![Telangana Gurukula educational institutes have issued notifications reserving most of the posts for women - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/28/teacher.jpg.webp?itok=VIz3B-ZG)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశంలా పరిణమించింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33శాతం పోస్టులు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీ చేస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత దక్కింది.
నూతన జోనల్ విధానం అమలు తర్వాత రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఏకంగా 9,231 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ ఈనెల 5వ తేదీన ఒకేసారి 9 నోటిఫికేషన్లను వెబ్‌నోట్ ద్వారా విడుదల చేసింది. తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లను కూడా గురుకుల నియామకాల బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చిం ది.
ప్రకటించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ద్వారా 9,210 పోస్టులు మాత్రమే భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ ఖాళీల్లో మహిళలకు ఏకంగా 77.62శాతం పోస్టులు రిజర్వ్ కావడం గమనార్హం. ఆర్ట్ టీచర్ కేటగిరీలో 2 పోస్టులు తగ్గగా... క్రాఫ్ట్ టీచర్ కేటగిరీలో 4 పోస్టులు, టీజీటీ కేటగిరీలో 14 పోస్టులు తగ్గాయి.
అక్కడా ఇక్కడా అత్యధికమే...
గురుకుల విద్యా సంస్థల్లో బాలుర గురుకులాలు, బాలికల గురుకులాలు విడివిడిగా ఉన్నాయి. రెండు కేటగిరీల్లో ఉన్న విద్యా సంస్థల్లోనూ మహిళలకు అత్యధిక పోస్టులు రిజర్వ్ అయ్యాయి. బాలికల విద్యా సంస్థల్లో ఉన్న ఉద్యోగాలన్నీ పూర్తిగా మహిళలతోనే భర్తీ చేయాలనే నిబంధన ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బాలికల గురుకుల విద్యా సంస్థల్లో 4,647 ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్‌లో ప్రకటించింది. ఇక బాలుర విద్యా సంస్థల్లో 4,563 ఉద్యోగ ఖాళీలను చూపగా... ఇందులో జనరల్ కేటగిరీకి కేవలం 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ కాగా... మిగతా 2,502 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి.
ఈ లెక్కన జనరల్ కేటగిరీకి 45.17శాతం పోస్టులు, మహిళలకు 54.83శాతం పోస్టులు దక్కాయి. నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో నియామకాల ప్రక్రియ రోస్టర్ పాయింట్ మొదటి నుంచి ప్రారంభమైంది. దీనికి తోడు మహిళలకు హారిజాంటల్ విధానంలో పోస్టుల కేటాయింపు జరగడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించినట్లయింది. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తం 9,210 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇందులో మహిళలకు 7,149 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ అయ్యాయి.
ప్రకటించిన మొత్తం పోస్టుల్లో జనరల్ కేటగిరీకి కేవలం 22.38శాతం పోస్టులు దక్కగా... మహిళలకు మాత్రం 77.62శాతం ఉద్యోగాలకు దక్కనున్నాయి. ఇక అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన వారిలో మహిళలుంటే జనరల్ కేటగిరీలోని పోస్టులు సైతం వారికి దక్కే అవకాశం ఉంది. ఈలెక్కన ప్రస్తుతం రిజర్వ్ అయిన పోస్టులకంటే మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment