Transfer of employees
-
నగదు ‘బదిలీ’! కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు
విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు రూ.2కోట్లు... తిరుపతి రూరల్ తహసీల్దార్ పోస్టుకు రూ.2కోట్లు... కర్నూలు ఆర్డీవో పోస్టుకు రూ.కోటి... శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టుకు రూ.50లక్షలు... ఇలా డిమాండ్‌ను బట్టి ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రజాప్రతినిధులు రేటు ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. చివరికి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిఫారసు చేసేందుకు కూడా రూ.లక్షన్నర వసూలు చేయా లని నిర్ణయించారు. తాము చెప్పినంత ఇస్తే నిబంధనలను సైతం పట్టించుకోకుండా జీరో సర్వీస్ బదిలీలు కూడా చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. మామూళ్లు ఇవ్వనివారిని, తమకు నచ్చనివారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు.పంచాయతీరాజ్, రెవెన్యూ, మైనింగ్, రిజిస్ట్రేషన్ల శాఖల్లో జోరుగా పైరవీలు సచివాలయ ఉద్యోగుల బదిలీకి టీడీపీ నేతల సంతకం తప్పనిసరి కానిస్టేబుల్ పోస్టింగ్‌కు సైతం డబ్బులు డిమాండ్సచివాలయ బదిలీకి రూ. లక్షన్నరగ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ కోసం స్థానిక టీడీపీ నాయకుడి సంతకం ఉండాలని చెబుతుండటంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఆ పార్టీ నేతలు బదిలీ కోసం సంతకం పెట్టడానికి రూ.1.50 లక్షలు అడుగుతుండడంతో ఆ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే తీవ్ర అవమాన భారంతో సతమతమవుతున్న సచివాలయ ఉద్యోగులు తాజా పరిణామాలతో హతాశులవుతున్నారు. 0 సర్వీస్కృష్ణా జిల్లా పెనమలూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌కి పది రోజుల క్రితం ఏవోగా పదోన్నతి రావడంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోస్టింగ్ ఇచ్చారు. తాజా బదిలీల్లో ఆయన్ను పెనమలూరు ఏవోగా నియమించాలని స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లెటర్ ఇచ్చారు. పట్టుమని పది రోజుల సర్వీసు కూడా పూర్తి కాకుండానే ఆయన బదిలీకి దరఖాస్తు పెట్టుకోవడం,దాని ఆమోదానికి రంగం సిద్ధమవడం విశేషం.రూ. లక్ష లక్షఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెంలో ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్‌తోపాటు ఎంపీడీవో కార్యాలయంలో ఏ పోస్టుకైనా సిఫారసు లెటర్ కావాలంటే ముందు లక్ష రూపాయలు ఇవ్వాలని, ఆ తర్వాత మరో రూ.లక్ష ఇవ్వాలని బేరం పెట్టారు. నియోజకవర్గంలో ఏ పోస్టుకైనా కప్పం కడితేనే సిఫారసు లెటర్ ఇస్తామని చెబుతున్నారు. రూ. 10 లక్షలుమైనింగ్ శాఖలో ఎన్టీఆర్ జిల్లా ఏడీ పోస్టుకి రూ.10 లక్షలు అడుగుతున్నట్లు సమాచారం. ఇందులో మంత్రి పేషీ, కార్యదర్శి పేషీల భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ. 2 కోట్లువిజయవాడలోని పటమట, విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టుల కోసం ఉన్నత స్థాయిలో పైరవీలు జరుగుతున్నాయి. ఈ పోస్టుల రేటు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు ఇచ్చిన గ్రీన్‌సిగ్నల్ పైరవీలకు రెడ్ కార్పెట్లా మారింది. నిబంధనలు, మార్గదర్శకాలను కాగితాలకే పరిమితం చేసి కాసులు, సిఫారసులతోనే బదిలీ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆయా శాఖల అవసరాలు, పనితీరుతో సంబంధం లేకుండా కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రయోజనాల కోసమే ఈ బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేలు చెప్పిన వారిని, కాసులిచ్చిన వారిని మంచి పోస్టుల్లో కూర్చోబెట్టడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. తమకు ఇష్టం లేని వారిని, డబ్బులు ఇవ్వలేని వారిని పక్కన పెట్టేసి మారుమూల ప్రాంతాలు, ప్రాధాన్యత లేనిచోట్లకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన వారిని కచ్చితంగా మార్చాలనే ప్రధాన నిబంధనను ఎక్కడా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. పాలనాపరమైన అవసరాలు, వ్యక్తిగత అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని బదిలీల ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇష్టానుసారం బదిలీలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసులుంటే జీరో సర్వీసు ఉన్నా బదిలీకి అనుమతిస్తుండటంపై ఉద్యోగ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. – సాక్షి, అమరావతిగగ్గోలు పెడుతున్న అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు ఉద్యోగుల బదిలీలను ఎమ్మెల్యేలు తమకు అన్ని విధాలా అనుకూలంగా మార్చుకుంటున్నారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను తమ గుప్పెట్లో ఉంచుకునేలా ఈ బదిలీల పర్వాన్ని నిర్వహిస్తున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులన్నింటిలోనూ తమకు అనుకూలమైన వారినే నియమించాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. ఎంపీడీవో, ఆ కార్యాలయంలోని ఉద్యోగులతోపాటు వ్యవసాయాధికారులుగా పలానా వారిని నియమించాలని సిఫారసు చేస్తూ ఎమ్మెల్యేలు లేఖలు ఇస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో పోస్టులకు సైతం సిఫారసు లేఖలు ఇస్తున్నారు. వాటి ప్రకారమే ఆయా శాఖల ఉద్యోగులను బదిలీల జాబితాలో చేరుస్తున్నారు. లేఖలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిర్ణయించారు. ఆ లెటర్లు తీసుకెళ్లి అధికారులకు ఇచ్చాక.. అక్కడా డబ్బు అడుగుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీల వ్యవహారం అంతా డబ్బుమయంగా మారిపోయిందని వాపోతున్నారు.డిమాండ్‌ను బట్టి రేటు పెంచేశారు!తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్ పోస్టుకు మంచి డిమాండ్ ఉండటంతో రేటు కూడా పెంచేసినట్లు తెలిసింది. ఇక్కడికి వచ్చేందుకు గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో పనిచేసిన ఓ మహిళా తహసీల్దార్ పైరవీలు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి అత్యంత సన్నిహితుల ద్వారా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఆమె సిద్ధపడినట్లు సమాచారం. ఇదే పోస్టుకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పనిచేస్తున్న మరో తహసీల్దార్ కోటి రూపాయలు ఇస్తానని ముందుకు రావడం... ఆ వెంటనే మరో తహసీల్దార్ ఏకంగా 1.25 కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ పోస్టుకు గిరాకీ ఎక్కువగా ఉందని టీడీపీ నేత అమాంతంగా ధరను పెంచేశారు. ఏకంగా రూ.2 కోట్లు ధర నిర్ణయించారు. దీంతో అప్పటి వరకు తిరుపతి రూరల్‌పై ఆశలుపెట్టుకున్న చాలామంది తహసీల్దార్లు మరో పోస్టింగ్ చూసుకున్నారు. అయితే చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న తహసీల్దార్ మాత్రం రూ.1.5కోట్లు చెల్లించి, మిగతా మొత్తం మూడు నెలల్లో ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఆ సీటు చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రిక్వెస్ట్’ పేరుతో దోపిడీకి స్కెచ్ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఉద్యోగులు, అధికారుల నుంచి దోపిడీకి రిక్వెస్ట్ బదిలీ పేరిట పక్కా ప్లాన్ రెడీ చేశారు. ‘ఉద్యోగులంతా తప్పనిసరిగా బదిలీ అభ్యర్థన (రిక్వెస్ట్) ఫారం పూర్తి చేసి డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపండి. సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిసెంట్లు, కార్యాలయ సిబ్బంది ఇది పాటించి తీరాల్సిందే...’ అంటూ ఒక ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరడజను రిక్వెస్ట్ ఫారాలు వాట్సాప్‌లో సదరు అధికారికి పంపినట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటేషన్ల పేరుతో రూ.లక్షలు వెనకేసుకున్న అధికారులు... ఈ రిక్వెస్ట్ బదిలీల పేరుతో మరోసారి రూ.కోట్ల వసూళ్లకు తెరతీశారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్, కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఒక్కోదానికి రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర నిర్ణయించినట్లు తెలిసింది. సర్పవరం, సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు, రాజమహేంద్రవరంలో రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.60లక్షలు నుంచి రూ.80లక్షలు చొప్పున రేటు ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. రాజానగరం, పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు, అమలాపురంలో రెండు సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షలు, ముమ్మిడివరం సబ్‌రిజిస్ట్రార్ పోస్టుకు రూ.30లక్షలు చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిసింది. ఈ దందా అంతా విజయవాడ ప్రధాన కార్యాలయంలోని మార్కెట్ అండ్ ఆడిట్ విభాగంలో పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఒకరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.జిల్లా స్థాయి పోస్టులకు భారీ డిమాండ్ మంత్రుల స్థాయిలో పైరవీలు⇒ జిల్లా స్థాయిలో ఉండే పోస్టులు, వివిధ కార్యాలయాల్లో ఉండే కీలకమైన సీట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. వీటి కోసం మంత్రులు, వారి పేషీలు, ఉన్నతాధికారుల వరకు పైరవీలు జరుగుతున్నాయి. పేషీకి ఒక రేటు ⇒ పంచాయతీరాజ్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు, ఇరిగేషన్ తదితర శాఖల్లో పోస్టులకు రూ.లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖలోని ఏఈ, డీఈ, ఈఈ పోస్టులకు సంబంధిత మంత్రి పేషీ నుంచి భారీ డబ్బు అడుగుతున్నట్టు తెలిసింది. మైనింగ్ శాఖలో డీడీ, ఏడీ, జియాలజిస్టు, సర్వే పోస్టులకు మంత్రి సిఫారసు లేఖ, ఆ తర్వాత సంబంధిత కార్యదర్శి పేషీ లోని కొందరు వ్యక్తులతో మాట్లాడుకుంటున్నారు. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, అనకాపల్లి వంటి జిల్లాల పోస్టులకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకుపైగా రేటు పెట్టారు. మంత్రి పేషీ వద్ద ఒక రేటు, ఆ తర్వాత కార్యదర్శి పేషీ వద్ద మరో రేటు.. ఈ రెండు ఓకే అయిన వారికే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి నెలకొంది.ఈ పోస్టులకు ప్రభుత్వ స్థాయిలోనే బేరం⇒ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బదిలీలన్నీ ఐజీ అండ్ కమిషనర్ కార్యాలయంలోనే చేసేలా ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్లు తీసుకోవడం ఆ శాఖలో కలకలం రేపింది. సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు భారీగా బేరాలు జరుగుతున్నాయి. విజయవాడలోని పటమట, విశాఖలోని మధురవాడ, భోగాపురం, కొత్తవలస, రేణిగుంట, తిరుపతి, నెల్లూరు, నల్లపాడు వంటి 25కు పైగా అధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ పోస్టులను ప్రభుత్వ స్థాయిలోనే బేరానికి పెట్టారనే చర్చ జరుగుతోంది. ఇరిగేషన్‌లోనూ తక్కువేం కాదు...⇒ ఇరిగేషన్ శాఖలో ఏఈ, డీఈ, ఈఈ పోస్టులకు అదే తరహాలో పైరవీలు సాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఈ క్యాడర్ అధికారులు ఎగబడుతున్నారు. అక్కడైతే బాగా బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉండటంతో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆ పోస్టులకు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ప్రకాశంలో పెద్ద ఎత్తున వసూలు⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లాలో సీఐలు, ఎస్ఐలు, తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. పోలీసు శాఖలో కోరిన చోట పోస్టింగ్ కోసం టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నగదు వసూలు చేసినట్లు సమాచారం. రూ.8లక్షలు తెస్తేనే లెటర్ ⇒ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈఈ పోస్టుకి రూ.8 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అంత డబ్బు ఇస్తేనే సిఫారసు లెటర్ ఇస్తామని పలువురికి సంబంధిత మంత్రి అనుయాయులు చెప్పినట్లు తెలిసింది.పక్కాగా పైసా వసూల్సీఐకి రూ.50లక్షలు.. కానిస్టేబుల్‌కు రూ.50వేలు!⇒ శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టింగుల కోసం రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బేరం జరిగినట్లు తెలిసింది. గోరంట్ల, హిందూపురం వన్‌టౌన్, ధర్మవరం వన్‌టౌన్, హిందూపురం రూరల్, హిందూపురం రూరల్ అప్‌గ్రేడ్, ధర్మవరం రూరల్, ముదిగుబ్బ, కదిరి స్టేషన్లలో సీఐల పోస్టులకు సిఫారసు లేఖలు ఎక్కువ ధర పలికినట్లు తెలిసింది. ఎస్ఐ స్థాయిలో ఏడాదికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చేందుకు అంగీకరించిన వారికే కోరిన చోట పోస్టింగులు ఇచ్చారని సమాచారం. కానిస్టేబుల్ బదిలీలకు కూడా టీడీపీ నేతలు రూ.50వేలు చొప్పున డిమాండ్ చేస్తున్నారు. తహసీల్దార్‌కు రూ.50లక్షలు.. వీఆర్వోకు రూ.లక్ష⇒ శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని మండలాల తహసీల్దార్ పోస్టులు రూ.50లక్షలు పలికినట్లు సమాచారం. జిల్లాలో పెద్దగా డిమాండ్ లేని మండలాల్లో అయినా ఆటంకాలు లేకుండా పని చేసుకునేందుకు టీడీపీ నేతలు రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. చిలమత్తూరు, కొత్తచెరువు, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, గోరంట్ల మండలాల పోస్టింగ్‌లకు అత్యధిక ధర పలికినట్లు ప్రచారం జరుగుతోంది. వీఆర్వోల బదిలీలకు కూడా రూ.లక్ష నుంచి బేరం ఆడుతున్నట్లు తెలిసింది. ముందు డబ్బులు ఇవ్వండి.. తర్వాత బదిలీ అవ్వండి⇒ ఎక్సైజ్ శాఖలో ‘సెబ్’ త్వరలోనే రద్దు చేస్తున్నామని, మద్యం పాలసీ మారగానే బదిలీలు ఖాయమని శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు రూ.10లక్షలు ఇస్తే రేపు నచ్చినచోట పోస్టింగ్ వేయిస్తామని ఎస్ఐ, సీఐల నుంచి వసూళ్లకు తెరతీశారు. గతి‘లేఖ’.. నేతల చుట్టూ...⇒ కృష్ణా జిల్లాలో కీలకమైన రెవెన్యూ, మునిసిపల్,పంచాయతీరాజ్, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ సిఫారసు లేకుండా బదిలీలు చేయవద్దని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సిఫారసు లేఖల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు చేస్తున్నారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు ఇచ్చేందుకు రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఆర్డీవో పోస్టుకు రూ.కోటి.. ముగ్గురు పోటీ!⇒ కర్నూలు ఆర్డీవో పోస్టును టీడీపీ నాయకులు రూ.కోటికి బేరం పెట్టినట్లు తెలిసింది. ఈ పోస్టు కోసం ముగ్గురు అధికారులు పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఎంత రేటుకు ఈ పోస్టు దక్కుతుందో ఒకటి, రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. విశాఖలో రూ.10లక్షలు–రూ.20లక్షలు⇒ విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం, భీమిలి,పెందుర్తి మండలాల తహసీల్దార్ల పోస్టింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోనే మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ప్రత్యేకం⇒ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు అధికార పార్టీ నేతలు రాష్ట్రంలోనే అత్యధిక ధర రూ.2కోట్ల వరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఆనందపురం, పెందుర్తి, గాజువాక, విశాఖ జాయింట్–1 పోస్టింగ్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఇక్కడ పోస్టింగ్ కోసం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు టీడీపీ నేతలు రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయినా కొందరు అధికారులు బదిలీల కోసం ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోస్టింగ్‌లు ఇవ్వకముందే డబ్బులు వసూలు⇒ అనకాపల్లి జిల్లాలో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదు. బదిలీల ప్రక్రియలో అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో పోస్టింగ్‌ల కోసం రూ.10లక్షలు చొప్పున, నర్సీపట్నం, చోడవరం మండలాల్లో రూ.5 లక్షలు చొప్పున కూటమి ప్రజాప్రతినిధులు వసూలు చేసినట్లు సమాచారం. సిఫారసు ఉంటేనీ సీఐ పోస్టింగ్⇒ అనకాపల్లి జిల్లాలో సీఐల బదిలీల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యేల లెటర్ ఉంటేనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. అనకాపల్లి జిల్లాలో సబ్బవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, నక్కపల్లి, చోడవరం సబ్ రిజిస్ట్రార్ల పోస్టింగ్‌ల కోసం రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. -
బదిలీలు బద్నామ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక తొలిసారిగా తలపెట్టిన ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. సీనియారిటీ జాబితాల రూపకల్పన మొదలు గరిష్టంగా 40శాతం సిబ్బంది బదిలీ నిబంధన వరకు ఎన్నో సమస్యలు తలెత్తాయి. దీనితో చాలా శాఖల్లో ట్రాన్స్ఫర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం ఈనెలాఖరు వరకు బదిలీల గడువును పొడిగించాల్సి వచ్చింది. నిజానికి ప్రభుత్వ శాఖలు ప్రకటించిన సీనియారిటీ జాబితాలు శాస్త్రీయంగా లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ జాబితాల ప్రకటన అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, తుది జాబితాల ప్రకటనకు ప్రభుత్వం పెద్దగా సమయం ఇవ్వలేదని.. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు ముందుకు సాగలేదని అంటున్నారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, సంక్షేమ శాఖల్లో ట్రాన్స్ఫర్లకు ఆటంకాలు ఏర్పడ్డాయని వివరిస్తున్నారు. ఆయా ఉద్యోగుల సందేహాలను, సీనియారిటీ సమస్యలను నివృత్తి చేయలేక శాఖాధిపతులు తల పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. తేలని జీవో 317 లొల్లి.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 అమల్లో భాగంగా చేసిన ఉద్యోగుల కేటాయింపులపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. 32 శాఖల్లోని 53వేల మందికిపైగా ఉద్యోగులు ఆన్లైన్ విధానంలో ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించారు. జీవో 317 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ సమస్యల వివరాలను కూడా సేకరించింది. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 18న ఉప సంఘం సమావేశమవాల్సి ఉన్నా జరగలేదు. దీంతో 53 వేల మంది ఉద్యోగుల వినతులు పెండింగ్‌లో పడిపోయాయి. అవన్నీ ఇంకా పెండింగ్‌లో ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెరలేపింది. మంత్రివర్గ సమావేశం జరిగి ఉంటే సమస్యల పరిష్కారానికి సిఫార్సు లభించేదని, వాటిని పరిష్కరించకుండా బదిలీల ప్రక్రియ ఎలా పూర్తవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం.గురుకులాల్లో ఆందోళన సాధారణ బదిలీల కంటే ముందే గురుకుల విద్యా సంస్థల్లో పదోన్నతులు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాదాపు నెలరోజులుగా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జోనల్ కేటాయింపులు రోజుకోరకంగా మారుతుండటంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో మల్టీజోన్–1కు చెందిన ఉద్యోగులను మల్టీజోన్–2కు కేటాయించారు. కొన్ని కేటగిరీల్లో మల్టీజోన్–2 పరిధిలోని ఉద్యోగులు మల్టీజోన్–1కు పంపారు. ప్రిన్సిపాల్స్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ కేటగిరీల్లో వందల మందికి ఇలా జోన్లు మారడంతో వారంతా న్యాయ పోరాటానికి దిగారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వారిని మినహాయించి బదిలీలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోనూ జోనల్ కేటాయింపుల్లో సమస్యలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. విద్యా శాఖలో సింగిల్ టీచర్ సమస్య.. పాఠశాల విద్యా శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ పదిరోజుల క్రితం ముగిసింది. దాదాపు 35వేల మంది టీచర్లు కొత్త స్కూళ్లకు బదిలీ అయ్యారు. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల విషయంలో ఇబ్బంది ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆ పాఠశాలల్లో ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు బదిలీ అవడం.. వాటికి ఇతర టీచర్లెవరూ రాకపోవడం సమస్యగా మారింది. అలాంటి చోట్ల టీచర్లను రిలీవ్ చేయకుండా నిలిపేశారు. బదిలీ అయినా ఆ టీచర్లు పాత స్కూళ్లలోనే కొనసాగాల్సి వస్తోంది. వైద్యారోగ్య శాఖలో సీనియర్లకు మొండిచేయి రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కూడా బదిలీల ప్రక్రియతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కీలక సమయంలో మంచి వైద్య సేవలు అందించిన అధికారులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మాజీ డీఎంఈ సైతం ప్రాధాన్యత లేని చోటికి ట్రాన్స్ఫర్ కావడం గమనార్హం. కరోనా సమయంలో కీలకపాత్ర పోషించిన రాజారావు, నాగేందర్, రమేశ్‌రెడ్డి కూడా దూర ప్రాంతాలకు కేటాయించారు. దీంతో ఈ శాఖలో బదిలీల ప్రక్రియను ఇష్టానుసారం చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నర్సుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని.. కొందరు అధికారులు ముడుపులు కూడా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఆర్థిక శాఖలో ‘క్లియర్ వేకెన్సీ’ వివాదం.. ఆర్థికశాఖలో జరిగిన బదిలీల్లో నిబంధనలు సరిగా పాటించలేదని ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. డైరెక్టర్ వర్క్స్, అకౌంట్స్ కార్యాలయంలో జరిగిన బదిలీల్లో నాలుగేళ్ల తప్పనిసరి బదిలీ నిబంధన పాటించలేదు. ఒకేచోట ఆరేడు ఏళ్ల సర్వీసు పూర్తయినా.. కొందరి వివరాలు సేకరించకుండా పక్కనబెట్టారని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు తక్కువకాలం పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరి బదిలీ జాబితాలోకి తీసుకువచ్చారని మండిపడుతున్నారు. అంతేకాదు.. సీనియారిటీ ప్రకారం పూర్తి వేకెన్సీలను చూపకుండా అన్యాయం చేశారనే ఆరోపణలూ వస్తున్నాయి. హనుమకొండలోని మిషన్ భగీరథ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక డీఏఓ ఆరేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ జాబితాలోకి తీసుకోలేదని సమాచారం. ములుగు కార్యాలయంలో ఉన్న క్లియర్ వేకెన్సీని సీనియర్ ఉద్యోగులకు చూపించకుండా.. మిషన్ భగీరథ వరంగల్ కార్యాలయంలో పనిచేస్తున్న తక్కువ సర్వీస్ ఉన్న డీఏఓకు కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. పీసీబీలోనూ బది‘లీలలు’! తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ)లో సుదీర్ఘకాలంగా హెడ్డాఫీస్, జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న పైస్థాయి అధికారులు, వివిధ కేడర్ల అధికారులు/ఉద్యోగులు నాలుగేళ్లకుపైబడి ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గడువు పెంచినా.. బదిలీల విషయంలో అధికారుల నుంచి అటెండర్ల వరకు అసంతృప్తిగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇలా వివిధ శాఖల్లో జరుగుతున్న బదిలీలు గందరగోళంగా మారడంతో ప్రభుత్వ బదిలీల ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో ఇప్పటికైనా అర్హులైన ఉద్యోగులకు బదిలీలు జరగాలని, అన్యాయంగా జరిగిన బదిలీలు ఆగిపోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. జోనల్ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు మినహాయింపు నీటి పారుదల శాఖలోని అన్ని కేడర్ల ఇంజనీర్లను సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం జారీచేశారు. శాఖలో ఇంజనీర్ల కొరత ఉందని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. నిర్మాణంలోని ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ అవసరాలు తీరాక శాఖ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని కేడర్లలోని ఇంజనీర్ల బదిలీలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఇంజనీర్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో శాఖలోని వివిధ ఇంజనీర్ల సంఘాల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ప్రస్తుతానికి బదిలీలను పక్కనపెట్టినట్టు సమాచారం. 40% నిబంధనతో చిక్కు..ప్రస్తుత సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నాలుగేళ్లు, ఆపై ఒకేచోట పనిచేస్తున్న అధికారి/ఉద్యోగి తప్పనిసరి బదిలీ కేటగిరీలోకి వస్తారు. అయితే గరిష్టంగా 40 శాతం మందికి మాత్రమే స్థానచలనం కలిగేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉదాహరణకు ఒక జోన్ పరిధిలో వంద మంది ఉద్యోగులు ఉండి, వారిలో 50 మంది నాలుగేళ్లకుపైగా ఒకేచోట ఉన్నారనుకుంటే.. ఈ 50 మందికి బదిలీ అర్హత ఉన్నట్టే. కానీ 40శాతం నిబంధన మేరకు 40 మంది మాత్రమే బదిలీ అయి, మిగతా పది మందికి చాన్స్ దొరకదు. ఇలా చాలా శాఖల్లో తప్పనిసరి జాబితాలోని ఉద్యోగులకు బదిలీ చాన్స్‌రాక తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్యాలయాలన్నీ ఒకే స్టేషన్ కిందకు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టత ఇచ్చింది. ఈ నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వ శాఖలు తడబాటుకు గురవడంతో.. కొందరు గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకే బదిలీ కావాల్సి వచ్చింది. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 'బదిలీల ఫీవర్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీల ఫీవర్ మొదలైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వడంతో హడావుడి కనిపిస్తోంది. ప్రధానంగా ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారు స్థానచలనం కోసం కసరత్తు మొదలుపెట్టారు. సీనియార్టీ, ఖాళీల స్థితిని అంచనా వేసుకుంటూ బదిలీలకు ఉన్న అవకాశాలను విశ్లేషించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఈనెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియను ప్రభుత్వ శాఖలు మొదలు పెట్టాయి. 20లోగా పూర్తి చేయాలి ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఈనెల 20వ తేదీ వరకు సడలిస్తూ.. నిర్దేశించిన షెడ్యూల్లోగా అన్ని శాఖలు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు విడివిడిగా బదిలీల మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే పలు విభాగాలు మార్గదర్శకాలు విడుదల చేయగా... ఒకట్రెండు రోజుల్లో దాదాపు అన్ని శాఖలు కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నాయి. బదిలీలకు సంబంధించిన రోజువారీ షెడ్యూల్‌ను సైతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉద్యోగుల నుంచి బదిలీల దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వాటిని పరిశీలించడం, అర్హుల జాబితాను విడుదల చేయడం పూర్తి చేసిన తర్వాత ఈనెల 19, 20 తేదీల్లో బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న పాఠశాల విద్యాశాఖలో బదిలీల ప్రక్రియ ఇప్పటికే ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డి జిల్లాలో ఒకట్రెండు కేటగిరీలు మినహా టీచర్ల బదిలీ దాదాపు పూర్తయింది. ప్రస్తుత బదిలీల్లో జీఓ 317 కింద నూతన కేటాయింపులు జరిగిన ఉద్యోగులు మినహా మిగతా వారిలో చాలామందికి, ప్రధానంగా స్థానచలనం కలిగే అవకాశం ఉంది. మరోవైపు 317 కింద కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ కొందరు ప్రభుత్వానికి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. వారికి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. సీనియర్లకే స్థానచలనం! ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు విధించింది. గరిష్టంగా 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయొద్దని ఆదేశించింది. ఈ నిబంధన జూనియర్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారి/ఉద్యోగి తప్పనిసరి బదిలీల జాబితాలోకి చేరతాడు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ బదిలీలు జరిగిన ఆరేళ్లు కావస్తోంది. దీంతో కొత్తగా నియమితులైన ఉద్యోగులు, జీఓ 317 కింద నూతన కేటాయింపుల్లో భాగంగా మారిన వారు, ఎన్నికల బదిలీలు మినహాయిస్తే దాదాపు ఉద్యోగులందరికీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అలాగే మెజార్టీ ఉద్యోగులు బదిలీ జాబితాలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే 40 శాతానికి మించి ఉద్యోగుల బదిలీలు చేయొద్దనే నిబంధన కారణంగా పలువురు తప్పనిసరి బదిలీల జాబితాలో ఉన్నప్పటికీ స్థానచలనం కలిగే అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది . ఆన్లైన్..మాన్యువల్ ప్రస్తుతం బదిలీల ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉంది. ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత సీనియార్టీ జాబితా ప్రకారం బదిలీలకు ఎంతమందికి అవకాశం దక్కుతుందో ఓ అంచానా వేసేందుకు అవకాశం ఉంటుంది. కాగా ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా బదిలీ విధానం మారనుంది. 100 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ సంఖ్యలో బదిలీ అయ్యే చోట వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేసుకున్నాయి. రాష్ట్రస్థాయి కార్యాలయంలో అయితే పరిమిత సంఖ్యలో ఉద్యోగులుండడంతో మాన్యువల్ కౌన్సెలింగ్‌కు అవకాశం ఉండగా... క్షేత్రస్థాయిలో మాత్రం ఆన్లైన్ కౌన్సెలింగ్ జరగనుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచి్చంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాయి. పాలనకు తాత్కాలిక విరామం! రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మొదలు జిల్లా స్థాయి, మండల స్థాయి కార్యాలయాల్లో ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలపైనే తీవ్ర చర్చ జరుగుతోంది. శాఖల వారీగా మార్గదర్శకాలు వెలువడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆలోపు సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవడంతో పాటు ఏయే స్థానాలకు బదిలీపై వెళ్లాలనే అంశంపై ఉద్యోగులు విశ్లేషణ చేసుకుంటున్నారు. రానున్న రెండు వారాల పాటు ఉద్యోగులంతా ఈ ప్రక్రియలోనే బిజీ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర కార్యకలాపాలకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఒడవని జీవో 317 లొల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో జీవో 317 అమలుపై తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టేందుకు గత నెలలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో అమలు తీరు అయోమయంలో పడింది. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 కేటగిరీలో దాదాపు నాలుగు వందల మందికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన 550 మంది టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరించిన అనంతరం వారికి కూడా జోన్ల కేటాయింపు, పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ముందడుగు పడలేదు. కనీసం ఉద్యోగుల సీనియార్టీ జాబితాలు సైతం రూపొందించకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.సొసైటీ కార్యాలయంలో ఎవరికి వారే...జీవో 317 కింద ఉద్యోగుల కేటాయింపు, సీని యార్టీ జాబితాలపై ఉద్యోగులంతా ఎస్సీ గురు కుల సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతు న్నారు. గత నెల 24, 25 తేదీల్లో వీరికి వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండగా... సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దాదాపు పది రోజులు గడిచినా ఇప్పటివరకు ఈ అంశంలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో సొసైటీ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించినప్పటికీ తమకేమీ తెలియదంటూ చేతులు దులిపేసుకుంటున్నా రని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తు తం ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ మొదలైంది. ఎస్టీ గురుకుల సొసైటీలో ఉద్యో గుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈనెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. ఇతర గురుకుల సొసైటీ లన్నీ వేగవంతంగా ప్రక్రియ పూర్తిచేస్తుండగా.. ఎస్సీ గురుకుల సొసైటీలో నెలకొన్న విచిత్ర పరిస్థితితో ఉద్యోగులంతా తలపట్టుకుంటున్నా రు. ముందుగా జీవో 317 కేటాయింపుల తర్వాత సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జీవో 317 బాధితులు ఆందోళన చెందొద్దుజీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులు ఏమాత్రం ఆందోళన చెందవద్దని.. వారికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. జీవో 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శనివా రం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు వివరించిన అంశాలను విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జీవో 317 బాధిత ఉద్యోగులు, స్పౌజ్ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీ శాశ్వత పరిష్కారం చూపుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి తుది నివేదిక అందించనుందని వెల్లడించారు. -
ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, తక్షణమే కౌన్సెలింగ్ పద్ధతిలో ఉద్యోగుల సాధారణ బదిలీలు నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం తీర్మానించింది. ఆదివారం నాంపల్లిలోని గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎ.సత్యనారాయణ ఈ సమావేశాన్ని ప్రారంభించి ఉద్యోగుల సమస్యలు, సరీ్వసు అంశాలపై చర్చించారు.అనంతరం 17 అంశాలతో కూడిన తీర్మాన ప్రతిని ప్రవేశపెట్టగా కేంద్ర సంఘం కార్యవర్గంతో పాటు 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగుల ఫోరం, 54 శాఖల ఫోరమ్‌లు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. జిల్లాల వారీగా, శాఖ ల వారీగా టీజీఓ ఫోరమ్‌ల ఏర్పాటుకు కేంద్ర సంఘం ఆమోదం తెలిపింది. ఈ తీర్మాన ప్రతిని మంత్రివర్గ ఉపసంఘానికి, త్రిసభ్య కమిటీకి అందించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు వెల్లడించారు. సమావేశంలో టీజీఓ కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు బి.శ్యామ్, ఉపాధ్యక్షుడు ఎ.జగన్మోహన్రావు, కోశాధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. తీర్మానంలోని ప్రధాన అంశాలు ⇒ ఉద్యోగుల బదిలీలపై బ్యాన్ ఎత్తివేసి కౌన్సెలింగ్ పద్ధతిన తక్షణమే నిర్వహించాలి ⇒ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏ బకాయి లను చెల్లించాలి. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి ⇒ ఆర్థిక శాఖలో పెండింగ్‌లోని సప్లిమెంటరీ బిల్లులన్నీ క్లియర్ చేయాలి ⇒ జీఓ 317 దరఖాస్తులన్నీంటినీ పరిష్కరించాలి ⇒ 2వ పీఆర్సీ మధ్యంతర భృతి 5% నుంచి 20% పెంచాలి ⇒ వైద్య,ఆరోగ్య శాఖలో జీఓ 142ను çసమీక్షించాలి ⇒ కొత్త జిల్లాల్లో అదనపు కేడర్ స్ట్రెంథ్ మంజూరు చేయాలి ⇒ అధికారులపై అనుచితంగా ప్రవర్తిస్తున్న జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి. -
చిచ్చు రేపిన వ్యాపారం
కర్ణాటక: ఉద్యోగుల బదిలీల గురించి అధికార, విపక్షాల మధ్య వాగ్వివాదంతో మంగళవారం విధానసభ మార్మోగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం విధానసభ ప్రారంభం కాగానే విజయపుర మహానగర పాలికె కమిషనర్ బదిలీపై బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడంతో స్పీకర్ ఖాదర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. జీర్ అవర్‌లో బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ పాలికె కమిషనర్ బదిలీ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బదిలీలు సహజం. ఐఏఎస్, కేఏఎస్ కేడర్ పోస్టులకు అదే కేడర్ అధికారిని నియమించాలి. కానీ విజయపుర మహానగర పాలికె కమిషనర్‌గా అర్హతలేని అధికారిని నియమించారు, వలయ కమిషనర్ కేడర్ కంటే తక్కువ హోదా ఉంది అని యత్నాళ్ దుయ్యబట్టారు. నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేశ్ మాట్లాడుతూ ఆ పోస్టుకు కేఏఎస్ అధికారినే నియమించామని, ఇందులో ఏ కులం అనేది చూడలేదని అన్నారు. యత్నాళ్ మాట్లాడుతూ తనను అణచివేయడానికి ప్రయత్నించిన అధికారిని నియమించారని, అర్హత కలిగిన అధికారిని కాదని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీలతో వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం అభ్యంతరం యత్నాళ్ మాటలపై అభ్యంతరం తెలిపిన సీఎం సిద్దరామయ్య, వ్యాపారమని ఎందుకు చెబుతున్నారు, మేము వ్యాపారం చేస్తున్నామని చెప్పడానికి మీరు హరిశ్చంద్రులా? అనవసరంగా మాట్లాడకండి అని మండిపడ్డారు. దీనిపై జీరో అవర్‌లో చర్చకు అవకాశం లేదని సీఎం చెప్పడంతో బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వివాదం ప్రారంభించారు. వ్యాపారం చేస్తున్నారు అనే పదం తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి స్పీకర్‌ను కోరారు. మాజీ సీఎం బసవరాజ బొమ్మై మాట్లాడుతూ యత్నాళ్ మాటలను సమర్థించడంతో అధికార– విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అరుపులతో సభలో గందరగోళం ఏర్పడింది. మంత్రి బైరతిసురేశ్ మాట్లాడుతూ మీ వద్దకు వ్యాపారం చేయడానికి అధికారిని పంపించాలా అని ప్రశ్నించడంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తొలగించాలి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పోస్టుకు రూ.2500 కోట్లు, మంత్రి పదవికి రూ.1000 కోట్లు అని యత్నాళ్ గతంలో బీజేపీపైనే ఆరోపణలు చేశారని ఎద్దేవా చేశారు. మా పార్టీ అయితే 24 గంటల్లో యత్నాళ్ ను బహిష్కరించేదన్నారు. దీనిపై యత్నాళ్ మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై సీబీఐ తో దర్యాప్తు చేయించండని అన్నారు. బొమ్మై జోక్యం చేసుకుంటూ అధికారం ఉందని ఇష్టానుసారం చేయడం సరికాదని మంత్రిపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ వ్యాపారం చేస్తున్నారు అనేది రికార్డులు నుంచి తొలగించాలని స్పీకర్‌ను మనవిచేశారు. మీరు లూటీ చేయడంతోనే ప్రజలు మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. గొడవ చెలరేగడంతో స్పీకర్ పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. -
వితంతువులకే మొదటి ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులెవరినీ వారి సొంత గ్రామ పంచాయతీలకు లేదా వారి సొంత మున్సిపల్ వార్డుల పరిధిలోకి ఎట్టి పరిస్థితిలో బదిలీ చేయబోమని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శనివారం పూర్తి మార్గదర్శకాలను విడుదల చేశారు. 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది.. ఈ ఏడాది మే 25 నాటికి ప్రొబేషన్ ప్రక్రియ పూర్తయిన వారు బదిలీ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఏఎన్ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు పరస్పర అంగీకార బదిలీలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే వారిపైన ఎలాంటి శాఖపరమైన క్రమశిక్షణా చర్యలు, ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యం.. ♦ కాగా బదిలీ దరఖాస్తులో సచివాలయాల ఉద్యోగులు ఐదు మండలాలు లేదా ఐదు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునే వీలు కల్పించారు. పరస్పర అంగీకార బదిలీలకు కేవలం ఒక మండలం లేదా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ల ద్వారా పొందిన నో డ్యూస్ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయాలి. ♦ బదిలీలు కోరుకునేవారిలో... వితంతువులు తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని, వ్యాధిగ్రస్తులు మెడికల్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. చెరొక చోట ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలకు వివాహ ధ్రువీకరణపత్రంతో పాటు భర్త లేదా భార్య ఆధార్ వివరాలు, వారి ఉద్యోగ ఐడీ కార్డు, ఉన్నతాధికారి జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలి. వాటిని దరఖాస్తుతోపాటు జత చేయాలి. ♦ ఒక జిల్లా పరిధిలో 15 శాతం నాన్ లోకల్ నిబంధనలకు లోబడి అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయి. ఒక లోకల్ ఉద్యోగి, మరొక నాన్ లోకల్ ఉద్యోగి పరస్పర అంగీకారంతో అంతర్ జిల్లా కేటగిరీలో బదిలీ కోరుకున్నప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బదిలీపై వెళ్తున్న ఉద్యోగితో సహా కొత్తగా ఆ జిల్లాకు వచ్చే నాన్ లోకల్ ఉద్యోగి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మించి ఉన్నప్పుడు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఉండదని వెల్లడించారు. ♦ బదిలీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించే సమయంలో మొదట జిల్లా పరిధిలో, ఆ తర్వాత దశలో మాత్రమే అంతర్ జిల్లాల బదిలీలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లతోసహా ఇతర నియామక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో బదిలీల్లో మొదట ఒంటరి మహిళ లేదా వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ తర్వాత వరుస క్రమంలో అనారోగ్య కారణాలు, భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పనిచేస్తుండడం వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇక చివరి ప్రాధాన్యతగా పరస్పర అంగీకార బదిలీలకు వీలు కల్పించాలన్నారు. అర్హులందరికీ బదిలీలకు అవకాశం బదిలీ కోరుకునే ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా.. నిర్ణీత గడువులోగా అర్హులందరికీ ప్రొబేషన్ కూడా పూర్తయ్యేలా కలెక్టర్లతో కలిసి ఆయా శాఖాధిపతులు చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ సూచించారు. డైరెక్టర్ లక్ష్మీశతో కలిసి శనివారం ఆయన సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖాధిపతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. -
పరస్పర బదిలీలకు ఓకే..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో కదలిక వచ్చింది. హైకోర్టు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని సమ్మతిపత్రం అందజేసిన దరఖాస్తుదారుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పరస్పర బదిలీలపై వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని అన్ని ప్రభుత్వశాఖలను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుందని అధికారులు వెల్లడించారు. విద్య, హోంశాఖల నుంచి అధికసంఖ్యలో పరస్పర బదిలీల కోసం దరఖాస్తులొచ్చాయి. విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సోమవారం ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు పరస్పర బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాకాటి కరుణ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోనల్, జోనల్, జిల్లా క్యాడర్లకు పలువురు ఉపాధ్యాయుల పరస్పర బదిలీల జాబితాలను ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు. బదిలీపై వెళ్లేవారికి కొత్త లోకల్ క్యాడర్లోని ప్రస్తుత రెగ్యులర్ చివరి ఉద్యోగి తర్వాతి ర్యాంక్‌ను కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలకు టీఏ, డీఏ వర్తించదని తెలిపారు. ఇదిలా ఉండగా, పరస్పర బదిలీల్లో భాగంగా ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు వెళ్తే మొత్తం సీనియారిటీని కోల్పోవాల్సి ఉంటుందని గతంలో జారీ చేసిన జీవోలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ అప్పట్లో కొందరు హైకోర్టులో కేసు వేయడంతో బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. ఈ అంశంపై తుదితీర్పునకు లోబడి తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణపత్రం జారీ చేయడంతో పరస్పర బదిలీలకు అనుమతిస్తూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలపై హైకోర్టు తుదితీర్పునకు కట్టుబడి ఉంటామని దరఖాస్తుదారుల నుంచి సమ్మతిపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. -
కొత్త జిల్లాలకు పదివేల మంది బదిలీ
సాక్షి, అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించేందుకు జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల ప్రొవిజనల్ కేటాయింపు కసరత్తు పూర్తయింది. నూతన రెవెన్యూ డివిజన్లలో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులను జనాభా ప్రాతిపదికన పూర్తి చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు సుమారు పది వేల మంది ఉద్యోగులు ప్రొవిజనల్ కేటాయింపుతో పాటు బదిలీలు కానున్నట్లు ఆర్ధిక శాఖ అంచనా వేసింది. ప్రొవిజనల్ కేటాయింపులో కొత్త జిల్లాలకు బదిలీ చేసే ఉద్యోగులు, అధికారుల సర్వీసు సీనియారిటీతో పాటు ఇతర సర్వీసు అంశాలన్నీ యథాతథంగా ఉంటాయి. కొత్త జిల్లాలు, డివిజన్లకు ప్రొవిజనల్ కేటాయింపులతో బదిలీ అయ్యే ఉద్యోగుల స్థానికత యథాతధంగా ఉంటుందని ఆర్ధిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం లేకుండా.. ఉదాహరణకు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రంగాల్లో 90 పోస్టులుంటే కొత్తగా ఏర్పాటవుతున్న సత్యసాయి జిల్లాకు జనాభా ప్రాతిపదికన ఆ పోస్టులను విభజిస్తారు. ఆ పోస్టుల విభజన మేరకు ఉద్యోగులను ప్రొవిజనల్‌గా కేటాయిస్తారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు ఉద్యోగుల ప్రొవిజనల్ కేటాయింపుల కోసం ప్రస్తుత జిల్లాలు, డివిజన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లను తీసుకున్నారు. ఒకే పోస్టుకు ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే రివర్స్ విధానంలో జూనియర్లను బదిలీ చేస్తారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు ప్రొవిజనల్ కేటాయింపుల్లో వెళ్లే ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతులపై ఎటువంటి ప్రభావం చూపదు. ప్రొవిజనల్ కేటాయింపుల్లో కొత్త జిల్లాలు, డివిజన్లకు బదిలీ అయ్యే ఉద్యోగులు, అధికారులకు బదిలీ ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. కొత్తజోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ బదిలీలన్నీ తాత్కాలికంగా ప్రొవిజనల్‌గా పనిచేయడానికి మాత్రమేనని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. 31న తుది నోటిఫికేషన్ కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుకు ఈ నెల 31వ తేదీన తుది నోటిఫికేషన్ జారీ కానుంది. ఆ వెంటనే కొత్త జిల్లాలకు, డివిజన్లకు ప్రొవిజనల్‌గా ఉద్యోగులను బదిలీ చేస్తూ సంబంధిత శాఖలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ప్రస్తుతం 13 జిల్లాల్లో ఆసరా–సంక్షేమ జాయింట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిని కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు రెవెన్యూ ఆఫీసర్లు (డీఆర్వో)గా నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుత జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ లేదా డిప్యుటీ డైరెక్టర్‌ను కొత్త జిల్లాలకు కేటాయిస్తే వారిని జిల్లా వ్యవసాయ అధికారిగానే పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కొత్త జిల్లాకు కేటాయిస్తే జిల్లా మహిళా శిశు సంక్షేమ ఆఫీసర్‌గా పరిగణిస్తారు. కొత్త జిల్లాలకు బదిలీ అయ్యే ఉద్యోగులు, అధికారుల వివరాలను ఈ విధంగానే రూపొందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగి పేరు, గుర్తింపు నెంబర్, క్యాడర్, హోదా, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం, ప్రొవిజనల్‌గా కేటాయిస్తున్న జిల్లా పేరుతో జాబితాలను రూపొందించనున్నారు. -
వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో మార్పులు
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి చేపట్టనున్న ఉద్యోగుల బదిలీల అంశంలో ప్రభుత్వం స్పల్ప మార్పులు చేసింది. బదిలీలకు సంబంధించి పలు నిబంధనలను పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయా నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా.. ఉద్యోగులు బదిలీ కోరుకునే మూడు ప్రాంతాలను మాత్రమే పేర్కొనేందుకు అవకాశం ఇవ్వగా, ఇప్పుడు వాటిని 20 ప్రాంతాలకు పెంచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ నాటికి పనిచేస్తున్న చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించగా.. ఆ తేదీని ఫిబ్రవరి 7 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకునే వారిని కూడా చేర్చారు. ఉద్యోగులు ఫిబ్రవరి 7వ తేదీ నాటికి బదిలీ దరఖాస్తులు సమర్పించాలని గత ఉత్తర్వుల్లో పేర్కొనగా.. దాన్ని ఫిబ్రవరి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల పరిశీలన తేదీని ఫిబ్రవరి 18 వరకు పెంచారు. -
ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పరస్పర ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉద్యోగులిద్దరూ పరస్పరం అవగాహన వస్తే బదిలీకి అవకాశం ఉంది. ఉద్యోగుల విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. భార్యాభర్తల కేసులను తక్షణం పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించారు. బదిలీలపై రేపు లేదా ఎల్లుండి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. చదవండి: ప్రగతి భవన్ దగ్గర జేసీ దివాకర్‌రెడ్డి ఓవర్ యాక్షన్ -
పరస్పర బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: వివిధ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీలకు వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా సడలించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ తొలి, రెండో వేవ్ నేపథ్యంలో 2020 మే, 2021 మే నెలల్లో సాధారణ బదిలీలకు అనుమతించడం సాధ్యం కాలేదని, ఈ నేపథ్యంలో పలు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు పాక్షికంగా సడలింపు ఇస్తూ పరస్పర బదిలీలకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తిరిగి జనవరి 5వ తేదీ నుంచి సాధారణ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారికే.. ఉద్యోగులు పరస్పర బదిలీల నిమిత్తం సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. పరస్పర బదిలీలు కోరుకునే వారిద్దరూ ప్రస్తుతం పనిచేసే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. బదిలీలు అదే కేడర్ పోస్టులకు ఉండాలి. వారి బదిలీలను ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు పరస్పర బదిలీలకు అనర్హులు. పరస్పర బదిలీలను సంబంధిత శాఖలు, శాఖాధిపతులు పారదర్శకంగా, ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలు, నిబంధనల ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ ప్రక్రియ అమలు పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. పరస్పర బదిలీలన్నీ వారి విజ్ఞప్తి మేరకు చేస్తున్నందున ఎటువంటి టీటీఏ, ఇతర బదిలీ ప్రయోజనాలు వర్తించవు. కాగా, ప్రభుత్వం ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం కల్పించడంపై ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక హర్షం వ్యక్తం చేసింది. సీఎంకు వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
రెండేళ్లు పూర్తయి ఉంటే బదిలీకి ఓకే..
సాక్షి, అమరావతి: ఒకే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే అలాంటి ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యారోగ్య శాఖలో తాజాగా బదిలీలకు మార్గదర్శకాలు జారీచేశారు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసిన వారు స్పష్టమైన ఖాళీ(క్లియర్ వేకెన్సీ) ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పరస్పర బదిలీల(మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అయితే ఒకే కేడర్ పోస్ట్ అయి ఉండాలి. బదిలీకి దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తామో చెప్పాలి. లేదా ఖాళీని బట్టి వారికి పోస్టింగ్ ఇస్తారు. బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారికి అదే చోట వెయ్యరు. ఉదాహరణకు విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలో పనిచేస్తూ.. మానసిక ఆస్పత్రికో, చెస్ట్ ఆస్పత్రికో బదిలీకి అనుమతించరు. కేవలం రిక్వెస్ట్ బదిలీలు మాత్రమే లకాబట్టి ఎవరికీ రవాణా సదుపాయాలు కల్పించరు. దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో జరుగుతుంది. 40 లేదా అంతకంటే ఎక్కువ వైకల్య శాతం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. మానసిక వైకల్యంతో బాధపడే పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి అవకాశం ఇస్తారు. క్యాన్సర్, గుండె ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలు చేయించుకున్న వారికి, చికిత్స కొనసాగుతున్న వారిని.. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రాంతానికి బదిలీ చేస్తారు. భర్త లేదా భార్య కేసుల(స్పౌస్ గ్రౌండ్స్)కు సంబంధించి ఒకరికి మాత్రమే బదిలీకి అనుమతిస్తారు. దీనిపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. దరఖాస్తు ప్రక్రియ గానీ, బదిలీ గానీ నిర్దేశించిన సమయంలో మాత్రమే అనుమతిస్తారు. పారదర్శకంగా బదిలీలు నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. -
‘సంక్షేమ’ శాఖలో..డిప్యుటేషన్ల షాక్!
సాక్షి, హైదరాబాద్: ‘‘జిల్లా సంక్షేమ కార్యాలయాల బలోపేతం కోసం మిమ్మల్ని బదిలీ చేస్తున్నాం. ఇకపై డిప్యుటేషన్ల పద్దతిలో మీరంతా డీడబ్ల్యూఓ కార్యాలయాల్లో పని చేయండి. వెంటనే అక్కడ విధుల్లో చేరండి. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్కడే కొనసాగండి ఇదీ మహిశాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మినిస్టీరియల్ ఉద్యోగులకు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఆ శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ‘న్యూ ఇయర్ షాక్’.క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సమస్యను అధిగమించేందుకు సర్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 109 మంది సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్‌లతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఆ శాఖ స్థానచలనంకలిగించింది. ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండగా... ఉద్యోగులకు అకస్మాత్తుగా డిప్యుటేషన్లు ఇవ్వడంతో వారంతా అవాక్కయ్యారు. ఎలాంటి సమాచారం లేకుండా... వ్యక్తిగత స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా వేరేచోట విధులు నిర్వహించాలని ఆదేశించడంపై భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి పథకం) ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల ఆధారంగా ప్రస్తుతం ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా పని ఒత్తిడి తగ్గిన నేపథ్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మినిస్టీరియల్ స్టాఫ్ సంఖ్యను తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈమేరకు చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈమేరకు గడచిన డిసెంబర్ 30వ తేదీన మెమో జారీ చేసింది. వెంటనే రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ స్పందిస్తూ డిప్యుటేషన్లు ఇస్తే సంబంధిత ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా బదిలీ అయిన వారిలో హైదరాబాద్ ఆర్జేడీ పరిధిలో 43 మంది, వరంగల్ ఆర్జేడీ పరిధిలో 66 మంది ఉన్నారు. జిల్లా పరిధిలోనే డిప్యూటేషన్ ఇవ్వాల్సి ఉండగా... కొంతమందికి అంతర్జిల్లాకు కూడా ఇచ్చారు. ఆ ఉద్యోగుల్లో అ‘సమ్మతి’... డిప్యుటేషన్ ఉత్తర్వులు అందడంతో మెజార్టీ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కనీస సమాచారం ఇవ్వకుండా, ఉద్యోగుల నుంచి సమ్మతి తీసుకోకుండా ఎలా ఇస్తారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ప్రభుత్వం సూచించినట్లుగా ఉద్యోగులతో మాట్లాడాలని, వారి నుంచి సమ్మతి పత్రాలు తీసుకున్న తర్వాతే డిప్యుటేషన్ ఇవ్వాలి. అవేమీ లేకుండానే జిల్లా కార్యాలయాల్లో పనిచేయాలని ఆదేశించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియార్టీని పట్టించుకోకుండా, కౌన్సెలింగ్ నిర్వహించకుండా ఇష్టానుసారంగా స్థానచలనం కలిగించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, కుటుంబాన్ని తరలిస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు వస్తాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ఎన్నికల విధుల్లో ఉండాల్సిన కొందరు ఉద్యోగులకూ డిప్యుటేషన్ ఇచ్చినట్లు సమాచారం. తక్షణాదేశాలు కావడంతో మెజార్టీ ఉద్యోగులు అయిష్టంగానే విధుల్లో చేరారు. -
అవి సాధారణ బదిలీలే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సంద ర్భంగా చేసిన ఉద్యోగుల బదిలీలను సాధారణ బదిలీలుగా నే పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాం టి ఉద్యోగులకు ప్రస్తుతమున్న స్థానం ఆధారంగానే ‘బదిలీ సర్వీసు’ను లెక్కలోకి తీసుకోవాలని సూచించింది. బదిలీల మార్గదర్శకాల్లో పేర్కొన్న ‘క్వాలిఫయింగ్ సర్వీస్ స్టేషన్’అంటే బదిలీ జరగాల్సిన ఉద్యోగి వాస్తవంగా పనిచేస్తున్న స్థానం అని.. అతడి సంస్థ, కార్యాలయం కాదని తెలిపింది. ప్రభు త్వోద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతినిస్తూ మే 24న జారీ అయిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవడంతో ఆయా అంశాలపై స్పష్టతనిస్తూ ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలివీ.. ♦ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగినప్పుడు మల్టీజోన్–2 పరిధిలో తెలంగాణకు చెందిన మొత్తం 10 ఉమ్మడి జిల్లాలు ఉండేవి. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో.. ఈ మల్టీజోన్– 2 కేడర్ ఉద్యోగుల బదిలీల బాధ్యతలను రాష్ట్ర కేడర్ ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ ముఖ్య కార్యదర్శి/ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలకు అప్పగించాలి. ♦ రంగారెడ్డి, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సర్వీసు స్థలా న్ని హైదరాబాద్‌గా పరిగణించాలి. ♦ ఉద్యోగుల డిప్యుటేషన్ వ్యవధిని కూడా అర్హత సర్వీసు కాలం కింద లెక్కించాలి. ♦ 40 శాతం ఉద్యోగుల బదిలీలకు అనుమతించడంతో ఈ లెక్కను మంజూరైన పోస్టుల సంఖ్య ఆధారంగా కాకుండా వాస్తవంగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా నిర్ధా రించాలి. ♦ జీవిత భాగస్వామి వేరే జిల్లా/ జోనల్/ మల్టీ జోనల్/ స్టేట్ కేడర్ పరిధిలో పనిచేస్తున్నందున స్పౌజ్ కేటగిరీ కింద ఎవరైనా ఉద్యోగి ప్రాధాన్యత బదిలీ కోరితే... ఆ ఉద్యోగి జిల్లా/ జోనల్/ మల్టీ జోనల్/ స్టేట్ కేడర్ పరిధిలోనే.. జీవిత భాగస్వామి పనిచేసే చోటుకు దగ్గరగా ఉండే స్థానానికి బదిలీ చేయాలి. ♦ భార్యాభర్తలిద్దరూ ఒకే స్థానంలో పనిచేస్తూ ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే.. వారిని కూడా తప్పనిసరిగా బదిలీ చేయాలి. సాధ్యమైతే వారిని ఒకే స్థానానికి లేదా సమీప స్థానాలకు బదిలీ చేయాలి. కొత్త జిల్లాలకు వెళ్లినవారికి ప్రస్తుతం బదిలీ లేనట్టే జిల్లాల పునర్విభజన 2016 అక్టోబర్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం కొత్త జిల్లాల్లోని కొత్త ప్రభుత్వ కార్యాలయాలకు వేలాది మందిని బదిలీ చేసింది. వారు ఇంకా రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోలేదు. సాధారణ బదిలీల నిబంధనల ప్రకారం ఏదైనా స్థానంలో కనీసం రెండేళ్లుగా కొనసాగుతున్న ఉద్యోగులే బదిలీలకు అర్హులు. అంటే వీరం తా తాజా బదిలీలకు అర్హత కోల్పోయినట్టే. -
ఎన్నికల్లో గెలిపించే అధికారులు కావాలి
- మాది రాజకీయ పరిపాలన: చంద్రబాబు - ఉద్యోగుల బదిలీలపై మంత్రులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ - మాట వినని అధికారులను వెయిటింగ్లో పెట్టాలి - డీఎస్పీ, ఆర్డీవోల బదిలీలను నేనే చేస్తా - పారదర్శకత అంటూ నాకే ఫిలాసఫీ చెబుతారా? - మంత్రులపై ముఖ్యమంత్రి ఆగ్రహం - బదిలీల గడువు నేటి వరకు పొడిగింపు సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ఉద్యోగుల సాధారణ బదిలీల విషయంలో స్వయంగా ప్రభుత్వమే పారదర్శతకు పాతరేసింది. పైరవీలకు తెరలేపింది. వాస్తవానికి బదిలీల గడువు సోమవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. కావాల్సిన వారిని కావాల్సిన చోట నియమించుకోవడానికి వీలుగా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం బుధవారం వరకు పొడిగించింది. మరో మూడేళ్లలో జరిగే ఎన్నికల్లో గెలవాలంటే మాట వినే అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆదేశించడం గమనార్హం. ఉద్యోగుల బదిలీలు పూర్తి పారదర్శకంగా, పనితీరు ఆధారంగానే జరుగుతాయని, ఇందులో రాజకీయ జోక్యానికి తావులేదని ఇప్పటిదాకా చెప్పిన సీఎం హఠాత్తుగా మాట మార్చేశారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బదిలీలు చేపట్టాలని నిర్దేశించారు. ఇక అధికార పార్టీ నేతలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగులు దక్కుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇందులో భారీగా అవినీతి చోటుచేసుకోనుందని, కోట్ల రూపాయల సొమ్ము చేతులు మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పార్టీకి విధేయులైన వారిని నియమించాలి ‘‘మాది రాజకీయ పరిపాలన.. మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే మా మాట వినే అధికారులను నియమించాలి. మాట వినని అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టాలి. జపాన్‌లో కేబినెట్ కార్యదర్శి కూడా అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. కీలకమైన డీఎస్పీ, ఆర్డీవోల బదిలీలు, నియామకాలకు సంబంధించిన ఫైళ్లను నాకే పంపించండి. నేను స్వయంగా చూసి ఆదేశాలు జారీ చేస్తా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ముఖ్యమంత్రి మంగళవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులతోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఉద్యోగుల బదిలీల వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రులను చంద్రబాబు నిలదీశారు. బదిలీలు పారదర్శకంగా, పనితీరు ఆధారంగానే జరుగుతాయని చెప్పడం వల్ల తాము పట్టించుకోలేదని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫిలాసఫీ చెబుతున్నావా? పారదర్శకత అంటే రాజకీయంగా ఆలోచించవద్దా? అని అచ్చెన్నాయుడిని గద్దించారు. మరో మూడేళ్లలో ఎన్నికలు ఉన్నందున ఉద్యోగుల బదిలీల విషయంలో ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదు ఉద్యోగుల బదిలీల విషయంలో మంత్రులు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు భేషజాల(ఇగో)కు పోతున్నారని, బదిలీల వ్యవహారంలో సరిగా వ్యవహరించట్లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. వ్యవసాయ శాఖలో బదిలీ ల వ్యవహారం ముందుకెళ్లకపోవడంపై సంబంధిత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు క్లాసు తీసుకున్నారు. అధికారులను సమన్వయం చేసుకోలేనప్పుడు మిమ్మల్ని మంత్రిగా, మరొకరిని ఇన్చార్జిగా పెట్టి ఉపయోగం ఏముందని ప్రశ్నించారు. బదిలీల ప్రక్రియను ఇంతవరకూ చేపట్టని ఆరోగ్యశాఖ, మరో రెండు రోజులు గడువు అడుగుతున్న విద్యాశాఖ తక్షణం ఈ ప్రక్రియను చేపట్టి గడువులోగా పూర్తి చేయాలన్నారు. పరిపాలనలో ముఖ్య భూమికగా ఉండే ఉద్యోగ వ్యవస్థ నుంచి ఉత్తమ బృందాల్ని ఎంపిక చేయడానికే బదిలీల ప్రక్రియ చేపట్టామని సీఎం చెప్పారు. మంత్రి గంటాపై చంద్రబాబు రుసరుసలు సాక్షి, విశాఖపట్నం: విద్యాశాఖలో బదిలీలు ఎందుకు జరగట్లేదు.. ఇంకెంత సమయం కావాలి? ఏడాది పొడవునా చేస్తారా? అంటూ సీఎం చంద్రబాబు మంత్రి గంటా శ్రీనివాసరావుపై రుసరుసలాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం మాట్లాడుతూ... బదిలీలు పూర్తి చేసేందుకు నీటి పారుదల, విద్యా శాఖలు గడువు కోరినట్టు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘‘ఖరీఫ్ ప్రారంభమైనందున ఆగస్టు వరకు వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు మనమే గడువిచ్చాం. విద్యాశాఖకు ఎందుకు గడువు అడుగుతున్నారు? వేసవి సెలవుల్లోనే బదిలీలు పూర్తి చేసి విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విధుల్లో చేరాలి కదా.. ఇప్పుడు గడువు కోరితే ఏడాది పొడవునా చేస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి గంటా బదులిస్తూ.. తమ ప్రిన్సిపల్ సెక్రటరీ 15 రోజులు సెలవుపై వెళ్లారని, అందువల్లే బదిలీలు చేపట్టలేకపోయామన్నారు. ‘‘నాకు సాకులు కాదు.. పని కావాలి’’ అని అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాను వచ్చి వ్యక్తిగతంగా కలుస్తానని గంటా అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా మాట్లాడలేదు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బదిలీలు ఉండాలని, మాట వినే వారికే పోస్టింగ్ ఇవ్వాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల కలెక్టర్లు, ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడలేదని వారు చెబుతున్నారు. ఇన్ని రోజులూ ఉద్యోగుల బదిలీల విషయంలో మంత్రుల జోక్యం అంతగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలతో కంగుతిన్నారు. కలెక్టర్లు కోరిన అధికారులను కీలక పోస్టుల్లో నియమించి, పరిపాలనలో సత్ఫలితాలు సాధించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ భావించారు. ఇందులో భాగంగా బదిలీల ఫైళ్ల ను మంత్రుల ఆమోదం కోసం సోమవారం పంపారు. అయినా మంత్రుల నుంచి ఆ ఫైళ్లు వెనక్కి రాలేదు. -
అంతా వాళ్లిష్టం..!
ముగిసిన ఉద్యోగుల బదిలీల ప్రహసనం * ప్రతి పోస్టుకు రాజకీయ పైరవీలు * అప్రతిష్ట తీసుకువచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు * ఆఖరి నిమిషంలో జీఓలనే మార్పించిన ఘనులు సాక్షి, విశాఖపట్నం: వడ్డించే వాడు మనవాడైతే ఆఖరి వరసలో కూర్చున్నా వచ్చేది వస్తుందని ఊరికే అనలేదు పెద్దలు..ఉద్యోగుల బదిలీ ప్రహసనం ముగిసింది. పాలకుల అండ ఉన్నవారికి అగ్రతాంబూలం దక్కింది. కానీ దీనివల్ల అధికార పార్టీపై మాయని మచ్చ ఏర్పడింది. తమకు నచ్చిన వారికి పోస్టింగ్ తెప్పించుకోవడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు చివరి నిమిషం వరకూ కొనసాగాయి. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పోస్టులో జారీ చేసిన జీఓను గంటల వ్యవధిలోనే మార్చాల్సిన పరిస్థితిని ఇద్దరు ఎమ్మెల్యేలు తీసుకురావడం మరో కొసమెరుపు. జిల్లా అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ జిల్లాలో కొన్ని వందల మందికి బదిలీలు జరిగాయి. వాటిలో కొన్ని వివాదాలకు కేంద్రమయ్యాయి. విశాఖ ఆర్డీఓ పోస్టు ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేపింది. వివాదం చినికి చినికి గాలివానగా మారి సీఎం దృష్టికి వెళ్లింది. మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం బదిలీ వల్లనే గొడవ కనుక దానినే విరమిస్తే మంచిదని చివరికి ప్రస్తుతం ఉన్న అధికారినే కొనసాగించాలని నిర్ణయించారు. అలా ఆ వివాదం సద్దుమణిగింది. జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖ ఏడీ పోస్టుకు ఎప్పుడూ లేనంత పోటీ వచ్చింది. ఐదుగురు అధికారులు ఉన్నత స్థాయిలో పైరవీలు చేశారు. కోట్ల రూపాయలు కుమ్మరించడానికి సిద్ధపడ్డారు. ఈ తతంగం వార్తల్లోకి ఎక్కడంతో చివరి నిమిషంలో బదిలీ నిలిచిపోయింది. ఈ పోస్టులో కూడా ప్రస్తుతం ఉన్న ఏడీనే కొనసాగించాల్సి వచ్చింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పోస్టుకు బదిలీ ప్రక్రియ ముగిసే ఆఖరి నిమిషం వరకూ పైరవీలు జరిగాయి. ఇక్కడి డీఎంహెచ్ఓ రెడ్డి శ్యామలను శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిగా బదిలీ చేసి ఆమె స్థానంలో యు.స్వరాజ్యలక్ష్మిని నియమిస్తూ తొలుత జీఓ విడుదలయ్యింది. విజయనగరం జిల్లా నుంచి స్వరాజ్యలక్ష్మి విశాఖ జిల్లాకు వస్తున్నారని తెలియగానే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం పేషీలో పైరవీలు చేశారు. జె.సరోజినికి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రిపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చారు. సరోజినికి తమతో పాటు ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చినా స్వరాజ్యలక్ష్మిని ఎలా నియమిస్తారంటూ హడావుడి చేశారు. దీంతో చివరి నిమిషంలో జీఓను మార్చి సరోజినికి విశాఖ డీఎంహెచ్‌ఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఇలా ఉన్నతాధికారుల బదిలీల్లో రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా తలదూర్చి పైరవీలు చేసి తమకు అనుకూలంగా ఉండే వారిని తెచ్చుకున్నారు. వారి దయాదాక్షిణ్యాలతో కోరుకున్న పోస్టింగ్ తెచ్చుకున్న అధికారులు వారు చెప్పినట్లు నడుచుకోకమానరు. ప్రాజెక్టులు,పనులు, నిధుల విషయంలో అధికారులను తమ ఇష్టానుసారం నడిపించే అవకాశం ప్రజాప్రతినిధులకు ఈ బదిలీల వల్ల వచ్చింది. ఇక అంతా వాళ్లిష్టమే. -
డబ్బు ఇచ్చుకో.. కోరిన చోటకు బదిలీ పుచ్చుకో
* జెడ్పీ ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు * ప్రభుత్వ నిబంధనలకు పాతర * నేటితో బదిలీలకు తెర ఏలూరు టూటౌన్ : జిల్లా పరిషత్‌లో ఎంపీడీవోలు, ఉద్యోగుల బదిలీల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి జెడ్పీ చైర్మన్, సీఈవో తమ ఇష్టారాజ్యంగా బదిలీలు చేపడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 979 నంబర్ జీవోను తుంగలోకి తొక్కుతున్నారని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. జెడ్పీలోని కీలక అధికారి ఒకరు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ బదిలీల్లో సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కోరుకునే వారి వద్ద రూ. 25 నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. నాలుగు రోజులుగా ఎంపీడీవోల బదిలీలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద నుంచి భారీస్థాయిలో సిఫార్సు లేఖలు జెడ్పీ సీఈవో, చైర్మన్‌కు అందాయి. నిబంధనల ప్రకారం ఎంపీడీవోలకు జీరో సర్వీస్ ఆధారంగా బదిలీలు చేయాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కోరిక మేరకు బదిలీలు జరుగుతున్నాయి. జిల్లా పరిషత్‌లో మినిస్ట్రీరియల్ ఉద్యోగులైన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లతో కలిపి మొత్తం వెయ్యి మంది వరకు ఉద్యోగులున్నారు. వీరిని జీవో నంబర్ 709 ప్రకారం 5 సంవత్సరాలు నిండిన వారిని 20 శాతం బదిలీలు కౌన్సిలింగ్ పద్ధతిలో జరపాల్సి ఉంది. అయితే ఆ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. గతంలో జెడ్పీ ఉద్యోగులకు సంబంధించి బదిలీల విషయంలో యూనియన్ నాయకులతో కూడా సీఈవో, చైర్మన్ సంప్రదింపులు జరిపేవారు. కాని ఈసారి దానికి విరుద్ధంగా తమ ఇష్టానుసారం బదిలీలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల మేరకే చేస్తాం : ఇన్చార్జి సీఈవో పి.సుబ్బారావు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో బదిలీల నిబంధనల మేరకే చేస్తామని ఇన్చార్జి జెడ్పీ సీఈవో పి.సుబ్బారావు తెలిపారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తప్పనిసరిగా కౌన్సిలింగ్ జరపాలనే నిబంధన లేదు. అందుకే ఉద్యోగుల ద్వారా అన్లైన్లో ఆప్షన్ తీసుకుని బదిలీలు చేస్తున్నాం. జీవో నెం.709 ప్రకారం బదిలీ చేయాలన్న నిబంధనతో ఫైల్ తయారు చేసి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు పంపామని చెప్పారు. ఇంజినీరింగ్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలు అవాస్తవం. ఎవరైనా డబ్బులు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బదిలీలతో బిజీబిజీ...ఎవరూ అతీగతీ
జన్మభూమి- మన ఊరు కేవలం ప్రభుత్వ కార్యక్రమం. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరవ్వాలి. కానీ పచ్చ చొక్కాల దౌర్జన్యాలతో గందరగోళంగా మారాయి. అధికారులు కూడా తానా తందానా అనడంతో ప్రొటోకాల్ పత్తాలేకుండా పోయింది. రెండో విడత వచ్చే సరికి కమిటీల పేరుతో అధికార ముద్రతో సర్కారు సభలపైకి ఉసి గొల్పడంతో ప్రజా సమస్యలు పక్కకు తొలగి పార్టీ ఎజెండా ముందుకు వచ్చింది. సర్వేల పేరుతో అర్హులను కూడా తొలగించడంతో మనస్థాపానికి గురై పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఓ వృద్ధురాలు ఏకంగా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఇంకో సంఘటనలో మరో వృద్ధుడు గుండె ఆగి చనిపోయాడు. తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లున్నాయన్న చందంగా అధికారులు పని చేసుకుపోవడంతో సంక్షేమం స్థానంలో సంక్షోభం ఏర్పడింది. లబ్ధిదారుల్లో మానసిక ఆందోళన నెలకొంది. ఇంతలో బది‘లీల’లు ప్రారంభమయ్యాయి. ఈ అర్జీల గతి ఏమవుతుందోనని లబ్ధిదారుల్లో సరికొత్త భయం నెలకొంది. వచ్చిన అధికారికి అంతా కొత్తే. ‘పెద్దాయనొచ్చె...మళ్లీ మొదలెట్టు’ అన్న చందంగా తయారవుతుందేమోనని అనుమానాలు ప్రారంభమయ్యాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో పలు అవాంతరాలతో ముగిసిన జన్మభూమి సభలు అనుకున్న లక్ష్యానికి చేరుకోక విమర్శల పాలయింది. వచ్చిన లక్షల అర్జీలు సంబంధిత శాఖలకు పంపించే తరుణంలో బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో ప్రయోజనం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రకాశం జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ సభలకు రెండు లక్షల 80 వేల అర్జీలు వచ్చాయి. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా నడుస్తుండటంతో ఈ దరఖాస్తులు ఆయా కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. అర్జీలకు ఆధార్‌తో ముడిపెట్టారు. ఆధార్ నెంబర్‌తోపాటు సెల్ నెంబర్ కూడా సేకరించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 1255 గ్రామసభలు నిర్వహించారు. అందులో రెండు లక్షల 80 వేల దరఖాస్తులు వస్తే కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించే లక్షా రెండువేల అర్జీలున్నాయి. భూ సమస్యలు, పట్టాదార్ పాసు పుస్తకాల కోసమే ఎక్కువ ధరఖాస్తులు వచ్చాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఒక్క చీరాల మండలంలోనే 80 శాతం అర్జీలు అధికారుల రికార్డులతో సరిపోలడం లేదు. దీంతో రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన అర్జీలలో వ్యక్తిగతమైనపనుల కోసం ఎన్ని అర్జీలు వచ్చాయి, సామాజికపరంగా ఎన్ని ఉన్నాయనే అంశాన్ని విడగొట్టాల్సి ఉంది. వీటిని పరిష్కరించడానికి ఒక నిర్ధిష్టమైన గడువు లేదు. దీంతో అధికారులు వీటిని ప్రాధాన్యతాక్రమంలో రానున్న ఐదు సంవత్సరాల్లో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బుతో ముడిపడిన ఏ అంశం కూడా పరిష్కారమయ్యే అవకాశం కనపడటం లేదు. ఆరోగ్య శిబిరాలు, వెటర్నరీ శిబిరాలు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది. పేదరికంపై గెలుపు, స్వచ్ఛ ఆంధ్రా, నీరు -చెట్టు తదితర కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది అంటూ సభలు నిర్వహించినా తర్వాత ఎక్కడా వాటి ఊసే లేదు. కొత్తగా బడికి వెళ్లని వారిని గుర్తించి స్కూళ్లలో చేర్చింది కూడా లేదు. డ్వాక్రా రుణాలు కూడా ముఖ్యమంత్రి సభలో ఇచ్చినవే. రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు. నిర్దేశించిన లక్ష్యం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రెవెన్యూ శాఖకు సంబంధించినవే కాకుండా, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 42, 650, హౌసింగ్‌కు సంబంధించి 38,469, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 11,754 అర్జీలు, మున్సిపాలిటీలకు సంబంధించి 5 వేల అర్జీలు వచ్చాయి. పింఛన్లకు పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పేరుతో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే, ఈ సభల్లో 2,56000 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని జిల్లా కలెక్టర్ విజయకుమార్ అధికారికంగా వెల్లడించారు. అందులో 27 వేలు పునరుద్ధరించారు. ఇంకా 52 వేల మందిలో అర్హత ఉండి కూడా పింఛన్ లేక చాలా మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలకు సమాచారం అందించాలని అధికారులు చెబుతున్నారు. అయితే వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ కమిటీలు కూడా పూర్తిగా తెలుగుదేశం వారితో నింపడంతో అర్హులకు న్యాయం జరగడం లేదు. తమకు పింఛన్ అందని కారణంగా జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా ఇంకొకరు గుండె ఆగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంత జరిగినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా తమ పార్టీ కార్యక్రమంగా నిర్వహించింది. పార్టీ నాయకులను వేదికపైన కూర్చోపెట్టేందుకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన జిల్లా మంత్రి, ఇతర శాసనసభ్యులు జన్మభూమి ముగిసిన తర్వాత దీనిపై సమీక్షించిన పాపాన పోలేదు. -
అక్టోబర్ టెన్షన్
10వ తేదీలోపు పూర్తి చేయాలని జీవో జారీ విధివిధానాలు మాత్రం మరిచారు ప్రజాప్రతినిధుల ప్రమేయంపై ఆందోళన చేతులు మారుతున్న నగదు మచిలీపట్నం : జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని ‘అక్టోబర్ టెన్’షన్ వెంటాడుతోంది. అక్టోబర్ పదో తేదీలోపు అన్ని శాఖల్లోనూ బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన జీవో విడుదల చేయడమే ఇందుకు కారణం. గడువు సమీపిస్తుండటం, కొన్ని శాఖల్లో బదిలీ అయ్యే వారి జాబితాలు సిద్ధం కావడంతో ఉద్యోగవర్గాల్లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం బిల్ కలెక్టర్ నుంచి కలెక్టర్ స్థాయి అధికారి వరకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే, బదిలీల ప్రక్రియ ఎలా ఉండాలనే విషయమై కేడర్లు, శాఖలవారీగా విధివిధానాలను మాత్రం పూర్తిస్థాయిలో ప్రభుత్వం ప్రకటించలేదు. కేవలం వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి కన్నా తక్కువ కేడర్ ఉన్న గుమాస్తాలు, బిల్ కలెక్టర్లు, అటెండర్లు తదితర ఉద్యోగులను మాత్రం కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేయాలని నిర్ణయిం చింది. ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఆదేశించింది. మూడు సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిలోనూ 20 శాతం మందిని బదిలీ చేయాలని నిర్ణయించింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల ఇష్టానుసారంగానే బదిలీలు జరుగుతాయని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏడాది మధ్యలో బదిలీ అయితే ఇబ్బందులు ఉంటాయని, అందువల్ల తమ స్థానాలను కాపాడుకునేందుకు కొందరు అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉద్యోగులు బదిలీలపై జోరుగా ప్రచారం జరుగుతుండటంతో ఉద్యోగులు తమ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కొందరు మధ్యవర్తులు, యూనియన్ నాయకులు.. ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖతోపాటు మరికొన్ని శాఖల్లో బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాలను తయారు చేసి కలెక్టర్ అనుమతి కోసం పంపేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం అక్టోబర్ నెలాఖరు వరకు పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించడంతో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు భావిస్తున్నారు. ఉపాధ్యాయులకు బదిలీలు లేనట్టే! ఉపాధ్యాయులకు కూడా బదిలీలు ఉంటాయని ఇటీవల వరకు ప్రచారం జరిగింది. రెండు రోజల క్రితం ఉపాధ్యాయల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టీచర్ల బదిలీలు వేసవిలోనే ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు గ్రామాల్లో శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనుంది. అక్టోబరు 2వ తేదీ నుంచి జన్మభూమి గ్రామసభలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులను బదిలీ చేసి కొత్తవారితో గ్రామసభలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఉద్యోగులు కేవలం ప్రభుత్వ పథకాలను ప్రకటిస్తారని, వాటిని అమలు చేసేందుకు నగదు ఖర్చు చేయటం లేదని, కాబట్టి బదిలీలకు అవేమీ అడ్డు కాదని వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా కొన్ని శాఖల్లో బదిలీల ఫైళ్లు తయారుకావడం.. ఉద్యోగులు తమ ఉన్నతాధికారులను కలవడం.. యూనియన్ నేతలు జోక్యం చేసుకోవడం.. నగదు చేతులు మారడం.. చకచకా జరిగిపోతున్నట్లు తెలుస్తోంది. -
బదిలీల గేటు తెరిచారు
శ్రీకాకుళం పాతబ స్టాండ్: అంక్షలు తొలగాయి. గేట్లు తెరుచుకున్నాయి. ఉద్యోగుల బదిలీలకు మార్గం సుగమమైంది. మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గత రెండేళ్లుగా బదిలీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాది మధ్యలో బదిలీలు అంటే పిల్లల చదువులు, ఇతర ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయాన్ని ఎన్జీవో సంఘ ప్రతినిధులు, కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 30 వరకు సుమారు 40 రోజులపాటు సాగే బదిలీల జాతరకు మార్గదర్శకాలు ఇంకా తెలియలేదు. వెబ్సైట్లో జీవో ఇంకా పెట్టకపోవడం వల్ల ఆ వివరాలపై స్పష్టత లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. కాగా ఈసారి బదిలీలు పూర్తిగా రాజకీయ ప్రమేయంతో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర్వులు జారీ కాకముందే పలు శాఖల అధిపతులకు మంత్రులు, విప్, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల సిపారసులు ఆశాఖల ఆదిపతులకు చేరాయి. బదిలీ లపై నిషేధాన్ని సడలించనున్నారని నెల రోజు లుగా ప్రచారం జరుగుతుండటంతో అప్పటినుంచే బదిలీలు కోరుకుంటున్న ఉద్యోగులు నాయకులను ఆశ్రయించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర ఇంజనీరీంగ్ విభాగాలకు సంబంధించి వందల సంఖ్యలో సిఫారసు లేఖలు అందినట్లు తెలిసింది. వీటి ఆధారంగా కొన్ని శాఖల్లో ఇప్పటికే బదిలీల జాబితాను కూడా తాత్కాలికంగా సిద్ధం చేసినట్లు సమాచారం. నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఒత్తిళ్లు, సిఫారసులు మరింత పెరగనున్నాయి. ఈ ప్రక్రియ అధికార పార్టీ నాయకులకు, కొందరు అధికారులకు కాసుల పంట పండించనుంది. శాఖలు, ఉద్యోగుల క్యాడర్ ఆధారంగా రేట్లు నిర్ణయించినట్లు తెలిసింది. నిర్ణీత రేటు చెల్లించేందుకు అంగీకరించి అడ్వాన్సుగా కొంత ముట్టజెప్పేవారికే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో 25 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలోనై ఉపాధ్యాయులే అధిక సంఖ్యలో ఉండగా వీరికి కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు జరుగుతాయి. రెవెన్యూ, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల్లో మాత్రం సిఫారసులదే రాజ్యం. ఒకేచోట ఐదేళ్లుగా పని చేస్తున్నవారిని విధిగా బదిలీ చేయాల్సి ఉండగా, కనీసం రెండుమూడేళ్లు ఒకేచోట పని చేస్తున్నవారు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. కానీ జీవోలో మార్గదర్శకాలు ఎలా ఉన్నాయన్నదాని బట్టి ఎందరు బదిలీ అవుతారన్నది స్పష్టమవుతుంది. మధ్యంతర బదిలీలతో కొంత ఇబ్బందే -హనుమంతు సాయిరాం, జిల్లా అధ్యక్షుడు, ఎన్జీవో సంఘం ఏడాది మధ్యలో బదిలీలు చేయడం వల్ల ఉద్యోగుల పిల్లల చదువులకు ఇబ్బందిగా మారుతుంది. అయితే ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తే. బదిలీలు అన్ని శాఖల్లోనూ పారదర్శకంగా జరగాలి. పాలకుల సిపారసుల కంటే నిబంధనలకు పెద్దపీట వేయాలని అధికారులను కోరు తున్నాం. -
మత్స్యశాఖకు మాయరోగం
- రెండేళ్లుగా జేడీ పోస్టు ఖాళీ - కార్యాలయంలో గ్రూపు తగాదాలు - నలుగురు ఉద్యోగుల బదిలీ - వనరుల్లేక అటకెక్కిన సంక్షేమం నెల్లూరు (విద్యుత్) : ఒకప్పుడు మంచినీటి చేపలు, రొయ్యలు, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తిలో జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. జిల్లాలో 169 కిలోమీటర్ల పొడవున సముద్రతీరం ఉంది. తీరం వెంబడి 77 మత్స్య గ్రామాలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 1.40 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా చేపల వేటపై ప్రధానంగా జీవిస్తున్నారు. అయితే వీరి సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు మత్స్యశాఖను ఏర్పాటు చేశారు. అయితే ఈ శాఖ విధులు జిల్లాలో నిరుపయోగంగా మారాయి. ఈ శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మత్స్యకారులకు అధికారులు అవగాహన కల్పించాల్సి ఈ శాఖాధికారులు ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు మచ్చుకు కూడా కానరావడం లేదు. జిల్లాలోని మత్స్య శాఖకు ఎలాంటి వనరులు లేకపోవడంతో ఉద్యోగులకు పనిలేకుండా పోయింది. ఈ శాఖపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటంతో కార్యాలయ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటకెక్కిన సంక్షేమం మత్స్య శాఖకు సంబంధించి ఎలాంటి నిధులు లేకపోవడంతో మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. చెరువుల లీజుకు, మత్స్యకారులకు వనరులు సమకూర్చడం, దీనికి సంబంధించిన ప్రణాళిక, చెరువుల క్రమబద్ధీకరణ, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి పనులు కార్యాలయ సిబ్బంది చేపట్టాల్సి ఉంది. అయితే ఈ కార్యాలయంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడంలేదు. రెండేళ్లుగా జేడీ పోస్ట్ ఖాళీ జిల్లాలోని మత్స్య శాఖలో రెండేళ్లుగా జేడీ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్చార్జిగా గుంటూరు డిప్యూటీ డెరైక్టర్ బలరామమూర్తి వ్యవహరిస్తున్నారు. జేడీ కార్యాలయంలో ఏడీ పోస్టులు, ఫీల్డ్ డెవలప్మెంట్ పోస్ట్‌లు కూడా ఖాళీగా ఉన్నాయి. గ్రూపు తగాదాలకు నిలయం మత్స్య శాఖ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కార్యాలయాన్ని భ్రష్టు పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. కార్యాలయంలో ఎలాంటి పనిలేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది పట్టపగలు మద్యం సేవించి గొడవలకు దిగడంతో మూడు నెలల క్రితం డిప్యూటీ డెరైక్టర్ నలుగురు ఉద్యోగులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం మత్స్యశాఖకు పట్టిన మాయ రోగానికి మందు వేయాల్సి అవసరం ఉంది. కలెక్టర్ శ్రీకాంత్ చొరవ తీసుకుని ఈ శాఖపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.