ప్రచారంలో పాల్గొన్న ప్రజలు
సాక్షి,పెగడపల్లి : ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాలో 129 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇటీవల కొత్తగా 19 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. వీటిలో 2,05,778 ఓటర్లుండగా ఇందులో పురుషులు 1,01,175 మంది, 1,04,601 మహిళా ఓటర్లు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. అందరిని కలువ లేక పోయిన కనీసం ఆ ఊరుకు పోయి రావాలే.. అసలే మాఘీ పొద్దు సమయం పొద్దంతా తక్కువగా సమయం ఉంటుంది. రాత్రంతా చలి. అందులో ప్రచారానికి సమయం ఉండటం లేదు. సహజంగా ఎన్నికలప్పుడు తప్పా నాయకులు ఎప్పుడు గ్రామాలకు రాలేదంటారు. కానీ ఎన్నికల వేళ కూడా అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. టీఆర్‌ఎస్ మినహా ఇతర పార్టీలకు తీరా టికెట్లు ఖరారై నామినేషన్లు వేసే సరికి పోలింగ్ సమయం దగ్గరికి వచ్చింది.
అభ్యర్థులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ఓట్లు అడిగే సమయం లేదు. దీంతో ప్రధాన గ్రామాలపై దృష్టి సారించిన నేతలు పగలు ప్రచారం చేస్తూ రాత్రి వేళ మంతనాలు చేస్తున్నారు. ఫోన్లు చేస్తూ గ్రామాల్లో ఉండే కార్యకర్తలు, నాయకులకు సూచనలు చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర ఉండటంతో పగలు, రాత్రి ప్రచారం చేసినా అన్ని గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ప్రచారానికి ఇంకా 12 రోజులే గడువుంది. నియోజకవర్గంలోని రెండు, మూడు గ్రామాలకు వెళ్లినా, తిరిగి వచ్చే సరికి ఒక్క రోజు గడిచిపోతోంది. చీకటి అయితే చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేతలు గ్రామాలకు వెళ్తున్న సమయంలో ఇతర గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమేతంగా ప్రచారం చేస్తున్నా సమయం సరిపోని పరిస్థితి ఉంది.
కార్యకర్తలపైనే ఆధారం...
ప్రచారానికి సమయం లేక పోవడం, పైగా గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు కార్యకర్తలపైనే ఆధారపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అవసరమున్న గ్రామాలకు మాత్రమే వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుని చక్కదిద్దే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వలసలు, చేరికలు తదితర వాటిపై నేతలు దృష్టి సారించారు. గ్రామాలకు వెళ్లలేని ఈ పరిస్థితుల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసే అవకాశమే లేదు. దీంతో చివరి రోజుల్లో ర్యాలీ ఏర్పాట్లకు సన్నాహలు చేసుకుంటున్నారు. గ్రామాలకు ప్రచారం చేసే బాధ్యతలను పార్టీల వారీగా కార్యకర్తలకు అప్పజెబుతున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అన్నీ గ్రామాలను చుట్టి రావడం అయ్యేపని కాదు. దీంతో ఆయా మండలాల్లో అత్యధిక ఓటర్లున్నా గ్రామాలకు వెల్లేందుకు ప్రణాళిక రూపొందించు కుంటున్నారు.
నియోజకవర్గంలో 148 పంచాయతీలు ఉండగా సుమారు మరో 30 వరకు అనుబంధ గ్రామలున్నాయి. దీంతో అభ్యర్థులు మండల కేంద్రాలతో పాటు, ప్రధాన గ్రామాల్లో ప్రచారం చేసేందుకు దృష్టి సారిస్తున్నారు. మిగితా గ్రామాల్లో ద్వితీయశ్రేణి నాయకులు ప్రచారం చేసేందుకు వ్యూహరచన చేసుకుంటున్నారు. అవసరమైతే అక్కడికి వెల్లిన తర్వాత స్థానికుల్లో ప్రధానమైన అనుచరగణంతో పోన్ల ద్వారా మాట్లాడి ఓట్లు వేయాలని కోరుతున్నారు. సమయం లేక పోవడంతో ఎన్నికల ప్రచారం ఒక వంతుగా చూస్తే అభ్యర్థులకు సవాలుగా మారినట్లే. దీంతో ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment