సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. 2019 జూలైలో 1న బదిలీలకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత కోవిడ్ కారణంగా 2020లో జరగలేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఆరోగ్య శాఖలోని అన్ని కేడర్ పోస్టులకూ బదిలీలు వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. కొంతమంది ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్నారు. మరికొందరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకేచోట పనిచేస్తూ.. బదిలీ కోసం వినతులు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. ముఖ్యంగా రిక్వెస్ట్ బదిలీలకు ప్రాధాన్యతనిస్తారు. ఇటీవలే 14,391 పోస్టులను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. నియామకాలకు ముందే బదిలీలు చేపట్టి, ఖాళీ అయిన చోట కొత్త నియామకాలు చేయాలనేది ఆరోగ్య శాఖ ఆలోచన.
మొదటి వారంలో నోటిఫికేషన్..
అక్టోబర్ మొదటి వారంలో బదిలీలకు నోటిఫికేషన్ ఇచ్చి.. ఆ నెలాఖరుకల్లా బదిలీల ప్రక్రియ ముగిసేలా చర్యలు చేపట్టారు. ఈ లోగా కొత్త నియామకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రుల్లోని, అన్ని కేటగిరీల ఉద్యోగులకు బదిలీలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. నియామకాల అనంతరం డిప్యుటేషన్లు, బదిలీల అన్న మాట ఉండకూడదని, పదే పదే సిఫార్సు లేఖలకు అవకాశం ఉండకూడదని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. దీంతో నియామకాలకు ముందే బదిలీలు చేపట్టి, మిగతా ఖాళీ పోస్టుల్లో కౌన్సెలింగ్ నిర్వహించి కొత్త వారిని నియమిస్తారు.
అన్ని కేడర్లలోనూ..
వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు, పారా మెడికల్,పరిపాలనా సిబ్బంది ఇలా ప్రతి కేటగిరీలోనూ దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తారు. కొన్ని బోధనాస్పత్రుల్లో 20 ఏళ్ల నుంచి కూడా వైద్యులు ఒకేచోట పని చేస్తున్నారు. 2019 బదిలీల మార్గదర్శకాల ప్రకారం మైదాన ప్రాంతాల్లో మూడేళ్లు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులు లేదా మెడికల్ కాలేజీల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యులు ఒకేచోట 7 ఏళ్లు పనిచేస్తే తనకు నచ్చిన చోటుకు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. మొత్తం బదిలీలు 20%కి మించకూడదు. తాజాగా బదిలీలకు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు.
బదిలీలు పూర్తవగానే నియామకాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో బదిలీలు చేయాలనుకున్నాం. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. సిబ్బంది బదిలీలకు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో వినతులు స్వీకరిస్తాం. ఈ వినతులను బట్టి బదిలీలు చేస్తాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త నియామకాలుంటాయి. నియామకాలు పూర్తయ్యాక ఎలాంటి డిప్యుటేషన్లు, ట్రాన్స్‌ఫర్లు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ
Comments
Please login to add a commentAdd a comment