సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు మరికొంత సమయం వేచి చూడాల్సిందే. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం అందుబాటులోకి రావడంతో ఆ మేరకు శాఖల వారీగా ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడంతో ఖాళీలు, నియామకాలపై సందిగ్ధత వీడలేదు. దీంతో ఈ అంశం తేలేవరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం లేదు. పాత జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ నియామకాలన్నీ జిల్లా, జోనల్ స్థాయిల్లోనే జరిగేవి. నూతన జోనల్ విధానంతో ఇకపై జిల్లా స్థాయితో పాటు జోనల్, మల్టీ జోనల్ కేడర్‌లలో నియామకాలు చేపట్టాలి. నియామకాలు చేపట్టాలంటే ప్రస్తుత ఉద్యోగుల కేడర్‌ను కొత్త జోనల్ విధానం ప్రకారం విభజించాలి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు నియామకాల ప్రక్రియ సాధ్యం కాదని ఉద్యోగ నియామక బోర్డులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
విభజన పూర్తయితేనే నియామకాలు..
కొత్త జిల్లాలు ఏర్పాటై మూడేళ్లయింది. ప్రస్తుతం ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువగా జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగులున్నారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనతో పాటు జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో కూడా పరిధిని ఫిక్స్ చేయాలి. ఇది పూర్తయితే ప్రతి ఉద్యోగికి పరిధిపై స్పష్టత రావడంతో పాటు జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, పనిచేస్తున్న వారి లెక్కలు తేలుతాయి. దీంతో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు, నేరుగా భర్తీ చేసేవెన్ని, పదోన్నతులతో నింపేవెన్ని అనేది తెలుస్తుంది.
ఉద్యోగులకు ఆప్షన్లు...
తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేయడంతో జిల్లాల సంఖ్య 33కు పెరిగింది. అలాగే ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. గత ఆగస్టు నుంచి రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అందుబాటులోకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులను ప్రాథమికంగా విభజించారు. అయితే విభజన పూర్తిస్థాయిలో జరిగితేనే ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారనేది స్పష్టత వస్తుంది. ఉద్యోగుల విభజన చేపట్టే క్రమంలో ప్రతి ఉద్యోగికి ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్లు ఇచ్చిన తర్వాత ఉద్యోగి ఎంపిక చేసుకునే విధానం ప్రకారం విభజనకు ఆస్కారముంటుంది. ఉద్యోగుల విభజన విషయంలో ప్రభుత్వం పలుమార్లు శాఖాధిపతులతో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment