సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించక ముందే పలువురు నేతలు అసమ్మతి రాగం అందుకుంటున్నారు. టికెట్ల ఖరారు తర్వాత అసంతృప్తి జ్వాలలు మరింత భగ్గుమనేలా కనిపిస్తున్నాయి. బాన్సువాడ స్థానం నుంచి కాసుల బాల్‌రాజ్ పేరు తెరపైకి వస్తుండటంతో ఈ స్థానాన్ని ఆశించిన మల్యాద్రిరెడ్డి అసమ్మతి గళం వినిపిస్తున్నారు. శుక్రవారం వర్నిలో తన ప్రధాన అనుచరులతో సమావేశమైన ఆయన ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూనే.. బరిలో ఉంటానని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు, మల్యాద్రిరెడ్డికి బీజేపీ గాలం వేస్తోంది. కాంగ్రెస్ నుంచి అవకాశం దక్కని పక్షంలో కమలం పార్టీ టికెట్ ఖరారు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అసమ్మతి రాగాలు ఒక్క బాన్సువాడకే పరిమితమయ్యేలా కనిపించడం లేదు. అభ్యర్థుల ప్రకటన వెంటనే జిల్లాలో పలు చోట్లలో అసమ్మతి నేతలు రచ్చకెక్కనున్నారు. ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేవంత్ వర్గానికి చుక్కెదురు?
కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుల్లో జిల్లాలోని రేవంత్‌రెడ్డి వర్గానికి చుక్కెదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ వెంట కాంగ్రెస్‌లో చేరిన జిల్లాకు చెందిన ముఖ్యనేతలు పలు స్థానాలను ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి నిజామాబాద్ రూరల్ స్థానం ఆశిస్తుండగా, ఎల్లారెడ్డి స్థానానికి సుభాష్‌రెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే, ఆర్మూర్‌లో రాజారాం యాదవ్ కూడా తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురిలో జిల్లాలో ఎవరికి అభ్యర్థిత్వం దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. రూరల్ స్థానాన్ని తనకు కేటాయించాలని అరికెల నర్సారెడ్డి రేవంత్‌రెడ్డి ద్వారా అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. సుభాష్‌రెడ్డి కూడా ఎల్లారెడ్డి అభ్యర్థిత్వం కోసం రేవంత్ ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద రేవంత్‌రెడ్డి వర్గానికి ఏ స్థానం దక్కుతుందనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది.
మరికొన్ని గంటల్లో తొలి జాబితా..
ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా మరికొన్ని గంటల్లో వెలువడే అవకాశాలున్నాయి. ఈ నెల 10న తొలి జాబితాను ప్రకటిస్తామని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా పేర్కొన్నారు. తొలి జాబితాలో జిల్లాకు చెందిన తొమ్మిది స్థానాల్లో ఆరు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు అభ్యర్థిత్వాలు ప్రకటించే వరకు అక్కడే ఉండునున్నారు. టికెట్లు కేటాయించిన తర్వాతే నియోజకవర్గానికి వచ్చి ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment