సాక్షి, అమరావతి: ఒకే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటే అలాంటి ఉద్యోగులు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యారోగ్య శాఖలో తాజాగా బదిలీలకు మార్గదర్శకాలు జారీచేశారు. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసిన వారు స్పష్టమైన ఖాళీ(క్లియర్ వేకెన్సీ) ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పరస్పర బదిలీల(మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్)కు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అయితే ఒకే కేడర్ పోస్ట్ అయి ఉండాలి. బదిలీకి దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తామో చెప్పాలి. లేదా ఖాళీని బట్టి వారికి పోస్టింగ్ ఇస్తారు.
బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారికి అదే చోట వెయ్యరు. ఉదాహరణకు విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలో పనిచేస్తూ.. మానసిక ఆస్పత్రికో, చెస్ట్ ఆస్పత్రికో బదిలీకి అనుమతించరు. కేవలం రిక్వెస్ట్ బదిలీలు మాత్రమే లకాబట్టి ఎవరికీ రవాణా సదుపాయాలు కల్పించరు. దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో జరుగుతుంది. 40 లేదా అంతకంటే ఎక్కువ వైకల్య శాతం ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది.
మానసిక వైకల్యంతో బాధపడే పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి అవకాశం ఇస్తారు. క్యాన్సర్, గుండె ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలు చేయించుకున్న వారికి, చికిత్స కొనసాగుతున్న వారిని.. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రాంతానికి బదిలీ చేస్తారు. భర్త లేదా భార్య కేసుల(స్పౌస్ గ్రౌండ్స్)కు సంబంధించి ఒకరికి మాత్రమే బదిలీకి అనుమతిస్తారు. దీనిపై నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. దరఖాస్తు ప్రక్రియ గానీ, బదిలీ గానీ నిర్దేశించిన సమయంలో మాత్రమే అనుమతిస్తారు. పారదర్శకంగా బదిలీలు నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.
రెండేళ్లు పూర్తయి ఉంటే బదిలీకి ఓకే..
Published Fri, Oct 1 2021 3:33 AM | Last Updated on Fri, Oct 1 2021 3:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment