illegal excavation
-
అనుమతులు గోరంత.. దోచేది కొండంత !
పిడుగురాళ్ల రూరల్: ప్రభుత్వం పేదల కోసం నిర్మించే ఇళ్ల స్థలాల చదును కోసం మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకొని ప్రైవేటు పనులకు అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతూ అక్రమార్కులు కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లను పెట్టి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుపుతూ అక్రమార్జనకు తెరలేçపుతున్నారు. అధికారులు సైతం జరుగుతున్న అక్రమంలో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ మేము ఉన్న సమయంలో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, ఆ తవ్వకాలకు మాకు ఎటువంటి సంబంధం లేదని చర్యలు తీసుకోవటంలో జాప్యం వహిస్తూ నిర్లక్ష్య సమాధానాలు చెబుతున్నారు. అనుమతి తీసుకున్న సదరు కాంట్రాక్టర్ పిడుగురాళ్ల మండల పరిధిలోని కామేపల్లి గ్రామ బైపాస్ వద్ద ఉన్న టీడీపీ నేతకు చెందిన స్థలంలోకి, స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీకి పెద్ద మొత్తంలో మట్టి తరలిస్తూ ప్రభుత్వం ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు పిడుగురాళ్ల, మాచవరం మండలం సరిహద్దుల్లో ఉన్న గాంధీనగర్ గ్రామం పొల్లాల్లో సర్వే నంబర్ 976/2 పట్టా భూమి నందు పిన్నెల్లి గ్రామంలోని ఇళ్ల స్థలాలు చదును చేయటానికి అనుమతులు తీసుకున్నారు. గ్రావెల్ రోడ్డుకు మట్టి తవ్వకాలు నిర్వహించుకోనేందుకు కాంట్రాక్టర్ 1,660 క్యూబిక్ మీటర్లకు ఆగస్టు నెల 19న అనుమతులు పొందాడు. భారీ ప్రొక్లెయిన్లు, పదుల సంఖ్యలో లారీలతో అర్ధరాత్రి సమయంలో అదే అనుమతిని అడ్డం పెట్టుకొని పిడుగురాళ్ల మండలం కామేపల్లి బైపాస్ పక్కనే ఉన్న ఓ టీడీపీ నేత పెట్రోల్ బంకు నిర్మాణానికి, తుమ్మలచెరువు గ్రామ శివారులో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి వేల టన్నుల్లో మట్టిని సరఫరా చేస్తున్నారు. 1,660 క్యూబిక్ మీటర్లకు 93 టిప్పర్లు మాత్రమే మట్టిని సరఫరా చేసుకోవాలి. అంటే 18 క్యూబిక్ మీటరుŠల్ ఒక టిప్పర్‌కు సమానం. రోజుకు సుమారు 120 టిప్పర్లతో మట్టిని తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కో టిప్పర్‌కు వచ్చి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్క రోజుకే సుమారు రూ.9 లక్షలకుపైగా ఆదాయం గడిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఇటువైపు కన్నెతి కూడా చూడటం లేదు. అనుమతులు పొందిన సర్వే నంబర్ ఒకటి, తవ్వకాలు జరిపేది ఒక చోట అని వదంతులు వినిపిస్తున్నాయి. స్థానిక వీఆర్వో అడిగినా తనకు ఎలాంటి సమాచారం తెలియదని, ఉన్నతాధికారులను సంప్రదించాలని మాట దాటవేశారు. దీనిపై మాచవరం మండలం తహసీల్దార్ సి.చెంచులక్ష్మిని సాక్షి ఫోన్లో వివరణ కోరగా తనకు తెలియదని తాను కొత్తగా వచ్చానని, గత తహసీల్దార్ అనుమతులు ఇచ్చారని, దీనిపై తనకు తెలియదని సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశారు. చర్యలు తీసుకుంటాం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పిన్నెల్లి గ్రామ శివార్లలో 1,660 క్యూబిక్ మీటర్లకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న తహసీల్దార్ ఎంత వరకు తవ్వకాలు జరిపారో, ఎక్కడికి తరలిస్తున్నారో అని సమాచారం తెలుసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికంగా తవ్వకాలు జరిపితే మేం చర్యలు తీసుకుంటాం. – వెంకట్రావు, మైనింగ్ ఏడీ, నడికుడి -
వనరులు ఫుల్.. అవకాశాలు నిల్
గనుల్లో ప్రతీ రోజు లక్షల టన్నుల ముడిసరుకు తవ్వితీసి, వేలాది లారీల్లో పక్క రాష్ట్రాల్లోని సిమెంట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు త్రైమాసికంగా రూ.కోట్లల్లో పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతోంది. కానీ స్థానికంగా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. చదువుకున్న ఈ ప్రాంత యువత వేలల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంతో సతమతవుతున్నారు. ఇక్కడే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ విషయం తెరపైకి రావడం లేదని తెలిసింది. మల్లంపల్లి, రామచంద్రాపురంలో ఎర్రమట్టి గనులు సాక్షి ములుగు: సహజ వనరుల ఖిల్లా ములుగు జిల్లా. కానీ వనరుల వినియోగంలో మాత్రం నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ములుగు మండలం మల్లంపల్లి నుంచి వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి సరిహద్దు వరకు, మరో వైపు శాయపేట మండల సరిహద్దు వరకు వేలాది ఎకరాల్లో ఎర్రమట్టి గనులు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ 30పైగా క్వారీల నిర్వహణ జరుగుతుండగా 220 హెక్టార్లకు పైగా భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ప్ర«ధానంగా ఎర్రమట్టి, బాక్సైట్, డోలమైట్, క్రే, లాటరైట్, ఐరన్‌ఓర్ వంటి నిక్షేపాలు తవ్వి తీస్తున్నారు. ఐరన్ ఓర్, ఇసుక, నీరు.. సిమెంట్ తయారీలో కాల్షియం, సిలికాన్, అల్యూమినీయం, ఐరన్‌ఓర్, ఇసుక, నీరు, సున్నపురాయి ప్రధానమైనవి. ఇందులో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో పుష్కలమైన ఐరన్‌ఓర్ ఉంది. అలాగే జిల్లా తలాపున గోదావరి పారుతోంది. మల్లంపల్లి పరీవాహక ప్రాంతానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఇసుకతో పాటు, నీటి లభ్యత ఆశించే స్థాయిలో ఉన్నాయి. అలాగే మాన్సింగ్ తండా సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు వందల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. రావాణా పరంగా చూస్తే ఇక్కడి నుంచి వరంగల్ కేంద్రం కేవలం 37 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. వరంగల్, కాజీపేటలో రైల్వే కేంద్రాలు రవాణాకు మరింత సౌలభ్యంగా ఉన్నాయి. ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్న మల్లంపల్లి, రామచంద్రాపురం ఏరియాలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏజెన్సీ అభివృద్ధి చెందుతుంది. క్వారీలన్నీ లీజు.. ప్రస్తుతం మల్లంపల్లి, రామచంద్రాపురం సమీపంలోని ఎర్రమట్టి క్వారీలు అన్నీ లీజులో నడుస్తున్నాయి. 20 సంవత్సరాల చొప్పున గనుల శాఖ వ్యాపారులకు అప్పగించింది. ఇదంతా పక్కనబెట్టి నేరుగా ప్రభుత్వమే తవ్వకాలు జరిపి సిమెంట్ ముడి సరుకుకు అవసరమైన ఐరన్‌ఓర్, నాణ్యమైన ఎర్రమట్టిని సేకరించి పరిశ్రమకు ప్రోత్సహిస్తే బాగుంటుందని నిరుద్యోగ యువత కోరుతుంది. అనుకున్న మేర ప్రభుత్వం చొరవ తీసుకుంటే సుమరు 3వేల నుంచి 5వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. స్థానిక వనరులతో పరిశ్రమ ఏర్పాటు చేయాలి మల్లంపల్లి. రామచంద్రాపురం ప్రాంతాల్లో లభ్యమయ్యే వనరుల ఆధారంగా వీలును బట్టి చిన్న, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇక్కడున్న ముడిసరుకును బయటి ప్రాంతాలకు తరలించి పన్నులు వసూలు చేస్తున్నారే తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం మల్లంపల్లి ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకోవాలి. – ధనసరి సీతక్క, ఎమ్మెల్యే, ములుగు ఉపాధి కల్పించాలి మల్లంపల్లిలో సిమెంట్ ఆధారిత, ఖనిజాధార పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్థానికంగా ఎలాంటి అవకాశాలు లేక యువత హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాలలోని పరిశ్రమల్లో పని చేయడానికి వలస వెళ్తున్నారు. – మొర్రిరాజు యాదవ్, మల్లపల్లి -
అక్రమ చెరువుల దందా
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి) : జిల్లాలో తాగునీటి కాలుష్యానికి మూలకారణమైన రొయ్యల చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. అనుమతులు లేనిదే చెరువులు తవ్వితే కఠినచర్యలు తీసుకుంటామని రెవెన్యూ, మత్స్యశాఖాధికారులు హెచ్చరిస్తున్నా చెరువుల తవ్వకం ఆగకపోవడం వెనుక కొంతమంది అధికారుల మామూళ్ల వసూళ్లు, రాజకీయ నాయకుల ఒత్తిడే కారణంగా చెబుతున్నారు. జిల్లాలో గత ఏడాది కాలంగా చెరువుల తవ్వకానికి అనుమతులివ్వడం లేదు. ఇటీవల కాళ్ల మండలంలో చెరువుల తవ్వకం ప్రారంభం కాగా అక్కడి ఎమ్మెల్యే మంతెన రామరాజు అధికారులపై కన్నెర్ర చేశారు. జిల్లాలో రొయ్యల సాగుకు అనుమతులు తక్కువే జిల్లాలో తీరప్రాంతంలో తప్ప మరెక్కడా రొయ్యల సాగుకు అనుమతులు లేవు. వరిసాగుతో రైతులకు తీవ్ర నష్టాలు, కష్టాలు తప్పకపోవడంతో నెమ్మదిగా రొయ్యల సాగు చేపట్టారు. ముందుగా నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఆకివీడు వంటి మండలాల్లో ప్రారంభమైన రొయ్యల సాగు క్రమేణా జిల్లా అంతటా చేపలు, రొయ్యల సాగు విస్తరించింది. సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తుండగా దాదాపు 50 వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు చేస్తున్నట్లు అనధికారిక అంచనా. రొయ్యలు, చేపల చెరువుల్లోని కలుషిత నీరు డ్రయిన్లలోకి వెళ్లే అవకాశం లేకున్నా.. యథేచ్ఛగా చెరువులు తవ్వి ఆక్వా సాగు చేపట్టి నీటిని పంట కాలువల్లోకి వదలడం వల్ల తాగునీరు కలుషితమవుతోంది. అంతేగాకుండా రొయ్యల సాగుకు బోర్ల సాయంతో ఉప్పునీటిని ఉపయోగించడం వల్ల భూగర్భజలాలు ఉప్పగా మారి డెల్టా ప్రాంతంలో తాగునీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. గతంలో అనేక గ్రామాల్లో తాగునీటి అవసరాలకు బోరు నీటిని ఉపయోగించుకోగా నేడు అలాంటి అవకాశం లేకుండా పోయింది. రొయ్యల సాగుకు తోడు వాటిని స్టోరేజ్ చేయడానికి ఎక్కడికక్కడ స్టోరేజీలు ఏర్పాటుచేయడం, రొయ్యలను కెమికల్స్‌తో శుభ్రం చేసిన నీటిని కాలువల్లోని వదలడం వల్ల నీటి కాలుష్యంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. చేపల సాగంటూ చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ముడుపుల మత్తులో అధికారులు చర్యల తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. రొయ్యల సాగు వల్ల డెల్టా ప్రాంతం ఉప్పునీటి కయ్యగా మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా పక్కనున్న సారవంతమైన భూములు కూడా వరిసాగుకు పనిచేయడం లేదంటూ అనేకమంది రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువుల తవ్వకానికి అనుమతులు నిలిపివేశారు. అయితే కాళ్ల మండలంలో చెరువుల తవ్వకాల విషయం బయటపడింది. గతంలో చేపల చెరువుల పేరుతో రొయ్యలు సాగుచేస్తున్న రైతులపై కూడా చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని ప్రాంతంలో రొయ్యల సాగును నిలుపుదల చేయాలని వరి పండించే రైతులు కోరుతున్నారు. -
అయినా ఆగటం లేదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధికార పార్టీ అండతో అనధికార ర్యాంపుల్లోనూ తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవడం లేదు. గోదావరి నది పొడవునా అక్రమ తవ్వకాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఇసుక అక్రమ దందాను నిలుపుదల చేయాలనే డిమాండ్‌తో అక్కడి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసిన గ్రామస్తులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది దుర్మరణం పాలవగా, మరో 15 మంది గాయపడిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత కూడా అ«ధికార పార్టీ నేతల వైఖరిలో మార్పు రాలేదు. అడుగడుగునా అక్రమ దందాయే : జిల్లావ్యాప్తంగా చిన్నాపెద్ద కలిపి మొత్తం 42 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. వీటిలో సుమారు 1.10 కోట్ల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక తవ్వారు. తనిఖీలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే చాలా ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. కొవ్వూరు, వాడపల్లి, సిద్ధాంతం, నరసాపురం రేవుల్లో జేసీబీలను ఉపయోగించి తవ్వకాలు జరుపుతున్నారు. యూనిట్ ఇసుక రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతోంది. ఇసుక తరలింపుదారులు పంచాయతీలకు ఎటువంటి శిస్తు చెల్లించడం లేదు. ఇటీవల తమ్మిలేరు నుంచి ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకున్న స్థానికులపై తెలుగుదేశం నేతలు దాడులకు తెగబడ్డారు. ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వాహనాలను స్థానిక నాయకులు అడ్డుకుంటూ.. తాము నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. లేకుంటే ఇసుక తరలించే లారీలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. నిడదవోలు మండలం పందలపర్రు ఇసుక ర్యాంపును ఎటువంటి ఉత్తర్వులు లేకుండా టీడీపీ నాయకుల సహకారంతో వారం రోజులపాటు అనధికారికంగా నిర్వహించారు. కూలీలతో తవ్వకాలు చేయించాల్సి రావడంతో గిట్టుబాటు కావడం లేదని మూసివేశారు. మరోవైపు పెండ్యాల ఇసుక ర్యాంపులో 20 రోజులుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కూలీలతో ఎగుమతి చేయిస్తుండటంతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. యూనిట్‌కు రూ.300, నిర్వాహణ చార్జీలంటూ రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. పందలపర్రు శివారు రావివారిపాలెంలో టీడీపీ నాయకులు బరితెగించారు. అనధికారికంగా ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. ఇందుకోసం గ్రామం నుంచి ర్యాంపు వరకు రహదారి సైతం నిర్మించారు. పొక్లెయిన్లతో నదిలోంచి ఇసుక తవ్వి అనధికారికంగా ఏర్పాటు చేసిన ర్యాంపులోకి డంప్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళ భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. మూడు యూనిట్లకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ నాయకులు వెనుక ఉండి నడిపిస్తున్నారు. -
లెసైన్సులు!
►అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ►ఎకరాకు రూ.8,500 లంచం! ►చక్రం తిప్పుతున్న ఎఫ్‌డీవోలు ►పైరవీలు చేస్తేనే త్వరగా పనులు మచిలీపట్నం : జిల్లాలో చేపల చెరువుల లెసైన్సుల జాతర ముమ్మరంగా సాగుతోంది. చేపల చెరువుల అక్రమ తవ్వకాలకు బ్రేక్ వేసేందుకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన నియమనిబంధనలను మండల స్థాయి అధికారులు తుంగలో తొక్కేస్తున్నారు. ఇష్టారాజ్యంగా పైరవీలు చేస్తూ చేపల చెరువులకు అనుమతులు ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చేపల చెరువుల లెసైన్సులు మంజూరు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఉన్నా, వీరందరి కళ్లుకప్పి రాత్రికి రాత్రే లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. పలు మండలాల్లో ఉన్న ఎఫ్‌డీవోలు లెసైన్సులు ఇప్పించటంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లెసైన్సులు మంజూరు చేసేందుకు ఎకరానికి రెవెన్యూ శాఖకు రూ.5,500, మత్స్యశాఖకు రూ.3వేలు చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. 1,645 దరఖాస్తులు 16,874 ఎకరాలు జిల్లాలో ఇప్పటి వరకు 16,874 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం కోసం మత్స్యశాఖకు వద్దకు 1,645 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 348 దరఖాస్తులను పరిశీలించి 6,201 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి ప్రాథమికంగా అనుమతులు ఇచ్చారు. 150 ఎకరాల భూమి చేపల చెరువుల తవ్వకానికి అనుకూలంగా లేదని, ఇందుకోసం వచ్చిన 14 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 1,200 పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండవల్లి, నందివాడ మండలాల నుంచే చేపల చెరువుల తవ్వకాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. జరుగుతున్నది ఇదీ.. చేపల చెరువుల తవ్వకానికి అనుమతులను వేగవంతం చేసేందుకు ఇటీవల మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తహశీల్దార్ చైర్మన్‌గా, ఎఫ్‌డీవో కన్వీనరుగా ఉన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ, డ్రెయినేజీ, ఆర్డబ్ల్యూఎస్ తదితర విభాగాల అధికారులు భూములను పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. డివిజన్ స్థాయిలో ఆర్డీవో ఈ భూములను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక పంపాల్సి ఉంది. అయితే తెరవెనుక కథ వేరుగా ఉంది. ఇంత మంది అధికారుల పరిశీలన చేయాల్సి ఉన్నా, ఇవేమి జరగకుండానే తెర వెనుక నోట్ల కట్టలు చేతులు మారుతుండటంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేపల చెరువులకు అనుమతులు ఇచ్చే విషయంలో నగదు చేతులు మారుతున్నాయనే అంశంపై మత్స్యశాఖ డీడీ టి కళ్యాణంను ‘సాక్షి’ వివరణ కోరగా, ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామని, అక్కడక్కడా తప్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.