Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

AP Sarkar has availed Huge Debts In 13 Months1
AP: అప్పుల భారం @రూ. 1,86,112 కోట్లు

విజయవాడ: సంక్షేమం సంగతి అటుంచితే అప్పుల్లో మాత్రం ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. పాలనలో హామీల మాట పక్కన పెట్టిన ఏపీ సర్కార్‌.. అప్పులు చేయడంలో ‘రికార్డులను’ నెలకొల్పుతోంది. మంగళవారం వచ్చిందంటే చాలు.. అప్పులు చేస్తూ తనదైన ముద్రను కాపాడుకుంటోంది. తాజాగా మరో రూ. 3600 కోట్ల అప్పు తెచ్చింది చంద్రబాబు సర్కారు. తద్వారా అప్పుల్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది.కేవలం 13 నెలల్లోనే రూ. 1, 86, 112 కోట్లను అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం అప్పుల్లో చెత్త రికార్డును నమోదు చేసింది. ప్రత్యేకంగా కార్పొరేషన్లు, అమరావతి పేరుతో రూ. 62, 450 కోట్లు అప్పు చేసంది. ఈ క్రమంలోనే జూన్‌, జూలై నెలల్లో భారీగా అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీల వేలం ద్వారా అప్పులు సమీకరిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. బడ్జెట్‌ లోపలే కాకుండా బడ్జెట్‌ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరారు. బడ్జెట్‌ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చేస్తోంది.ఇంత పెద్దమొత్తంలో అప్పులు తెస్తున్నా సూపర్‌ సిక్స్‌లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు సర్కారు చేసింది ఏమైనా ఉంది అంటే.. అది భారీగా అప్పులే అనే విషయం కళ్లకు కట్టినట్లు కనబడుతోంది.

Telangana Govt Letter to Ministry Of Jalshakti On Banakacharla2
బనకచర్ల వద్దు.. తెలంగాణ సర్కారు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఎజెండాలో గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని, వెంటనే ఎజెండాను సవరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో రాసిన ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలన్నింటినీ సీఎస్‌ ప్రస్తావించారు. బనకచర్లే సింగిల్‌ ఎజెండాగా ఏపీ ప్రతిపాదన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ సింగిల్‌ (ఏకైక) ఎజెండాగా బనకచర్లపై మాత్రమే చర్చించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. తెలంగాణ చేసిన పలు ప్రతిపాదనలను ఎజెండాలో చేర్చాలని కోరింది. కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ పెండింగ్‌ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తింపు అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ పథకం కింద సాయం, గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, నిధుల కేటాయింపు వంటి అంశాలను చేర్చాలని విజ్ఞప్తి చేసింంది. తాజాగా ఇప్పుడు కూడా ఈ అంశాలపైనే చర్చించాలని సీఎస్‌ స్పష్టం చేశారు. ఆ సంస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది.. బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ తీవ్ర అభ్యంతరాలు తెలపడాన్ని సీఎస్‌ గుర్తు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను, ట్రిబ్యునల్‌ తీర్పులన్నింటినీ ఉల్లంఘిస్తూ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేనేలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. సీడబ్ల్యూసీ కూడా ఈ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. డీపీఆర్‌ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు ఇవే.. ⇒ పరీవాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా, అంగీకారం తీసుకోకుండా, గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రాలకు ట్రిబ్యునల్‌ జరిపిన నీటి కేటాయింపుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాజెక్టుల నిర్వహణలో సైతం మార్పులు చోటుచేసుకుంటాయి. ఏకపక్షంగా 200 టీఎంసీలను తరలించాలని చేసిన ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్‌ షెడ్యూల్‌లో మార్పులు జరగడంతో పాటు తెలంగాణ నీటి హక్కులకు విఘాతం కలుగుతుంది. ⇒ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అనుమతుల జారీకి సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి క్లియరెన్స్‌లు అవసరం కాగా, బనకచర్ల ప్రాజెక్టుకు ఇవేమీ లేవు. ⇒ ఏపీ సమర్పించిన ప్రీ ఫీజబిలిటీ రిపోర్టులో కీలకమైన సమాచార లోపాలున్నాయి. నీటి లభ్యత, సాంకేతిక సమాచారం లోపించింది. ⇒ పోలవరం ప్రాజెక్టుతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడే ముంపుపై ఇప్పటికే న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారు? ⇒ ఈ ప్రాజెక్టు తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాలను హరిస్తుంది. ప్రధానంగా కరువు పీడిత ప్రాంతాలపై దుష్ప్రభావం చూపుతుంది. అన్ని ప్రక్రియలూ పూర్తైన తర్వాతే చర్చించాలి ⇒ చట్టబద్ధంగా రావాల్సిన అన్ని అనుమతులు, అంతర్రాష్ట్ర సంప్రదింపులు, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలు పూర్తైన తర్వాతే ఈ ప్రాజెక్టుపై అయినా, ఏ సమావేశంలోనైనా చర్చ జరగాలి. ఆ తర్వాతే ప్రాజెక్టును ఆమోదించాలి. ⇒ బనకచర్ల ద్వారా తరలించనున్న 200 టీఎంసీల గురించి పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌లో ప్రస్తావన లేదు. నీటి లభ్యత, అంతర్రాష్ట్ర ప్రభావాలపై సమగ్ర అధ్యయనంతో పాటు ట్రిబ్యునల్‌ తీర్పులను నికచ్చిగా అమలు చేస్తేనే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) స్పష్టం చేసింది. ⇒ బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ఆపరేషన్‌ షెడ్యూల్, గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు, 1980 ఏప్రిల్‌ 2న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం అమలు తీరులో మార్పులు చోటుచేసుకుంటాయని గోదావరి బోర్డు అభ్యంతరం తెలిపింది. ఎలాంటి మార్పులకైనా పరీవాహకంలోని అన్ని రాష్ట్రాల నుంచి తప్పనిసరిగా రాతపూర్వకంగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. గోదావరి జలాల బట్వాడా విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపింది. 80 టీఎంసీలకు మించి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే బేసిన్‌లోని అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. ⇒ గోదావరి ట్రిబ్యునల్‌ పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాల కోటాలను పూర్తిగా వాడుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నిర్మించిన తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించిన 200 టీఎంసీల లభ్యతపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ⇒ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పుకు విరుద్ధమని పేర్కొంటూ బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరించిన విషయాన్ని సైతం లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని కోరిందని తెలిపింది. చర్చకు పెడితే బాయ్‌కాట్‌! కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇందుకోసం మంగళవారం రాత్రి వారు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లపై చర్చకు ఒప్పుకునేది లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ బనకచర్లను ఎజెండాలో పెట్టి చర్చ ప్రారంభిస్తే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్‌కాట్‌ చేస్తారని తెలుస్తోంది. కాగా, వీలును బట్టి సీఎం బుధవారం రాత్రికి, లేదా గురువారం నగరానికి వస్తారని సీఎంవో కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Sakshi Editorial On China3
ఇకనైనా చైనా మారేనా?

గల్వాన్‌ లోయలో భారత, చైనాల మధ్య ఘర్షణలు జరిగిన అయిదేళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఇతర దేశాల విదేశాంగమంత్రులతోపాటు కలవటమేకాక, చైనా ఉపాధ్యక్షుడు హాన్‌ జెంగ్‌తో ముందు రోజు భేటీ అయ్యారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఇరుగుపొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందునా చైనా వంటి దేశం పొరుగున వుంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకూ వుందన్న అంశంలో మాత్రమే కాదు... పాకిస్తాన్‌తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవటం చైనాకు అలవాటైంది. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా మోకాలడ్డుతోంది. ఇలాంటి సమస్యలెన్ని వున్నా సామర స్య వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవటమే విజ్ఞత. అందుకే అయిదేళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటుచేసుకోవటం హర్షించదగ్గది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కలుసుకున్నారు. ఉభయ దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అటు తర్వాత మధ్య మధ్యలో చైనా వ్యవహార శైలివల్ల ఇబ్బందులేర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలూ ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. సరిహద్దుల్లోని డెమ్‌చోక్,డెస్పాంగ్‌ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలూ నిరుడు అక్టోబర్‌లో నిర్ణయించ టంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. కానీ మొన్న ఏప్రిల్‌లో హఠాత్తుగా విద్యుత్‌ వాహనాల తయారీలో, ఏఐ సహా అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధ కమవుతాయి. ఈ సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్య పడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరుచుకోవాల్సిన అవసరం వున్నదని చైనా ఉపాధ్యక్షుడు హాన్‌ జెంగ్‌ అన్నట్టు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై వున్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో రెండూ అతి పెద్ద మార్కెట్లు. కానీ వృథా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత రెండు దేశాలనూ ఆవరిస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎస్‌సీఓ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనాలో జరగబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. కనుక ఈలోగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచు కోవటానికి కృషి చేయాల్సి వుంది. కశ్మీర్‌లోని పెహల్గాంలో పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడిచేయటం, అనంతరం ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో మన దేశం గట్టిగా జవాబీయటం వంటి పరిణామాల్లో చైనా, పాకిస్తాన్‌ వైపే నిలబడింది. ఇక దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించటాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించటానికి వీల్లేదు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతేమీ లేదని బంగ్లాదేశ్‌ చెప్పినా, పాకిస్తాన్‌ మాత్రం భవిష్యత్తు త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది. ఇదిగాక అమెరికాలో ట్రంప్‌ ఆగమనం తర్వాత ఆ దేశం బంగ్లాదేశ్‌ వ్యవహారాల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా అస్పష్టంగా వుంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో మనతో కలిసి కూటమి కట్టిన అమెరికా, దానిపై కూడా తన వైఖరేమిటని చెప్పటం లేదు. తన మనసులోని మాట చెప్పకుండా ఈ మధ్య జపాన్, ఆస్ట్రేలియాలతో జరిపిన సమావేశంలో తైవాన్‌ విషయంలో చైనా దూకుడు నిర్ణయం తీసుకుంటే మీ చర్యలెలావుంటాయంటూ ట్రంప్‌ ఆరా తీశారు. అమెరికా ఏం చేస్తుందో, ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియకుండా హామీ ఇవ్వటానికి రెండు దేశాలూ నిరాకరించాయి. ఆస్ట్రేలియా అయితే నేరుగానే అది తన సమస్య కాదన్నట్టు మాట్లాడింది. కనుక స్వీయ ప్రయోజనాల రీత్యా చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు.అయితే మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్‌సీఓలో మంగళవారం మాట్లాడిన జైశంకర్‌ నిర్మొహమాటంగానే మన వైఖరేమిటో చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులతో పోరాడాల్సి వుంటుందని ఆయన ప్రకటించారు. పెహల్గాం దాడి జమ్మూ కశ్మీర్‌ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రని చెప్పటంతోపాటు ఎస్‌సీఓ తన ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్‌సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్‌కు మద్దతీయటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతేతప్ప పాక్‌ తప్పులన్నిటినీ భుజాన మోసుకెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు తెస్తుందని చైనా గుర్తించాలి.

YS Jagan Wishes Shubhanshu Shukla4
శుభాంశు శుక్లాకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

సాక్షి,తాడేపల్లి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా తిరిగి రావటంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్లాతోపాటు ఆయన టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇది భారత్‌ గర్వించదగిన సమయం అంటూ ట్వీట్ చేశారు. A proud moment for India! Congratulations to Group Captain #ShubhanshuShukla and the entire #Axiom4 crew on their successful return from the ISS. pic.twitter.com/hMqBlWSN4x— YS Jagan Mohan Reddy (@ysjagan) July 15, 2025యాక్సియం-4 మిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. 18 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన శుక్లా బృందం.. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నాం భూమ్మీదకు స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సూల్‌ ద్వారా సురక్షితంగా తిరిగొచ్చింది. దీంతో ఇస్రో వర్గాలు సంబురాల్లో మునిగితేలాయి. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా బృందానికి వైఎస్‌ జగన్‌ శుభాంకాంక్షలు తెలిపారు.

Sakshi Guest Column On BRICS countries and Donald Trump5
బ్రిక్స్‌... ట్రంప్‌... కాగితం పులి కథ!

బ్రెజిల్‌లోని రియో డి జనేరో నగరంలో ఈ నెల 6–7 తేదీలలో జరిగిన ‘బ్రిక్స్‌’ 17వ శిఖరాగ్ర సమావేశాలను ఒకవైపు, దానిపై మొదటినుంచే కత్తులు దూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను మరొకవైపు గమనించగా కాగితం పులి కథ గుర్తుకు వస్తుంది. బ్రిక్స్‌... తన సభ్య దేశాల అభివృద్ధికి, పరస్పర సహకారానికి ఏర్పడినటువంటిది. 2009లో స్థాపించినప్పటి నుంచి గత 16 సంవత్సరాలలో అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చింది తప్ప, అమెరికాకు గానీ, మరొకరికిగానీ వ్యతిరేకంగా ఎప్పుడు ఏ చర్యలూ తీసుకోలేదు. అయినప్పటికీ, అమెరికా అధ్యక్షులందరికి భిన్నమైన రీతిలో ట్రంప్‌ మాత్రం బ్రిక్స్‌ను తమకు వ్యతిరేకమైన కూటమి అంటున్నారు. అధికారానికి వచ్చిన కొత్తలో బ్రిక్స్‌ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇపుడు బ్రెజిల్‌ సమావేశాలకు ముందు రోజున 10 శాతం అన్నారు. బ్రిక్స్‌లో చేర రాదంటూ ప్రపంచ దేశాలను కొన్ని నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఈసారి సమావేశాలు ముగిసే నాటికి, ట్రంప్‌ను అమెరికా సన్నిహిత దేశాలు సహా ఎవరూ ఖాతరు చేయనట్లు స్పష్టమైంది. జనాభా... జీడీపీ... 40 శాతం వాటా!2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలలో బ్రిక్‌గా మొదలైన సంస్థ, దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారటం తెలిసిందే. ట్రంప్‌ హెచ్చరికలు చేసిన మరునాడే ఇండోనేషియా పూర్తి సభ్య దేశంగా చేరింది. ఇపుడు బ్రెజిల్‌లో బేలారూస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, నైజీరియా, మలేషియా, థాయ్‌లాండ్, వియత్నాం,ఉగాండా, ఉబ్జెకిస్తాన్‌ భాగస్వామ్య దేశాలుగా కొత్తగా చేరాయి. బ్రెజిల్‌ సమావేశాల కన్న ముందు మాసాలలో ఈజిప్టు, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ పార్ట్‌నర్‌ దేశాలయ్యాయి. ఈ జాబితాను విశ్లేషించినట్లయితే నాలుగు విషయాలు దృష్టికి వస్తాయి. ఒకటి, సంఖ్య రీత్యా ఇపుడవి మొత్తం 21 దేశాలు. రెండు, అమెరికా, యూరప్‌తో కూడిన పాశ్చాత్య ప్రపంచానికి బయటగల ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా ఖండాలన్నింటికి అందులో ప్రాతినిధ్యం ఉంది. మూడు, వాటిలో అనేకం ఆర్థికంగా శక్తిమంతమై నవి. నాలుగు, బహుశా అంతకన్న విశేషంగా పలు దేశాలకు అమెరి కాకు అనుకూలమైనవనే పేరున్నది. అటువంటి పేరే గల ఆసియన్‌ కూటమి దేశాలు కూడా బ్రిక్స్‌కు తోడుకావటం మరొక విశేషం.తాజా విస్తరణ తర్వాత బ్రిక్స్‌ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 41 శాతానికి చేరింది. వీటి జీడీపీ ప్రపంచ జీడీపీలో 40 శాతం అయింది. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జి–7కు మించిపోయిన లెక్కలు. బ్రిక్స్‌ నెలకొల్పిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డిబి) రుణ సహాయాలతో 40 బిలియన్‌ డాలర్ల విలువ గల 120 అభివృద్ధి పథకాలను వర్ధమాన దేశాలలో అమలుపరుస్తున్నారు. అమెరికా చెప్పు చేతలలో గల ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ తరహా షరతులుగానీ, ఆయా దేశాల ఆర్థిక విధా నాలలో జోక్యం గానీ బ్రిక్స్‌ బ్యాంక్‌ నుంచి ఉండవు.అమెరికాకు ఎందుకు కలవరం?అమెరికా తన డాలర్‌ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రపంచ దేశాల కరెన్సీ విలువలను, మార్కెట్లను, బ్యాంక్‌ చెల్లింపులను, రిజర్వ్‌లను నియంత్రిస్తున్నందున, తమకు సరిపడని దేశాల డాలర్‌ అకౌంట్లను స్తంభింపజేస్తున్నందున, డాలర్‌ మారకం నుంచి విముక్తి అవసరమని బ్రిక్స్‌ దేశాలు కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌ నగరంలో జరిగిన 16వ సమావేశాలలో ఇందుకు మరింత కదలిక వచ్చింది. ఆ ప్రకారం బ్రిక్స్‌ దేశాలు డాలర్‌తో సంబంధాలను ఒకే సారి పూర్తిగా తెంచుకోవటంగాక, తమ మధ్య వాణిజ్యానికి పరస్పర చెల్లింపులు డాలర్‌లో గాక వీలైనంత మేర తమ సొంత కరెన్సీలలో జరుపుకోవాలనీ, ఆ స్థాయిని క్రమంగా పెంచుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. ఈ పని బ్రిక్స్‌ దేశాల మధ్యనే గాక, ఇతర దేశాలతోనూ జరిగేందుకు ప్రయత్నించాలని భావించాయి. అనగా డాలర్‌ పాత్రను, ఆధిపత్యాన్ని తగ్గించటమన్నమాట!నిజానికి స్థానిక కరెన్సీలలో చెల్లింపుల పద్ధతి స్వల్ప స్థాయిలో గతంలోనూ ఉండేది. కానీ బ్రిక్స్‌ నిర్ణయాలతో అది గణనీయంగా పెరిగి ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 30 శాతానికి మించినట్లు అంచనా. బ్రెజిల్‌ విస్తరణతో ఈ ధోరణి పెరిగినట్లయితే, త్వరలో 50 శాతానికి చేరే అవకాశం ఉంది. బ్రిక్స్‌ అంటే అమెరికా అధ్యక్షుడు ఎందుకింత కలవరపడుతున్నారో, దీన్ని బట్టి తేలికగా అర్థం చేసు కోవచ్చు. ప్రపంచంపై అమెరికా సామ్రాజ్యవాదపు ఆధిపత్యం వెంటనే అంతం కాక పోయినా క్రమంగా బలహీనపడుతుంది. మారిన పరిస్థితులలో ఒకప్పటివలె బ్రిక్స్‌ వంటి దేశాలపై ప్రత్యక్ష యుద్ధాలు చేయలేరు గనుక, టారిఫ్‌ల హెచ్చింపు, ఇతర వాణిజ్య ఆంక్షల రూపంలో ఆర్థిక యుద్ధాలు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి, అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతరుల నుంచి వస్తున్న పోటీలను తట్టుకునేందుకు ఆయన స్వపర భేదాలు లేకుండా అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్‌ల యుద్ధం ఆరంభించారు. అయితే, బ్రిక్స్‌తో వైరం భిన్నమైనది. ఆ సంస్థ వర్ధమాన దేశాల కోసం భిన్న మైన, దీర్ఘకాలిక, ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించే అజెండాతో పని చేస్తున్నది. ఆర్థికంగానే కాదు. అభివృద్ధి నమూనా దృష్ట్యా కూడా. వాణిజ్యంలో ‘స్వేచ్ఛ’ కోసం...మరొక కీలకమైన అంశం స్వేచ్ఛా వాణిజ్యం. ఈ భావనను ముందుకు తెచ్చి డబ్ల్యూటీవోను నెలకొల్పిన అమెరికా కూటమి, దానిని తమ ప్రయోజనాలకు అనుకూలమైనంత కాలం ఉపయోగించుకుని, ఇటీవల ఇతర దేశాలు కూడా లాభపడుతుండటంతో ఆ నియమాలను భంగపరచజూస్తున్నది. స్వేచ్ఛా వాణిజ్యం యథా తథంగా కొనసాగటమే గాక, ఆ సంస్థలో వర్ధమాన దేశాల గొంతుకలు వినవస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నది బ్రిక్స్‌ వాదనలలోని ముఖ్యాంశాలలో ఒకటి. ఆ పని జరిగితే వర్ధమాన దేశాల వనరులకు, ఉత్పత్తులకు తగిన ధరలు లభిస్తాయి. ధనిక రాజ్యాలు ఇతరులను ఒత్తిడి చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేయటం, తమ ఉత్పత్తులను మాత్రం అధిక ధరలకు విక్రయించటం వంటి పరిస్థితి పోతుంది. మరొక స్థాయిలో బ్రిక్స్‌ దేశాలు అమెరికా ఏకధ్రువ ప్రపంచం ఆమోదయోగ్యం కాదనీ, బహుళ ధ్రువ ప్రపంచం తమ లక్ష్యమనీ స్పష్టంగానే చెప్తున్నాయి. బ్రిక్స్‌ గురించి యూరోపియన్‌ దేశాలు ఇంతవరకైతే వ్యతిరేకంగా మాట్లాడలేదుగానీ, అమెరికా వైపు చూస్తు న్నాయి. కజాన్, రియో డి జనేరో సమావేశాల దరిమిలా ట్రంప్‌పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల తక్షణ ప్రభావాల గురించి కూడా కొంత చెప్పు కోవాలి. ఇండియాను టారిఫ్‌లతో లొంగదీసి ఒప్పందాలు చేసుకో జూడగా, దానిపై ఒకవైపు చర్చలు సాగిస్తూనే, తాము కూడా 25 శాతం ఎదురు సుంకాలు విధించగలమని భారత ప్రభుత్వం డబ్ల్యూటీవోలో స్పష్టం చేసింది. తామూ అదే పని చేయగలమని బ్రెజిల్, వియత్నాం, ‘ఆసియాన్‌’, దక్షిణాఫ్రికా మొదలైనవి హెచ్చరించాయి. చైనా, రష్యా సరేసరి. టారిఫ్‌లు ప్రకటించినపుడు ట్రంప్‌ మాట్లాడుతూ 90 రోజులలో 90 ఒప్పందాలు చేసుకోగలమని,అందరూ క్యూలు కడుతున్నారని ఆట్టహాసంగా అన్నారు. 90 రోజులు గడిచేసరికి జరిగినవి ఇంగ్లండ్, వియత్నాంలలో మాత్రమే. కెనడా, యూరప్‌ సైతం ధిక్కార స్వరంలోనే ఉన్నాయి. ఈ పరిణా మాల మధ్య బ్రిక్స్‌ను ఢీకొంటున్న ట్రంప్, కాగితం పులిగా మిగలటం తప్ప గత్యంతరం కనిపించదు.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Sunil Gavaskar Goes Hard At India After Loss At Lords vs England6
భార‌త్ ఓట‌మికి కార‌ణ‌మదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గ‌వాస్క‌ర్

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో టెస్టులో 22 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. 193 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌లేక టీమిండియా చ‌త‌క‌ల‌ప‌డింది. ర‌వీంద్ర జ‌డేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన‌ బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో భార‌త్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది.ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చ‌ర్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బ్రైడ‌న్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు. ఇక గిల్ సేన ఓట‌మిపై మ్యాచ్‌ అనంతరం భార‌త క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించారు. ల‌క్ష్య చేధ‌నలో బ్యాట‌ర్లు భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్ప‌క‌పోవ‌డం వ‌ల్ల భార‌త్ ఓటమి పాలైంద‌ని ఆయ‌న తెలిపారు."భార‌త రెండో ఇన్నింగ్స్‌లో క‌నీసం ఒక్క‌టైన 60 నుంచి 70 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదైంటే ఫ‌లితం మ‌రో విధంగా ఉండేది. కానీ భార‌త బ్యాట‌ర్లు అలా చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. స్పిన్న‌ర్లు జో రూట్, షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జ‌డేజా దూకుడుగా ఆడ‌లేద‌ని కొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు. కానీ ఆ స‌మ‌యంలో అత‌డు ఆడిన తీరు స‌రైన‌దే. ఎందుకుంటే బ‌య‌ట మ‌రో వికెట్ లేదు. జ‌డేజా పోరాటానికి పూర్తి మార్క్‌లు ఇవ్వాల్సిందేన‌ని" అధికారిక బ్రాడ్‌కాస్ట‌ర్ సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌న్నీ పేర్కొన్నారు. కాగా భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ సైతం త‌మ ఓట‌మికి కార‌ణం ఇదే చెప్పుకొచ్చాడు. ఒక 50 ప‌రుగుల భాగ‌స్వామ్యం వ‌చ్చి వున్నా తాము గెలిచే వాళ్ల‌మ‌ని గిల్ అన్నాడు. ఇక భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్ట‌ర్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టులోకి లైమ్ డాస‌న్ వచ్చాడు. భార‌త్ కూడా త‌మ తుది జ‌ట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: భార‌త్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ రీఎంట్రీ

Health Ministry clarifies no warning labels for samosa and jalebi7
సమోసా, జిలేబీలపై వార్నింగ్‌ లేబుల్స్‌లో.. ​కేంద్రం ట్విస్ట్‌

సాక్షి,న్యూఢిల్లీ: ‘పొగతాగుట,మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం’ ఈ తరహా హెచ్చరికలు తినే ఆహార పదార్ధాలకు కేంద్రం వార్నింగ్‌ లేబుల్స్‌ తగిలించేలా దిశగా ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం జోరందుకుంది. అయితే, మంగళవారం ఆ ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఈ మేరకు పీబీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. సమోసా,జిలేబీ,లడ్డూతో పాటు ఇతర ఆహార పదార్ధాలకు వార్నింగ్‌ లేబుల్స్‌ను అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటి వరకూ ఆ తరహా నిర్ణయాలు తీసుకోలేదని తేల్చింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌లో ఆహా పదర్ధాలకు వార్నింగ్‌ లేబుల్స్‌ను జతచేయనుందనే జాతీయ మీడియా కథనాల్ని ట్వీట్‌లో జత చేసింది. Some media reports claim that the @MoHFW_INDIA has issued a health warning on food products such as samosas, jalebi, and laddoo.#PIBFactCheck✅This claim is #fake ✅The advisory of the Union Health Ministry does not carry any warning labels on food products sold by vendors,… pic.twitter.com/brZBGeAgzs— PIB Fact Check (@PIBFactCheck) July 15, 2025పలు మీడియా నివేదికలు ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌ వంటి కేంద్ర సంస్థల్లో ఆహార పదార్ధాలపై వార్నింగ్‌ లేబుల్స్‌ ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించిందని పేర్కొన్నాయి. కానీ పీఐబీ ప్రకారం, ఇది పనిచేసే ప్రాంతాల్లో ఉద్యోగులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాల్ని ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఇచ్చిన సాధారణ సూచన మాత్రమేనని తెలిపింది. ఈ సూచన ప్రత్యేకంగా భారతీయ స్ట్రీట్ ఫుడ్‌ను లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. అందరికీ ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు రూపొందించినట్లు పీబీఐ హైలెట్‌ చేసింది.దేశ జనాభాలో పెరిగిపోతున్న ఒబిసిటి,డయాబెటీస్‌,గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యల భాగంగా ఈ సూచనను తీసుకొచ్చింది. ఈ అడ్వైజరీలో సమోసా, జిలేబీ, లడ్డూ వంటి స్నాక్స్‌పై వార్నింగ్‌ లేబుల్స్‌ పెట్టాలని ఎక్కడా చెప్పలేదు. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు వర్క్‌ ప్లేసుల్లో సూచనలు మాత్రమే స్పష్టం చేసింది.

Bengaluru Student Incident By Physics, Biology Lecturers And Their Friend8
బెంగళూరులో దారుణం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం

బెంగళరూరు: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. క్లాస్‌లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి టెక్ట్స్‌ మెసేజ్‌ చేసిన లెక్చరర్‌.. ఆపై సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్‌ రూమ్‌కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్‌, అతని ఫ్రెండ్‌ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడటంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ఓ విద్యార్థినిని ఫిజిక్స్‌ బోధించే లెక్చరర్‌ నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సాయంతో పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్నాడు. ఇలా అనూప్‌ అనే స్నేహితుడి రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ అనూప్‌ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డ వీడియోను చూపించి మరొక లెక్చరర్‌ సందీప్‌ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థినిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వీరు కర్ణాటక మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది. దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇదిలావుంచితే, ఒడిశాలో కూడా ఇదే తరహా దారుణం ఇటీవల చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసి ప్రాణాలు తీసుకుంది. ప్రిన్సిపాల్‌ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలాసోర్‌ బీఈడీ సెకండియర్‌ స్టూడెంట్‌ సూసైడ్‌ చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని 90 శాతం కాలిన గాయాల పాలైన ఆమెను ఆస్పత్రిలో జాయిన్‌ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది. ముందే చెబుతున్నా.. న్యాయం జరగకపోతే..

Will cope with new sanctions Russia on Trumps  tariff threat9
ట్రంప్‌ వేస్తారు.. మేము భరిస్తాం: రష్యా

బీజింగ్‌: వచ్చే 50 రోజుల్లోపు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, వంద శాతం సుంకాలను ఆ దేశం ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ఈరోజు(మంగళవారం, జూలై 15) షాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సమ్మిట్‌కు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్‌ ప్రెస్‌ కాన్పరెన్స్‌లో మాట్లాడారు. దీనిపై అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ విధిస్తామన్న సుంకాలపై కాస్త​ వ్యంగ్యంగా బదులిచ్చారు లావ్రోవ్‌. ‘ ట్రంప్‌ సుంకాలు వేస్తానన్నారు కదా.. అది కూడా వంద శాతం దాటి సుంకాలన్నారు. వేయనీయండి.. మేము భరిస్తాం. ఈ రకమైన బెదిరింపులు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి’ అంటూ బదులిచ్చారు. పుతిన్‌.. నీకు 50 రోజుల సమయమేకాగా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్‌ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. వైట్‌ హౌస్‌లో నాటో చీఫ్‌ మార్క్‌ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్‌ కాస్త ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి:ట్రంప్‌-పుతిన్‌ బ్రొమాన్స్‌ ముగిసిందా?

Party discussions during local elections in Telangana10
రిజర్వేషన్లు ఎలా ఉంటాయో!?

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్‌ సైతం తీసుకురానుంది. దీంతో ఆర్డినెన్స్‌ ఎప్పుడు జారీ అవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికల రాజుకుంటున్న నేపథ్యంలో గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్‌ ఎలా ఉంటుందో..: పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం చూస్తే..అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు ప్రస్తుతం ఉన్న 22 శాతం రిజర్వేషన్లను, 42 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్‌ తేనుండటంతో.. అందులో పొందుపరిచే అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ,ఎస్టీ స్థానాలు కూడా కొంత మేరకు ప్రభావితం కావచ్చునని చెబుతున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు.. గతంలో ఉన్న రిజర్వేషన్లు రెండు పదవీ కాలాల (టర్మ్‌లు) సమయం కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్మ్‌కు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్‌ మాత్రమే ఉంటాయన్న మాట. ఈ కారణంగానూ రిజర్వేషన్‌ స్థానాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. తాజా జనాభా లెక్కలతోనూ ప్రభావితం! గతంలో మాదిరిగానే సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల ప్రతిపాదికన, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా యూనిట్‌గా..ఎంపీపీ అధ్యక్షుడు జిల్లా యూనిట్‌గా, జెడ్పీపీ చైర్మన్‌ రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు ఉంటాయా లేదా అనేది కూడా రాజకీయ పార్టీల నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది. అయితే ప్రభుత్వం జారీచేసే ఆర్డినెన్స్‌కు అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజా జనాభా లెక్కల్లో (కుల గణన)వచ్చిన మార్పులను బట్టి రిజర్వేషన్లు కూడా మారిపోతాయని భావిస్తున్నారు. స్థానాల సంఖ్యపై స్పష్టత! రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు 12,782గా, గ్రామాల వార్డులు 1,12,712, ఎంపీటీసీ స్థానాలు 5,816, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్‌లు 566, జిల్లా పరిషత్‌లు 31గా లెక్క తేలినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఈ లెక్క తేల్చినట్లు అధికారవర్గాల భోగట్టా. 2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా పరిషత్‌ (జెడ్పీపీ)–(మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ రద్దు) స్థానం తగ్గగా అనేక గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 55 నుంచి 60 స్థానాల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. తగ్గిన ఎంపీటీసీలు, పెరిగిన మండలాలు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ (గ్రామీణ జిల్లా) ఉనికిలో లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో ఆయా గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గనున్నట్టు తెలుస్తోంది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గవచ్చని అంచనా. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది. గత ఎన్నికల్లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 12,782కు పెరిగింది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా 10–11 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి 12న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా, క్షేత్రస్థాయి నుంచి సకాలంలో పూర్తి సమాచారం అందకపోవడంతో వాటి ప్రకటనలో జాప్యం జరిగింది. సోమవారం నాటికి కూడా కొన్నిచోట్ల నుంచి వివరాలు రాకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లపై కచి్చతమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 ఎన్నికల నాటికి మండల ప్రజా పరిషత్‌లు 539 ఉండగా, 2025 ఎన్నికల నాటికి 566కు పెరగనున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు 12,769 ఉండగా, ఇప్పుడు 12,782కు చేరుకున్నట్టు అధికారవర్గాల సమాచారం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement