హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ | Telangana cabinet grants expanded powers to HYDRA: Telangana | Sakshi
Sakshi News home page

హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ

Published Sat, Sep 21 2024 2:01 AM | Last Updated on Sat, Sep 21 2024 8:33 AM

Telangana cabinet grants expanded powers to HYDRA: Telangana

అన్ని ప్రభుత్వ శాఖలకు ఉన్న అధికారాలు హైడ్రాకు..

సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం

కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి

హైడ్రాకు డిప్యుటేషన్‌పై 169 మంది అధికారులు, 946 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు  

ట్రిపుల్‌ ఆర్‌ దక్షిణ అలైన్‌మెంట్‌ ఖరారుకు 12 మంది అధికారులతో కమిటీ  

మూడు వర్సిటీలకు కొత్త పేర్లు 

కోస్గికి కొత్త ఇంజనీరింగ్‌ కళాశాల.. హకీంపేటకు జూనియర్‌ కాలేజీ 

ఎస్‌ఎల్‌బీసీ అంచనా వ్యయం రూ.4,637 కోట్లకు పెంపు 

వచ్చే నెలలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం 

సన్నాలకు రూ.500 బోనస్‌..జనవరి నుంచి రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ విపత్తు నిర్వహణ– ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు పూర్తిస్థాయి స్వేచ్ఛ కలి్పస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూలి్చవేతల విషయంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.

సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.  

ట్రిపుల్‌ ఆర్‌ దక్షిణ అలైన్‌మెంట్‌పై కమిటీ 
‘ఓఆర్‌ఆర్‌కు లోపల ఉన్న కోర్‌ అర్బన్‌ రీజియన్‌లోని 24 పురపాలికలు, 51 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని శాఖలకు ఉన్న స్వేచ్ఛ(అధికారాలు)ను హైడ్రాకు కల్పించేలా నిబంధనలను సడలించాం. వివిధ విభాగాలకు చెందిన 169 మంది అధికారులు, 946 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై హైడ్రాలో నియమించాలని నిర్ణయం తీసుకున్నాం.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఖరారు చేసేందుకు ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 12 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ కనీ్వనర్‌గా ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, ఐదారు జిల్లాల కలెక్టర్లు, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే ఆథారిటీ, జియోలాజికల్‌ విభాగాల అధికారులు ఉంటారు..’ అని పొంగులేటి తెలిపారు.  

8 కొత్త వైద్య కళాశాలలకు 3 వేల పైచిలుకు పోస్టులు 
‘హైదరాబాద్‌ నగరం కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి,  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేర్లను పెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని ఎస్‌పీఎల్‌ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించాం.

తెలంగాణ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మనోహరాబాద్‌ మండలంలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుకు గాను 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించాం. అలాగే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండ్రస్టియల్‌ పార్క్‌ ఏర్పాటుకు 58 ఎకరాల భూమిని రెవెన్యూ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయనున్నాం. ములుగు జిల్లా ఏటూరునాగారం ఫైర్‌ స్టేషన్‌కు 34 మంది సిబ్బందిని మంజూరు చేశాం. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 వైద్య కళాశాలలకు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 3 వేల పైచిలుకు పోస్టులను మంజూరు చేశాం. కొద్దిరోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. కోస్గికి ఇంజనీరింగ్‌ కాలేజీ, హకీంపేటకు జూనియర్‌ కళాశాల మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం..’ అని పొంగులేటి చెప్పారు.  

కాంగ్రెస్‌కు పేరొస్తుందనే ఎస్‌ఎల్‌బీసీపై నిర్లక్ష్యం: కోమటిరెడ్డి  
‘కాంగ్రెస్‌ పారీ్టకి, తనకు పేరు వస్తుందనే అక్కసుతో కేసీఆర్‌ గత 10 ఏళ్లలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. నల్లగొండ జిల్లాలో రూ.6 వేల కోట్ల మిషన్‌ భగీరథ పనులు జరిగితే, రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగింది. నల్లగొండలో ఫ్లోరైడ్‌ తగ్గిందంటూ కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి ఫ్లోరైడ్‌ తీవ్రత పెరిగినట్టు కేంద్రం నివేదిక ఇచి్చంది..’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ, డిండి పూర్తి: ఉత్తమ్‌ 
‘ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.4,637 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్‌ఎల్‌బీసీ, డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి 2027 సెపె్టంబర్‌లోగా ప్రారంభిస్తాం. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ను ఆదేశించాం.

డిండి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతుల సాధనకు, మిగిలి న 5 శాతం పనుల పూర్తికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాల్సిందిగా సీఎం సూచించారు. ఖరీఫ్‌లో సన్నాలను పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఖరీఫ్‌లో రికార్డు స్థాయి లో 1.43 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట రానుంది. వచ్చే నెలలో కొత్త తెల్లరేషన్‌ కార్డుల జారీని ప్రారంభిస్తాం. జనవరి నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తాం.. అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.

బిల్లులు రావట్లేదు సార్‌ 
కేబినెట్‌ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం తాము మంజూరు చేసిన పనులకు సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదని పలువురు మంత్రులు..సీఎం రేవంత్‌ దృష్టికి తెచి్చనట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఆయా బిల్లులు త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement