జిల్లా కేడర్‌ పోస్టుగా కానిస్టేబుల్‌  | Police Department New Zonal System Comes Into Force In Telangana | Sakshi
Sakshi News home page

జిల్లా కేడర్‌ పోస్టుగా కానిస్టేబుల్‌ 

Published Sat, Dec 11 2021 1:11 AM | Last Updated on Sat, Dec 11 2021 1:11 AM

Police Department New Zonal System Comes Into Force In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జోనల్‌ వ్యవస్థపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు అమలు చేసేందుకు పోలీస్‌ శాఖ కసరత్తు ప్రారంభించింది. కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు, జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి వరకు కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం ఆప్షన్లు తీసుకుంటోంది.

ఉద్యోగులు ఏ జిల్లా నుంచి నియమితులయ్యారు? వారి సీనియారిటీ ఎంత అనే వివరాలను పరిగణనలోకి తీసుకోవడానికే ఆప్షన్లు సేకరిస్తోంది. ఆయా జిల్లాల్లో కేడర్‌ పోస్టులు, ఖాళీలు, నియమాకాలకు రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. 

కానిస్టేబుల్‌ నుంచి డీఎస్పీ వరకు... 
పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు జిల్లా పరిధిలోకి వస్తారని, వాళ్ల రిక్రూట్‌మెంట్‌ ఆధారంగా ఏ జిల్లాలో సెలక్ట్‌ అయ్యారో ఆ జిల్లా పరిధిలోకి వస్తారని, వారి బదిలీలు సైతం ఆ జిల్లా పరిధిలోనే ఉంటాయని పోలీస్‌ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆప్షన్ల విషయంలో గందరగోళం అవసరంలేదని, ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయి నూతన జిల్లాలుగా ఏర్పడ్డ ఏ జిల్లాకైనా వాళ్లు ఆప్షన్‌ ఇచ్చుకునే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు.

అయితే హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ అధికారులు మాత్రం ఆప్షన్‌ వారి నియామకమైన ప్రాంతానికిచ్చినా వారి బదిలీలు మాత్రం రేంజ్‌ పరిధిలో ఉంటాయని, రేంజ్‌లో ఉన్న ఏ జిల్లాల్లో అయినా పనిచేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. గతంలోనూ ఇదే విధంగా ఉందని, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందన్నారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అధికారులు కూడా వారు నియామకమైన జిల్లాకు ఆప్షన్‌ ఇచ్చుకున్నా వారి పరిధిలోని జోన్‌లో ఎక్కడైనా పనిచేసే సౌలభ్యం ఉందని తెలిపారు. డీఎస్పీ ర్యాంకు అధికారులు వారు సెలక్టయిన జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకున్నా వారు మాత్రం రాష్ట్రస్థాయి అధికారులుగా ఉంటారని, కేవలం వారి సీనియారిటీకి మాత్రమే మల్టీజోన్‌ ప్రాతిపదిక అవుతుందని పేర్కొన్నారు. 

మినిస్టీరియల్‌ స్టాఫ్‌... 
మినిస్టీరియల్‌ స్టాఫ్‌లో ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ మాత్రమే జిల్లా కేడర్‌ పోస్టు కిందకి వస్తుంది. వారి సేవలను ఆ జిల్లాలోనే వినియోగించుకునేలా ఆదేశాలున్నాయి. అయితే డిప్యుటేషన్‌పై రాష్ట్రస్థాయి యూనిట్లలో కానిస్టేబుల్‌ అయినా, జూనియర అసిస్టెంట్‌ అయినా ఎక్కడైనా పనిచేయవచ్చు. సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌ హోదా వరకు జోన్‌ కేడర్‌గా ఉంటారని, వారి సేవలను పోలీస్‌ జోన్‌లో ఎక్కడైనా వినియోగించుకునే వెసులుబాటు ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.

ఇక అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు (ఏఓ) మల్టీజోన్‌ కిందకు వస్తారని, వారిని మల్టీజోన్‌ సీనియారిటీతో రాష్ట్రస్థాయిలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. ఆప్షన్‌ను కేవలం వారి జిల్లా కేటాయింపు, సీనియారిటీకే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 

ఫ్రీ జోన్‌లో రిక్రూట్‌ అయినా.. 
ఉమ్మడి రాష్ట్రంలో వివాదాస్పదమైన ఫ్రీ జోన్‌లో రిక్రూట్‌ అయిన అధికారులు వారు నియామకమైన జిల్లా ద్వారా ఆప్షన్‌ ఎంచుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ఫ్రీ జోన్‌లో హైదరాబాద్‌ స్థానికత కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్‌ జిల్లా/హైదరాబాద్‌ కమిషనరేట్‌ కేడర్‌ పరిధిలోకి వస్తారని, ఆప్షన్‌ కింద వారు దాన్నే ఎంచుకోవాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.  

రేంజ్‌లు, జోన్లు, మల్టీజోన్లు.. 
ప్రస్తుతం పోలీస్‌ శాఖలో వరంగల్‌ (నార్త్‌), హైదరాబాద్‌ (వెస్ట్‌ జోన్‌) జోన్లు ఉన్నాయి. అయితే కొత్తగా మల్టీజోన్‌–1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి ఉండగా మల్టీజోన్‌–2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు (రేంజ్‌లు) ఉండనున్నాయి. ఐజీల పర్యవేక్షణలో ఉండే ఈ రెండు మల్టీజోన్ల కింద ఏడుగురు డీఐజీలు పనిచేయనున్నారు.

ఇందులో భాగంగా కాళేశ్వరం రేంజ్‌ డీఐజీ మంచిర్యాలలో, బాసర రేంజ్‌ డీఐజీ నిజామాబాద్‌లో, రాజన్న సిరిసిల్ల రేంజ్‌ డీఐజీ కరీంనగర్‌లో, భద్రాద్రి డీఐజీ ఖమ్మం నుంచి కార్యకలాపాలు సాగించనున్నారు. అదేవిధంగా యాదాద్రి డీఐజీ రాచకొండ కమిషనరేట్‌ నుంచి, చార్మినార్‌ డీఐజీ డీజీపీ కార్యాలయంలోని పాత హైదరాబాద్‌ డీఐజీ కార్యాలయం నుంచి, జోగుళాంబ డీఐజీ మహబూబ్‌నగర్‌ కేంద్రం నుంచి కార్యకలాపాలు సాగించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement