ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేరికతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీలో వార్ మొదలైందా? అర్బన్ సీటు సంజయ్‌కు కన్ఫామ్ అయిందా? మరి నిజామాబాద్ అర్బన్‌పై ఆశలు పెట్టుకున్నవారు ఏం చేయాలి? పార్టీలో మొదలైన మాటల యుద్ధాన్ని ఎవరు చల్లార్చుతారు? సంజయ్ వల్ల కాంగ్రెస్‌కు లాభమా? నష్టమా? వాచ్ దిస్ స్టోరీ..
పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ తన పెద్ద కుమారుడు సంజయ్‌ను ఎట్టకేలకు కాంగ్రెస్ గూటికి చేర్చారు. సంజయ్ గాంధీభవన్‌లో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఎంతమంది అడ్డుకున్నా ఈ విషయంలో డీఎస్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్లో తనకున్న పట్టు.. తన రాజకీయ అనుభవం ఏంటో పార్టీలోని ప్రత్యర్థులకు చూపించారు.
అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొడుకు సంజయ్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరి 24 గంటలు తిరక్కుండానే డీఎస్ పీచేముడ్ అనడంతో ఒక్కసారిగా ధర్మపురి ఫ్యామిలీ పాలిటిక్స్ బట్టబయలయ్యాయి. డీఎస్ ఫ్యామిలీ పొలిటికల్ ఎపిసోడ్ పక్కనపెట్టి.. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ రాజకీయాలు పరిశీలిస్తే సరికొత్త వార్‌కు తెరతీసినట్లయింది. డీఎస్ పక్కా ప్లాన్ తోనే తన కొడుకు సంజయ్ కు టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకునే తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చారన్న చర్చ ఊపందుకుంది.
నిజామాబాద్ అర్బన్‌లో మున్నూరు కాపుల బలమెక్కువగా ఉండటం డీఎస్ కుమారుడికి కలిసొచ్చే అంశం. ఇప్పటికి రెండుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఆయనకు పార్టీలోను, ప్రజల్లోనూ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. ఈసారి మున్నూరు కాపు బిడ్డను గెలిపించుకోవాలనే గట్టి పట్టుదలతో ఆ సామాజికవర్గీయులంతా ఉన్నట్టుగా చర్చ నడుస్తోంది.
చదవండి: ఎంపీ అర్వింద్‌కు కొత్త టెన్షన్.. నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం!
మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేతగా.. తనకూ, తన తండ్రికి తమ వర్గంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని ఈసారి నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలన్నది సంజయ్ యోచనగా ఉంది. దానికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సై అన్నట్టుగా ఇప్పటికైతే ఓ ప్రచారం ఊపందుకుంది. కానీ సంజయ్ మాత్రం ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.. తన గ్రౌండ్ వర్కంతా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
సంజయ్ రాకను ఆది నుంచీ స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తమ అభ్యంతరాలను ఏఐసీసీకి కూడా నివేదించారు. సీనియర్ నేత, పార్టీకి ఎంతో సేవ చేసిన డీఎస్ వస్తే పర్లేదు గానీ.. సంజయ్ అవసరమా అన్నట్టుగా బాహాటంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. సంజయ్ రాకను అడ్డుకునేందుకు అంతర్గతంగా పావులు కదిపారు. కానీ డీఎస్ తన పంతం నెగ్గించుకుని కొడుకు సంజయ్‌ను తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు.
చదవండి: కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు..?
దీంతో ఇంతకాలం నిజామాబాద్ అర్బన్‌పై ఆశలు పెట్టుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితేంటన్న చర్చ కాంగ్రెస్‌లో మొదలైంది. సంజయ్‌కు టిక్కెట్ కన్ఫామ్ అయిందంటూ సాగుతున్న ప్రచారాన్ని మహేష్ గౌడ్ కొట్టిపారేస్తున్నారు. టిక్కెట్ ఖరారైందంటూ ఇప్పట్నుంచే ఎవరైనా చెప్పుకుంటే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ.. పరోక్షంగా సంజయ్ కు చురకలంటించే యత్నం చేశారు.
తన తమ్ముడు, బీజేపీ ఎంపీ అరవింద్‌తో కొనసాగుతున్న పొల్టికల్ వార్‌లో భాగంగా.. అవసరమైతే అరవింద్ పైనే పోటీకి దిగుతానంటూ కూడా సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్టీలోని సంజయ్ ప్రత్యర్థులు దాన్ని కూడా అడ్వంటేజ్‌గా మార్చుకుంటున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ పోటీ చేస్తాడన్న ప్రచారం జరుగుతుండటంతో.. సంజయ్‌ను అక్కడే తన తమ్ముడిపై బరిలో దింపాలని కూడా అధిష్ఠానం ముందు తమ సూచనలు ఉంచినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఓ వైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వర్గం...మరోవైపు సంజయ్ వర్గం కాంగ్రెస్ బరిలో గిరిగీసి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యర్థి పార్టీలతో కాకుండా..పార్టీలోని ప్రత్యర్థులతోనే ఎవరికి వారు పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్‌లో కొనసాగుతోంది. మొత్తం మీద నిజామాబాద్ అర్బన్‌లో ఒకవైపు డీఎస్ ఫ్యామిలీలో అంతర్గత యుద్ధం..మరో వైపు హస్తం పార్టీలో టిక్కెట్ పోరు అక్కడి కేడర్‌లో ఉత్కంఠను రేపుతోంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment