కాళ్ల మండలం ఏలూరుపాడులో కొత్తగా చెరువులు తవ్వుతున్న దృశ్యం
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి) : జిల్లాలో తాగునీటి కాలుష్యానికి మూలకారణమైన రొయ్యల చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. అనుమతులు లేనిదే చెరువులు తవ్వితే కఠినచర్యలు తీసుకుంటామని రెవెన్యూ, మత్స్యశాఖాధికారులు హెచ్చరిస్తున్నా చెరువుల తవ్వకం ఆగకపోవడం వెనుక కొంతమంది అధికారుల మామూళ్ల వసూళ్లు, రాజకీయ నాయకుల ఒత్తిడే కారణంగా చెబుతున్నారు. జిల్లాలో గత ఏడాది కాలంగా చెరువుల తవ్వకానికి అనుమతులివ్వడం లేదు. ఇటీవల కాళ్ల మండలంలో చెరువుల తవ్వకం ప్రారంభం కాగా అక్కడి ఎమ్మెల్యే మంతెన రామరాజు అధికారులపై కన్నెర్ర చేశారు.
జిల్లాలో రొయ్యల సాగుకు అనుమతులు తక్కువే
జిల్లాలో తీరప్రాంతంలో తప్ప మరెక్కడా రొయ్యల సాగుకు అనుమతులు లేవు. వరిసాగుతో రైతులకు తీవ్ర నష్టాలు, కష్టాలు తప్పకపోవడంతో నెమ్మదిగా రొయ్యల సాగు చేపట్టారు. ముందుగా నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఆకివీడు వంటి మండలాల్లో ప్రారంభమైన రొయ్యల సాగు క్రమేణా జిల్లా అంతటా చేపలు, రొయ్యల సాగు విస్తరించింది. సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తుండగా దాదాపు 50 వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు చేస్తున్నట్లు అనధికారిక అంచనా. రొయ్యలు, చేపల చెరువుల్లోని కలుషిత నీరు డ్రయిన్లలోకి వెళ్లే అవకాశం లేకున్నా.. యథేచ్ఛగా చెరువులు తవ్వి ఆక్వా సాగు చేపట్టి నీటిని పంట కాలువల్లోకి వదలడం వల్ల తాగునీరు కలుషితమవుతోంది.
అంతేగాకుండా రొయ్యల సాగుకు బోర్ల సాయంతో ఉప్పునీటిని ఉపయోగించడం వల్ల భూగర్భజలాలు ఉప్పగా మారి డెల్టా ప్రాంతంలో తాగునీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. గతంలో అనేక గ్రామాల్లో తాగునీటి అవసరాలకు బోరు నీటిని ఉపయోగించుకోగా నేడు అలాంటి అవకాశం లేకుండా పోయింది. రొయ్యల సాగుకు తోడు వాటిని స్టోరేజ్ చేయడానికి ఎక్కడికక్కడ స్టోరేజీలు ఏర్పాటుచేయడం, రొయ్యలను కెమికల్స్‌తో శుభ్రం చేసిన నీటిని కాలువల్లోని వదలడం వల్ల నీటి కాలుష్యంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. చేపల సాగంటూ చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ముడుపుల మత్తులో అధికారులు చర్యల తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రొయ్యల సాగు వల్ల డెల్టా ప్రాంతం ఉప్పునీటి కయ్యగా మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా పక్కనున్న సారవంతమైన భూములు కూడా వరిసాగుకు పనిచేయడం లేదంటూ అనేకమంది రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువుల తవ్వకానికి అనుమతులు నిలిపివేశారు. అయితే కాళ్ల మండలంలో చెరువుల తవ్వకాల విషయం బయటపడింది. గతంలో చేపల చెరువుల పేరుతో రొయ్యలు సాగుచేస్తున్న రైతులపై కూడా చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని ప్రాంతంలో రొయ్యల సాగును నిలుపుదల చేయాలని వరి పండించే రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment