లెసైన్సులు! | Fish ponds illegally dredging permit | Sakshi
Sakshi News home page

లెసైన్సులు!

Published Mon, Sep 15 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

లెసైన్సులు!

లెసైన్సులు!

►అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి
 ►ఎకరాకు రూ.8,500 లంచం!
►చక్రం తిప్పుతున్న ఎఫ్‌డీవోలు
►పైరవీలు చేస్తేనే త్వరగా పనులు
మచిలీపట్నం : జిల్లాలో చేపల చెరువుల లెసైన్సుల జాతర ముమ్మరంగా సాగుతోంది. చేపల చెరువుల అక్రమ తవ్వకాలకు బ్రేక్ వేసేందుకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన నియమనిబంధనలను మండల స్థాయి అధికారులు తుంగలో తొక్కేస్తున్నారు. ఇష్టారాజ్యంగా పైరవీలు చేస్తూ చేపల చెరువులకు అనుమతులు ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చేపల చెరువుల లెసైన్సులు మంజూరు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఉన్నా, వీరందరి కళ్లుకప్పి రాత్రికి రాత్రే లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. పలు మండలాల్లో ఉన్న ఎఫ్‌డీవోలు లెసైన్సులు ఇప్పించటంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లెసైన్సులు మంజూరు చేసేందుకు ఎకరానికి రెవెన్యూ శాఖకు రూ.5,500, మత్స్యశాఖకు రూ.3వేలు చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం.  
 
1,645 దరఖాస్తులు 16,874 ఎకరాలు
జిల్లాలో ఇప్పటి వరకు 16,874 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం కోసం మత్స్యశాఖకు వద్దకు 1,645 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 348 దరఖాస్తులను పరిశీలించి 6,201 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి ప్రాథమికంగా అనుమతులు ఇచ్చారు.
 150 ఎకరాల భూమి చేపల చెరువుల తవ్వకానికి అనుకూలంగా లేదని, ఇందుకోసం వచ్చిన 14 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 1,200 పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండవల్లి, నందివాడ మండలాల నుంచే చేపల చెరువుల తవ్వకాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి.
 
జరుగుతున్నది ఇదీ..
చేపల చెరువుల తవ్వకానికి అనుమతులను వేగవంతం చేసేందుకు ఇటీవల మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తహశీల్దార్ చైర్మన్‌గా, ఎఫ్‌డీవో కన్వీనరుగా ఉన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ, డ్రెయినేజీ, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర విభాగాల అధికారులు భూములను పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. డివిజన్ స్థాయిలో ఆర్డీవో ఈ భూములను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక పంపాల్సి ఉంది. అయితే తెరవెనుక కథ వేరుగా ఉంది.

ఇంత మంది అధికారుల పరిశీలన చేయాల్సి ఉన్నా, ఇవేమి జరగకుండానే తెర వెనుక నోట్ల కట్టలు చేతులు మారుతుండటంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేపల చెరువులకు అనుమతులు ఇచ్చే విషయంలో నగదు చేతులు మారుతున్నాయనే అంశంపై మత్స్యశాఖ డీడీ టి కళ్యాణంను ‘సాక్షి’ వివరణ కోరగా, ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామని, అక్కడక్కడా తప్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement