Department of Fisheries
-
ఆరోగ్యాన్నిచ్చే సముద్రపు నాచు.. ఎన్నెన్నో పోషకాలు.. ఏపీకి సదావకాశం
సీవీడ్.. శతాబ్దాలుగా పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన పేరిది. దశాబ్ద కాలంగా దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రయోగాత్మక సాగుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో దీని ప్రత్యేకతలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సముద్రపు నాచుగా పిలిచే సీవీడ్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతోపాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ సమ్మేళనాల్లో ఉంటాయి. శతాబ్దాలుగా చైనా, జపాన్, కొరియా, మెక్సికో వంటి కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో సముద్రపు నాచును సంప్రదాయ ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఐరోపా వంటకాల్లో సముద్రపు నాచును చేర్చేందుకు ఫ్రాన్స్‌లో పెద్దఎత్తున ప్రయత్నాలు చేసి కొంతమేర విజయం సాధించారు. జపాన్ దేశీయులు ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, హవాయి వంటి ప్రాంతాల్లో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్లలో ఇది సాధారణంగానే కనిపిస్తోంది. వాస్తవానికి ఆస్ట్రియా, జర్మనీలలో సముద్రపు నాచును అత్యంత విలువైన బ్రెడ్–అల్టెన్బ్రోట్ను ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌లో బారామోర్ లేదా బ్రెడ్ ఆఫ్ సీ తయారీకి ఉపయోగిస్తున్నారు. తృణ ధాన్యాల మిశ్రమం సీవీడ్ తృణధాన్యాల మిశ్రమం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా తూర్పు తీరంలో కొన్ని కంపెనీలు మానవ వినియోగం కోసం ప్రత్యేకంగా సముద్రపు నాచును పెంచడం ప్రారంభించాయి. ప్రపంచ జనాభా పెరుగుదల, పరిమిత భూమి, విలువైన సహజ వనరుల ప్రాముఖ్యత దీనిపై పరిశోధనలకు కారణమైంది. జపాన్, చైనా వంటి కొన్ని దేశాల్లో వీటి పెంపకం పరిశ్రమ స్థాయికి చేరుకుంది. జపాన్, చైనా, కొరియా, మెక్సికో, అమెరికన్ దేశాల్లో శతాబ్దాలుగా దాదాపు 66 శాతం ఆల్గే (సముద్రపు నాచు) జాతులను రోజువారీ ఆహారంలో ఉపయోగిస్తున్నారు. మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని గుర్తించారు. ఏపీకి అందివచ్చిన అవకాశం సువిశాల సముద్ర తీరం గల ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ఇప్పుడు మెగా మిషన్‌ను ప్రారంభించింది. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు శ్రీకాకుళం జిల్లా బారువ, విశాఖపట్నం భీమిలి బీచ్‌కు వెళ్లే దారిలో మంగమారిపేట, బాపట్ల జిల్లా సూర్యలంక, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో పైలట్ ప్రాతిపదికన సీవీడ్ సాగును ప్రారంభించారు. రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో 49 ప్రదేశాలు దీని సాగుకు అనువైనవిగా గుర్తించారు. మన దేశంలో సముద్రపు నాచును మందులు, వస్త్రాలు, ఎరువులు, పశువుల దాణా, జీవ ఇంధన పరిశ్రమల్లోనూ వినియోగిస్తున్నారు. సీవీడ్ ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ రంగుల్లో ఉంటుంది. అత్యధికంగా సాగు చేస్తున్న సీవీడ్ రకాలు కప్పాఫైకస్ ఆల్వారెజి, గ్రాసిలేరియా, సాచరినా జపోనికా, ఫైరోపియా, సర్గస్సమ్ ప్యూసిఫార్మ్. ప్రభుత్వ ప్రోత్సాహం సీవీడ్ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్రం తీరప్రాంత రాష్ట్రాలతో కలిసి సాగును ప్రోత్సహిస్తోంది. ఏపీలో 10 వేల సీవీడ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద 60–40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత ఇస్తున్నాయి. మత్స్యకారులు, మత్స్యకార మహిళా సొసైటీలు, ఎస్సీ, ఎస్టీ కో–ఆపరేటివ్ సొసైటీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకం కింద సాయం పొందేందుకు అర్హులు. 15 మందితో ఏర్పాటయ్యే ఒక్కో క్లస్టర్ పరిధిలో రూ.1.50 లక్షల పెట్టుబడితో సాగు చేస్తే రూ.6 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడిలో 60 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్రానికి ఈ ఏడాది 7,200 యూనిట్లు మంజూరు చేశారు. రూ.1.86 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1.12 కోట్లు సబ్సిడీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా రూ.74.40 లక్షలు లబ్ధిదారులు భరిస్తారు. ♦ సీవీడ్ సాగుకు అయ్యే వ్యయం అత్యల్పం. శ్రమశక్తి వినియోగం కూడా స్వల్పమే. ♦ ఒకసారి విత్తనాలు కొని తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా పునరుత్పత్తి అయ్యే విత్తనాలే వాడుకోవచ్చు. ♦ ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వేయాల్సిన అవసరం లేదు. ♦కొద్దిపాటి శిక్షణతో మహిళలు, నిరక్షరాస్యులు సైతం పెద్దఎత్తున సాగు చేయవచ్చు. ♦రెండు నెలల వ్యవధిలోనే ఉత్పత్తులు చేతికి వచ్చే అవకాశం ఉంది. ♦దేశవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో పాటు ప్రభుత్వమే మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. ♦ సముద్రపు నాచులో అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీంతో ఫార్మా కంపెనీలకు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడుతుంది. ♦ రొయ్యలు, చేపల పెంపకంలో నాణ్యమైన ఫీడ్‌గా, పంటలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ♦అధిక పోషకాలు ఉన్నందున ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ♦ నీటిని శుభ్రపరిచే గుణం దీనికి ఉంది. సముద్రంలో చేరే మురుగు, ఇతర వ్యర్థాలను శోషించుకుని నీటిని స్వచ్ఛంగా ఉంచేందుకు నాచు సహాయ పడుతుంది. సాగు ఇలా.. సముద్రంలో అలలు తక్కువగా ఉండే ప్రదేశాలు, బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతాల్లో సీవీడ్ సాగు చేసుకోవచ్చు. అలల ఉధృతి అధికంగా ఉంటే నాచు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదముంది. ఏడాదిలో ఏడెనిమిది నెలలు దీని సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సీవీడ్ విత్తనాలను కిలో రూ.50 చొప్పున తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. అధిక సాంద్రత కలిగిన పాలీవినైల్ పైప్స్ లేదా ట్యూబ్ నెట్ పద్ధతిలో సాగు చేపడుతున్నారు. సీఎంఎఫ్ఆర్ఐ, పీఎంఎంఎస్వై ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తాయి. విత్తనాలను వలల్లో అమర్చి ఆ వలలను కర్రలు లేదా పైపులకు కడతారు. కెరటాల అలజడి లేని తీర ప్రాంతాల్లో వాటిని తెప్పల్లా అమర్చుతారు. 2 రోజులకోసారి వాటిని పరిశీలిస్తుంటారు. 45–60 రోజుల్లో మొక్కలు పెరుగుతాయి. వాటిని ఎండబెట్టి విక్రయిస్తారు. – సురేష్, మత్స్యశాఖ జేడీ, బాపట్ల జిల్లా -
మరింత మందికి ఆక్వా విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు ఆక్వా సాగుచేసే రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్న ప్రభుత్వం మరింతమందికి లబ్దిచేకూర్చాలని సంకల్పించింది. జోన్ పరిధిలో అసైన్డ్ భూములతో సహా వివిధరకాల ప్రభుత్వ భూముల్లో సాగుచేస్తున్న వారితోపాటు దేవదాయ భూములను లీజుకు తీసుకుని సాగుచేస్తున్న పదెకరాల్లోపు వారికి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. వెబ్‌ల్యాండ్‌లో ఈ భూముల హక్కులు ప్రభుత్వ, ఆయా దేవస్థానాల పేరిట నమోదై ఉండడంతో ఆక్వా సబ్సిడీ వర్తింపునకు సాంకేతికంగా ఇబ్బంది నెలకొంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అయా భూముల్లో పదెకరాల్లోపు సాగుచేస్తున్న రైతులందరికి సబ్సిడీ వర్తించేలా వెసులుబాటు కల్పించింది. ఈ ఫిష్ సర్వే ప్రకారం 1,72,514 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 3,14,313 ఎకరాల్లోను, 4,691 మంది పదెకరాలకు పైగా విస్తీర్ణంలో.. మొత్తం 1,17,780 ఎకరాల్లోను ఆక్వా సాగుచేస్తున్నారు. నోటిఫైడ్ ఆక్వాజోన్ పరిధిలో 2,49,348 ఎకరాల్లో 1,00,792 మంది సాగుచేస్తున్నారు. వీరిలో 98,095 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 1,86,218 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. నాన్ ఆక్వాజోన్ పరిధిలో 74,419 మంది 1,28,095 ఎకరాల్లో సాగుచేస్తుండగా, 76,413 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 1,82,744 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. జోన్ పరిధిలో పదెకరాల్లోపు సాగుదారులందరికీ ఈ నెల 1వ తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు.. జోన్ పరిధిలో పదెకరాల్లోపు అసైన్డ్‌తో సహా వివిధరకాల ప్రభుత్వ, దేవదాయ భూముల్లో సాగుచేస్తున్న వారికి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలను ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబును ఆదేశించారు. దీంతో మత్స్యశాఖాధికారులు జోన్ పరిధిలో అసైన్డ్ ల్యాండ్స్, వివిధరకాల ప్రభుత్వ, దేవదాయ భూముల్లో పదెకరాల్లోపు సాగుచేస్తున్నవారిని గుర్తించి వారికి విద్యుత్ సబ్సిడీ వర్తించేలా చర్యలు చేపట్టారు. ఈ జాబితాలను తయారుచేసి ఆయా డిస్కమ్‌లకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు నాన్ ఆక్వాజోన్ ప్రాంతాల్లో అర్హతగల ఆక్వాజోన్ ప్రాంతాల గుర్తింపునకు చేపట్టిన సర్వే పూర్తికాగా, వాటికి గ్రామసభతోపాటు జిల్లాస్థాయి కమిటీలు ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిస్కమ్‌లకు జాబితాలు ఆక్వాజోన్‌లో పదెకరాల్లోపు అర్హత కలిగిన విద్యుత్ కనెక్షన్ల వివరాలను డిస్కమ్‌లకు పంపించాం. వాటికి యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జోన్ పరిధిలో ఉన్న అసైన్డ్, ఇతర ప్రభుత్వ, దేవదాయ భూముల్లో సాగుచేసే పదెకరాల్లోపు రైతులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసేలా చర్యలు చేపట్టాం. ఈ జాబితాలను డిస్కమ్‌లకు పంపిస్తున్నాం. నాన్ ఆక్వాజోన్ ప్రాంతాల్లో అర్హమైన ప్రాంతాలను గుర్తించి జోన్ పరిధిలోకి బదలాయించేందుకు చర్యలు చేపట్టాం. – కూనపురెడ్డి కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
బ్రాండింగ్ ‘చేప’ట్టిన సర్కారు.. ‘ఫిష్ ఆంధ్ర’కు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ’ఫిష్ ఆంధ్ర’ బ్రాండింగ్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు మత్స్య శాఖచర్యలు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులతో ఆక్వా రంగంలో తరచూ తలెత్తుతున్న సంక్షోభం దృష్ట్యా కేవలం ఎగుమతులపైనే ఆధారపడకుండా స్థానిక వినియోగంపైనా దృష్టి సారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగం పెంచడం.. తద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు అండగా నిలబడటమే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో లభించే సముద్ర, రైతులు పండించే మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట హబ్‌లు, అవుట్‌లెట్స్, కియోస్క్‌ల ద్వారా మత్స్య శాఖ విక్రయిస్తోంది. వీటిని బ్రాండింగ్ చేసేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్‌తో పాటు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రమోట్ చేయనుంది. డోర్ డెలివరీ కోసం ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేయనున్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ (సీఆర్ఎంఎస్) ద్వారా వినియోగదారులు ఎలాంటి ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానిపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ నియమించనున్నారు. ఆసక్తి కల్గిన ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) కోరుతూ బుధవారం మత్స్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు www.fisheries.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా టెండర్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని వచ్చే నెలాఖరులోగా apfisheriestender@gmail.comలో దరఖాస్తు చేసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు కోరారు. -
జోన్.. జోష్
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రణాళిక రూపొందించింది. ఆక్వా జోనేషన్ విధానంతో సాగు చేసే విస్తీర్ణం, రైతుల వివరాలతో లెక్కలు తేల్చి అన్ని విధాలా ఆదుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ–ఫిష్ యాప్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఎంత విద్యుత్ అవసరమో గుర్తించి రైతులకు విద్యుత్ చార్జీల భారం నుంచి భారీ విముక్తిని కల్పించనుంది. విడవలూరు: ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆక్వా జోనేషన్ విధానం వరంగా మారనుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో రొయ్యల ధరల ఒడిదుడుకుల కారణంగా జిల్లాలోని ఆక్వా రైతులు అతలాకుతలమవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేతస్థాయిలో దళారులు మొండి చేయి చూపుతున్నారు. ఆక్వా రైతులకు అండగా ఉండేందుకు ఇప్పటికే ఆక్వా జోనేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. మత్స్యశాఖ, విద్యుత్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్న అధికారులు ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలు, విద్యుత్ వినియోగం వివరాలను ఈ–ఫిష్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. తాజాగా మరోసారి సర్వే ప్రారంభించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఆక్వా రైతులకు ఊరట ప్రతి ఆక్వా రైతు ఈ–ఫిష్‌లో నమోదు చేసుకోవడం వల్ల వారికి కరెంట్ చార్జీలు భారీగా తగ్గుముఖం పడుతాయి. జిల్లాలోని తీర ప్రాంతాలైన ఉలవపాడు, గుడ్లూరు, కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాల్లో ఆక్వా సాగు కింద రొయ్యలు, చేపలను సాగు చేస్తున్నారు. ఈ 9 మండలాల్లో సుమారు 8,500 మంది రైతులు సుమారు 40 వేల ఎకరాల ఆక్వా సాగు చేస్తున్నారు. ఏటా రెండు దఫాలుగా సాగు జరుగుతోంది. ఈ సాగులో మొదటి నెలలో ఎకరా గుంతకు రెండు ఏయిరేటర్లు, రెండు మోటార్లు నిత్యం నియోగించాలి. రెండో నెలలో నాలుగు ఏయిరేటర్లు, రెండు మోటార్లు, మూడో నెలలో ఆరు ఏయిరేటర్లు, రెండు మోటార్లను రైతులు వినియోగిస్తుంటారు. ఏడాదికి రూ. 480 కోట్ల మేర భారం ప్రస్తుతం ఆక్వా సాగు కింద విద్యుత్ యూనిట్‌ను రూ.3.85 చొప్పున వసూలు చేస్తున్నారు. నెలకు ఒక ఎకరాకు రూ.30 వేల విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే ఈ–ఫిష్ రీ సర్వే పూర్తయ్యాక యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందిస్తారు. దీంతో నెలకు ఎకరాకు సుమారు రూ.10 వేల లోపు మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. ఈ లెక్కన నెలకు ప్రభుత్వంపై దాదాపు రూ.80 కోట్లు భారం పడనుంది. ఏడాదిలో ఆక్వా సాగు జరిగే ఆరు నెలలకు నెలకు రూ. 80 కోట్లు చొప్పున రూ.480 కోట్ల మేర భారం పడనుంది. ఈ– ఫిష్ నమోదు ప్రక్రియ ఇలా.. ►కేవలం 10 ఎకరాల్లోపు విస్తీర్ణం కలిగిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ►ఆక్వా సాగు చేసే పరిధిలోని సచివాలయంలో మత్స్యశాఖ ఉద్యోగి ద్వారా నమోదు ప్రక్రియ చేసుకోవాలి. ►రైతుకు సంబంధించిన ఆక్వా సాగు విస్తీర్ణ ధ్రువీకరణ పత్రాలు, సర్వే నంబర్ పత్రాలు, విద్యుత్ సర్వీస్ నంబర్ పత్రాలు, ఆధార్‌కార్డు, మత్స్యశాఖ వారు జారీ చేసిన లైసెన్సు లేదా, కార్డును ఉద్యోగులకు అందజేయాలి. ►అనంతరం వాటిని జిల్లా మత్స్యశాఖ జేడీ కార్యాలయానికి పంపి అక్కడ నుంచి విద్యుత్ జిల్లా అధికారులకు నివేదికను అందజేస్తారు. రైతులకు భారీ ఊరట ఆక్వా జోనేషన్ నిజంగా ఆక్వా రైతుల పాలిట వరం. ప్రస్తుతం ఆక్వా సాగు ఒడిదుడుకుల మధ్య సాగడంతో నష్టాలను చవి చూస్తున్నాం. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నాం. ఈ విధానంతో యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50లకే మాత్రమే పడడంతో చాలా వరకు కష్టాలు తీరనున్నాయి. – వెంకటేశ్వర్లు, రామచంద్రాపురం, విడవలూరు మండలం చిన్న రైతులకు మేలు ఈ ఆక్వా జోనేషన్ చిన్న, సన్న కారు ఆక్వా రైతులు చాల మేలు కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కేవలం 10 ఎకరాల లోపు వారు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంది. చిన్న రైతులకు విద్యుత్ భారం తగ్గనుంది. చిన్న రైతులు కూడా సాగు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. – సంతోష్, ఆక్వా రైతు, గంగపట్నం, ఇందుకూరుపేట మండలం ఆక్వా జోనేషన్ వరం ఈ ఆక్వా జోనేషన్ పథకం ద్వారా విద్యుత్ చార్జీలు భారీగా తగ్గుతాయి. ఇప్పటికే మా సిబ్బంది రీ సర్వే చేసి గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాగును నమోదు చేస్తున్నాం. ఇంకా నమోదు చేసుకోని రైతులు సచివాలయాలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ -
Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు
ప్రజల కోసం ప్రశ్నించే పార్టీ.. అవినీతికి తావులేని రాజకీయాలకు పనిచేసే పార్టీ తమదని హడావుడి చేసే జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్‌నాయుడు అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫోర్జరీ, బ్యాంకు గ్యారంటీలతో తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసి అడ్డంగా బుక్కైన జేపీ నాయుడు వ్యవహారం జిల్లా జనసేనలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జేపీ వివాదాస్పద వ్యవహార శైలిపై సర్వత్రా చర్చ సాగుతోంది. తొమ్మిదేళ్ల్ల కాలంలో అతడిపై 9 కేసులు నమోదై కొన్ని కేసులు ముగిసిపోగా, మరికొన్ని విచారణ దశలోనూ, ఇంకొన్ని కోర్టుల్లో వివిధ దశల్లోనూ ఉన్నాయి. సాక్షి, ఏలూరు: తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ అక్కడ చెరువుల్లో చేప, రొయ్యల పిల్లలు పెంచడానికి వీలుగా టెండర్లు ఆహ్వానించింది. ఈ క్రమంలో భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు, అతని బృందం టెండ ర్లు దాఖలు చేసి దక్కించుకున్నాకా బ్యాంకు గ్యారంటీ, ఫెర్ఫార్మెన్స్ గ్యారంటీ పత్రాలు సమర్పించి టెండర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని 9 జిల్లాలో జేపీ నాయుడు అండ్ టీం టెండర్లు దక్కించుకుంది. ఈ క్రమంలో జయప్రకాష్ నాయుడు పాలకొల్లులోని ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి నామమాత్రంగా బ్యాంకు గ్యారంటీలను తీసుకుని, తీసుకున్న డాక్యుమెంట్లను పూర్తిగా ఫోర్జరీ చేసి గ్యారంటీ విలువను పూర్తిగా పెంచి బ్యాంకు సిబ్బంది సంతకాలు, నకిలీ స్టాంపులతో తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించారు. విచారణలో ఇదంతా వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం టెండర్ రద్దు చేయడంతో పాటు జేపీ నాయుడు అతని బృందంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించి సీఐడీకి కేసు అప్పగించినట్టు సమాచారం. ఈ క్రమంలో జయప్రకాష్ నాయుడు వ్యవహార శైలి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందిన జేపీపై 2014 నుంచి ఇప్పటివరకు భీమవరం వన్‌టౌన్, టూటౌన్, పాలకోడేరు, వీరవాసరం పోలీస్స్టేషన్లల్లో 9 కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు ముగిసిపోగా, మిగతా కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. చదవండి: (బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్) కబ్జాలు.. హత్యాయత్నాలు భీమవరం 32వ వార్డులో గాదిరాజు నాగేశ్వరరాజు జగన్నాథరాజుకు చెందిన 10 సెంట్ల భవనాన్ని శ్రీరామరాజు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిలో జయప్రకాష్‌నాయుడు కలు గచేసుకుని భవనం తనదేనని, యజమాని రికార్డులో తన పేరు నమోదు చేయాలని కోరారు. అయితే అప్పటికే గాదిరాజు నాగేశ్వరరాజు పేరు రికార్డుల్లో ఉండటంతో జయప్రకాష్ యత్నం విఫలమైంది. దీంతో నాగేశ్వరరాజు తల్లి జయప్రకాష్‌నాయుడుకు సంబంధించి వెంకటపతిరాజుకు రిజిస్ట్రేషన్ చేసిందని నకిలీ పత్రాలు సృష్టించి జయప్రకాష్ అనుచరులైన పృధ్వీరాజ్, మురళీకృష్ణలను సాక్ష్యులుగా పెట్టుకుని 2014 గణపవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వెంకటపతిరాజు పేరుతో రిజిస్ట్రేషన్‌కు యత్నించారు. ఈ సమాచారంతో నాగేశ్వరరాజు కోర్టులో కేసు దాఖలు చేయడంతో పాటు భీమవరం టూటౌన్ స్టేషన్లో కేసు పెట్టారు. ►ఇదే రీతిలో ప్రభుత్వ భూమి కబ్జాకు జేపీ ప్రత్యేక స్కెచ్ గీశారు. వీరవాసరంలోని 10వ వార్డుకు చెందిన వలవల రామకృష్ణ అనే వ్యక్తి 439/1 సర్వే నంబర్లో 34 సెంట్ల భూమి దాదాపు 45 ఏళ్లుగా తన ఆధీనంలో ఉంచుకుని సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి పన్ను క డుతున్నారు. దీనిపై జేపీ టీం దృష్టి పెట్టి 2017 జూన్ 24న స్థలంలోకి ప్రవేశించి పాకలు వేసే ప్రయత్నం చేసి అడ్డుకోబోయిన రామకృష్ణపై దౌర్జన్యం చేశారని వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో 113/2017తో జేపీపై కేసు నమోదై కొనసాగుతోంది. ►అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇద్దరితో కోర్టులో కేసులు వేయించి ఒకరికి అనుకూలంగా వచ్చాక ఆ భూమి తమదేనని మరొకరికి అమ్మేస్తూ అడ్డగోలు రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా జేపీ చేస్తున్నారు. ►వీరవాసరానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావు ఇంటి ప్రహరీ నిర్మిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి ధ్వంసం చేయడంతో పాటు కుటుంబసభ్యులపై హత్యాయత్నం చేశారు. ఈ వ్యవహారంలో జయప్రకాష్నాయుడుది కీలకపాత్ర ఉందని అతనిపై క్రైం నంబర్ 157/2022 కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. -
ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఏపీ
సాక్షి, అమరావతి: ఫిష్ ఆంధ్రాతో ఆక్వాకల్చర్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. సాగు, దిగుబడులు, ఎగుమతుల్లోనే కాకుండా స్థానికంగా వినియోగంలో సైతం రాష్ట్రాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులతో కలిసి ఆక్వా హబ్‌లు, రిటైల్ ఔట్లెట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోందని చెప్పారు. వీటిలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి పేటీఎంతో కలిసి పనిచేస్తున్నామన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో మంగళవారం మంత్రి సమక్షంలో పేటీఎం, రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఆఫ్కాఫ్ చైర్మన్ కె.అనిల్ బాబు, పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ శర్మ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం రిటైల్ ఔట్లెట్ నిర్వాహకులకు రూ.22 వేల విలువైన పాయింట్ ఆఫ్ సేల్ (పోస్), క్యూఆర్ కోడ్, తదితరాలను పేటీఏం సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వీటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ ఔట్లెట్లను తీసుకొస్తున్నామని చెప్పారు. మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా పోషక విలువలు ఉన్న తాజా చేపలు, సముద్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతామన్నారు. వీటి ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. పేటీఎం చీఫ్ బిజినెస్ మేనేజర్ అభయ్ శర్మ మాట్లాడుతూ.. ఫిష్ ఆంధ్రా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న కృషిలో పేటీఏంను భాగస్వామిని చేయడం గర్వకారణంగా ఉందన్నారు. -
చెరువుల్లో సముద్ర చేపలు!
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం రైతుల వినూత్న ఆలోచనతో.. ఆక్వా సాగు కొత్తపుంతలు తొక్కుతూ లాభాల బాటలో పయనిస్తున్నది. సహజంగా చెరువుల్లో సాధారణ రకాల చేపలు, రొయ్యలను సాగుచేస్తుంటారు. అయితే సముద్రంలో లభించే అరుదైన పండుగప్ప(సీబాస్), చందువాపార(సిల్వర్ పాంపనో) రకం చేపలను చెరువుల్లో పెంచితే ఎలా ఉంటుందన్న ఆలోచన పెదపులుగువారిపాలెం రైతులకు వచ్చిన నేపథ్యంలో.. పంజరం సాగు ప్రచారంలోకి వచ్చింది. పంజరాల్లో చేపల పెంపకం ఇలా.. సముద్రంలో పెరిగే పండుగప్ప, చందువాపార చేపలు సాధారణంగా వాటి కన్నా పరిమాణంలో చిన్న చేపలను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. దీనిని నివారించేందుకు పిల్లలను చెరువుల్లో వలలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంజరాల్లో సాగు చేస్తున్నారు. వారానికొకసారి చేపలను గ్రేడింగ్ చేసి బరువు ఆధారంగా వేర్వేరు పంజరాల్లో పెంచుతున్నారు. పంజరంలో పెరిగే క్రమంలో చిన్న వయసు నుంచే రైతులు వేసే మేతను తినే అలవాటు చేస్తారు. ఇలా 100 గ్రాములు బరువు వచ్చే వరకు పంజరంలో పెంచిన తర్వాత ఒకే పరిమాణంలో ఉన్న చేపలను చెరువుల్లోకి విడుదల చేస్తారు. రొయ్య, చేపల పెంపకంలో తరచూ నష్టాలు వస్తుండడంతో ప్రత్యామ్నాయంగా పంజరాల్లో సాగు ప్రారంభించామని పెదపులువారిపాలెం రైతులు చెబుతున్నారు. ఆర్టీసీఏ సహకారంతో ప్రయోగాత్మకంగా తొలుత మూడెకరాల్లో సాగు చేసిన పంజరం తరహాసాగు లాభదాయకంగా ఉండడంతో.. ప్రస్తుతం 33 ఎకరాల్లో సాగవుతోందని చెబుతున్నారు. చెరువు వద్దే రూ.400 పైగా ధర.. పండుగప్ప, చందువాపార రకాలకు మన దేశంతో పాటు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మలేషియా, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక తదితర దేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది. చెరువు వద్దే పండుగప్ప చేప కిలో రూ.400 పైగా ధర పలుకుతుంది. వీటిని ఉప్పు చేపగా తయారుచేసి కిలో రూ.800–850 దాకా విక్రయిస్తున్నారు. అలాగే చందువాపార రకం రైతు వద్ద కిలో రూ.350 దాకా లభిస్తోంది. ‘ఆక్వా’ పార్కుతో మరింత ప్రోత్సాహం.. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్న రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్(ఆర్జీసీఏ), కొచ్చిన్‌లో ఉన్న సెంటర్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎంఎఫ్ఆర్ఐ) సముద్ర రకం చేపల సాగుకు పిల్లలను సరఫరా చేస్తున్నాయి. సముద్ర చేపల పెంపకాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిజాంపట్నంలో ఆక్వా పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. సుమారు 280 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏర్పాటు చేయనున్న పార్కు డీపీఆర్ పూర్తవుతుంది. ప్రోత్సాహంతో పాటు శిక్షణ.. సముద్ర చేపలైన పండుగప్ప, చందువాపార రకం పెంచాలనుకునే రైతులకు అవసరమైన సాంకేతిక శిక్షణను ఆర్బీకేల ద్వారా అందించనున్నాం. చెరువుల తవ్వకానికి 40 శాతం దాకా సబ్సిడీ ఇవ్వనున్నాం. నాణ్యమైన, తక్కువ ధరలో చేప పిల్లలను అందు బాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. – డి. సురేష్, డీడీ, మత్స్యశాఖ, గుంటూరు జిల్లా -
మత్స్యకారుల హక్కులకు భంగం కలగనీయం
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుందని, సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన మత్స్యకారుల సమన్వ య కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. మత్స్యకారుల సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన సమన్వయ కమిటీ సభ్యులు కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో పర్యటించి అక్కడ గుర్తించిన సమస్యలపై సమావేశంలో వివరించారు. నిబంధనలకు అనుగుణం గా ఉన్న సమస్యల పరిష్కారానికి వెం టనే చొరవ చూపాలని మంత్రి శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను ఆదే శించారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న నీటి వనరులను కూడా మత్స్య శాఖ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి వెల్లడించారు. సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాలో ఫిషరీస్ వర్సిటీ
సాక్షి, అమరావతి: ఆక్వా రాజధాని ‘పశ్చిమ డెల్టా’లో ఫిషరీస్ యూనివర్సిటీ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సరిపల్లి–లిఖితపూడి గ్రామాల మధ్య ఈ వర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 40 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి రూ.332 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. వర్సిటీ నిర్మాణానికి సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నిపుణుల కొరత తీర్చేలా.. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 29 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 68 శాతం వాటా ఏపీదే. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ 40 శాతం వాటా రాష్ట్రానిదే. రాష్ట్ర స్థూల ఆదాయంలో 8.67 శాతం (రూ.55,294 కోట్లు) ఈ రంగం నుంచే వస్తోంది. గడచిన పదేళ్లలో సముద్ర చేపల ఉత్పత్తి రెట్టింపు కాగా, రొయ్యల ఉత్పత్తి నాలుగు రెట్లు, సంప్రదాయ చెరువుల్లో చేపల ఉత్పత్తి రెండున్నర రెట్లు, ఉప్పు, మంచినీటి చెరువుల్లో రొయ్యల ఉత్పత్తి 15 రెట్లు పెరిగింది. ఈ రంగంపై 8.50 లక్షల మంది మత్స్యకార కుటుంబాలతో పాటు 26.50 లక్షల మంది ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఏటా 11 శాతం వృద్ధిరేటు సాధిస్తున్న ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడంతోపాటు లోతైన పరిశోధనలు చేపట్టడం.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. మరో రెండు కళాశాలల ఏర్పాటు ఈ వర్సిటీకి అనుబంధంగా శ్రీకాకుళం జిల్లా పలాస, కృష్ణా జిల్లా కైకలూరు వద్ద కూడా ఫిషరీస్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వర్సిటీకి అనుబంధంగా మరిన్ని పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. సర్కారు చర్యల వల్ల ఆక్వా రంగంలో పరిశోధనలు పెరగడమే కాకుండా నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చడంతోపాటు ఆక్వా రంగంపై ఆధారపడిన వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అవకాశం కలుగుతుంది. దేశంలోనే మూడో వర్సిటీ దేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఫిషరీస్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఏపీలో నిర్మిస్తున్న ఈ వర్సిటీ దేశంలోæ మూడోది కానుంది. ఇందుకు అవసరమైన భూమిని రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించి ఇటీవలే మత్స్య శాఖకు అప్పగించింది. తొలి దశలో ఇచ్చే రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్ బ్లాక్, విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా హాస్టల్స్, రైతులకు శిక్షణ కేంద్రం, మల్టీపర్పస్ బిల్డింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో వర్సిటీని నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. టెండర్లు పిలిచేందుకు కసరత్తు ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పరిపాలన, విద్యా సంబంధిత భవనాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్య శాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచే.. ఫిషరీస్ యూనివర్సిటీ ప్రాంగణంలో కొత్తగా మత్స్య కళాశాల కూడా ఏర్పాటు కానుంది. తొలుత బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్ కోర్సుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, పీహెచ్డీ కోర్సులను సైతం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్డీలలో ఆక్వా కల్చర్, అక్వాటిక్, యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్, ఫిషరీస్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ తదితర కోర్సులు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద మత్స్య కళాశాల, అవనిగడ్డ మండలం బావదేవరపల్లి వద్ద ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉప్పు నీటి రొయ్యలు, బిక్కవోలు మండలం బలభద్రపురంలో మంచినీటి చేపల పరిశోధనా కేంద్రాలు ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వద్ద మంచినీటి చేపలు, రొయ్యల పరిశోధనా కేంద్రం ఉంది. ఇవన్నీ ఇకపై ఫిషరీస్ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తాయి. -
వైఎస్సార్ మత్స్యకార భరోసా
-
గంగ పుత్రులకు నేడు ‘మత్స్యకార భరోసా’
సాక్షి, అమరావతి: సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో అమలు చేస్తున్న వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఈ ఏడాది మరింత మందికి లబ్ధి చేకూరనుంది. సంతృప్త స్థాయిలో (అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా) 1,19,875 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఉదయం కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా సొమ్ములు జమ చేయనున్నారు. గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన సర్కారు గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ విధంగా 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు లబ్ధి చేకూర్చగా, 2020లో 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్ల మేర సాయమందించారు. ఇతర సబ్సిడీల రూపంలో.. బోట్లపై సముద్రంలోకి వేట కోసం బోట్లపై వెళ్లేందుకు వినియోగించే ఆయిల్‌పై సబ్సిడీ రూపంలో 2019–20లో 10.06 కోట్లు, 2020–21లో రూ.22.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్ చార్జీల సబ్సిడీ రూపంలో 53,500 మంది లబ్ధిదారులకు 2019–20లో రూ.720 కోట్లు, 2020–21లో నవంబర్ వరకు రూ.420 కోట్లు చెల్లించింది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున 2019–20లో రూ.2.20 కోట్లు, 2020–21లో రూ.1.20 కోట్లను ఎక్స్‌గ్రేషియా రూపంలో చెల్లించింది. మత్స్యకారేతరులకూ వర్తింపు మత్స్యకారులతో పాటు సముద్రంలో చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్న ఇతర సామాజిక వర్గాల వారిని కూడా ఈ ఏడాది అర్హులుగా గుర్తించాం. ఈ విధంగా బీసీలు 1,18,119 మంది, ఓసీలు 747 మంది, ఎస్సీలు 678 మంది, ఎస్టీలు 331 మంది అర్హులుగా నిర్ధారించాం. – కె.కన్నబాబు, మత్స్య శాఖ కమిషనర్ -
అలుగు దుంకిన చేప
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మొన్నటి వర్షాల దెబ్బకు చెరువుల్లో చేపలు అయిపూ అజా లేకుండా కొట్టుకుపోయాయి. నీటి వనరుల్లో ఎదిగి సిరులు పండిస్తాయని ఆశించిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. వాగుల్లో, చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు పోసి వాటిని మత్స్యకారులకు ఆర్థిక వనరుగా మార్చాలనే సర్కారు లక్ష్యానికి ఈసారి వర్షాలు గండికొట్టాయి. ఇప్పటివరకు ఏ చెరువులో ఎన్ని చేపల్ని పోశారనే లెక్కలున్నాయి కానీ.. వర్షా ల తర్వాత ఎన్ని మిగిలాయనేది తెలియట్లేదు. ఈ ఏడాది లక్ష్యం 77 కోట్లపైనే.. మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 77 కోట్లకుపైగా చేపపిల్లల్ని పంపిణీ చేయాలని సంకల్పించింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో గల 21,855 చెరువుల్లో జూలై – ఆగస్టు మధ్యకాలంలో దాదాపు 56 కోట్లకుపైగా చేపపిల్లల్ని వదిలింది. లక్ష్యంలో 78.46 మేర పంపిణీ పూర్తయింది. మిగతావి వదలాలనుకునే వేళలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. చెరువులన్నీ అలుగుపోయడంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చేపలన్నీ కొట్టుకుపోయాయి. ఇంకా చెరువుల్లో ఎన్ని మిగిలాయో, కొత్తగా మళ్లీ ఎన్ని వదలాలో తెలియక మత్స్యకారులు, మత్స్యశాఖ కిందామీదా పడుతున్నాయి. ముందువరసలో ఆ 4 జిల్లాలు ఉచిత చేపపిల్లల పంపిణీ 4 జిల్లాల్లో ఇప్పటికే వంద శాతం పూర్తయింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోని చెరువుల్లో వంద శాతం చేపపిల్లల్ని పోశారు. అత్యల్పంగా సూర్యా పేట జిల్లాలో 51.51శాతం మేర మాత్రమే లక్ష్యం నెరవేరింది. ఆయా చెరువుల్లో కొద్దోగొప్పో చేపలు మిగిలినా ఎదుగుదల బాగా లేదని మత్స్యకారులు అంటున్నారు. నెరవేరని ముందస్తు లక్ష్యం ఈ ఏడాది కాస్త ముందే చేపపిల్లల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకుతగ్గట్టే జూలై–ఆగస్టు మధ్యలో పంపిణీ చేపట్టింది. ఇంకో 20 కోట్లకుపైగా చేపలను పోయాలనే సమ యంలోనే భారీ వర్షాలు రావడంతో బ్రేక్ పడింది. మిగిలిన చెరువుల్లో లక్ష్యం మేరకు చేపల్ని వదలడంతో పాటు.. కొట్టుకుపోయిన చోట్ల ఏం చేయాలనే దానిపై నివేదిక తయారు చేస్తున్నారు. ‘చేపపిల్లలు చెరువు దాటి వెళ్లినట్టు మత్స్యకారులు భావిస్తే ఆయా జిల్లాల అధికారులకు తెలిపాలి. అవసరమైన మేర మళ్లీ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయా చెరువుల్లో మళ్లీ చేపప్లిలలు పోయాలని అధికారులకు ఇప్పటికే తెలిపాం’అని మత్స్యశాఖ అధికారి ఒకరు చెప్పారు. -
పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆక్వా హబ్స్
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆక్వా హబ్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తొలి దశలో నగరాలు, పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ తరువాత నియోజకవర్గ కేంద్రాలకూ విస్తరించనుంది. వీటి నిర్వహణ బాధ్యతల్ని ఎఫ్ఎఫ్పీవో (ఫిష్ ఫార్మర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్)లకు అప్పగిస్తారు. ఎంపికైన ఆక్వా హబ్ నిర్వాహకులకు ప్రభుత్వమే రాయితీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తుంది. హబ్‌ల నుంచి రిటైలర్లు, ఫిష్ మార్కెట్లు, జనతా బజార్లకు లైవ్ ఫిష్ (బతికున్న చేపలు) రవాణా చేయడానికి వీలుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. హబ్‌లలో కూలింగ్ సెంటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. వీటినుంచి మార్కెట్లకు లైవ్ ఫిష్ రవాణా చేసేందుకు ఐస్ బాక్సు వ్యాన్లను వాడతారు. మత్స్యశాఖ అధికారులు ఆక్వా హబ్స్, మార్కెట్ పరిస్థితులను పర్యవేక్షిస్తారు. మార్కెట్లో ఒడిదుడుకుల్ని నివారించేందుకు.. ► రాష్ట్రంలో ఏటా 35 లక్షల టన్నుల చేపల దిగుబడి వస్తోంది. ఇందులో 90 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కేవలం 10 శాతం చేపల్ని మాత్రమే రాష్ట్ర ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నారు. ► రాష్ట్రంలో ఆక్వా సాగు విస్తీర్ణం 2 లక్షల హెక్టార్ల వరకు ఉంది. ఈ రంగంపై ఆధారపడి 1.40 లక్షల కుటుంబాలు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పొందుతున్నాయి. ► ఈ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.25 వేల కోట్లకు చేరుకుంది. ► ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ రంగం లాక్డౌన్ సమయంలో మార్కెట్ల మూసివేత, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ► భవిష్యత్‌లో ఒడిదుడుకులకు గురి కాకుండా ఉండేందుకు ప్రభుత్వం స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేస్తోంది. ► ఇదే సందర్భంలో పోషక విలువలు అధికంగా ఉండే చేపల్ని ఆహారంగా తీసుకునే అలవాటును ప్రజల్లో పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. స్థానిక వినియోగం మరీ తక్కువ ► ప్రపంచంలోని ఇతర దేశాల్లో చేపల సగటు వినియోగం 20 నుంచి 30 కిలోలుగా ఉంది. ► మత్స్యశాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి వ్యక్తి ఏటా 7.50 కిలోల నుంచి 10 కిలోల వరకు చేపలను ఆహారంగా తీసుకుంటున్నారు. ► మన రాష్ట్రానికి వస్తే.. చేపల సగటు వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో ఏటా 1.80 కిలోలు, పట్టణాల్లో 1.32 కిలోలుగా ఉంది. ► మంచి పోషక విలువలు కలిగిన చేపల్ని వారానికి రెండుసార్లు ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ► ఈ దృష్ట్యా వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో లక్ష టన్నులు, 2025 నాటికి 5 లక్షల టన్నుల చేపల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం వివిధ పథకాలను అందుబాటులోకి తెస్తోంది. -
ఈ–పంట తరహాలో ఈ–ఫిష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య దిగుబడులను, సాగు విస్తీర్ణాన్ని 2025 నాటికి మూడింతలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సాంకేతిక విధానాల అమలు ద్వారా కలగనున్న ప్రయోజనాలపై రైతులకు అవగాహన కలిగిస్తూ.. ఆ విధానాల అమలుకు ముఖ్యమైన సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రత్యేక యాప్‌ల రూపకల్పన ద్వారా క్షేత్ర స్థాయిలోని పరిస్థితులన్నింటినీ క్షణాల్లో ప్రభుత్వానికి తెలిసేలా చర్యలు తీసుకుంటోంది. ప్రకృతి వైపరీత్యాలు, ప్రస్తుత కోవిడ్–19 వంటి విపత్తులో ఆక్వా రైతులకు ఈ యాప్‌ల ద్వారా సత్వరం సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ–పిష్ : వ్యవసాయ శాఖలోని ఈ–కర్షక్ విధానాన్ని పరిశీలించి మత్స్యశాఖ అధికారులు ఈ–ఫిష్ యాప్‌ను రూపొందించారు. రాష్ట్రంలో దాదాపు 1.95 లక్షల హెక్టార్లలో చేపలు, రొయ్యలు సాగులో ఉన్నాయి. అయితే గ్రామ, మండల, జిల్లాల వారీగా పంటల వివరాలు నేటికీ లేవు. ఇప్పుడు సర్వే నంబర్లు, రైతుల పేర్లు, సాగులోని వివరాలను యాప్ ద్వారా నమోదు చేస్తూ డాష్ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. తద్వారా నష్టపోయినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే అందించవచ్చు. మత్స్య సాగుబడి: వ్యవసాయ శాఖలోని పొలంబడిని ఆధారంగా చేసుకుని మత్స్య సాగుబడి యాప్‌ను రూపొందించారు. సాగులో మెళకువలు, అధిక దిగుబడుల కోసం మేత వినియోగం తదితర విషయాల్లో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రతి ఆర్బీకేలో మత్స్య సాగుబడిని ఏర్పాటు చేసి, రైతుల సందేహాలు నివృత్తి చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డులు : ఐదు హెక్టార్లలోపు చేపలు, రొయ్యలు, ఇతర మత్స్య సంపద చెరువులు ఉన్న రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారు. సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిండానికి చర్యలు తీసుకుంటున్నారు. రైతుల వివరాలు యాప్ ద్వారా నమోదు చేసి డాష్‌బోర్డు ద్వారా మత్స్యశాఖ ప్రధాన కార్యాలయానికి అనుసం«ధానం చేస్తున్నారు. తద్వారా ఆక్వా రైతుల పూర్తి వివరాలు తెలుస్తాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ ఎస్ఎస్బీసీ (స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ)లో ప్రభుత్వానికి వివరించడానికి అవకాశం ఉంటుంది. నీటి నాణ్యత పరీక్షలు : ప్రభుత్వం రాష్ట్ర మత్స్య సహాయకులకు ఇచ్చిన టెస్ట్ కిట్ల ద్వారా చెరువుల్లోని నీటి నాణ్యతను పరిశీలించి రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. రొయ్యలు, చేపల మేత, రోగనిరోధక మందుల వినియోగానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. రైతు భరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆక్వాల్యాబ్స్‌కు వీటిని అనుసంధానం చేస్తారు. నీలి విప్లవంలో సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ విపణిలో దేశ మత్స్య సంపద విక్రయాలు పెరగాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగించాలి. తీర ప్రాంతంలో మత్స్య సాగుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం చొరవ వల్ల మత్స్యశాఖ కూడా వినూత్న విధానాలు, శాస్త్ర సాంకేతిక విధానాల అమలు పట్ల మొగ్గు చూపుతోంది. ఇందుకు అనుగుణంగా మా సిబ్బంది, అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. – కన్నబాబు, మత్స్య శాఖ కమిషనర్ -
ఆక్వాకు ఊపిరి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆక్వా రంగానికి ఊపిరి పోస్తోంది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రొయ్యల కొనుగోళ్లు తిరిగి ఊపందుకున్నాయి. ఇతర దేశాలకూ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేస్తున్నారు. చెరువుల పట్టుబడి, రొయ్యల కొనుగోళ్లలో గ్రామ సచివాలయ సిబ్బంది ముఖ్య భూమిక పోషిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస్తూ రెవెన్యూ, మత్స్య శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు ఎదుర్కొంటున్న కార్మికులు, ప్యాకింగ్ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల 6వ నాటికి రాష్ట్రంలోని 73 ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు 5,819.3 మెట్రిక్ టన్నుల రొయ్యల్ని కొనుగోలు చేశారు. వాటిని ప్రాసెసింగ్ చేసి చైనా, మలేషియా, సింగపూర్, కెనడా, సౌత్ కొరియా, వియత్నాం దేశాలకు ఎగుమతి ప్రారంభించారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల నుంచి సోమవారం వరకు 233 కంటైనర్ల ద్వారా 3,695 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఎగుమతి అయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో.. ► సరిగ్గా 15 రోజుల క్రితం ఆక్వా రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఆక్వా సమస్యలను విన్నవించారు. ► తక్షణమే స్పందించిన సీఎం ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, వ్యాపారులతో సమీక్ష జరపటంతో రొయ్యల కొనుగోళ్లు మొదలయ్యాయి. ► ప్రాసెసింగ్ ప్లాంట్లలోని కార్మికుల సమస్యలను అధికారులు పరిష్కరించి, వాటిల్లో ప్రాసెసింగ్ కార్యక్రమాలు ఉపందుకునేలా చేశారు. ► గతంలో కొనుగోలు చేసిన రొయ్యలను కూడా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. గతంలో పరిస్థితి ఇలా.. ► కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఎగుమతులు లేక రాష్ట్రంలోని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు మూతపడ్డాయి. ► ఇదే సమయంలో రొయ్యల చెరువులు పట్టుబడికి రాగా.. ప్లాంట్ల నిర్వాహకులు కొనుగోలుకు ముందుకు రాలేదు. ► స్థానిక మార్కెట్లలో 100 కౌంట్ రొయ్యలకు రూ.100 లోపే ధర పలకగా.. ఎకరాకు కనీసం రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లే దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితి ఇదీ ► ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు గ్రామ సచివాలయ సిబ్బందిని, జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. ► గ్రామ సచివాలయ సిబ్బంది తమ పరిధిలో పట్టుబడికి వచ్చిన చెరువుల వివరాలను సేకరించి అధికారులకు నివేదిస్తున్నారు. ► అధికారులు ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులతో చర్చించి.. చెరువుల్లోని సరుకును కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నారు. ► కొన్ని ప్రాసెసింగ్ ప్లాంట్లు కార్మికుల కొరత వల్ల ఇంకా తెరుచుకోలేదు. అధికారులు రంగంలోకి దిగి కార్మికులతో చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. ► మరోసారి అధికారులు, మంత్రులు జిల్లాల్లో పర్యటించిన క్షేత్రస్థాయిలో రొయ్యల కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ► ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం.. ఈ నెల 30న రొయ్యల ఎగుమతికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ► రాష్ట్రంలోని విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవులకు ప్రాసెస్ చేసిన రొయ్యలను పంపిస్తున్నారు. జిల్లాల వారీగా పని చేస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్లు, కొనుగోలు చేసిన రొయ్యలు -
మాకు ఊపిరి పోశారు
సాక్షి, అమరావతి: ‘‘మీరు మాకు నిజంగా ఊపిరి పోశారు. బతికినంతకాలం మీ పేరు చెప్పుకుంటాం’’ అంటూ పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ఉద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో పాకిస్తాన్ చెర నుంచి విముక్తులైన 20 మంది రాష్ట్ర మత్స్యకారులు బుధవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తమ విడుదలకు కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతూ ‘‘మీలో ఏదో కనిపించని శక్తి ఉంది సార్.. అందుకే మేం బయటకు రాగలిగాం’’ అని పేర్కొన్నారు. తనను కలిసిన మత్స్యకారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరుపేరునా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చేపల వేటకోసం గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితులపై ఆరా తీశారు. రామారావు అనే మత్స్యకారుడు ముఖ్యమంత్రికి తమ సమస్యలు వివరిస్తూ.. తమ ప్రాంతంలో సముద్రమున్నా జెట్టీలు, పోర్టు లేనందువల్ల పదివేల నుంచి పదిహేను వేల మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని, తమకు ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించి ఇస్తే ఇక్కడే కుటుంబాలతో కలసి ఉంటామని విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. శ్రీకాకుళం జిల్లాలోని సముద్రతీరంలో మత్స్యకారుల చేపల వేట కోసం రాబోయే మూడేళ్లలో మంచి జెట్టీలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే భావనపాడు పోర్టు నిర్మాణం కోసం కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున మత్స్యకారులకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని, ఉపాధికోసం వలస వెళ్లకుండా ఈ సాయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జోక్యం చేసుకుని బంగ్లాదేశ్‌లోని జైలులోనూ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఉన్నారని, కొన్ని కారణాలతో వారి విడుదలలో జాప్యం జరుగుతోందని వివరించగా.. వారిని కూడా విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాక్ జైల్లో ఇంకా మిగిలి ఉన్న ఇద్దర్ని కూడా విడిపించాలని చెప్పారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు చేతుల మీదుగా.. విముక్తులైన మత్స్యకారులు నిలదొక్కుకోవడానికి వీలుగా ఆర్థిక సాయం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చెక్కుల్ని అందజేశారు. చెక్కుతోపాటు శాలువా, స్వీట్‌బాక్స్‌ను కూడా ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ జి.సోమశేఖరంతోపాటు పలువురు పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి మోపిదేవి వెంకటరమణారావు జాలర్లతో కలసి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఆనాడు ప్రతిపక్ష నేతగా పాక్ జైలులో ఉన్న జాలర్లను విడిపించుకు వస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎం తీసుకున్న చొరవ మాటల్లో వర్ణించలేమన్నారు. -
‘ఆ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: చేప పిల్లల ఎంపికలో లోపాలుంటే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని మత్స్య, పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’లో ‘చేపా.. చేపా.. నీకేమైంది’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. దీనిపై మత్స్యశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. పత్రికలో పేర్కొన్న ప్రాంతాలకు ఉన్నతాధికారులను పంపి, వాస్తవ పరిస్థి తులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీని ఆధారంగా.. చేప పిల్లల ఎంపికలో ఏవైనా లోపాలుంటే.. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని స్పష్టం చేశారు. మత్స్యకారులు చేపలను విక్రయించేందుకు 140 చేపల మార్కెట్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, అందులో 40 మార్కెట్లకు స్థల సేకరణ జరుగుతోందని తెలిపారు. చేపల విక్రయాల కోసం విస్తృతమైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
లెసైన్సులు!
►అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలకు అనుమతి ►ఎకరాకు రూ.8,500 లంచం! ►చక్రం తిప్పుతున్న ఎఫ్‌డీవోలు ►పైరవీలు చేస్తేనే త్వరగా పనులు మచిలీపట్నం : జిల్లాలో చేపల చెరువుల లెసైన్సుల జాతర ముమ్మరంగా సాగుతోంది. చేపల చెరువుల అక్రమ తవ్వకాలకు బ్రేక్ వేసేందుకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రవేశపెట్టిన నియమనిబంధనలను మండల స్థాయి అధికారులు తుంగలో తొక్కేస్తున్నారు. ఇష్టారాజ్యంగా పైరవీలు చేస్తూ చేపల చెరువులకు అనుమతులు ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చేపల చెరువుల లెసైన్సులు మంజూరు చేసేందుకు ప్రత్యేక కమిటీ ఉన్నా, వీరందరి కళ్లుకప్పి రాత్రికి రాత్రే లెసైన్సులు మంజూరు చేస్తున్నారు. పలు మండలాల్లో ఉన్న ఎఫ్‌డీవోలు లెసైన్సులు ఇప్పించటంలో చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లెసైన్సులు మంజూరు చేసేందుకు ఎకరానికి రెవెన్యూ శాఖకు రూ.5,500, మత్స్యశాఖకు రూ.3వేలు చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. 1,645 దరఖాస్తులు 16,874 ఎకరాలు జిల్లాలో ఇప్పటి వరకు 16,874 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకం కోసం మత్స్యశాఖకు వద్దకు 1,645 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 348 దరఖాస్తులను పరిశీలించి 6,201 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి ప్రాథమికంగా అనుమతులు ఇచ్చారు. 150 ఎకరాల భూమి చేపల చెరువుల తవ్వకానికి అనుకూలంగా లేదని, ఇందుకోసం వచ్చిన 14 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 1,200 పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మండవల్లి, నందివాడ మండలాల నుంచే చేపల చెరువుల తవ్వకాలకు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. జరుగుతున్నది ఇదీ.. చేపల చెరువుల తవ్వకానికి అనుమతులను వేగవంతం చేసేందుకు ఇటీవల మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తహశీల్దార్ చైర్మన్‌గా, ఎఫ్‌డీవో కన్వీనరుగా ఉన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ, డ్రెయినేజీ, ఆర్డబ్ల్యూఎస్ తదితర విభాగాల అధికారులు భూములను పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. డివిజన్ స్థాయిలో ఆర్డీవో ఈ భూములను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక పంపాల్సి ఉంది. అయితే తెరవెనుక కథ వేరుగా ఉంది. ఇంత మంది అధికారుల పరిశీలన చేయాల్సి ఉన్నా, ఇవేమి జరగకుండానే తెర వెనుక నోట్ల కట్టలు చేతులు మారుతుండటంతో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేపల చెరువులకు అనుమతులు ఇచ్చే విషయంలో నగదు చేతులు మారుతున్నాయనే అంశంపై మత్స్యశాఖ డీడీ టి కళ్యాణంను ‘సాక్షి’ వివరణ కోరగా, ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామని, అక్కడక్కడా తప్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
మత్స్యశాఖకు మాయరోగం
- రెండేళ్లుగా జేడీ పోస్టు ఖాళీ - కార్యాలయంలో గ్రూపు తగాదాలు - నలుగురు ఉద్యోగుల బదిలీ - వనరుల్లేక అటకెక్కిన సంక్షేమం నెల్లూరు (విద్యుత్) : ఒకప్పుడు మంచినీటి చేపలు, రొయ్యలు, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తిలో జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో 169 కిలోమీటర్ల పొడవున సముద్రతీరం ఉంది. తీరం వెంబడి 77 మత్స్య గ్రామాలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 1.40 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా చేపల వేటపై ప్రధానంగా జీవిస్తున్నారు. అయితే వీరి సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు మత్స్యశాఖను ఏర్పాటు చేశారు. అయితే ఈ శాఖ విధులు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. ఈ శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మత్స్యకారులకు అధికారులు అవగాహన కల్పించాల్సి ఈ శాఖాధికారులు ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు మచ్చుకు కూడా కానరావడం లేదు. జిల్లాలోని మత్స్య శాఖకు ఎలాంటి వనరులు లేకపోవడంతో ఉద్యోగులకు పనిలేకుండా పోయింది. ఈ శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటకెక్కిన సంక్షేమం మత్స్య శాఖకు సంబంధించి ఎలాంటి నిధులు లేకపోవడంతో మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. చెరువుల లీజుకు, మత్స్యకారులకు వనరులు సమకూర్చడం, దీనికి సంబంధించిన ప్రణాళిక, చెరువుల క్రమబద్ధీకరణ, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి పనులు కార్యాలయ సిబ్బంది చేపట్టాల్సి ఉంది. అయితే ఈ కార్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడంలేదు. రెండేళ్లుగా జేడీ పోస్ట్ ఖాళీ జిల్లాలోని మత్స్య శాఖలో రెండేళ్లుగా జేడీ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్చార్జిగా గుంటూరు డిప్యూటీ డెరైక్టర్ బలరామమూర్తి వ్యవహరిస్తున్నారు. జేడీ కార్యాలయంలో ఏడీ పోస్టులు, ఫీల్డ్ డెవలప్మెంట్ పోస్ట్‌లు కూడా ఖాళీగా ఉన్నాయి. గ్రూపు తగాదాలకు నిలయం మత్స్య శాఖ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కార్యాలయాన్ని భ్రష్టు పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. కార్యాలయంలో ఎలాంటి పనిలేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది పట్టపగలు మద్యం సేవించి గొడవలకు దిగడంతో మూడు నెలల క్రితం డిప్యూటీ డెరైక్టర్ నలుగురు ఉద్యోగులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం మత్స్యశాఖకు పట్టిన మాయ రోగానికి మందు వేయాల్సి అవసరం ఉంది. కలెక్టర్ శ్రీకాంత్ చొరవ తీసుకుని ఈ శాఖపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
‘వెలుగుబంటి’ కేసులో మరో నిందితుడి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: మత్స్యశాఖ మాజీ కార్యనిర్వాహక ఇంజనీర్ వెలుగుబంటి సూర్యనారాయణపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు నమోదు చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు. నగరానికి చెందిన ప్రవాసభారతీయురాలు విజయలక్ష్మికి ఒడిశాతో పాటు రాష్ట్రంలోని కృష్ణపట్నంలో విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అనుమతి లభించింది. వీటికి రూ.400 కోట్లు సమీకరించుకోగా, మరో రూ.200 కోట్లు అవసరమవటంతో బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని భావించారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ వెలుగుబంటి ఆమెను చెన్నైలో ఒక సమావేశానికి తీసుకువెళ్లారు. సుందర్రాజన్, సూర్యనారాయణ తదితరులు తాము రుణం ఇప్పిస్తామంటూ విజయలక్ష్మి నుంచి ముందస్తు చెల్లింపుల పేరుతో రూ.65 లక్షల వరకు తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సుందర్రాజన్ను అరెస్టు చేయగా ఆయన న్యాయస్థానం నుంచి బెయిల్ పొంది విడుదలయ్యాడు. మిగిలిన నిందితుల కోసం సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. సుందర్ రాజన్ నుంచి నేరానికి సంబంధించిన రూ.4 లక్షల నగదు సైతం రికవరీ చేశారు.