సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో సగం అంటున్నారు కానీ మహిళలకు అవకాశాలు అంతంత మాత్రమే. రాజకీయ రంగంలోనైతే అవకాశాలు నామమాత్రమేనని కర్ణాటక ఎన్నికల ముఖచిత్రాన్ని చూస్తే స్పష్టమవుతుంది. ఓటర్లు చూస్తే సగం మంది మహిళలే ఉన్నారు కానీ కర్ణాటకలో ప్రధాన పార్టీలన్నీ టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు మొండి చెయ్యి చూపించాయి. కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలది అదే తీరు. కర్ణాటక అసెంబ్లీలో మహిళా ఓటర్లు 49 శాతం మంది ఉన్నారు కానీ టిక్కెట్ల విషయానికొచ్చేసరికి వారికి మొండి చెయ్యే ఎదురైంది.
కర్ణాటకలో ఓటర్ల సంఖ్య 4.96 కోట్లు ఉంటే వారిలో 2.44 కోట్ల మంది మహిళలే. గత ఎన్నికలతో పోల్చి చూస్తే మహిళా ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 2.13 కోట్ల మంది మహిళలు ఉంటే, 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి వారి సంఖ్య 2.26 కోట్లకు పెరిగింది. కానీ చట్టసభల్లో అడుగు పెట్టే మహిళల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. ఈ సారి ప్రధాన పార్టీలన్నీ మహిళా అభ్యర్థులకు నిరాశనే మిగిల్చాయి. కాంగ్రెస్ పార్టీ 16 మంది మహిళలకు (7 శాతం) టిక్కెట్లు ఇస్తే, బీజేపీ కేవలం ఆరుగురికి ఇచ్చింది. ఇక జనతాదళ్ నలుగురికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది.
మిగిలిన పార్టీలతో పోల్చి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మందికి టిక్కెట్లు ఇచ్చినా, వారిలో మరణించిన ఎమ్మెల్యేల భార్యలు, వారి వారసులే ఉన్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుమార్తెలు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మృతి చెందిన ఖమరూల్ ఇస్లామ్, మహదేవ్ ప్రసాద్ భార్యలు, రుద్రేష్ గౌడ కుమార్తె, ఎమ్మెల్యే ఆర్. రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి ఇలా ప్రముఖులకే టిక్కెట్‌లు దక్కాయి తప్ప, పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి పని చేస్తున్న వాళ్లకి ఎప్పట్లాగే ఈ సారి కూడా నిరాశే మిగిలింది.
మహిళలకైతే మొండి చెయ్యి చూపించారు కానీ వారి ఓట్లను ఆకర్షించడానికి మాత్రం అన్ని పార్టీలుపోటీ పడుతున్నాయి. చీరలు, నగలు, గృహోపకరణాలు వంటివి అన్ని రాజకీయ పార్టీలు భారీగా పంచుతున్నాయి. ఎన్నికల సంఘం నిఘాలో ఈ విషయం బయటకొచ్చింది. మైసూరు ప్రాంతంలో 8 కోట్ల విలువ చేసే గృహోపకరణాలున్న రెండు లారీలను ఈసీ సీజ్ చేసింది. అదే విధంగా 1.5 కోట్ల రూపాయలు విలువైన కుక్కర్లు, ఐరన్ బాక్స్‌లను కూడా స్వాధీనం చేసుకుంది.
- మొత్తం ఓటర్లలో మహిళల శాతం 49
- పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లాలు రాయచూరు, ఉడుపి, రామానగర, దక్షిణ కన్నడ, కొడగు
- ఎక్కువ మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులగానే పోటీ
- 1957లో 24 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తే, 2013 వచ్చేసరికి వారి సంఖ్య 175కి పెరిగింది.
- 2013 ఎన్నికల్లో మొత్తం 2,945 అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగితే వారిలో 175 మంది (6శాతం) మాత్రమే మహిళలు. కాంగ్రెస్ ఎనిమిది, బీజేపీ ఏడుగురు, జేడీ(ఎస్)12 మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. ఇక స్వతంత్రఅభ్యర్థులుగా 67 మంది పోటీ చేశారు.
- 2013లో అసెంబ్లీలోకి అడుగు పెట్టింది ఆరుగురు మహిళలు మాత్రమే
కర్ణాటక ఎన్నికల్లో పురుషులదే ఆధిపత్యం
కర్ణాటకలో మొదట్నుంచి ప్రధాన పార్టీలన్నీ మహిళలకు టిక్కెట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. తమ ఉనికిని కాపాడుకోవడానికి మహిళలే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దీంతో విజయం సాధించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ప్రతీ పది మంది మహిళా అభ్యర్థుల్లో తొమ్మిది మందిని ఓటర్లు ఇంటిముఖం పట్టిస్తున్నారు.
ఎక్కడైనా ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కర్ణాటకలో పరిస్థితి దానికి భిన్నం. చిన్నా చితక పార్టీల నుంచి పోటీచేయడం, లేదంటే స్వతంత్రంగానే బరిలోకి దిగుతూ ఉండడంతో సక్సెస్ రేటు ఉండడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చాలా రాష్ట్రాలతో పోల్చి చూస్తే కర్ణాటక రాజకీయాల్లో మహిళల పాత్ర చాలా పరిమితంగా ఉంది. విద్యావంతులు, సామాజిక సేవలో ఉన్న మహిళలు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల సంవత్సరం మహిళా అభ్యర్థులు గెలిచినవారు
1989 79 10
1994 117 7
1999 62 6
2004 107 6
2008 107 3
2013 175 6
-- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment