సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళా ఎమ్మెల్యేలు లేని లోటు కన్పిస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏ పార్టీ కూడా మహిళలకు టికెట్లు కేటాయించలేదు. దీంతో ఈసారైనా మహిళా ఎమ్మెల్యే ఎన్నికవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గ్రేటర్‌లో 35,24,088 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జీహెచ్‌ఎంసీలో ఏకంగా 76 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. కానీ తాజాగా రద్దయిన శాసనసభలో గ్రేటర్‌లో ఒక్క మహిళకు స్థానం లేని విషయం తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు జాబితాలు ప్రకటించిన టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్క స్థానం కూడా మహిళకు కేటాయించలేదు. దీంతో ఆయా పార్టీల్లోని మహిళా నేతలు రెండో∙జాబితాపై చివరి ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కార్పొరేటర్లు పి.విజయారెడ్డి, గద్వాల విజయలక్ష్మిలు ఖైరతాబాద్ శాసనసభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ నియోజకవర్గ రాజకీయాల్లో పూర్తి క్రియాశీలకంగా ఉన్నారు. విజయారెడ్డి 2014లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి 25 వేల వరకు ఓట్లు సంపాదించారు. అంబర్‌పేటలో మరో కార్పొరేటర్ కాలేరు పద్మావతి టికెట్ రేసులో సీరియస్‌గా ఉన్నారు. ఐతే టీఆర్‌ఎస్ ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వకపోవటంతో రెండో జాబితాలోనైనా తమకు తప్పకుండా స్థానం లభిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు.
కాంగ్రెస్‌లోనూ బోలెడు మంది
ప్రతి ఎన్నికల్లోనూ మహిళలకు స్థానాలు కేటాయించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ మారు కొనసాగిస్తుందన్న ఆశాభావాన్ని మహిళా నేతలు వ్యక్తం చేస్తున్నారు. మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, సికింద్రాబాద్ నుండి మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, మేరీ రవీంధ్రనాథ్‌లు ఆశలు పెట్టుకున్నారు. చాలా కాలంగా సికింద్రాబాద్ స్థానాన్ని మహిళలకు కేటాయిస్తూ వస్తుండటంతో ఈ మారు మహిళా నేతలు టికెట్ తమకే ఖాయమన్న ధీమాతో ఉన్నారు.
బీజేపీ–ఎంఐఎంలలోనూ ఆశావహులు
భారతీయ జనతా పార్టీలో సైతం ఈమారు మహిళా అభ్యర్థుల పోటీ ఎక్కువైంది. సనత్‌నగర్ నుండి మహిళా మోర్చ నాయకులు విజయ, చాంద్రాయణగుట్టలో సయ్యద సహజాదిలు టికెట్లు ఆశిస్తున్నారు. ఎంఐఎం 1989 తర్వాత మళ్లీ మహిళలకు శాసనసభ టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఐనా ఈసారి కార్వాన్, జూబ్లిహిల్స్ స్థానాల్లో ఆశావహులున్నారు.
గతంలో ఘనం...
హైదరాబాద్ స్టేట్ ఏర్పడిన తొలి శాసనసభలోనే నగరం నుండి తొలి మహిళా ఎమ్మెల్యే శాలిబండ నుండి ఎన్నికయ్యారు. తదనంతరం నగరం నుండి ఖచ్చితంగా మహిళా ప్రాతినిథ్యంటూ వస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం సంప్రదాయానికి భిన్నంగా మహానగరం నుండి శాసనసభకు మహిళల ప్రాతినిధ్యం లేకపోవటం గమనార్హం. హైదరాబాద్ స్టేట్ శాసనసభకు 1951లో జరిగిన తొలి ఎన్నికల్లోనే శాలిబండ నియోజకవర్గం నుండి మైనారిటీ మహిళ మసూమబేగం తొలి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టగా ఆ తర్వాత కాలంలో అనేక మంది మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. ఆయా రాజకీయ పక్షాలు సైతం నగరంలో మహిళలకు తప్పకుండా టికెట్లు ఇచ్చే ఆనవాయితీని కొనసాగించారు.
1957లో పత్తర్‌ఘట్టీ నుండి మసూమాబేగం విజయం సాధించారు.1962లో జూబ్లీహిల్స్ నుండి రోడామిస్త్రీ, హైదరాబాద్ ఈస్ట్ నుండి సుమిత్రాదేవిలు విజయం సాధించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సుమిత్రాదేవి, సరోజినిపుల్లారెడ్డి, మంకమ్మ, ఉమా వెంకట్రాంరెడ్డి, లక్ష్మీకాంతమ్మ, కాట్రగడ్డ ప్రసూన, మేరీ రవీంధ్రనాథ్, మణెమ్మ అంజయ్య, సబితా ఇంద్రారెడ్డి, జయసుధలు విజయం సాధించి నగరానికి ప్రాతినిథ్యం వహించారు. గడిచిన ఎన్నికల్లో ఆయా ప్రధాన పార్టీలు మహిళలకు కనీస టికెట్లు ఇవ్వని అంశం ఈమారు కూడా పునరావృతం అవుతుందా లేక..పాత సంప్రదాయం కొనసాగుతుందా వేచి చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment