- రెండేళ్లుగా జేడీ పోస్టు ఖాళీ
- కార్యాలయంలో గ్రూపు తగాదాలు
- నలుగురు ఉద్యోగుల బదిలీ
- వనరుల్లేక అటకెక్కిన సంక్షేమం
నెల్లూరు (విద్యుత్) : ఒకప్పుడు మంచినీటి చేపలు, రొయ్యలు, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తిలో జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో 169 కిలోమీటర్ల పొడవున సముద్రతీరం ఉంది. తీరం వెంబడి 77 మత్స్య గ్రామాలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 1.40 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా చేపల వేటపై ప్రధానంగా జీవిస్తున్నారు. అయితే వీరి సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు మత్స్యశాఖను ఏర్పాటు చేశారు. అయితే ఈ శాఖ విధులు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. ఈ శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా ఉంది.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మత్స్యకారులకు అధికారులు అవగాహన కల్పించాల్సి ఈ శాఖాధికారులు ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు మచ్చుకు కూడా కానరావడం లేదు. జిల్లాలోని మత్స్య శాఖకు ఎలాంటి వనరులు లేకపోవడంతో ఉద్యోగులకు పనిలేకుండా పోయింది. ఈ శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అటకెక్కిన సంక్షేమం
మత్స్య శాఖకు సంబంధించి ఎలాంటి నిధులు లేకపోవడంతో మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. చెరువుల లీజుకు, మత్స్యకారులకు వనరులు సమకూర్చడం, దీనికి సంబంధించిన ప్రణాళిక, చెరువుల క్రమబద్ధీకరణ, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి పనులు కార్యాలయ సిబ్బంది చేపట్టాల్సి ఉంది. అయితే ఈ కార్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడంలేదు.
రెండేళ్లుగా జేడీ పోస్ట్ ఖాళీ
జిల్లాలోని మత్స్య శాఖలో రెండేళ్లుగా జేడీ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌చార్జిగా గుంటూరు డిప్యూటీ డెరైక్టర్ బలరామమూర్తి వ్యవహరిస్తున్నారు. జేడీ కార్యాలయంలో ఏడీ పోస్టులు, ఫీల్డ్ డెవలప్‌మెంట్ పోస్ట్‌లు కూడా ఖాళీగా ఉన్నాయి.
గ్రూపు తగాదాలకు నిలయం
మత్స్య శాఖ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కార్యాలయాన్ని భ్రష్టు పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. కార్యాలయంలో ఎలాంటి పనిలేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది పట్టపగలు మద్యం సేవించి గొడవలకు దిగడంతో మూడు నెలల క్రితం డిప్యూటీ డెరైక్టర్ నలుగురు ఉద్యోగులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం మత్స్యశాఖకు పట్టిన మాయ రోగానికి మందు వేయాల్సి అవసరం ఉంది. కలెక్టర్ శ్రీకాంత్ చొరవ తీసుకుని ఈ శాఖపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మత్స్యశాఖకు మాయరోగం
Published Tue, Aug 12 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement
Advertisement