బరిలో 695 మంది అభ్యర్థులు
వారిలో మహిళలు 12 శాతమే
23 శాతం మందిపై కేసులు
తొలి నాలుగు విడతల మాదిరే లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలోనూ మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వీరిలో మహిళలు 82 మందే! అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మొదటి, రెండో విడతలో 8 శాతం చొప్పున, మూడో విడతలో 9 శాతం, నాలుగో విడతలో 10 శాతం మహిళా అభ్యర్థులు పోటీ చేశారు.
ఐదో విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 18 శాతం మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి తీవ్ర అభియోగాలకు సంబంధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పారీ్టలవారీగా చూస్తే మజ్లిస్‌లో 50 శాతం, సమాజ్‌వాదీలో 40 శాతం, కాంగ్రెస్‌లో 39 శాతం, శివసేనలో 33 శాతం, బీజేపీలో 30 శాతం, టీఎంసీలో 29 శాతం, ఆర్జేడీలో 25 శాతం, శివసేన (ఉద్ధవ్)లో 13 శాతం మంది అభ్యర్థులపై తీవ్ర క్రిమినల్ కేసులున్నాయి. మొత్తమ్మీద 29 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
33 శాతం కోటీశ్వరులు
ఐదో విడత అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వరులని ఏడీఆర్ నివేదిక తెలిపింది. యూపీలోని ఝాన్సీ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అనురాగ్ శర్మ అత్యధికంగా రూ.212 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మహారాష్ట్రలోని బివాండీ స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ భగవాన్ సాంబ్రే రూ.116 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత రూ.110 కోట్లతో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (మహారాష్ట్ర ముంబై నార్త్) మూడో స్థానంలో ఉన్నారు. సురేష్ గోపీనాథ్ మాత్రే (ఎన్సీపీ–ఎస్‌పీ) రూ.107 కోట్లు, కృష్ణానంద్ త్రిపాఠీ (కాంగ్రెస్)రూ.70 కోట్లు, సంగీత కుమారీ సింగ్‌దేవ్ (బీజేపీ) రూ.67 కోట్లు, రవీంద్ర దత్తారాం వైఖర్ (శివసేన) రూ.54 కోట్లు, కపిల్ మోరేశ్వర్ పాటిల్ (బీజేపీ) రూ.49 కోట్లు, కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ) రూ.49 కోట్లు, సంజయ్ మఫత్‌లాల్ మొరాఖియా (స్వతంత్ర) రూ.48 కోట్లతో టాప్ 10లో ఉన్నారు.
విద్యార్హతలు
42 శాతం మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి పన్నెండో తరగతిలోపే. వీరిలో 21 మంది ఐదో తరగతి వరకే చదివారు. 64 మంది ఎనిమిదో తరగతి, 97 మంది పదో తరగతి గట్టెక్కారు. 50 శాతం మందికి గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యార్హతలున్నాయి. 26 శాతం మంది డిప్లోమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment