ఒకప్పుడు అక్కడ మున్నూరు కాపులదే రాజ్యం. పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధులు వారే. కాని ఇప్పుడు వేరే సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ మున్నూరు కాపుల జెండా ఎగరేయాలని ఆ సామాజికవర్గ నేతలు పట్టుదలగా ఉన్నారు. ఈసారి రెండు పార్టీల నుంచి మున్నూరు కాపులు పోటీకి ప్లాన్ చేస్తున్నారు.
ఏ కులానికి టికెట్.?
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన బిగాల గణేష్ గుప్తా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిటింగ్లకే వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయిస్తామని గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ ప్రకటించడంతో..గణేష్ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఎమ్మెల్యేల పనితీరును బట్టి అవసరమైతే అభ్యర్థులను మారుస్తామని కేసీఆర్ చెప్పినా... తాజా ప్రకటన వల్ల సిటింగ్లకు పెద్దగా ఇబ్బంది లేదనే వాదన వినిపిస్తోంది. అయితే గణేష్‌కు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ అర్బన్లో తమ పట్టు పోయిందని భావిస్తున్న మున్నూరు కాపులు తమ వర్గానికి చెందిన నేతను నిలపాలని కోరుకుంటున్నారు. దీంతో ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రేస్లో ముందుకొచ్చారు.
కమలంలోనూ కుల సమీకరణాలే
ఇదిలా ఉంటే మరో వైశ్య ప్రముఖుడు ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈసారి ఆయనకే కమలం సీటు దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి గణేష్, బీజేపీ నుంచి సూర్యనారాయణ..ఇలా రెండు ప్రధాన పార్టీల నుంచి వైశ్య ప్రముఖులకే సీట్లు దక్కుతాయనే ప్రచారం నేపథ్యంలో మున్నూరు కాపులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తమ సామాజికవర్గ బలంతోనే ఎవరైనా గెలవాల్సి ఉంటుందని అందువల్ల తమనుంచే ప్రధాన పార్టీల్లో అభ్యర్థులుండాలని వారు భావిస్తున్నారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే గణేష్కు బదులుగా బరిలో దిగాలని ఆకుల లలిత గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ అధికార టీఆర్ఎస్ నుంచి గనుక ఆకుల లలితకు టిక్కెట్ దక్కకపోతే...ఆమె కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే అవకాశాలూ లేకపోలేదనే ప్రచారమూ జరుగుతోంది.
మా వాళ్లు ఎక్కువ, మేమే గెలుస్తాం..
మరోవైపు కాంగ్రెస్ టిక్కెట్ కోసం సీనియర్ నేత డి.శ్రీనివాస్ పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ కూడా ప్రయత్నిస్తున్నారు. కాని కారిణం బయటకు రాలేదు గాని..ఈ ప్రయత్నాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ధర్మపురి సంజయ్‌కు కాంగ్రెస్ టిక్కెట్ రాకపోతే..అర్బన్‌లో పట్టున్న ఎంఐఎం పార్టీ తరపున దించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మైనారిటీలకు బలం ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం పట్టుదలగా ఉంది. అందువల్ల గాలిపటం పార్టీ నుంచి పోటీ చేస్తే అటు మైనారిటీ ఓట్లు, ఇటు మున్నూరు కాపుల ఓట్లతో తేలిగ్గా గెలవవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నిజామాబాద్ అర్బన్ పోటీ ఈసారి రసవత్తరంగా ఉంటుంది. టీఆర్ఎస్ సిటింగ్కే సీటిస్తే...బీజేపీ కూడా వైశ్య అభ్యర్థినే బరిలో దించితే..ఇక కాంగ్రెస్, ఎంఐఎంల నుంచి మున్నూరు కాపులు పోటీ చేస్తే రాబోయే ఎన్నికల పోరాటం నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనే టాక్ వినిపిస్తోంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment