అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కేంద్రాల్లో లింక్ వర్కర్ల నియామకానికి స్పందన కరువైంది. నోటిఫికేషన్ విడుదల చేసి.. దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించినా నిరుద్యోగ మహిళా అభ్యర్థులు ముందుకు రావడం లేదు.
దీంతో అధికారులు కంగుతింటున్నారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలవుతున్న ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం కోసం లింక్‌వర్కర్ల నియామకానికి స్త్రీ,శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలోని కంబదూరు, కణేకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర, కదిరి ఈస్ట్, కదిరి వెస్ట్, గుత్తి, పెనుకొండ ప్రాజెక్టుల్లో అమృతహస్తం పథకం అమలవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,427 అంగన్‌వాడీ, 626 మినీ అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి.
వీటిలో లింక్ వర్కర్లను నియమించడానికి ఈ నెల నాలుగున నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులు అర్హులు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనా అభ్యర్థుల నుంచి స్పందన కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఉన్నతస్థాయిలో అధికారులు తీసుకున్న నిర్ణయాలేనని స్పష్టమవుతోంది. ప్రస్తుతం మధ్యాహ్నం వరకూ ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు సైతం రూ.100 వరకు వేతనం లభిస్తోంది. అయితే...లింక్ వర్కర్లకు నెలకు రూ.750 మాత్రమే వేతనం ఇస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో పది ప్రాజెక్టుల పరిధిలో ఒక్క అభ్యర్థి కూడా ముందుకు రాలేదు.
లింక్ వర్కర్ల నియామకం ఉద్దేశమిదే...
ఇందిరమ్మ అమృతహస్తం అమలవుతున్న ప్రాజెక్టుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలపై పెనుభారం పడుతోంది. సెంటర్‌కు వస్తున్న గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్న భోజనం వండిపెట్టాలి. జిల్లా వ్యాప్తంగా 4,286 కేంద్రాలుంటే... అమృతహస్తం అమలవుతున్నవి 2,053 ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 40 వేల మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. అలాగే చిన్నారులు కూడా లక్ష మంది వరకూ ఉంటారు. చిన్నపిల్లలకు పౌష్టికాహార పంపిణీతో పాటు గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నానా అవస్థలు పడుతున్నారు. పైగా వారికి ప్రభుత్వం నుంచి అదనంగా డబ్బులేమీ రావడం లేదు. దీంతో వారికి పనిభారం తగ్గించడానికి లింక్‌వర్కర్లను నియమించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు మరణాలను తగ్గించడం, బాల్య వివాహాలు, భ్రూణ హత్యల నివారణ వంటి విధులను కూడా లింక్ వర్కర్లు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వారికి రూ.750 మాత్రమే వేతనం నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘లింక్’ కుదిరేనా?
Published Sat, Feb 8 2014 2:59 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement