women candidates
-
Lok Sabha Election 2024: మహిళలు 10 శాతమైనా లేరు!
ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 10 శాతం కంటే తక్కువే ఉంది! ఈసారి మహిళా అభ్యర్థులు కేవలం 797 మందేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. అంటే 9.5 శాతం! తొలి విడతలో 1,618 మంది అభ్యర్థుల్లో మహిళలు 135 మంది. రెండో విడతలో 1,192 మంది అభ్యర్థుల్లో 100 మంది, మూడో విడతలో 1,352 మందిలో 123, నాలుగో విడతలో 1,717 మందిలో 170, 5వ విడతలో 695 మందిలో 82 మంది మహిళలున్నారు. పోలింగ్ జరగాల్సిన ఆరో విడతలో 869 మంది అభ్యర్థుల్లో 92 మంది మహిళలున్నారు. ఏడో విడతలో కూడా 904 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 95 మందే. మహిళా రిజర్వేషన్ల అమలుపై పారీ్టల చిత్తశుద్ధి ఏపాటితో చెప్పేందుకు ఈ ఉదంతం ఒక్కటి చాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి మొత్తం 8,337 మంది అభ్యర్థులు లోక్‌సభ బరిలో నిలిచారు. ఇంతమంది పోటీలో ఉండటం 1996 తర్వాత ఇదే తొలిసారి. 1996లో రికార్డు స్థాయిలో 13,952 మంది పోటీ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
తొలి నాలుగు విడతల మాదిరే లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలోనూ మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కలేదు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉంటే వీరిలో మహిళలు 82 మందే! అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మొదటి, రెండో విడతలో 8 శాతం చొప్పున, మూడో విడతలో 9 శాతం, నాలుగో విడతలో 10 శాతం మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఐదో విడత బరిలో ఉన్న అభ్యర్థుల్లో 23 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 18 శాతం మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాల వంటి తీవ్ర అభియోగాలకు సంబంధించిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. పారీ్టలవారీగా చూస్తే మజ్లిస్‌లో 50 శాతం, సమాజ్‌వాదీలో 40 శాతం, కాంగ్రెస్‌లో 39 శాతం, శివసేనలో 33 శాతం, బీజేపీలో 30 శాతం, టీఎంసీలో 29 శాతం, ఆర్జేడీలో 25 శాతం, శివసేన (ఉద్ధవ్)లో 13 శాతం మంది అభ్యర్థులపై తీవ్ర క్రిమినల్ కేసులున్నాయి. మొత్తమ్మీద 29 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 33 శాతం కోటీశ్వరులు ఐదో విడత అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వరులని ఏడీఆర్ నివేదిక తెలిపింది. యూపీలోని ఝాన్సీ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి అనురాగ్ శర్మ అత్యధికంగా రూ.212 కోట్ల ఆస్తులు ప్రకటించారు. మహారాష్ట్రలోని బివాండీ స్వతంత్ర అభ్యర్థి నీలేశ్ భగవాన్ సాంబ్రే రూ.116 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత రూ.110 కోట్లతో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (మహారాష్ట్ర ముంబై నార్త్) మూడో స్థానంలో ఉన్నారు. సురేష్ గోపీనాథ్ మాత్రే (ఎన్సీపీ–ఎస్పీ) రూ.107 కోట్లు, కృష్ణానంద్ త్రిపాఠీ (కాంగ్రెస్)రూ.70 కోట్లు, సంగీత కుమారీ సింగ్‌దేవ్ (బీజేపీ) రూ.67 కోట్లు, రవీంద్ర దత్తారాం వైఖర్ (శివసేన) రూ.54 కోట్లు, కపిల్ మోరేశ్వర్ పాటిల్ (బీజేపీ) రూ.49 కోట్లు, కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ) రూ.49 కోట్లు, సంజయ్ మఫత్‌లాల్ మొరాఖియా (స్వతంత్ర) రూ.48 కోట్లతో టాప్ 10లో ఉన్నారు. విద్యార్హతలు 42 శాతం మంది అభ్యర్థుల విద్యార్హత ఐదు నుంచి పన్నెండో తరగతిలోపే. వీరిలో 21 మంది ఐదో తరగతి వరకే చదివారు. 64 మంది ఎనిమిదో తరగతి, 97 మంది పదో తరగతి గట్టెక్కారు. 50 శాతం మందికి గ్రాడ్యుయేషన్, అంతకంటే ఉన్నత విద్యార్హతలున్నాయి. 26 శాతం మంది డిప్లోమా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కూతురు వెన్నెల
హైదరాబాద్: కంటోన్మెంట్ శాసనసభా నియోజకవర్గంలో వారసురాళ్లు కదన భేరికి సంసిద్ధులవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థులు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణంతో అధికార బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యరి్థగా ఆయన కుమార్తె లాస్యను ప్రకటించింది. దీంతో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం మహిళా అభ్యర్థుల వైపే మొగ్గు చూపే పరిస్థితులు ఎదురయ్యాయి. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి, ఆ వర్గం ఓటర్లపై దృష్టిపెట్టిన బీజేపీ.. ఈ ఎన్నికల్లోనే అధిక సంఖ్యలో అతివలకు టికెట్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ► ఇక కాంగ్రెస్ సైతం తమ పార్టీ తరఫున మహిళనే రంగంలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఇద్దరు మహిళా అభ్యర్థులు సుషి్మత శంకర్రావు, రజని ప్రధానంగా పోటీ పడుతుండగా, అధిష్టానం సుషి్మతకే టికెట్ కేటాయించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యరి్థగా దాదాపు ఖరారు చేసిందని తెలుస్తోంది. దీంతో కంటోన్మెంట్లో వారసురాళ్ల పోటీ అనివార్యం కానుంది. సుషి్మత తండ్రి శంకర్రావు 2009–14 మధ్య కాలంలో కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. సాయన్న 1994 నుంచి 2009లో ఒక్కసారి మినహా అయిదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గద్దర్ కుటుంబం కంటోన్మెంట్‌ను ఆనుకుని ఉండే అల్వాల్‌లో నివాసముంటోంది. బీజేపీ నుంచి సుస్మిత.. బీజేపీ నుంచి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉద్యోగి పరశురామ్, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న కపిల్ బరాబరి టికెట్ కోసం తీవ్రంగానే ప్రయతి్నస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే శంకర్రావు కుమార్తె సుషి్మతకు టికెట్ ఇప్పించడంలో ఆమె మామ వివేక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అధిష్టానం తీరుపై అసహనంతో ఉన్న వివేక్‌ను ఒప్పించే క్రమంలో బీజేపీ పెద్దలు ఆయన మేనకోడలు సుషి్మతకు టికెట్ ఖరారు చేయొచ్చనే అంచనాలున్నాయి. కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్.. కాంగ్రెస్ నుంచి స్థానిక నేతలు డీబీ దేవేందర్, నర్సింహతో పాటు పొంగులేటి అనుచరుడు పిడమర్తి, అల్వాల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జీవక పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమర్పణకు వెళ్తూ అట్టహాసంగా ర్యాలీ నిర్వహించిన సర్వే ఆ తర్వాత సైలెంటయ్యారు. తాజా సమీకరణాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం గద్దర్ కుమార్తె వెన్నెల వైపు మొగ్గు చూపినట్లు సంకేతాలు అందుతున్నాయి. తొలి మహిళా ఎమ్మెల్యే మంకమ్మ 1957లో ఏర్పడిన కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా బీవీ గురుమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 1967లో ఈ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో వి. రామారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏడాదిలోనే ఈయన మరణించడంతో ఉపఎన్నికల్లో ఆయన సతీమణి మంకమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తిరిగి 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచారు. కంటోన్మెంట్ తొలి, ఏకైక మహిళా ఎమ్మెల్యేగా రికార్డు ఆమె పేరిటే ఉంది. -
గురుకుల కొలువుల్లో ‘ఆమె’కు అందలం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మహిళా అభ్యర్థులకు అద్భుత అవకాశంలా పరిణమించింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీలో మహిళలకు 33శాతం పోస్టులు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీ చేస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. నూతన జోనల్ విధానం అమలు తర్వాత రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఏకంగా 9,231 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. ఇందులో భాగంగా టీఆర్‌ఈఐఆర్‌బీ ఈనెల 5వ తేదీన ఒకేసారి 9 నోటిఫికేషన్లను వెబ్‌నోట్ ద్వారా విడుదల చేసింది. తాజాగా పూర్తిస్థాయి నోటిఫికేషన్లను కూడా గురుకుల నియామకాల బోర్డు వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చిం ది. ప్రకటించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ద్వారా 9,210 పోస్టులు మాత్రమే భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగ ఖాళీల్లో మహిళలకు ఏకంగా 77.62శాతం పోస్టులు రిజర్వ్ కావడం గమనార్హం. ఆర్ట్ టీచర్ కేటగిరీలో 2 పోస్టులు తగ్గగా... క్రాఫ్ట్ టీచర్ కేటగిరీలో 4 పోస్టులు, టీజీటీ కేటగిరీలో 14 పోస్టులు తగ్గాయి. అక్కడా ఇక్కడా అత్యధికమే... గురుకుల విద్యా సంస్థల్లో బాలుర గురుకులాలు, బాలికల గురుకులాలు విడివిడిగా ఉన్నాయి. రెండు కేటగిరీల్లో ఉన్న విద్యా సంస్థల్లోనూ మహిళలకు అత్యధిక పోస్టులు రిజర్వ్ అయ్యాయి. బాలికల విద్యా సంస్థల్లో ఉన్న ఉద్యోగాలన్నీ పూర్తిగా మహిళలతోనే భర్తీ చేయాలనే నిబంధన ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బాలికల గురుకుల విద్యా సంస్థల్లో 4,647 ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లో ప్రకటించింది. ఇక బాలుర విద్యా సంస్థల్లో 4,563 ఉద్యోగ ఖాళీలను చూపగా... ఇందులో జనరల్ కేటగిరీకి కేవలం 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ కాగా... మిగతా 2,502 పోస్టులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఈ లెక్కన జనరల్ కేటగిరీకి 45.17శాతం పోస్టులు, మహిళలకు 54.83శాతం పోస్టులు దక్కాయి. నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రాష్ట్రంలో నియామకాల ప్రక్రియ రోస్టర్ పాయింట్ మొదటి నుంచి ప్రారంభమైంది. దీనికి తోడు మహిళలకు హారిజాంటల్ విధానంలో పోస్టుల కేటాయింపు జరగడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించినట్లయింది. గురుకుల విద్యా సంస్థల్లో మొత్తం 9,210 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇందులో మహిళలకు 7,149 పోస్టులు రిజర్వ్ కాగా... జనరల్ కేటగిరీలో 2,061 పోస్టులు మాత్రమే రిజర్వ్ అయ్యాయి. ప్రకటించిన మొత్తం పోస్టుల్లో జనరల్ కేటగిరీకి కేవలం 22.38శాతం పోస్టులు దక్కగా... మహిళలకు మాత్రం 77.62శాతం ఉద్యోగాలకు దక్కనున్నాయి. ఇక అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన వారిలో మహిళలుంటే జనరల్ కేటగిరీలోని పోస్టులు సైతం వారికి దక్కే అవకాశం ఉంది. ఈలెక్కన ప్రస్తుతం రిజర్వ్ అయిన పోస్టులకంటే మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. -
పాలు పోయడానికి వచ్చా..ఓట్లివ్వండి
26 ఏళ్ల అరితా బాబూ రోజూ తెల్లవారుజామున 4 గంటలకు లేచి పాలు పితికి 15 ఇండ్లకు పాలుబోసి ప్రచారానికి బయలుదేరుతుంది.కేరళ ఎన్నికలలో ఆమె అత్యంత పిన్న వయస్కురాలైన ఎం.ఎల్.ఏ అభ్యర్థి.పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా పాల అమ్మకాన్ని జీవనాధారం చేసుకున్న అరిత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చాక కూడాపాల వాడికీలకు వెళ్లి పాలుపోయడం మానలేదు. ‘పాలు గిన్నెలో పోసే క్షణంలోనే ఆ ఇంటి కష్టం సుఖం నాకు తెలిసిపోతాయి. ఎం.ఎల్.ఏ అభ్యర్థికి అంతకన్నా ఏం కావాలి’ అంటోంది. ఆమె ఉత్సాహం, ఊపు అక్కడ పెద్ద వార్త. నిన్న మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. అయితే ఆమె తమిళనాడు వెళ్లలేదు. కేరళకు వచ్చారు. కేరళలో కూడా చాలా నియోజకవర్గాలు ఉండగా మొదట అలెప్పుజా జిల్లాలోని కాయంకులం నియోజకవర్గానికి వెళ్లారు. ఏప్రిల్ 4న జరగనున్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అరితాబాబును తన జీప్ ఎక్కించుకుని రోడ్ షో చేశారు. ‘అరితా... నువ్వు కేరళ భవిష్యత్తువి’ అన్నారు. ఆ తర్వాత అరిత ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యం స్వీకరించారు కూడా. కేరళలో అత్యంత చిన్న వయస్కురాలైన అసెంబ్లీ అభ్యర్థిగా వార్తల్లో ఉన్న 27 ఏళ్ల అరితా బాబు హవా అది. కేరళ సినీరంగంలో గొప్ప కమెడియన్‌గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ఉన్న సలీమ్ కుమార్ అరితా బాబు నామినేషన్ వేస్తుంటే స్వయంగా వచ్చి తోడు నిలిచాడు. ఆమె గెలవాలి... అందుకు నేను సాయపడతాను అన్నాడు. అరితా బాబుది వెనుకబడిన సామాజికవర్గం. ఆమె తండ్రి కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త. వాళ్లు ఆవు పాలు అమ్ముకుని జీవిస్తుంటారు. అరితా తండ్రి ప్రభావంతో కాలేజీ రోజుల నుంచే చురుగ్గా విద్యార్థి రాజకీయాల్లో పాల్గొంది. ఆ తర్వాత యువజన కాంగ్రెస్‌లో పని చేసింది. 2015లో జరిగిన స్థానిక ఎన్నికలలో పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొంది ఐదేళ్లు పదవిలో ఉంది కూడా. సోషల్ వర్క్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అరితా తండ్రికి కేన్సర్ రావడంతో ఇంటి బాధ్యత తీసుకుంది. ఆవు పాలు పితికి ఇళ్లకు వేయడం ఆమె పని. అందుకోసం రోజూ తెల్లారి నాలుగుకు లేచి ఆరు గంటలకు పాల క్యాన్లు తీసుకుని టూ వీలర్ మీద బయలుదేరుతుంది. అలాంటి అరిత ఈసారి ఎం.ఎల్.ఏ కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పార్టీ అనుకుంది. యు.డి.ఎఫ్ అభ్యర్థిగా ఆమెను కాయంకులంలో నిలబెట్టింది. ప్రతి గడప కష్టం నాకు తెలుసు ‘పాలు పోయడానికి గడప గడప తిరిగే నాకు తెలియని కష్టం లేదు. నా నియోజక వర్గానికి ఏం కావాలో నాకు తెలుసు. ఇక్కడ టూరిజమ్ పరిశ్రమను అభివృద్ధి చేసి ఉపాధి పెంచాలి. వైద్య సదుపాయాలు కల్పించాలి. ఉపాధి పెంచడం గురించే నేను ఎక్కువ కృషి చేస్తాను’ అంది అరిత. అయితే అరితకు ఈ గెలుపు సులభమా? కాయంకులం నియోజక వర్గం నుంచి గత మూడు ఎలక్షన్లలో ఎల్.డి.ఎఫ్ అభ్యర్థులే గెలుస్తున్నారు. గత ఎలక్షన్లలో కూడా సి.పి.ఎం అభ్యర్థి అయిన ప్రతిభ గెలిచింది. ఆమెను మళ్లీ ఆ పార్టీ నిలబెట్టింది. దాంతో ఇద్దరు మహిళా అభ్యర్థులు హోరాహోరీగా పోరాడే నియోజకవర్గంగా కాయంకులంను పరిశీలకులు గుర్తిస్తున్నారు. ‘ఈసారి పార్టీ అభ్యర్థులపై రాహుల్ గాంధీ ముద్ర ఉంది. ఆయన కొత్త, యువ అభ్యర్థులకు ఎక్కువ చోటిచ్చారు. నాలాగే ‘రూపాయి లాయర్’గా పేరొందిన బి.ఆర్.ఎం.షఫీర్‌కు కూడా సీటు ఇచ్చారు. మేమంతా పరిపాలనలో ఉత్సాహంగా పాల్గొని ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాం’ అంది అరిత. ఎలక్షన్లలో డబ్బు ఖర్చు సంగతి తెలిసిందే. అరితా దగ్గర తన టూ వీలర్, కొన్ని ఆవులు తప్ప మరేం లేవు. ప్రచారం అంతా పార్టీ చూస్తోంది. ‘నేను శ్రేష్ఠమైన పాలు పోస్తాను. కనుక కల్తీ లేని పాలన కూడా అందిస్తానని నా నియోజకవర్గం ప్రజలు భావించి నాకు ఓట్లు వేస్తారన్న నమ్మకం ఉంది’ అంది అరితా. ఆమె గెలుపు ఏమయ్యిందో ఇంకో పది రోజుల్లో తెలుసుకుందాం. -
నారి.. విజయ విహారి
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 15 మందికి, టీడీపీ 19 మంది మహిళలకు టికెట్లు కేటాయించాయి. వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసిన 15 మందిలో 13 మంది విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీ చేసిన 19 మందిలో రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని ఒక్కరే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా మొత్తం 187 మంది పోటీ చేయగా 14 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున మొత్తం 15 మంది పోటీ చేయగా 13 మంది విజయం సాధించారు. పాతపట్నం నుంచి రెడ్డిశాంతి, పాలకొండ (ఎస్టీ) నుంచి విశ్వసరాయ కళావతి, కురుపాం(ఎస్టీ) నుంచి పాముల పుష్పా శ్రీవాణి, పాడేరు (ఎస్టీ) నుంచి కె. భాగ్యలక్ష్మి, రంపచోడవరం (ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి, కొవ్వూరు (ఎస్సీ) నుంచి తానేటి వనిత, ప్రత్తిపాడు (ఎస్సీ) నుంచి మేకతోటి సుచరిత, చిలకలూరిపేట నుంచి విడదల రజిని, పత్తికొండ నుంచి కె. శ్రీదేవి, సింగనమల (ఎస్సీ) నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ, నగరి నుంచి ఆర్.కె. రోజా, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. విశాఖపట్నం తూర్పు నుంచి ఎ.విజయనిర్మల, పెద్దాపురం నుంచి తోట వాణి ఓడిపోయారు. అలాగే అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి సత్యవతి, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వంగా గీత, అరకు లోక్‌సభ స్థానం నుంచి గొడ్డేటి మాధవి విజయం సాధించారు. -
ఈసారి మహిళా అభ్యర్థులు ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, బిహార్ ప్రాంతాల్లోని 51 లోక్‌సభ సీట్లకు ఐదవ విడత పోలింగ్ జోరుగా సాగుతుంది. మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 12 శాతం మంది మహిళలు ఉండడం విశేషం. మొత్తం ఏడు విడతల్లో అతి తక్కువ సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతుండగా, ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతలకన్నా ఈ విడత పోలింగ్‌లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉండడం విశేషమని ఎన్నికల కమిషన్ వివరాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్ 11న జరిగిన తొలి విడత పోలింగ్‌లో 69 శాతం పోలింగ్, ఏప్రిల్ 18వ తేదీన జరిగిన రెండో విడత పోలింగ్‌లో 68 శాతం, ఏప్రిల్ 23న జరిగిన మూడో విడత పోలింగ్‌లో 66.04 శాతం, నాలుగో విడత పోలింగ్‌లో 64 శాతం పోలింగ్ నమోదయింది. బిహార్ సీతమరాహి, మధుబని, ముజఫర్‌పూర్, శరణ్, ఆజిపూర్ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఐదు సీట్లను ఎన్డీయేనే కైవసం చేసుకుంది. ఈ సారి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, హిందుస్థానీ హవామ్ మోర్చా సెక్యులర్, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీలతో కూడిన మహా కూటమి పోటీ చేస్తోంది. జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తవగా, ఈ రోజు మూడవ విడత పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరఫున గులామ్ అహ్మద్ మీర్, నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున హస్నైన్ మసూది, బీజేపీ తరఫున సోఫి మొహమ్మద్ యూసఫ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మెహబూబా ముఫ్తీ విజయం సాధించారు. జార్ఖండ్ కోడెర్మా, రాంచి, కుంతీ, హజారీబాగ్–నాలుగు సీట్లకు ఈరోజు పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నాలుగు సీట్లకు బీజేపీయే ప్రాతినిధ్యం వహిస్తోంది. ఒక్క హజారీబాగ్‌లో తప్పించి మూడు సీట్లలో బీజేపీ కొత్తవారినే పోటీకి దింపింది. మధ్యప్రదేశ్ బోతుల్, దమోహ్, హోషంగబాద్, ఖజూరహో, రేవా, సాత్నా, తికాంగఢ్ స్థానాలకు ఈ రోజు పోలింగ్. వీటిల్లో రేవా నియోజకవర్గం కీలకమైనది. ఇక్కడ ముగ్గురు ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ జనార్దన్ మిశ్రా, కాంగ్రెస్ తరఫున సిద్ధార్థ్ తివారీ, సీపీఎం తరఫున్ గిరిజేష్ సింగ్ సెంగార్ పోటీ పడుతున్నారు. రాజస్థాన్ అల్వార్, దౌసా ముఖ్యస్థానాలతోసహా 12స్థానాలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతోంది. మూక హత్యలు, గోరక్షక దాడులతో అల్వార్ ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది. ఈ సీటుకు బీజేపీ మత ప్రచారకుడు బాలక్‌నాథ్‌ను రంగంలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రి జతేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది. ఇక దౌసా నియోజకవర్గం నుంచి ప్రధానంగా ఇద్దరు మహిళలు పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున జస్ కౌర్ మీనా, కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మురారీ లాల్ మీనా భార్య సవితా మీనా పోటీ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ మొత్తం 80 సీట్లకుగాను ఈ రోజు 14 సీట్లకు పోలింగ్ కొనసాగుతోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో వీటిల్లో 12 సీట్లను బీజేపీయే కైవసం చేసుకొంది. వీటిల్లోని అమేథీ, రాయబరేలి సీట్లను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు గెలుచుకున్నారు. అమేథిలో ఈసారి రాహుల్ గాంధీపై బీజేపీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తుండగా, సోనియా గాంధీపై బీజేపీ అభ్యర్థిగా మాజీ కాంగ్రెస్ నాయకుడు దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ శ్రీరాంపూర్, హూగ్లీ, ఆరమ్బాగ్, హౌరా, బారక్పూర్, ఉల్బేరియా, బాంగావ్ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. అంతకుముందు పోలింగ్ జరిగిన నియోజక వర్గాల్లో హింసాకాండ చెలరేగడంతో ఈసారి ఎన్నికల కమిషన్ ఈ అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. -
ఎవరికో.. ఆ రెండు పీఠాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లా పరిషత్‌లపై కన్నేసిన టీఆర్ఎస్ నాయకత్వం చైర్పర్సన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఇప్పటికే ప్రకటించగా, మిగతా మూడు జిల్లాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక నుంచి గెలిపించుకునే దాకా బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రులకు అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటేనే చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పెద్దపల్లి జెడ్పీ చైర్పర్సన్ రిజర్వేషన్ కేటగిరీలో బీసీ జనరల్‌కు కేటాయించడంతో పుట్ట మధు ఎంపిక సులభమైంది. ఓడిపోయిన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావించడంతో ఆయన పేరును ముందే ప్రకటించారు. కమాన్‌పూర్ జెడ్పీటీసీగా ఆయన పోటీ చేయనున్నారు. జగిత్యాలలో తుల ఉమకే అవకాశం ఉమ్మడి జిల్లా పరిషత్ చివరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు కొనసాగిన తుల ఉమ ఈసారి జగిత్యాల జిల్లాకే పరిమితం కానున్నారు. బీసీ జనరల్‌కు కేటాయించిన జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి టీఆర్ఎస్ నాయకుడు బాలినేని రాజేందర్, మల్యాల సర్పంచి మిట్టపల్లి సుదర్శన్ కూడా పోటీ పడుతున్నారు. రాజేందర్ సతీమణి రాజ్యలక్ష్మి ప్రస్తుతం జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. కాగా ఈసారి బీసీ జనరల్ సీటుగా మారిన కొత్త మండలం బుగ్గారం నుంచి రాజేందర్ పోటీ చేస్తున్నారు. మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్ కూడా ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని భావిస్తున్నారు. సిట్టింగ్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న తుల ఉమ పట్లనే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాదరహితురాలుగా ఐదేళ్లు కరీంనగర్ జెడ్పీని నడిపించిన తుల ఉమకే మరోసారి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఆమె కథలాపూర్ మండలం నుంచి పోటీ చేయనున్నారు. సిరిసిల్లపై తేల్చని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వుడ్ కావడంతో ఇక్కడ నుంచి రాజకీయంగా ఎదగాలని భావించిన నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లతోపాటు వేములవాడ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండగా, ఎక్కడి నుంచి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట నుంచి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి భార్య అరుణ పోటీ చేస్తున్నారు. ఆమెకు అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గం తంగెళ్లపల్లి నుంచి సిట్టింగ్ జెడ్పీటీసీ పి.మంజుల కూడా మరోసారి పోటీ చేస్తున్నారు. మంజుల సైతం జెడ్పీ చైర్పర్సన్ బరిలో నిలువనున్నారు. కేటీఆర్ ఎవరి పేరు చెపితే వారే ఇక్కడ జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. కరీంనగర్లో కుదరని రిజర్వుడు లెక్కలు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, ఈ కేటగిరీలో రెండు జెడ్పీటీసీలు మాత్రమే జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ నిర్ణయం మీదనే జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి ఆధారపడి ఉంది. హుజూ రాబాద్ నియోజకవర్గంలోని కొత్త మండలం ఇల్లందకుంట, చొప్పదండి మండలాలు ఎస్సీ మహిళకు రిజర్వు చేయబడ్డాయి. ఇల్లందకుంట నుంచి కనుమల విజయను జెడ్పీటీసీగా ఇప్పటికే ఎంపిక చేశారు. ఆమెను జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. మరో మండలం చొప్పదండిలో ఎమ్మెల్యే రవిశంకర్ భార్య జీవన పోటీ చేస్తారని, ఆమెకే జెడ్పీ అధ్యక్షురాలి అభ్యర్థిత్వం ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కాగా బుధవారం ఎమ్మెల్యే రవిశంకర్ తన భార్య పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. చొప్పదండిలో స్థానికులకే అవకాశం లభిస్తుందని చెప్పారు. మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఆరెపల్లి మోహన్ సతీమణిని ఎస్సీ జనరల్ నుంచి గానీ జనరల్ స్థానం నుంచి గాని పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వడం లేదు. చొప్పదండి నుంచి స్థానిక టీఆర్ఎస్ నాయకులు తమ సతీమణులను పోటీలో నిలిపేందుకు పోటీ పడుతున్నా, జెడ్పీ పీఠంపై కూర్చొనే అనుభవం ఉన్నవారు లేకపోవడం గమనార్హం. -
రెండుసార్లు పోటీ.. ఒకసారి గెలుపు
సాక్షి, మధిర: మధిర శాసనసభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నాడు మధిర నియోజకవర్గంలో మధిర, బోనకల్, ఎర్రుపాలెం, వైరా, తల్లాడ మండలాలు ఉండేవి. మొదటినుంచి మధిర నియోజకవర్గంలో పురుషుల ఓట్లకంటే మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో మధిర అసెంబ్లీ స్థానం నుంచి మొట్టమొదటిసారిగా 1972వ సంవత్సరంలో దుగ్గినేని వెంకట్రావమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. ఆమె మధిర మండలం ఇల్లూరు గ్రామానికిచెందినవారు. ఈ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీచేసిన బోడేపూడి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఆమెకు 40,799ఓట్లు రాగా బోడేపూడికి 23,457 ఓట్లు వచ్చాయి. దీంతో 17,342 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. దీంతో మొట్టమొదటిసారిగా మధిరనుంచి ఎమ్మెల్యేగా ఒక మహిళ ప్రాతినిధ్యం వహించినట్లయింది. వెంకట్రావమ్మ విజయవాణి 2009 ఎన్నికల్లో నూతనంగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎర్రుపాలెం మండలం పెగళ్లపా డు గ్రామానికి చెందిన సగ్గుర్తి విజయవాణి పోటీచేశారు. ఆమె పెద్దపల్లి డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో పోటీచేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,59,985 ఓట్లు పోలవ్వగా అందులో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసిన విజయవాణికి 14,615 ఓట్లు వచ్చాయి. ఓటమి చెందిన తరువాత తిరిగి ఉద్యోగంలో చేరలేదు. ప్రస్తుతం వారు రాజకీయాల కు దూరంగా ఉంటూ మం చిర్యాలలో స్థిరపడ్డారు. -
మహిళా అభ్యర్ధులపై కమల్‌నాథ్ వ్యాఖ్యల కలకలం
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీ తలపడుతున్న కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. మహిళా అభ్యర్ధుల ఎంపికపై ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టికెట్ల పంపిణీపై విలేకరుల సమావేశంలో కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహిళా అభ్యర్ధులకు కాంగ్రెస్ పెద్దపీట వేయకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా గెలుపు ప్రాతిపదికనే తాము వారికి టికెట్లు కేటాయించామని, కేవలం కోటా కోసమో, డెకరేషన్ కోసమో ఎంపిక చేయలేదని వ్యాఖ్యానించారు. దీంతో మహిళలను అలంకారప్రియులుగా కమల్‌నాథ్ చిత్రీకరించారంటూ బీజేపీ భగ్గుమంటోంది.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు కమల్‌నాథ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మరోవైపు ఆరెస్సెస్ శాఖా సమావేశాలకు ప్రభుత్వ అధికారులు హాజరు కావడాన్ని నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడంపై కూడా బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. -
మహిళలకు ఏవీ.. టికెట్లు?
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళా ఎమ్మెల్యేలు లేని లోటు కన్పిస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏ పార్టీ కూడా మహిళలకు టికెట్లు కేటాయించలేదు. దీంతో ఈసారైనా మహిళా ఎమ్మెల్యే ఎన్నికవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గ్రేటర్లో 35,24,088 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీలో ఏకంగా 76 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. కానీ తాజాగా రద్దయిన శాసనసభలో గ్రేటర్లో ఒక్క మహిళకు స్థానం లేని విషయం తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు జాబితాలు ప్రకటించిన టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్క స్థానం కూడా మహిళకు కేటాయించలేదు. దీంతో ఆయా పార్టీల్లోని మహిళా నేతలు రెండో∙జాబితాపై చివరి ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కార్పొరేటర్లు పి.విజయారెడ్డి, గద్వాల విజయలక్ష్మిలు ఖైరతాబాద్ శాసనసభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ నియోజకవర్గ రాజకీయాల్లో పూర్తి క్రియాశీలకంగా ఉన్నారు. విజయారెడ్డి 2014లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి 25 వేల వరకు ఓట్లు సంపాదించారు. అంబర్‌పేటలో మరో కార్పొరేటర్ కాలేరు పద్మావతి టికెట్ రేసులో సీరియస్‌గా ఉన్నారు. ఐతే టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వకపోవటంతో రెండో జాబితాలోనైనా తమకు తప్పకుండా స్థానం లభిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. కాంగ్రెస్‌లోనూ బోలెడు మంది ప్రతి ఎన్నికల్లోనూ మహిళలకు స్థానాలు కేటాయించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ మారు కొనసాగిస్తుందన్న ఆశాభావాన్ని మహిళా నేతలు వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, సికింద్రాబాద్ నుండి మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, మేరీ రవీంధ్రనాథ్లు ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలంగా సికింద్రాబాద్ స్థానాన్ని మహిళలకు కేటాయిస్తూ వస్తుండటంతో ఈ మారు మహిళా నేతలు టికెట్ తమకే ఖాయమన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ–ఎంఐఎంలలోనూ ఆశావహులు భారతీయ జనతా పార్టీలో సైతం ఈమారు మహిళా అభ్యర్థుల పోటీ ఎక్కువైంది. సనత్‌నగర్ నుండి మహిళా మోర్చ నాయకులు విజయ, చాంద్రాయణగుట్టలో సయ్యద సహజాదిలు టికెట్లు ఆశిస్తున్నారు. ఎంఐఎం 1989 తర్వాత మళ్లీ మహిళలకు శాసనసభ టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఐనా ఈసారి కార్వాన్, జూబ్లిహిల్స్ స్థానాల్లో ఆశావహులున్నారు. గతంలో ఘనం... హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తొలి శాసనసభలోనే నగరం నుండి తొలి మహిళా ఎమ్మెల్యే శాలిబండ నుండి ఎన్నికయ్యారు. తదనంతరం నగరం నుండి ఖచ్చితంగా మహిళా ప్రాతినిథ్యంటూ వస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం సంప్రదాయానికి భిన్నంగా మహానగరం నుండి శాసనసభకు మహిళల ప్రాతినిధ్యం లేకపోవటం గమనార్హం. హైదరాబాద్ స్టేట్ శాసనసభకు 1951లో జరిగిన తొలి ఎన్నికల్లోనే శాలిబండ నియోజకవర్గం నుండి మైనారిటీ మహిళ మసూమబేగం తొలి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టగా ఆ తర్వాత కాలంలో అనేక మంది మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. ఆయా రాజకీయ పక్షాలు సైతం నగరంలో మహిళలకు తప్పకుండా టికెట్లు ఇచ్చే ఆనవాయితీని కొనసాగించారు. 1957లో పత్తర్‌ఘట్టీ నుండి మసూమాబేగం విజయం సాధించారు.1962లో జూబ్లీహిల్స్ నుండి రోడామిస్త్రీ, హైదరాబాద్ ఈస్ట్ నుండి సుమిత్రాదేవిలు విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సుమిత్రాదేవి, సరోజినిపుల్లారెడ్డి, మంకమ్మ, ఉమా వెంకట్రాంరెడ్డి, లక్ష్మీకాంతమ్మ, కాట్రగడ్డ ప్రసూన, మేరీ రవీంధ్రనాథ్, మణెమ్మ అంజయ్య, సబితా ఇంద్రారెడ్డి, జయసుధలు విజయం సాధించి నగరానికి ప్రాతినిథ్యం వహించారు. గడిచిన ఎన్నికల్లో ఆయా ప్రధాన పార్టీలు మహిళలకు కనీస టికెట్లు ఇవ్వని అంశం ఈమారు కూడా పునరావృతం అవుతుందా లేక..పాత సంప్రదాయం కొనసాగుతుందా వేచి చూడాలి మరి. -
ఓ మహిళా నువ్వెక్కడ ?
సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో సగం అంటున్నారు కానీ మహిళలకు అవకాశాలు అంతంత మాత్రమే. రాజకీయ రంగంలోనైతే అవకాశాలు నామమాత్రమేనని కర్ణాటక ఎన్నికల ముఖచిత్రాన్ని చూస్తే స్పష్టమవుతుంది. ఓటర్లు చూస్తే సగం మంది మహిళలే ఉన్నారు కానీ కర్ణాటకలో ప్రధాన పార్టీలన్నీ టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు మొండి చెయ్యి చూపించాయి. కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలది అదే తీరు. కర్ణాటక అసెంబ్లీలో మహిళా ఓటర్లు 49 శాతం మంది ఉన్నారు కానీ టిక్కెట్ల విషయానికొచ్చేసరికి వారికి మొండి చెయ్యే ఎదురైంది. కర్ణాటకలో ఓటర్ల సంఖ్య 4.96 కోట్లు ఉంటే వారిలో 2.44 కోట్ల మంది మహిళలే. గత ఎన్నికలతో పోల్చి చూస్తే మహిళా ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 2.13 కోట్ల మంది మహిళలు ఉంటే, 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి వారి సంఖ్య 2.26 కోట్లకు పెరిగింది. కానీ చట్టసభల్లో అడుగు పెట్టే మహిళల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. ఈ సారి ప్రధాన పార్టీలన్నీ మహిళా అభ్యర్థులకు నిరాశనే మిగిల్చాయి. కాంగ్రెస్ పార్టీ 16 మంది మహిళలకు (7 శాతం) టిక్కెట్లు ఇస్తే, బీజేపీ కేవలం ఆరుగురికి ఇచ్చింది. ఇక జనతాదళ్ నలుగురికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. మిగిలిన పార్టీలతో పోల్చి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మందికి టిక్కెట్లు ఇచ్చినా, వారిలో మరణించిన ఎమ్మెల్యేల భార్యలు, వారి వారసులే ఉన్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుమార్తెలు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మృతి చెందిన ఖమరూల్ ఇస్లామ్, మహదేవ్ ప్రసాద్ భార్యలు, రుద్రేష్ గౌడ కుమార్తె, ఎమ్మెల్యే ఆర్. రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి ఇలా ప్రముఖులకే టిక్కెట్లు దక్కాయి తప్ప, పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి పని చేస్తున్న వాళ్లకి ఎప్పట్లాగే ఈ సారి కూడా నిరాశే మిగిలింది. మహిళలకైతే మొండి చెయ్యి చూపించారు కానీ వారి ఓట్లను ఆకర్షించడానికి మాత్రం అన్ని పార్టీలుపోటీ పడుతున్నాయి. చీరలు, నగలు, గృహోపకరణాలు వంటివి అన్ని రాజకీయ పార్టీలు భారీగా పంచుతున్నాయి. ఎన్నికల సంఘం నిఘాలో ఈ విషయం బయటకొచ్చింది. మైసూరు ప్రాంతంలో 8 కోట్ల విలువ చేసే గృహోపకరణాలున్న రెండు లారీలను ఈసీ సీజ్ చేసింది. అదే విధంగా 1.5 కోట్ల రూపాయలు విలువైన కుక్కర్లు, ఐరన్ బాక్స్‌లను కూడా స్వాధీనం చేసుకుంది. మొత్తం ఓటర్లలో మహిళల శాతం 49 పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లాలు రాయచూరు, ఉడుపి, రామానగర, దక్షిణ కన్నడ, కొడగు ఎక్కువ మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులగానే పోటీ 1957లో 24 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తే, 2013 వచ్చేసరికి వారి సంఖ్య 175కి పెరిగింది. 2013 ఎన్నికల్లో మొత్తం 2,945 అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగితే వారిలో 175 మంది (6శాతం) మాత్రమే మహిళలు. కాంగ్రెస్ ఎనిమిది, బీజేపీ ఏడుగురు, జేడీ(ఎస్)12 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. ఇక స్వతంత్రఅభ్యర్థులుగా 67 మంది పోటీ చేశారు. 2013లో అసెంబ్లీలోకి అడుగు పెట్టింది ఆరుగురు మహిళలు మాత్రమే కర్ణాటక ఎన్నికల్లో పురుషులదే ఆధిపత్యం కర్ణాటకలో మొదట్నుంచి ప్రధాన పార్టీలన్నీ మహిళలకు టిక్కెట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. తమ ఉనికిని కాపాడుకోవడానికి మహిళలే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీంతో విజయం సాధించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ప్రతీ పది మంది మహిళా అభ్యర్థుల్లో తొమ్మిది మందిని ఓటర్లు ఇంటిముఖం పట్టిస్తున్నారు. ఎక్కడైనా ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కర్ణాటకలో పరిస్థితి దానికి భిన్నం. చిన్నా చితక పార్టీల నుంచి పోటీచేయడం, లేదంటే స్వతంత్రంగానే బరిలోకి దిగుతూ ఉండడంతో సక్సెస్ రేటు ఉండడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చాలా రాష్ట్రాలతో పోల్చి చూస్తే కర్ణాటక రాజకీయాల్లో మహిళల పాత్ర చాలా పరిమితంగా ఉంది. విద్యావంతులు, సామాజిక సేవలో ఉన్న మహిళలు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సంవత్సరం మహిళా అభ్యర్థులు గెలిచినవారు 1989 79 10 1994 117 7 1999 62 6 2004 107 6 2008 107 3 2013 175 6 -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అన్నింటా ముందే, అయినా ఇదేమీ శాపం!
సాక్షి, న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు గత నెల జరిగిన ఎన్నికల్లో దాదాపు 90 శాతం పోలింగ్ జరగడం విశేషం. ఓటర్లు సృష్టించిన ఈ తుపానుకు త్రిపురలో వామపక్ష ప్రభుత్వం తుడుచుపెట్టుకుపోగా, నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అనే కొత్త పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈసారి పోలింగ్‌లో మహిళలు విశేషంగా పాల్గొన్నప్పటికీ ఎప్పటిలాగా కనిపించని మార్పు ఒక్కటే. అదే మహిళల ప్రాతినిధ్యం. త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ముగ్గురేసి మహిళలు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, ఎప్పటిలాగే నాగాలాండ్‌లో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది స్వతంత్య్ర సభ్యులు సహా మొత్తం 60 మంది మహిళలు పోటీ చేశారు. వారు కేవలం ఆరుగురు మాత్రమే విజయం సాధించారు. మహిళల ప్రాతినిథ్యం విషయంలో మొదటి నుంచి ఈ రాష్ట్రాల పరిస్థితి అలాగే ఉంది. 1960వ దశకం నుంచి ఇప్పటి వరకు ఈ మూడు రాష్ట్రాల్లో 307 మంది మహిళలు పోటీ చేయగా, వారిలో 44 మంది మాత్రమే విజయం సాధించారు. 2013 సంవత్సరంతో పోలిస్తే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిథ్యం తగ్గింది. 2013లో తొమ్మిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, ఈసారి ఆరుగురు మహిళలు మాత్రమే విజయం సాధించారు. మేఘాలయలో మాజల్ అంపారిన్ లింగ్డో, దిక్కాంచిసిర అనే మహిళలు తమ స్థానాలను తిరిగి గెలుచుకోగా, మాజీ కేంద్ర మంత్రి పీఏ సంగ్మా కూతురు అగాథా సంగ్మా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. త్రిపురలో ప్రభుత్వం వ్యతిరేక ఓటును తట్టుకొని సీపీఎం తరఫున బిజితా నాథ్ అనే మహిళ మాత్రమే విజయం సాధించారు. మిగతా ఇద్దరు కళ్యాణి రాయ్, శంతన చక్మా బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ఇక నాగాలాండ్‌లో ప్రధాన రాజకీయ పార్టీలేవీ మహిళలను పోటీకి నిలబెట్టలేదు. ఎక్కువ మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒక్కరు కూడా విజయం సాధించలేదు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం అంతో ఇంతో పెరుగుతుండగా, ఈశాన్య రాష్ట్రాల్లో రానురాను తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మహిళల ప్రాతినిథ్యం 7. 6 శాతం ఉండగా, నాగాలాండ్‌లో జీరో, హర్యానాలో అత్యధికంగా 14.4 శాతం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోవడానికి రెండు కారణాలు చెబుతారు. ఒకటి రాజకీయాల్లో మహిళలకు తగిన అనుభవం లేదన్నది ఒక్కటైతే మగవాళ్లలో పోలిస్తే మహిళలకు రాజకీయాల్లో బలహీనులని, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, సమర్థపాలన అందించడంలో వారు పోటీ పడలేరన్నది రెండో కారణం. అయితే గత 15 ఏళ్లలో మహిళా ఎమ్మెల్యేల చేపట్టిన పనులను పరిశీలిస్తే వారే మగవారికన్నా ఎక్కువ రాణించారు. పలు నియోజక వర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నప్పటికీ, పలు ప్రచార ర్యాలీల్లో మహిళలే ఎక్కువ క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలు గెలవక పోవడం చిత్రమైన పరిస్థితి. అది వారికో శాపంలా పరిణమించింది. -
తొలిసారి ఐదుగురు మహిళల పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : నాగాలాండ్ అసెంబ్లీకి ఈనెల 27న జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి ఐదుగురు మహిళలు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలోని మొత్తం 60 సీట్లకుగాను 2.56 శాతం సీట్లకే మహిళలు పోటీ పడుతున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఎక్కువ సంఖ్యలో మహిళలు పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారి అంటే ఆశ్చర్యం కలగకమానదు. నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి ఇద్దరు, కొత్తగా ఏర్పాటైన నేషనలిస్ట్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ఒకరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తుండగా, మరొకరు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నిరాటంకంగా పాలిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఒక్క మహిళ కూడా పోటీ చేయక పోవడం కూడా ఆశ్చర్యకరమే. 1963లో నాగాలాండ్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు 19 మంది మహిళలు పోటీ చేయగా, ఇంతవరకు ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఇంతవరకు నాగాలాండ్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికల్లో పోటీచేసి ఒకే ఒక మహిళ విజయం సాధించారు. 1977లో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి రానో ఎం సాయిజ్ విజయం సాధించారు. ఆ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మొదటి మహిళ కూడా ఆమెనే. ఆమే ప్రముఖ నాగా వేర్పాటువాద నాయకుడు ఏజెడ్ పీజో మేనకోడలు. ఆమె 2015లో మరణించారు. మగవారితో సమానంగా ప్రత్యర్థి సైనికులతో పోరాడడమే కాకుండా తెల్లవారక ముందే కొండ కోనల్లో కష్టమైన పనులకు వెళ్లే అలవాటు, సామాజిక సంస్థల్లో క్రియాశీలక పాత్ర వహించే నాగా మహిళలు ఎన్నికల పట్ల అంతగా ఆసక్తి చూపక పోవడం, ఎన్నికల్లో రాణించక పోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఒక్క నాగాలాండ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అసెంబ్లీలలో మహిళ ప్రాతినిధ్యం తొమ్మిది శాతం దాటడం లేదు. గతేడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 4,800 మంది పోటీ చేయగా, 446 మంది మహిళలు, పంజాబ్‌కు 1145 మంది పోటీ చేయగా, వారిలో 81 మంది, ఉత్తరాఖండ్‌కు 637 మంది పోటీ చేయగా, వారిలో 58 మంది, గోవాకు 250 మంది పోటీ చేయగా, వారిలో 18 మంది, మణిపూర్‌కు 266 మంది పోటీ చేయగా, వారిలో 11 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అస్సాం, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఫర్వాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎనిమిది శాతం మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2013లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నాగాలండ్‌లో కూడా పోటీచేసే మహిళల సంఖ్య 1.6 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పిస్తే వారి ప్రాతినిథ్యం పెరుగుతుందని వాదించేవారు లేకపోలేదు. నాగాలాండ్‌లో గతేడాది ప్రాంతీయ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించినప్పుడు పెద్ద గొడవ జరిగింది. అది హింసకు దారితీయడమే కాకుండా రాష్ల్రముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు వెళ్లింది. ఒక్క మహిళలే రిజర్వేషన్లనే కాదు, అన్ని రకాల రిజర్వేషన్లకు నాగాలాండ్ ఆదివాసీ తెగలు వ్యతిరేకం. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న విషయాన్ని కూడా ఎక్కువగా స్థానిక సంఘాలే నియమిస్తాయి. కనుక మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది. -
లక్కీచాన్స్
టెట్‌లో అర్హత సాధించిన బీఈడీ, డీఈడీ మహిళా అభ్యర్థులకు టీఆర్టీ రూపంలో అదృష్టం వేచిచూస్తోంది. టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం.. ఇందులో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం మహిళలకు వరంగా మారింది. దీనికి తోడు జనరల్ కోటాలో వీరు పోటీ పడనుండడంతో వీరికి మరిన్ని సీట్లు పెరిగే ఆస్కారం ఉంది. జిల్లాలో మొత్తం 820 పోస్టులకు గాను సుమారు 270 పోస్టులు మహిళలకు రిజర్వు కానున్నాయి. ఉద్యోగంపై నమ్మకం ఏర్పడింది టీఆర్టీలో మహిళల కోటా ఎక్కువగా ఉండటంతో ఈ సారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. డీఎస్సీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళలకు ఇది సదావకాశం. కోటాను సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలి. – మాధవి, వికారాబాద్ సాక్షి, వికారాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులు ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం లభించింది. టీచర్ పోస్టుల భర్తీకిగాను సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో మాదిరిగా జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో కాకుండా పోస్టుల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించింది. డీఎస్సీ బదులు టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పేరుతో పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన విధంగా జిల్లాలో 820 పోస్టులు ఉన్నట్లు లెక్కతేల్చారు. వీటిలో 33 శాతం మంది మహిళా అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించారు. దీంతో సుమారు వీరికి 270 పోస్టులు ప్రత్యేకంగా దక్కనున్నాయి. తమకు కేటాయించిన పోస్టులతో పాటుగా జనరల్ కేటగిరీలోనూ మహిళలు ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల ఆధారంగా మహిళలకు ఎక్కువ శాతం పోస్టులను కేటాయించారు. దీంతో జిల్లాలో ఎక్కువ మంది పంతులమ్మలు దర్శనమివ్వనున్నారు. మహిళలు చదువుకుంటే భవిష్యత్‌లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఖాళీలే నిదర్శనమని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. టెట్‌లో మహిళల ఉత్తీర్ణతే అధికం.. టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత సాధించిన వారిలో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సుమారుగా 3,500 వరకు ఉండవచ్చని అంచనా. గత ఆగస్టులో నిర్వహించిన టెట్‌లో అన్ని విభాగాల్లో కలిపి 2,468 మంది అర్హత సాధించారు. పేపర్ – 1లో 1,683 మంది అభ్యర్థులు పాస్‌కాగా, పేపర్– 2లో సోషల్ స్టడీస్‌లో 490 మంది అభ్యర్థులు, గణితం మరియు సైన్స్ విభాగాల్లో 295 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో కూడా రిజర్వేషన్, జనరల్ కేటగిరీల్లో కలిపి పురుషులకంటే ఎక్కువ మంది మహిళలే ఉద్యోగాలను కైవసం చేసుకునే అవకాశముంది. మంచి అవకాశం.. ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మహిళలకు మంచి అవకాశాలున్నాయి. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులు 528 ఉండగా, వాటిలో 346 జనరల్ కేటగిరీకి కేటాయించారు. వీటిలో 182 పోస్టులు మహిళలకు రిజర్వుచేశారు. ఎస్ఏ (స్కూల్ అసిస్టెంట్) పోస్టులు జిల్లాలో 135 ఉండగా, వీటిలో జనరల్ కేటగిరీకి 63 పోస్టులను రిజర్వు చేశారు. మహిళలకు 72 పోస్టులను కేటాయించారు. దీంతో ఎస్ఏ పోస్టుల్లో జనరల్ పోస్టులకంటే మహిళలకే 9 పోస్టులను అధికంగా రిజర్వ్ చేశారు. భాషా పండితుల పోస్టుల విషయానికొస్తే తెలుగు పండిత్ విభాగానికి సంబంధించి 54 ఖాళీలు ఉండగా, వీటిలో 32 జనరల్ కేటగిరీకి కేటాయించగా, మహిళలకు 24 పోస్టులను రిజర్వు చేశారు. ఉర్దూ మీడియంలో 30 పోస్టులు ఉండగా, వీటిలో 14 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఆంగ్ల మాధ్యమంలో 35 పోస్టులు ఉండగా, జనరల్ కేటగిరీకి 19 పోస్టులు, మహిళలకు 16 ఖాళీలను రిజర్వు చేశారు. హిందీ పండిత్ ఖాళీలు జిల్లాలో 29 ఉండగా, వీటిలో జనరల్ కేటగిరీకి 32 పోస్టులు, మహిళలకు 22 పోస్టులను కేటాయించారు. పీఈటీ పోస్టులు జిల్లాలో మొత్తం 6 ఉండగా, జనరల్ కేటగిరీకిలో 2 పోస్టులు, మహిళలకు 4 పోస్టులను రిజర్వు చేశారు. పీఈటీలలో పురుషుల కంటే రెండు పోస్టులు మహిళలకే ఎక్కువగా కేటాయించడం విశేషం. -
మహిళలు..మహరాణులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పురుషుని జీవితంలో స్త్రీ సగభాగం అనే రోజులు దాటిపోయి స్త్రీ పురుషుల సమానత్వం సాగుతున్న దశలో రాజకీయ పార్టీలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. ఎన్నికల రంగంలోకి మహిళా అభ్యర్థులను దించడంలో డీఎంకే, అన్నాడీఎంకే పోటీపడుతున్నాయి. అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అన్నాడీఎంకే ముందంజలో నిలిచి ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో అన్నాడీఎంకే పోటీ చేస్తున్న 227 స్థానాలకుగాను 31 మంది మహిళలకు అవకాశం కల్పించింది. అలాగే డీఎంకే 174 సీట్లకుగాను 19 సీట్లను మహిళా అభ్యర్థులకు కేటాయించింది. డీఎంకే చరిత్రలో ఇంతపెద్ద సంఖ్యలో మహిళలకు అవకాశం ఇవ్వడం ఇదే ప్రథమం. డీఎంకేలో 1996 వరకు సింగిల్ డిజిట్‌గా ఉన్న మహిళా అభ్యర్థులు 2001లో తొలిసారిగా 16 స్థానాలతో డబుల్ డిజిట్‌కు చేరుకున్నారు. అలాగే అన్నాడీఎంకే 1989 ఎన్నికల్లో కేవలం 4 సీట్లతో పరిమితం కాగా ఆ తరువాత ఎన్నికల్లో ఈ సంఖ్యను ఏకంగా 27కు పెరిగిపోయింది. 1991 నాటి ఎన్నికల్లో తొలిసారిగా 27 స్థానాలతో అన్నాడీఎంకే మహిళా అభ్యర్థుల సంఖ్య డబుల్ డిజిట్‌కు చేరుకుంది. చట్టసభ ఎన్నికల్లో 1977 నుంచి మహిళల ప్రాధాన్యతను పరిశీలిస్తే డీఎంకే కంటే అన్నాడీఎంకేనే గణనీయంగా పెంచుకుంటూ పోతోంది. అన్నాడీఎంకేలో ఒకప్పుడు 13.65 శాతంగా ఉన్న మహిళా అభ్యర్థులు 1991లో 27 సీట్లలో పోటీ చేయడం ద్వారా 16 శాతానికి పెరిగారు. మహిళా సామాజిక కార్యకర్త షీలు ఈ అంశంపై మాట్లాడుతూ ద్రవిడ పార్టీలు మహిళలకు కేటాయిస్తున్న సీట్ల సంఖ్య ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ఒక వైపు 33 శాతం మహిళా బిల్లును సమర్థిస్తూ తమ పార్టీల్లో కేవలం 16 నుంచి 20 శాతానికి పరిమితం కావడం ఏమిటని ప్రశ్నించారు. అంతేగాక, గెలుపు సాధ్యమైన సీట్లలో పురుష అభ్యర్థులను నిలబెట్టి, కష్టసాధ్యమైన సీట్లను స్త్రీలకు కేటాయించారని ఆమె ఆరోపించారు. పైగా ప్రజలకు పరిచితం కాని వ్యక్తులను నిలబెట్టారని తప్పుపట్టారు. వీటన్నిటినీ విశ్లేషించుకుంటే మహిళలకు కేవలం మొక్కుబడిగా కేటాయించారేగానీ, స్త్రీపట్ల గౌరవంతో కాదని ఆమె అన్నారు. మహిళా బిల్లుకు చిత్తశుద్ధితో సమర్థిస్తున్నవారైతే ఎన్నికల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని ఆమె అన్నారు. 33 శాతం సీట్లను కేటాయించిన పక్షంలో మహిళా బిల్లు సులభంగా పాస్ అయిపోతుందని చెప్పారు. గత పది అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలలో మహిళా అభ్యర్థుల గణాంకాలు ఇలా ఉన్నాయి. -
తొలిసారి మహిళా ప్రతినిధులు!
సౌదీ అరేబియా.. అక్కడ ఇన్నాళ్ల పాటు మహిళలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా 20 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. అలాగే, అక్కడి మహిళలు కూడా దేశ చరిత్రలో తొలిసారి ఓట్లు వేశారు. మొత్తం దేశంలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల స్థానాల సంఖ్యతో పోలిస్తే మహిళా ప్రతినిధుల సంఖ్య నామమాత్రమే అయినా.. తొలిసారి కావడంతో కనీసం ఈమాత్రమైన ప్రాతినిధ్యం ఉందన్న సంతోషం మిగిలింది. దేశంలో మొత్తం 2,100 మునిసిపల్ కౌన్సిల్ సీట్లుండగా వాటిలో కేవలం 20.. అంటే సుమారు 1 శాతం సీట్లను మాత్రమే మహిళలకు కేటాయించారు. అసలు నడకే లేని చోట ఒక్క అడుగు ముందుకు పడటంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. సౌదీలో ఇప్పటికీ మహిళలకు డ్రైవింగ్ చేసే హక్కు లేదు. అక్కడి గార్డియన్షిప్ చట్టాల్లో కూడా పురుషాధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్లి, ప్రయాణాలు, ఉన్నత చదువులు.. ఇలాంటి ప్రతి అంశాల్లోనూ పురుషుల మాట వినాల్సిందే. ఇప్పుడు తొలిసారి మహిళా సభ్యులు అక్కడి కౌన్సిల్‌కు ఎన్నిక కావడంతో, రాజు తలచుకుంటే మరింత మంది మహిళలకు అవకాశం లభిస్తుంది. 2100 స్థానాలకు మొత్తం 7వేల మంది పోటీపడగా, వాళ్లలో 979 మంది మహిళలున్నారు. ఇంతకుముందు 2005, 2011 సంవత్సరాల్లో కూడా ఈ కౌన్సిళ్లకు ఎన్నికలు జరిగినా, అవి కేవలం పురుషులకే పరిమితం అయ్యాయి. -
మహిళా పోలీస్ ‘పరుగు’..!
- కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ మొదలు - అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు 4,366 మంది - బుధవారం కూడా కొనసాగనున్న పరీక్ష సాక్షి, ముంబై: పోలీస్ శాఖలో భర్తీ ప్రక్రియలో భాగంగా మహిళా అభ్యర్థులకు నిర్వహిస్తున్న మూడు కి.మీ. పరుగు పరీక్ష (రన్నింగ్ టెస్ట్) కోసం వైద్యపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరుగు పరీక్ష బుధవారం వరకు కొనసాగనుందని అధికారి ఒకరు తెలిపారు. పరుగు పందెంలో మహిళా అభ్యర్థులకు ఏదైనా అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వెంటనే ప్రాథమిక చికిత్స అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల పురుష అభ్యర్థుల 5 కి.మీ.పరుగు పందెం సమయంలో సరైన సమయానికి వైద్యసదుపాయం అందక ఐదుగురు అభ్యర్థులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా పోలీసు అభ్యర్థుల పరుగు పరీక్షలో తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.ఇదిలా ఉండగా, 4,366 మంది అభ్యర్థులు అవుట్ డోర్ పరీక్షలో అర్హత సాధించారు. వీరికి విక్రోలిలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సర్వీస్ రోడ్ వద్ద రన్నింగ్ టెస్టును నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు సగం మంది మహిళా అభ్యర్థులు మంగళవారం జరిగిన పరుగు పరీక్షలో పాల్గొన్నారు. మిగిలినవారు బుధవారం జరుగనున్న పరుగు పరీక్షలో పాల్గొంటారని అధికారి తెలిపారు. సాధారణంగా పరుగు సమయంలో అభ్యర్థులకు ఊపిరికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి లేదా డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఆ సమయంలో సరైన వైద్య సహాయం అందిస్తే వారికి ప్రాణాపాయం ఉండదు. దీంతో మహిళా అభ్యర్థుల రన్నింగ్ టెస్ట్ సమయంలో రన్నింగ్ ట్రాక్ పొడవునా వైద్యులను అందుబాటులో ఉంచినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అదేవిధంగా అభ్యర్థుల కోసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. అంతేకాక ఈసారి కార్పొరేషన్, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అభ్యర్థులకు కనీస సౌకర్యాల ఏర్పాటుకు ముందుకువచ్చాయి. ఇదిలా వుండగా, నగరంలో పోలీసు కానిస్టేబుళ్ల కోసం 2,570 ఖాళీలు ఏర్పడగా, ఇందులో మూడవ వంతు మహిళా అభ్యర్థుల కోసం ఖాళీగా ఉన్నాయి. మహిళా అభ్యర్థుల కోసం పండ్లు, ఇతర అల్పాహారాన్ని కూడా అందజేస్తున్నట్లు అధికారి తెలిపారు. మహిళా కోటా కింద ఉన్న పోస్టులు పూర్తిగా భర్తీకాకపోతే, మిగిలిన వాటిని పురుషులతో భర్తీచేయనున్నామని ఆ అధికారి వివరించారు. అయితే మహిళల కోసం కేటాయించిన వాటిలో భర్తీ కాని పోస్టులను పురుషులతో భర్తీచేయనున్నట్లు అధికారి వెల్లడించారు. -
‘పీజీ ఈసెట్’లో మహిళలదే పైచేయి
* మహిళల ఉత్తీర్ణత 92.27%, పురుషుల ఉత్తీర్ణత 89.19% * పీజీ ఈసెట్ సీట్ల సంఖ్య పెంచుతాం: మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష పీజీ ఈసెట్-2014 ఫలితాల్లో మహిళా అభ్యర్థులు 92.27 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. పురుష అభ్యర్థులు 89.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. పీజీ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలంగాణ విద్యా శాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి, సీమాంధ్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు స్థానిక ఉస్మానియా దూరవిద్యా కేంద్రంలో సోమవారం సంయుక్తంగా విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొత్తం 1,08,112 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, వీరిలో 97,640 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకుపైగా ఖాళీగా ఉన్న ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ సీట్లను భర్తీ చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఠీఠీఠీ. ్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ, ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పీజీ ఈసెట్‌కు డిమాండ్ పెరిగిందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. పీజీ-ఈసెట్ సీట్లను పెంచి లోటు భర్తీ చేస్తామని అన్నారు. సీమాంధ్రలో విద్యాప్రమాణాలు మెరుగు పరచడంతో పాటు, ఉన్నత విద్యలో తమ ప్రాంతాన్ని ఓ రోల్ మోడల్‌గా మారుస్తానని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ ప్రకాష్, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రతాప్‌రెడ్డి, పీజీ ఈసెట్ కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 14 నుంచి కౌన్సెలింగ్: రెండు రాష్ట్రాలకు కలిపి జూలై 14 నుంచి పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఆన్లైన్ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. గేట్, జీప్యాట్ అర్హతగల అభ్యర్థులకు తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రాష్ట్రాలు విడిపోయినా కౌన్సెలింగ్‌లో గత ఏడాది నిబంధనలనే పాటించనున్నట్టు పేర్కొన్నారు. -
పురపోరులో గెలుపు ఆమెదే
చీరాల అర్బన్, న్యూస్‌లైన్ : పురపోరులో మహిళా అభ్యర్థులు విజయఢంకా మోగించారు. హోరాహోరీగా సాగిన పోరులో రాజకీయ పార్టీల తరుపున బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులు తమ సత్తా చాటారు. పురపాలక సంఘంలోని మొత్తం 33 వార్డుల్లో 17 వార్డుల్లో మహిళా అభ్యర్థులు విజయం సాధించగా వీటిలో 10 మంది మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ పోరులో పార్టీల తరఫున పోటీ చేసిన మహిళలు కౌన్సిలర్లుగా బరిలోకి దిగారు. త్రిముఖ పోటీ సాగిన పురపోరులో వైఎస్సార్సీపీ బలపరిచిన వార్డుల్లో పది మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ తరఫున ఆరుగురు మహిళలు, చీరాల పరిరక్షణ సమితి తరఫున ఒకరు ఉన్నారు. మొత్తం 17 మంది మహిళా కౌన్సిలర్లు నూతన కౌన్సిల్లో పనిచేయనున్నారు. వీరందరూ తొలి ప్రయత్నంలోనే కౌన్సిలర్లుగా ఎన్నికైన వారు కాగా టీడీపీ తరఫున విజయం సాధించిన కల్లగుంట అంజమ్మ మూడోసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పురుషులతో పాటు మహిళలు కూడా సమాన స్థాయిలో బరిలో దిగి విజయ కేతనాన్ని ఎగురవేశారు. చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్లో 17 మంది మహిళలు కౌన్సిలర్లుగా ఉండడం ప్రత్యేకత సంతరించుకుంది. -
పెద్దపీట.. ఉత్తమాట!
తమిళనాడులో మహిళలను విస్మరించిన పార్టీలు ఒక్క మహిళకూ టికెట్టివ్వని బీజేపీ మూడు సీట్లతో సరిపెట్టిన కాంగ్రెస్ సి.నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘మహిళాభ్యుదయం.. ఆకాశంలో సగం.. మహిళా సాధికారత...’’ అంటూ ఓట్ల కోసం ఉపన్యాసాలు దంచేసే రాజకీయ నేతలకు టికెట్ల ద గ్గరికి వచ్చే సరికి మాత్రం ఆ మహిళలు కనిపించడం లేదు! మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామంటూ తమిళనాట నానా హంగామా చేసే పార్టీలన్నీ మహిళలకు మొండిచేయి చూపాయి. రాష్ట్రంలో పదికిపైగా ఉన్న పార్టీలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తమ్మీద 12 మంది మహిళలకు మాత్రమే టికెట్లిచ్చాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీ అయితే కనీసం ఒక్క మహిళనైనా బరిలోకి దించలేదు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే తదితర పార్టీలతో పొత్తుపెట్టుకుని కూటమిని ఏర్పరచుకున్న బీజేపీ... ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీచేస్తోంది. బీజేపీతోపాటు ఈ కూటమిలోని ఏ పార్టీ కూడా మహిళలకు టికెట్ ఇవ్వలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గట్టి మద్దతుదారైన సుష్మాస్వరాజ్ పార్టీలోనే మహిళకు ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. ఇక మిగిలిన పార్టీల విషయానికి వస్తే అన్నాడీఎంకే 4, కాంగ్రె స్ 3, డీఎంకే 2, సీపీఎం 2, సీపీఐ ఒకరికి చొప్పున మహిళలకు అవకాశం కల్పించాయి. జయలలిత నేతృత్వంలోని అధికార అన్నాడీఎంకే సైతం మహిళలకు కేవలం నాలుగు సీట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. తమిళనాడులో 39, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 లోక్‌సభ స్థానాలున్నాయి. పార్టీల వారీగా మహిళా అభ్యర్థులు... 4.అన్నాడీఎంకే: మరగతం కుమారవేల్ (కాంచీ పురం), వనరోజా (తిరువన్నామలై), సత్యభామ (తిరుపూర్), వాసంతి మురుగేశన్ (దక్షిణ కాశీ) 3. కాంగ్రెస్: చారుబాల తొండైమాన్ (తిరుచ్చీ), రాణీ (విళుపురం), జ్యోతిమణి (కరూర్) 3. వామపక్షాలు: వాసుకి (ఉత్తర చెన్నై) సీపీఎం, తమిళ్‌సెల్వి (తంజావూరు) సీపీఎం, మహేశ్వరీ (రామనాధపురం) సీపీఐ 2. డీఎంకే: ఉమా రమణి (సేలం), పవిత్ర వల్లి (ఈరోడ్) 0 బీజేపీ -
జనాభాలో సగం..చట్టసభల్లో...
ఇటానగర్: జనాభాలో సగం ఉన్న మహిళల పరిస్థితి చట్టసభల్లో మరీదయనీయంగా ఉంది. చట్టసభల్లో వారికి ఆ సగంలో సగమైనా ప్రాతినిధ్యం దక్కడంలేదు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇక్కడ 60 శాసనసభా స్థానాలుండగా, పోటికి నిలిచిన మహిళా అభ్యర్థులు కేవలం 8 మంది. వీరిలో ఎంతమంది గెలుస్తారో తెలియదు. అప్పుడు మాత్రమే చట్టసభలో వారి శాతం తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ ఒక్క మహిళా అభ్యర్థిని కూడా బరిలో దింపలేదు. కాంగ్రెస్ మాత్రం ఇద్దరు సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించింది. ఎన్సీపీ ఇద్దరు, పీపీఏ ఒక అభ్యర్థికి టికెట్ ఇచ్చాయి. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులుగా పలు స్థానాల్లో పోటీలో ఉన్నారు. -
‘లింక్’ కుదిరేనా?
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ కేంద్రాల్లో లింక్ వర్కర్ల నియామకానికి స్పందన కరువైంది. నోటిఫికేషన్ విడుదల చేసి.. దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించినా నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు కంగుతింటున్నారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలవుతున్న ప్రాజెక్టుల్లో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం కోసం లింక్‌వర్కర్ల నియామకానికి స్త్రీ,శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలోని కంబదూరు, కణేకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి ఈస్ట్, కదిరి వెస్ట్, గుత్తి, పెనుకొండ ప్రాజెక్టుల్లో అమృతహస్తం పథకం అమలవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,427 అంగన్వాడీ, 626 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో లింక్ వర్కర్లను నియమించడానికి ఈ నెల నాలుగున నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు అర్హులు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనా అభ్యర్థుల నుంచి స్పందన కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఉన్నతస్థాయిలో అధికారులు తీసుకున్న నిర్ణయాలేనని స్పష్టమవుతోంది. ప్రస్తుతం మధ్యాహ్నం వరకూ ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు సైతం రూ.100 వరకు వేతనం లభిస్తోంది. అయితే...లింక్ వర్కర్లకు నెలకు రూ.750 మాత్రమే వేతనం ఇస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీంతో పది ప్రాజెక్టుల పరిధిలో ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రాలేదు. లింక్ వర్కర్ల నియామకం ఉద్దేశమిదే... ఇందిరమ్మ అమృతహస్తం అమలవుతున్న ప్రాజెక్టుల్లో అంగన్వాడీ కార్యకర్తలపై పెనుభారం పడుతోంది. సెంటర్‌కు వస్తున్న గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్న భోజనం వండిపెట్టాలి. జిల్లా వ్యాప్తంగా 4,286 కేంద్రాలుంటే... అమృతహస్తం అమలవుతున్నవి 2,053 ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 40 వేల మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అలాగే చిన్నారులు కూడా లక్ష మంది వరకూ ఉంటారు. చిన్నపిల్లలకు పౌష్టికాహార పంపిణీతో పాటు గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నానా అవస్థలు పడుతున్నారు. పైగా వారికి ప్రభుత్వం నుంచి అదనంగా డబ్బులేమీ రావడం లేదు. దీంతో వారికి పనిభారం తగ్గించడానికి లింక్వర్కర్లను నియమించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు మరణాలను తగ్గించడం, బాల్య వివాహాలు, భ్రూణ హత్యల నివారణ వంటి విధులను కూడా లింక్ వర్కర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వారికి రూ.750 మాత్రమే వేతనం నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
డైట్ తిప్పలు
డైట్ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. రోజుల తరబడి సాగుతున్న ప్రక్రియతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఆన్లైన్లోనే ఉన్న డైట్ కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు స్పాట్‌కు మార్చడంతో కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న 618 మంది జిల్లాలోని అభ్యర్థులంతా మెదక్‌కు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికొచ్చిన వారికి గత రెండు రోజులుగా కొనసాగిస్తున్న కౌన్సెలింగ్‌ను మరో రోజుకు అధికారులు పొడిగించడంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. చిన్నపిల్లలతో మహిళా అభ్యర్థుల బాధలు వర్ణనాతీతం. డీఈడీ చేస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండడంతో అభ్యర్థులు డైట్లో ప్రవేశానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సీట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా డైట్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను సులభతరం చేసేందుకు 2012-13లో ప్రభుత్వం వెబ్ ఆప్షన్‌కు అవకాశం కల్పించింది. దీంతో ఎంట్రెన్స్ రాసిన అభ్యర్థులు ఎక్కడి నుంచైనా ఆన్ లైన్ ద్వారా వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం లభించింది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లను ఆన్లైన్ ద్వారానే నిర్వహించారు. మూడో విడతకు వచ్చేసరికి జిల్లాలోని ప్రభుత్వ డైట్ కళాశాలలోనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుకు సాగని కౌన్సెలింగ్.. జిల్లాలో మొత్తం 24 ప్రైవేట్, ప్రభుత్వ డైట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 240 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద, మిగిలిన 1,060 సీట్లు కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రస్తుతం మూడో విడతకు వచ్చేసరికి 52 తెలుగు మీడియం, 11 ఉర్దూ మీడియం సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈనెల 6న కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇందుకోసం 618 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెండు రోజుల్లో కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతోపాటు, 200 నుంచి 300 కళాశాలలకు ఆప్షన్లు ఇస్తుండడంతో ఒక్కో అభ్యర్థికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ దశలో రెండు రోజుల గడువు చాలకపోవడంతో మరో రోజు పెంచారు. 6,7 తేదీల్లో సుమారు 350 మందికి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. మిగతా 268 మంది ఎదురు చూస్తున్నారు. బుధవారం ఎంత ఆలస్యమైనా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మొదటి రోజు అవకాశం దక్కని అభ్యర్థులు రెండో రోజు కూడా వచ్చారు. రెండో రోజూ అవకాశం దొరకని వారు మూడో రోజు కూడా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బస్సు చార్జీలతోపాటు రాకపోకలు సాగించ డం, వసతుల కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చంటి పిల్లల తల్లులు సైతం రెండు రోజులుగా అవస్థలు పడ్డారు. అమ్మాయిలు తమ తల్లిదండ్రులను తోడుగా తెచ్చుకుంటున్నారు. కౌన్సెలింగ్ వేగంగా జరగకపోవడం తో తమ నంబర్ వచ్చే వరకు ఇలా వీరంతా డైట్లో పడిగాపులు కాస్తున్నారు. స్లైడింగ్ లేక సమస్య.. గతంలో మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు రెండో, మూడో విడతల్లో తమ ర్యాంకుకు అనుగుణంగా దగ్గరి కళాశాలల్లోకి అడ్మిషన్ బదిలీ చేయించుకునే(స్లైడింగ్) అవకాశం ఉండేది. కానీ ఈసారి ఆ అవకాశాన్ని తొలగించడంతో అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
ప్రశాంతంగా టెట్
సాక్షి, చెన్నై:ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే వారికి టెట్ తప్పనిసరి చేస్తూ కేంద్రం సరికొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ క్రమంలో టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నం గందరగోళం మధ్య సాగింది. పరీక్ష నిర్వహణ తేదీ పలుమార్లు వారుుదా పడింది. ఎట్టకేలకు పరీక్ష జరిగినా అభ్యర్థుల విద్యార్హతతో సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడం, 150 ప్రశ్నలకు గంటన్నర మాత్రమే సమయం కేటాయించడం విమర్శలకు దారి తీసింది. ఫలితంగా పరీక్ష రాసిన ఆరు లక్షల మందిలో రెండు వేల మందే ఉత్తీర్ణులయ్యూరు. దీంతో మూడు గంటల సమయాన్ని నిర్ణయించి మళ్లీ పరీక్షలు నిర్వహించి ఖాళీల్ని భ ర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పకడ్బందీ టెట్ నిర్వహించేందుకు ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు తీసుకుంది. శనివారం పేపర్ 1(డీఎడ్), ఆదివారం పేపర్ 2(బీఎడ్) పరీక్ష జరగనున్నట్లు ప్రకటించింది. నిఘానీడలో పరీక్ష శనివారం తొలి పేపర్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. అత్యంత కట్టుదిట్టమైన నిఘానీడలో పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉదయూన్నే చేరుకున్నారు. పది నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రంలోని 677 కేంద్రాల్లో 2.67 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. చెన్నైలోని కేంద్రాల్లో 50 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలో మహిళా అభ్యర్థులు అధికం. ఆదివారం బీఎడ్ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది. సుమారు 4.11 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. లీక్ కలకలం టెట్ పేపర్ ధర్మపురిలో లీక్ అరుునట్లు వచ్చిన సమాచారం అభ్యర్థులు, అధికారులను ఆందోళనలో పడేసింది. ధర్మపురిలో ఓ ముఠా పేపర్ లీక్‌కు పాల్పడినట్లు, ప్రశ్నపత్రాలను వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఓ చోట అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళుతున్న సమయంలో ఈ ప్రచారం మొదలైంది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రచారం బయలుదేరిన పరీక్ష కేంద్రం వద్ద నుంచి విచారణ వేగవంతం చేశారు. ధర్మపురి ఎస్పీ అష్రాకార్గ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కృష్ణగిరి సరిహద్దుల్లో తనిఖీలు వేగవంతం చేశారు. ఆ సరిహద్దుల్లో ఐదుగురి వద్ద ప్రశ్నపత్రాలు లభించడంతో అదుపులోకి తీసుకున్నారు. అరుుతే ఈ ప్రశ్నపత్రాలు నకిలీవిగా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ ప్రశ్నపత్రాల్ని సృష్టించి అభ్యర్థుల్ని మోసగించడం లక్ష్యంగా ఈ ముఠా కుట్ర చేసినట్లు విచారణలో తేలింది. ప్రశ్నపత్రాలను రూ.పది వేల నుంచి రూ.లక్ష వరకు విక్రరుుంచినట్లు గుర్తించారు. అరెస్టయిన వారిలో కృష్ణగిరికి చెందిన గణపతి, హోసూరుకు చెందిన కృష్ణ, చంద్రశేఖర్, తలికి చెందిన అశోక్‌కుమార్, మరో వ్యక్తి ఉన్నారు.