బదిలీలు బద్నామ్‌! | Serious confusion in regular transfers of Telangana state employees | Sakshi
Sakshi News home page

బదిలీలు బద్నామ్‌!

Published Mon, Jul 22 2024 1:07 AM | Last Updated on Mon, Jul 22 2024 1:07 AM

Serious confusion in regular transfers of Telangana state employees

రాష్ట్ర ఉద్యోగుల సాధారణ బదిలీల్లో తీవ్ర గందరగోళం..  

కొత్త జోనల్‌ విధానం వచ్చాక పూర్తిస్థాయిలో చేపట్టిన తొలి ట్రాన్స్‌ఫర్లు

40శాతానికి మించొద్దనే నిబంధనతో చిక్కు.. సీనియర్లకూ దక్కని బదిలీ చాన్స్‌ 

ఆందోళనకు కారణమవుతున్న జీహెచ్‌ఎంసీ పరిధి నిర్ధారణ.. 

ఫోకల్‌ నుంచి నాన్‌ ఫోకల్‌కు బదిలీ చేయాలన్న నిబంధన గాలికి.. 

గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల జోన్లు తారుమారు 

వైద్యారోగ్య శాఖలో సీనియర్లు నారాజ్‌.. కీలక అధికారులు మారుమూల ప్రాంతాలకు..

దాదాపు నెలరోజులుగా కొనసాగుతున్నా కొలిక్కిరాని ప్రక్రియ 

సీనియారిటీ జాబితాల రూపకల్పనపై ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి వచ్చాక తొలిసారిగా తలపెట్టిన ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. సీనియారిటీ జాబితాల రూపకల్పన మొదలు గరిష్టంగా 40శాతం సిబ్బంది బదిలీ నిబంధన వరకు ఎన్నో సమస్యలు తలెత్తాయి. దీనితో చాలా శాఖల్లో ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం ఈనెలాఖరు వరకు బదిలీల గడువును పొడిగించాల్సి వచ్చింది. నిజానికి ప్రభుత్వ శాఖలు ప్రకటించిన సీనియారిటీ జాబితాలు శాస్త్రీయంగా లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

సీనియారిటీ జాబితాల ప్రకటన అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, తుది జాబితాల ప్రకటనకు ప్రభుత్వం పెద్దగా సమయం ఇవ్వలేదని.. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు  ముందుకు సాగలేదని అంటున్నారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, సంక్షేమ శాఖల్లో ట్రాన్స్‌ఫర్లకు ఆటంకాలు ఏర్పడ్డాయని వివరిస్తున్నారు. ఆయా ఉద్యోగుల సందేహాలను, సీనియారిటీ సమస్యలను నివృత్తి చేయలేక శాఖాధిపతులు తల పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. 

తేలని జీవో 317 లొల్లి.. 
రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 అమల్లో భాగంగా చేసిన ఉద్యోగుల కేటాయింపులపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. 32 శాఖల్లోని 53వేల మందికిపైగా ఉద్యోగులు ఆన్‌లైన్‌ విధానంలో ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించారు. జీవో 317 సమస్యల పరి­ష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ సమస్యల వివరాలను కూడా సేకరించింది. 

వీటిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 18న ఉప సంఘం సమావేశమవాల్సి ఉన్నా జరగలేదు. దీంతో 53 వేల మంది ఉద్యోగుల వినతులు పెండింగ్‌లో పడిపోయాయి. అవన్నీ ఇంకా పెండింగ్‌లో ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెరలేపింది. మంత్రివర్గ సమావేశం జరిగి ఉంటే సమస్యల పరిష్కారానికి సిఫార్సు లభించేదని, వాటిని పరిష్కరించకుండా బదిలీల ప్రక్రియ ఎలా పూర్తవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం.

గురుకులాల్లో ఆందోళన 
సాధారణ బదిలీల కంటే ముందే గురుకుల విద్యా సంస్థల్లో పదోన్నతులు, ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాదాపు నెలరోజులుగా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జోనల్‌ కేటాయింపులు రోజుకోరకంగా మారుతుండటంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో మల్టీజోన్‌–1కు చెందిన ఉద్యోగులను మల్టీజోన్‌–2కు కేటాయించారు. కొన్ని కేటగిరీల్లో మల్టీజోన్‌–2 పరిధిలోని ఉద్యోగులు మల్టీజోన్‌–1కు పంపారు. 

ప్రిన్సిపాల్స్, డిగ్రీ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్‌ కేటగిరీల్లో వందల మందికి ఇలా జోన్లు మారడంతో వారంతా న్యాయ పోరాటానికి దిగారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వారిని మినహాయించి బదిలీలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోనూ జోనల్‌ కేటాయింపుల్లో సమస్యలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. 

విద్యా శాఖలో సింగిల్‌ టీచర్‌ సమస్య.. 
పాఠశాల విద్యా శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ పదిరోజుల క్రితం ముగిసింది. దాదాపు 35వేల మంది టీచర్లు కొత్త స్కూళ్లకు బదిలీ అయ్యారు. సింగిల్‌ టీచర్‌ ఉన్న పాఠశాలల విషయంలో ఇబ్బంది ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆ పాఠశాలల్లో ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు బదిలీ అవడం.. వాటికి ఇతర టీచర్లెవరూ రాకపోవడం సమస్యగా మారింది. అలాంటి చోట్ల టీచర్లను రిలీవ్‌ చేయకుండా నిలిపేశారు. బదిలీ అయినా ఆ టీచర్లు పాత స్కూళ్లలోనే కొనసాగాల్సి వస్తోంది. 

వైద్యారోగ్య శాఖలో సీనియర్లకు మొండిచేయి 
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కూడా బదిలీల ప్రక్రియతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కీలక సమయంలో మంచి వైద్య సేవలు అందించిన అధికారులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మాజీ డీఎంఈ సైతం ప్రాధాన్యత లేని చోటికి ట్రాన్స్‌ఫర్‌ కావడం గమనార్హం. కరోనా సమయంలో కీలకపాత్ర పోషించిన రాజారావు, నాగేందర్, రమేశ్‌రెడ్డి కూడా దూర ప్రాంతాలకు కేటాయించారు. దీంతో ఈ శాఖలో బదిలీల ప్రక్రియను ఇష్టానుసారం చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నర్సుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని.. కొందరు అధికారులు ముడుపులు కూడా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరా తీసినట్టు సమాచారం. 

ఆర్థిక శాఖలో ‘క్లియర్‌ వేకెన్సీ’ వివాదం.. 
ఆర్థికశాఖలో జరిగిన బదిలీల్లో నిబంధనలు సరిగా పాటించలేదని ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. డైరెక్టర్‌ వర్క్స్, అకౌంట్స్‌ కార్యాలయంలో జరిగిన బదిలీల్లో నాలుగేళ్ల తప్పనిసరి బదిలీ నిబంధన పాటించలేదు. ఒకేచోట ఆరేడు ఏళ్ల సర్వీసు పూర్తయినా.. కొందరి వివరాలు సేకరించకుండా పక్కనబెట్టారని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు తక్కువకాలం పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరి బదిలీ జాబితాలోకి తీసుకువచ్చారని మండిపడుతున్నారు. 

అంతేకాదు.. సీనియారిటీ ప్రకారం పూర్తి వేకెన్సీలను చూపకుండా అన్యాయం చేశారనే ఆరోపణలూ వస్తున్నాయి. హనుమకొండలోని మిషన్‌ భగీరథ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక డీఏఓ ఆరేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ జాబితాలోకి తీసుకోలేదని సమాచారం. ములుగు కార్యాలయంలో ఉన్న క్లియర్‌ వేకెన్సీని సీనియర్‌ ఉద్యోగులకు చూపించకుండా.. మిషన్‌ భగీరథ వరంగల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న తక్కువ సర్వీస్‌ ఉన్న డీఏఓకు కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. 

పీసీబీలోనూ బది‘లీలలు’! 
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ)లో సుదీర్ఘకాలంగా హెడ్డాఫీస్, జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న పైస్థాయి అధికారులు, వివిధ కేడర్ల అధికారులు/ఉద్యోగులు నాలుగేళ్లకుపైబడి ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం గడువు పెంచినా.. 
బదిలీల విషయంలో అధికారుల నుంచి అటెండర్ల వరకు అసంతృప్తిగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇలా వివిధ శాఖల్లో జరుగుతున్న బదిలీలు గందరగోళంగా మారడంతో ప్రభుత్వ బదిలీల ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో ఇప్పటికైనా అర్హులైన ఉద్యోగులకు బదిలీలు జరగాలని, అన్యాయంగా జరిగిన బదిలీలు ఆగిపోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. జోనల్‌ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు మినహాయింపు 
నీటి పారుదల శాఖలోని అన్ని కేడర్ల ఇంజనీర్లను సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శనివారం జారీచేశారు. శాఖలో ఇంజనీర్ల కొరత ఉందని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. 

నిర్మాణంలోని ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ అవసరాలు తీరాక శాఖ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని కేడర్లలోని ఇంజనీర్ల బదిలీలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఇంజనీర్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో శాఖలోని వివిధ ఇంజనీర్ల సంఘాల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ప్రస్తుతానికి బదిలీలను పక్కనపెట్టినట్టు సమాచారం.  

40% నిబంధనతో చిక్కు..
ప్రస్తుత సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నాలుగేళ్లు, ఆపై ఒకేచోట పనిచేస్తున్న అధికారి/ఉద్యోగి తప్పనిసరి బదిలీ కేటగిరీలోకి వస్తారు. అయితే గరిష్టంగా 40 శాతం మందికి మాత్రమే స్థానచలనం కలిగేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉదాహరణకు ఒక జోన్‌ పరిధిలో వంద మంది ఉద్యోగులు ఉండి, వారిలో 50 మంది నాలుగేళ్లకుపైగా ఒకేచోట ఉన్నారనుకుంటే.. ఈ 50 మందికి బదిలీ అర్హత ఉన్నట్టే. కానీ 40శాతం నిబంధన మేరకు 40 మంది మాత్రమే బదిలీ అయి, మిగతా పది మందికి చాన్స్‌ దొరకదు. 

ఇలా చాలా శాఖల్లో తప్పనిసరి జాబితాలోని ఉద్యోగులకు బదిలీ చాన్స్‌రాక తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కార్యాలయాలన్నీ ఒకే స్టేషన్‌ కిందకు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టత ఇచ్చింది. ఈ నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వ శాఖలు తడబాటుకు గురవడంతో.. కొందరు గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకే బదిలీ కావాల్సి వచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement