ఇందూరు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్దం జరుగుతోందా? కొందరు నేతలు టిక్కెట్ల కోసం పాము, ముంగిసల్లా కాట్లాడుకుంటున్నారా? వీళ్ళ వ్యవహారం జిల్లా నుంచి ఢిల్లీ దాకా పాకిపోయిందా? గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో కొందరి కారణంగా పుట్టి మునిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా?
ఎడమ చేయి vs కుడి చేయి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీని కాంగ్రెస్ స్థానిక నేతలు చేతులారా దెబ్బ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఎవరికి వారు పోటీ పడుతూ.. కొట్లాడుకుంటున్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గానికి... ఎల్లారెడ్డి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్‌రావు ఓ కొరకరాని కొయ్యలా మారాడు. ఎల్లారెడ్డి టిక్కెట్‌ను ఇప్పటికే సుభాష్ రెడ్డి అనే నేత ఆశిస్తున్నారు. అయితే మదన్ మోహన్ చేసుకుంటున్న ప్రచారంతో... సుభాష్ రెడ్డితో పాటు...షబ్బీర్ అలీకి దిక్కుతోచని పరిస్థితులేర్పడ్డాయి. పైగా సుభాష్ రెడ్డీకి షబ్బీర్ అలీ మద్దతుగా ఉంటున్నందుకు...మదన్‌మోహన్ ఆయనకు కూడా ఎర్త్ పెడుతున్నాడు. అప్పుడప్పుడు టీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అజారుద్దీన్ ను తీసుకొచ్చి... అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి తాను బరిలోకి దిగుతానంటూ స్టేట్ మెంట్స్ కూడా ఇప్పిస్తుండటంతో.. షబ్బీర్ వర్గీయుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడిన్టవుతోంది. ఈ క్రమంలోనే...పీసీసీ చీఫ్ రేవంత్ పర్యటన సందర్భంగా రెండు వర్గాల మధ్య మరోసారి బాహాబాహీకి తెరలేచింది.
నీ గుట్టు నేను విప్పుతా
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించే రచ్చబండ కార్యక్రమాల సమయంలో.. ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్, సుభాష్ రెడ్డి గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎల్లారెడ్డిలో రేవంత్ సభ జరిగిన సమయంలో కూడా రచ్చ జరిగింది. ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కార్ల కాన్వాయ్ ఒకటి వచ్చి సుభాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం.. సదరు ఎమ్మెల్యే స్టిక్కర్ కారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి,.
మదన్ మోహన్ స్వయానా ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు. మంత్రి స్టిక్కర్ కార్ల కాన్వాయ్ ఘటనతో మదన్ మోహన్ పై కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఏఐసీసీ స్థాయిలో ఉన్న తన పలుకుబడితో మదన్ మోహన్ సస్పెన్షన్ అమలవకుండా చేసుకోగలిగారు. ఇటవంటి ఘటనలన్నీ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. అంతేకాదు, ఒకసారి కామారెడ్డిలో మదన్ మోహన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చిన అజారుద్దీన్... అధిష్ఠానం ఆదేశిస్తే తాను కామారెడ్డి బరిలో ఉంటానని..ఇంకోసారి ఎల్లారెడ్డిలో పోటీ చేస్తానని చెప్పారు. ఇలా షబ్బీర్ వర్గానికి వ్యతిరేకంగా మదన్ మోహన్ వర్గం జిల్లాలో సీరియస్‌గా పనిచేస్తోంది. అటు షబ్బీర్‌కు, ఇటు సుభాష్‌రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి తీసుకువస్తున్నారు మదన్‌మోహన్.
తగ్గేదే లేదట.!
కామారెడ్డి, ఎల్లారెడ్డి చూసుకుంటానని చెప్పడానికి షబ్బీర్ అలీ ఎవరని ప్రశ్నిస్తూ మదన్‌మోహన్ కామారెడ్డిలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏడుసార్లు ఓటమి పాలైన షబ్బీర్ ముందు కామారెడ్డిలో గెలిచి.. ఎల్లారెడ్డి సంగతి చూడాలని సూచించారు. టిక్కెట్లు పంపిణీ చేసేందుకు.. షబ్బీర్ అలీ టీపీసీసీ అధ్యక్షుడో, ఏఐసీసీ అధ్యక్షుడో కాదంటూ మదన్ మోహన్ కామెంట్ చేశారు. కచ్చితంగా తాను ఎల్లారెడ్డి నుంచి బరిలో ఉంటానని తేల్చి చెప్పిన మదన్ మోహన్.. ప్రజలు తిరస్కరిస్తే ఓ కార్యకర్తలా పనిచేయడానికీ సిద్ధమేనంటూ తన మనోగతాన్ని వివరించారు. అదే సమయంలో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా తన గళాన్ని గట్టిగా వినిపించాడు. దీంతో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయాయి.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment