సాక్షి, మాచారెడ్డి: ఎన్నికల సమీపిస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో తలమునకలవుతున్నారు. సమీకరణలు జోరందుకున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ టీ స్టాల్ వద్ద నరేందర్, సురేందర్ అనే ఇద్దరు యువకుల మధ్య జరిగిన ముచ్చటి ఇది. నరేందర్ టీస్టాల్ వద్ద యమ సీరియస్‌గా న్యూస్‌పేపర్ చదువుతున్నారు.
- ఏమ్రా నరీ అగో ఏమో గంత సీరియస్గా పేపర్ చదువుతున్నవేందిరా. ఏమైందిరా అండ్ల నేనచ్చి ఎంత సేపాయే ఇటుదిక్కు సూడకుండా పేపర్ల ముఖం బెట్టినవ్
- ఏమ్జెప్పమంటున్నవ్రా సూరీ పేపర్ చదువుతంటు నవ్వాల్నో... ఏడ్వాల్నో సొసయిస్తలేదు. అరే నీయవ్వ బళ్లు ఓడలు, ఓడలు బళ్లవుతాయంటే ఇదేనోమేరా.
- అరే ఏంద్రాబై ఏమైంద్రా గట్లంటున్నవ్.
- అరే సూరీ ఇగో గీ వార్త సూడు మొన్నటి దాక గాల్ల వగస్ పార్టోళ్లను తిట్టరాని తిట్లు తిట్టరాకుండా తిట్టిండు. తిట్టి పోసియనంక గీయిన గా పార్టీల జేరిండు. గా పార్టీల ఉన్న ఇంకో పెద్ద మనిషి గీళ్లను దిట్టిండు. ఆగట్టునుంటవా నాగన్న... ఈ గట్టుకొస్తావా అన్నట్టు గిండ్లోళ్లు గండ్ల పోవట్టిరి. గండ్లోళ్లు గిండ్ల రావట్టిరి.
- ఛ నీయవ్వ మనసొంటొళ్లం గట్లవోతమారా అవురా నరీ మన పానం బోయిన గట్ల పోము. గా పెద్ద పెద్దొళ్లే జంప్ జిలానీలు అవుతుండ్రు. ఇగ గీళ్ల వశమేమొచ్చింద్రా. ఆళ్లకు నడుస్తదిరాబై...
- అవ్రా సూరీ గీళ్లు పార్టీలు ఎందుకు మారుతారంటవ్.
- అరే నరీగా గద్దెల్వదారా ఆ పార్టీల విలువ తగ్గినోళ్లు...ఈ పార్టీలొకిస్తుండ్రు. ఈ పార్టీల విలవలేనోళ్లు ఆ పార్టీలకు వోతుండ్రు గంతే గింత దానికి బుర్ర బద్దలు కొట్టుకోవడ్తివేందిరా.
- నిజ్జంగారా సూరీ గీళ్లను జూసీ ఆ ఊసరెల్లులు సిగ్గుపడేట్టున్నయ్. పాపం గవి ఆత్మరక్షణ కోసం రంగు మారిస్తే గీళ్లేమో వాళ్ల జేబులు నింపుకునేందుకు, పదవులు పొందేందుకు పార్టీలు మారుస్తుండ్రు.
- అవ్‌రా మస్తుగ జెప్పినవ్రా. నరీ పదవుల కోసం పజీత్ (ఇజ్జత్) దీస్కునే గీళ్లు సేవ జేస్త్రారా ఛ... ఏం రాజకీయాలో ఏమో... అరే గీ వార్త జూడు, మూడు, నాలుగు సార్లు పదవుల్ల ఎక్కినోళ్లు పాపం ఇల్లు గూడ కట్టుకోకుండా సేవ జేసిండ్రట. గీళ్లున్నారా పదవుల కోసం పాకులాడుతూ పబ్బం గడుపుకుంటరా.
- అవ్‌రా సురీ గింత మంచి ముచ్చట చెప్పున్తవ్. మరి నువ్వు రాజకీయాలల్లకు రారాదురా మస్తుగుంటది. ఆ... పోరాబై మనసొంటోళ్లను గీళ్లు గెల్వనిత్తార్నా... వద్దురా బాబు గీ రాజకీయాల జోలికి నేనువోను. అరే గట్లంటే ఎట్లరాబై.. జెర సోసాయించురా... అరే నా వంతుకు నీకు వెయ్యి ఓట్లు ఏపిస్త నువ్వు నిలవడు...
- అరే జోకు జెయ్యకురా బై... టీ తాగు చల్లగైతది. మస్తయింది బాతకానీ.. ఇగ పోదాంపా ఆకలైతుంది..
Comments
Please login to add a commentAdd a comment