదావరిలో జలసమాధి అయ్యారు. -
‘ఆక్వా’కు మంచిరోజులు
డబుల్ డిజిట్లో భాగంగా చెరువులు వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు రైతులను మరింత ప్రోత్సహించాలని మత్స్యశాఖ నిర్ణయం దాదాపు వెయ్యి హెక్టార్లలో పునరుద్ధరణకు కసరత్తు ఒంగోలు టౌన్ : ఆక్వాకు ఊపిరిపోయాలని మత్స్యశాఖ నిర్ణయించింది. గతంలో డాలర్ల వర్షం కురిపించిన పంటకు తిరిగి అదే వైభవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. డబుల్ డిజిట్లో భాగంగా గతంలో తవ్వి వదిలేసిన దాదాపు వెయ్యి హెక్టార్లలోని చెరువులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆక్వా రైతులను ఒక వేదికపైకి తీసుకువచ్చి సాగులో మెళకువలు అందించడంతోపాటు నాణ్యమైన దిగుబడి పొందే విధంగా సలహాలు, సూచనలు అందించి మరింత ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లోని చెరువులతోపాటు మంచినీటి చెరువుల్లో ఆక్వాను సాగుచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 1990 దశకంలో ఆక్వా రంగం నీలి విప్లవంలా వచ్చింది. వ్యవసాయ, వాణిజ్య పంటలను సాగు చేసేవారికంటే ఆక్వా చెరువులు ఉన్నవారు స్వల్ప కాలంలోనే ఆర్థికంగా బలపడ్డారు. ఆ సమయంలో ఎన్ని ఎకరాల మాగాణి భూమి ఉన్నాగానీ రెండుమూడు ఆక్వా చెరువులు ఉంటే చాలన్నట్లుగా ఆ సాగు ఫరిడవిల్లింది. ఒకరిని చూసి మరొకరు, ఒక గ్రామాన్ని చూసి ఇంకో గ్రామం..ఇలా అంతా ఆక్వా చెరువుల మయమైంది. ఇబ్బడి ముబ్బడిగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తీరప్రాంత మండలాల్లో మెజార్టీ భాగం ఆక్వా చెరువులు ఉన్నాయి. చివరకు మంచినీటి వనరులున్నచోట కూడా ఒక్కసారిగా ఆక్వా చెరువులు వెలిశాయి. విదేశాల నుంచి అనూహ్యంగా ఆర్డర్లు రావడంతో ఇక్కడి రైతులకు డాలర్ల వర్షం కురిసింది. ఒకవైపు పెద్దమొత్తంలో ఆదాయం పొందుతున్నప్పటికీ, ఇంకోవైపు ఆక్వా చెరువులకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలపై రైతులు పెద్దగా దృష్టి సారించలేదు. విచ్చలవిడిగా చెరువులు తవ్వడం, ఉత్పత్తి అధికంగా రావాలన్న ఉద్దేశంతో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో ఒక్కసారిగా ఆక్వా రంగం కుదేలైంది. వైట్‘స్పాట్’... భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతవుతున్న రొయ్యల్లో వైట్‘స్పాట్’ ఉండటంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. వైట్‌స్పాట్ ఉన్న రొయ్యల్లో అధిక శాతం ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నవి కావడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో కొన్ని దేశాలు భారతదేశం నుంచి రొయ్యలు ఎగుమతి చేసుకునేందుకు పూర్తిగా నిరాకరించాయి. దాంతో ఆక్వా రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. అనేక మంది రైతులు ఆక్వా చెరువులను ఎక్కడికక్కడే వదిలేశారు. అనేక ప్రాంతాల్లో చెరువులు కొన్నేళ్లపాటు ఖాళీగా ఉన్నాయి. పరిమిత సంఖ్యలో ఆక్వా చెరువులు సాగుచేస్తూ రావడం, అదే సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో క్రమంగా ఆక్వా రంగం కోలుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో డబుల్ డిజిట్ సాధించాలన్న ఉద్దేశంతో లక్ష్యాలు కేటాయించింది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలను విస్తృతంగా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో ఆక్వాకు పూర్వ వైభవం రానుంది. నేడు ఆక్వా రైతులకు అవగాహన సదస్సు జిల్లాలోని ఆక్వా రైతులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకుడు పి.శ్రీహరి గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ సదస్సులో కలెక్టర్ సుజాతశర్మ, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్‌నాయక్ పాల్గొంటారన్నారు. డబుల్ డిజిట్ సాధనలో భాగంగా జిల్లాలో ఆక్వా రంగాన్ని మరింత విస్తరింపజేసేందుకు వీలుగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత పరిధిలో, మంచినీటి చెరువుల పరిధిలో ఆక్వా సాగు చేస్తున్నవారు, గతంలో సాగుచేసి వదిలేసిన రైతులంతా హాజరుకావాలని ఆయన కోరారు. -
అడ్డగోలు గరికట్లు.. ఆదాయానికి తూట్లు
- పంచాయతీల రాబడికి గండి - దారి మళ్లుతున్న రూ.లక్షలు - పట్టించుకోని మత్స్యశాఖ - డెల్టాలో పలు డ్రెయిన్లలో ఇదే పరిస్థితి భీమవరం : డెల్టాలోని పలు ప్రాంతాల్లో అనధికార గరికట్లు రాజ్యమేలుతున్నాయి. ఫలితంగా ఆయా గ్రామ పంచాయతీలు, మత్స్యకార సొసైటీలకు చేరవలసిన రూ.లక్షల ఆదాయం దారి మళ్లుతోంది. కొందరు గ్రామ పెద్దలు మత్స్యశాఖతోపాటు మత్స్యకార సొసైటీలకు సంబంధం లేకుండా అనధికార గరికట్లతో లక్షలాది రూపాయలు బొక్కేస్తున్నారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో పలు గ్రామాల్లో మేజర్, మైనర్, మీడియం డ్రెయిన్లు ఉన్నాయి. ఈ డ్రెయిన్లలో ఎటువంటి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు గరికట్లు ఏర్పాటుచేసి వాటిని పాట పెట్టి మరీ లక్షలాది రూపాయలు బొక్కేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే నెం. 2 అకౌంట్ పేరుతో గ్రామ పెద్దలు ఈ బోదె పాటల వల్ల వచ్చే ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నారు. భీమవరం, మొగల్తూరు, న రసాపురం, వీరవాసరం, కాళ్ల, యలమంచిలి, ఆకివీడు వంటి మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రవహిస్తున్న డ్రెయిన్లు, కాలువల్లో ఈ అనధికారిక గరికట్లు ఇబ్బడి ముబ్బడిగా వెలశాయి. అటు డ్రెయిన్లలోని మత్స్య సంపదను కొల్లగొట్టడంతోపాటు వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి చెందకుండా కొంతమంది పెద్దలు గెద్దల్లా తన్నుకుపోతున్నారు. ఆయా గ్రామాల్లో గతంలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మత్స్యశాఖ అనుమతితో ఈ గరికట్లు అధికారికంగా నిర్వహించేవారు. వచ్చిన పాట సొమ్మును గ్రామ పంచాయతీ ఆదాయంలో జమ చేసేవారు. ఆ ఆదాయాన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించేవారు. మరికొన్ని గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలకు ఈ డ్రెయిన్‌లోని గరికట్లను అధికారికంగా మత్స్యశాఖ అధికారులు అప్పగించి వచ్చిన ఆదాయాన్ని ఆయా సొసైటీల ఆర్థిక పురోభివృద్ధికి కేటాయించేవారు. తద్వారా మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపేవారు. వీటన్నింటినీ పక్కనపెట్టి ఆయా గ్రామాల్లో గరికట్లు అనధికారికంగా వేస్తున్నారు. పట్టించుకోని మత్స్యశాఖ డెల్టాలోని పలు డ్రెయిన్లలో గరికట్లు వేసి మత్స్య సంపదను పట్టుకుంటున్నారు. ఒక్కొక్క డ్రెయిన్‌లో అనధికారికంగా వేసిన గరికట్లకు ఆయా డ్రెయిన్ల సామర్థ్యం, మత్స్య సంపదను బట్టి రూ. 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఆదాయం వస్తుంది. భీమవరం మండలంలోని బందాలచేడు, పొలిమేరతిప్ప, మందచేడు, ధనకాలువ, గునుపూడి సౌత్, మొగల్తూరు మండలంలో దర్భరేవు డ్రెయిన్, చింతరేవు కాలువ, నరసాపురం మండలంలో నల్లిక్రీక్, యలమంచిలి మండలంలో కాజా డ్రెయిన్, కాళ్ల మండలంలో బొండాడ డ్రెయిన్, రుద్రాయికోడు, స్ట్రైట్‌కట్ డ్రెయిన్, పెదకాపవరం డ్రెయిన్లపై అనధికారిక గరికట్లు వెలశాయి. ఆయా ప్రాంతాల్లోని మత్స్యశాఖ, రెవెన్యూశాఖ అధికారులు అక్రమ గరికట్ల ఏర్పాటు దారుల వద్ద కాసులకు కక్కుర్తిపడి ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ గరికట్ల ఆదాయంపై దృష్టి సారించాలని ఆయా గ్రామాలకు చెందినవారు ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
‘ఆక్వా’ అభివృద్ధికి ప్రత్యేక ఫిషరీస్ పాలసీ
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి సాక్షి, విజయవాడ: ఆక్వాతోపాటు అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఫిషరీస్ పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించిన ‘భారత్‌లో ఆక్వా హబ్‌గా ఆంధ్రప్రదేశ్’ సదస్సులో మంత్రి మాట్లాడారు. మత్స్యశాఖ ఉత్పత్తులను రూ.23 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు పెంచేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. మత్స్యశాఖ అభివృద్ధికి రూ.187 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పుల్లారావు ప్రకటించారు. భీమవరం సమీపంలోని తుందుర్రులో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని వివరించారు.