yella reddy
-
కేసీఆర్‌తో కలిసి నడిచాడు, కమిట్మెంట్ ఉన్న ఎమ్మెల్యే: కేటీఆర్
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని అన్నారు. పైసలు, పదవుల కోసం సురేందర్ రాజకీయల్లోకి రాలేదని, తెలంగాణ రావాలని కేసీఆర్‌తో కలిసి నడిచారని గుర్తు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. కేసీఆర్‌ను, మంత్రులను సురేందర్ ఎప్పుడు కలిసినా మా నియోజకవర్గం వెనుకబడింది, నిధులు కేటాయించాలని అడుగుతారని కేటీఆర్ గుర్తు చేశారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.20 కోట్ల 31లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే అత్యధికంగా 1లక్షా 3 వేల మందికి రైతు బంధు అందుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం రైతులు అవస్థలు పడ్డారని విమర్శించారు. కరెంట్ లేక సాగునీరు కోసం రైతులు అడుక్కోవాల్సి వచ్చిందన్నారు. విత్తనాలు, ఎరువు పోలీస్ స్టేషన్లో పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్‌దని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు 10 సార్లు ఓటేస్తే రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీవి నీతి లేని మాటలని కేటీఆర్ ధ్వజమెత్తారు. హిందూ, ముస్లిం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదని ఫైర్ అయ్యారు. రాబంధులు రావాలా రైతు బంధు కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కుంభకోణాలేనని విమర్శించారు. హస్తం పాలనలో దుర్భిక్షం.. బీఆర్ఎస్ పాలనలో సస్యశ్యామలమని తెలిపారు. కాగా 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసిన సురేందర్ సమీప టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్) అభ్యర్థిపై 31,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకముందు మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను కేటీఆర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. -
కామారెడ్డి.. ఎల్లారెడ్డి.. కుమ్ములాటకు రెడీ
ఇందూరు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్దం జరుగుతోందా? కొందరు నేతలు టిక్కెట్ల కోసం పాము, ముంగిసల్లా కాట్లాడుకుంటున్నారా? వీళ్ళ వ్యవహారం జిల్లా నుంచి ఢిల్లీ దాకా పాకిపోయిందా? గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో కొందరి కారణంగా పుట్టి మునిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎడమ చేయి vs కుడి చేయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీని కాంగ్రెస్ స్థానిక నేతలు చేతులారా దెబ్బ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఎవరికి వారు పోటీ పడుతూ.. కొట్లాడుకుంటున్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గానికి... ఎల్లారెడ్డి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్‌రావు ఓ కొరకరాని కొయ్యలా మారాడు. ఎల్లారెడ్డి టిక్కెట్‌ను ఇప్పటికే సుభాష్ రెడ్డి అనే నేత ఆశిస్తున్నారు. అయితే మదన్ మోహన్ చేసుకుంటున్న ప్రచారంతో... సుభాష్ రెడ్డితో పాటు...షబ్బీర్ అలీకి దిక్కుతోచని పరిస్థితులేర్పడ్డాయి. పైగా సుభాష్ రెడ్డీకి షబ్బీర్ అలీ మద్దతుగా ఉంటున్నందుకు...మదన్మోహన్ ఆయనకు కూడా ఎర్త్ పెడుతున్నాడు. అప్పుడప్పుడు టీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అజారుద్దీన్ ను తీసుకొచ్చి... అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి తాను బరిలోకి దిగుతానంటూ స్టేట్ మెంట్స్ కూడా ఇప్పిస్తుండటంతో.. షబ్బీర్ వర్గీయుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడిన్టవుతోంది. ఈ క్రమంలోనే...పీసీసీ చీఫ్ రేవంత్ పర్యటన సందర్భంగా రెండు వర్గాల మధ్య మరోసారి బాహాబాహీకి తెరలేచింది. నీ గుట్టు నేను విప్పుతా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించే రచ్చబండ కార్యక్రమాల సమయంలో.. ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్, సుభాష్ రెడ్డి గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎల్లారెడ్డిలో రేవంత్ సభ జరిగిన సమయంలో కూడా రచ్చ జరిగింది. ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కార్ల కాన్వాయ్ ఒకటి వచ్చి సుభాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం.. సదరు ఎమ్మెల్యే స్టిక్కర్ కారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి,. మదన్ మోహన్ స్వయానా ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు. మంత్రి స్టిక్కర్ కార్ల కాన్వాయ్ ఘటనతో మదన్ మోహన్ పై కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఏఐసీసీ స్థాయిలో ఉన్న తన పలుకుబడితో మదన్ మోహన్ సస్పెన్షన్ అమలవకుండా చేసుకోగలిగారు. ఇటవంటి ఘటనలన్నీ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. అంతేకాదు, ఒకసారి కామారెడ్డిలో మదన్ మోహన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చిన అజారుద్దీన్... అధిష్ఠానం ఆదేశిస్తే తాను కామారెడ్డి బరిలో ఉంటానని..ఇంకోసారి ఎల్లారెడ్డిలో పోటీ చేస్తానని చెప్పారు. ఇలా షబ్బీర్ వర్గానికి వ్యతిరేకంగా మదన్ మోహన్ వర్గం జిల్లాలో సీరియస్‌గా పనిచేస్తోంది. అటు షబ్బీర్‌కు, ఇటు సుభాష్‌రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి తీసుకువస్తున్నారు మదన్మోహన్. తగ్గేదే లేదట.! కామారెడ్డి, ఎల్లారెడ్డి చూసుకుంటానని చెప్పడానికి షబ్బీర్ అలీ ఎవరని ప్రశ్నిస్తూ మదన్మోహన్ కామారెడ్డిలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏడుసార్లు ఓటమి పాలైన షబ్బీర్ ముందు కామారెడ్డిలో గెలిచి.. ఎల్లారెడ్డి సంగతి చూడాలని సూచించారు. టిక్కెట్లు పంపిణీ చేసేందుకు.. షబ్బీర్ అలీ టీపీసీసీ అధ్యక్షుడో, ఏఐసీసీ అధ్యక్షుడో కాదంటూ మదన్ మోహన్ కామెంట్ చేశారు. కచ్చితంగా తాను ఎల్లారెడ్డి నుంచి బరిలో ఉంటానని తేల్చి చెప్పిన మదన్ మోహన్.. ప్రజలు తిరస్కరిస్తే ఓ కార్యకర్తలా పనిచేయడానికీ సిద్ధమేనంటూ తన మనోగతాన్ని వివరించారు. అదే సమయంలో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా తన గళాన్ని గట్టిగా వినిపించాడు. దీంతో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
గులాబీ ముళ్లు: ఈటలతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు మంతనాలు!
గులాబీ కోటలో కలకలం మొదలైంది. అధిష్టానం వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తగిన గుర్తింపు దక్కని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం మాజీ ఎమ్మెల్యే బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. సాక్షి, కామారెడ్డి: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నికలను ఆయుధంగా మలచుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2008లో ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించారు. అప్పుడు రవీందర్‌రెడ్డి అధినేత చెప్పినట్లుగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్‌గౌడ్ చేతిలో ఓటమి చెందారు. 2009 సాధారణ ఎన్నికల్లో తిరిగి ఆయన గెలుపు తీరాలకు చేరారు. తెలంగాణ కోసం 2010లో మరోసారి ఎమ్మెల్యే పదవిని వీడారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీని ఓడించారు. 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగిన రవీందర్‌రెడ్డి 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు. సురేందర్ చేరికతో తగ్గిన ప్రాధాన్యత ఎల్లారెడ్డి నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్ 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గ టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా సురేందర్‌కు ప్రాధాన్యత లభించడం, పార్టీ అధిష్టానం తనను పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారన్న ప్రచారం ఉంది. 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన రవీందర్‌రెడ్డికి అధిష్టానం నుంచి భరోసా దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మంత్రి హరీశ్‌రావు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న రవీందర్‌రెడ్డికి పార్టీ నాయకత్వం తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆయన కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. తనతో పాటు తన క్యాడర్‌కు అన్యాయం జరుగుతోందంటూ పార్టీ నేతల దగ్గర పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈటల వెంటే..? టీఆర్ఎస్ ఆవిర్భావ సమయం నుంచి పార్టీ ముఖ్య నేతలందరితో సన్నిహిత సంబంధాలున్న ఏనుగు రవీందర్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈటల వెంట అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టినా, వేరే పార్టీలో చేరినా ఆయన వెంట నడవాలనే ఆలోచనతోనే ఈటలను కలిసినట్టు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డికి నియోజక వర్గంలో బలమైన క్యాడర్ ఉంది. వారంతా ఆయన వెంటే నడుస్తారని తెలుస్తోంది. అప్పట్లో బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినా తాను టీఆర్ఎస్ను వీడేదిలేదని పేర్కొన్నారు. అయితే పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనలో ఉన్న రవీందర్‌రెడ్డి.. ఇప్పుడు ఈటల వెంట నడుస్తాడన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఈటలను కలవడం అందుకు బలాన్ని చేకూర్చింది. రవీందర్‌రెడ్డి అనుచురులైతే తాడోపేడో తేల్చుకోవాలని కొంత కాలంగా ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పార్టీలో గుర్తింపు లేకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆయన అనుచరులు బాహాటంగానే పేర్కొంటున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా వారికి సభ్యత్వ నమోదు పుస్తకాలు అందకపోవడంతో సభ్యత్వం కూడా తీసుకోలేదని సమాచారం. జిల్లా టీఆర్ఎస్ పార్టీలో మరికొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వివిధ మండలాలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు చాలా మంది తమకు సరైన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతో ఉన్నారని తెలు స్తోంది. నామినేటెడ్ పదవులు లేకపోవడంతో పాటు రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు రాకపోవడంతో కొందరు అసంతృప్తితో ఉన్నారు. వారు రవీందర్‌రెడ్డి బాటలో నడుస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో తొలి నాటి నుంచి పనిచేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వంలో çతగిన గుర్తింపు లభించలేదు. దీంతో వారంతా ఈటల వెంట నడిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. చదవండి: ఈటలతో కాంగ్రెస్ నేత భేటీ, టీపీసీసీకి షాక్ తప్పదా? -
శాంతి చిహ్నం
వజ్రపురం, గిరిపురం రెండు రాజ్యాల మధ్య నది ఒక్కటే అడ్డం. అది ఎప్పుడూ ప్రవహిస్తూ వుంటుంది. ఒక రాజ్యంలోకి మరొకరు ప్రవేశించాలంటే తెప్పల ద్వారా దాటాల్సిందే. రెండు రాజ్యాల మధ్య ఏనాడూ ఘర్షణలు లేవు. అక్కడ సంత జరిగినా, ఇక్కడ సంత జరిగినా సఖ్యతతో జరిగేది. మోసాలు, కుట్రలు లేవు. ఇద్దరు రాజులు ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేమిటంటే... వివాహసంబంధాలు అక్కడ, ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవాలి. ఇంకే రాజ్యసంబంధాలు చేసుకోకూడదు. దానితో రెండు రాజ్యాలు ఇంకా పటిష్టమైనాయి. ప్రజలు కూడా రాజుల శాసనాలకు మద్దతు ఇచ్చారు. రెండు రాజ్యాలలో ‘కరువు’ అనేది కనిపించడం లేదు. ఏ సహాయమైనా క్షణాల్లో జరిగిపోతుంటుంది. ఈ రెండు రాజ్యాల సంబంధం, ఐక్యత చూసి గిరిపురం దగ్గరలోని కొండ దిగువన ఉన్న శ్రీపురం రాజు కన్ను గిరిపురంపై పడింది. ఎలాగైనా సరే గిరిపురాన్ని ఆక్రమించి తన రాజ్యంలో కలుపుకోవాలనుకున్నాడు. గిరిపురంతో పోల్చుకుంటే శ్రీపురం సైనికబలగం ఎక్కువే. కాని గిరిపురం, వజ్రపురం కలిస్తే శ్రీపురం మట్టి కరవడం ఖాయం. రెండు రాజ్యాల ఐక్యత, ఆ ఐక్యత వల్ల వచ్చిన బలం శ్రీపురం రాజుకు ఇబ్బందిగా మారింది. కయ్యమా? స్నేహమా? అని ఆలోచించాడు. చివరికి కయ్యానికి కాలు దువ్వి గిరిపురానికి దూతతో లేఖ పంపాడు. ‘‘నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను. అయితే నీవు వజప్రురం సహాయం తీసుకోకూడదు. ఇరువైపులా సైనికులు కూడా వద్దు. యుద్ధభూమిలో మనిద్దరమే వుండాలి’’ అని రాశాడు. గిరిపురం రాజు వీరదత్తుడు ఆ లేఖ చదివి చిరునవ్వు నవ్వి– ‘‘యుద్ధం జరగకుండానే నీ మనసు మారాలి’’ అని ప్రార్థించాడు. మరుసటి రోజు– శ్రీపురం రాజు తలకు శిరస్త్రాణంతో, ఆయుధాలతో వచ్చాడు. గిరిపురం రాజు తన శిరస్త్రాణం ఎక్కడ ఉంచాడో తెలియలేదు. అంతా వెదికాడు. చివరకు తల్లికి కబురు పెట్టి ‘‘నా శిరస్త్రాణం ఎక్కడమ్మా?’’ అని అడిగాడు. ఆమె చెప్పింది. ‘‘అలాగా’’ అంటూ శిరస్త్రాణం లేకుండానే ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్లాడు గిరిపురం రాజు. అతన్ని చూడగానే జయవర్మ– ‘‘రాజా! శిరస్త్రాణం లేకుండా వచ్చావు. అది ధరించిరా యుద్ధం చేద్దాం’’ అన్నాడు. అప్పుడు వీరదత్తుడు– ‘‘రాజా! నేను శిరస్త్రాణం ధరించాలంటే అన్యాయంగా ఓ ప్రాణిని చంపినట్లవుతుంది. దాన్ని చంపడం ఇష్టం లేక ఇలానే వచ్చాను’’ అన్నాడు. జయవర్మకి అర్థం కాలేదు. శిరస్త్రాణం ధరిస్తే ఒక ప్రాణి చచ్చిపోతుందా! అనుకొని ‘‘నువ్వు చెప్పేదాంట్లో నిజం ఉంటే నేను యుద్ధం మానేస్తా’’ అన్నాడు. అప్పుడు వీరదత్తుడు జయవర్మని తన రాజ్యానికి ఆహ్వానించి ఆయుధగారంలో ఓ మూలన ఉన్న శిరస్త్రాణం చూపాడు. జయవర్మ అది చూసి ఆశ్చర్యపోయాడు. శిరస్త్రాణంలో ఒక తెల్లని పావురం పిల్లలు పెట్టుకుంది. అవి తల్లి రెక్కల కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. తల్లిపావురం ఆ పిల్లలను రెక్కల కింద భద్రంగా దాచింది. ‘‘రాజా! నేను శిరస్త్రాణం ధరించాలంటే ఆ పావురాన్ని వెళ్లగొట్టాలి. అప్పుడు ఆ పావురం, పిల్లలు ఆవాసం లేక చచ్చిపోతాయి. అది నాకు ఇష్టం లేదు. అందుకే శిరస్త్రాణం ధరించలేదు’’ అన్నాడు వీరదత్తుడు. ఆ మాటకు కళ్ళు తెరిచాడు జయవర్మ. ‘‘నిజమే, యుద్ధం ఏ దేశానికి తగినది కాదు. శాంతే మన లక్ష్యం. ఈరోజు నుంచి కాదు...ఈ క్షణం నుంచి నేను యుద్ధం చేయను. శాంతి కోసం పోరాడతా! నన్ను నీ మిత్రునిగా చేర్చుకో’’ అని వీరదత్తుడిని ఆలింగనం చేసుకున్నాడు జయవర్మ. ఆ స్నేహాన్ని చూసి పావురం రెక్కలు టపటపా కొట్టింది. ‘‘ఇప్పుడు మనం ముగ్గరం మిత్రులమే’’ అన్నాడు వీరదత్తుడు. ‘‘యుద్ధాన్ని దూరం చేసి శాంతికి ద్వారాలు తీసిన ఆ పావురం మన రాజ్యాలకు శాంతిచిహ్నంగా ఉంటుంది’’ అన్నాడు జయవర్మ. అలా పావురం శాంతికి చిహ్నంగా మారిపోయింది. -
ఎన్ఎస్పీ క్వార్టర్ల విక్రయం ఎప్పుడో?
హాలియా, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్ వాసులకు సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. డ్యామ్ నిర్మాణం నుంచి పనిచేసి రిటైర్డ్ అయిన అధికారులు, డ్యామ్ నిర్మాణంలో పాల్గొన్న కూలీల వారసులు తాము నివాసం ఉంటున్న ఎన్ఎస్పీ క్వార్టర్లను తమకే ఇవ్వాలని 20 ఏళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం సాగర్‌లో మిగులు క్వార్టర్లు విక్రయించేందుకు మూడేళ్ల క్రితం 1653 జీఓ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రభుత్వమైనా తమకు మిగులు క్వార్టర్లు విక్రయించాలని సాగర్వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఉద్యోగ, కార్మికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఈఈ, ఏఈ, ఏ, బీ, బీ2, సీ, డీ, ఈ1, టైఫ్కు చెందిన సుమారు 4500 క్వార్టర్లను నిర్మించింది. అందులో కొన్నింటిని 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం అర్హులైన పేదలకు కనీస ధరకే విక్రయించింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పరిధిలో 1600 క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో నీటిపారుదల శాఖ అధికారులతోపాటు, విద్య, వైద్య, ఆరోగ్య, విద్యుత్, పోస్టాఫిస్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన ఉద్యోగులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా నివాసం ఉంటున్నారు. 40 ఏళ్లుగా క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారు వాటిని తమకే కేటాయించాలంటూ రెండు దశాబ్ధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. 2005లో నాగార్జునసాగర్‌లో జరిగిన సాగర్ స్వర్ణోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నాటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎన్ఎస్పీ సిబ్బంది కలిసి క్వార్టర్లు తమకే కేటాయించాలని కోరారు. ఇందుకు రాజశేఖరరెడ్డి సానుకూలంగా స్పందించారు. 2009 సాధారణ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కుందూరు జానారెడ్డి సైతం తనను గెలిపిస్తే.. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే క్వార్టర్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారికే కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ప్రజల ఒత్తిడి మేరకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 2011లో ప్రాజెక్ట్ అవసరాలకు పోను మిగిలిన క్వార్టర్ల సంఖ్య నిర్ధారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సర్వే చేసిన ఎన్ఎస్పీ అధికారులు ఇరిగేషన్, ఇతర శాఖల అవసరాలు పోను 459 క్వార్టర్లను విక్రయించవచ్చునని ప్రభుత్వానికి నివేదించారు. గతంలో ఆందోళన..... ప్రాజెక్టు పరిధిలోని మిగులు క్వార్టర్ల విక్రయంలో 1653 జీఓకు విరుద్ధంగా ఎన్ఎస్పీ అధికారులు వ్యవహరించడంపై గతంలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. 1653 జీఓ ప్రకారం ఎన్ఎస్పీ క్వార్టర్ల విక్రయంలో మొదట ఇరిగేషన్ శాఖ ఉద్యోగులకు, ఆ తరువాత రిటైర్డ్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అర్హులను పక్కనపెట్టి ఇతరులు 89 మందికి క్వార్టర్లు కేటాయింపు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో కలత చెందిన ఉద్యోగులు గత ఫిబ్రవరి మాసంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ ఎల్లారెడ్డిని సైతం ఘెరావ్ చేశారు. దీంతో సీఈ ఎల్లారెడ్డి స్పందించి 89మందికి క్వార్టర్స్ విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు ఇరిగేషన్ సెక్రటరీతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు ఆందోళన కూడా విరమించారు. అయితే సీఈ ఇప్పటి వరకు ఉన్నతాధికారులతో మాట్లాడకపోవడంతో క్వార్టర్ల విక్రయం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికే ఆలస్యమైందని, వెంటనే సీఈ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సాగర్వాసులు కోరుతున్నారు. 459 క్వార్టర్ల విక్రయానికి 1653 జీఓ జారీ నాగార్జునసాగర్‌లో ఉన్న మిగులు క్వార్టర్ల విక్రయించేందుకు 2011, ఆగస్టు 22న ప్రభుత్వం 1653 జీఓ జారీ చేసింది. దీని ప్రకారం క్వార్టర్ల విక్రయంలో మొదటి ప్రాధాన్యం ఇరిగేషన్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి, రెండో ప్రాధాన్యం రిటైర్డ్ ఉద్యోగులకు, మూడో ప్రాధాన్యం ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారికి, చివరి ప్రాధాన్యం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాల్సి ఉంది. క్వార్టర్ల విక్రయానికి సంబంధించి భూమి వాల్యుయేషన్ నిర్ధారించే బాధ్యతను రెవెన్యూ అధికారులకు, ప్రస్తుతం క్వార్టర్లలో ఎవరు నివాసం ఉంటున్నారు, విక్రయానికి వారు అర్హులా..కాదా అన్న విషయాలను నిర్ధారించే బాధ్యతను ఎన్ఎస్పీ అధికారులకు అప్పగించారు. ఇలా ఆయా అంశాలను పరిశీలించిన అధికారులు 149 మందితో మొదటి లిస్టును తయారు చేశారు. -
22న నరేంద్ర మోడీ రాక
ఎల్లారెడ్డి రూరల్, న్యూస్‌లైన్ : భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈనెల 22న జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోడీ సభకు లక్షలాదిమంది తరలి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అనువైన మూడు స్థలాలను పరిశీలించామని, పార్టీ రాష్ట్ర బాధ్యులు, స్థానిక అధికారులతో చర్చిం చిన అనంతరం స్థలాన్ని ఎంపిక చేస్తామన్నారు. సభను ఉదయం 11గంటలకు నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించనున్నామన్నారు. ఆయ న వెంట టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జహీరాబాద్ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి మదన్మోహన్రావు, ఎల్లారెడ్డి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, మాజీమంత్రి నెరేళ్ల ఆంజనేయులు తదితరులున్నారు. -
‘గులాబీ’ గూటికి జనార్దన్‌గౌడ్ ?
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులుతోపాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు సై తం ఆయన వెంట సాగనున్నట్లు సమాచారం. జనార్దన్ గౌడ్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. ఆయన 1999, 2004, 2008, 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. 2008 ఉప ఎన్నికలో గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ తనకే టికెట్టు వస్తుందని ఆశించారు. అయితే అనూహ్యంగా నల్లమడుగు సురేందర్‌ను పార్టీ తెరపైకి తేవడంతో అవాక్కయ్యారు. నియోజకవర్గంలో ఐదుగురు సీనియర్లు ఉండగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా జనార్దన్‌గౌడ్ నామినేషన్ వేసినా.. శనివారం ఉపసంహరించుకున్నారు. తమకు కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్టు ఇచ్చిన అధిష్టానానికి బుద్ధి చెప్పాలని సీనియర్లు నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్లో చేరి కాంగ్రెస్న ఓడించాలన్న లక్ష్యంతో వారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై మాజీ మంత్రి నేరెళ్లతో కలిసి ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది. రెండు రోజుల్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరతారని సమాచారం. వారిస్తున్న మరికొందరు.. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేశామని, ఇప్పుడు అదే పార్టీ లో చేరడం బాగుండదని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని కొందరు ఆలోచిస్తున్నారు. పలువురు కార్యకర్త లు, నాయకులు మాత్రం బీజేపీలోకి వెళ్దామని సూచించినట్లు తెలిసింది. ఏ పార్టీలోనూ చేరొద్ద ని, కాంగ్రెస్ తమకు చేసిన మోసాలను ప్రజ లకు వివరిద్దామని ఇంకొందరు సూచించినట్లు సమాచారం. ఏ విషయమై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.