వజ్రపురం, గిరిపురం రెండు రాజ్యాల మధ్య నది ఒక్కటే అడ్డం. అది ఎప్పుడూ ప్రవహిస్తూ వుంటుంది.
ఒక రాజ్యంలోకి మరొకరు ప్రవేశించాలంటే తెప్పల ద్వారా దాటాల్సిందే. రెండు రాజ్యాల మధ్య ఏనాడూ ఘర్షణలు లేవు. అక్కడ సంత జరిగినా, ఇక్కడ సంత జరిగినా సఖ్యతతో జరిగేది.
మోసాలు, కుట్రలు లేవు.
ఇద్దరు రాజులు ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేమిటంటే... వివాహసంబంధాలు అక్కడ, ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవాలి. ఇంకే రాజ్యసంబంధాలు చేసుకోకూడదు. దానితో రెండు రాజ్యాలు ఇంకా పటిష్టమైనాయి.
ప్రజలు కూడా రాజుల శాసనాలకు మద్దతు ఇచ్చారు. రెండు రాజ్యాలలో ‘కరువు’ అనేది కనిపించడం లేదు.
ఏ సహాయమైనా క్షణాల్లో జరిగిపోతుంటుంది.
ఈ రెండు రాజ్యాల సంబంధం, ఐక్యత చూసి గిరిపురం దగ్గరలోని కొండ దిగువన ఉన్న శ్రీపురం రాజు కన్ను గిరిపురంపై పడింది. ఎలాగైనా సరే గిరిపురాన్ని ఆక్రమించి తన రాజ్యంలో కలుపుకోవాలనుకున్నాడు.
గిరిపురంతో పోల్చుకుంటే శ్రీపురం సైనికబలగం ఎక్కువే.
కాని గిరిపురం, వజ్రపురం కలిస్తే శ్రీపురం మట్టి కరవడం ఖాయం.
రెండు రాజ్యాల ఐక్యత, ఆ ఐక్యత వల్ల వచ్చిన బలం శ్రీపురం రాజుకు ఇబ్బందిగా మారింది.
కయ్యమా? స్నేహమా? అని ఆలోచించాడు.
చివరికి కయ్యానికి కాలు దువ్వి గిరిపురానికి దూతతో లేఖ పంపాడు.
‘‘నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను.
అయితే నీవు వజప్రురం సహాయం తీసుకోకూడదు.
ఇరువైపులా సైనికులు కూడా వద్దు.
యుద్ధభూమిలో మనిద్దరమే వుండాలి’’ అని రాశాడు.
గిరిపురం రాజు వీరదత్తుడు ఆ లేఖ చదివి చిరునవ్వు నవ్వి–
‘‘యుద్ధం జరగకుండానే నీ మనసు మారాలి’’ అని ప్రార్థించాడు.
మరుసటి రోజు–
శ్రీపురం రాజు తలకు శిరస్త్రాణంతో, ఆయుధాలతో వచ్చాడు. గిరిపురం రాజు తన శిరస్త్రాణం ఎక్కడ ఉంచాడో తెలియలేదు. అంతా వెదికాడు. చివరకు తల్లికి కబురు పెట్టి ‘‘నా శిరస్త్రాణం ఎక్కడమ్మా?’’ అని అడిగాడు.
ఆమె చెప్పింది.
‘‘అలాగా’’ అంటూ శిరస్త్రాణం లేకుండానే ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్లాడు గిరిపురం రాజు.
అతన్ని చూడగానే జయవర్మ–
‘‘రాజా! శిరస్త్రాణం లేకుండా వచ్చావు. అది ధరించిరా యుద్ధం చేద్దాం’’ అన్నాడు.
అప్పుడు వీరదత్తుడు–
‘‘రాజా! నేను శిరస్త్రాణం ధరించాలంటే అన్యాయంగా ఓ ప్రాణిని చంపినట్లవుతుంది. దాన్ని చంపడం ఇష్టం లేక ఇలానే వచ్చాను’’ అన్నాడు.
జయవర్మకి అర్థం కాలేదు.
శిరస్త్రాణం ధరిస్తే ఒక ప్రాణి చచ్చిపోతుందా! అనుకొని ‘‘నువ్వు చెప్పేదాంట్లో నిజం ఉంటే నేను యుద్ధం మానేస్తా’’ అన్నాడు.
అప్పుడు వీరదత్తుడు జయవర్మని తన రాజ్యానికి ఆహ్వానించి ఆయుధగారంలో ఓ మూలన ఉన్న శిరస్త్రాణం చూపాడు.
జయవర్మ అది చూసి ఆశ్చర్యపోయాడు.
శిరస్త్రాణంలో ఒక తెల్లని పావురం పిల్లలు పెట్టుకుంది. అవి తల్లి రెక్కల కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. తల్లిపావురం ఆ పిల్లలను రెక్కల కింద భద్రంగా దాచింది.
‘‘రాజా! నేను శిరస్త్రాణం ధరించాలంటే ఆ పావురాన్ని వెళ్లగొట్టాలి. అప్పుడు ఆ పావురం, పిల్లలు ఆవాసం లేక చచ్చిపోతాయి. అది నాకు ఇష్టం లేదు. అందుకే శిరస్త్రాణం ధరించలేదు’’ అన్నాడు వీరదత్తుడు.
ఆ మాటకు కళ్ళు తెరిచాడు జయవర్మ.
‘‘నిజమే, యుద్ధం ఏ దేశానికి తగినది కాదు. శాంతే మన లక్ష్యం. ఈరోజు నుంచి కాదు...ఈ క్షణం నుంచి నేను యుద్ధం చేయను. శాంతి కోసం పోరాడతా! నన్ను నీ మిత్రునిగా చేర్చుకో’’ అని వీరదత్తుడిని ఆలింగనం చేసుకున్నాడు జయవర్మ.
ఆ స్నేహాన్ని చూసి పావురం రెక్కలు టపటపా కొట్టింది.
‘‘ఇప్పుడు మనం ముగ్గరం మిత్రులమే’’ అన్నాడు వీరదత్తుడు.
‘‘యుద్ధాన్ని దూరం చేసి శాంతికి ద్వారాలు తీసిన ఆ పావురం మన రాజ్యాలకు శాంతిచిహ్నంగా ఉంటుంది’’ అన్నాడు జయవర్మ.
అలా పావురం శాంతికి చిహ్నంగా మారిపోయింది.
శాంతి చిహ్నం
Published Sun, Dec 22 2019 1:34 AM | Last Updated on Sun, Dec 22 2019 1:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment