Telangana Govt Departments: Centre approves Telangana’s new zonal system- Sakshi
Sakshi News home page

New Zonal‌ Policy: ఉద్యోగుల కేడర్లు ఖరారు

Published Sat, Aug 7 2021 2:36 AM | Last Updated on Sat, Aug 7 2021 2:47 PM

Telangana Finalized Employee Cadres New Zonal Policy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. వివిధ హోదాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ కేడర్ల కింద విభజించింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖల్లో ఏయే పోస్టులు ఏ కేటగిరీల్లోకి వస్తాయన్న వివరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018 ఆగస్టులో జారీచేసిన లోకల్‌ కేడర్‌ వ్యవస్థీకరణ ఉత్తర్వులకు కొనసాగింపుగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం... ఆఫీస్‌ సబార్డినేట్‌ నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వరకు జిల్లా కేడర్‌ కింద గుర్తించగా.. సీనియర్‌ అసిస్టెంట్, ఆపై పోస్టులు జోనల్‌ కేడర్‌ కింద, జిల్లాస్థాయి అధికారులు, ఇతర పోస్టులను మల్టీజోనల్‌ కేడర్‌ కింద పరిగణించనున్నారు. అయితే కొన్నిశాఖల్లో పక్కపక్క జిల్లాలను, పక్కపక్క జోన్లను కలిపి యూనిట్లుగా ఏర్పాటు చేసి.. పలురకాల పోస్టులను యూనిట్ల పరిధిలోకి తీసుకువచ్చారు.

ఉద్యోగుల విభజనకు సంబంధించి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)లకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తాజా కేడర్‌ విభజనకు అనుగుణంగా ఆయా శాఖల్లో కేడర్‌ సంఖ్యను నిర్ధారించాలని.. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన మేరకు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్‌ ఆదేశించారు. 
 
పలుశాఖల్లో కొన్ని జిల్లాలు యూనిట్‌గా.. 
పురావస్తు శాఖలో కొన్ని పోస్టులను పక్కపక్కనే ఉన్న జిల్లాలకు కలిపి ఉమ్మడిగా కేటాయించారు. ఈ మేరకు జిల్లాలను యూనిట్లుగా విభజించారు. జూనియర్‌ అసిస్టెంట్లు, ముఖ్య చౌకీదార్, స్వీపర్, ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మెన్, మ్యాన్యుస్క్రిప్ట్‌ మెకానిక్, న్యుమిస్మాటిక్‌ మెకానిక్‌ పోస్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఆ యూనిట్‌ జిల్లాలన్నింటి పరిధిలో ఉమ్మడిగా ఉంటాయి.

జిల్లాల యూనిట్లు.. 1.ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు; 2. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల; 3.కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి; 4.కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌ (అర్బన్, రూరల్‌); 5.సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ; 6.మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌; 7.మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ శాఖ పరిధిలో సీనియర్‌ అసిస్టెంట్‌ కంటే తక్కువ కేడర్‌ పోస్టులను ప్రస్తుత జిల్లాల కేడర్‌ కింద.. సీనియర్‌ అసిస్టెంట్, కేర్‌టేకర్‌ పోస్టులను జోనల్‌ కేడర్‌ కింద.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (టెక్నికల్‌), టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులను మల్టీజోన్‌ కింద నోటిఫై చేశారు. 

►ఎక్సైజ్‌ శాఖలోనూ పక్కపక్కన జిల్లాలతో కలిపి యూనిట్లుగా పరిగణించనున్నారు. జోనల్‌ పోస్టులైన ఆఫీస్‌ సూపరిండెంట్, అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను పక్కపక్కనే ఉన్న జోన్లతో కలిపి యూనిట్‌గా నోటిఫై చేశారు. 
►తూనికలు–కొలతల శాఖలో కూడా కొన్ని పోస్టులను పక్కపక్కనే ఉన్న జిల్లాలు, పక్కపక్కనే ఉన్న జోన్లను కలిపి యూనిట్లుగా పరిగణించనున్నారు. 
►పోలీసు బెటాలియన్లు, ఐటీ అండ్‌ కమ్యూనికేషన్ల శాఖలో జిల్లా పోస్టులను రెండు కేడర్‌లలో (పక్కపక్కనే ఉన్న జిల్లాలను కలుపుతూ), జోనల్‌ పోస్టులను పక్కపక్క జోన్లు కలిపి యూనిట్లుగా నోటిఫై చేశారు. 
►పర్యాటక శాఖలో టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్, టూరిస్టు గైడ్, కేర్‌టేకర్‌ గైడ్‌–2, వాచ్‌మన్, శానిటరీ వర్కర్, ఆఫీస్‌ సబార్డినేట్, ఆఫీస్‌ బాయ్, కుక్‌ పోస్టులను మాత్రమే జిల్లా కేడర్‌ కింద నోటిఫై చేశారు. ఈ శాఖలో జోనల్, మల్టీజోనల్‌ పోస్టులను నోటిఫై చేయలేదు. 
►యువజన సర్వీసుల శాఖలో సూపరిండెంట్‌ స్థాయి పోస్టులను జోనల్‌ కేడర్‌ వరకే నోటిఫై చేశారు. ఎన్‌సీసీ విభాగం, పరిశ్రమల శాఖలోనూ మల్టీజోనల్‌ పోస్టులను నోటిఫై చేయలేదు. 
►అర్థగణాంక శాఖలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టును మల్టీజోనల్‌ కేడర్‌లో చేర్చారు. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) వీసీ పరిధిలోనికి వచ్చే పోస్టులను కూడా కేడర్ల వారీగా విభజించారు. 
►జీహెచ్‌ఎంసీ పోస్టులను జోనల్‌ అయితే చార్మినార్‌ జోన్‌కు, మల్టీజోనల్‌ అయితే రెండో జోన్‌కు మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. 

జిల్లా పోస్టులుగా నోటిఫై చేసిన పలు హోదాలు 
జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, సూపర్‌వైజర్, మ్యాట్రన్, బార్బర్, రికార్డ్‌ అసిస్టెంట్, కుక్, ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మన్, స్వీపర్, మాలి, శానిటరీ వర్కర్, ఆయా, ధోబీ, కామాటి, వార్డుబాయ్, స్టోర్‌ కీపర్, అంగన్‌వాడీ ఆయా, నర్సు, స్కిల్డ్‌ అసిస్టెంట్, గోల్డ్‌ స్మిత్, ఈవో గ్రేడ్‌–2, అసిస్టెంట్‌ ఫోర్‌మన్, టైం కీపర్, బిల్‌ కలెక్టర్, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, బోర్‌వెల్‌ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పంప్‌ డ్రైవర్, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్, డార్క్‌రూం/ఎక్స్‌రే/ల్యాబ్‌ అటెండెంట్లు, క్లీనర్, స్ట్రెచ్‌ బేరర్, థియేటర్‌ అసిస్టెంట్, టైలర్, లిఫ్ట్‌ అటెండెంట్, ప్లంబర్, ఫైర్‌మన్, యానిమల్‌ అటెండెంట్‌ తదితర పోస్టులు. 
(వైద్య విద్య శాఖలో అత్యధికంగా 145 రకాల పోస్టులను జిల్లా కేడర్‌గా నోటిఫై చేశారు. ఆ శాఖలో జోనల్‌ కేడర్‌లో 136 రకాల పోస్టులు, మల్టీజోనల్‌ కేడర్‌లో 64 రకాల పోస్టులు ఉన్నాయి) 
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement