Zonal System
-
స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లో భాగంగా తీసుకొచ్చిన జీవో 317 ద్వారా తీవ్రంగా నష్టపోయామంటూ బాధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ పది నెలలైనా ఆ హామీని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలని డిమాండ్ చేస్తూ బాధిత ఉద్యోగులు బుధవారం గాందీభవన్‌ను ముట్ట డించారు. గాం«దీభవన్ ఎదుట రోడ్డుపైన ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలి పారు. జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగి చదువుకున్న ప్రాంతాన్ని స్థానికతగా పరిగణించాలని, అలాకాకుండా సంబంధం లేని ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపులు జరిపి తమ భవిష్యత్తును ఆందోళనకరంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు గాం«దీభవన్ వద్ద మోహరించారు. నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం జీవో 317 బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. బాధిత ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించిన ప్రభుత్వం.. వాటి పరిష్కారానికి సంబంధించిన బాధ్యతలను మంత్రివర్గ ఉపకమిటీకి అప్పగించింది. ఈ కమిటీ పలుమార్లు సమావేశమైనప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాదాపు ఎనిమిది నెలలైనా ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగ్రహించిన బాధిత ఉద్యోగులు ప్రస్తుతం ఆందోళనబాట పట్టారు. పరిష్కారానికి మంత్రి, మహేశ్‌గౌడ్ హామీ ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ గాం«దీభవన్ లోపలికి పిలిచి చర్చలు జరిపారు. జీవో 317పై ప్రభుత్వం సబ్‌కమిటీని నియమించిందని, పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ నెల 3న సబ్‌కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ ఉంటుందని హామీనిచ్చారు. దీంతో ఉద్యోగులు ఆందోళనను విరమించారు. -
బదిలీలు బద్నామ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చాక తొలిసారిగా తలపెట్టిన ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. సీనియారిటీ జాబితాల రూపకల్పన మొదలు గరిష్టంగా 40శాతం సిబ్బంది బదిలీ నిబంధన వరకు ఎన్నో సమస్యలు తలెత్తాయి. దీనితో చాలా శాఖల్లో ట్రాన్స్ఫర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం ఈనెలాఖరు వరకు బదిలీల గడువును పొడిగించాల్సి వచ్చింది. నిజానికి ప్రభుత్వ శాఖలు ప్రకటించిన సీనియారిటీ జాబితాలు శాస్త్రీయంగా లేవని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ జాబితాల ప్రకటన అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, తుది జాబితాల ప్రకటనకు ప్రభుత్వం పెద్దగా సమయం ఇవ్వలేదని.. దీంతో ఆయా శాఖల్లో బదిలీలు ముందుకు సాగలేదని అంటున్నారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, సంక్షేమ శాఖల్లో ట్రాన్స్ఫర్లకు ఆటంకాలు ఏర్పడ్డాయని వివరిస్తున్నారు. ఆయా ఉద్యోగుల సందేహాలను, సీనియారిటీ సమస్యలను నివృత్తి చేయలేక శాఖాధిపతులు తల పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. తేలని జీవో 317 లొల్లి.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 అమల్లో భాగంగా చేసిన ఉద్యోగుల కేటాయింపులపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. 32 శాఖల్లోని 53వేల మందికిపైగా ఉద్యోగులు ఆన్లైన్ విధానంలో ప్రభుత్వానికి తమ వినతులు సమర్పించారు. జీవో 317 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ సమస్యల వివరాలను కూడా సేకరించింది. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 18న ఉప సంఘం సమావేశమవాల్సి ఉన్నా జరగలేదు. దీంతో 53 వేల మంది ఉద్యోగుల వినతులు పెండింగ్‌లో పడిపోయాయి. అవన్నీ ఇంకా పెండింగ్‌లో ఉండగానే.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు తెరలేపింది. మంత్రివర్గ సమావేశం జరిగి ఉంటే సమస్యల పరిష్కారానికి సిఫార్సు లభించేదని, వాటిని పరిష్కరించకుండా బదిలీల ప్రక్రియ ఎలా పూర్తవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం.గురుకులాల్లో ఆందోళన సాధారణ బదిలీల కంటే ముందే గురుకుల విద్యా సంస్థల్లో పదోన్నతులు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాదాపు నెలరోజులుగా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. జోనల్ కేటాయింపులు రోజుకోరకంగా మారుతుండటంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలో మల్టీజోన్–1కు చెందిన ఉద్యోగులను మల్టీజోన్–2కు కేటాయించారు. కొన్ని కేటగిరీల్లో మల్టీజోన్–2 పరిధిలోని ఉద్యోగులు మల్టీజోన్–1కు పంపారు. ప్రిన్సిపాల్స్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ కేటగిరీల్లో వందల మందికి ఇలా జోన్లు మారడంతో వారంతా న్యాయ పోరాటానికి దిగారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వారిని మినహాయించి బదిలీలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోనూ జోనల్ కేటాయింపుల్లో సమస్యలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించాకే బదిలీల ప్రక్రియ చేపట్టాలంటూ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. విద్యా శాఖలో సింగిల్ టీచర్ సమస్య.. పాఠశాల విద్యా శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియ పదిరోజుల క్రితం ముగిసింది. దాదాపు 35వేల మంది టీచర్లు కొత్త స్కూళ్లకు బదిలీ అయ్యారు. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల విషయంలో ఇబ్బంది ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆ పాఠశాలల్లో ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు బదిలీ అవడం.. వాటికి ఇతర టీచర్లెవరూ రాకపోవడం సమస్యగా మారింది. అలాంటి చోట్ల టీచర్లను రిలీవ్ చేయకుండా నిలిపేశారు. బదిలీ అయినా ఆ టీచర్లు పాత స్కూళ్లలోనే కొనసాగాల్సి వస్తోంది. వైద్యారోగ్య శాఖలో సీనియర్లకు మొండిచేయి రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కూడా బదిలీల ప్రక్రియతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కీలక సమయంలో మంచి వైద్య సేవలు అందించిన అధికారులు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మాజీ డీఎంఈ సైతం ప్రాధాన్యత లేని చోటికి ట్రాన్స్ఫర్ కావడం గమనార్హం. కరోనా సమయంలో కీలకపాత్ర పోషించిన రాజారావు, నాగేందర్, రమేశ్‌రెడ్డి కూడా దూర ప్రాంతాలకు కేటాయించారు. దీంతో ఈ శాఖలో బదిలీల ప్రక్రియను ఇష్టానుసారం చేపట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నర్సుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని.. కొందరు అధికారులు ముడుపులు కూడా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఆర్థిక శాఖలో ‘క్లియర్ వేకెన్సీ’ వివాదం.. ఆర్థికశాఖలో జరిగిన బదిలీల్లో నిబంధనలు సరిగా పాటించలేదని ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. డైరెక్టర్ వర్క్స్, అకౌంట్స్ కార్యాలయంలో జరిగిన బదిలీల్లో నాలుగేళ్ల తప్పనిసరి బదిలీ నిబంధన పాటించలేదు. ఒకేచోట ఆరేడు ఏళ్ల సర్వీసు పూర్తయినా.. కొందరి వివరాలు సేకరించకుండా పక్కనబెట్టారని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు తక్కువకాలం పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరి బదిలీ జాబితాలోకి తీసుకువచ్చారని మండిపడుతున్నారు. అంతేకాదు.. సీనియారిటీ ప్రకారం పూర్తి వేకెన్సీలను చూపకుండా అన్యాయం చేశారనే ఆరోపణలూ వస్తున్నాయి. హనుమకొండలోని మిషన్ భగీరథ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక డీఏఓ ఆరేళ్లకుపైగా ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ జాబితాలోకి తీసుకోలేదని సమాచారం. ములుగు కార్యాలయంలో ఉన్న క్లియర్ వేకెన్సీని సీనియర్ ఉద్యోగులకు చూపించకుండా.. మిషన్ భగీరథ వరంగల్ కార్యాలయంలో పనిచేస్తున్న తక్కువ సర్వీస్ ఉన్న డీఏఓకు కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. పీసీబీలోనూ బది‘లీలలు’! తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ)లో సుదీర్ఘకాలంగా హెడ్డాఫీస్, జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న పైస్థాయి అధికారులు, వివిధ కేడర్ల అధికారులు/ఉద్యోగులు నాలుగేళ్లకుపైబడి ఒకేచోట పనిచేస్తున్నా బదిలీ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గడువు పెంచినా.. బదిలీల విషయంలో అధికారుల నుంచి అటెండర్ల వరకు అసంతృప్తిగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇలా వివిధ శాఖల్లో జరుగుతున్న బదిలీలు గందరగోళంగా మారడంతో ప్రభుత్వ బదిలీల ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో ఇప్పటికైనా అర్హులైన ఉద్యోగులకు బదిలీలు జరగాలని, అన్యాయంగా జరిగిన బదిలీలు ఆగిపోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. జోనల్ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని, ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖలో ఇంజనీర్లకు మినహాయింపు నీటి పారుదల శాఖలోని అన్ని కేడర్ల ఇంజనీర్లను సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం జారీచేశారు. శాఖలో ఇంజనీర్ల కొరత ఉందని, ప్రస్తుత వర్షాకాలంలో ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. నిర్మాణంలోని ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ అవసరాలు తీరాక శాఖ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్ని కేడర్లలోని ఇంజనీర్ల బదిలీలను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిజానికి ఇంజనీర్ల బదిలీలు, పదోన్నతుల విషయంలో శాఖలోని వివిధ ఇంజనీర్ల సంఘాల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో ప్రస్తుతానికి బదిలీలను పక్కనపెట్టినట్టు సమాచారం. 40% నిబంధనతో చిక్కు..ప్రస్తుత సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా నాలుగేళ్లు, ఆపై ఒకేచోట పనిచేస్తున్న అధికారి/ఉద్యోగి తప్పనిసరి బదిలీ కేటగిరీలోకి వస్తారు. అయితే గరిష్టంగా 40 శాతం మందికి మాత్రమే స్థానచలనం కలిగేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఉదాహరణకు ఒక జోన్ పరిధిలో వంద మంది ఉద్యోగులు ఉండి, వారిలో 50 మంది నాలుగేళ్లకుపైగా ఒకేచోట ఉన్నారనుకుంటే.. ఈ 50 మందికి బదిలీ అర్హత ఉన్నట్టే. కానీ 40శాతం నిబంధన మేరకు 40 మంది మాత్రమే బదిలీ అయి, మిగతా పది మందికి చాన్స్ దొరకదు. ఇలా చాలా శాఖల్లో తప్పనిసరి జాబితాలోని ఉద్యోగులకు బదిలీ చాన్స్‌రాక తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్యాలయాలన్నీ ఒకే స్టేషన్ కిందకు వస్తాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టత ఇచ్చింది. ఈ నిబంధనను అమలు చేయడంలో ప్రభుత్వ శాఖలు తడబాటుకు గురవడంతో.. కొందరు గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకే బదిలీ కావాల్సి వచ్చింది. -
టీడీపీలో టికెట్ల బేరం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానం తీరుపై కుతకుత ఉడికిపోతున్నారు. అధికార పార్టీ దూకుడు మీద ఉండగా.. టీడీపీ అసలు అభ్యర్థులనే ప్రకటించకుండా జాప్యం చేస్తుండడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. ఒకవైపు పొత్తులు, మరోవైపు కమిటీల పేరుతో ఎంతో కాలంగా పనిచేసిన లీడర్లను కూడా హీనంగా చూస్తున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారంటూ ఎక్కువ డబ్బు డిమాండు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మమ్మల్ని నిర్ణయించేది జోనల్ కమిటీనా? తెలుగుదేశం పార్టీలో ఇటీవలే జోనల్ కమిటీని వేశారు. రాయలసీమకు సంబంధించిన ఈ జోనల్ కమిటీలో బీద రవిచంద్రయాదవ్, కిలారి రాజేష్ ఉన్నారు. వీళ్లిద్దరి పెత్తనం ఎక్కువైందనేది ఇక్కడి నేతల ఆవేదన. చీటికి మాటికి హైదరాబాద్ పిలుస్తున్నారని, అక్కడికి వెళితే ‘మీ నియోజకవర్గంలో పోటీ ఎక్కువగా ఉంది. మీరు చెబుతున్న డబ్బుకైతే మీకు టికెట్ ఇవ్వడం కష్టం’ అని చెబుతున్నారని అంటున్నారు. ఇద్దరు అభ్యర్థులను ఒక్కొక్కరి చొప్పున (వన్ టూ వన్) పిలిచి డబ్బులు అడుగుతున్నారని, టికెట్ కోసం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఇవ్వడానికి ఇన్నేళ్లు జెండా మోయడం దేనికని మండి పడుతున్నారు. రాబిన్ శర్మ రిపోర్టులంటూ.. ప్రస్తుతం టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్‌శర్మ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. ప్రతి ఒక్కరినీ పిలిచి, మీకు రిపోర్టులు నెగిటివ్‌గా ఉన్నాయని చెబుతున్నారని, ఈ రిపోర్టులను ఆధారం చేసుకుని జోనల్ కమిటీ మెంబర్లు డబ్బులు అడుగుతున్నట్టు నేతలు వాపోతున్నారు. ఎవరికైతే టికెట్ ఇవ్వకూడదనే ఆలోచన ఉందో వారికి సంబంధించి రాబిన్ శర్మ రిపోర్టు నెగిటివ్‌గా ఉందని చెబుతున్నారని, డబ్బులిచ్చిన వారికి రిపోర్టు బాగుందని అంటున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టూమెన్ కమిటీ ఇంకెన్నాళ్లు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల, మడకశిర రెండూ రిజర్వుడు నియోజకవర్గాలు. శింగనమలలో ఇద్దరు ఓసీ నేతలతో టూమెన్ కమిటీ వేశారు. ఇక్కడ ఈ ఇద్దరిదే పెత్తనం. మడకశిరలోనూ అంతే. మైనింగ్ మాఫియాగా ఉన్న గుండుమల తిప్పేస్వామి అక్కడ ఇన్చార్జ్గా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదమని, ఎస్సీలను డమ్మీ చేశారని టీడీపీ ఎస్సీ నేతలు ఆరోపిస్తున్నారు. కాలపరిమితి లేని కమిటీగా వ్యవహరిస్తున్నారని, తమను వీరినుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. -
పాత జోనల్ విధానంలో మార్పులు
సాక్షి, అమరావతి: పాత జోనల్ విధానంలో మార్పులు చేసి కొత్త జిల్లాలతో కొత్త జోన్లు, మల్టీజోన్ ఏర్పాటుచేయాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికత, జోనల్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చేయాల్సి ఉన్నందున.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. కొత్త జోన్లు, మల్టీజోన్ ఏర్పాటుచేసేందుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల (1975)కు సవరణ చేసేందుకు ప్రతిపాదిత అంశంపై సీఎస్ సమీక్షించారు. స్థానికత, ప్రతిపాదిత నూతన జోనల్ విధానం తదితర అంశాలపై సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి. భాస్కర్ వివరించారు. ఈ సమావేశంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెఎచ్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. రహదారుల కోత నివారణ.. ఇక రాష్ట్రంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోత నివారణకు కూడా ప్రభుత్వం త్వరలో ముగింపు పలకనుంది. ఇందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) సాంకేతికతతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ అంశంపైనా శుక్రవారం సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్షించారు. ఈ విధానంలో రోడ్లు నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలపై ఆయన చర్చించారు. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా, వర్షాలుపడినా, వరదలు వంటి విపత్తులు వచ్చినా నదీతీర ప్రాంతాల్లోని రోడ్లు తరచూ కోతకు గురవుతున్నాయి. ఈ సమస్య తీర ప్రాంత జిల్లాల్లో దశాబ్దాలుగా ఎదురవుతోంది. ఇలా రహదారుల విధ్వంసంతో ప్రభుత్వానికి రూ.వేలకోట్ల నష్టం జరుగుతోంది. ఇకపై రోడ్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా వనరుల కొరతతో పాటు వాటి జీవితకాలాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫుల్ డెప్త్ రిక్లమేషన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో పాత రోడ్డును యంత్రాల సాయంతో రెండు నుంచి మూడు అడుగుల లోతు తవ్వుతారు. ఆ తర్వాత సిమెంట్, కెమికల్‌తో మిక్స్‌చేసి చదును చేస్తారు. ఆపై ఒకదానిపై మరొక లేయర్‌ను నిర్మిస్తారు. ఇవి సాధారణ రోడ్లు కంటే 15 నుంచి 20 ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. పైగా ఈ విధానంలో రోడ్లు నిర్మిస్తే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల ఈఎన్సీలు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలపై ఉద్యోగ సంఘాల భేటి
అమరావతి: జోనల్ వ్యవస్థలో మార్పులపై ఉద్యోగ సంఘాలతో జీఏడి సెక్రెటరీ పోలా భాస్కర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన, జిల్లాల విభజన తర్వాత ఇప్పటి వరకు పాత విధానంలోనే జరుగుతున్న ఉద్యోగాల భర్తీ పై చర్చ జరిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలకు తెలియజేసి వారి నుంచి పలు సూచనలు, సలహాలను స్వీకరించారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి.శ్రీనివాసులు, బొప్పరాజు, ఆస్కార్ రావు తదితర నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టు రిక్రూట్మెంట్)కు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనపై నివేదికలను అధికారులు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి పోస్టుల భర్తీపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను అధికారులు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ -
బదిలీలు ఉంటాయో.. లేదో!?
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 భయం వీడలేదు. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి చేసినప్పటికీ... కేవలం గురుకుల విద్యా సంస్థల్లో మాత్రమే ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు 30వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరందరికీ స్థానికత ఆధారంగా జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయిలో కేటాయింపులు జరిపారు. ఈ మేరకు నూతన కేటాయింపులతో కూడిన జాబితాలను గురుకుల సొసైటీలు సిద్ధం చేసినప్పటికీ 2022–23 విద్యా సంవత్సరం మధ్యలో ఉద్యోగులకు స్థానచలనం కలిగిస్తే ఇబ్బందులు వస్తాయన్న భావనతో ఈ ప్రక్రియను అప్పట్లో వాయిదా వేశారు. కానీ ప్రస్తుతం నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై రెండో నెల గడుస్తున్నా జీఓ 317 అమలు ఊసేలేదు. ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఎలా...? రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగ ఖాళీలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ముందుగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఖాళీలపై స్పష్టత వస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేసింది. ఈ క్రమంలో గతేడాది అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికత ఆధారంగా ఈ కేటాయింపులు జరపడంతో జిల్లా, జోన్లు, మల్టీజోన్ల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత వచ్చింది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్న గురుకుల విద్యా సంస్థల సొసైటీల్లోనూ జీఓ 317 అమలు చేస్తేనే ఉద్యోగ ఖాళీల లెక్క తేలుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు చేపట్టాలని సొసైటీ కార్యదర్శులను ఆదేశించింది. దాంతో గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో ఈ కసరత్తు పూర్తి చేసి ప్రాథమిక జాబితాలు రూపొందించినప్పటికీ... వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదు. వాస్తవానికి 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడితే ఆ మేరకు ఉద్యోగులు విధుల్లో చేరే వీలుండేది. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండో నెల గడుస్తున్నాజీఓ 317 అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం కొనసాగుతుండడం.... మరోవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో ఉద్యోగులను కొత్త స్థానాలకు బదిలీ చేసే అవకాశంపై సొసైటీ వర్గాల్లో కొంత ఆనిశ్చితి కనిపిస్తోంది. ఇంకోవైపు గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల ఖాళీల లెక్కపైనా అయోమయం నెలకొంది. -
గురుకుల కొలువుల్లో ‘ఆమె’కు అందలం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశంలా పరిణమించింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33శాతం పోస్టులు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీ చేస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. నూతన జోనల్ విధానం అమలు తర్వాత రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఏకంగా 9,231 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ ఈనెల 5వ తేదీన ఒకేసారి 9 నోటిఫికేషన్లను వెబ్‌నోట్ ద్వారా విడుదల చేసింది. తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లను కూడా గురుకుల నియామకాల బోర్డు వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చిం ది. ప్రకటించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ద్వారా 9,210 పోస్టులు మాత్రమే భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ ఖాళీల్లో మహిళలకు ఏకంగా 77.62శాతం పోస్టులు రిజర్వ్ కావడం గమనార్హం. ఆర్ట్ టీచర్ కేటగిరీలో 2 పోస్టులు తగ్గగా... క్రాఫ్ట్ టీచర్ కేటగిరీలో 4 పోస్టులు, టీజీటీ కేటగిరీలో 14 పోస్టులు తగ్గాయి. అక్కడా ఇక్కడా అత్యధికమే... గురుకుల విద్యా సంస్థల్లో బాలుర గురుకులాలు, బాలికల గురుకులాలు విడివిడిగా ఉన్నాయి. రెండు కేటగిరీల్లో ఉన్న విద్యా సంస్థల్లోనూ మహిళలకు అత్యధిక పోస్టులు రిజర్వ్ అయ్యాయి. బాలికల విద్యా సంస్థల్లో ఉన్న ఉద్యోగాలన్నీ పూర్తిగా మహిళలతోనే భర్తీ చేయాలనే నిబంధన ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బాలికల గురుకుల విద్యా సంస్థల్లో 4,647 ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లో ప్రకటించింది. ఇక బాలుర విద్యా సంస్థల్లో 4,563 ఉద్యోగ ఖాళీలను చూపగా... ఇందులో జనరల్ కేటగిరీకి కేవలం 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ కాగా... మిగతా 2,502 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఈ లెక్కన జనరల్ కేటగిరీకి 45.17శాతం పోస్టులు, మహిళలకు 54.83శాతం పోస్టులు దక్కాయి. నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో నియామకాల ప్రక్రియ రోస్టర్ పాయింట్ మొదటి నుంచి ప్రారంభమైంది. దీనికి తోడు మహిళలకు హారిజాంటల్ విధానంలో పోస్టుల కేటాయింపు జరగడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించినట్లయింది. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తం 9,210 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇందులో మహిళలకు 7,149 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ అయ్యాయి. ప్రకటించిన మొత్తం పోస్టుల్లో జనరల్ కేటగిరీకి కేవలం 22.38శాతం పోస్టులు దక్కగా... మహిళలకు మాత్రం 77.62శాతం ఉద్యోగాలకు దక్కనున్నాయి. ఇక అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన వారిలో మహిళలుంటే జనరల్ కేటగిరీలోని పోస్టులు సైతం వారికి దక్కే అవకాశం ఉంది. ఈలెక్కన ప్రస్తుతం రిజర్వ్ అయిన పోస్టులకంటే మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. -
గురుకులాల్లో 317 గుబులు! జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లోని ఉద్యోగుల్లో జీఓ 317 గుబులు మొదలైంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఆమేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను కేడర్ల వారీగా కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. తాజాగా సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ప్రభుత్వం ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించింది. దీంతో కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపుపై సొసైటీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లు జీఓ 317 అమలుకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వగా... అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అతి త్వరలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిభా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల పరిధిలోనూ కొత్త జోన్ల వారీగా ఉద్యోగ కేటాయింపు ప్రక్రియ మొదలు కానుంది. నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే కొత్తగా నియామకాలు, పోస్టింగులు ఇవ్వడానికి మార్గం సుగమం కానుంది. వివరాల సేకరణ షురూ ఎస్సీ, మైనార్టీ గురుకుల సొపైటీల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ వేగవంతమైంది. ఉద్యోగుల నుంచి నిర్దేశించిన ఫార్మాట్లో వివరాలను సేకరించే పనిలో రీజినల్ కోఆర్డినేటర్లు బిజీ అయ్యారు. ఇప్పటికే దాదాపు సమాచారం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. వీటిని పరిశీలించాక సీనియారిటీ జాబితాను రూపొందించిన అనంతరం కేటాయింపులు జరుపుతారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా నిర్దేశించిన కేటగిరీల్లోని ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారు. జోనల్ ఉద్యోగుల్లో గందరగోళం కొత్త జోనల్ విధానం ప్రకారం విభజన అంశం జోనల్ స్థాయి ఉద్యోగుల్లోనే ఎక్కువ గుబులు పుట్టిస్తోంది. ఇదివరకు రాష్ట్రంలో రెండు జోన్లు మాత్రమే ఉండేవి. కొత్త విధానంతో జోన్ల సంఖ్య ఏడుకు పెరిగింది, ఇందులో జోన్ పరిధి తగ్గింది. ఈ క్రమంలో జోనల్ స్థాయి ఉద్యోగుల స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపితే సగానికి పైగా ఉద్యోగులకు స్థానచలనం అనివార్యం కానున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల స్థానచలనం జరిగితే పిల్లల చదువులు, ఇతరత్రా అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే వాదన ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన ఇలా... జిల్లా స్థాయి: జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండర్ జోనల్ స్థాయి: టీజీటీ, సూపరింటెండెంట్, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 2), లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, వార్డెన్, పీఈటీ, ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, ప్లంబర్/ఎలక్ట్రీషియన్ మల్టీ జోనల్ స్థాయి: ప్రిన్సిపల్ (గ్రేడ్ 2), డిగ్రీ కాలేజీలోని లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ (గ్రేడ్ 1), పీజీటీలు. జిల్లా, మల్టీ జోన్లలో కొందరు జిల్లాస్థాయి, మల్టీ జోనల్ స్థాయి కేడర్ ఉద్యోగుల్లోనూ కొన్ని మార్పులు తప్పవని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాల పరిధి కుదించుకోపోవడం, ఇదివరకు మల్టీ జోన్ లేకుండా రాష్ట్రస్థాయి పోస్టులుండగా... ఇప్పుడు ఆయా కేడర్లలోని ఉద్యోగుల్లో కొందరికి మార్పు తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం వివరాల సేకరణలో ఉన్న అధికారులు.. వారంలోగా సీనియారిటీ ఆధారంగా కేటాయింపులపై ప్రాథమిక జాబితాలు రూపొందిస్తే కొంత స్పష్టత రానుంది. మరోవైపు ఉద్యోగుల కేటాయింపులు మాత్రమే ఇప్పుడు జరిపి, స్థానచలనం జరిగితే కొంత సమయం ఇవ్వాలనే ఉద్యోగుల వినతులను ప్రభుత్వం పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం. చదవండి: Telangana: ఊరూరా గోదారే!.. కనీవినీ ఎరుగని జలవిలయం -
Telangana: కొలువుల భర్తీకి కొత్త రోస్టర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో కీలకమైన రోస్టర్ పట్టిక ఒకటో నంబర్ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ పాయింట్లు సైతం మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉన్నాయి. జిల్లా, జోన్లు ఆధారంగా నియామకాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం రోస్టర్‌ను ఒకటో నంబర్ నుంచి అమలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో అప్పట్లో ఆ విధానాన్ని ఎంచుకోగా... ఇప్పుడు నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో మరోమారు రోస్టర్ పాయింట్లు క్రమసంఖ్య ఒకటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ చేసిన పాయింట్ల ఆధారంగా రోస్టర్‌ను కొనసాగించే వీలు లేకపోవడం, ఈడబ్ల్యూఎస్‌కు పదిశాతం కోటా ఇవ్వాల్సి రావడంతో కొత్తగా రోస్టర్ పాయింట్ల అమలు దిశగా ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన జోనల్ విధానం ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత రాగా, కొత్త నియామకాల విషయంలో రోస్టర్ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మారిన కేడర్... కొత్త రోస్టర్ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. తెలంగాణ ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇదివరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్‌లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్ కేడర్‌లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్‌తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. అదీగాక రోస్టర్ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా నంబర్లను ఖరారు చేయాలి. ఆ తర్వాత ఖరారైన రోస్టర్‌ను ఒకటో క్రమ సంఖ్య నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు 65వేలు? కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యక్షంగా భర్తీ చేసే నియామకాలకు నోటిఫికేషన్లను నియామక బోర్డుల ద్వారా చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదంతో ఆయా బోర్డులకు సమర్పించాలి. అయితే కొత్త రోస్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఏమిటీ రోస్టర్? ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్. రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి. ఒకటో క్రమసంఖ్య జనరల్ మహిళతో మొదలవుతుంది. జనరల్ మహిళ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలో మహిళలు, జనరల్, డిజేబుల్ మహిళ, డిజేబుల్ జనరల్ కేటగిరీలకు ఒక్కో క్రమసంఖ్యను రోస్టర్ పాయింట్లలో ఖరారు చేశారు. ఈ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే... ఏ పాయింట్ దగ్గర నియామకాలు పూర్తవుతాయో... తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు పెరిగినా జోన్లు నాలుగే
సాక్షి, అమరావతి: ఉగాది నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో ఉద్యోగుల జోనల్ వ్యవస్థ పైన ఉన్నతాధికారుల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ఉన్నత విద్యా సంస్థల పరిధిపైనా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం ప్రస్తుతం ఉద్యోగుల జోనల్ వ్యవస్థ ఎలా ఉంది, కొత్త వ్యవస్థ ఎలా ఉండాలో ప్రతిపాదించారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. వీటికి రెండు మల్టీ జోన్లు (1, 2), వాటి పరిధిలో నాలుగు జోన్లు (1, 2, 3, 4) ఉన్నాయి. మల్టీ జోన్–1 పరిధిలోని జోన్–1లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు, జోన్–2లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. మల్టీ జోన్–2 పరిధిలోని జోన్–3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–4లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలున్నాయి. కొత్త జోనల్ వ్యవస్థ ఇలా.. పునర్వ్యవస్థీకరణ అనంతరం 26 జిల్లాలనూ అదే క్రమంలో విభజిస్తారు. ప్రస్తుతం ఉన్న విధంగానే రెండు మల్టీ జోన్లు, నాలుగు జోన్లనే ప్రతిపాదించారు. కానీ వాటి పరిధిలో కొత్త జిల్లాలు అదనంగా వస్తాయి. ఒక్కో జోన్లో 5 నుంచి 7 జిల్లాలు వస్తాయి. మల్టీ జోన్–1 పరిధిలోని జోన్–1లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, జోన్–2లో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు రానున్నాయి. మల్టీ జోన్–2 పరిధిలోని జోన్–3లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్–4లో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలను ప్రతిపాదించారు. కొత్తగా ఏర్పడుతున్న శ్రీ బాలాజీ జిల్లాలో 17 మండలాలు నెల్లూరులో (జోన్–3), 18 మండలాలు చిత్తూరులో (జోన్–4) ఉండటంతో దాన్ని ఏ జోన్లో ఉంచాలనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. జూనియర్ అసిస్టెంట్ దానికి సమాన స్థాయి ఉద్యోగుల బదిలీలు జిల్లా పరిధిలోనే ఉండడంతో వారు పూర్తిగా జోనల్ వ్యవస్థలోకి వస్తారు. జూనియర్ అసిస్టెంట్ కంటే పై స్థాయి ఉద్యోగుల నుంచి సూపరింటెండెంట్ల వరకు జోనల్ స్థాయి పరిధిలో ఉంటారు. సూపరింటెండెంట్ ఆ పై క్యాడర్ ఉద్యోగులంతా మల్టీ జోన్లోకి వస్తారు. అందువల్ల విభజనలో వారిపై ప్రభావం ఉండదు. ఉన్నత విద్యా సంస్థల పరిధి రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలన్నీ ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలున్నాయి. జిల్లాల విభజన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలను ప్రతిపాదించారు. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్‌లో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీబాలాజీ, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు ఉండాలని ప్రతిపాదించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రకాశం జిల్లా (ఆంధ్రా వర్సిటీ రీజియన్) పరిధిలోని 5 మండలాలు, నెల్లూరు జిల్లా (వెంకటేశ్వర వర్సిటీ రీజియన్) పరిధిలోని 30 మండలాలు ఉండడంతో దాన్ని ఏ రీజియన్ పరిధిలో చేర్చాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. -
317 జీవోపై ఆగని పోరు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: జోనల్ విధానం అమలు కోసం ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోపై ఉపాధ్యాయుల వ్యతిరేకత రోజురోజుకూ పెరగుతోంది. పలు సంఘాలు సోమవారం వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలిపాయి. సీనియారిటీ ప్రాతిపదికగా కేటాయింపులు చేయడం, భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే ఆప్షన్లను పరిగణలోనికి తీసుకోకపోవడంపై టీచర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలకు కేటాయించినా ఆ జిల్లాల్లో పట్టణ ప్రాంతాలకు సమీపంలోని స్కూళ్లను బ్లాక్ చేశారని, దీంతో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు నేతల వద్ద వాపోయారు. జీవోకు వ్య తిరేకంగా ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని యూటీ ఎఫ్ సహా పలు సంఘాలు నిర్ణయించాయి. టీచర్ల అరెస్ట్: సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నేతలు కరివేద మహిపాల్‌రెడ్డి, అరికెల వెంకటేశం నేతృత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించారు. దీంతో ఎస్జీటీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను సంఘం నేతలు కలిసి 317 జీవో వల్ల తమకు కలిగే అసౌకర్యాన్ని వివరించారు. ఇదెక్కడి అన్యాయం?: బాధిత ఉద్యోగులు 317 జీవో అమలులో స్పౌజ్ కేసులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరుగా బదిలీ అయిన భార్యాభర్తల ఉద్యోగులు తమ ఆందోళనను మీడియాకు వివరించారు. 33 జిల్లాల్లో కేవలం 19 జిల్లాల్లోనే భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టులు ఇచ్చారని, 13 జిల్లాల్లో పోస్టులు బ్లాక్ చేసి, భార్యభర్తలను వేర్వేరు ప్రాంతాలకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భారీ పోలీసు బందోబస్తు: 13 జిల్లాల స్పౌజ్ బాధితులు సుమారు 150 మందికి పైగా ప్రెస్‌క్లబ్‌కు రావడంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో వీళ్లంతా ప్రెస్‌క్లబ్ నుండి ప్రగతిభవన్ వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. 8 నెలల బాబుతో ఎలా ఉండాలి? నాకు యాదాద్రి జిల్లాకు బదిలీ అవగా నా భర్త అనిల్‌కు రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. 250 కిలోమీటర్ల దూరం. నాకు 8 నెలల బాబు ఉన్నాడు. చిన్న పిల్లాడితో భర్త ఒకచోట, నేను ఒకచోట ఎలా ఉంటాం? – సుమ చాలా ఇబ్బంది పడుతున్నాం నేను పదేళ్లుగా గద్వాల జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నా. నాకు అదే గద్వాలకు పోస్టింగ్ ఇచ్చి నా భర్తకు రంగారెడ్డి జిల్లాకు ఇచ్చారు. ఇద్దరు అమ్మయిలు వారానికోసారి ఇంటికి వచ్చి వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. అత్తమామను చూసుకోలేకపోతున్నాం. – భార్యాభర్తలు పద్మ, శంకర్ -
కొత్త కొలువుల్లో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానంలో భాగంగా చేసిన ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ (2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం) శుక్రవారంతో పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని కేడర్ల కేటాయింపుల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆదేశాలు అందుకున్న వారిలో ఎక్కువమంది విధుల్లో చేరినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా 22,418 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలిగితే ఇప్పటివరకు 21,800 మంది కొత్త ప్రాంతాల్లో జాయిన్ అయ్యారు. మిగతా వారు శనివారం చేరే వీలుంది. కాగా 13,760 మంది జిల్లా కేడర్ ఉద్యోగులు కొత్త చోట్ల చేరారు. జోనల్, మల్టీ జోనల్ కేటాయింపుల ప్రక్రియ కూడా పూర్తయిందని, శనివారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ విభజన ద్వారా స్థానిక యువతకు 95 శాతం మేర ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎంవో పేర్కొంది. -
నేలవిడిచి సాముచేయవద్దు!
‘‘తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష’’ అనే సత్యాన్ని రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం మరచిపోయినట్లుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరపరా భవం ఎదుర్కోవడంతో కేసీఆర్‌లో అసహనం తీవ్ర స్థాయికి చేరింది. ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంయమనంగా ఉండవలసిందిపోయి... విచక్షణా రహితంగా రైతు, నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇంటర్ విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలిపేందుకు ప్రజల పక్షాన బీజేపీ నిలబడటాన్ని సహించలేక కేసీఆర్ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు తెరలేపింది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అయిన బండి సంజయ్‌ను అరెస్టు చేయించి జైలుకు పంపించారనేది విశ్లేషకుల మాట. హైకోర్టు బండి సంజయ్ అరెస్ట్, రిమాండ్ల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయన్ని విడుదల చేయాలని ఆదేశించి న్యాయ వవస్థ ఔన్నత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. బండి సంజయ్‌ని అరెస్టు చేసిన 15 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎలా సాధ్యమైందని హైకోర్టు ప్రశ్నించడం పోలీసు శాఖ ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. తెలంగాణలో 317 జీఓ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. తెలంగాణ ఉద్యమ యోధులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు 317 జీఓ కారణంగా స్థానికత విషయంలో తీవ్ర భయాందోళనలకు గురవడమే కాకుండా, పలువురు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. తెలంగాణ సాధనకు ప్రధాన అంశాలైన నిధులు, నియామకాలు, నీళ్ళ విషయాలను కేసీఆర్ ప్రభుత్వం ఆటకెక్కించింది. అందుకే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలు/ఉప ఎన్నికల్లో ఓటర్లు టీఆర్ఎస్ను ఓడించి, బీజేపీని గెలిపించారు. (చదవండి: ఈ జీఓతో సమస్య మళ్లీ మొదటికి!) ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయారు. దళితు డిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి తానే ముఖ్యమంత్రి పీఠమెక్కడమే కాకుండా... వారికి ఇస్తామన్న మూడెకరాల భూమి విషయంలోనూ కేసీఆర్ మాటతప్పారు. ఇటీవల హడావుడిగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కూడా ఇప్పటికీ అమలు చేయడం లేదు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన నిరుద్యోగుల్లో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక రైతులను వరి పంట వేయవద్దని, వరి వేస్తే ఉరే అన్న ధోరణిలో కేసీఆర్ భయపెడుతున్నారు. ధాన్యం కొనుగోలులోని జాప్యం కారణంగా పలువురు రైతులు కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో వరి కుప్పలపైనే దిగులుతో ప్రాణాలు వదిలిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. వరి కొనకపోవడానికి కారణం కేంద్రమే అన్న ధోరణిలో రాష్ట్రం వ్యవహరించడం శోచనీయం. రైతులు వాస్తవాలు గ్రహించారు కాబట్టే బీజేపీ రైతులకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలకు పూర్తిగా అండగా నిలిచారు. దేశంలో బాయిల్డ్ రైస్ వాడకం తగ్గడమే కాకుండా వరి ఉత్పత్తి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం తాము బాయిల్డ్ రైస్ కొనబోమని ఎప్పుడో స్పష్టం చేసింది. అందుకు అంగీకరించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పి రైతుల ఊపిరి తీసింది. రాష్ట్రానికి కేంద్రం సహకారం, సహాయం అందే విషయంలో అన్ని విధాలా కృషి చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇటీవల కేసీఆర్ అభ్యంతర పదజాలంతో దూషించడం తనలో పెరిగిన అసహనానికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) ప్రజామోదం లేకుండా ప్రభుత్వం ఏమీ సాధించలేదు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులు 317 జీఓ విషయంలో తీవ్ర భయాందోళనలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వారికి ధైర్యం చెప్పాల్సిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికీ చలించకపోవడం శోచనీయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న 317 జీఓలో తగిన సవరణలను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (చదవండి: ఈ కశ్మీర్ లెక్క కరెక్టేనా?) - శ్యామ్ సుందర్ వరయోగి బీజేపీ రాష్ట్ర నాయకులు -
కొత్త జిల్లాల టీచర్లకు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానంలో భాగంగా కొత్త జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు వారు పనిచేయాల్సిన స్కూళ్లకు సంబంధించి విద్యాశాఖ నుంచి గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ (ఐఎఫ్ఎంఎస్) ద్వారా జిల్లా యంత్రాగానికి పోస్టుల కేటాయింపు జాబితా పంపించారు. తర్వాత జిల్లా కలెక్టర్ల కార్యాలయం నుంచి సంబంధిత ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులను పంపారు. అయితే, వివాదం లేని టీచర్ల జాబితానే ఇప్పటివరకూ ఖరారు చేసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులు సీనియారిటీ ఆధారంగా కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. వీరిలో 8 వేల మంది వివిధ కారణాలతో అభ్యంతరాలు లేవనెత్తారు. ఐదువేల స్పౌస్ కేసులున్నాయి. మరో మూడువేల మంది సీనియారిటీ తప్పుగా పడిందని, అనారోగ్యం కారణంగా స్థానికంగా ఉంచాలని తదితర కారణాలతో అప్పీలు చేసుకున్నారు. వీటన్నింటినీ విద్యాశాఖ అధికారులు గత వారం రోజులుగా పరిశీలించి 3,500 స్పౌస్ కేసులను పరిష్కరించినట్లు తెలిసింది. మరో 1,500 మందిలో భార్య లేదా భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదు. వీటిని ప్రస్తుతం పెండింగ్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. అప్పీలు చేసుకున్న వారి విషయంలో అన్ని కోణాల్లో పరిశీలించి, పరిష్కారం దొరకని కొన్ని కేసులను పెండింగ్‌లో ఉంచినట్టు తెలిసింది. జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులకు సరిపడా సమతూకం లేని కారణంగా మరికొన్ని పరిష్కారం కాలేదు. మొత్తం మీద ఎక్కువ మంది టీచర్ల విషయంలో తుది నిర్ణయం తీసుకుని, వారి జాబితాను ఐఎఫ్‌ఎంఎఫ్‌లో పొందుపరిచారు. ప్రస్తుతం వీరికే పోస్టింగులు ఇస్తున్నారు. పోస్టింగ్ సమాచారం అందుకున్న టీచర్లు మూడు రోజుల్లో తమకు కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది. -
ఈ జీఓతో సమస్య మళ్లీ మొదటికి!
ఘన చరిత్ర గల తెలంగాణ ఉద్యమం ముల్కీ నిబంధనలతో మొదలై 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతం అయిందని అను కున్నాం. కానీ 317 జీ.ఓ తో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని అనుకోలేదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గలవారి ప్రభుత్వంలో ఈ విధమైన పరిస్థితి దాపురించడం శోచనీయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 371డి అధికరణ అవసరం లేదని కొందరు, భౌగోళిక తెలంగాణలో కూడ చాలా అంతరాలు ఉన్నాయని 371డి అధికరణ కొత్త రాష్ట్రంలో కూడా అవసరమని మెజార్టీ సమాజం అభి ప్రాయం వ్యక్తం చేసింది. దానికి అనుగుణంగానే కొత్తగా రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో వెలువడ్డాయి. అయితే ఇక్కడే అసలు సమస్య ప్రారంభమయ్యింది. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు– 95:5 ప్రకారం కొత్త నియామకాలు చేపట్టనున్నందువల్ల స్థానికతకు పెద్దపీట వేస్తున్నట్లు అర్థమయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కూడా అదే. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 124 తేదీ 30–8–2018 ప్రకారం 31 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా ఏర్పరచడం, తదుపరి 128 జీవో ప్రకారం ముప్పై మూడు జిల్లాలకు అనుమతి పొందడం చాలా మంచి పరిణామమే. అయితే 10 జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయులను 33 జిల్లాలకు కేటాయించడానికి కొత్తగా విడుదలైన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికత అనే పదం లేకపోవడం సీనియార్టీ అనే పదం మాత్రమే ఉండటంతో ఏ స్థానికత కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో, ఏ స్థానికులకు ప్రయోజనం కల్పించాలని కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయో... ఆ స్థానికులే ఉద్యోగ, ఉపాధ్యాయ కేటాయింపుల్లో స్థానికేతరులు అవుతున్నారు. స్థానికతను వదిలిపెట్టి సీనియారిటీని కొలమానంగా తీసుకోవడం వల్ల సీనియర్లు రంగారెడ్డి లాంటి నగర జిల్లాలకు, ఉమ్మడి జిల్లా కేంద్ర పట్టణాలకు పరిమితమై జూనియర్లు గ్రామీణ ప్రాంతాలకే కాకుండా ఏకంగా సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు కేటాయింపునకు గురయ్యారు. సర్వీస్‌లో సీనియర్ అయినా, క్యాడర్లో జూనియర్ ఉపాధ్యాయులు అయితే కూడా వేరే జిల్లాలకు వెళ్లవలసిన అవసరం లేదు. వీరందరూ పదవీ విరమణ పొందే వరకు అదే జిల్లాలో పని చేయాల్సి వస్తుంది. మల్టీ జోనల్ పోస్టులు నిర్ణయించేటప్పుడు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాన్ని తీసుకుని స్కూల్ అసిస్టెంట్ పోస్టు జోనల్ పోస్టులుగా పేర్కొని ఉండాల్సింది. ఏఎన్ఎం,హెడ్ కానిస్టేబుల్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు జోనల్ పోస్టులు చేసి ఆయా పోస్టులతో సమానమైన, అంతకంటే ఎక్కువ బేసిక్ పే ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టు జిల్లా పోస్ట్ చేయడం వల్ల ఆందోళన ఇంత తీవ్ర స్థాయిగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మరో ప్రధాన సమస్య స్పౌజ్ కేటగిరి. సీనియర్ అయిన ఉద్యోగి, ఈ కేటగిరీ ద్వారా జీవిత భాగస్వాములను తమ ప్రాంతాలకు తెచ్చుకునే అవకాశం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాలో మొత్తం సీనియర్లు, మరికొన్ని జిల్లాలో మొత్తం జూనియర్లు కేటాయింపునకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే రాబోయే కాలంలో కొన్ని జిల్లాల్లో ఉద్యోగ ప్రకటన ఉండకపోవచ్చు. కొన్ని జిల్లాల్లో పెద్ద మొత్తంలో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉండొచ్చు. ఈ విధానం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఉద్యోగ, ఉపాధ్యా యుల కేటాయింపుల్లో సీనియార్టీ ప్రాతిపదిక కాకుండా 80:20 ప్రకారం స్థానిక, స్థానికేతరులకు పాఠశాల బోనఫైడ్ ఆధారంగా ఆయా జిల్లాలను కేటాయిం చినట్లయితే 90 శాతం సమస్య పరిష్కారం అవుతుంది. ఏ జిల్లాలో కూడా 20 శాతం కన్నా ఎక్కువ స్థానికేతరులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్కువగా ఉన్నా అందులో సీనియర్లకు అవకాశం ఇచ్చి స్థానికేతరులైన జూనియర్లను వారి సొంత జిల్లాలకు పంపడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కార మార్గం. - జుర్రు నారాయణ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ టీచర్స్ యూనియన్ -
‘స్పౌజ్’పై సానుకూలత!
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం అమలు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులకు వీలైనంత త్వరగా పనిచేసే ప్రదేశాలకు సంబంధించిన పోస్టింగ్ ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రధాన సమస్యగా మారిన ఉపాధ్యాయుల బదిలీల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వేల సంఖ్యలో అందిన విజ్ఞప్తులను ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పరిష్కరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు బదిలీలకు సంబంధించిన అభ్యంతరాలతో ఇప్పటివరకు మొత్తం 8 వేల వినతులు (అప్పీళ్ళు) అందాయి. 5 వేలకు పైగా స్పౌజ్, ఒంటరి మహిళలు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు తాము పనిచేస్తున్న ప్రాంతంలోనే ఉంచాలని కోరుకున్నారు. అయితే ఇందులో భార్య లేదా భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న అర్జీలు 1,500 వరకు ఉన్నాయి. వీటిని ప్రస్తుతానికి పక్కన బెట్టాలని భావిస్తున్నారు. మిగిలిన 3,500 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు సానుకూలంగా స్పందించేందుకు సిద్ధమయ్యారు. సీనియారిటీ అర్జీల పరిశీలన మరోవైపు సీనియారిటీలో తమకు అన్యాయం జరిగిందని అర్జీలు పెట్టుకున్న వాళ్ళలో ఆధారాలున్న వాటిని పరిశీలించారు. పదోన్నతి పొందిన నాటి నుంచి సీనియారిటీ పరిగణనలోనికి తీసుకోవడం వల్ల కొంతమంది స్థానికత కోల్పోతున్నారు. వీళ్ళలో కొందరు పదోన్నతి వద్దని, స్థానిక ప్రాంతంలోనే ఉంచాలని కోరుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో కొన్నింటికి ఆమోదం తెలిపేందుకు జిల్లా కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. వీటన్నింటిపై విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు జిల్లాల వారీ జాబితాలతో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన మరుక్షణమే ఉత్తర్వులపై నిర్ణయం తీసుకునే వీలుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 317 జీవోపై సంఘాల నిప్పులు జోనల్ విధానం కోసం తీసుకొచ్చిన 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నేతృత్వంలో 317 జీవోకు వ్యతిరేకంగా 33 జిల్లాల కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాల వద్ద సోమవారం ఆందోళనలు జరిగాయి. ఉపాధ్యాయ ఖాళీలు చూపించి, సీనియారిటీ జాబితాల్లో తప్పులు సరిచేసిన తర్వాతే బదిలీలు చేపట్టాలని జాక్టో డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమానికి జాక్టో నాయకులు సదానంద్‌గౌడ్, పర్వత్‌రెడ్డి, ఎం రాధాకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు తక్షణమే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వం ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) హెచ్చరించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమార్ స్వామి, ఉపాధ్యక్షుడు పురుషోత్తం సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని వారు ధ్వజమెత్తారు. ప్రభుత్వం సృష్టించే గందరగోళంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు మానసిక వేదనతో ఉన్నాయని తెలిపారు. అస్మదీయులకు ఇష్టమొచ్చిన చోట పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే 317 జీవో తీసుకొచ్చామని విద్యాశాఖ మంత్రి చెప్పడాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. స్థానికతకే ప్రాధాన్యం ఇవ్వాలని చర్చల్లో భాగంగా తాము చేసిన డిమాండ్లను మంత్రి గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. -
తెలంగాణలో వివాదంగా మారిన జోనల్ విధానం రద్దు
-
జిల్లా మారితేనే కొత్త పోస్టింగ్‌లు
ఉదాహరణకు.. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఉద్యోగి ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నాడు అనుకుంటే.. ప్రస్తుతం కేడర్ ఫిక్సేషన్లో భాగంగా ఆ ఉద్యోగిని మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తే.. ఆ ఉద్యోగికి కొత్తగా పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నచోటనే పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉద్యోగి ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో పని చేస్తూ ఉండి.. మంచిర్యాల జిల్లాకు కేటాయించిన పక్షంలో మాత్రం జిల్లాలో సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా మంచిర్యాలలో కొత్తగా పోస్టింగ్ ఇవ్వాలి. ఆ ఉద్యోగి నిర్మల్ జిల్లా నుంచి రిలీవ్ అయ్యి.. మంచిర్యాల జిల్లాలో చేరతారు. సాక్షి, హైదరాబాద్: కొత్త జోనల్ విధానం అమల్లో భాగంగా జిల్లాలు మారిన ఉద్యోగులకు మాత్రమే కొత్త పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా మారని ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోనే ఉంటారని అందులో పేర్కొన్నారు. సాధారణ బదిలీలపై గతంలో ఇచ్చిన ఆంక్షలను సర్కార్ సడలించింది. సాధారణ బదిలీలు చేయాల్సి వస్తే కొత్తవారిని కూడా బదిలీల ప్రక్రియలో భాగస్వామ్యం చేయనుంది. కొత్త పోస్టింగ్‌ల అమలుకు వీలుగా విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులోభాగంగా ఇప్పటికే కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను అన్ని ప్రభుత్వ శాఖలూ సిద్ధం చేశాయి. 25వ తేదీన వీటిని అందుబాటులోకి తెస్తారు. 26, 27 తేదీల్లో కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటారు. 28, 29న కౌన్సెలింగ్ పూర్తి చేసి, 30న పనిచేయాల్సిన ప్రాంతానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా కేడర్‌కు వర్తిస్తుంది. జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఆ తర్వాత వచ్చే అవకాశముంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించగా, ఏప్రిల్‌లో జరిగే సాధారణ బదిలీలకు దీంతో ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. నిబంధనలు ఇవీ.. ♦జిల్లాకు కొత్తగా వచ్చిన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తయారు చేస్తారు. దీన్ని కలెక్టర్ ఆమోదిస్తారు. ఈ జాబితాను శనివారం అందరికీ అందుబాటు లో ఉంచుతారు. 27నుంచి ఉద్యోగులు ఏ ప్రాంతంలో పోస్టింగ్ కోరుకుంటున్నారనే ఆప్షన్లు ఇస్తారు. ♦జిల్లా అధికారులు అన్ని కేడర్లకు సంబంధించిన ఖాళీలను, ఎక్కడ తక్షణ అవసరం ఉందనే వివరాలను గుర్తిస్తారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్తగా జిల్లాకు వచ్చిన ఉద్యోగులతో భర్తీ చేస్తారు. భర్తీ చేయాల్సిన పోస్టులనే కౌన్సెలింగ్‌లో ఉంచుతారు. ఉదాహరణకు జిల్లాకు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు మంజూరై... పోస్టులు 50 ఉన్నప్పుడు, అవసరమైన పోస్టులను మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ♦ఉద్యోగుల పోస్టింగ్, బదిలీల వ్యవహారం మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తారు. తెలంగాణ గెజిటెడ్, నాన్–గెజిటెడ్, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తారు. æ ప్రత్యేక కేటగిరీ, భార్యాభర్తల విషయంలో ప్రాధాన్యత నిర్ధారించేందుకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. పోలీసు, రెవెన్యూ, కమర్షియల్ టాక్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ విభాగాల్లో అక్కడి అవసరాలకు అనుగుణంగా ఆయా శాఖలు మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ ఏడు రోజుల్లో పూర్తవ్వాలి. స్వాగతిస్తున్నాం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉన్నాయి. దీన్ని స్వాగతిస్తున్నాం. భార్యాభర్తల బదిలీలు, కౌన్సెలింగ్ ద్వారా ఎక్కడి వారక్కడే ఉండేలా కసరత్తు చేయడం మంచి పరిణామమే. ఈ దిశగా చొరవ చూపిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – మామిళ్ల రాజేందర్ (టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు) బదిలీలపై స్పష్టత ఇవ్వాలి కొత్త వారికే పోస్టింగ్‌లు ఇవ్వడం వల్ల.. ఆ జిల్లాలో ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి న్యాయం జరిగే అవకాశం కన్పించడం లేదు. ఏప్రిల్‌లో సాధారణ బదిలీలు నిర్వహిస్తే అప్పటికే ఉద్యోగులు కోరుకున్న పోస్టులో ఇప్పుడొచ్చిన కొత్తవాళ్లు ఉంటారు. ఏళ్ల తరబడి కోరుకున్న ప్రాంతానికి వెళ్లాలనుకునే వారికి నిరాశే. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
తెలంగాణ: కీలక దశకు చేరుకున్న ఉద్యోగుల విభజన
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన కీలక దశకు చేరుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల జిల్లా కేడర్ కేటాయింపులు మొత్తం పూర్తయ్యాయి. వారంతా దాదాపు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్తున్నారు. ఈ రిపోర్టింగ్ ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో ముగియనుంది. ఇక జోనల్, మల్టీజోనల్‌కు సంబంధించి కొన్ని శాఖల్లో కేటాయింపులు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. దీంతో అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగుల లెక్క పక్కాగా తెలిసే వీలుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటివరకూ జరిగిందంతా కేడర్ విభజన మాత్రమేనని, ఎవరు ఏ జిల్లా, జోన్, మల్టీజోన్ అనే దానిపైనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పనిచేసే చోటు నుంచి రిలీవ్ కాకుండా కొత్త జిల్లాల్లో రిపోర్టు చేయడాన్ని కేడర్ విభజనగా తీసుకోవాలే తప్ప కొత్త ప్రాంతంలో వెంటనే పనిచేయాలన్నట్లు కాదని ప్రభుత్వ వర్గాలూ స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలవారీ విభజనతోపాటే భార్యాభర్తలు, వికలాంగుల బదిలీలు, ఇతర అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ రకమైన అప్పీళ్లను పరిశీలించాక కొన్ని మార్పుచేర్పులు జరిగే వీలుంది. మొత్తమ్మీద వచ్చే నెల 20 నాటికి క్షేత్రస్థాయి విభజన తుది దశకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ విభజన తక్షణ అవసరం కావడంతో ఈ కసరత్తు పూర్తవుతోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. చదవండి: పాక్ కేంద్రంగానే ‘దర్భంగ’ పేలుడు.. కుట్ర పన్నింది ఇలా... శేషప్రశ్నలెన్నో... మిగతా ప్రభుత్వ శాఖల్లో విభజన పెద్దగా సమస్యలు తేవట్లేదు. విద్యాశాఖలోనే అనేక సందేహాలకు తావిస్తోంది. మెజారిటీ టీచర్ల విభజన జిల్లా స్థాయిలోనే ఉంది. ఈ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది ఉపాధ్యాయులు ప్రస్తుత జిల్లా నుంచి కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. పోస్టింగ్ ఇచ్చే జిల్లాలో విద్యాశాఖ కౌన్సెలింగ్ జరిపి ఏ స్కూల్లో పనిచేయాలనేది నిర్ణయిస్తుంది. దీనికోసం విద్యాశాఖ విధివిధానాలు రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. జిల్లా మారిన వారికే బదిలీలు చేపట్టాలా? సాధారణ బదిలీల మాదిరి మార్గదర్శకాలు ఇవ్వాలా? సీనియారిటీ కొలమానమైతే ఇవ్వాల్సిన ఆప్షన్లు ఏమిటి? ఇలా అనేక అంశాలపై గురువారం అధికారులు చర్చించారు. చదవండి: టీఆర్ఎస్కు త్వరలో కొత్త ‘టీమ్’.. కసరత్తు ప్రారంభించిన సీఎం కేసీఆర్ కేడర్ విభజన పూర్తయింది కాబట్టి బదిలీల ప్రక్రియను విద్యాసంవత్సరం ముగిసేవరకూ వాయిదా వేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. జిల్లా కేడర్ ఇచ్చిన టీచర్ అప్పటివరకూ ఉన్న చోటే పనిచేస్తే నష్టమేమీలేదని అధికారులు అంటున్నారు. ఇది పాలనాపరమైన సమస్యకు దారితీస్తుందని విద్యాశాఖలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖలో మూడేళ్లుగా బదిలీల్లేవు. దీంతో అన్ని ప్రాంతాల్లో టీచర్లు ట్రాన్స్ఫర్లు అడుగుతున్నారు. ఏప్రిల్‌లో బదిలీలు చేపట్టాలని అధికారులు కేడర్ విభజనకు ముందు నిర్ణయించారు. దీంతో ఇప్పటికిప్పుడు బదిలీలు ఎందుకని అధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రావచ్చని ఓ అధికారి తెలిపారు. -
16లోగా విభజన ప్రక్రియ పూర్తి..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం రాత్రి రెండు జీవోలను జారీ చేశారు. ఇప్పటికే పూర్తయిన సీనియారిటీ జాబితాపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీలోగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ విభజన పూర్తి చేయాలని, 20వ తేదీలోగా సంబంధిత అధికారులు కేటాయింపు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది పూర్తయిన వారం రోజుల్లో ఉద్యోగులు కేటాయించిన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఈ దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా అధికారుల నేతృత్వంలో కమి టీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జోనల్ పరిధిలో రిపోర్టింగ్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలు జీవోల్లో వివరించారు. -
జిల్లా కేడర్ పోస్టుగా కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమలు చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించింది. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ అధికారి వరకు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఆప్షన్లు తీసుకుంటోంది. ఉద్యోగులు ఏ జిల్లా నుంచి నియమితులయ్యారు? వారి సీనియారిటీ ఎంత అనే వివరాలను పరిగణనలోకి తీసుకోవడానికే ఆప్షన్లు సేకరిస్తోంది. ఆయా జిల్లాల్లో కేడర్ పోస్టులు, ఖాళీలు, నియమాకాలకు రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు... పోలీస్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు జిల్లా పరిధిలోకి వస్తారని, వాళ్ల రిక్రూట్మెంట్ ఆధారంగా ఏ జిల్లాలో సెలక్ట్ అయ్యారో ఆ జిల్లా పరిధిలోకి వస్తారని, వారి బదిలీలు సైతం ఆ జిల్లా పరిధిలోనే ఉంటాయని పోలీస్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆప్షన్ల విషయంలో గందరగోళం అవసరంలేదని, ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయి నూతన జిల్లాలుగా ఏర్పడ్డ ఏ జిల్లాకైనా వాళ్లు ఆప్షన్ ఇచ్చుకునే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు. అయితే హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ అధికారులు మాత్రం ఆప్షన్ వారి నియామకమైన ప్రాంతానికిచ్చినా వారి బదిలీలు మాత్రం రేంజ్ పరిధిలో ఉంటాయని, రేంజ్లో ఉన్న ఏ జిల్లాల్లో అయినా పనిచేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. గతంలోనూ ఇదే విధంగా ఉందని, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందన్నారు. సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు కూడా వారు నియామకమైన జిల్లాకు ఆప్షన్ ఇచ్చుకున్నా వారి పరిధిలోని జోన్లో ఎక్కడైనా పనిచేసే సౌలభ్యం ఉందని తెలిపారు. డీఎస్పీ ర్యాంకు అధికారులు వారు సెలక్టయిన జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకున్నా వారు మాత్రం రాష్ట్రస్థాయి అధికారులుగా ఉంటారని, కేవలం వారి సీనియారిటీకి మాత్రమే మల్టీజోన్ ప్రాతిపదిక అవుతుందని పేర్కొన్నారు. మినిస్టీరియల్ స్టాఫ్... మినిస్టీరియల్ స్టాఫ్‌లో ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే జిల్లా కేడర్ పోస్టు కిందకి వస్తుంది. వారి సేవలను ఆ జిల్లాలోనే వినియోగించుకునేలా ఆదేశాలున్నాయి. అయితే డిప్యుటేషన్‌పై రాష్ట్రస్థాయి యూనిట్లలో కానిస్టేబుల్ అయినా, జూనియర అసిస్టెంట్ అయినా ఎక్కడైనా పనిచేయవచ్చు. సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ హోదా వరకు జోన్ కేడర్‌గా ఉంటారని, వారి సేవలను పోలీస్ జోన్లో ఎక్కడైనా వినియోగించుకునే వెసులుబాటు ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక అడ్మినిస్ట్రేటివ్ అధికారులు (ఏఓ) మల్టీజోన్ కిందకు వస్తారని, వారిని మల్టీజోన్ సీనియారిటీతో రాష్ట్రస్థాయిలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. ఆప్షన్‌ను కేవలం వారి జిల్లా కేటాయింపు, సీనియారిటీకే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఫ్రీ జోన్లో రిక్రూట్ అయినా.. ఉమ్మడి రాష్ట్రంలో వివాదాస్పదమైన ఫ్రీ జోన్లో రిక్రూట్ అయిన అధికారులు వారు నియామకమైన జిల్లా ద్వారా ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ఫ్రీ జోన్లో హైదరాబాద్ స్థానికత కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్ జిల్లా/హైదరాబాద్ కమిషనరేట్ కేడర్ పరిధిలోకి వస్తారని, ఆప్షన్ కింద వారు దాన్నే ఎంచుకోవాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. రేంజ్‌లు, జోన్లు, మల్టీజోన్లు.. ప్రస్తుతం పోలీస్ శాఖలో వరంగల్ (నార్త్), హైదరాబాద్ (వెస్ట్ జోన్) జోన్లు ఉన్నాయి. అయితే కొత్తగా మల్టీజోన్–1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి ఉండగా మల్టీజోన్–2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు (రేంజ్‌లు) ఉండనున్నాయి. ఐజీల పర్యవేక్షణలో ఉండే ఈ రెండు మల్టీజోన్ల కింద ఏడుగురు డీఐజీలు పనిచేయనున్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరం రేంజ్ డీఐజీ మంచిర్యాలలో, బాసర రేంజ్ డీఐజీ నిజామాబాద్‌లో, రాజన్న సిరిసిల్ల రేంజ్ డీఐజీ కరీంనగర్లో, భద్రాద్రి డీఐజీ ఖమ్మం నుంచి కార్యకలాపాలు సాగించనున్నారు. అదేవిధంగా యాదాద్రి డీఐజీ రాచకొండ కమిషనరేట్ నుంచి, చార్మినార్ డీఐజీ డీజీపీ కార్యాలయంలోని పాత హైదరాబాద్ డీఐజీ కార్యాలయం నుంచి, జోగుళాంబ డీఐజీ మహబూబ్‌నగర్ కేంద్రం నుంచి కార్యకలాపాలు సాగించనున్నారు. -
తెలంగాణ కొత్త జోనల్ పాలసీ.. ఉద్యోగుల కేడర్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. వివిధ హోదాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల కింద విభజించింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖల్లో ఏయే పోస్టులు ఏ కేటగిరీల్లోకి వస్తాయన్న వివరాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2018 ఆగస్టులో జారీచేసిన లోకల్ కేడర్ వ్యవస్థీకరణ ఉత్తర్వులకు కొనసాగింపుగా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం... ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లా కేడర్ కింద గుర్తించగా.. సీనియర్ అసిస్టెంట్, ఆపై పోస్టులు జోనల్ కేడర్ కింద, జిల్లాస్థాయి అధికారులు, ఇతర పోస్టులను మల్టీజోనల్ కేడర్ కింద పరిగణించనున్నారు. అయితే కొన్నిశాఖల్లో పక్కపక్క జిల్లాలను, పక్కపక్క జోన్లను కలిపి యూనిట్లుగా ఏర్పాటు చేసి.. పలురకాల పోస్టులను యూనిట్ల పరిధిలోకి తీసుకువచ్చారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)లకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తాజా కేడర్ విభజనకు అనుగుణంగా ఆయా శాఖల్లో కేడర్ సంఖ్యను నిర్ధారించాలని.. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన మేరకు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. పలుశాఖల్లో కొన్ని జిల్లాలు యూనిట్‌గా.. పురావస్తు శాఖలో కొన్ని పోస్టులను పక్కపక్కనే ఉన్న జిల్లాలకు కలిపి ఉమ్మడిగా కేటాయించారు. ఈ మేరకు జిల్లాలను యూనిట్లుగా విభజించారు. జూనియర్ అసిస్టెంట్లు, ముఖ్య చౌకీదార్, స్వీపర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మ్యాన్యుస్క్రిప్ట్ మెకానిక్, న్యుమిస్మాటిక్ మెకానిక్ పోస్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవి ఆ యూనిట్ జిల్లాలన్నింటి పరిధిలో ఉమ్మడిగా ఉంటాయి. జిల్లాల యూనిట్లు.. 1.ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు; 2. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల; 3.కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి; 4.కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ (అర్బన్, రూరల్); 5.సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ; 6.మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్; 7.మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈ శాఖ పరిధిలో సీనియర్ అసిస్టెంట్ కంటే తక్కువ కేడర్ పోస్టులను ప్రస్తుత జిల్లాల కేడర్ కింద.. సీనియర్ అసిస్టెంట్, కేర్‌టేకర్ పోస్టులను జోనల్ కేడర్ కింద.. అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్), టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను మల్టీజోన్ కింద నోటిఫై చేశారు. ►ఎక్సైజ్ శాఖలోనూ పక్కపక్కన జిల్లాలతో కలిపి యూనిట్లుగా పరిగణించనున్నారు. జోనల్ పోస్టులైన ఆఫీస్ సూపరిండెంట్, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను పక్కపక్కనే ఉన్న జోన్లతో కలిపి యూనిట్‌గా నోటిఫై చేశారు. ►తూనికలు–కొలతల శాఖలో కూడా కొన్ని పోస్టులను పక్కపక్కనే ఉన్న జిల్లాలు, పక్కపక్కనే ఉన్న జోన్లను కలిపి యూనిట్లుగా పరిగణించనున్నారు. ►పోలీసు బెటాలియన్లు, ఐటీ అండ్ కమ్యూనికేషన్ల శాఖలో జిల్లా పోస్టులను రెండు కేడర్లలో (పక్కపక్కనే ఉన్న జిల్లాలను కలుపుతూ), జోనల్ పోస్టులను పక్కపక్క జోన్లు కలిపి యూనిట్లుగా నోటిఫై చేశారు. ►పర్యాటక శాఖలో టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, టూరిస్టు గైడ్, కేర్‌టేకర్ గైడ్–2, వాచ్‌మన్, శానిటరీ వర్కర్, ఆఫీస్ సబార్డినేట్, ఆఫీస్ బాయ్, కుక్ పోస్టులను మాత్రమే జిల్లా కేడర్ కింద నోటిఫై చేశారు. ఈ శాఖలో జోనల్, మల్టీజోనల్ పోస్టులను నోటిఫై చేయలేదు. ►యువజన సర్వీసుల శాఖలో సూపరిండెంట్ స్థాయి పోస్టులను జోనల్ కేడర్ వరకే నోటిఫై చేశారు. ఎన్సీసీ విభాగం, పరిశ్రమల శాఖలోనూ మల్టీజోనల్ పోస్టులను నోటిఫై చేయలేదు. ►అర్థగణాంక శాఖలో స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టును మల్టీజోనల్ కేడర్‌లో చేర్చారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వీసీ పరిధిలోనికి వచ్చే పోస్టులను కూడా కేడర్ల వారీగా విభజించారు. ►జీహెచ్ఎంసీ పోస్టులను జోనల్ అయితే చార్మినార్ జోన్‌కు, మల్టీజోనల్ అయితే రెండో జోన్‌కు మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. జిల్లా పోస్టులుగా నోటిఫై చేసిన పలు హోదాలు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, సూపర్వైజర్, మ్యాట్రన్, బార్బర్, రికార్డ్ అసిస్టెంట్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మన్, స్వీపర్, మాలి, శానిటరీ వర్కర్, ఆయా, ధోబీ, కామాటి, వార్డుబాయ్, స్టోర్ కీపర్, అంగన్వాడీ ఆయా, నర్సు, స్కిల్డ్ అసిస్టెంట్, గోల్డ్ స్మిత్, ఈవో గ్రేడ్–2, అసిస్టెంట్ ఫోర్మన్, టైం కీపర్, బిల్ కలెక్టర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, బోర్వెల్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పంప్ డ్రైవర్, పబ్లిక్ హెల్త్ వర్కర్, డార్క్‌రూం/ఎక్స్‌రే/ల్యాబ్ అటెండెంట్లు, క్లీనర్, స్ట్రెచ్ బేరర్, థియేటర్ అసిస్టెంట్, టైలర్, లిఫ్ట్ అటెండెంట్, ప్లంబర్, ఫైర్‌మన్, యానిమల్ అటెండెంట్ తదితర పోస్టులు. (వైద్య విద్య శాఖలో అత్యధికంగా 145 రకాల పోస్టులను జిల్లా కేడర్‌గా నోటిఫై చేశారు. ఆ శాఖలో జోనల్ కేడర్‌లో 136 రకాల పోస్టులు, మల్టీజోనల్ కేడర్‌లో 64 రకాల పోస్టులు ఉన్నాయి) -
కొత్త జోనల్ విధానంతో స్థానికులకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు రూపొందించి చట్టం చేయడం, అది రాష్ట్రపతి ఆమోదం పొందడం చిరస్మరణీయమని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. ఈ విధానానికి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు, అందుకనుగుణంగా 50 వేల కొత్త ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎంను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, కార్యదర్శి, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కలిశారు. ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి విన్నవించిన సమస్యలివీ.. ఆర్డర్‌టుసర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జోనల్ విధానాన్ని అనుసరించి వారి స్వస్థలాలకు/ జిల్లాలకు ఆప్షన్ ద్వారా పంపించడానికి చర్యలు తీసుకుని ఆర్డర్‌టుసర్వ్‌ను రద్దు చేయాలి. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం పీఆర్సీ సూచన మేరకు ఒక శాతం మూల వేతనాన్ని ప్రభుత్వ కార్పస్ ఫండ్‌కు ఇవ్వడానికి రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు తదితర ఉద్యోగులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేలా జీవో విడుదల చేయాలి. ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో ఉన్న వ్యత్యాసాలను సవరించడానికి అనమలీస్ కమిటీని ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీలతో ఏర్పాటు చేయాలి. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలి. ఆంధ్రాలో మిగిలి ఉన్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయి, గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శాఖల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయాలి. -
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారని వెల్లడించారు. కొత్త జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారి ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకున్నదని, పునర్వ్యవస్థీకరణ ద్వారా రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా స్థాయి పోస్టులు.. జూనియర్ అసిస్టెంట్ మొదలుకుని జోన్లు, మల్టీజోన్ల ఉద్యోగాల వరకు స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చడాన్ని చట్టబద్ధం చేయడంతో పాటు వికారాబాద్ జిల్లాను ప్రజల కోరిక మేరకు చార్మినార్ జోన్ పరిధిలో చేర్చడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకే పరిమితం కాకుండా టీఎస్ఐపాస్ విధానం ద్వారా రాష్ట్రంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ సంఖ్యలో పరిశ్రమలను తీసుకువచ్చామన్నారు. -
కొత్త జోన్లు: మన ఉద్యోగాలు ఇక మనకే!
కరీంనగర్ అర్బన్: రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాజముద్ర పడింది. ఇక నియామకాల్లో నూతన అధ్యాయం మొదలు కానుంది. ఏ స్థాయి పోస్టులైనా 95 శాతం స్థానికులకే అవకాశం దక్కనుంది. ఈ క్రమంలో శాఖల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. నూతన జోన్ల ప్రకారమే పోస్టుల భర్తీ ఉండనుందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న విధానానికి మంగళం పాడుతూ నూతన విధానాన్ని ప్రవేశపెట్టగా గత లోపభూయిష్ట విధానాలకు చరమగీతం పాడుతూ అటెండర్ నుంచి గెజిటెడ్ అధికారి వరకు అన్ని శాఖల్లో ఒకే విధానముండేలా సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల్లో ఉన్న భయాందోళనలను తొలగిస్తూ పాత ఉద్యోగులు అలాగే ఉండనుండగా జారీ అయ్యే ఉద్యోగ ప్రకటనల దరిమిలా నూతన విధానం కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో స్థానికేతర పోస్టుల్లో గల మూస ధోరణికి అడ్డుకట్ట వేయగా.. ఇక స్థానికులను ఉద్యోగాలు వరించనున్నాయి. మొత్తానికి ఏళ్లుగా ఊరిస్తున్న జోనల్ వ్యవస్థకు పచ్చజెండా ఊపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు, బదిలీలకు సముచిత స్థానమిస్తూ జిల్లాలను విభజించి జోన్లుగా ఖరారు చేయగా, కరీంనగర్‌ను రాజన్న జోన్‌గా ఖరారు చేశారు. మల్టీజోన్లుగా రాజన్న, కాళేశ్వరం, బాసర, భద్రాద్రిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా మూడు ముక్కలు జిల్లాల విభజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలుగా విభజింపబడిన విషయం విదితమే. ఇక హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కలవగా మంథని డివిజన్లోని పలు మండలాలు భూపాలపల్లి జిల్లాకు, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు వరంగల్ అర్బన్ జిల్లాలో కలిశాయి. ఈ క్రమంలో మళ్లీ జోనల్ వ్యవస్థ తెరపైకి రావడంతో వివిధ జోన్లలో కలిశాయి. జిల్లాలు విభజింపబడగా బదిలీలు, పదోన్నతులు పాతజిల్లా ప్రకారం ఉండనుండగా కొత్తగా నియామకమైన వారికి నూతన వి«ధానం అమలుకానుంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లో చేర్చగా పెద్దపల్లి జిల్లాను కాళేశ్వరం జోన్లో, జగిత్యాల జిల్లాను బాసర జోన్లో చేర్చారు. నూతన విధానంతో ప్రయోజనాలు.. ఇప్పటివరకు కొనసాగుతున్న నియామక ప్రక్రియలో జిల్లాస్థాయి పోస్టులకు సంబంధించి 80 శాతం స్థానికత, 20 శాతం ఓపెన్ కేటగిరీ ఉండేది. జోనల్ స్థాయిలో 70 శాతం స్థానికత, 30 శాతం ఓపెన్ కేటగిరీ, రాష్ట్రస్థాయిలో 60 శాతం స్థానికత, 40 శాతం ఓపెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేసేవారు. దీంతో స్థానికత విషయంలో బాగానే ఉన్నా ఓపెన్ కేటగిరీలో మాత్రం అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులన్నీ 95 శాతం స్థానికత 5 శాతం స్థానికేతరులకు కేటాయించడంతో మన ఉద్యోగాలు మనకేనని స్పష్టమవుతోంది. ఏ స్థాయి పోస్టులైనా ఇదే విధానం అమలు కానుండటంతో వేల పోస్టులు తెలంగాణ యువతకు దక్కనున్నాయి. రాజన్న జోన్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల నూతన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లో చేరనుండగా 43.09 లక్షల జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు కలిపి రాజన్న జోన్‌గా ఉండనుండగా జోనల్ పోస్టులన్నింటినీ ఈ పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. ఇక అన్ని శాఖలకు ఒకే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించనుండగా సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లను జోన్ పరిధిలో, గెజిటెడ్ అధికారులు, డీటీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏటీవో, ఎస్టీవో ఇలా వివిధ రకాల హోదా గల అధికారులకు మల్టీజోన్ వారీగా బదిలీ, పదోన్నతులు ఉండనున్నాయి. ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులకు రాష్ట్రస్థాయిలో బదిలీలుండనున్నాయి. రాజన్న జోన్ మల్టిజోన్–1లో ఉండనుంది. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
గ్రూప్స్‌కు తొలగిన అడ్డంకులు.. త్వరలోనే నోటిఫికేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, ఇతర కేటగిరీల్లోని దాదాపు 3 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమమైంది. కొత్త విధానం ప్రకారం ఏయే పోస్టులు ఏయే జోన్లలో వస్తాయి, ఏయే పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయన్న వివరాలు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. పదేళ్ల తరువాత.. రాష్ట్రంలో కీలకమైన గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల సమస్యల కారణంగానే ఇన్నాళ్లుగా భర్తీకి నోచుకోలేదు. 2011లో చేపట్టిన గ్రూప్-1 నియామకాల తర్వాత ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ చేపట్టలేదు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక వీటితోపాటు గ్రూప్-2, 3 వంటి పోస్టుల భర్తీకి కూడా జోన్ల సమస్య అడ్డంకిగా మారింది. అయితే 2018లో అప్పటికే ఏర్పాటుచేసిన 31 జిల్లాలతో కూడిన జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం కొత్తగా మరో రెండు ములుగు, నారాయణ్‌పేట్ జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జోన్ల విధానంలో ఈ జిల్లాలు లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినా.. న్యాయ వివాదాలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించారు. ఇదే తరుణంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అంశాలన్నీ చేరుస్తూ.. అప్పటికే 2018లో రాష్ట్రపతి ఆమోదం పొందిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018’కు సవరణలు చేసింది. ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలను చేర్చడంతోపాటు, జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్‌జోన్‌కు మార్చి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. పోస్టులను ఎప్పుడో గుర్తించినా.. తెలంగాణ ఏర్పాటయ్యాక తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. గ్రూప్-1, 2, 3 పోస్టులు, మల్టీ జోనల్ పోస్టుల భర్తీకి కసరత్తు చేసింది. సబ్జెక్టు నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి సిలబస్‌ను రూపొందించింది. భర్తీకోసం గ్రూప్-1లో 142 పోస్టులను, గ్రూప్–2లో 60 పోస్టులను, గ్రూప్–3లో 400 వరకు పోస్టులను గుర్తించింది. మరికొన్ని కేటగిరీల్లోని మల్టీ జోన్, జోనల్ పోస్టులు కలుపుకొని 3 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. శాఖల వారీగా పోస్టులు, రోస్టర్ తదితర వివరాలపై కసరత్తు కూడా జరిగింది. అయితే పాలనాపర సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం.. రాష్ట్రంలో జిల్లాలను తొలుత 31 జిల్లాలుగా విభజించింది. అప్పటివరకు ఉన్న 2 జోన్లను ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లు మార్చింది. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించినా.. కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుతో మళ్లీ ఆగిపోయింది. మార్పులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం రావడంతో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. అప్పట్లో గుర్తించిన సుమారు 3 వేల పోస్టులతోపాటు ప్రస్తుత ఖాళీలను కలుపుకొంటే 4వేలకుపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవేకాకుండా ప్రభుత్వం భర్తీ చేయదలచిన 50 వేల ఉద్యోగాలకు కూడా కొత్త జోనల్ విధానాన్ని అమలు చేయనున్నారు. -
రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 95% స్థానికులతోనే ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయింది. అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్ కోటా 5 శాతం మాత్రమే ఉండనుంది. ఈ మేరకు రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. పోలీసు విభాగం మినహా ఇతర శాఖలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇక ముందు కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. నిజానికి 2018లోనే కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించినా.. తర్వాత ప్రభుత్వం మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్చింది. ఈ మార్పులకు కూడా రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి రావడంతో ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదించడంతో కొత్త జోనల్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా చాలా పోస్టులు ఓపెన్ రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని కేటగిరీల్లో 100 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలోనే ఉండటం గమనార్హం. గ్రూప్–1లోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్ కోటానే. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్ కోటా కిందే ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఇక్కడివారితోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీపడి, ఉద్యోగాలు దక్కించుకునేవారు. ఇక గ్రూప్–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లోనూ కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్ పోస్టులు ఉండేవి. మల్టీజోన్ పరిధిలో 40 శాతం పోస్టులు, జోనల్లో 30 శాతం, జిల్లా స్థాయిలో 20 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉండేవి. వాటిల్లో ఇతర రాష్ట్రాల వారు, ఇతర జోన్ల వారు పోటీపడి ఉద్యోగాలు పొందేవారు. స్థానికులకు అవకాశాలు తక్కువగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెస్తున్న కొత్త జోనల్ విధానంతో.. ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లా పోస్టులతోపాటు 61 కీలక విభాగాల్లోని 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. స్టేట్ కేడర్ నుంచి మార్చడంతో.. కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 34 రకాల స్టేట్ కేడర్ (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ విధానం నుంచి తొలగించి.. మల్టీ జోనల్ పరిధిలోకి తెచ్చింది. కొన్ని కేటగిరీల్లో కొత్త జోనల్, జిల్లా విధానం అమల్లోకి వస్తే.. ఆ ఉద్యోగాలు పొందిన వారు సర్వీసు పరంగా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియను మల్టీ జోనల్ స్థాయిలో చేసినా.. పోస్టింగ్‌లు మాత్రం రాష్ట్ర స్థాయి కేడర్‌లో ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్‌కు ప్రమోట్ అయ్యే వారికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో అత్యధికం పదోన్నతులపైనే భర్తీ కానున్నాయి. మల్టీజోన్ పరిధిలోకి వచ్చే స్టేట్ కేడర్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్, కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ గ్రేడ్–2 ట్రెజరర్, అకౌంట్స్ ఆఫీసర్; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీవో, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డైరెక్టర్, డీఎస్పీ (కమ్యూనికేషన్స్), అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, స్టాటిస్టిక్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్, మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయుష్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ జోనల్ పరిధిలోకి వచ్చే గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులివీ.. గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, కో-ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, ఇండస్ట్రీస్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, హార్టికల్చర్ ఆఫీసర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ట్యూటర్, ఫిజికల్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్. మల్టీజోన్లు.. వాటి పరిధిలోని జోన్లు మల్టీజోన్-1: కాళేశ్వరం-1, బాసర-2, రాజన్న-3, భద్రాద్రి-4 మల్టీజోన్-2: యాదాద్రి-5, చార్మినార్-6, జోగులాంబ-7 -
గ్రేటర్ దుబారా!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో కింది స్థాయి నుంచి అభివృద్ధి పనులు సక్రమంగా జరిగేందుకు జోనల్ కమిషనర్ల నిధుల మంజూరు అధికారాన్ని పెంచారు. అయితే ఈ పెంపుదల సత్ఫలితాలివ్వకపోగా దుబారా ఖర్చులకు దారితీస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోనల్కమిషనర్ల నిధుల మంజూరు పవర్‌ను రూ.20 లక్షల నుంచి ఏకంగా రూ.2 కోట్లకు పెంచుతూ కమిషనర్ తన అధికారాల్ని వారు కూడా వినియోగించుకునేలా బదలాయించారు. పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఉపకరిస్తుందని ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ చర్య రానురాను వికటిస్తోంది. పనులు సత్వరమయ్యే సంగతటుంచి నిధుల ఖర్చు పెరిగిపోతోంది. దుబారా భారీగా జరుగుతోంది. గతంలో అధికారాలు ప్రధాన కార్యాలయం పరిధిలో ఉన్నప్పటి కంటే జోన్లకు విస్తృతంగా బదలాయించాక పారిశుధ్యం, రవాణా, జీవ వైవిధ్యం, విద్యుత్, ఎంటమాలజీ తదితర విభాగాల్లో ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఖర్చులు పెరిగినా..సదరు విభాగాల్లో పరిస్థితులు మెరుగయ్యాయా అంటే అదీలేదు. ఇవి నిధుల మంజూరుకు సంబంధించిన విభాగాల పరిస్థితి కాగా, భవన నిర్మాణ అనుమతుల జారీకి సంబంధించిన టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఐదంతస్తుల వరకు జోన్లకే అధికారాలు కట్టబెట్టాక అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లాయి. నివాస, వాణిజ్య భవనాలన్నింటి అనుమతుల జారీకి అక్కడే అధికారాలుండటంతో స్థానిక అధికారులు ఆడింది ఆటగా సాగుతోంది. అనుమతులకు తప్ప అధికారాల్ని అక్రమాల్ని నిరోధించేందుకు వినియోగించడం లేరు. జోనల్ కమిషనర్లకు అధికారాలు కట్టబెట్టినప్పటికీ..వారి దిగువ స్థాయిలో ఉండే అధికారులు చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్నాయి. జోనల్ కమిషనర్లకు వివిధ బాధ్యతలుండటంతో అన్నింటిమీద దృష్టి సారించలేకపోతున్నారు. జోనల్ స్థాయిలో సదరు పనుల పర్యవేక్షణకు, క్రాస్ చెకింగ్‌కు జాయింట్ కమిషనర్ స్థాయిలో మరొకరుంటే వారా పనులు చేసేవారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జోనల్ కమిషనర్లకు రూ.2 కోట్ల వరకు అధికారం..నెలకు గరిష్టంగా రూ.8 కోట్ల వరకు వెరసి ఏడాదికి రూ.96 కోట్ల వరకు అధికారాలు దఖలు పడటంతో ఇక ప్రధాన కార్యాలయం నుంచి చేసే పనులేముంటాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాంతో ప్రధాన కార్యాలయంలోని పలువురు అడిషనల్ కమిషనర్లు ఏం చేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు పారిశుధ్యం, విద్యుత్, ఎంటమాలజీ, వెటర్నరీ తదితర విభాగాల అడిషనల్ కమిషనర్లకు చేసేందుకు చేతినిండా పనిలేకుండా పోయిందని చెబుతున్నారు. జోన్లలోనే నిధుల మంజూరు, పనులు చేసే అధికారాలుండటంతో ఆయా విభాగాల అడిషనల్ కమిషనర్ల ప్రమేయం లేకుండానే పనులు జరుగుతున్నాయి. జోనల్ స్థాయిలోనే నిధుల అధికారంతో పనులు డబ్లింగ్ అవుతున్నాయి. ఉదాహరణకు రూ. 5 భోజన కేంద్రాలను ప్రయోగాత్మకంగా జోన్‌కు 10 వంతున ఆధునీకరించేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. వాటికి నిధులను మంజూరు చేయకముందే, ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి లేకుండానే కొన్ని జోన్లలో స్థానిక అధికారులు ఎవరికి వారుగా ఆధునీకరణ పనులు ఇప్పటికే చేపట్టారు. జోనల్ స్థాయిలో పెరిగిన మంజూరు అధికారంతో ఇలా ప్రధాన కార్యాలయానికి..జోన్లు/సర్కిళ్లకు మధ్య సమన్వయం లేకుండా పోతోంది. మరోవైపు జోనల్ స్థాయిలోనే పనులన్నీ చేస్తుండటంతో ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయో.. నాణ్యత ఏ మేరకు ఉంటుందో.. పనులెక్కడ కుంటుపడుతున్నాయో ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు తెలియడం లేదు. ఇంజినీరింగ్ పనులకు సంబంధించి నెలకోమారు ఎన్ని పనులు మంజూరైంది.. ఎన్ని పనులు ప్రారంభించారు వంటి వివరాల సంఖ్య మాత్రం ప్రధాన కార్యాలయానికి మొక్కుబడిగా పంపుతున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో ఏపనులు జరుగుతున్నాయో..నత్తనడకన సాగితే కారణాలేమిటో.. నాణ్యత ఎలా ఉందో ఉన్నతాధికారులకు తెలియకపోవడంతో వాటి విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. గతంలో సర్కిల్,జోన్ల స్థాయిలోజరిగే పనుల గురించి ప్రధాన కార్యాలయంలోని చీఫ్ఇంజినీర్లకు తెలిసేది.. ఎక్కడైనా సమస్యలొస్తే వెంటనే పరిష్కరించేవారు. నాణ్యతపైనా ప్రశ్నించేవారు. ప్రస్తుతమా పరిస్థితి లేదు. అలాగే గ్రేటర్లో వివిధ ప్రాంతాల్లో ఆయా మార్గాల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. అవన్నీ జోన్లస్థాయిలోనే చేశారు. ఇక వీధిదీపాలకు సంబంధించి పనులన్నీ ఈఈఎస్ఎల్కు అప్పగించారు. ప్రధాన కార్యాలయంలోని ఆ విభాగం అడిషనల్ కమిషనర్ ఇక ఏం పనులు చేయాలో సంబంధిత అధికారులకే తెలియాలి. ఇలా ఓవైపు ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు చేతినిండా పనులు లేక..జోన్లస్థాయిలో పర్యవేక్షణ లేక.. నిధుల దుబారా జరుగుతుండటంతో.. జోన్లకు అధికారాల వికేంద్రీకరణతోపాటు అందుకు తగ్గట్లు క్రాస్‌చెకింగ్.. అజమాయిషీ వంటివి ప్రధాన కార్యాలయం నుంచి ఉంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. నామినేషన్ పనులు పెరిగే ప్రమాదం.. ఇక జోన్లకే కోట్లాది రూపాయల నిధుల మంజూరు అధికారం ఇవ్వడంతో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వారికి ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. లక్ష రూపాయల వరకు పనుల్ని నామినేషన్ మీద ఇచ్చేందుకు ఉన్న వెసులుబాటును ఉపయోగించుకొని జోనల్ కమిషనర్లు లెక్కకు మిక్కిలిగా నామినేషన్ మీద ఇచ్చే ప్రమాదముందని చెబుతున్నారు. నామినేషన్ పనులంటేనే నిధులు కుమ్మరించడమే అనే అభిప్రాయాలున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు నామినేష¯Œన్ మీద పనుల్ని రద్దు చేయడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఉద్యోగాలు జో ‘నిల్’
ప్రభుత్వ శాఖల్లో కొత్త నియామకాలు ఇప్పట్లో కష్టమే. గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానంతో ఈ పరిస్థితి తలెత్తింది. అంతకుముందున్న విధానంతో ఉద్యోగాలను భర్తీ చేసిన నియామక సంస్థలు కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగాల ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల విడుదలకు బ్రేక్ వేశాయి. ప్రభుత్వం ఆమోదించిన పోస్టులను సైతం భర్తీ చేయకుండా వాయిదా వేశాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి వివిధ నియామక సంస్థలు ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, పోస్టుల సర్దుబాట్లు, ఖాళీలపై స్పష్టత వచ్చే వరకు నూతన నియామకాలు చేపట్టే అవకాశాలు లేవనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారీ కొలువుపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం మరికొంతకాలం వేచిచూడాల్సిందే. – సాక్షి, హైదరాబాద్ కొత్త విధానమేమిటంటే.. రాష్ట్రంలో నూతన జోనల్ విధానాన్ని ఆమోదిస్తూ గత ఆగస్టులో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్లు, ఏడు జోన్లు, 31 జిల్లాలుగా విభజించారు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. దీంతో మల్టీజోన్లు, జోన్ల పరిధిలో ఏయే జిల్లాలు వస్తాయనే అంశంపై స్పష్టత లేదు. రాష్ట్రంలో ఇదివరకు రెండు జోన్లు, 10 జిల్లాల మేరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో స్థానికత, కేడర్ ఆధారంగా మల్టీజోన్లు, జోన్లు, జిల్లా స్థాయిలో ఉద్యోగులను విభజించాలి. దీనికి ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలి. ఉద్యోగుల సుముఖత, శాఖల సౌలభ్యం ప్రకారం విభజన ప్రక్రియ పూర్తయితేనే కేటగిరీల వారీగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఈ రెండు ప్రధాన కారణాలతో ఉద్యోగ నియామకాలకు బ్రేక్ పడింది. ఆ నోటిఫికేషన్ల సంగతి.. గతేడాది రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే నాటికే ప్రభుత్వం కొన్ని రకాల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆయా శాఖల వారీగా ప్రతిపాదనలు సంబంధిత నియామక సంస్థలకు పంపగా.. నోటిఫికేషన్ల రూపకల్పన దాదాపు పూర్తయింది. చివరి నిమిషంలో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడటం.. కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. టీఎస్పీఎస్సీ, గురుకుల, మెడికల్ బోర్డుల పరిధిలో 8,547 పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పరిధిలో గ్రూప్–1 కేటగిరీలో 138, గ్రూప్–2 కేటగిరీలో 60, గ్రూప్–3 కేటగిరీలో 339, అదేవిధంగా 117 అసిస్టెంట్ ఇంజనీర్, 58 డ్రాఫ్ట్‌మన్, 68 దేవాదాయ, 31 అటవీ అధికారి, 260 రెవెన్యూ అధికారి, 287 కార్మిక ఉపాధి కల్పన, 208 రోడ్డు రవాణా సంస్థ విభాగాలతో పాటు మరిన్ని శాఖల్లో సింగిల్ డిజిట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేసే క్రమంలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. ►తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు పరిధిలో సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్, లైబ్రేరియన్, క్రాఫ్ట్, ఆర్ట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టాఫ్ నర్సు కేటగిరీల్లో దాదాపు 2,440 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ బోర్డు నుంచి ఏడాదిన్నరగా నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ►తెలంగాణ రాష్ట్ర వైద్య నియామకాల బోర్డు పరిధిలో కూడా డాక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్స్, హెల్త్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లో 4,150 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్లు వెలువడలేదు. -
విభజన తర్వాతే కొత్త కొలువులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అందుబాటులోకి రావడంతో ఆ మేరకు శాఖల వారీగా ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడంతో ఖాళీలు, నియామకాలపై సందిగ్ధత వీడలేదు. దీంతో ఈ అంశం తేలేవరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం లేదు. పాత జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ నియామకాలన్నీ జిల్లా, జోనల్ స్థాయిల్లోనే జరిగేవి. నూతన జోనల్ విధానంతో ఇకపై జిల్లా స్థాయితో పాటు జోనల్, మల్టీ జోనల్ కేడర్లలో నియామకాలు చేపట్టాలి. నియామకాలు చేపట్టాలంటే ప్రస్తుత ఉద్యోగుల కేడర్‌ను కొత్త జోనల్ విధానం ప్రకారం విభజించాలి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు నియామకాల ప్రక్రియ సాధ్యం కాదని ఉద్యోగ నియామక బోర్డులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. విభజన పూర్తయితేనే నియామకాలు.. కొత్త జిల్లాలు ఏర్పాటై మూడేళ్లయింది. ప్రస్తుతం ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువగా జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగులున్నారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనతో పాటు జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో కూడా పరిధిని ఫిక్స్ చేయాలి. ఇది పూర్తయితే ప్రతి ఉద్యోగికి పరిధిపై స్పష్టత రావడంతో పాటు జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, పనిచేస్తున్న వారి లెక్కలు తేలుతాయి. దీంతో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, నేరుగా భర్తీ చేసేవెన్ని, పదోన్నతులతో నింపేవెన్ని అనేది తెలుస్తుంది. ఉద్యోగులకు ఆప్షన్లు... తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. గత ఆగస్టు నుంచి రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అందుబాటులోకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులను ప్రాథమికంగా విభజించారు. అయితే విభజన పూర్తిస్థాయిలో జరిగితేనే ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారనేది స్పష్టత వస్తుంది. ఉద్యోగుల విభజన చేపట్టే క్రమంలో ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఉద్యోగి ఎంపిక చేసుకునే విధానం ప్రకారం విభజనకు ఆస్కారముంటుంది. ఉద్యోగుల విభజన విషయంలో ప్రభుత్వం పలుమార్లు శాఖాధిపతులతో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు. -
ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చరాదంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎర్రగడ్డలోని ‘ఇరానుమా’ కూల్చివేత ప్రయత్నాలను అడ్డుకున్నట్లుగానే ఎర్రమంజిల్ భవనం కూల్చివేత విషయంలోనూ స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయ వాది నళిన్ కుమార్ కోరారు. రెగ్యులేషన్ 13ప్రకారం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో చేర్చారని, దీని ద్వారానే హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ ఏర్పడిందన్నారు. వారసత్వ జాబితాలో భవనాల్ని చేర్చినా, తిరిగి ఆ జాబితా నుంచి ఏదైనా భవనాన్ని తొలగించాలన్నా ఆ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం చేయాలన్నారు. మరమ్మతులు చేయాలన్నా కమిటీ అనుమతి అవసరమని, ఏ అనుమతి లేకుండా ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించడం చట్టవ్యతిరేకమన్నారు. ఇరానుమా భవనం కూల్చివేయరాదన్న కేసులో హైకోర్టు.. హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని 2015లో ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ధర్మాసనం కల్పించుకుని.. దీన్ని లోతుగా విచారించాల్సి ఉందంది. గత విచారణ సమయంలో హెచ్ఎండీఏ చట్టంలోని రెగ్యులేష న్ 13ను తొలగించినప్పటికీ జోనల్ రెగ్యులేషన్‌లో ఉన్నందున మాస్టర్ ప్లాన్‌లో అది కొనసాగుతుందని వాదించారని తెలిపింది. ఇప్పుడు జోనల్ రెగ్యులేషన్‌కు స్వయంప్రతిపత్తి ఉందని, హెచ్ఎండీఏ చట్టంలోని 13వ నిబంధన తొలగింపు ప్రభావం లేదని అందుకు విరుద్ధంగా ఎలా చెబుతున్నారో వివరణ ఇవ్వాలంది. హెచ్ఎండీఏ చట్టాన్ని రూపొందించినప్పుడు 13వ నిబంధన లేదని, తర్వాత చేర్చిన ప్రభుత్వం తిరిగి 2015లో తొలగించిందని, కొత్త చట్టంలో 13వ నిబంధన ఏ విధంగా ఉనికిలో ఉంటుందో చెప్పాలని, పిటిషనర్లను కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
గురుకులాల్లో 667 పోస్టులకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో పోస్టుల విభజన పూర్తి కావడంతో వాటిల్లో ఖాళీల భర్తీకి గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) దృష్టి సారించింది. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో గతంలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించిన పోస్టులను కొత్త జోనల్ విధానం ప్రకారం భర్తీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం గురుకుల బోర్డు వద్ద 667 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. తాజాగా పోస్టుల విభజన పూర్తి కావడంతో నియామకాలకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో తాజా పోస్టులకు గురుకుల సొసైటీలు మరోమారు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. కొత్త జోనల్ విధానం, కొత్త జిల్లాలవారీగా పోస్టులను విభజించిన తర్వాత ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పిస్తే అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చే వీలుంటుంది. ఈ మేరకు గురుకుల నియామకాల బోర్డు ఆయా సొసైటీలకు సూచనలు చేసింది. అతిత్వరలో సొసైటీల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకొని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు అధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. కేటగిరీలవారీగా పోస్టుల వివరాలు కేటగిరీ పోస్టులు ప్రిన్సిపాల్ 18 లైబ్రేరియన్ 148 పీడీ (డిగ్రీ), పీడీ 206 మెస్ మేనేజర్ 31 స్టాఫ్‌నర్స్ 31 కేర్ టేకర్ 15 ల్యాబ్ అసిస్టెంట్ 62 కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 31 అసిస్టెంట్ లైబ్రేరియన్ 23 జూనియర్ అసిస్టెంట్ కం డీఈఓ 30 స్టోర్ కీపర్ 15 క్రాఫ్ట్‌టీచర్ 10 ఆర్ట్ టీచర్ 5 మ్యూజిక్ టీచర్ 5 స్టాఫ్ నర్స్ (డిగ్రీ) 12 పీఈటీ 25 -
సర్వీస్ రూల్స్‌పై విద్యాశాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు కొత్త సర్వీసు రూల్స్ రూపకల్పనపై విద్యా శాఖ కసరత్తు ప్రారం భించింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన కొత్త జోనల్ విధానం ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా రూల్స్ రూపొందించే పనిలో పడింది. ప్రభుత్వ టీచర్లతో పాటు పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టుకు కొట్టేయడంతో ప్రత్యా మ్నాయ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి 2018 ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దానికి అనుగుణంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. దానికంటే ముందే పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాల్ చేస్తూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో కొట్టేసింది. దీంతో ఆ తర్వాత వచ్చిన జోనల్ విధానానికి అనుగుణంగా మళ్లీ సర్వీసు రూల్స్ రూపకల్పనకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. అందులో కొత్త జోన్లతో పాటు జిల్లా కేడర్, జోనల్ కేడర్, మల్టీ జోన్ కేడర్లే ఉండేలా, 95 శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేలా సవరణలు చేస్తూ రాష్ట్రపతి కొత్త జోన్లకు ఆమోదం తెలిపారు. అందులో మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, గవర్నమెంట్ టీచర్లు/ తత్సమాన కేటగిరీల వారు నాన్ గెజిటెడ్ కేటగిరీలోని జిల్లా కేడర్ పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం ఉన్నందున అదే ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్ని మేనేజ్మెంట్ల టీచర్లు ఒకే కేటగిరీలో లోకల్ కేడర్‌గా పేర్కొన్న నేపథ్యంలో సర్వీసు రూల్స్ రూపకల్పనకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వాటిపైనా గతంలో కొందరు ప్రభుత్వ టీచర్లు కోర్టును ఆశ్రయించారు. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గవర్నమెంట్ టీచర్లంతా లోకల్ కేడర్‌గా పేర్కొనడాన్ని సవాల్ చేసినా కోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేయలేదు. తదుపరి విచారణ చేపట్టే దాకా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పిందని ప్రభుత్వ టీచర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.వీరాచారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి రూల్స్‌ను రూపొందించి సిద్ధంగా ఉంటే కోర్టులో కేసు మళ్లీ విచారణకు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు చేపట్టొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. -
కొత్త జోన్లకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోస్టుల వర్గీకరణకు కసరత్తు ప్రారంభమైంది. కొత్త జోనల్ వ్యవస్థ అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈనెల 3న సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. కేటగిరీలవారీగా పోస్టులు, ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలతో హాజరు కావాలని సాధారణ పరిపాలన శాఖ కోరింది. ఉమ్మడి ఏపీలో ఆరు జోన్లుండగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 4, తెలంగాణకు 2 జోన్లు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 31కి పెంచారు. కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాల అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానాన్ని రూపొందించింది. రాష్ట్రపతి గత ఆగస్టు 29న ఈ ప్రతిపాదనలను ఆమోదించిన విషయం తెలిసిందే. దీనినే ‘ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్, 2018’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29న గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. 36 నెలల్లోపు ఈ కొత్త జోనల్ వ్యవస్థను రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. ఈ మేరకు కొత్త జోనల్ వ్యవస్థ ఆధారంగా పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులు, పోస్టుల వివరాలు సేకరించేందుకు ఆరు రకాల నమూనా దరఖాస్తులను రాష్ట్ర ఆర్థిక శాఖ సిద్ధం చేసింది. తెలంగాణ ఆర్థిక శాఖ అధికారిక వెబ్సైట్లో శాఖల వారీగా ఉద్యోగులు, పోస్టుల వివరాలను అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. -
స్థానికతపై స్పష్టత అవసరం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ వ్యవస్థ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న స్థానికత విషయంలో మరింత స్పష్టత అవసరమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్లోని అంశాలపై న్యాయవాదులు, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మరింత లోతుగా మాట్లాడుతానన్నారు. 95% స్థానిక రిజర్వేషన్ మంచిదేనన్నారు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరులకు గౌరవం దక్కడంలేదని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. హరికష్ణ స్మతివనానికి స్థలం కేటాయించి గౌరవించినట్లే తెలంగాణ కోసం జీవితాలను త్యాగం చేసిన కొండాలక్ష్మణ్ బాపూజీ, ప్రొఫె సర్ కేశవరావు జాదవ్, గూడ అంజన్న వంటి వారిని కూడా గౌరవించాలన్నారు. తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం ఏర్పాటు కోసం సెప్టెంబరు 12న పార్టీ కార్యాలయంలో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. -
సరికొత్త తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కొత్తరూపు సంతరించుకుంటోంది. ఇప్పటికే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల పునర్విభజన పూర్తవగా తాజాగా పరిపాలనలో కీలకమైన పోస్టుల భర్తీలో కొత్త వ్యవస్థ మొదలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018గా దీన్ని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన జరిగింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం జోనల్ విధానాన్ని రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి గురువారం ఉత్తర్వులు (124) జారీ చేశారు. కొత్త జోనల్ విధానం ప్రకారం తీసుకునే ఏ నిర్ణయమైనా రాజ్యాంగం లోని 371 (డీ) ప్రకారం 1975 అక్టోబర్ 18న జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి తాజా నోటిఫికేషన్ జారీ చేశారు. స్థానికత, పోస్టులు, క్యాడర్, జిల్లా, జోన్, మల్టీజోన్ వంటి అంశాలను పేర్కొంటూ కొత్త విధానంలో 14 పాయింట్లలో పొందుపరిచారు. కొత్త జోనల్ విధానంలోని అంశాలివీ రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ విధానం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోని అన్ని రకాల పోస్టులను జిల్లా, జోన్, మల్టీజోన్, రాష్ట్రస్థాయి, సివిల్ సర్వీస్ కేడర్లవారీగా వర్గీకరించాలి. 36 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా పూర్తి చేయని పరిస్థితుల్లో మళ్లీ రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, దీనికి సమానమైన, దీనికంటే తక్కువ కేడర్ పోస్టులను ప్రత్యేక కేటగిరీగా పేర్కొన్నారు. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లోని నాన్ గెజిట్ కేటగిరీలోని టీచర్ల పోస్టులను జిల్లా యూనిట్‌గా ఒక కేడర్‌గా భావిస్తారు. జూనియర్ అసిస్టెంట్ పైస్థాయికి సమానమైన పోస్టుల నుంచి సూపరింటెండెంట్, దీనికి సమానమైన పోస్టులను ప్రత్యేక కేడర్‌గా పేర్కొన్నారు. ఈ పోస్టులు జోన్ పరిధిలో ఉంటాయని తెలిపారు. సూపరింటెండెంట్‌పై స్థాయికి సమానమైన పోస్టుల నుంచి డిప్యూటీ కలెక్టర్ పోస్టు వరకు ఉండే అన్ని రకాల పోస్టులను మల్టీజోనల్ పోస్టులుగా నిర్ధారించారు. అన్ని స్థానిక కేడర్లలోని ఉద్యోగుల ఉన్నతస్థాయి పదోన్నతులకు సమాన అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. లోకల్ కేడర్ నుంచి ఇతర ఆఫీసులకు, సంస్థలకు ఒక ఉద్యోగిని బదిలీ చేయడానికి ఈ ఉత్తర్వు వర్తించదు. ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్‌కు బదిలీ జరగాలి. ప్రతి మల్టీజోన్ ఒక లోకల్ ఏరియాగా ఉంటుంది. కొన్ని మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల పోస్టులు వీటి పరిధిలో ఉంటాయి. లోకల్ కేడర్‌కు బదిలీ చేయడంతో ఇబ్బంది పడినట్లుగా భావించిన ఉద్యోగి ఈ విషయంపై ప్రభుత్వానికి ఆరు రోజుల్లోగా వినతిపత్రం ఇవ్వాలి. పైకేడర్ పోస్టుల భర్తీ విషయంలో లోకల్ కేడర్ నుంచి సమానావకాశాలు వర్తిస్తాయి. లోకల్ కేడర్ అధికారిని ఏ కార్యాలయానికైనా బదిలీ చేయవచ్చని పేర్కొన్నారు. ఒక లోకల్ కేడర్‌లో ఉన్న ఉద్యోగిని ఇతర లోకల్ కేడర్‌కు బదిలీ చేయొచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కేటగిరీ పోస్టులకు, ప్రతి ప్రాంతానికి ఒక లోకల్ కేడర్‌ను, నియామకాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వచించిన ‘స్థానికత’ప్రకారం పోస్టులను, నియామకాలను, విధి నిర్వహణ అంశాలను పేర్కొన్నారు. ప్రతి జిల్లా ఒక లోకల్ ఏరియాగా ఉంటుంది. అలాగే ప్రతి జోన్‌ను ఒక లోకల్ ఏరియాగా పరిగణిస్తారు. మల్టీజోన్ విషయంలోనూ ఇదే విధంగా ఉంటుంది. ఒకటికంటె ఎక్కువ జిల్లాల్లోని ఒకే కేడర్ పోస్టులుగా ఉండే పోస్టులను ప్రత్యేక కేడర్‌గా పరిణగిస్తారు. జోన్, మల్టీజోన్ విషయంలోనూ ఇదే తరహా విధానం ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హత సాధించే వ్యక్తి అక్కడ స్థానికుడిగా ఉంటారు. పోస్టులవారీగా పేర్కొనే నిబంధనల ప్రకారం ఈ స్థానికతను పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వ అమోదిత విద్యా సంస్థల్లో వరుసగా నాలుగేళ్లు చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. చదివిన జిల్లాలను స్థానిక జిల్లాగా పేర్కొంటారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ పరిధిలోని అన్ని పోస్టుల భర్తీలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ 95 శాతం పోస్టులను డెరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తారు. ఇలా భర్తీ చేసే 95 శాతం పోస్టుల్లో పూర్తిగా స్థానికులకే అవకాశం ఉంటుంది. ఈ మేరకు రిజర్వేషేన్లు కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీ కింద 5 శాతం మాత్రమే ఉంటాయి. స్థానిక అభ్యర్థులు లేకపోవడం వల్ల ఖాళీగా మిగిలే పోస్టులను తర్వాత స్థానికులకే చెందేలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రత్యేక కార్యాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసే కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలకు జోనల్ విధానంలోని నిబంధనలు వర్తించవని గెజిట్‌లో పేర్కొన్నారు. ఆయా కార్యాలయాల్లోని సిబ్బందిని మాత్రం జిల్లాల్లోని కార్యాలయాలకు పరస్పరం బదిలీ చేయవచ్చని పేర్కొన్నారు.