Story in funday
-
మిత్తా మాయమై పోనావా...!
కోడి కూసింది. చెంబు పట్టుకొని ఊరి గోర్జివైపు వెళ్లిన సొండి రామ్మూర్తి పెద్ద కేకేశాడు..అవురా ఇంటికేసిన తాళం అలానే ఉంది... సవరోళ్లు మాయమై పోనారని. ఇంకేం అది ఆళ్లపనే ఆళ్లకు మంత్రాలొచ్చురా..నాను మొన్ననే అనుకున్నానెస్..తొత్తుకొడుకులు మా ఆవుపడ్డకేసి ఒకటే సూపు సూసినాడా..అది అనంగ ఇరగబడి పోయిందెస్..అని వెనకనే ఉన్న పాలేసు తన అనుభవం చెప్పేశాడు. ఊరంతా మళ్లీ కలకలం..ఆ గందరగోళంలోనే కళ్లంనుంచి ఇంటికొచ్చిన ఈశ్వరుడికి వెక్కిరిస్తూ కనిపించాయి మిత్తలు తెచ్చిన పట్టుతేనె, వెదురు బియ్యం,అరటి గెలలు..రాత్రేమయ్యిందో తెలీదు..ఇల్లనుకొని వచ్చిన సవరలు ఎందుకెళ్లిపోయారో తెలీదు..తన తాతల నుంచి సాగిన స్నేహబంధాన్ని ఎవరు తెంపేశారో అర్థం కాలేదు..అయితే ఏదో అనుకోనిది జరిగిందన్నది అర్థమైంది. కంట తడిపెట్టుకున్నాడు..‘ఓరయ్యా పల్లకోరా ఏటి సిన్నపిల్లడినాగా ’అని కొడుకులు కసురుకుంటున్నా మిత్తల అమాయక మొహాలే తనను నిలదీస్తున్నట్లు ..నువ్వేం పెద్ద మనిషివయ్యా..అని చీదరించుకుంటున్నట్లు భావన గుండెను పిండేస్తోంది. తూర్పు గాలి వీస్తోంది.రాత్రి ఎనిమిది దాటుతోంది. ఊరంతా భోజనాలు ముగించి వాకిళ్లలో కూర్చున్నారు.పిల్లలంతా ఈత చాపలు, దుప్పట్లు పట్టుకొని పరుగులు తీస్తున్నారు.అంతా ఒకటే హడావుడి. బుడబుడకల సూరిగాడి పాటట..‘ఓహ్ తుంగాం సూరిగాడి ఏసం కట్టి పాటెత్తుకుంటేనే ఓలప్పా సరస్వతి చెపుతోంది..అంకమ్మతో. కమ్మగా ఉంతాదే. రెక్కల రంభ కథ ఎప్పుడైనా ఇన్నావే. ఆడి మాటకేంగానీ పక్కన అంజిగాడు బుడబుడకల కుండతోటి రక్తి కట్టిత్తాడే. గతేడాది కార్తీక నోములప్పుడు భీయమ్య మామోళ్ల ఇంటికాడ ఆడించినారు కదా..నీకు ఎరికి నేదేటి అని పక్కనే ఉన్న గుణ్నమ్మ గుర్తుచేసింది.’’ ఇలా ఆడా,మగా సూరిగాడి కథకోసం వీధి అరుగుల మీద కూర్చున్నారు. ఆ రోజు అంగ ఈశ్వరుడింటికి వచ్చిన మిత్త మంగయ్య ‘ఏమిటి బావ్.. కథా..’ అని ఉడుకు అంబలి బువ్వలో..కాల్చిన ఎండు చేపలు, తోట కూర పులుసుతో తింటూ తనతో పాటే తింటున్న ఈశ్వరుడు కొడుకు రామ్మూర్తిని అడుగుతున్నాడు. మంగయ్యది ఒడిశాలోని పర్లాఖిమిడికి ఓ 40 కిలోమీటర్ల దూరంలో ఉండే దారకొండల్లోని మిర్చిగూడ. కాపుగోదేవలసకు ఏటా కొడుకులు, ఇతర బంధువులతో వస్తుంటాడు.ఈ బంధం ఓ మూడు తరాలనుంచీ సాగుతోంది. కొండకోనల్లో బతుకులీడ్చే అమాయకపు సవర గిరిజనుల గుండెల్లో నిండా ఉండేది పచ్చని అనురాగం. అల్లుకున్న ఆత్మీయత. కొండ లోతుల్లో ఉండే వారు సమీప గ్రామాల్లోని సంతలకు వచ్చినప్పుడు మైదానం ప్రాంత రైతులను కలుస్తుంటారు. అడవి తల్లి ఇచ్చే చింతపండు, ఇప్పపువ్వు, పోడు సాగుద్వారా వచ్చే కందులు, అరటి, పుట్ట తేనె, వంటి వాటిని కావిళ్లతో సంతలకు తెచ్చి అమ్ముతుంటారు. ఆ సంతల్లోనే రైతులతో మాటామాట కలుస్తుంది. వాటిని మమతలుగా అల్లుకొని ఎవరైనా నచ్చిన రైతు కనిపిస్తే మిత్తకడదామా (స్నేహం చేయడం) అని అడుగుతారు. అదేదో ఒక్క నిమిషంలో అయిపోయే తంతు కాదు. ప్రతిపాదితుల మధ్య ఏళ్లపాటు.. కాదు.. కాదు కొన్ని జీవితాల పాటు సాగే స్నేహ బంధం . అందులో స్వార్థం ఉండదు. నువ్వూ, నేను అనే బేధం ఉండదు.అగ్ని సాక్షిగా ఆ బంధాన్ని శాశ్వత పరచుకుంటారు. ఇందుకు ఓ ప్రత్యేక కార్యక్రమం గూడెంలో ఏర్పాటవుతుంది. ఆ గూడెం పెద్ద ఓ చిన్న క్రతువు జరిపిస్తాడు. మిత్తకోరుకునే వారిని ఊరి మధ్యలోకి పిలుస్తాడు. చిన్న హోమం ఏర్పాటు చేసి తనకు వచ్చిన మంత్రాలను చదువుతాడు. వారి స్నేహం స్వచ్ఛంగా, అడవంత పచ్చగా,తేనంతటి తియ్యగా సాగాలని కొండ దేవతకు మొక్కుతాడు.తాము నిత్యం ఆరాధించే ప్రకృతి దేవతలను ఆవాహనం చేసి సాక్షులుగా పిలుస్తాడు. దీంట్లో మిత్త (గిరిజన స్నేహితుడు), మైదాన ప్రాంతానికి చెందిన రైతు, వారి కుటుంబీకులు పాల్గొంటారు. ఇరువురూ అందరి సమక్షంలో బాసలు చేస్తారు. ఓ చీపురు పుల్లను తీసుకొని రెండుగా చీల్చి చెరో పక్కకు వ్యతిరేక దిశలో విసిరి వారిని ఎవ్వరూ వేరు చేయకుండా ఉండాలని దోష నివారణ సంకేతాన్ని చూపి వారి చేతులు కలుపుతాడు. ఇలా వారు అప్పటినుంచి ఆత్మీయంగా మిత్తా అని పిలుచుకుంటారు. వారి భార్యలను మిత్తమ్మా అంటారు. ఈ క్రతువు ఇంచుమించుగా రామాయణంలో రాముడు, సుగ్రీవుడు చేసుకున్న స్నేహ ఒడంబడిక లాంటిదన్న మాట.ఈ సందర్భంగా రైతు తన సవర మిత్రునికి పంచెల చాపు, పౌడరు డబ్బా,తాను పండించిన ఉత్పత్తులను బహుమానంగా ఇస్తే, గిరిజన నేస్తం ప్రతిగా తాను స్వయంగా సేకరించిన ఇప్పపువ్వు, తేనె, వెదురు బియ్యం ఇస్తాడు. కాస్త సారా లాగించాక వారంతా అడవిలో ఓ రెండు రోజులు ఆనందంగా గడుపుతారు. అంతే కాదు..మిత్రుడ్ని సాగనంపినప్పుడు కావుళ్లతో అటవీ ఉత్పత్తులు, మామిడి బద్దలు బహుమానంగా ఇచ్చి పంపుతాడు. ఇక అక్కడినుంచి ఏటా సంక్రాంతి సమయంలో రైతు నేస్తం ఇంటికి వస్తాడు. అలా మిత్తలు వచ్చారంటే పల్లెల్లో సందడే సందడి. గిరిజన ఆహార్యంలోనే మిత్తలు తమ ఇళ్లకు వచ్చి వచ్చీ రాని తెలుగులో తన నేస్తానికి కుశల ప్రశ్నలు వేస్తుంటే ఆ సన్నివేశం చూసేందుకు ఊరంతా గుమిగూడుతుంది. వారున్నన్ని రోజులూ రైతులూ ఆప్యాయంగా చూసుకుంటారు. పిల్లలకూ, ఊరి పెద్దలకూ వారిని పరిచయం చేస్తుంటారు. వారూ తమ నేస్తాలతో కలసి సరదాగా సేద్యం పనుల్లో సాయం చేస్తుంటారు. ఇలా మంగయ్య అంగ ఈశ్వరుడి ఇంటికి కొడుకులతో వచ్చాడు. అదే రోజు ఊరిలో బుడబుడకల సూరిగాడి పాట ఉండడంతో మంగయ్యా ఆ కథ వినాలని సంబరపడ్డాడు.. దీన్ని పసిగట్టిన ఈశ్వరుడు..కొడుకు కృష్ణమూర్తిని పిలచి..‘ఓరె కుష్టా..మిత్తలకి అప్పోళ్ల ఇంటి అరుగు మీద చాపేసి కూకో పెట్రా, అక్కడైతే కథ కమ్మగా ఇంతారు.’ అని చెప్పి తాను ఊరి చివరన ఉన్న కళ్లంలో పడుకునేందుకు వెళ్లి పోయాడు. అప్పుడు రాత్రి 9 గంటలు..సూరిగాడు పాటకోసం గొంతు సవరించుకుంటున్నాడు. ఆచారం ప్రకారం ఆడ వేషం కట్టాడు...అంజి బుడబుడకల కుండను ‘టిర్రిం..టిర్రిం..డుబుక్..డుబుక్’ అని నాలుగు దరువులు వేసి కథకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఊరంతా...పాటకోసం నిశ్శబ్దం..ముందుగా గణపతి ప్రార్థన అయ్యింది. సూరిగాడి లయలో తేడా గమనించిన అంజిగాడు అవునవునూ..అంటూ సమయస్ఫూర్తిగా సవరించే ప్రయత్నం చేశాడు. మళ్లీ హాస్యం పేరిట నాలుగు గెంతులు ..గ్రామ పెద్దలనూ, గ్రామ అమ్మవారిని పొగిడాడు. ఈ దృశ్యాన్ని మంగయ్య కొడుకులతో సహా ఆశ్చర్యంగా చూపుతిప్పుకోకుండా చూస్తున్నాడు. తమ గూడల్లో ఆడతారు, పాడతారు గానీ ఇదంతా కొత్తగా ఉంది. అందుకే అరుగు దిగీ మరీ ముందుకు వచ్చి కూర్చున్నాడు. మళ్లీ సూరిగాడిని సరిచేసే దిశగా అంజిగాడు ఓ మోటు హాస్యం రువ్వి..‘ఆయమ్మ రెక్కల రంభ..ఓయమ్మో సజ్జవుతోంది గావాలప్పా..అందుకే పాపకు నోరు పెగల లేదు..మాట్లాడవే.. రంభా..అంటూ సూరిగాడికి పాత్రను గుర్తుచేశాడు. ఇక తప్పదనుకున్న సూరిగాడు..ఆ యొక్క రెక్కల రంభ.. అందాల సుందర రాశి..అంటూ తడబడుతూనే కథను ప్రారంభించాడు. గొంతును సవరించుకుంటున్నా ..నాలిక తిమ్మిరెక్కి పోతోంది. ఓ గెంతు గెంతి పాటకు ఊపుతెద్దామనకున్నోడు కాస్తా విరుచుకు పడ్డాడు. అదీ సరిగ్గా..మంగయ్య చూస్తున్న వైపే.. ఇదేదీ అర్థం కాని మంగయ్య అదీ కథలో భాగమనుకుంటున్నాడు. ఊర్లో అలజడి..ఓరె ఏమైందెస్..శేషయ్య కేకేశాడు.సూరిగాడు.. ఏదో చెప్తున్నాడు. ఎవరికీ అర్థం కావడం లేదు. అంజిగాడికీ ఏమీ పాలుపోవడం లేదు. ఇదేంటీ ఈడినాగా అనుకుంటూ ..తనకు సందేహం వచ్చినా బయట పడితే బడితె పూజ అవుతుందని భయపడి..మెల్లిగా అన్నాడు..ఇది గాలిపని అయ్యుంటాదయ్యా అని. ఇంతలో సూరిగాడు సవరమంగయ్య వైపు చెయ్యచూపుతూ ..ఏదో చెప్తున్నాడు.అంతా కేకలు..అరుపులు..ఇంతలో ఎవరో చెప్తే సొండి రామ్మూర్తి వచ్చాడు. మరోవైపు శాంతారావు కేకలేశాడు. ..ఒరే అది సవర దెయ్యమటరా..అని అంటే..అందరూ ఓలమ్మా సిల్లెంగెట్టేసుంటారర్రా... సూరిగాడు ఆడేసికం ఏత్తే ఆడోళ్లే సూపు తిప్పుకోనేరు..అంటూ ఇది చేతపడి పనే అని ఎప్పుడూ శివాలేసే రెయ్య గణ్ణెమ్మ తేల్చిపడేసింది. ఇంకేటెస్ ..అంగోళ్లు ఇంటికి వచ్చిన సవరోళ్ల పనేనే అని పారమ్మ మద్ధతు పలికింది. ‘నాను సూసినానే ఆడు పెందిలికాడినుంచి అందరు దుక్కూ మిటుకూ..మిటుకూ మని సూత్తన్నాడే ’ అని సాక్ష్యం చెప్పేసింది. ఇంకేం ఊరంతా ఇది ఆళ్లపనే అని తేల్చి పారేశారు. అప్పటికి పరిస్థితి అర్థమైన మంగయ్య, కొడుకులూ వణికి పోతున్నారు.‘ బావ్..మేం మిత్తకోసం వచ్చినం..మాకేంటీ బాధ...’ అని ఏడుపు గొంతులతో అంటున్నా పట్టించుకునే వారే లేరు. ఎవరు ఎవరికి చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఆఖరికి అంతా కలసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆళ్ల ముగ్గుర్నీ ఊరి చివర ఉన్న ఓ ఇంట్లో కట్టేసి రేపు పంచాయతీ పెట్టాల అని. ఈ లోపు కొందరు సూరిగాడ్ని మోసుకెళ్లి ఓ అరుగుమీద పడేశారు. ఏం మాట్లాడితే ఏమొస్తాదో అని అంజిగాడు నోరు కుట్టేసుకున్నాడు. దీనిమీద రాత్రంతా రకరకాల కథలు..పరస్పరం నడిచాక అందరూ నిద్రలోకి జారుకున్నారు. గదిలో బందీలైన మంగయ్య కొడుకులతోనూ చాలాసేపు మాట్లాడలేక పోయాడు. ఇప్పటికి మూడు తరాలుగా ఆ ఊరు వస్తున్నా ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ప్రేమతో వస్తే ఇలా ప్రాణాలమీదకు వచ్చిందేమిటా అని తనకు తెల్సిన దేవతలందరికీ మొక్కాడు. అడవి చీకటికి అలవాటైన ఆ కళ్లు ఇప్పుడు తప్పించుకునే మార్గాలకోసం అన్వేషిస్తున్నాయి. పులులనే ఎదిరించే తమ ధీరత్వం ఇలా బందీలై పోయిందేమిటా అని తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు. కొడుకులూ అయోమయంలో ఉండడంతో వారికి సైగలతోనే ధైర్యం చెప్పాడు. ఇంతలోనే తనకు సంకేతాలందిస్తున్నట్లుగా ఓ బల్లి చూరుపైనుంచి శబ్దం చేస్తోంది. కర్తవ్యం బోధపడింది. వేట గాడి ఎత్తుగడలా వ్యూహం పన్నాడు. సొండి రామ్మూర్తి దెబ్బకు ఊరి చివరకు జనం అంతా పరుగెత్తారు. అందరిలోనూ ఒకటే ప్రశ్న. సవరోళ్లు ఏమైనారని ఎలా మాయమయ్యారనీ...ఈ సందడిలోనే తెలివి తెచ్చుకున్న సూరిగాడు,తోడున్న అంజి తూర్పువైపు జారుకున్నారు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.రాత్రి సంతబొమ్మాళి వెళ్లి తెల్లవారే వస్తున్న తామాడ రామారావుకు గట్టుచాటున వెళ్తూ..మాట్లాడుకుంటున్న అంజి,సూరిల మాటలు చెవిట్లో పడ్డాయి...‘ఓరయ్యా నువ్వు పీకలమొయ్య తాగేసి పడిపోనావని ఊళ్లో తెలిస్తే మక్కలిరగతన్నేసోళ్లు. ఆ సమయానికి సవరోళ్లు మీదకు నెపం నెట్టేసినావు గాని..నా గుండ్లో రాయిపడి పోనాది. ’ అని అంజి చెప్తుంటే అవేవీ చెవిట్లో వేసుకోని సూరి పరుగులాంటి నడకతో పొలాలకు అడ్డంబడి వెళ్తున్నాడు. ఊర్లోకొచ్చాక రామారావు ఆ గుట్టు విప్పడంతో అంతా నోరెళ్ల బెట్టారు. మరో వైపు సవరోళ్లు తప్పించుకున్న ఇంటి చూరు వారిని వెక్కిరించింది. వర్తమానంలోకి వచ్చిన ఈశ్వరుడు.. తమ మిత్తల స్నేహాన్ని చిదిమేసిన మూర్ఖత్వాలను ఎలా ప్రశ్నించాలో తెలీక మౌనాన్ని ఆశ్రయించాడు.ఇంతలోనే గుడ్ల కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ వచ్చి ‘పెద్దయ్యా సవరోళ్లు సైనోల్లు ఇంటి పెనక ఇప్పుకొని ఎళ్లిపోనార్రా’ అని చెప్పడంతో తమ స్నేహం కాదు..కాదు పల్లెకు..అడవికీ ఉన్న తరతరాల బంధం ఎవరో తెంచేశారని కుమిలి పోయాడు..గుండె పగిలేలా రోదించాడు....ఆత్మీయత లోతులను తడుముకున్నాడు.. తమ వారి మూర్ఖత్వాన్ని ప్రశ్నించ లేక పోతున్న తన దైన్యానికి తనను తానే తిట్టుకున్నాడు. - పట్నాయకుని వెంకటేశ్వరరావు -
‘అంత డబ్బుని గతంలో ఎప్పుడూ చూడలేదు’
హఠాత్తుగా కుండపోత వర్షం మొదలైంది. ఈ వేళ కాని వేళలో వర్షం రాజాకు ఇబ్బందిగా ఉంది. అతడు బయటికి బయల్దేరాడు. కాని ఈ వాన వల్ల ఇల్లు కదల్లేకపోతున్నాడు. ఇది మామూలు వాన కాదు. జలప్రళయంలా వున్నది. రాజా గొణుక్కుంటూ, తిట్టుకుంటూ తన ఇంటి ద్వారానికి అతుక్కుపోయాడు. కొద్దిసేపు ఆగి ఇంకా వెనక్కి పోయాడు. రాజా ఒక కవి, జేబుదొంగ. మరో మాటలో చెప్పాలంటే రెండూనూ. ఇది కొంచెం అసాధారణమైనదే కానీ బెంగాలీలలో అసాధ్యమైంది కాదు. కవిత్వాన్ని బాగా చదువుతాడు. జేబుదొంగ మాత్రమే కాదు తాగుబోతు. తాగడం కోసమే జేబుల్ని కొట్టేవాడో లేక జేబుల్ని కొట్టిన డబ్బు ఖర్చు పెట్టడానికే తాగుతాడో స్పష్టంగా తెలీదు. ప్రతి వ్యక్తికి ఒక గతం ఉంటుంది. అది అద్భుతమైన గతమయితే చరిత్రగా మారుతుంది. అలా పరిగణిస్తే రాజా గతమేమీ గొప్పది కాదు. మంచి కుటుంబంలోనే పుట్టాడు. బియ్యే చదువుతూ పూర్తి కాకుండానే మానేశాడు. ఎందుకంటే చదువు వల్ల ప్రయోజనం లేదని అతనికొక రోజు అనిపించింది. కేవలం డబ్బు సంపాదించడంలోనే సర్వమూ వున్నదని గ్రహించాడు. అంచేత కాలేజీ నుంచి బయటికి వచ్చేశాడు. తల్లిదండ్రులు అప్పటికే గతించారు. కాబట్టి కుటుంబ బాధ్యతలు లేవు. ఒక ఇల్లు ఉండేది. దాన్ని అమ్మివేసి ఆ డబ్బుని జేబులో వేసుకొని విశాలమైన ప్రపంచంలో తన స్థానాన్ని వెతుక్కుంటూ బయల్దేరాడు. ఇప్పుడు కలకత్తా మహానగరమే అతడి ప్రపంచంగా వున్నది. కవిగా జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. అయితే జీవితం సారా గ్లాసుల్లోనూ, సాని కొంపల్లోనూ వున్నదని దృఢంగా నమ్మాడు. అనతి కాలంలోనే తనలాంటి భావాలు గల సహచరుల్నీ పోగు చేసుకున్నాడు. క్రమేణా ఒకనాటి విదేశి మద్యం స్థానంలో నాటుసారా చోటు చేసుకున్నది. అతి సామాన్యంగా బ్రతకడం కూడా నేర్చుకున్నాడు. ఆ తరువాత ఒకనాటి రాజా, కాలేజీ రోజుల రాజా, చరిత్రలో కలిసిపోయాడు. ఇదంతా జరిగి సుమారు అయిదు సంవత్సరాలైంది. ఒకే ఆకాశంలో సూర్యుడూ, చంద్రుడూ తిరగడానికి పోటీ పడుతున్నట్టు ఒకే దేహంలో ఇద్దరు రాజాల పోరు చాలా కాలం క్రితమే పరిష్కారమైపోయింది. ఇక మిగిలినదంతా ఒక్కటే. కవిత్వం పట్ల ప్రేమ. తాగినా, చదివినా, మాట్లాడిన ఆడెన్, ఇలియట్ మొదలైన వారి ప్రస్తావనలు వస్తూనే వుంటాయి. ఉయయాన్నే ఈ వర్షపాతం అతని మూడ్‌ని పాడు చేసింది. ఇప్పటికే ఎనిమిదిన్నరయింది. ఒక ట్రామ్ని అందుకోవాలంటే మెయిన్ రోడ్డుకు వెళ్ళాలి. ఆఫీసుకు పోయే జనాల రద్దీ పది తరువాతనే తగ్గుతుంది. తను బయల్దేరుతున్న పని వర్షపునీటిలో వెళ్ళాల్సింది కాదు. అది సాధ్యం కాదు. పాడువర్షం...తనలో తనే తిట్టుకున్నాడు. ఇంకా వర్షం కురుస్తున్నది. తగ్గే సూచనలూ లేవు. రాజా గదిలో చాప మీద మేను వాల్చాడు. సగం చేరబడి కళ్ళు మూసుకున్నాడు. రాత్రి సందడి సుమారు ఒంటిగంటకు ముగిసింది. ఇప్పుడు శరీరం దూది పింజలా వున్నది. ఆవులిస్తూ విసుగెత్తించే వర్షపు శబ్దాలను వింటున్నాడు. ఆ తరువాత ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. చేతి వాచీ చూసుకున్నాడు. పది గంటల కొద్ది నిమిషాలయింది. అతడి మూడ్ చెడిపోయి పరిసరాలలో ప్రతిదానిపైనా అసహ్యం పుట్టింది. వర్షం ఆగింది. వీధుల్లో నీరు తగ్గింది. నెమ్మదిగా జనం బయటికి వస్తున్నారు. ఎటు చూసినా బురద చీదరగా వున్నది. రాజా లేచి ముఖం మీద నీళ్ళు చల్లుకొని తల దువ్వుకున్నాడు. తలుపు వద్ద ఏదో ధ్వని వినబడింది. తలుపు తెరిచాడు. ఒక సేవకుడు ఒక ఉత్తరాన్ని తెచ్చి అతడి చేతిలో వుంచాడు. ఉత్తరం! రాజాకు ఉత్తరం! ఇది చాలా అసాధారణమైన సంగతి. ఇక బయటికి వెళ్ళాలనిపించడం లేదు. తిరిగి తన గదిలోనికి వెళ్ళాడు. ఉత్తరాన్ని చూస్తూ కొంచెం బెదిరాడు. ఉత్తరం రావడం అనేది ప్రతిరోజూ జరిగే విషయం కాదు. అందులోనూ తనకి! రాజాకి! మరి ఎవరు రాసి వుంటారు? కవరు చించాడు. అదొక ఆహ్వానపత్రిక. నీలిరంగు కాగితం మీద బంగారురంగు అక్షరాలున్నాయి. ఒకనాటి తన మిత్రుల సమూహం ‘జ్వాలావలయం’ యొక్క వార్షిక సమావేశం. రేపే! ఆహ్వాన పత్రిక వెనుక చిన్న చేతి రాత ఉన్నది: ‘ఈ పుస్తకం నీకు అందుతుందో తెలీదు. అందితే మాత్రం తప్పకుండా రాగలవు. నీ కోసం ఎదురుచూస్తుంటాను–సునీల్’ ‘జ్వాలావలయం!’ కాలేజీలో రాజా తన ఎనమండుగురు మిత్రులతో కలిసి సంఘం ఏర్పాటు చేశాడు. పేరు కూడా అతడే నిర్ణయించాడు. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఆశయాలు ఆ పేరుతో ముడిపడి వున్నాయి. ఆ సంఘానికి పేరు రాజా పెట్టాడు. అందరూ సునీల్ ఇంటిలో సమావేశమౌతారు. అదొక పండుగలా వుంటుంది. అక్కడికి మంచి గాయకులు, కవులు, రచయితలను కలకత్తా అంతటి నుండీ ఆహ్వానిస్తారు. చర్చలూ, విశ్లేషణలూ, విమర్శలూ, వాదోపవాదాలు కొనసాగుతాయి. చందాలు పోగు చేస్తారు. వినోద కార్యక్రమాలుంటాయి. రాత్రి నిచ్చెనలు పట్టుకొని గోడకు పోస్టర్లు అంటిస్తారు. అదొక తపస్సు. అదొక యజ్ఞం. ‘జ్వాలా వలయం’ ఈ పేరు గుర్తొస్తే అతడికి కళాశాల జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. అప్పటికి ఆ చిన్న జీవితాల్లో అవి ఉజ్వలమైన రోజులు. యౌవనంలో అడుగు పెడుతున్న రోజులు! క్రికెట్ మైదానం, వక్తృత్వపోటీలు, వ్యాసరచన పోటీలు, సాహితీ చర్చలు, ఒకటేమి? గౌరీ, స్నిగ్ధా, మాయా...ఇంకో ఆమె పేరు గుర్తు రావడం లేదు. రోల్‌నెం 67. అతడి గదిలో అమ్మాయిలందరూ వరుసగా గుర్తొస్తున్నారు. ఇక అబ్బాయిలు: బుద్ధా, సునీల్, ఆనంద్, బిమల్! వీళ్ళందరూ అతడి మనోఫలకంపై చిరంజీవులు! వారికి వార్ధక్యం రాదు. మరణం లేదు. ఎప్పుడూ నిత్యయౌవనంతోనే విలసిల్లుతుంటారు. ‘జ్వాలావలయం’ చిహ్నంలో ఉదయిస్తున్న సూర్యుడు తన సప్తాశ్వ రథాన్ని అధిరోహించి దిగంతాల వైపు పయనిస్తునట్టుగా వుంటాడు. అప్పుడెప్పుడో నిస్సారమై స్తబ్దమైపోయిన జ్ఞాపకాలనీ అతన్లో తిరిగి ఊపిరి పోసుకొంటున్నాయి. మరి తన చిరునామా ఎలా దొరికింది? నిజానికి తాను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. క్రింది సంతకం మరోసారి చూశాడు. సునీల్! అంటే సునీల్ ఇంకా ఆ సమ్మేళనానికి సంపాదకుడిగా వున్నాడు. అంటే ఎవరూ దాన్ని విడిచి వెళ్ళలేదు. చిరునామా ఎలా సంపాదించాలో తెలీదు. తనని ఆహ్వానించారు...అదేచాలు! రాజా వెళ్తాడు. తప్పకుండా వెళ్తాడు. సునీల్ పిలుస్తున్నాడు. బుద్ధా పిలుస్తున్నాడు. ఆనంద పిలుస్తున్నాడు. విద్యార్థిదశలోని మిత్రులంతా పిలుస్తున్నారు. రాజా విస్మృతగతం, అప్పటి ప్రేమాభిమానాలు, గిల్లికజ్జాలు, నవ్వులూ, కన్నీళ్ళూ...ఇవన్నీ అతడ్ని ఊరించి మరీ పిలుస్తున్నాయి. తప్పనిసరిగా వెళ్తాడు. అవును వెళ్తాడు. రాజా తనను తాను అద్దంలో చూసుకున్నాడు. గత అయిదు సంవత్సరాల్లో కళ్ళు లోతుకు పోయాయి. కళ్ళ చుట్టూ నల్లని చారలు కూడా ఏర్పడ్డాయి. పెదాల మీద తెలుపూ నలుపూ కలిసిన మచ్చలు ఏర్పడ్డాయి. నవ్వితే ఆ పెదాల మధ్య నుండి గారపట్టిన పళ్ళు వికృతంగా కనబడుతున్నాయి. సంవత్సరాల తరబడి అతడి పొడవైన జుత్తుకు నూనె జాడ తెలీదు. ఈ రూపంలో, ఈ స్థితిలో ఇప్పుడు పాత మిత్రుల్ని కలుసుకోవడం సముచితమైన పనేనా? కాదా? అనే మీమాంసలో పడ్డాడు. ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఒకప్పటిలాగే వుండే అవకాశం లేదు. జీవితపు ఒడిదొడుకులు వార్ని కూడా ఎంతో కొంత మార్చే వుంటాయి. ఆనాటి వారి అమాయకత్వం కూడా బ్రతుకు చక్రాల క్రింద మాయమైపోయి వుంటుంది. ఇంత వరకూ అతడి మనోఫలకం పైన అందరి చిత్రాలు సజీవంగా నిత్యనూతకంగా ఉన్నాయి. వాట్ని అపురూపుంగా పదిలపరుచుకున్నాడు. మధ్యాహ్నమైంది. నిరాశలో మునిగి మద్యం సీసాని తెరిచాడు. బహుశా ఇటువంటి అస్థిమిత స్థితికి అంతకన్నా మంచి మందులేదు. అతడి గుండెలో ఒక చిత్రమైన స్పందన కలిగింది. రకరకాల ఆలోచనలతో తల తిరుగుతున్నది. అతడి గొంతులో ఏదో ధ్వని మేల్కొని పైకి లేచింది. జీవితాన్ని దూదిపింజె కన్నా తేలిగ్గా తీసుకున్న రాజా తాగిన మత్తులో ఏడుస్తున్నాడు. కారణం తేలీదు. అంతలోనే అతడు మనస్సు మార్చుకున్నాడు. మరుసటిరోజు ఉదయాన్నే రైలు బయల్దేరుతుంది. సాయంత్రానికి చేరుతుంది. ఆ రైలుకే బయల్దేరి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది గంటల ప్రయాణం అంతే. అనుకున్న ప్రకారం ఆ శివారు రైల్వేస్టేషన్లో దిగాడు. సాయంకాలమైంది. ఆకాశంలో అక్కడక్కడా మబ్బులు వున్నాయి. చిన్న చినుకులు పడుతున్నాయి. స్టేషన్ మెట్ల వద్దకు వచ్చేసరికి గత జీవితపు స్మృతులు రాజాని స్వాగతించాయి. ఆ గాలిలో చిరపరిచితమైన పరిమళం వుంది. అతడి గుండెలోతుల్లో ఒక అనునాదం మార్మోగింది. ఇటువంటి అనుభూతిని పొంది ఎంతో కాలమైంది. ఆశ్చర్యకరంగా ఇక్కడి బురద కూడా చిరాకు కలిగించడం లేదు. రాజా సంతృప్తిగా నడుస్తున్నాడు. ప్రయాణంలో చాలాసేపు ట్రైను కిటికి వద్దనే ప్రకృతిని చూస్తూ గడిపాడు. మొదట చిన్న కునుకు ముంచుకొచ్చింది. అంతలోనే ఒక కల వచ్చి మేల్కొలిపింది. అతడి పాతజీవితం కళ్ళ ముందు కదలాడింది. కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నట్లనిపించింది. తల్లి భోజనం వడ్డించి పిలుస్తున్నది. ‘‘రా....రా...నాయనా అన్నం పెట్టాను. ఇంకెంతసేపు ఎదురుచూడను?’’ ‘‘ఎందుకే అలా అరుస్తావు! చేపల కూరా...త్వరగా తీసుకురా మరి...’’ అన్నాన్ని చల్చార్చడానికి చేతిలో ఒక విసనకర్ర పట్టుకొని ఆమె కూడా అతని ప్రక్కనే కూర్చుంది. అతడికేదో అనుమానం వచ్చింది. తిట్లు తినడానికే అలవాటు పడ్డాడు. నెమ్మదిగా అడిగాడు–‘‘అమ్మా! ఏంటి సంగతి?’’ ‘‘రేపు షష్ఠి కదా! నాక్కొన్ని పళ్ళు తెచ్చి పెట్టు’’ అన్నది తల్లి. చప్పుడు చేస్తూ గ్లాసుని క్రింద పెట్టాడు. కోపంగా లేచాడు. ‘‘నాకు తెలుసు. నేను తేలేను. ఎవరి చేతనో తెప్పించుకో. నేనొక ఆటలో పాల్గొనాలి’’ అతడు త్వరగా బయట పడాలని భావించాడు. ‘‘మరి మజ్జిగా తాగవా?’’ ‘‘ఇవ్వయితే’’ అన్నాడు. అంతే...మరుక్షణంలో తల్లి చిరునవ్వు ముఖం పొగలాగా మాయమైంది. కునుకు నుండి మెలకువ వచ్చింది. ఆ తరువాత నిద్ర పోలేదు. అక్కడికి కొద్దిరోజుల్లోనే తల్లి ఆస్తమాతో చనిపోయింది, ఆమెకు సరైన వైద్యం అందించలేకపోయాడు. ఆమె జీవించి వున్నంతకాలమూ ఇంటి వ్యవహారాలు చూసుకునేది. అతడికి ఏ లోటూ వుండేది కాదు. అందరి తల్లుల్లాగే ఆమె కూడా కొండంత సహనం గల మాతృమూర్తి. ఆమె మరణించగలదని రాజా ఊహించలేకపోయాడు. అతడి హృదయంలో ఆమె ఎప్పుడూ జీవించి వుంటుంది. తప్పుల్ని క్షమిస్తుంది. దుఃఖంలో ఓదారుస్తుంది. బాగా పరిచయమైన పరిసరాలు అతడ్ని ఎంతో సంతోషంతో నింపాయి. సాయంకాలమే అయినా మేఘాల్లోంచి హఠాత్తుగా సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. నేల మీద పచ్చగడ్డి పైన నీటిబిందువులు మెరవసాగాయి. అతడికి వసంతకాలమంటే ఎంత ఇష్టమో గుర్తు వచ్చింది. మేఘాలు కనిపిస్తే చాలు ఉత్తేజితుడైపోతాడు. కాళిదాసు, రవీంద్రనాథ్ టాగోర్‌ల వానపాటలు అతడ్ని పిచ్చెక్కిస్తాయి. ఎంత ఆశ్చర్యం? ఇంతకాలం అతడెక్కడికి పోయాడు? ఇవన్నీ ఎలా మరిచిపోయాడు? ఇది అతడికి ప్రీతిపాత్రమైన ప్రదేశం. అదిగో కవిరాజ్ బనమాలి గారి ఇంటి ముందరి గది. ఆ తరువాత ఇరుగు పొరుగు ఇళ్ళు వరుసగా వున్నాయి. అందులో ఒక ఇంటి రెండో అంతస్తులో తన తల్లిదండ్రులతో గౌరి వుండేది. ఇంకా ఆమె అక్కడే వుందా? గౌరి అక్కడ సహ విద్యార్థిని. గంభీరంగా, ప్రశాంతంగా బంగారు రంగులో మెరిసే కళ్ళతో వుండేది. అందగత్తె కాదుగానీ ఆమెలో అతడికి ప్రత్యేకమైన ఆకర్షణ కనబడేది. చిన్నగా సన్నగా ఆమె ఎప్పుడూ సిగ్గుపడుతూ మాట్లాడినా అతడి చెవులకు అది శ్రావ్యమైన సంగీతంలా వుండేది. వారిద్దరి మధ్యా ఏమి లేదనే మాట నిజం. కాని వారి స్నేహం గురించి శ్రావ్యమైన సంగీతంలా వుండేది. కాని వారి స్నేహం గురించి కాలేజీలో గోడ కవులు చిలవలు పలవలు అల్లేరు. మరో మలుపు తరువాత ఒకనాటి తను నివసించిన ఇంటిని దాటి పోయాడు. ఆ ఇంటినే అతడు అమ్మేశాడు. ఇంటి వాకిట్లో చిన్న కుర్రాడు ఆడుకొంటున్నాడు. ఒక యువతి ఒక పదమూడేళ్ళ అబ్బాయిని జామచెట్టు ఎక్కమని ప్రోత్సహిస్తున్నది. ఆ చెట్టు మీదనే అతడి బాల్యం గడిచింది. ఇప్పడా ఇంట్లో వున్న వారు కొత్త ముఖాలు. వీధుల్లో దీపాలు వెలిగాయి, ప్రధాన వీధి ముఖద్వారం వద్దనే ఒక ఇంటిలో సునీల్ వుంటాడు. ఆ ఇంటిలోంచి కాంతిచారలు రోడ్డు మీద పడుతున్నాయి. ఇంటిలోంచి ఉరుముల్లాగా పెద్దగా నవ్వులు నేలని కుదిపేస్తున్నాయి. మెట్లెక్కి లోపలికెళ్ళాడు. రాజాని గుర్తించగానే ఎనిమిది గొంతులు అతడ్ని స్వాగతించాయి. ‘‘ఎవరూ? రాజా? రాజానే!’’ ‘‘రాజా వచ్చాడు. రాజా వచ్చాడు’’ ఒకనాటి మిత్రుడ్నీ, గత కొన్నేళ్ళుగా తప్పిపోయి చిరునామా కూడా తెలియకుండా పోయిన స్నేహితుడ్నీ, ఊహించని ఒకనాటి సహచరుడ్నీ చూసి అందరూ ఉవ్వెత్తున సంబరపడిపోయారు. నేల మీద అదే తివాచీ వుంది. ఇంటి ముందర అదే సైన్బోర్డ్. రంగు వెలిసింది కాని ఇంకా మెరుస్తున్నది. ముందరి తలుపు మీద ‘జ్వాలా వలయం’ స్థాపించినప్పుడు అతడు రాసిన గీతమే వున్నది. అక్కడ సునీల్, ఆనంద్ వున్నారు. బుద్ధా ఒక మూలనున్నాడు. బిమల్ తివాచీ మీద కూర్చొని వున్నాడు. ఇంకా ఇతర మిత్రులూ వున్నారు. రాజా అందర్నీ ఒకసారి తేరిపార చూశాడు. ఎవరిలోనూ పెద్దగా మార్పు కనబడలేదు. ‘‘అద్భుతం! రాజా! నాతో కూర్చో. కొద్దిగా టీ తీసుకో’’ ‘‘అయితే రాజా! ఉత్తరం అందిందన్నమాట’’ ‘‘అందుకేగా వచ్చింది’’ అన్నాడు రాజా. ‘‘రాజా! నేనీరోజు కొత్తగీతం రాశాను. నువ్వు విని తీరాలి’’ అన్నాడు అమర్. ‘‘ఆగండి! రాజా రైలు దిగి వచ్చాడు. ఊపిరి పీల్చుకోనివ్వండి’’ అన్నాడు బుద్ధా. రాజా స్థిమితపడ్డాడు. అమర్ వినిపించిన గీతాన్ని విన్నాడు. ఆనందా తిండిపోతు. అజీర్తితో బాధపడుతుంటాడు. అతడి అనారోగ్యపు వివరాలన్నీ విన్నాడు. అందరి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. జితిన్ కలెక్టరయ్యాడు. ఛోటా కొకా ప్రొఫెసరయ్యాడు. ఆనందా వ్యాపారం చాలాబాగుంది. సునీల్ విద్యార్థి ఉద్యమానికి ఇంకా నాయకత్వం వహిస్తున్నాడు. బుద్ధా ఒక చిత్రకారుడిగా మంచి గుర్తింపు పొందాడు. గౌరి గురించి కూడా తెలిసింది. ఆమె పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది. రాజా ఒక పెద్ద దిండుకు చేరబడి కన్నులు మూసుకున్నాడు. ఇప్పుడతడు కలలు కనడం లేదు. మిత్రుల మధ్య, బాగా పరిచయమైన ప్రపంచంలో సంతృప్తిగా కూర్చున్నాడు. భూగోళం మీద ఎక్కడ వున్నాసరే ప్రతిసంవత్సరం ఇదేరోజున ఇక్కడ సమావేశమౌతుంటారు. ఆ వివరాల్ని సునీల్ చెబుతున్నాడు. ఆ ఎనమండుగురు మాత్రమే వస్తుంటారు. వేరేవరూ రారు. రాజా ఉనికి తెలీదు. అతడు ఇప్పుడు చేరాడు. ‘‘నా చిరునామా మీకెలా తెలిసింది?’’ ‘‘నువ్వు కొద్దిరోజుల క్రితం సరోజ్ని కలిశావట కదా’’ . రాజాకు గుర్తొచ్చింది. సురోజ్ సునీల్ పెద్ద తమ్ముడు. రెండు నెలల క్రితం కలకత్తాలో ట్రామ్‌లో కలిశాడు. చిరునామా అడిగి వుంటాడు. తను చెప్పి వుంటాడు. తన ఉనికి గురించి నిజం ఎందుకు చెప్పాడో అతనికే తెలియదు. సరోజ్ ఆ చిరునామాను వాళ్ళకి అందచేశాడన్నమాట. ‘‘సరే, చిరునామా విషయం మరిచిపో. వాస్తవానికి మన అందిరిలో చురుకైనవాడివి, తెలివైన వాడివి నువ్వే. ఇన్ని సంవత్సరాలు ఏంచేస్తున్నావు? ఎలా వున్నావు?’’ అందరూ ముక్తకంఠంతో అడిగారు. రాజా మిత్రుల ముందర అబద్ధాలతో కూడిన అందమైన కథని అల్లాడు. అతడు మధ్యప్రదేశ్‌లో ఒక మైనింగ్ ఆఫీసర్‌గా చేస్తున్నాడు. హఠాత్తుగా పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఎవర్నీ ఆహ్వానించడానికి సమయం లేకపోయింది. భార్య ముచ్చటగా వుంటుంది. ఒక కుమారుడు కూడా పుట్టాడు. గత రెండు నెలలుగా సెలవుల మీద కలకత్తాలో వుంటున్నాడు. ప్రస్తుతం తన అత్తవారింటికి వెళ్ళాల్సివుంది. అక్కడొక పెళ్ళికార్యక్రమానికి హాజరు కావాలి...ఇలా రాజా ఎన్నో కల్పిత విశేషాలు చెప్పుకొన్నాడు. రాజా...జ్వాలావలయం స్థాపకుడు రాజా...విద్యార్థినాయకుడు రాజా...మిత్రుల దృష్టిలో ఉన్నతుడైన రాజా, వాళ్ళందరికీ గర్వకారణమైన రాజా...అటువంటి వాడ్ని ఎంతో కాలం తరువాత చూస్తున్నారు. అతడ్ని గురించి వివరాలు వింటున్నారు. రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. ముగ్గురు కలిసి ఒకే గదిలో, ఒకే రగ్గులో నిద్రపోయారు. రాజా కనులు మూసుకున్నాడేగానీ మనస్సు ఉరకలు వేస్తున్నది. మధురం...జీవితం మధురం....ఆపాత జ్ఞాపకాలు ఇంకా మధురం. ఈరోజు నుంచి తానొక నూతన యాత్ర ప్రారంభించాలి. తాగడం మానేయాలి. దొంగతనాలు మానేయాలి. నేరగాళ్ళ సహవాసాన్ని తుంచేయాలి. కలకత్తా కూడా వెళ్ళకూడదు. ఇక్కడెక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి. నీతిగా తలెత్తుకొని తిరగాలి. ఇక్కడెక్కడో ఉద్యోగం సంపాదించుకోవాలి. ఈ శాశ్వతసౌందర్యసీమలో పరిపూర్ణమైన కీర్తిగౌరవాలతో తనని తను పునఃప్రతిష్ఠించుకోవాలి. రాజా ఒకవైపు నుండి మరోవైపు ఒత్తిగిల్లాడు. బుద్ధా గురక పెడుతున్నాడు. తిరుగు రైలు ఉదయం అయిదు గంటలకే బయల్దేరుతుంది. నాలుగున్నరకే సునీల్ నిద్ర లేపాడు. రాజా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆకాశం మేఘావృతంగా వున్నది. వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంతమంది ఆత్మీయుల మధ్యకు తిరిగి వచ్చేయడమే మేలని మరోసారి తీర్మానించుకున్నాడు. బయల్దేరే సమయం ఆసన్నమైంది. బుద్ధా, ఆనందా గాఢనిద్రలో వున్నారు. వాళ్ళని మేల్కొలపడం అతనికిష్టం లేదు. ఎలాగు త్వరలోనే వచ్చేస్తాడు. మారిన మనిషిగా తిరిగి జీవితం ప్రారంభిస్తాడు. రాజాకు తన షర్ట్ కనబడలేదు. అక్కడున్న దుస్తులన్నీ తొలగిస్తూ తన చొక్కా కోసం వెతకడం మొదలుపెట్టాడు. సునీల్ తల్లిగారు ఇచ్చిన అల్పాహార పొట్లం తీసుకొని, అతడ్ని తోడ్కొని రాజా స్టేషన్‌కు వెళ్ళాలి. ఇంకా తన షర్ట్ కోసం వెదుకుతూనే వున్నాడు. అంతలోనే అక్కడ నీలి చొక్కా క్రింద తన చొక్కా పడి వున్నది. దాన్ని పైకి తీసాడు. నీలిచొక్కా జేబులోంచి ఏదో బరువుగా పడింది. మనీ పర్స్! బాగా ఉబ్బెత్తుగా ఉన్న పర్స్. రాజా వేళ్ళు తిమ్మిరెక్కాయి. అసంకల్పితంగానే ఆ పర్స్‌ను పైకి తీసి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతడి గుండె గట్టిగా కొట్టుకున్నది. నిద్రపోతున్న మిత్రుల వైపు చూస్తూనే పర్స్ తెరిచాడు. దాన్నిండా కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు. ఇది ఆనందాది కావచ్చు. అతడు తన దుకాణం నుంచి తెచ్చుకున్న నగదు కావచ్చు. రాజా ఆ పర్స్‌ని తిరిగి నీలిచొక్కా జేబులో పెట్టేసాడు. తన చొక్కాని వేసుకున్నాడు. కానీ రాజా తలలో ఏదో పురుగు తొలచడం మొదలైంది. తాగడానికి అలవాటు పడిన నాలుక పిడచకట్టుకుపోయింది. దానర్థం మిత్రులందరి ముందూ అలనాటి తన అందమైన గతాన్ని తుడిచి వేయడమేనా? తన నిజస్వరూపం వెల్లడించడమేనా? పునఃప్రారంభించాలని భావిస్తున్న కొత్తజీవితం తిరిగి మరుగున పడిపోవడమేనా? మంచుపొరలు తెరలు తెరలుగా పైకి లేస్తున్నాయి. రాజా ఇంత డబ్బుని గతంలో ఎప్పుడూ కళ్ళ చూడలేదు. అతడి ముఖంలో చిరునవ్వు వికసించింది. సునీల్, ఆనందా, గౌరీ...మొదలైన స్నేహితులు అందరి ముఖాల్నీ పొగమంచు కబళించింది. చీకటి తొలగినట్టే తొలగి మంచుతో మరింత చిక్కనైపోయింది. అప్పటికే రాజా కోసం తన తల్లి ఇచ్చిన అల్పాహార పొట్లాన్ని పట్టుకొని సునీల్ బయట వేచివున్నాడు. ‘‘రాజా! రా! ట్రైన్ టైమ్ అవుతోంది. ఆలస్యం చేయకు’’ అని పిలుస్తున్నాడు. రాజా, ‘‘ఇదిగో వచ్చేస్తున్నాను...’’ అన్నాడు. కానీ నాలుక మడతపడింది. మాట తడబడ్డాడు. అక్షరక్రమం మారింది. గుటకలు వేశాడు. ఆనంద వైపు నిశ్చలంగా జాగ్రత్తగా చూశాడు. నీలిరంగు జేబులోంచి తిరిగి ఆ పర్సుని తన సన్నని నైపుణ్యంగల వేళ్ళతో లాఘవంగా పైకి తీశాడు. ∙ బెంగాలీ మూలం : రిత్విక్ ఘటక్ (ప్రముఖ సినీదర్శకుడు) అనువాదం: టి.షణ్ముఖరావు -
నా కొడుకు సుందరాంగుడు
శనివారం సాయంత్రం– మీసాలాయన కయ్యి కాడికి పోయి పచ్చ గడ్డి కోసుకొని అప్పుడే ఇంటికి వచ్చింది అచ్చెమ్మక్క. గంప దించీ దించక ముందే రాతి గుంజలకు కట్టి వున్న రెండు ఆవులూ గంప మీదికి ఎగబడ్డాయి. రెండింటినీ కుడిచేత్తో రెండు దెబ్బలేసి గంపలోని గడ్డిని వాటి ముందర పోసింది. అవి ఆవురావురుమని తింటున్నాయి. మట్టి తొట్టెలోని నీళ్లతో ముఖం కడుక్కొని పమిట కొంగుతో తుడుచుకొంటూ ఇంట్లోకి వెళ్తోంది. వేప చెట్టుకింద నార మంచంపైన బడిలో రెండో తరగతి చదివే బాలడు బల్లికగా బలహీనంగా పడుకొని వున్నాడు. గబ గబా కొడుకు దగ్గరకు పోతూ వుంటే వాడి స్కూలు బ్యాగు ఆమె కాళ్ళకి తగిలింది. బ్యాగులోని స్టీలు కారియర్ మిలమిలా మెరుస్తూ వుంటే మూత తీసి చూసింది. క్యారియర్‌లో తెల్లారి పెట్టి పంపిన గోగాకు వూరిబిండి, అన్నం ఎట్ల బెట్టింది అట్లే వుంది. ‘ఏమయ్యిం దబ్బా నా బిడ్డకి’ అనుకొంటూ వాడి ముఖంపై చేయి పెట్టి చూసింది. ‘‘కాళ్ళు సలుపులే అమ్మా, సచ్చుగా వుందే అమ్మా’’ అని చుట్టుకొని చుట్టుకొని పడుకొన్నాడు. బాలడి ముఖం గాండ్రించుకొని వుంది. కళ్ళు కొంచెం పసుపు రంగులో వున్నాయి. కింది కనురెప్పలు లాగి చూసింది. రక్తం అంతంత మాత్రమే వుంది. అచ్చెమ్మ వెనకే వచ్చిన నల్ల రంగు తెల్ల చుక్కల ఇంటి కుక్క బాలడికి ఒళ్ళు బాలేదని తెలిసి ఇద్దరి ముఖాలు చూస్తూ నాలుక బయటికి పెట్టి నాలుకను ఆడిస్తూ నిలబడింది. అప్పుడే పాలల్లో తోడు వేయడానికని పెరుగుకోసం వచ్చిన పార్వతక్క ‘బాలడికి పసికర్లు పసిరికల మాదిరి వుంది. పాకాల పక్కన కొట్టాలలో చేతి మణికట్టు పైన వేడి కమ్మితో రూపాయ బిళ్ళంత కాలుస్తారంట. అది బాగా పుండై చీము పట్టి ఎండిపోతే పసికర్లు కూడా బాగై పోతుందంట...’ అని ఇంకా ఏదో చెప్పబోతోంది పార్వతక్క. సర సర వచ్చిన అచ్చెమ్మక్క గట్టిగా తన రెండు చేతుల్తో పార్వతక్క నోరు గట్టిగా మూసేసింది. ‘పాపిష్టి పార్వతీ, వచ్చినదానివి వచ్చిన పని చూసుకొని పోకుండా నా బంగారంలాంటి కొడుకును కాల్చుకోమంటావా? నా బిడ్డను నా కండ్ల ముందర కాలుస్తుంటే నా ప్రాణం నిలబడుతుందా? ఈ నా ప్రాణం వుంటే ఎంత? పోతే ఎంత? నా కొడుకు సల్లగా వుండాల. వాడిని చీమ కుట్టినా నన్ను తేలు కొట్టినంత బాధ పడతాను. ఇట్టాంటి మాటలు ఎప్పుడూ చెప్పబాక. కడుపులో కత్తెర పెట్టుకొని నోట్లో చక్కెర పొసే మనిషిగా ఉండావు’ అని తిట్టేసి ఇంట్లోకి సర సరా పోయి తోడు కోసం పెరుగు తెచ్చి ఇచ్చింది. ‘తప్పై పోయిందిలే అచ్చెమ్మక్కా, రాసపల్లి రాచకొండ నారాయణమ్మ ఆకు పసరు మందు ఇస్తుందంట. మూడు వారాలకే పసిపిలకాయలకు పసికర్లు పోయి చెంగుచెంగుమని పరుగులు తీస్తారంట. పోరాదా, ఆకు పసరు తినిపించరాదా’ అంటూ చెప్పి వెళ్లి పోయింది. రాత్రంతా నిద్ర లేదు అచ్చెమ్మకు. బిడ్డ పక్కనే కూర్చొంది. గంట గంటకీ బాలడి కనురెప్పలు తెరిచి తెరిచి చూసింది. కండ్లు తెల్లగున్నాయా, పసుపు రంగుకు మారినాయా అని చూసింది. వాడు కడుపు నొప్పికి ఆ పక్కకీ ఈ పక్కకీ దొర్లుతుంటే ‘‘ఏం కాదు... ఏం కాదులే నాయనా’’ అని దైర్యం చెప్పింది. తడిగుడ్డ తెచ్చి వాడి పొట్టపైన వేసింది. ఆదివారం తెల్లారింది. ఊర్లో కోళ్లు ఒకటి కాదు, వరసగా అయిదారు కూసినాయి. గబగబా లేచి పెళ్ళోకి పెరట్లోకి పోయి చన్నీళ్లతో తల స్నానం చేసింది. దేముడి పటాలకు దండం పెట్టింది. మూడేళ్ళ ముందు బురద గుంటలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న మొగుడి పటానికి ముద్దబంతి పూలు పెట్టింది. బాలడిని తట్టి లేపి తడి గుడ్డతో బాలడి ఒళ్ళంతా తుడిచింది. వాడి గుడ్డలు చిన్నగా మార్చి ‘‘బాలా, రాసపల్లికి పోదాము. నారాయణమ్మ పసరు మందు తీసుకొందాము. తెల్లార్తోనే పోయి ఎండ రాకుండా ముందే మందు తిందాము’’ అని చెప్పింది. చిన్నగా అమ్మా కొడుకు ఈశ్వరాపురం నుంచి మైలు దూరంలో వున్న రాసపల్లి బయలుదేరినారు. కయ్యిలమ్మిట, కాల్వలమ్మిట బాలడు అడుగులో అడుగువేసుకొంటూ నడుస్తున్నాడు. ‘‘సుందరాంగుడు నా కొడుకు. వాడు నడిస్తే వుండే రాజఠీవి ఈ నాలుగూళ్ళల్లో ఎవడికి వస్తాది? ప్రాయానికి రానీ నా కొడుకు, ఊర్లో ఆడపిలకాయలు ఎగరేసుకు పోవాలని చూస్తారు. ఏ పాపిష్ఠి కండ్లు పడినాయో నా బిడ్డ మీద, ఏ చుప్పనాతి దిష్టి తగిలిందో నా బిడ్డ మీద, సగానికి సగం అయిపోయినాడు’’ అనుకొంటూ వాడి వెనకే నడుస్తోంది అచ్చెమ్మ. అర మైలు నడిచినారు. ‘‘కాసేపు కూర్చొంటానే అమ్మా’’ అని అడిగినాడు. ఇద్దరూ చింత చెట్టు కింద రాతి బండ పైన కూర్చొన్నారు. చింత చెట్టు ముందరే రెండు నీళ్ళ గుంటలు వున్నాయి. వాటిని ఆ చుట్టు పక్కల ఊర్లల్లో నూకలగుంట, రాగులగుంట అని పిలుస్తారు. గుంటల ఒడ్డున నత్త గుల్లలు పెండ్లి కూతుర్ల లెక్కన నడుస్తూ వుంటే బాలడు వాటినే చూస్తున్నాడు. ఇంతలో ఒంటిమిట్ట ఊరోళ్ళవి అర డజను ఆవులు వచ్చి నూకల గుంటలో నీళ్లు తాగుతూ వున్నాయి. అప్పుడే రాసపల్లి ఆవులు పది దాకా వచ్చి అదే గుంటలో నీళ్లు తాగబోయాయి. అట్లా ఇట్లా చూసిన ఒంటిమిట్ట ఆవులు రాసపల్లి ఆవుల్ని నీళ్లు తాగనీయకుండా బుసలు కొడుతూ, కొమ్ములు విసురుతూ తరిమినాయి. ఎదురు తిరగలేని రాసపల్లి ఆవులు తోకలు ఆడించుకొంటూ పక్కనున్న రాగులగుంట కాడికెళ్ళి నీళ్లు తాగాయి. ఆవుల తరుముడు చూసిన బాలడు చిన్నగా అర నవ్వు నవ్వినాడు. దూరంగా వున్న చెరుకు తోటల నుంచి గాలి తెరలుతెరలుగా వీస్తోంది. ‘‘సరే పోదాం పదరా బాలా’’ అనింది అచ్చెమ్మ. చిన్నగా చెట్టు పట్టుకొని లేచినాడు. ‘‘నా వల్ల కావడం లేదే అమ్మా’’ అనినాడు. ఒక పక్క కొడుక్కి దైర్యం చెబుతూ. ‘ఎట్ల చేసేదిరా కొడకా’ అని సాయానికి ఎవరైనా కనబడతారేమోనని అన్ని దిక్కులూ చూసింది. దరిదాపుల్లో ఎవ్వరూ కనబడకపోయేసరికి ‘సరే రారా నేనే ఎత్తుకొని పోతాను’ అని చెప్పి బాలడిని భుజాన వేసుకొని పది అడుగులు వేసింది. అచ్చెమ్మ వల్ల కాలేదు. బలవంతంగా అడుగులేసుకొంటూ వెళుతుంటే ఊరినుంచి ఎద్దుల బండిలో సొరకాయలాయన వడ్ల మూటలు వేసుకొని వస్తున్నాడు. అచ్చెమ్మను చూసిన సొరకాయలాయన ‘‘అచ్చెమ్మక్కా, కాటారెడ్డి మిల్లులో వడ్లు ఆడించుకొనేదానికి అగ్రహారం పోతా ఉండా, బండిలో అబ్బిని కూర్చోబెట్టు. రాసపల్లిలో దించిపోతా’’ అనినాడు. ‘‘కోరిన కొండ పైన వాన పడతందంటే వద్దంటామా అన్నా, నా బిడ్డను ఎక్కించుకో నీ బండిలో, నీకు జన్మ జన్మకీ రుణపడి వుంటాను’’ అని చెప్పి బాలడిని ఎద్దులబండిలో ఎక్కించి వెనకనే నడుచుకొంటూ వెళ్ళింది. రూపాయ బిళ్ళంత బొట్టు పెట్టి ముక్కుకు రెండు వైపులా బంగారు పుడకలుబెట్టి తలకి బిచ్చాడిక్రొప్పు ముడి వేసి మూర మల్లెపూలు పెట్టి చేతినిండా బంగారు గాజులేసి ఒళ్ళంతా పసుపురాసి లక్ష్మీకరంగా వాకిట్లో నిలబడివుంది నారాయణమ్మ. పట్టు చీరకట్టి, మెడ పైవరకు కుట్టించుకున్న జాకెట్టుతో మెడలో నల్లపూసలతో మిలమిలా మెరుస్తోంది నారాయణమ్మ. నిండు ముత్తయిదువ కదా, నిమ్మ రంగు ఒళ్ళు కదా, ధగధగా మెరిసిపోతోంది అయిదు అడుగుల ఎత్తు వున్న నారాయణమ్మ. నవ్వుతూ పలకరించి విషయం తెలుసుకొంది. ‘‘మూడు ఆదివారాలు రావాలి. పరగడుపున వారం వారం ఆకు ముద్దలు మూడు మింగాలి. చల్లటి మజ్జిగ తాగాలి. ఆ రోజంతా ఉప్పులేని మజ్జిగన్నం తినాలి. పసికర్లు తగ్గేంత వరకు మాంసంగానీ శెనగనూనె గానీ వేపుళ్ళు గానీ తినకూడదు. తేలికగా జీర్ణమయ్యే తిండి తినాలి. చెడీ బడీ తినొద్దు. ఈ మూడు వారాలూ నోరు కట్టేసుకో’’ అని బాలడికి జాగ్రత్తలు చెప్పింది. అన్నిటికీ బుద్ధిమంతుడి లెక్కన తల ఊపినాడు బాలడు. అచ్చెమ్మ వైపు తిరిగి ‘‘నేను ఇచ్చే మందు ఆకు పేరు ఏమి అని అడగబాకండి. మందు పేరు చెబితే వైద్యం పనిచేయదని మా గురువు ఆజ్ఞ. మందు పనిచేస్తుందో చేయదో అని అనుమానం పెట్టుకోకండి. నమ్మితేనే వైద్యం పని చేస్తుంది. వందల మంది నా మందు తిన్నారు. దేముడి దయ వల్ల అందరూ చల్లగా వుండారు. వైద్యానికి నేను పైసా తీసుకోను. డబ్బు తీసుకొంటే వైద్యం పని చేయదని కూడా మా గురువు చెప్పినాడు’’ అని గబ గబ చెప్పేసింది. అన్నిటికీ సరేనంది అచ్చెమ్మ. ఐదో తరగతి చదివే నారాయణమ్మ నాలుగో కొడుకు శీనడు బలహీనంగా వున్న బాలడిని ఎగాదిగా చూసి ఆకు కోసుకొద్దామని నిక్కరు ఎగేసుకొంటూ పరుగులు తీసినాడు. ఊరికి ఎగుదాల ముగ్గురాళ్ళ మిట్ట కాడ కొన్ని ఆకులు కోసుకొచ్చినాడు. మోటరు బావి కాడ పారుతున్న మంచి నీళ్ళల్లో శుభ్రంగా ఆకుల్ని కడిగి ఇంటికి తెచ్చినాడు. ఇంటి పెరట్లోని సనికెల రాయి పైన పెట్టినాడు. నారాయణమ్మ శుభ్రంగా కాళ్ళు చేతులూ కడుక్కొని గబగబా వచ్చి ఆకును నూరసాగింది. ఇంట్లోకెళ్ళి శీనడు చెంబునిండా మజ్జిగ తెచ్చినాడు. నూరిన ఆకు పసరును ముద్దలు ముద్దలుగా చేసి నారాయణమ్మ మూడు తెల్ల తమలపాకుల్లో పెట్టింది. బాలడిని తూర్పు దిక్కుగా కూర్చోమని చెప్పి కండ్లు మూసుకొని తిరుత్తణి సుబ్రమణ్యస్వామిని మొక్కుకొని ఒక్కొక్క ముద్దా తినిపించింది. కండ్లు మూసుకొని గుటక్ గుటక్ మని మింగినాడు. అక్కడే కాసేపు కూర్చోమని చెప్పి ‘‘భయం లేదు,అంతా బాగైపోతుందిలే’’ అని భుజం తట్టి దైర్యం చెప్పి పంపింది. రెండవ ఆదివారం– అమ్మా, కొడుకు చిన్నగా నడుచుకొంటూ మందు కోసం రాసపల్లికి వెళ్తున్నారు. అలిసిన బాలడు కొంచెం సేపు కూర్చొంటానంటే ఇద్దరూ దారిలోని బ్రహ్మం గారి మఠం కాడ కూర్చొన్నారు. అక్కడే ఒంటిమిట్ట వెంకటమ్మ తలకి గుడ్డ చుట్టుకొని తట్ట, బుట్ట పెట్టుకొని చింత చెట్టు బెరడు, పిక్కలు ఏరుతోంది. వాటిని గోతాలకేసుకొని ఒలిచి తిరుపతికి తీసుకెళ్లి ఎంతకో కొంతకు అమ్ముకొంటుంది. ‘గురివింద గింజా గురివింద గింజా పైపైకి చూస్తావు గురివింద గింజా నీ నలుపేల చూడవు గురివింద గింజా’ అని పాడుతూ వుంది. బండ పైన కూర్చొని వున్న అచ్చెమ్మ చేతికి చింతపండు ఇచ్చింది. ‘తిను, పుల్లగా తియ్యగా భలే వుంది ఈ చెట్టు పండు’ అని చెప్పింది. ‘‘లేదు వెంకటమ్మా, బిడ్డకి ఒళ్ళు బాగ లేనికాడినుంచి నా నోటికి ఉప్పూ కారం, తీపు చేదు రుచి తెలియడంలేదు. ఏడుకొండలోడి దయవల్ల నా బిడ్డ తేరుకోబోతాడా అని ఒకటే దిగులు పట్టుకొంది. తట్ట నిండా పెడితే కడుపు నిండా తినే నా కొడుకు ఆకలే కావడం లేదంటా వుండాడక్కా. చాన్నాళ్లుగా తిండి తినక నా కొడుకు సచ్చుబడి పోయినాడక్కా! ఆకలో, ఆకలో అని అరిచేటోడు ఆకలి మాట నోరారా ఎత్తడం లేదక్కా’’ అని కన్నీళ్లు పెట్టుకొంది. ‘‘అయ్యో ఏంది అచ్చెమ్మా, ఈరోజు వున్నట్టే రేపు వుంటుందా? రేపు వున్నట్టే ఎళ్లుండి వుంటుందా? అంతా నీ పిచ్చిగానీ, దైర్యంగా వుండు. మగ తోడు లేనిదానివి. అన్నీ మంచే జరుగుతాయిగానీ’’ అని దైర్యం చెప్పింది. పొగాకు తిత్తి లోనుంచి మడతలు పడిన పదిరూపాయల నోటు తీసి అచ్చెమ్మ చేతిలో బలవంతంగా పెట్టింది. ‘‘దోవలో ఎక్కడైనా టెంకాయలు అమ్మతావుంటే లేత టెంకాయ ఒకటి కొట్టించి బిడ్డకు తాగిపించు. కడుపు చల్లబడతాది’’ అని చెప్పి పంపింది. రెండో వారం కూడా నారాయణమ్మ ఇచ్చే పసరు మందు తీసుకొని ఇంటికొచ్చినారు. మూడవ ఆదివారం– అమ్మా, కొడుకు తెల్లారేకడికి లేచి నడుచుకొంటూ వెళ్లి కాసేపు కూర్చొందామని పసుపు కాల్వ కాడ కూర్చొన్నారు. బాలడు కాల్వ గట్టున వున్న పసుపు పచ్చని తంగేడు పూలు చూస్తూ కూర్చొన్నాడు. రాసపల్లి మేకల గుంపు పసుపు కాల్వ కుడి పక్కనున్న కటవ మీది తుమ్మచెట్టు చుట్టూ చేరి ముండ్లు గుచ్చుకోకుండా ఒడుపుగా ఆకులు పెరుక్కొని తింటున్నాయి. వాటి వెనకే వచ్చిన ఒంటిమిట్ట మేకల గుంపును కొమ్ములతో తరుముకున్నాయి. ఒంటిమిట్ట మేకల గుంపు వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీసి ఎడమ పక్కనున్న తుమ్మచెట్టు దగ్గరికి పోయి నోటితో ఆకులు పెరుక్కొని నమలసాగాయి. మేకల పరుగుళ్లు చూసిన బాలడు ‘వాల్లోళ్ళ రాజ్యం వాల్లోళ్ళది’ అనుకొంటూ ముసిముసిగా నవ్వినాడు. ఇంతలో ఆముదాలను వండి ఆముదాన్ని పుత్తూరులో అమ్ముకొనేదానికి పోతా వున్న చిర్రక్క నిలబడింది. ‘‘కడుపు నిండితే కడవలు మోయు, లేకపోతే పగుల వేయు కదా నా కొడుకు. కంచం వైపు చూడటమే లేదు, మంచం వైపే చూస్తున్నాడు’’ అని చిర్రక్కతో చెబుతూ ముక్కు చీదింది అచ్చెమ్మ. ‘‘ఏమిరా బాలా, ఏనుగు మాదిరి వుండాల్సిన వాడివి ఎలుక పిల్ల మాదిరి సన్న బడిపోయినావు’’ అని అంటూ నెత్తి మీది సత్తు చెంబు కింద పెట్టింది. అచ్చెమ్మ పసికర్ల విషయం చెప్పేసరికి– ‘‘అచ్చెమ్మక్కా, నీ బిడ్డకి ఒంట్లో వేడి అయిపోయి వుంటుంది. అందుకే బిడ్డ ఇట్లా ఎండి పోతావుండాడు’’ అంటూ చేతిలోకి ఆముదం తీసుకొని తలకి కాళ్ళకి పొట్టకి రాసి ‘‘నూరేండ్లు చల్లగా ఉండురా నాయనా’’ అని దీవించి గంపనెత్తుకొని బయలుదేరింది. చిన్నగా నడుచుకొంటూ రాసపల్లి కెళ్ళి మూడో ఆదివారం కూడా నారాయణమ్మ పసరు మందు తీసుకున్నారు. నారాయణమ్మ ఇంటకాడనే తిన్నె పైన కూర్చొన్నారు అమ్మా కొడుకు. ఎదురుగా వున్న తాటి చెట్లను చూస్తూ వున్నాడు బాలడు. గాలికి అప్పుడప్పుడు తాటి మట్టలు చిన్నగా కదులుతున్నాయి. ఇంతలో కోతుల గుంపు ఒకటి వచ్చింది. పెద్ద కోతి ఒకటి ఎక్కడినుంచో అరటిపండ్ల గెల ఒకటి పట్టుకొచ్చింది. పిల్ల కోతులు చుట్టూరా చేరి గెల లోని పండ్లు పెరుక్కొని తింటున్నాయి. బాలడు ఎక్కడ భాగానికొస్తాడో అన్నట్లుగా అప్పుడప్పుడు బాలడి వైపు ఉరిమి ఉరిమి కోతి చూపులు చూసినాయి. ఇంతలో తాటి చెట్టునుంచి ఒక పెద్ద తాటిమట్ట ఒకటి కోతి గుంపుపైన ధభీమని పడింది. అరటిపండ్లు అన్నీగబగబా ఏరుకొని కోతులన్నీ చెల్లాచెదురుగా పరుగులెత్తాయి. కోతులు పరుగులు తీసేది చూసిన బాలడు పకపకా నవ్వినాడు. చాన్నాళ్లకు కొడుకు పకపకా నవ్వేది చూసిన అచ్చెమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గబగబా లేచి దోవలో తోపుడు బండి గంట కొట్టుకొంటూ వెళ్తున్న సులేమాన్ని ఆపింది. గాజు సీసాలోని పీచుమిఠాయి పొట్లం కట్టించి నారాయణమ్మ కొడుకు శీనడి చేతికిచ్చింది. మిఠాయికి పైసలిచ్చి వెనక్కి తిరిగి చూసేలోగా శీనడు పీచుమిఠాయిని గుటుక్కుమని మింగేసినాడు. రెండోసారి తీసిచ్చింది. సిగ్గు పడకుండా తీసుకున్నాడు. మూడోసారి తీసిస్తుంటే.... నారాయణమ్మ ఇంట్లోంచి గబగబా వచ్చి ‘‘తినింది చాల్లేరా శీనా, కడుపు చెడిపోతుంది. ఎవరైనా ఏమైనా తీసియ్యబోతారా అని కాసుకొని ఉంటాడు తీసుమింగుడు’’ అంటూ కట్టె ఎత్తుకొని తరిమింది. శీనడు ‘‘నాకేం తెలుసు?’’ అన్నాడు. ‘‘అచ్చెమ్మక్క ఇచ్చింది. తీసుకున్నాను. అచ్చెమ్మక్క ఇచ్చింది. తిన్నాను’’ అంటూ జారి పోతున్న నిక్కరు ఎగేసుకొంటూ చీమిడి ముక్కు చీదుకొంటూ ఊర్లోకి పరుగులెత్తినాడు. ‘‘ఇంటికి పోదాం పదమ్మా’’ అని భుజాలెగరేస్తూ అడిగినాడు బాలడు. సరేనంది అచ్చెమ్మ. ముందుగా బాలడు నడుస్తున్నాడు. వెనక అచ్చెమ్మ నడుస్తోంది. రాసపల్లి ఊరి చివరికి వచ్చారు. రేగు పండ్ల చెట్ల నుంచి నేల మీద పడిన రేగు పండ్ల వాసన గుప్పుగుప్పుమని వస్తోంది. బాలడి నోటిలో నుంచి కొంచెం కొంచెం ఊట ఎంగిలి ఊరుతోంది. అయ్యోరోళ్ల భాగ్యం ఇడ్లీ అంగడి కాడ గబుక్కున ఆగినాడు బాలడు. కొడుకు వెనకే వస్తున్న అచ్చెమ్మ దారిపక్కనున్న అనంతమ్మ గుడి కాడ నిలబడింది. గుడిలోని బండారు (విభూది) పెట్టుకొంది. కొడుకు బాగుండాలని పడీ పడీ మొక్కుతోంది. ఇంతలో గట్టిగా బాలడు ‘‘అమ్మా, ఆకలే!’’ అని అరిచినాడు. బాలడి నోట ‘ఆకలి’ అనే పదం వచ్చేసరికి అచ్చెమ్మ నోట్లో తేనె పోసినట్లయ్యింది. కొడుకు దగ్గరికి ఎగురుకొంటూ వచ్చింది అచ్చెమ్మ. ‘‘ఎన్నాళ్లయిందిరా కొడకా, నీకు ఆకలి తెలిసి. పిడికెడన్నం తిని పదిరోజులయ్యింది కదరా, నీ పసికర్లు పరారైనాయి. నారాయణమ్మ పసరు మందు భలే పనిచేసిందిరా బాలా, అంతా అనంతమ్మ చలవ....రారా కొడకా’’ అంటూ వాడిని ఎత్తుకొని గిరగిరా తిప్పింది. వాడు అమ్మ ముందర కాసేపు కులికినాడు. రెండు మూడు పల్టీలు కొట్టినాడు. వాళ్ళ అమ్మని ఎత్తబోయినాడు. ఎత్త వద్దని చెబుతూ అచ్చెమ్మ ‘‘బాలా, అన్ని పాములూ ఎగిరినాయని వాన పాము కూడా ఎగిరిందంట. ఆ మాదిరి వుంది నీ వ్యవహారం, ఇంకొక వారం పత్యంగా వుంటే నువ్వు కోరింది చేసి పెడ్తారా కొడకా! కావాల్సింది తిందువుగానీ’’ అనింది. వాడు సినిమా హీరో ఫోజులు పెడుతూ.... ‘‘నాకు ఒళ్ళు బాగైపోయిందోచ్, జబ్బు గిబ్బు జాన్తానై. ఇడ్లీ ,దోసెలు తినొచ్చు. బెల్లం బర్ఫీ, అల్లం బర్ఫీ తినొచ్చు’’ అంటూ భాగ్యం అంగడికి పోయి రెండు ఇడ్లీలు పెట్టించుకున్నాడు. అడిగడిగి సాంబారు పోయించుకున్నాడు. భాగ్యం సాంబారు పోసింది పోసిందే....అర బకెట్ సాంబారు క్షణాల్లో మాయం. పడీ పడీ నవ్వుతోంది అచ్చెమ్మ. సాంబారు తాగుతున్న బాలడిని చూసి అంగడి భాగ్యం ముక్కు మీద వేలేసుకొంది. అమ్మా కొడుకుల సంబరం చూసిన అనంతమ్మ విగ్రహం తల పైని తెల్ల చామంతులు బాలడిని ఆశీర్వదిస్తున్నట్లుగా నేల మీద రాలినాయి. - ఆర్ సి కృష్ణస్వామిరాజు -
శాంతి చిహ్నం
వజ్రపురం, గిరిపురం రెండు రాజ్యాల మధ్య నది ఒక్కటే అడ్డం. అది ఎప్పుడూ ప్రవహిస్తూ వుంటుంది. ఒక రాజ్యంలోకి మరొకరు ప్రవేశించాలంటే తెప్పల ద్వారా దాటాల్సిందే. రెండు రాజ్యాల మధ్య ఏనాడూ ఘర్షణలు లేవు. అక్కడ సంత జరిగినా, ఇక్కడ సంత జరిగినా సఖ్యతతో జరిగేది. మోసాలు, కుట్రలు లేవు. ఇద్దరు రాజులు ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేమిటంటే... వివాహసంబంధాలు అక్కడ, ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవాలి. ఇంకే రాజ్యసంబంధాలు చేసుకోకూడదు. దానితో రెండు రాజ్యాలు ఇంకా పటిష్టమైనాయి. ప్రజలు కూడా రాజుల శాసనాలకు మద్దతు ఇచ్చారు. రెండు రాజ్యాలలో ‘కరువు’ అనేది కనిపించడం లేదు. ఏ సహాయమైనా క్షణాల్లో జరిగిపోతుంటుంది. ఈ రెండు రాజ్యాల సంబంధం, ఐక్యత చూసి గిరిపురం దగ్గరలోని కొండ దిగువన ఉన్న శ్రీపురం రాజు కన్ను గిరిపురంపై పడింది. ఎలాగైనా సరే గిరిపురాన్ని ఆక్రమించి తన రాజ్యంలో కలుపుకోవాలనుకున్నాడు. గిరిపురంతో పోల్చుకుంటే శ్రీపురం సైనికబలగం ఎక్కువే. కాని గిరిపురం, వజ్రపురం కలిస్తే శ్రీపురం మట్టి కరవడం ఖాయం. రెండు రాజ్యాల ఐక్యత, ఆ ఐక్యత వల్ల వచ్చిన బలం శ్రీపురం రాజుకు ఇబ్బందిగా మారింది. కయ్యమా? స్నేహమా? అని ఆలోచించాడు. చివరికి కయ్యానికి కాలు దువ్వి గిరిపురానికి దూతతో లేఖ పంపాడు. ‘‘నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను. అయితే నీవు వజప్రురం సహాయం తీసుకోకూడదు. ఇరువైపులా సైనికులు కూడా వద్దు. యుద్ధభూమిలో మనిద్దరమే వుండాలి’’ అని రాశాడు. గిరిపురం రాజు వీరదత్తుడు ఆ లేఖ చదివి చిరునవ్వు నవ్వి– ‘‘యుద్ధం జరగకుండానే నీ మనసు మారాలి’’ అని ప్రార్థించాడు. మరుసటి రోజు– శ్రీపురం రాజు తలకు శిరస్త్రాణంతో, ఆయుధాలతో వచ్చాడు. గిరిపురం రాజు తన శిరస్త్రాణం ఎక్కడ ఉంచాడో తెలియలేదు. అంతా వెదికాడు. చివరకు తల్లికి కబురు పెట్టి ‘‘నా శిరస్త్రాణం ఎక్కడమ్మా?’’ అని అడిగాడు. ఆమె చెప్పింది. ‘‘అలాగా’’ అంటూ శిరస్త్రాణం లేకుండానే ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్లాడు గిరిపురం రాజు. అతన్ని చూడగానే జయవర్మ– ‘‘రాజా! శిరస్త్రాణం లేకుండా వచ్చావు. అది ధరించిరా యుద్ధం చేద్దాం’’ అన్నాడు. అప్పుడు వీరదత్తుడు– ‘‘రాజా! నేను శిరస్త్రాణం ధరించాలంటే అన్యాయంగా ఓ ప్రాణిని చంపినట్లవుతుంది. దాన్ని చంపడం ఇష్టం లేక ఇలానే వచ్చాను’’ అన్నాడు. జయవర్మకి అర్థం కాలేదు. శిరస్త్రాణం ధరిస్తే ఒక ప్రాణి చచ్చిపోతుందా! అనుకొని ‘‘నువ్వు చెప్పేదాంట్లో నిజం ఉంటే నేను యుద్ధం మానేస్తా’’ అన్నాడు. అప్పుడు వీరదత్తుడు జయవర్మని తన రాజ్యానికి ఆహ్వానించి ఆయుధగారంలో ఓ మూలన ఉన్న శిరస్త్రాణం చూపాడు. జయవర్మ అది చూసి ఆశ్చర్యపోయాడు. శిరస్త్రాణంలో ఒక తెల్లని పావురం పిల్లలు పెట్టుకుంది. అవి తల్లి రెక్కల కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. తల్లిపావురం ఆ పిల్లలను రెక్కల కింద భద్రంగా దాచింది. ‘‘రాజా! నేను శిరస్త్రాణం ధరించాలంటే ఆ పావురాన్ని వెళ్లగొట్టాలి. అప్పుడు ఆ పావురం, పిల్లలు ఆవాసం లేక చచ్చిపోతాయి. అది నాకు ఇష్టం లేదు. అందుకే శిరస్త్రాణం ధరించలేదు’’ అన్నాడు వీరదత్తుడు. ఆ మాటకు కళ్ళు తెరిచాడు జయవర్మ. ‘‘నిజమే, యుద్ధం ఏ దేశానికి తగినది కాదు. శాంతే మన లక్ష్యం. ఈరోజు నుంచి కాదు...ఈ క్షణం నుంచి నేను యుద్ధం చేయను. శాంతి కోసం పోరాడతా! నన్ను నీ మిత్రునిగా చేర్చుకో’’ అని వీరదత్తుడిని ఆలింగనం చేసుకున్నాడు జయవర్మ. ఆ స్నేహాన్ని చూసి పావురం రెక్కలు టపటపా కొట్టింది. ‘‘ఇప్పుడు మనం ముగ్గరం మిత్రులమే’’ అన్నాడు వీరదత్తుడు. ‘‘యుద్ధాన్ని దూరం చేసి శాంతికి ద్వారాలు తీసిన ఆ పావురం మన రాజ్యాలకు శాంతిచిహ్నంగా ఉంటుంది’’ అన్నాడు జయవర్మ. అలా పావురం శాంతికి చిహ్నంగా మారిపోయింది. -
ఆరో యువకుడి కోరిక
అనగనగా ఓ రాజు. అతని దగ్గర ఓ మంత్రి. చుట్టుపక్కల ఆయన దయాదాక్షిణ్యాలతో నడిచే ప్రాంతాల నుంచి పన్నులు వసూలు చేయడానికి తన మంత్రిని పంపుతుంటాడు. మంత్రి ఓ నలుగురు భటులతో పన్నుల వసూలుకు పోతుంటాడు. తిరిగి వస్తున్నప్పుడు మంత్రి, అతని అంగరక్షకులు ఓ అడవి గుండా రావాల్సి ఉంటుంది. ఓసారి వీరిలా పన్నులు వసూలు చేసి వస్తుండగా అడవి మార్గంలో దోపిడీ దొంగలు మంత్రిని, భటులను బెదిరించి వారి నుంచి డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మంత్రి మనసులో దేవుడిని ప్రార్థిస్తాడు తమను కాపాడమని. ఆ ప్రార్థన భగవంతుడి చెవిన పడిందో ఏమోగానీ ఎక్కడి నుంచో ఆరుగురు యువకులు అక్కడికి వస్తారు. మంత్రిని, అతని అంగరక్షకులను కాపాడుతారు. మంత్రి ఆ ఆరుగురు యువకులను మెచ్చుకుని తమతో రాజు వద్దకు తీసుకుపోతారు. రాజుకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు మంత్రి. రాజు వారిని కొనియాడుతూ, మీరేం కోరుకున్నా ఇస్తానని మాటిస్తాడు. మొదటి యువకుడు తనకు బోలెడంత డబ్బు కావాలని కోరుకుంటాడు. రెండో యువకుడు తానూ, తన కుటుంబసభ్యులు హాయిగా నివసించడానికి ఓ ఇల్లు కావాలని కోరుతాడు. మూడోవాడు తానుంటున్న గ్రామంలో రోడ్లను బాగు చేయాలని కోరుకుంటాడు. నాలుగో యువకుడు తాను ఇష్టపడుతున్న ఓ ధనికుడి కూతురితో తనకు వివాహం జరిపించాలని కోరుకుంటాడు. అయిదో యువకుడు తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చాలని కోరుతాడు. అయిదుగురు యువకులకూ వారు వారు కోరుకున్నది ఇస్తానని హామీ ఇస్తాడు రాజు. ఇక ఆరవ యువకుడి వంక చూసి ‘నీకేం కావాలి’ అని అడుగుతాడు రాజు. యువకుడు అడగడానికి ముందుగా కాస్తంత జంకుతాడు. అయితే రాజు ఎటువంటి జంకూ గొంకూ లేకుండా ఏది కావాలన్నా అడుగు ఇస్తానంటాడు. మాట తప్పనని అంటాడు. అప్పుడు ఆ యువకుడు తనకు నగానట్రా ఏవీ అక్కర్లేదంటాడు. ఏడాదికి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ఓ వారమో లేక పది రోజులో ఉండాలి. నాకు అంతకన్నా మరేమీ వద్దంటాడు. రాజు ఇంతేగా అంటూ అతని కోరికకు సరేనని ఒప్పుకుంటాడు. అయితే ఆ తర్వాతే ఆ యువకుడి కోరికలో దాగి ఉన్న ఉద్దేశం అర్థమైంది. అవును...ఆ నిజమేమిటంటే, రాజు అతనింటికొచ్చి ఉండాలంటే అతని ఇల్లు బాగుండాలి. ఆ ఊరికి వెళ్ళే రహదారులన్నీ బాగుపడతాయి. అలాగే అతనున్న సమయంలో అతనికోసం పనివాళ్ళు కావాలి. ఈ క్రమంలో అతనికీ ఓ అర్హత లభిస్తుంది. ఇలా ఉండగా, మొదటి ఐదుగురూ కోరుకున్నవన్నీ కలిపి ఈ ఆరవ యువకుడు ఒక్క మాటతో తీర్చుకోబోతున్నాడు తన కోరికను. అతని ఉద్దేశాన్ని గ్రహించిన రాజు ఆ యువకుడి తెలివితేటలను గ్రహించి అతనికే తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ వల్ల తెలుసుకోవలసిందేమిటంటే రాజే మన పరమాత్మ అనుకుందాం. సహజంగా అయితే అందరూ దేవుడిని కోరుకునేదేమిటంటే ఆ అయిదుగురి యువకుల్లా తమకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు. కానీ ఆరో యువకుడిలా దేవుడే మనతో ఉండాలని కోరుకుంటే మిగిలినవన్నీ తానుగా అమరుతాయి అని గ్రహించాలి. - యామిజాల జగదీశ్ -
మాయన్నగాడు నన్ను పిలవకపోతాడా..!
‘‘రేయి, సురేష్ యాడుండావురా తొందరగా రా అన్నం తిని బరుగోళ్లను తోలుకుని పొదురా’’ అని మా నాయిన అనగానే బయట వున్న మా యన్నగాడు ఉరుకుతా నా దగ్గరకు వచ్చినాడు. అప్పుడే బీరువా సందున వున్న బాల్ బాడ్మింటన్ బ్యాట్ మా నాయనకు కానరాకుండా అంగీ యెనకాల దాసిపెట్టుకుంటున్నా. ‘‘ఒరేయ్ నాయన పిలుచ్చాన్నాడు మర్యాదగా ఇద్దరం అన్నం తిని బరుగోళ్లకు పోదాం పద’’ అని మా యన్న బుసపెడుతూ చెప్తున్నాడు. ‘‘యెందిరా నువ్వు, అయిన నాయన నీకు సెప్పినాడు నాకు కాదు. నేను రాను నువ్వు పో నేను మ్యాచ్ ఆణ్ణికి పోవాల’’ అని గట్టిగా సెప్పిన. ‘‘ఆ పొతావ్ పొతావ్ యెట్టాపోతావో సుచ్చా పారా ఆ బ్యాట్ నాది ఇట్టతా అది, లేకుంటే పోయి నాయనకు సెప్త. ఆడు బరుగోళ్ళకు రమ్మంటే రాకున్నాడు. బాడ్మింటన్ ఆణ్ణికి పోతనాడు అని సెప్త’’ అనేసారికి నాకు బయమేసింది. నేను రొంచేపు ఆలోసించి ‘‘ఆ సెప్పురా నాకేం. సెప్తే ముందు ఈ బ్యాట్ ఇరగొడ్తాడు. అప్పుడు ఇద్దరికీ ల్యాకుండా పోతాది’’ అనేసారికి మా యన్నగాడు పౌరుషంతో.. ‘‘ఆ ఇరగొట్టని నాకేం నాకు బ్యాట్ ఇచ్చేవాళ్లు సాన మంది వున్నారు. పోతే ఇద్దరం తోలుకోని పోవాల లేదంటే ఇద్దరం ఇన్నే వుండాల తేల్చుకో మళ్ళా’’ అన్నాడు. ‘‘రేయ్ ఇద్దరు లోపల ఏం జెచ్చనారురా పిలచ్చంటే ఇనపడలేదా’’ అని నాయిన లోపలోకి వచ్చానాడు. బ్యాట్ పట్టుకొని వుండడం సూసినాడంటే ఇంగా అంతే మరి ఒక్క యెటుకు ఇరగొడ్తాడు. మా ఇద్దరికీ ఇంతకముందే రెండు సార్లు సెప్పినాడు మా నాయన. ఈ రోజు ఎట్టాయిన సరే మ్యాచ్ ఆణ్ణికి పోవాల. కంపమళ్ళవురోల్లు వచ్చింటారు. మాకు వాళ్ళకు ఇప్పుడు మ్యాచ్ వుంది. సునీల్‌గాడు యెదురుసూచ్చవుంటాడు. నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో వాళ్ళే గెలిసినారు. ఈ రోజు ఎట్టాయిన సరే వాల్ల మిందా గెలవాలని రాత్రి నేను, సునీలుగాడు, సూరిగాడు, బాబాగాడు, అనిలుగాడు కానిగ సెట్టు కింద కుచ్చోని గట్టిగా అనుకున్నాం. ఇప్పుడే సాన టైమ్ అయిపోయింది. ఇడేమో ఇట్ట. రోజు మా యమ్మనే బరుగోళ్లను తోలుకొని పోతుండా. మేము ఆణ్ణికి పోతున్నాం. ఈ రోజు సేన్లో కలుపు తియ్యనికి మా యమ్మ–నాయిన పోతనారు. ఇప్పుడు యెట్టనో అర్థం కాలేదు నాకు. దిక్కు తెలియడంలేదు. నాయిన కోడెలి తీసుకుంటున్నాడు, మా యమ్మ బాటిల్లో నీళ్ళు పోసుకుంటుంది. నేను ఇంగా బీరువా దగ్గర మా యన్న గాడితో కొట్టర్తనా ఇంగా లాభం లేదు అనుకోని ‘‘రేయ్ అన్న ఈ ఒక్క రోజుకు నువ్వు పోరా, కావాలంటే రేపు నేను పోతా. మద్యానం నువ్వు రాగానే బరుగోళ్లను నేనే యేటికి తీసుకొని పోతా. మ్యాచ్ ఆణ్ణీకి కంపమళ్ళవొళ్ళు వచ్చింటారురా. రేపు వంతు నాదే ఇప్పుడు నువ్వు పోరా’’ అనేసారికి మా యన్నగాడి కళ్ళు మెరిసినాయి. ఆడు దొరికింది ఛాన్స్ లే అని ‘‘సరే రా పోతా. మరి అట్టాయితే సాయంత్రం నువ్వే కోళ్ళు మూయాలా నా బదులు. దానికి నువ్వు సరే అంటే ఇప్పుడు పోతా, లేదంటే నాయినకు సెప్త ఇద్దరం కలిసి బరుగోళ్ళకు పోదాం’’ అని కళ్ళు ఎగరేసినాడు. ‘‘అమ్మ నా కొడకా రొంచెపులోనే ఎంత ప్లాన్ యేసినావ్ రా... నాయిన నిన్ను ఊరికే తిట్టడు రా బింగిసెవులు నా కొడకా’’ అని మనుసులో అనుకోని ‘‘సరే లే పోతా’’ అని తలకాయ ఊపిన. ‘‘ఏం జెచ్చనారురా ఆడ, ఏరా పెద్దోడ బరుగోళ్ళకు పోతనరా లేదా ఊర్లో బరుగోళ్ళున్ని పోతనాయీ తొందరగా తిని పొదురారి’’ అని గంపలో కోడెళ్ళు, నీళ్లబాటిల్ పెట్టుకుంటుంది మా యమ్మ. ‘‘ఆ వచ్చానామ్మ’’ అని మా యన్నగాడు అన్నం తిన్నికి పోయినాడు. నేను సిన్నగా మా నాయినకు బ్యాట్ కానరాకుండా గోడకు అనుకోని ఇంట్లో నుంచి బైట పడి ఎగురుకుంటా కలంలోకి ఉరికినా. కంపమళ్ళ టీమ్ వాళ్లతో మూడు ఆటలు ఆడి ఇంటికి వచ్చెసారికి, మా యన్నగాడు బరుగోళ్లను యెట్లోకి పిలుసుకొనిపోయి వచ్చి గాటికి కట్టేసి దాల్లకు తిండానికి గడ్డి యెచ్చు నన్ను సూసి– ‘‘నల్లనాకోడక మధ్యానం కళ్ల ఇంటికాడా వుంటా యేటికి బరుగోళ్లను తోలుకొని పోతా అని సెప్పి అన్నే వుంటావా’’ అని నా మీదకు ఉరుముతా వచ్చి – ‘‘బ్యాట్ మిందా సేయెయ్యి సెప్తనా, రేపునుంచి ఎట్టపోతావో సూచ్చ’’ అని బ్యాట్ సేతీలో నుంచి గుంజుకున్నాడు. మూడు మ్యాచ్‌లు ఓడిపోయి ఇంటికి వచ్చిన నాకు మా యన్నగాడి మాటలు ఎక్కలేదు. ముప్పై రూపాయలు పొగుట్టుకున్న బాధే ఎక్కువ వుంది. ఆ అనిల్ గాడు సరిగ్గా ఆడక మొత్తం మూడు మ్యాచ్‌లు ఓడిపోయినాం. ఇంతలోనే మా యమ్మ నాయిన సేను కానుంచి వచ్చినారు. మా యమ్మ ఇద్దరికీ అన్నం పెట్టింది. తిని పడుకొని లేసేసారికి టైమ్ ఆరైంది. లేచ్చ లేచ్చానే గాటివైపు సుసినా కోళ్ళకు గంపలు యెయ్యలేదు. మా యన్నగాడు ఇంట్లో వున్నాడు ఏమో అని సూసిన బ్యాట్ కూడా కనపడలేదు. మా యమ్మ బయట నుంచి తిడతావుంది ‘‘ఇనా కొడుకు కోళ్ళు మూయకుండా యాడికి పోయినాడో’’ అని సరే లే వాడుకూడా ఆడుకోవాలి గదా అనుకోని నేను లేసి కోళ్ళకు గంపలేచ్చుంటే మా యమ్మ అట్ట్నే నాకెళ్ళి సుచ్చాంది. ఎప్పుడు మా యమ్మ, అన్న ఇద్దరే కోళ్ళను మూసేది. నేను మా నాయన అటు దిక్కే పోము. మా యమ్మకు పొద్దునా, మధ్యానం జరిగిన యవ్వారం తెలియదు గదా. ఇప్పుడు కూడా కోళ్ళు మూయకుంటే అంతే ఇంగా వాడు నిజంగానే నాకు అస్సలు బ్యాట్ ఇయ్యడూ అనుకోని కోళ్ళకు గంపలేసి మొత్తం కోళ్ళను దిబ్బలోలుంచి, బండిదొడ్లలోనుంచి, కలంలోనుంచి తోలుకొని వచ్చేసరికి నా పానం పోయింది. ఒక్కసారి మా యమ్మ, అన్న మిందా జాలి యెసింది. మా ఇంట్లో వున్న అరవై కోళ్ళు రోజు ఎట్టా మూచ్చనారో, ఎంత కట్టపడ్తానారో అనిపించింది. నేను కోళ్ళను ఒల్పడం సూసి మా యమ్మ కూడా వచ్చి కోళ్ళను మూసింది. నేను లాస్ట్ మా నల్లకొడి దాని పిల్లలను మూసేసరికి మా యన్నగాడు బ్యాట్ తీసుకొని నన్ను సూస్తూ ఇంట్లోకి పోయినాడు. ‘‘బింగిసెవులు నా కొడకా కోళ్ళు మూయకుండా యాడికి పోయినావురా సదుకోరా అంటే సదువుకోవు గాని ఆటలు ఆణ్ణికిపొతావ్. ముందు ఆ బ్యాట్ యిరగొట్టి పొయ్యిలో పెడితే సరిపోతుంది’’ అనేసరికి ఒక్కసారి నా గుండె వేగంగా పరిగెత్తింది మా సునీల్ గాడు కొట్టే బాల్ లాగా. బ్యాట్ పోతే కష్టం. యెవ్వరు ఇవ్వరు నేను మా యమ్మ యెపే సూచ్చ నిలబడ్డ ఏం జరుగుతుందో అని. మా యన్నగాడు మాత్రం తాపీగా బ్యాట్ బీరువా సందున పెట్టి కాళ్ళు కూడా కడుకోకుండా మంచం ఎక్కి టీవి పెట్టినాడు. యెట్ట మా యమ్మ పొయ్యిలో పెట్టదు లే అనే దీమ వాడికి ఎందుకంటే మా నాయనకు తెలియకుండా లెక్క ఎగపెట్టి వాడికి బ్యాట్ కొనిపించింది మా యమ్మే గనక. అందరం అన్నం తిని మంచాలు బయట యేసుకొని పడుకున్నాం. మనుసు మొత్తం నాకు పొద్దున జరిగిన మ్యాచ్ మీదే వుంది. అన్నీ కలిపి ఐదు మ్యాచ్‌లు ఓడిపోయినాం. నాది యాభై రూపాయలు మా సునీలుగాడివి ఎనభై రూపాయలు లెక్క పోయింది. రేపు ఎట్టాయిన సరే అనిల్ గాడిని తీసేసి గోపాల్ గాడిని పెట్టి మ్యాచ్ ఆడి వాళ్ళ మిందా గెలిసి మా లెక్క మేము సంపాదించుకోవాలి అనుకుంటూ పడుకున్నా. రేపు కూడా సేన్లో కలుపువుందని తెలియదు నాకు. ఇంగా కలుపు తియ్యడం అయిపోలేదు సేన్లో. మా నాయన మళ్ళీ అరుచ్చానాడు ‘‘యాడవుండావ్రా బరుగోళ్లను ఇప్పుకొని పొదురా’’ అని. మా యన్న నా దగ్గరకు వచ్చి ‘‘పోరా ఇనపడలేదా, నాయన నేను పోతా అని సేప్పుపో’’ అంటానాడు. మరిసిపోయినవా నిన్న సెప్పినావ్. ఈ రోజు వంతు నీదే పో తొందరగా అని సెప్పిందే సెప్తానాడు. నాకు ఏడుపు వచ్చాంది. ‘‘నేను పోను’’ అని సెప్పిన నేను ఆణ్ణికి పోవాల నిన్న నాది లెక్క పోయింది. ‘‘నేను పోను నువ్వే పో’’ అని సెప్పినా మాయన్నగాడు ఇన్ల. వాడు మా యమ్మ కాల్చే రొట్టెలా పెన్నం లాగా మూతి నల్లగాపెట్టి గబ్బెగ్గిన నా సెతిలో వున్న బ్యాట్ గుంజుకున్నాడు. నాకు కోపం వచ్చింది. మా యన్న గాని మిందా కలబన్య. ఇద్దరం కలబడి కొట్టుకుంటూన్నాము. అన్నం తినే మా నాయన ఉరుకుతా వచ్చి మా ఇద్దరని ఇడదీసి మా యన్న గాడిని కొట్టినాడు. వాడు ఎడ్చానాడు. నన్ను కూడ యాడ కొడతాడో అని ముందుగానే గట్టిగా ఎడ్సడం మొద్దలుపెట్టినా. ‘‘.... అరగక సచ్చానారు’’ అని తిట్టి మా యన్నగాన్ని లేపి ‘‘బరుగోళ్లకు పో’’ అని దొబ్బినాడు. వాడు ఎడ్సుకుంటూ యెప్పుడు నేనేనా పోయేది ఆడు వున్నాడుగా ఆన్నీ పొమ్మని సెప్పు అని మా నాయన ముందు గట్టిగా అరిసినాడు. నా కొడకా మళ్ళా అరుచ్చానవా అని ములకట్టే తీసుకొని కాళ్ళమిందా కొట్టేసారికీ పాపం తట్టుకోలేక గట్టిగా ఏడుసుకుంటూ బయటకు ఉరికినాడు. ఈ నా కొడుకులకు ఈ రోజు అన్నం పెట్టినావు అంటే నీకు వుంటాది సెప్తనా సూడు అని మా యమ్మ మిందా అరిసి అన్నం కూడా తినకుండా బరుగోళ్లను ఇప్పుకొని పోయినాడు. మా యమ్మ నా యెపు సూసుకుంటూ గంప నెత్తిన పెట్టుకొని సేనుకి పోయింది. నేను అట్నే బీరువా దగ్గర కూలబడిపోయినా. రొంచేపు మా యన్నగాడు కుంటుకుంటా వచ్చి అన్నం పెట్టుకొని తింతనాడు. కాలు యెనక బాగం కొద్దిగా వాసింది. ఇద్దరం ఏం మాట్లాడుకోలా నేను అన్నం పెట్టుకొని తింటున్న. వాడు కాలు సూసుకుంటూ అట్ట్నే మంచం మిందా పడుకున్నాడు. నేను బయటకు యెల్లి మధ్యానం తిరిగి వచ్చేసారికి మా యమ్మ ఇంటికి వచ్చేసింది. ఎందుకో ఈ రోజు ముందుగానే వచ్చేసింది సేన్లో నుంచి. ‘‘ఇంగా మీ నాయిన రాలేదా?’’ అని అడిగింది నన్ను. ‘‘ఊహూ రాలేదు’’ అని సెప్పిన. మంచంలో పడుకొని వున్న మా యన్నగాని దగ్గరకు పోయి వాసిన కాలు సూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది మా యమ్మ ..... అంతలోనే మా నాయిన ఒక్కడు ఇంటికి వచ్చినాడు. మా యమ్మ ఎనక ముందు సూసి ‘‘బరుగోళ్ళు యేదే?’’ అని అడిగింది మా నాయనను. మా నాయన కోపంగా ‘‘ఆ గాడిదవోంక కాడ పడినాయిపో. పోయి తెచ్చుకో దూడపిల్ల కాలు ఇరిగింది. దానమ్మ ఒక్కసాట వుండదే యాసిరిక వొచ్చింది. కంకరరాయీ తీసుకొని విసిరిరెచ్చే దానికి కాలుకి తగిలి కిందపడింది. అట్ట్నే సిన్నగా తీసుకొని వచ్చిన పోయి తోలుకొని వచ్చుకపో’’ అని సెప్పగానే మా యమ్మ మా నాయిన యెపు సూసిన సూపు నాకు ఇంగా గుర్తుకుంది. సేనుకాడ నుంచి వచ్చి కాళ్ళుకూడా కడుకోకుండా ఉరుకుతా పోయింది బరుగోళ్ల కోసం. యెనిమిది నెలలా కిందట మా యమ్మ వాళ్ళ సెల్లెలు కాడ ఒక బరుగోడ్డును పట్టీచ్చింది. అంతకముందు మా ఇంట్లో బరుగోళ్ళు వుండేవి కావు. పాలకు ఇబ్బందిగా వుంది వుంటే మా పిన్ని మాకు ఊరికేనే పట్టీచ్చింది. ఆ బరుగొడ్డు పట్టుకొని రానికి నేను మా యన్ననే పోయింది. బాయోల్లా వెంకటేశ్వర్లతో ఎద్దులబండి కట్టించి నన్ను మా యన్నను పంపించిది మా యమ్మ. మా పిన్ని వాళ్ళ ఉరికానుంచి మా ఊరికి ఇరవై అయిదు కిలోమీటర్లు ఆ నుంచి బండికి వెనక ఆ నల్ల బరుగొడ్డును కట్టి నేను మా యన్న బండిమిందా కుచ్చోని తోలుకొని వచ్చినాం. ఆ బరుగొడ్డు మా ఇంట్లోకి వచ్చేసరికి దానికి ఎనిమిది నెలలు. మా ఇంట్లోనే ఈనింది. బరుగొడ్డు పట్టుకొని వచ్చినప్పుడు మా యమ్మ ఆనందం సూడాల ఇంగా, ఆ బరుగొడ్డు ఈనినప్పుడు అందులోను పై దూడను ఈనినప్పుడు మా యమ్మ సంతోషం అలివికాలేదు లే. దావన పోయే అందరకి సూపీచ్చంది. ఆ ఆనందం కొన్ని కోట్లు గుమ్మరించిన దొరికేదీకాదు. అది పెరిగి ఇంట్లో తిరుగతా వుంటే మా యమ్మ కళ్ళు ఇంత పెద్దవి సేసుకోని సూసేది. మా యమ్మ సిన్నగా దూడపిల్లను తల్లిని తోలుకొని వచ్చింది ఇంట్లోకి. మా యమ్మ కళ్ళలో ఆ రోజు రెండు సార్లు నీళ్ళు సూసిన దానికి అంతటా కారణం నేనే. నేను పొద్దున గమ్మునా పోయివుంటే ఇట్టవుండేది కాదు. ఇంట్లో సెంగు సెంగునా యెగురుతా వున్న దూడపిల్ల ఇప్పుడు మూలకు కూలబడిపోయింది. మా యమ్మను అన్నను దూడపిల్లను అలారొంచేపు సూసేసరికి నాకు నీళ్ళు తిరిగినాయీ కళ్ళలో. మా యమ్మ కాళ్ళ మిందా పడాలినిపించింది. మా నాయన పాత బట్టను నీళ్ళలో తడిపి పసుపు బాగా పట్టించి సిన్న సిన్న కర్రలతో దూడపిల్ల కాలుకు కట్టినాడు. మా నాయన సేతులు వణుకుతున్నాయి, ఎంత బాధపడినాడో కట్టేటప్పుడు. దూడపిల్ల రెండు రోజులకు గాను లేయలేదు. నేను మా యన్న కొన్ని రోజులు దాంక మాట్లాడలేదు. ఆ రోజు నుంచి మళ్ళీ యెండకాలం సెలువులు దాంక ఏ రోజు నేను మా యన్న బ్యాటు ముట్టలేదు, కలందిక్కు పోలేదు. దూడపిల్ల లేసి నడవడం మొదలు పెట్టింది కానీ దాని కాలు మాత్రం సొట్టపోయింది. దాని కాలు వైపు సూసిన పతిసారి నా మీద నాకు అసహ్యం యెసేది. అప్పట్నుంచి యే రోజు మా యన్న నన్ను బరుగోళ్లకు పోదాందా అని అడగలేదు. వాడు బరుగోళ్లకు పోయే పతిసారి నేను వాకిలి దగ్గర నిలబడి సూసేవాన్ని ఒక్కరోజు అయిన నన్ను పిలుచ్చాడేమో అని. - సురేంద్ర శీలం -
చందా అడగటమంటే భిక్షమడగటమే కదా!
ఇంతకు ముందు ఎన్నోమార్లు అతనిని నేను చూశాను కానీ ఆరోజు అతనిని చూసి కలవరపడిపోయాను. ఆశ్చర్యచకితుడినయ్యాను. అదనుగాని సమయంలో కాసిన పండునో, పూసిన పువ్వునో చూసినట్లు అనిపించింది. శ్రావణ భాద్రపద మాసాల్లో నిరంతరం వర్షం కురుస్తున్న ఈ చిత్తడి రోజుల్లో ఎక్కడినుంచి ఊడిపడ్డాడో, ఏమో? నేనే కాదు, అతన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. కొంతమందైతే అతని టేబుల్ వద్దకు వెళ్లి ఏమో అడుగుతున్నారు. దానికి అతను మామూలుగా క్లుప్తంగా జవాబిస్తున్నాడు. ‘ఫార్బిస్గంజ్లోని ఈ చిన్న టీకొట్టులో ఒక చెయ్యివిరిగిన కుర్చీలో కూర్చున్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యచకితులవడం నేను గమనిస్తున్నాను. ఎందుకో? నేను కారణాన్ని వెతుక్కుంటూ ఆలోచించసాగాను– దాదాపు ముప్పయి ఏళ్ల కిందట నేను మొట్టమొదటిగా ఈ వ్యక్తిని చూశాను– బహుశ అది 1929 సంవత్సరం కావచ్చు. అదే సంవత్సరం ప్రప్రథమంగా ‘గులాబ్బాగ్’ ఉత్సవంలో చాలా కిందుగా పోతున్న విమానాన్ని చూశాను. అందువల్లనే ఆ సంవత్సరం నాకిప్పటికీ గుర్తు. 1929 సంవత్సరం అంటే అప్పుడు నా వయసు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుంటుంది. ఆ సంవత్సరమే కలకత్తా నుంచి పేరు పొందిన నాటక కంపెనీ గులాబ్ బాగ్ ఉత్సవానికి వచ్చింది. ఎక్కడ చూసినా జనమే– ఇసుకవేస్తే రాలనంత జనం! రంగస్థలంపైనే రైలుబండి వస్తూ పోతూ ఉంది. ఇంజను పొగ వదులుతూ, విజిలేస్తూ నడుస్తుంది. రంగురంగుల కాంతుల్లో దేవకన్యలు నాట్యం చేశాయి... ఆహా! జీవితంలో మొట్టమొదటిసారి నాటకం చూసి ఎంత ఉత్తేజితుడినయ్యానో– ఈరోజు కూడా నాకు ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టుంటుంది. ఎంత అద్భుతం! ఎంత ఆశ్చర్యం! స్కూలు తెరిచిన తర్వాత నాతో పాటు చదువుకునే బకుల్ బెనర్జీ తన మాటలతో నన్ను కించపరచాడు. అతను కూడా ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు వాడు. కాని చాలా చలాకీగా ఉంటాడు. జన్మతః ‘ఆర్ట్ క్రిటిక్’గా ఉండేవాడు. అతనేమన్నాడంటే– ‘పోయిన సంవత్సరం నాగేశర్బాగ్ తిరనాళ్లకి వచ్చిన అసలైన నాటక కంపెనీ నుంచి వెళ్లగొట్టబడిన వాళ్లే ఈ నకిలీ కంపెనీలోకి వచ్చి చేరారు’ అని! నేను చిన్నబుచ్చుకోవడం చూసి బకుల్ మళ్లా అందుకున్నాడు– ‘‘అయినా, ఈ కంపెనీలో ప్రత్యేకత ఉందిలే! ఈ కంపెనీ నాటకంలో రైల్వే పోర్టరుగా నటించినవాడు నాగేశరబాగ్ తిరనాళ్లకి వచ్చిన కంపెనీలో కూడా ఇదే పాత్ర ధరించాడు. అంటే వెయిటింగ్ రూమ్‌లో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తాడు. ఇతన్ని నకిలీ అనలేము!’’ ఇప్పటికీ ఆనాటి మాటలు నాకు గుర్తున్నాయి– గులాల్‌బాగ్ తిరానళ, పంజాబ్ మెయిల్లోని రైల్వే పోర్టరు– హత్య– బకుల్ మాటలన్నీ. నాలుగైదు సంవత్సరాల తర్వాత ‘సింహేశ్వర్’ తిరనాళకి వచ్చిన ‘ఉమాకాంత్ ఝా’ కంపెనీలో మరలా ఈ వ్యక్తిని చూడగలిగాను. ‘బిల్వమంగళ’ నాటకంలో చింతాబాయి బృందంలో బోథియా బాబాగారి వేషంలో– ‘కాయాకా పింజరా డోలేరే, సాంస్కా పంఛీ బోలే’ (దేహపంజరంలో ఊగిసలాడే ఊపిరి పక్షి) అంటూ! చాలా మధురంగా పాడాడు. గులాల్‌బాగ్ తిరనాళలో ప్రదర్శించిన నాటకంలోని అమ్మాయిని హత్య చేసినవాడు, హంతకుని పాత్ర ధరించినవాడు, కాషాయ వస్త్రాలతో బాబాగా దర్శనమిచ్చాడు. కాని అతను తన మాటల సరళిని చాలాసేపు దాచుకోలేకపోయాడు– అతని మాటలను బట్టి నేను అతన్ని కనుక్కోగలిగాను. పారశీ నాటక కంపెనీలోని ఒక దృశ్యంలో కవిత్వం పాడుతున్నప్పుడు– మృదంగం ‘దిల్తై అంటుంటే అందెలు ఎవరికి ఎవరికి?’ అని మోగుతుండగా అప్పుడు వేశ్య నాట్యం చేస్తూ, ‘ఇతనికి ఇతనికి’ అంటూ ఉంటే అప్పుడు నిస్సందేహంగా అతనే ఇతనని తెలిసిపోయింది. ఈ బాబాగారిని గుర్తుపట్టాను. గులాల్‌బాగ్ తిరనాళ్లలోని కంపెనీ నాటకంలో, వెయిటింగ్ రూములో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తున్నప్పుడు తన చెయ్యి వణకటం చూసి పిచ్చివాని మాదిరి గొణిగాడు– ‘‘ఏమిటి నా చేతులిలా వణుకుతున్నాయి? ఈ చేతులు యజమాని ఆజ్ఞ ప్రకారమే పని చేయాలిగదా! వణకకే నా కత్తీ! సమయాన్ని వృథా చేయకు. ఎవర్ని చంపాలో వాడు దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు. నీ పని నువ్వు చేసెయ్యి’’ ఇంతలోనే డోలు గట్టిగా మోగింది. అందరూ ఉలిక్కిపడ్డారు. అంతా క్షణంలో అయిపోయింది. తర్వాత మూడోసారి ఆద్యాప్రసాద్ నాటక కంపెనీలో ‘శ్రీమతి మంజరి’ నాటకంలో ఇంగ్లిష్ జడ్జి వేషం ధరించి టేబులుపై సుత్తిని కొడుతూ ‘ఆర్డర్, ఆర్డర్!’ అంటూ వెల్, మంజరీబాయి మేము నీకు ‘శ్రీమతి మంజరి’ అని బిరుదు ఇస్తాము. ఈరోజు నుంచి నిన్ను శ్రీమతి మంజరి అని పిలుస్తాము. నేను పిలిస్తే అందరూ నిన్ను అలాగే పిలుస్తారు’ అంటాడు. ఈ దృశ్యం ముగిసిన కొద్ది క్షణాలకు అతడే ‘ఈ శరీర పంజరం ఊగిసలాడెలే’ అని పాత టోనులో పాడుకుంటూ స్టేజిపైన కనపడతాడు. అతన్ని గుర్తుపట్టడంలో నేనెక్కడా పొరబడలేదు. అన్నిచోట్లా అతన్ని పసిగట్టాను. టీ దుకాణంలో కుర్చీలో కూర్చొని ఉన్నాడు కాని, ఏదో ఎక్కడో ఆలోచిస్తూ అన్యమనస్కుడై చాలా దిగాలుగా కూర్చున్నాడు. ఆకాశంపైన మేఘపంక్తిని కన్నార్పకుండా చూస్తున్నాడు. అతను పోర్టరు వేషంలోని హంతకుడు– బాబాగారు– ఇంగ్లిష్ జడ్జి– ఉపదేశకుడు– పోలీసు సిపాయి– గజదొంగ– గుడ్డోడు– ఫకీరు వంటి వేషాలెన్నో ధరించిన ఏకైక వ్యక్తి! కొద్దిసేపటికి నా దృష్టి అతను తొడుక్కున్న బుష్‌షర్ట్‌పై పడింది. రంగు వెలిసిన బుష్షర్ట్ మట్టి కొట్టుకుపోయి ఉంది. తెగిపోయిన కొత్త డిజైను చెప్పులు. అతను ఉన్నట్టుండి టీ ఇచ్చేవానివైపు చూసి, ‘ఒక టీ ఇక్కడ’ గట్టిగా అరిచాడు. అతని అరుపు విని పోర్టరు వేషంలో ఉండే హంతకుడు, కంపరం కలిగించే గజదొంగ, పవర్ఫుల్ ఇంగ్లిష్ జడ్జి, ప్రశాంతచిత్తుడైన ఉపదేశకుడిగా నటించిన అతను ఇప్పుడు ముసలివాడయ్యాడని స్పష్టంగా తెలిసిపోతుంది. ఫార్బిస్గంజ్ తిరనాళ్లలోని నాటక కంపెనీకి చెందిన నటుల వెనుక నేను నడుస్తున్నాను. ఒక కిళ్లీ దుకాణం దగ్గర అందరూ నిలబడగా నేను వాళ్ల వెనుక నిలబడ్డాను. నటులు చాలామంది అక్కడ గుమిగూడి ఉన్నారు. లైలా–మజ్నూ, ఫర్హాద్, రాజు, గజదొంగ భార్య నుంచి రాజకుమారిని విడిపించిన రాకుమారుడు, అవసరం వచ్చినప్పుడు ఉరితీసే వాడి వేషం వేసేవాడు, వీరందరితో పాటు ‘ఈ శరీరపంజరము ఊగిసలాడెలే’ అని పాడేవాడు. నేను వాళ్ల వెనుక నడవడం చూసి ‘‘ఏమిరా! మా వెంట ఎందుకు పడుతున్నావు? జేబులు కొట్టాలని చూస్తున్నావా?’’ అని అతను నన్ను గద్దించాడు. ఆ చిన్న వయసులో కూడా అతని మాటలు నా ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టాయి. నాకు పౌరుషమొచ్చింది. ‘‘ఏ జేబులో ఏముందనీ, నీ జేబు కొట్టేయడానికి?’’ అని నేను అతన్ని ఎదిరించాను. అతను గాభరాపడి ‘‘నీకు ఎలా తెలుసురా, నా జేబు ఖాళీ అని’’ అన్నాడు. ఆ రోజుల్లో మాస్కూల్లో నేను ఫైనల్ క్లాసులో చదువుతూ ఉండేవాడిని. మా టీచరు ఆజ్ఞ మేరకు ప్రతి అపరిచితునితోనూ ఇంగ్లిష్‌లో మాట్లాడేవాడిని, కాని అతనికి నేను హిందీలోనే జవాబిచ్చాను– ‘‘నాకెందుకు తెలీదు. రాత్రి నువ్వు అడుక్కుంటున్నావు కదా, ‘బాబూ ధర్మం చేయండి’ అని’’ అంటూనే అందరూ బిగ్గరగా నవ్వి ‘‘ఫర్వాలేదే ఈ పిల్లోడు!’’ అన్నాడు. అప్పుడు నేను ఇంగ్లిష్‌లో మొదలుపెట్టాను– ‘‘యూ సీ మిస్టర్– రైల్వేపోర్టర్ యాక్టర్– డోంట్ సే మీ పిల్లోడు, ఐయామ్ మెట్రిక్ స్టూడెంట్ యూ నో?’’ ఎన్నో ఏళ్ల కిందటి ఈ సంఘటన గుర్తుకు రాగానే నాకు నవ్వొచ్చింది. ఇప్పుడు అతను ఏ కంపెనీలో పని చేస్తున్నాడో? ఇప్పుడు కూడా అప్పటి మాదిరే బ్రహ్మాండమైన డైలాగులు చెప్పగలడా? అదే మాదిరి వెయిటింగ్ రూములో నిద్రపోతున్న అబ్బాయిని కత్తితో పొడుస్తాడా? ముందుమాదిరే! ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. నేను తేరుకొనేలోగానే అతను టీ తాగేసి నా టేబులు వద్దకు వచ్చి నిలబడి ‘‘ఏం సేఠుగారూ! నన్ను మీరు గుర్తుపట్టారా?’’ అన్నాడు. ‘‘నేను సేఠ్‌ను కాను. మామూలు మనిషిని. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? నాటకాల సీజనుగాని ఈ రోజుల్లో ఈ ప్రాంతంలో మిమ్మల్ని చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ అతని చేతులు పట్టుకుని కూర్చోబెట్టాను. ‘‘బాబుగారూ! ఇప్పుడెక్కడున్నాయి కంపెనీలు? ఎక్కడున్నాయి ఆ నాటకాలు? సినిమా అన్నింటినీ మింగేసింది’’ అంటూ పెదవి విరిచాడతను. ‘‘మీరు ఇంతవరకు ఎన్ని కంపెనీల్లో పనిచేశారు?’’ ‘‘ఎన్ని కంపెనీలంటారా? పదిహేను కంపెనీలు’’ అతని వాలకం చూస్తే పాత సంగతులన్నీ దాచుకుంటూ ఉన్నట్లుంది. నిమిషం ఆగి శూన్యంలోకి చూస్తూ మళ్లీ ‘‘తొమ్మిదేళ్ల ప్రాయంలో తొలిసారి నాటకాల్లో ప్రవేశించాను బాలకృష్ణుని వేషంలో..’’ అని అన్నాడు. గడచిన కాలంలోని ఒక కాలఖండం నా ముందర నిలబడ్డట్లు నాకనిపించింది– పారశీ నాటక కంపెనీకి చెందిన శిథిలమైన ఒక నటుడు! సిగరెట్టు అతనికందిస్తూ, ‘‘అయితే ఇప్పుడేం చేస్తుంటావు?’’ అన్నాను. కొంతసేపు నన్ను చూస్తూ అతను ఊరుకున్నాడు. సిగరెట్టు వెలిగించుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఏముంది చెయ్యడానికి బాబుగారు? ఎవరో ఒక కవి అన్నాడు చూడు: ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’ అన్నట్లు నాటక కంపెనీలో పడి పాడైపోయాను. పదేళ్ల తర్వాత ఈ ప్రాంతానికొచ్చాను. ఈ ప్రాంతాన్ని ఏమో అంటారట– ఆ! మిథిలాప్రదేశ్! బాబుగారూ! ఇక్కడ నాటకాలంటే మోజున్న వాళ్లున్నారు కదా... నేను సినిమాల్లో కూడా నటించాను. కానీ అక్కడ మనసొప్పలేదు’’ ఈ మాటలు చెప్పి అటూ ఇటూ ఓరకన్నుతో పరికించి తిరిగి నావైపు దీనంగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు, ‘‘బాబుగారూ! ఎక్స్‌క్యూజ్‌మీ.. ఫర్ లాస్ట్ టూడేస్ అయామ్ హంగ్రీ, వెరీ హంగ్రీ! ఎవరినైనా అడగాలంటే ధైర్యం చాలడంలేదు.’’ అతని ఈ ఇంగ్లిష్ డైలాగు నాటకీయంగా లేదు. నేను మాట్లాడేలోపలే అతను నా ఆజ్ఞను శిరసావహిస్తున్నట్లు దీనంగా మొదలుపెట్టాడు– ‘‘మీ ఆజ్ఞ అయితే నా విద్యను మీ ముందు ప్రదర్శిస్తాను. ఇప్పుడు నా వద్ద మిగిలిందల్లా ఈ విద్య ఒక్కటే. అప్పుడప్పుడూ నాటకాలంటే అభిమానించే వాళ్లు కనబడతారు. నా డైలాగ్సు ప్రదర్శించి తృప్తిపడతాను. నాకు కొద్దో గొప్పో ఇస్తే..’’ అతను తన వాక్యాన్ని ముగించకుండానే ఒక మూల ఉంచిన తన సూట్‌కేసును పరుగున వెళ్లి తీసుకొచ్చాడు. ఒక నల్లని లుంగీ బయటకు తీసి ముఖానికి కప్పుకున్నాడు. లుంగీ ముసుగు తొలగించగానే కోరమీసాలతో ఒక విచిత్రవేషం కనిపించింది. ‘భగ్న ప్రేమికుడైన యువకుని డైలాగిది’ అని నెమ్మదిగా అంటూ గొంతు సవరించుకుని డైలాగు చెప్పసాగాడు: ‘‘నమ్మకద్రోహి! చపలా!! నీకిది తగునా? నీవు నా హృదయాన్ని వెయ్యి ముక్కలుగా చీల్చి చెండాడావు! నమ్మకద్రోహీ!! ఎంత అనర్థం చేశావే! చపలా.. చపలా నన్ను వదిలి వెళ్లిపోయావటే! నన్ను దిక్కులేనివానిగా చేసి వెళ్లిపోవుట తగునా..!!’’ తర్వాత వెక్కివెక్కి ఏడుస్తూ మరి కొన్ని డైలాగులు వల్లె వేశాడు. అతను చెప్పిన డైలాగ్సును నేనిక్కడ వెల్లడించలేను. టీకొట్టులో జనం మూగారు. నాలుగు వైపుల నుంచి అందరూ తొంగి తొంగి చూస్తున్నారు. అందరి ముఖాల్లో ఏదో కుతూహలం! కానీ అందరూ స్తబ్దులై తమాషా చూసేవాళ్లే. బయట మేఘాలు గర్జిస్తున్నాయి. మరల అతను లుంగీలో తన ముఖాన్ని కప్పుకున్నాడు. తను గ్రీన్రూములోకి ప్రవేశించినట్లు.. ఈసారి లుంగీని తొలగించుకుని పెద్ద గడ్డం, మీసాలు గల సర్దారు బయటికొచ్చాడు. లుంగీ కింద పడిన వెంటనే అతను గర్జించాడు. ‘‘ఏమిరా దుర్మార్గుడా! రాకుమారులెక్కడ? ఎక్కడున్నాడు ఆ నికృష్టుడు?’’ భావావేశంతో చెప్పిన ఈ డైలాగు వల్ల నోట్లో ఉన్న కట్టుడు పండ్ల సెట్టు విరిగి కింద పడింది. ఈ విధంగా అతను ఎన్నో వేషాలు వేశాడు. ఎన్నో డైలాగులు చెప్పాడు. ఆఖరులో తన టోపీని భిక్షాపాత్ర మాదిరి చాపి అందరి వద్దా ‘‘బాబూ! దానం చేయండి. అణా, బేడా, పైసా–పరకో దానం చేయండి బాబూ! మీకు పుణ్యం ఉంటుంది’’ అని అడుక్కున్నాడు. నాకు ఏదో లోకం నుంచి ఊడిపడ్డట్లనిపించింది. ఈ మనిషి తన కళానైపుణ్యంతో ఎన్నో సంవత్సరాల వెనక్కు నన్ను తీసుకువెళ్లాడు. నేను మళ్లీ వర్తమానానికి తిరిగి వచ్చాను. బకుల్ బెనర్జీ నావైపు తదేక దృష్టితో చూస్తున్నాడు. లోలోపల నవ్వుకుంటూనే. బకుల్ అతన్ని గద్దించి అడిగాడు– ‘‘ఏం యాక్టరు మహాశయా! నిన్న చాలా శ్రమపడి సంపాదించిన చందా పైసలేమయ్యాయి? అన్నీ రాత్రి ఏ బట్టీలో కాల్చేశావు. భలే గొప్పోడివే?’’ పుట్టుకతోనే ఆర్ట్క్రిటిక్గా పేరుపొందిన నా సహాధ్యాయి బకుల్ బెనర్జీ ఇప్పటికీ కళను, కళాకారులను గుర్తించే పని చేస్తున్నాడు. మొదటి నుంచి ఇంతే వీడు. ‘‘ఏమోయ్! నీవు కూడా వీడి మాటల్లో చిక్కుకున్నావా? ఇతను నిన్న నాతో కూడా ఫర్ టూ డేస్ అయామ్ హంగ్రీ అన్నాడు’’ బకుల్ నావైపు చూసి అన్నాడు. ఎందుకో బకుల్ మాట నాకు అప్పుడు నచ్చలేదు. వాణ్ణి అడ్డుకుని అతని చెవిలో ‘‘బకుల్! ఊగిసలాడే ఈతని శరీర పంజరంలో ఉన్న పక్షి ఏమంటుందో వినగలవా? అది విని నీకు ఏమనిపిస్తోందో నాకు స్పష్టంగా వివరించి చెప్పు’’ అని అన్నాను. బకుల్ నిశ్చేష్టుడయ్యాడు. నిమిషం సేపు ఊరుకుండి మళ్లీ ఇలా అన్నాడు. ‘‘ఏమీ అనిపించకపోతే నిన్నంతా అతని వెంట తిరిగి భిక్షాటన ఎందుకు చేశాను? చందా అడగటమంటే భిక్షమడగటమే కదా! ఒక నిట్టూర్పు వదిలి మళ్లీ ఏం చెప్పను? ఏమనిపించిందని? నీతో, నీలాంటి ఇతర స్నేహితులతో కలిసి హాస్టలు నుంచి తప్పించుకుని పారిపోయి రాత్రంతా నాటకం చూసినట్టు అనిపించింది’’ అన్నాడు. ‘‘నిజంగానే బకుల్ నాకూ అలాగే అనిపించింది’’ అన్నాను. ఇంతలో ఆ ముసలి నటుడు తనకిష్టమైన పాత పాటలోని మొదటి పంక్తులను ఆలపించడం ప్రారంభించాడు. ‘‘తెల్లవారగానే చుక్కలన్నీ మటుమాయమయ్యాయి– అయిన వాళ్లంతా నన్ను వదిలిపోయారు’’ అకస్మాత్తుగా మళ్లీ మా స్మృతిపథంలో తిరనాళ్ల సంబరం మెదలసాగింది. - హిందీ మూలం : ఫణీశ్వరనాథ్ రేణు - తెలుగు: పి.విజయరాఘవ రెడ్డి -
వేట మొదలైంది..
చీకటి. కాటుకలాంటి చీకటి. పిరికివాడి భయంలా చిక్కగా ఉండి. అడవిలో నిశ్శబ్దం చూసుకొని మరింత నల్లగా నవ్వుతోంది. ప్రమాద పరిస్థితిలో పసివాడి చిరునవ్వులా నింగిన చుక్కలు అమాయకంగా మెరుస్తున్నాయి. మొహం చెల్లక, కడుపులో ప్రమాదాలు దాచిపెట్టుకున్న చీకటి కూడా మిణుగురులతో ఇకిలిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు రూపు ధరించిన చీకట్లలా లీలగా కనబడి మాయమవుతున్నాయి. మంచు కురుస్తోంది. చలి కరుస్తోంది. గాలి సన్నగా, వాడిగా రంపపు కోతలా ఒరుసుకుపోతోంది. చెవుల మీద నుంచి చోటు దొరికిన చోటాల్లా గాఢంగా గుచ్చుకుంటోంది. ఆర్కెస్ట్రాలో అసందర్భపు క్లారినెట్‌లా ఎక్కడో నక్కలు అపశ్రుతిగా అరుస్తున్నాయి...భయం...భయంగా.... ఇలకోడి ఎగురుతాళంలో కూస్తోంది. భయసందేహాల వల్ల లయ లేకుండా పడుతున్న మా అడుగుల సవ్వడిని కాబోలు ఆగి ఆగి అలకిస్తోంది. మెయిన్‌రోడ్డు మీద నడిచిన అలవాటు వల్ల కాబోలు దారి నిండా ఇన్ని గతుకులేమిటని విసుక్కుంటున్నాయి పాదాలు. వెనక మేమున్నామన్న ధీమాతో బ్యాటరీలైటు కాంతికిరణం ఒకటి మా ముందు చెంగు చెంగున ఎగురుతూ పోతోంది. సాక్షాత్తు మృత్యువులాంటి పెద్దపులులు పచ్చటి ఎర్రటి కనుపాపలు పెద్దవి చేసుకొని ఊపిరి బిగబట్టి పొంచి ఉండే పొదలలోకి కూడా తొంగి చూసి వస్తోంది ఆ కిరణం. ఒక్క క్షణం ఆగాను. ఇంత చలిలోనూ కూడా చిరుచెమట పోసింది నొసట...అలసట చేత...భయం చేత కూడాను. రుమాలుతో మొహం తుడుచుకొని డబుల్ బారెల్ గన్ను ఆ భుజం నుంచి ఈ భుజానికి మార్చుకున్నాను. ఆటవిక నిశ్శబ్దం నన్ను చెవిటివాణ్ణి చేసింది. నా వెనక వస్తున్న నా మిత్రుడు పొడిదగ్గాడు. ఉలిక్కిపడ్డాను. ‘ఊ?’’ అన్నాను వెనక్కితిరక్కుండానే. ‘అబ్బే’ అన్నాడు అతడు. ‘చలా?’ ‘ఉహు’ ‘‘భయమెందుకోయ్’’ అన్నాను భయం అణుచుకుంటూ. అతను నవ్వాడు–ధైర్యం తెచ్చుకొంటూ (అతనికిదే తొలిసారి) నాది భయమా? భయమైతే నేనెందుకు షికారుకు వెళ్లాలి? ధైర్యముంటే అతనెందుకు భయపడాలి? మేము అడవిని చూసి భయపడితే అడవి మమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? అడవిలో పులులు ఎందుకు ముందుకురావు? చీకటి నిశ్శబ్దంలో, నిశ్శబ్దం చీకట్లో ఎందుకు దాక్కున్నాయి? కుట్ర చేస్తున్నట్లుగా ఎందుకు నిశ్శబ్దం? పొంచి ఉన్న ఈ ‘ప్రమాదాల’ మధ్య, మృత్యుపరికరాల మధ్య, అణగి ఉన్న ఈ ప్రకృతిశక్తి చైతన్యాల మధ్య రంగారావుకు చోటెంత? అణువంత. కాని అణువులోని శక్తి ఎంత? ఆ సంగతి తెలిసే ధైర్యముగా అడవిలోకి ఆరుమైళ్ళ దూరం వచ్చానా? ఏ ధైర్యం నన్ను ముందుకు నడిపించింది? స్వతహాగా పిరికివాణ్ని గదా...చేతిలో తుపాకి ఉన్నదన్న ధైర్యంతో కాబోలు. కాని ‘మృత్యువు’ గాండ్రుమని గర్జించి మీదికి లంఘించినప్పుడు ఎదిరించి కాల్చే సాహసమెంత? ఈ రంగారావులో భయమూ వుంది. సాహసం ఉంది. భయం కోరి తెచ్చుకున్నది. సాహసం ఆవహింపజేసుకున్నది. శత్రువు(?)ని కొట్టేవరకూ ‘ప్రమాదం’ ఎక్కడ పొంచి ఎట్నించి మీద పడుతుందోనని భయం. ఆ భయం–అప్పటి ఉత్కంఠ ఒక అద్భుతమైన అనుభూతి. అనిర్వచనీయమైన సుఖం. అదే వేటగాడి కష్టానికి తెగింపుకూ ప్రతిఫలం. ప్రాణం పణంగా ఒడ్డి గెల్చుకున్న మధురఫలం. అందుకోసమే, ఆ భయం కోసమే, సుఖం కోసమే షికారీ వేటకెళ్తాడేమో. ‘‘ప్రమాదం తన పచ్చటి ఎర్రటి కళ్ళతో అమేయమైన శక్తితో తన వేపు గురి చూసి ఉన్న తుపాకీకేసీ, ఆ వెనుక ఉన్న మనకేసి చూసి–గాండ్రుమంటూ అడవి జడుసుకేలా అరచి దూకినప్పుడు– తుపాకి ట్రిగ్గర్ నొక్కి, అందులో నుంచి గుండు బయల్దేరి ముందుకు వెళ్తున్నప్పుడు– పులిపంజా, తెరచిన నోరు, తొమ్మిది అడుగుల భారీ శరీరం, చిన్న తుపాకి గుండుకు ఎదురుగా వస్తున్నప్పుడు– ఆ పులికీ, ఈ బుల్లెట్కీ భేటి కుదరకపోతే? ఆ అరక్షణం తరువాత ఏమి జరుగుతుందీ అని అర క్షణంసేపు షికారీ నరాలను మెలిపెట్టి దహించివేసే విద్యుదాఘతంలాంటి ఆలోచన– అదే భయం– ఆదే సుఖం– ఆ క్షణమే స్వర్గం– ఆ క్షణమే భరింపరాని నరకం. అదే అంతవరకూ వేటగాడు ఎదురుచూచిన ముహుర్తం. సాధారణంగా వేటకు వెళ్తే మనం ఎక్కడో భద్రంగా కూర్చుని, పులి వచ్చే వరకూ కాసుకుని కొట్టేస్తాం. అది చూచినా దానికి అందని పద్దతిలో ఉంటాం. విశాఖజిల్లా మన్యపా్రంతాలలో అడ్డతీగెల, ఎర్రకుండి, మర్రిపాకల అడవులలోనే, తూర్పుగోదావరిలో జిడ్డంగి, కాకరపాడు దగ్గర మంప వగైరా ప్రాంతాలలోనూ నేను నా మిత్రులు అప్పుడప్పుడు వేటకు వెళ్తునే ఉంటాం. ఒకసారి అడ్డతీగలలో–పెద్ద వేటగాళ్లుతో పోల్చుకుంటే ఏమి అనుభవం లేని నాకు, అప్పటికి అనుభవం అనదగ్గ సంఘటన ఒకటి జరిగింది. భోజనాలు చేసి, జెర్కిన్లు బిగించి, స్వెట్టర్లు తొడిగి, మఫ్లరీలు చుట్టి ఒక జీపులో బయల్దేరాం నలుగురం. రాత్రి పదకొండున్నర అయింది. నేను ముందు సీట్లో కూర్చున్నాను తుపాకి దట్టించి. గతుకుల్లో జీప్ నెమ్మదిగా వెళ్తోంది. ఎదుట చీకటి. కాటికలాంటి చీకటి. అంతటా నిశ్శబ్దం. మధ్య మధ్య అపశ్రుతిగా ఎక్కడో నక్కలు అరుస్తున్నాయి. ఇలకోడి ఎదురు తాళంలో కూస్తోంది. జీపు కారు శబ్దాన్నీ ఇవీ మిగతా నిశ్శబ్దమూ కలిసి మింగేశాయి కాబోలు, వినబడటమే లేదు. అంతలో నా మిత్రుడు జీపుకు బ్రేక్ వేశాడు. ‘ష్’ అన్నాడు నిష్కారణంగా. ఎదర 15 గజాల దూరాన చోటు తెరిపిగా ఉంది. జీపు హెడ్లైట్ల కిరణాలు నీరసించి మసకమారిపోతున్న చోట లీలగా జంతువు కదలిక కనిపించింది. నేను ఆలోచించే స్థితిలో లేను. కొత్త ఉత్సాహం. గబుక్కున తుపాకి గురి చేసి ట్రిగ్గర్ నొక్కాను. అడవీ, నిశ్శబ్దమూ, నా గుండే, పొదల్లో కుందేళ్ళూ, చెట్ల మీద పక్షులు దడదడలాడిపోయాయి తుపాకి మోతకి. ఒక్క క్షణం నిశ్శబ్దం. అంతలో గర్జనలతో అరణ్యం మళ్ళీ మారుమోగింది. నేను గబుక్కున జీపులోంచి కిందకు దూకాను. క్లియరింగ్ వేపు బయల్దేరాను. నా మిత్రులు గట్టిగా వారించారు. వెనుక్కులాగారు, విదిలించుకుపోయాను. నిజానికి అది చాలా మూర్ఖమైన పని...అని ఇప్పుడు తెలుసు. ఆచూకీ తెలియకుండా పొంచి ఉన్నప్పుడు అలా దిగిఅటు వేపు పోకూడదు. నేను మొండిధైర్యంతో–బహుశా అది అజ్ఞానం వల్ల నిలబడ్డ ధైర్యంతో అనుకొంటాను–అలా ముందుకు పోతున్నాను. వెనకాల జీపు వస్తోంది నెమ్మదిగా పది అడుగుల తరువాత ఆగిపోయినట్టుంది. నేను వెనక్కి చూడలేదు. తుపాకిని పొజిషన్లో పట్టుకొని దాని మీద క్లాంప్ వేసిన లైట్‌ను వెలిగించి సర్వేంద్రియాలకూ హెచ్చరిక చెప్పి జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇంకా ముందు వెళ్లాను. నేల మీద ఒకచోట నల్లటి డాగు కనబడింది. పెద్ద డాగు. ఆగి పరీక్షగా చూశాను. రక్తం. అంత భయంలోనూ గర్వం. గురి తప్పక కొట్టగలిగానని. ఆనందంతో గర్వంతో వెనక్కు చూశాను. అంతలోనే నేను ఉన్న స్థితి గుర్తుకు వచ్చింది. చిరుతపులి నాకు కుడివైపు నుండి ఎడమవైపుకు పోతూ ఉండగా కొట్టాను. బహుశా దెబ్బతిని ఎదర ఉన్న పొదలలోకి దూకి ఉంటుంది. ఎక్కడా అలికిడి లేదు. ఆయాసంగా ఊపిరి తీస్తున్న సవ్వడి కూడా లేదు–నాది తప్పు. క్లాంప్లాంప్ను పొదల మీదకు ప్రసరించి నెమ్మదిగా జరుపుతూ పరిశీలిస్తున్నాను. అంతలో హఠాత్తుగా నా కుడి వైపు దగ్గరగా బాటరీలైటు కిరణం పడింది. పరాకుగా ఉన్న వాడి పక్కన బాంబు పేలినట్లయింది. చిక్కటి చీకటిలో ఆ వెలుగు కిరణం అలా పగలడంతో గుండె ఝల్లుమంది. కదలకుండానే ఎటూ తిరక్కుండానే పక్కకు వాల్చి ఆ కిరణం కేసి చూశాను. అది నా పాదాల దగ్గర నుండి కుడివేపుకు వెళ్ళి మళ్లీ వెనక్కువచ్చి మళ్ళీ కుడివైపుకు వెళ్తోంది. నాకేదో చెప్పాలని నానా హైరానా పడుతూ–నా వెనక జీపులోంచి నా మిత్రుడు వేస్తున్న లైటు అని తెలుసు. గట్టిగా అరవవచ్చుననీ తెలుసు. అరవడానికి కంఠం పెగల్లేదు. ఒకడు అలా గాయపడ్డ జంతువును వెదుకుతూ ఉండగా వెనకనించి మరొకడు అలా లైటు వెయ్యకూడదు. అలా చేస్తే పొంచి ఉన్న జంతువుకు ఇతను స్పష్టంగా కనబడి పోతాడు. అది ప్రమాదమని నా మిత్రులకు నా కన్న బాగా తెలుసు. గత్యంతరం లేకనే ఈ పని చేస్తూ ఉండి ఉండాలి. నేను నిలబడ్డ చోటు వైశాల్యం పది చదరపు గజాల లోపు. శాంతి కిరణాన్ని అనుసరిద్దామని ఆ వెంటే వెనక్కి తిరిగి, నా తుపాకీ మీద బాటరీ లైటు పొదలవైపు వేసి చూశాను. అంతే, ఇప్పుడంతా అర్థమైంది. ఆలోపలే గుండె ఝల్లుమంది. క్షణంలో ఒళ్ళు కొయ్యబారి పోయింది. ఒక్కసారిగా నిడివడింది. అంత చలిలోనూ ముచ్చెమటలు పోసేశాయి. నా ఎదురుగుండా 20 అడుగుల దూరంలో పొద పక్కన కూర్చుని ఉంది–దెబ్బ తిన్న చిరుపుతి. దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు కూర్చుంది. నాకేమీ తోచలేదు. ఆలోచనకు అవకాశమే లేదు. నన్నెవరూ ఆ క్షణంలో ఆదుకోలేరు. కాపాడలేరు. ఆ క్షణంలోనే ఒళ్లు తెలియకుండా ఆలోచన లేకుండా బాటరీ దాని మొహం మీద వేశాను. ఆ కాంతికి చిరుతపులి ఒక్క మాటు కళ్లు ముడుచుకున్నది. కళ్లు చీకట్లు కమ్మి ఉండాలి. అది కళ్ళు తెరిచి తమాయించుకుంటే తరువాత ఆ దెబ్బతిన్న పులిని అడ్డేవాడుండడు. నా దగ్గర తుపాకిలో ఇంక ఒక్కటే గుండు ఉన్నదన్న ఊహ కూడా స్ఫురించింది. అయితే ఒకటే ధైర్యం. గుండు గురి తప్పి, అది మీదకు ఉరికినా ఒక్క ఆశ ఉంది. అంది పెద్దపులి కాదు. చిరుతపులి కాబట్టి కలియబడవచ్చు. అప్పుడు జయపజయాలు–ఏమో. ఒక పక్క చెమటలు పోస్తున్నాయి. మరోపక్క ఒళ్ళు గజగజ వణికిపోతుంది. తెగించి, గురి పెట్టి కాల్చారు. తుపాకి శబ్దానికి అడవి మారుమోగింది...కాని దానికి ప్రతిధ్వనిగా గర్జన రాలేదు. మూలుగులాటిది వినబడింది. పులి నా మీద కురక లేదు. పొద అదిరిపోలేదు. ఇక ఫరవాలేదు అది దెబ్బతింది అనుకున్నాను. గబగబ పెద్దపెద్ద అంగలు వేస్తూ జీపు వేపు నడిచిపోయాను. నా మిత్రులు ముగ్గురూ ఆమాంతం ఎదురువచ్చి కౌగిలించుకున్నారు. కారులో కూర్చోబెట్టి మొహం తుడిచారు. కాంగ్రాచ్యులేషన్స్ కురిపించారు. ఫ్లాస్కులోంచి వెచ్చటి టీ తీసి ఇచ్చారు. అది తాగి సిగరెట్ ముట్టించాను. కసితీరా రెండు పీల్పులు పీల్చాక ప్రాణం కుదుటపడింది. ఎవరితోను మాట్లాడ బుద్ధి కావటం లేదు. చెప్పరానంత ఆనందగా గర్వంగా హాయిగా వుంది, కన్నులరమూసి కూర్చున్నాను. పావుగంట తరువాత, వాళ్ళతో వెళ్లి నేను చంపిన చిరుతపులిని సాయం పట్టి జీపు బాలెట్ పడేశాను. తృప్తిగా కూర్చున్నాను. జీపు అడ్డతీగెల గ్రామం వేపు సాగిపోతుంది నెమ్మదిగా, మిత్రులు, నేనెంత మూర్ఖపుపని చేయబోయానో, ఎంతటి గండం తప్పిందో చెబుతున్నారు. క్రమంగా అవన్నీ వినబడడం మానేశాయి. వాళ్ళ సంతోషం పంచుకోలేకపోతున్నాను. నేను సాధించిన విజయం ఏమిటి? పగ సాధించానన్న ఈ తృప్తి ఎందుకు కలగాలి? పగ ఎందుకు వచ్చింది? పులికి నా మీద కోపం ఉన్నట్లు ఎవరూ చెప్పలేదు. నాకు దాంతో పరిచయం లేదు. పనిమల్లె నేను ఇక్కడికి దాని రాజ్యంలోకి ప్రవేశించాను. నేనే శత్రువుని. దాని దారిన అది పోతూ ఉంటే, హెచ్చరించకుండా దెబ్బ కొట్టాను. నాకన్న అది బలమైనదని తెలుసు. ధైర్యం ఎక్కువని తెలుసు. నాకు అదంటే భయమని తెలుసు. మరొక్కటి తెలుసు. అది జంతువని దానికి బుద్దిబలం లేదనీ, వంచనా శిల్పం బాగా తెలీదనీ, నేను నాగరిక మానవుడిననీ, దానికి లేని బుద్ధిబలం నాకు ఉండదనీ పైగా వంచనా శిల్పం, ఆయుధసంపద నా అధీనంలో ఉన్నాయనీను. అదే, పంజా ఎత్తిన పులికాక. తుపాకి పట్టిన మరో మనిషి లాగే ఆ పొదలో నిలిచి ఉంటే? నేనూ అతడూ సమానస్థాయిలో ఉందుము. అపుడు ఎవరేమయ్యేవారో! నేను నిరాయుధుడనై వెళ్తే పులి నన్ను బలి చేస్తుందని ఊహించి. నాకన్న అది బలశాలి అని గుర్తించి, దానికి తెలీకుండా, అది నాతో సవాలు చేసినట్టు అనుకుని, ప్రతీకారం కోసం అయినట్టు పనిమల్లె వెళ్ళి చంపాను. కాని ఇది ప్రతీకారమా, నాలో అహంకారానికి ఉపశమనమా? ఏమో. తెలీదు...తెలుసుకోవడం ఇష్టం ఉండదు. అది తెలుసుకుంటే, నేను చాలా ధైర్యశాలిని అని వెన్ను చరుచుకోవడానికి అవకాశం ఉండదనా? ఏమో... ‘‘వాట్ రంగారావ్...ఏమిటలా ఉన్నావు?’’ అంటున్నారెవరో. ‘‘కొత్తగదయ్యా...పోను పోను అతనే సర్దుకుంటాడు’’ అంటున్నారింకెవరో. జీపు ఊరివేపు, నాగరికత వేపు, సంస్కారం వేపు ముందుకు సాగిపోతుంది. - ఎస్వీ రంగారావు -
బీసెంట్ రోడ్డు
పొద్దున్నంతా లోపలనే ఉంది. కాసేపు ఏడ్చింది. కాసేపు ఫోన్లో ఒకరిద్దరు ఫ్రెండ్స్‌తో మాట్టాడింది! ఇంకెవరైనా ఉంటే బాగుండు, చాలా దగ్గరగా, తన బాధ అర్ధం చేసుకునే, తన వయసుకితగ్గ తోడు. మొహం ఉబ్బిపోయింది. కోపం వస్తోంది. దుఃఖం తగ్గడం లేదు. ఏం చెయ్యాలి? సాయంత్రం నాలుగు దాటింది. మెల్లగా లేచి రెండు బక్కెట్ల నిండా నీళ్ళు పట్టుకుని గబా గబా తలస్నానం చేసింది. పైనించి కిందికి దిగి నేలమీదకి జారి పోయే నీళ్ళలో తన బాధకూడా కరిగిపోవచ్చుకదా. ఫ్యాన్ కింద నిలబడి తల ఆర పెట్టుకుంది. ఆ మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి. ఫాన్ గాలికి నీళ్ళు ఆవిరి అయినట్టు, నచ్చని విషయాలు ఆరిపోతే ఎంత హాయో కదా. ఛీ. ఖర్మ. ఆ కాసేపు చెవులు పూడుకు పోగూడదా. పోనీ, కనీసం చెవులు మూసుకునే అవకాశం అయినా ఉండొచ్చు కదా. చెవులు మూసుకోవడం కాదు, చెత్తమత్తంగా కొట్టగలిగితే, కనీసం తిరిగి చెడా మడా తిట్టేస్తే అప్పుడు ఎంత బావుంటుందో. తిట్లు అంటే ఇంగ్లిష్ తిట్లు, నాజూకు తిట్లు కాదు. అచ్చ తెలుగు తిట్లు తిట్టేయాలి వాడిని. అప్పుడుగానీ కోపం శాంతించదు. అమావాస్య మర్నాడు వచ్చే సన్నని చందమామలా చిన్న నవ్వు విచ్చుకుంది. ప్చ్. కుదరదు. చేసే ఉద్యోగం వినడం, జవాబు చెప్పడం. అంతవరకే. ఏం మాట్లాడిన వినాలి. విసుక్కోకుండా, వినయంగా జవాబు చెప్పాలి. నిన్న వాడు వాగిన వాగుడికి లైన్ కట్ చేసి భోరుమని ఏడ్చేసింది. అందరూ ఓదార్చారు. అంతకన్నా వాళ్ళు చేయగలిగేదీ ఏమీ ఉండదు. ‘అలా సెన్సిటివ్ గా ఉండకూడదు శాంతీ. బోల్డ్ గా ఉండాలి. ఇదికాదు, ఇంకో చోటికి, ఇంకో పనికి వెళ్ళావనుకో, అక్కడా ఎదురు అవుతారు ఇలాంటి ఎదవలు’ పై అధికారి చెప్పే మాటల్లో, శాంతిలో ధైర్యం నింపే ఆలోచనకన్నా, ఆ పిల్ల ఎక్కడ ఉన్నపళాన ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతుందో అని భయం ఎక్కువ. సినిమా స్టార్ కావాలంటే అర్హతలు ఏమిటో తెలుసా? నున్నటి తోలు, చురుకైన కళ్ళు, సన్నటి ముక్కు, కొద్దిగా డాన్స్, ముద్దు ముద్దు మాటలు....ఇలాకొన్ని. చాలు. అవి మాత్రం చాలు. అసలు ఏమీ లేక పోయినా, గ్రాఫిక్స్ తో ఇవాళ లేని కళలు ఉన్నట్లు, ఉన్న అవకరాలు లేనట్టు చూబెట్టవచ్చునంట. కానీ, కాల్ సెంటర్ లో పని చెయ్యాలంటే ఆ మనిషికి ఏ లక్షణాలు ఉండాలో తెలుసా? చాలా గొప్ప ఓర్పు కావాలి. మానవ మాత్రుడికి సాధ్యం కాని, లేని అనంతమైన ఓర్పు. ఏ పురాణంలోనూ, ఇతిహాసం లోనూ ఏ పాత్రకూ కనబడని సహనం కావాలి. పైగా దానిని కృత్రిమంగా నటించి చూపడం కుదరదు. స్వంతంగా ఉండాల్సిందే. ఎక్కువమంది కోరుకోని, ఎక్కువరోజులు నిలబడలేని ఈ ఉద్యోగానికి అర్హతలు అతి కష్టమైనవి. ఫోన్ కాల్ అందుకుని జవాబులు చెప్పినందుకే పదిహేను వేలు ఇస్తారా అనుకుంది చేరక ముందు. కానీ, తొందరగానే తెలిసొచ్చింది, శాంతి తన మనఃశాంతిని అతి చవక రేటుకి తాకట్టు పెట్టిందని. శాంతి పేరు డిగ్రీ కాలేజీలో రెండవ సంవత్సరంలో హాజరు పట్టీలో ఉంది. కానీ, ఎప్పుడోకానీ తను హాజరు పలకదు. చాలా అవసరం, ఏదైనా అసైన్మెంట్ ఇవ్వాలి, ఫీజు కట్టాలి లేదా ఎవరినైనా కలవాలి అంటే పనికి శెలవు పెట్టి కాలేజీకి వెళుతుంది. గవర్నమెంటు కాలేజీల్లో నూటికి అరవై మంది పిల్లల దిగువ మధ్య తరగతి వాళ్ళు. బైట తప్పని సరిగా ఏదో ఒక పని చేసుకోకపోతే గడవని వాళ్ళు. అందుకే వాళ్ళ రోజువారీ హాజరుని అదే పనిగా పట్టించుకుని ఎవరూ ఇబ్బంది పెట్టరు. ‘బైటికి వెళుతున్నాను అక్కా. షాపింగ్‌కి’ పేయింగ్ గెస్ట్ హౌస్ ఓనరమ్మతో చెప్పింది. ఆవిడ సరే అని గానీ వద్దు అని గానీ అనకుండా ఒక రకమైన మొహం పెట్టింది. ఎప్పుడైనా అంతే. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళినా, హౌస్‌కి రావడంలో ఒక పదినిమిషాలు లేటు చేసినా, ఆదివారం షాపింగ్‌కి వెళ్ళినా, గురువారం గుడికి వెళ్ళినా, నోటితో ఏమీ అనదు కానీ ఒక లాగా చూస్తుంది. ‘హౌస్‌లో అందరి కన్యత్వానికీ, ప్రవర్తనకీ తనని తను కేర్ టేకర్ గా అనుకుంటది గావున లోపల’ శాంతికి అనుమానం. ఆ చూపు వెంటాడుతుంది. సందేహిస్తుంది. చాలా అవమానిస్తుంది. కానీ శాంతి ఈ హౌస్ వదిలి పోలేదు. కాలేజీకీ, ఆఫీస్ కీ బాగా దగ్గర. ఉన్నంతలో తక్కువ రేటు. శాంతి రంగు చామన ఛాయకి తక్కువే. ఐదడుగులకి కిందనే ఎత్తు. బహుశా కురచ మనిషి అనొచ్చు. ముక్కు మాత్రం ఉండవలసిన దానికన్నా కాస్త పొడవు. కింది పెదవి ముందుకు వచ్చి ఉంటుంది. పొట్టి గిరజాల జుట్టు. కోల ముఖం. ఫెయిర్ అండ్ లవ్లీ లెక్కలప్రకారం పెద్ద అందగత్తె కాదు. ఆయా లెక్కా పత్రాల జోలి లేకుండా మాట్టాడితే, కురూపి కూడా కాదు. సరైన తూకంలో చెప్పాలంటే, శాంతి ఒక వయసులో ఉన్న పిల్ల. కష్టపడి పని చేసుకునే పిల్ల. బ్యాక్ లాగ్స్ లేకుండా జాగ్రత్త పడే పిల్ల. ఎంతవరకో అంతవరకే సావాసాల జోలికి వెళ్ళే పిల్ల. లోపల్లోపల ఏవో ఆశలు ఉన్నాయి. అవి ఉన్నాయని, ఉండొచ్చనీ గమనించి, ఆలోచించే తీరికే లేని పిల్ల. మన జనాల జనాభా గణనలో కొత్త కొత్త మార్పులు చేర్చి మనుషుల స్వభావం, సమాజం, అంచనాలు అనే కాలమ్ ఒకటి చేర్చి రాస్తే, దాని పరంగా, శాంతి ప్రస్తుతానికి ఒక మంచి పిల్ల. మొహానికి పల్చగా పౌడెర్ రాసింది. ఎరుపు రంగు టాప్. నీలం రంగు లెగ్గింగ్. టాప్ కి కాలర్, కాలర్కి చిన్న చిన్న పూల పూల డిజైన్ ఉంది. జుట్టు పిన్నులు పెట్టి, బాండ్ తో పోనీకట్టింది. ఎత్తు మడమల చెప్పులు వేసుకుంది. రోడ్ మీదికి వచ్చి షేర్ ఆటో కోసం చూసింది. నిన్న జీతం వచ్చింది. ఇవాళ శెలవు పెట్టింది. శలవకు కారణం అనే కాలమ్ దగ్గర ‘అనారోగ్యం’ అని రాసింది. ‘ఏమైంది?’ అని ఒకరిద్దరు అడిగారు. నీరసంగా నవ్వింది. జ్వరం కాదు. జలుబు కూడా లేదు. ఒక సాఫ్ట్వేర్ కనిబెట్టాలి. మాటలు వడబోసే సాఫ్ట్వేర్. నచ్చని మాటలు చెవి తమ్మె దగ్గరే ఫిల్టర్ అయిపోవాలి. తప్పుగా ఎవరైనా మాట్లాడితే, వెంటనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ బ్లాక్ అయిపోవాలి. వాళ్ళు సరిగా మాట్లాడేదాకా, ఏ కంపెనీ కూడా వాళ్లకి ఫోన్ సౌకర్యం కలిగించకూడదు. శాంతికి నవ్వొచ్చింది. అసలు జరగని విషయాల గురించి తను ఆలోచిస్తోంది. అంతకన్నా ఉద్యోగం వదిలేసి, వేరే పని వెతుక్కోవడం సులభం కదా. ప్రస్తుతానికి ఆ ఉద్యోగంలోనే ఉంది కాబట్టి, వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేసి, చివరికి తప్పదని ఇచ్చిన ఈ ‘ఒకరోజు’ శెలవుతోనే తను తెప్పరిల్లాలి. పై వారికి తెలుసు. కానీ వాళ్ళు కూడా ఏమీ చెయ్యలేరు. శాంతి లాగానే, బతకడానికి ఉన్న అనేక మార్గాల్లో వాళ్లకి ఇప్పటికి వీలైనది ఇదే. షేర్ ఆటో ఎందుకు? ఇలాంటప్పుడు కాబ్ ఎక్కాలి. బుక్ చేసింది. ఫోన్ చూసుకుంటూ సెంటర్ లో నిలబడింది. ఇదిగో కాబ్ వచ్చేసింది అని ఫోన్ చూబిస్తోంది. కానీ రాలేదు. ‘నేను. బుక్ చేసి ఇక్కడే నిలబడి ఉన్నాను. ఐదు నిమిషాలు అన్నారు. ఇంకా రాలేదు’ మెల్లగానే అంది. ‘ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టలేరు. ఇంత లోకి ఫోన్ చేసేస్తారు. పికప్ చేసుకోవడానికే కదా వచ్చేది. ట్రాఫిక్ అడ్డం వస్తే ఆగుతాం. వస్తాం కదా’ ఆటో డ్రైవర్ తన ఇంట్లో పెళ్ళాన్ని కసిరినట్లు కసురుతున్నాడు! ‘ఔను. చెప్పిన టైం కి రాలేదుకాబట్టి ఫోన్ చేశాను. నీతో కబుర్లు చెప్పడానికో, పనీ పాట లేకనో ఫోన్ చేస్తానా? ఏదంటే అది మాట్లాడుతున్నావేంటి?’గట్టిగా బదులు చెప్పింది. చాలా గట్టిగా. ఆటో అతను తగ్గాడు. శభాష్. ఇంతే ఇలానే చెప్పాలి ఎవరికైనా. శాంతి మాట్లాడితే నోరెత్తాలంటే ఎదటివాడు భయపడిపోవాలి! కానీ మళ్ళీ అదే ఆటో ఎక్కింది. కాన్సిల్ చేస్తే, డబ్బులు కట్ చేస్తాడు. అటో దిగినాక వీడి మీద నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రాసేస్తాను. తిక్క కుదిరిపోతుంది. ఆటోదిగిన తరవాత ఎడమ చేతివైపు సందులోకి తిరిగింది. అదొక లోకం. మహా వైభవం. ఒకప్పుడు ఇంకా ఉండేది. విదేశీ వ్యాపారాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రాకముందు ఏకచత్రాధిపత్యం ఏలిన రాజసపు ఛాయలు పూర్తిగా వెలిసిపోలేదు. రోడ్డుకి రెండుపక్కలా షాపులు. గోల్డు కవరింగ్ నగలు, వాచీలు, బట్టలు, తినుబండారాలు, చెప్పులు, కాఫీపొడి, టీపొడి, పచారీ సామాను, బేకరీలు, స్వీట్ మాజిక్, కాస్త పక్క సందులోకి వెళితే హాట్ డ్రింక్స్.........ఇంకా ఏవేవో. రోడ్డుకి మధ్యలో బారుగా సైకిళ్ళు మోటారు సైకిళ్ళు సెంట్రల్ పార్కింగ్ చేసి ఉన్నాయి. వాటిని ఆనుకుని, ఏఏ వస్తువులు పెద్ద పెద్ద షాపుల్లో పెద్ద పెద్ద రేట్లకి అమ్ముతారో, అవే వస్తువులు చిన్న చిన్న బళ్లమీద చిన్న చిన్న రేట్లకి అమ్ముతున్నారు. శాంతి పెద్ద బోర్డుల వంక చూడలేదు. చిన్న తోపుడు బండ్లసమీపానికి కూడా వెళ్ళలేదు. మధ్యలో నిలబడింది. అందర్నీ చూస్తోంది. ఎందుకు అలా నిలబడింది? ఏమిటి చూస్తోంది. ఏమిటి చూస్తోందో! ప్రతి మనిషి మనసులో ఏవుందో మనం అన్నీ తెలుసుకోగలమా? ఆ లోకాన్ని చూస్తోంది. ఏదో వెతుకుతోంది. ‘వెదకుడి దొరకును’. బైబిల్ వాక్యం గుర్తు చేసుకంది. నీకేం కావాలి? అక్కడ దొరకనిది ఉండదు. కానీ, ఆ దోవన వచ్చిపోతున్న జన సముదాయం కేవలం వస్తువులకోసమే వచ్చినట్టు కనబడటం లేదు! ఎత్తు కోణాకారం వెదురు గంపలో తీరిగ్గా సర్ది పెట్టిన మరమరాలూ మసాలాలూ చిన్న బట్టల షాపులో వెదజల్లి ఉన్నాయి. బక్క పలచటి ఆడ మనిషి కోపంగా ఊగిపోతోంది. ‘ఇస్తాను కదా. నెమ్మదిగా అడిగి తీసుకో. అరవడం ఎందుకు? ఇలా వెదజల్లడం ఎందుకు? ఇప్పుడు నష్టం ఎవరికి? నాకా? నీకా?’ షాప్ లో నేల పడిన వాటిని చిమ్మేస్తూ అతను కేకలు పెడుతున్నాడు. బైట నిలబడిన మరమరాల గంపగలామె ఏదేదో తిడుతోంది. ఆమె ఎందుకు కోపంగా ఉంది? అతను ఏమని ఉంటాడు? డబ్బులు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పించాడా? లేక ఏదైనా అనకూడనిది మాట్టాడాడా? ఆమెకు కోపం తెప్పించాడా? వాడు ఏమైనా అననీ అనకపోనీ. ఆమెకి కోపం వచ్చింది. కోపం చూపాలనుకుంది. చూబెడుతోంది. ఎంత అదృష్టమో కదా. శాంతి ఆమె వంక ముచ్చటగా చూసింది. తల నుంచి పాదాల దాకా ఏ సింగారానికైనా వస్తువులు దొరికే ఒక చిన్న బండి. అది అతనిది. అతనెవరు? ఎవరో. శాంతికి లాగానే, ఎర్ర చొక్కా, నీలం ఫాంటు వేసుకొని ఉన్నాడు. బట్టల రంగు ఒకటే గానీ, మెటీరియల్ వేరు. కుట్టిన విధానం కూడా వేరు. చుట్టూ ఐదారుగురు ఆడపిల్లలు చేరారు. చమ్కీ గాజులు, బొట్టు బిళ్ళలు, రంగు రంగుల గోళ్ళ రంగులు చూస్తున్నారు. ఏ వస్తువైనా ఇరవై రూపాయలు. ‘పది రూపాయలకి ఇస్తావా? ‘రాదు’ ‘ఓ ముద్దు కూడా ఇస్తాను’ ఒకపిల్ల దూకుడుగా ఉంది. భయం లేదా? లేదా ఇక్కడ దేనికీ భయపడనక్కరలేదా? ఏదైనా అనేసేయోచ్చా? నిజానికి అతను ముద్దు వచ్చేంతవాడు కాదు. కానీ, అవసరానికి అందంతో పని లేదు. ఆ పిల్ల ఎంత లోటుపడిఉందో. వినీ విననట్టు వేరే వైపు సర్దుకుంటున్నాడు. అతనికి పెళ్లి అయిందో లేదో? ఎవరైనా ముద్దు పెట్టారో లేదో. నిజంగా వినలేదా? ఎన్నోసార్లు విని విసిగిపోయాడా? అబ్బా, వినకుండా ఉండొచ్చు, జవాబు చెప్పకుండా నిర్లక్ష్యం చేయొచ్చు. అతన్ని ఆ పిల్ల నిజంగా ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తాడో? తెల్లబోతాడా? చిరాకు పడతాడా? షాక్ తింటాడా? శాంతి ఊహించుకుని నవ్వుకుంది. వూరంతటిలో బోలెడు బ్రాంచిలు ఉన్న స్వీట్ మంత్ర షాపులోకి వెళ్ళింది. పైకి మెట్లు ఉన్నాయి. మెట్లెక్కింది. ఊళ్ళో చాలా పెద్ద హోటళ్ళు ఉంటాయి. అక్కడ కాఫీ వంద రూపాయలు. కొందరు స్టేటస్ కోసం అక్కడికి వెళతారు. మిగిలినవాళ్ళంతా ఇక్కడికి వస్తారు. ఆ మిగిలిన వాళ్ళలో కూడా చాలా విభజనలు. చిన్న చిన్న వాళ్ళు రోడ్డు పక్కన బండి మీద అమ్మే స్వీట్లు కొంటారు. మరీ దరిద్రం, కనీసం ఇరవై కూడా లేదా? గులాబీ రంగు పీచు మిఠాయే గతి. అంటే, కొందరు కాస్త గొప్పోళ్ళు కూడా ఇష్టం మీద అలా చవకైనవి కొనుక్కుని తింటారు. అటు మరీ స్టార్ హోటల్ కి పోలేని, లేదా బొత్తిగా రోడ్డు పక్కన బండి మీదివి కొనడం సరికాదు అనిపించిందనుకో, ఇలా ఈ బజారులో, ఈ ఫలానా షాపులోకి నడిచి వచ్చేయొచ్చు. ఇలానే ఠీవిగా మెట్లు ఎక్కి పైకి వెళ్లి ఏం కావాలో ఆర్డర్ చెబుతారు. వెయిటర్లు, మిఠాయిలైతే కిందినుంచి, ఫాస్ట్ ఫుడ్స్ అయితే పైన ఉన్న కిచెన్ నుంచి తెచ్చి ఇస్తారు. పార్సిల్ ఆర్డర్ చెప్పింది. రాసుకున్నాడు. చుట్టూ నాలుగైదు టేబుల్స్. జనం కూడా పల్చగా ఉన్నారు. ఒక టేబుల్ దగ్గర ఒకబ్బాయి ఎదురగా కూచున్న అమ్మాయికి ఏవేవో గొప్పలు చెబుతున్నాడు. ఆపిల్ల, అవన్నీ నిశ్శబ్దంగా వింటూ మధ్య మధ్య ఆశ్చర్యపోతూ, పాతకాలం పిల్లలాగా అవసరం లేకపోయినా, అప్పుడప్పుడూ సిగ్గుపడుతోంది. ఇంకోబల్ల దగ్గర తల్లి ఇద్దరు పిల్లలు. వాళ్ళు పేచీలు పెడుతూనే జాలీగా తింటున్నారు. తల్లి సంతోషంగా, గర్వంగా ఉంది. పెద్ద బల్ల చుట్టూతా స్టూడెంట్స్ ఉన్నారు. అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి వచ్చారు. చీకూ చింతా లేనట్టు, ఇక్కడ కూచోడం తప్ప ప్రస్తుతానికిగానీ, లేదా ఒక గంట తరవాత గానీ ముఖ్యమైన పనే లేనట్టున్నారు. పదినిమిషాలు గడిచాయి. ఇరవై నిమిషాలు గడిచాయి. ఆర్డర్ రాలేదు. వెయిటర్ని పిల్చింది. ‘చేస్తున్నారు మేడం’ మళ్ళీ పది ఇరవై నిమిషాలు గడిచాయి. ఇంతసేపటి తరవాత కూడా ఆర్డర్ రాలేదు. సహనం తగ్గింది. ‘మీరు చెప్పిన ఆర్డర్‌కి టైం పడుతుంది మేడం. ఇంకోటి ఉంది. తెమ్మంటారా?’ ‘ఎంత టైం పడుతుంది? ముందు చెప్పాలి కదా వెంటనే చెయ్యడం కుదరదని’ ‘అంటే, స్టాఫ్ ఇవాళ తక్కువ మంది ఉన్నారు. ఇంకో ఐటెం రెడీగా ఉంది. తెమ్మంటారా?’ ‘వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇంత సేపు కూచోపెట్టి ఇప్పుడు అది లేదు, ఇది ఉంది అంటారేంటి? అసలు ఆర్డర్ కాన్సిల్ చేసేస్తున్నాను. నాకు ఏమీ వద్దు. నేను పే చేసిన మనీ తిరిగి ఇచ్చేయండి’ శాంతి ఇంగ్లీష్ లో మాట్టాడింది. ‘ఆన్లైన్ పేమెంట్ వెళ్ళిపోయింది మేడం. తిరిగి ఇవ్వడం కుదరదు. మీరు ఇంకేదైనా తీసుకోండి’ ఆతను ఆమె ఇంగ్లీష్‌కి స్పందించిన దాఖలా లేదు! ‘దిస్ ఇస్ టూ మచ్. ఐ జస్ట్ కాంట్ అండర్‌స్టాండ్ వాట్ యు మీన్. డబ్బులు ముందు ఇచ్చిన పాపానికి మాకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏ చెత్త పెడితే ఆ చెత్త తినాలా?’ ‘మేడం, మీరు కూచోండి. నేను రెడీ చేయిస్తాను’ పైన జరుగుతున్న గోలకి కిందినుంచి వచ్చిన మేనేజెర్ శాంతిని కళ్ళతో అంచనా వేస్తూనే చెప్పాడు. ‘ఐ విల్ కంప్లైంట్ టూ యువర్ మెయిన్ ఆఫీస్. పరమ దరిద్రపు సర్వీసు. తెలీక వచ్చాను’ సుమారు పావుగంట తరవాత ఆర్డర్ వచ్చేదాకా శాంతి తిడుతూనే ఉంది. పక్క టేబుళ్ళ వాళ్ళు వింటూనే తింటూ ఉన్నారు. ‘ధాంక్ యు మేడం’ తాపీగా పార్సిల్ పాకెట్ శాంతి చేతికి ఇచ్చి మావూలుగా అన్నాడు. అతనివంక కోపంగా చూస్తూ శాంతి పాకెట్ విసురుగా లాక్కుంది. అతను అభావంగా ఉన్నాడు. అతని రెండు కళ్ళలో శాంతి ప్రతిబింబాలు ఉన్నాయి. బైటికి వచ్చి ఏదైనా నూట యాభై అని అట్టమీద పెన్నుతో రేటు వేసివున్న బండి మీద ఒక జీన్స్, సరిపడా టాప్ కొన్నది. సెంటర్లో వినాయకుడి గుడి దగ్గర దణ్ణం పెట్టుకుంది. గుడికి వెళితే ఒక్క నిమిషమైనా కూచోవాలి అంటారు. అది చాలా చిన్న గుడి. అయినా ఒక పక్కగా అరుగుమీద కూచుంది. ఫోన్ తీసింది. రెండు కంప్లైంట్స్ రాయాలి. ఒకటి ఆటో అతనిమీద. రెండోది స్వీట్ మంత్ర సర్వీస్ మీద. వరస్ట్ సర్వీస్.......ఆటో డ్రైవర్ గురించి రాసింది. మళ్ళీ ఎందుకనో తీసేసింది. వెరీబాడ్ సర్వీస్.......స్వీట్ మంత్ర పేజీలో రాసింది. అది కూడా డిలీట్ చేసింది. ఒక్క నిమిషం కళ్ళుమూసుకుంది. ప్రశాంతంగా ఉంది. లేచి దేవుడిని మళ్ళీ ఓసారి చూసి అలవాటు ప్రకారం రెండు చెంపలూ వేసుకొని వెనక్కి తిరిగింది. (కోటి సుల్తాన్ బజార్, జగదాంబ సెంటర్, సూపర్ మార్కెట్, లేకపోతే పాత రోజుల్లో సంత. బాధనీ, సంతోషాన్నీ సమాంతరంగా పంచుతూ, మార్కెట్లు నిరంతరాయంగా తెరవబడే ఉన్నాయి) ఎం.ఎస్.కె.కృష్ణజ్యోతి -
అత్తారింటికి దారి దొరికింది..!
మా అబ్బాయికి కల్యాణం నిశ్చయమైంది. ఇదేమీ పెద్ద విషయం కాదు. అందరి ఇళ్లలోనూ జరిగే సర్వసాధారణమైన ఉత్సవం. అందుకే నాకు పెద్దగా ఉత్సాహం లాంటివేమీ కలగలేదు. నా పని నేను మామూలుగానే చేసుకుంటున్నాను. నా పోలికే వచ్చిందేమో మా అబ్బాయికి, వాడిలోనూ పెద్దగా మార్పేమీ లేదు. ఎప్పటిలాగే ఉన్నాడు. వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఎప్పటిలాగే రోజులు మామూలుగానే నడుస్తున్నాయి. ఇవన్నీ మామూలుగానే ఉన్నా – నా మనసు మాత్రం ఒక మాటకు పదే పదే ఉలిక్కి పడుతోంది. అదే అత్తగారు! పదం. అబ్బాయి పెళ్లి కుదిరింది అని ఎవరితో చెప్పినా, ‘అయితే అత్తగారు హోదా వస్తోందన్నమాట’ అంటున్నారు. అత్తగారు అనేది హోదా ఎందుకు అవుతుందో నాకు అర్థం కాలేదు. ప్రతివారి నోటిలో నుంచి ఈ చిలక పలుకులే వింటుంటే నా మనసు మాత్రం వాటిని కాకి అరుపుల్లా భావిస్తోంది. ఎవరైనా అత్తగారు అనే పదం అంటుంటే, నా నోటి నుంచి ‘ఆ మాట మాత్రం అనకండి’ అనే వాక్యం అప్రయత్నంగా వచ్చేస్తోంది. నా మాటలు అందరికీ విచిత్రంగా అనిపించే ఉంటాయి. నిజమే మరి, కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడుతోందంటే, సంతోషంగా ఉండక, ఇలా ఉలికిఉలికి పడుతున్నానని చెబుతుంటే, వాళ్లకి విచిత్రంగానే అనిపిస్తుంది కదా మరి! ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది. అత్తగారు అనే పదం నాకు చెప్పులో రాయి, చెవిలో జోరీగ, కంటిలో నలుసు, ఇంటిలో పోరులా అనిపించసాగింది. అవును, ఒక్కోరు అత్తగారు అన్నప్పుడల్లా ఒక్కో రకంగా స్పందించింది నా మనసు. దీని వెనకాల పెద్ద కథ కాదు... పే.... ద్ధ.... కథే ఉంది. నాకు వివాహమై 30 సంవత్సరాలు కావస్తోంది. కారణాలు ఏమైతేనేమి నాకు అత్తవారింట్లో ఉండవలసిన అవసరం రాలేదు. మా ఆయన ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉండటంతో అత్తవారిల్లు అనే పదం నాకు ఆవలి ఒడ్డునే ఉండిపోయింది. అదృష్టంకొద్దీ నాకు అత్తగారి గురించి అత్తింటివారి గురించి తప్పుగా మాట్లాడే ఆలోచన రాకుండా భగవంతుడు నన్ను రక్షించాడు. థాంక్స్ ఎ లాట్ టు గాడ్. నా విషయం పక్కనపెట్టి, ప్రస్తుతంలోకి వద్దాం... కొత్తగా పెళ్లయిన ఏ ఆడపిల్లను పలకరించినా, మా అత్తగారితో పడలేకపోతున్నాను. ఆవిడ వంట చేసిన తరవాత ఆ గది కడగలేకపోతున్నాను. వంట గట్టంతా పాడు చేసేస్తారు అని ఒకరు... మా అత్తగారికి నేను ఏది చేసినా నచ్చదు. మా పెళ్లయినా కూడా మా ఆయనకు ఆవిడే అన్నీ చేసి పెట్టాలి, నేను చేస్తే నచ్చదు, ఆవిడతో పడలేకపోతున్నాను... అని ఒకరు... మా అత్తగారికి నేను డ్రసెస్ వేసుకుంటే ఇష్టం ఉండదు, అమ్మమ్మలా చీరలే కట్టుకోవాలిట, నేను కొద్దిగా మోడరన్‌గా ఉంటానే కానీ, మరీ అసభ్యంగా ఉండను కదా. అలా ఎందుకంటుందో. మా అత్తగారికి మా వారు ఒక్కరే అబ్బాయి. అందుకే వాళ్లతో కలిసి ఉండకా తప్పదు, నేను మాటలు పడకా తప్పదు... ఇలా మరొకరు... ఇవి మచ్చుకి మాత్రమే. ఇందులో అత్తగారి తప్పు ఎంత ఉందో, కోడలి అనుమానం ఎంత ఉందో అనే చర్చ నాకు అనవసరం. కొత్త కోడలు అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్తల్లో అత్తగారిని ఒక తాటకిలాగో, ఒక లంఖిణిలాగో, ఒక సూర్యకాంతంలాగో చూస్తుందని మాత్రం ఆ వయసులోనే అర్థమైంది. మరి ఇప్పుడు నేను అత్తగారి హోదాలో ఉంటే నేను కూడా ఏదో ఒక రాక్షసినే అవుతాను కదా. చిన్నప్పుడు ఆడుకున్న ఒక ఆట నాకు ఈ సందర్భంలో బాగా గుర్తుకు వస్తోంది. చిన్నపిల్లలు అన్నం తినకపోతే, వాళ్ల అరచేతిని మన చేతిలోకి తీసుకుని, ‘అలికి, ముగ్గు పెట్టి, ఆకేసి, పీటేసి, పప్పేసి, కూర వేసి, నెయ్యేసి... అన్నీ కలిపి ఆం ఆం అని తినాలి’ అని చివరగా అత్తారింటికి దారేదంటే కిత కిత కిత కిత... అంటూ పిల్లల్ని నవ్వించేవారు. పిల్లలు అత్తారిల్లు అంటే కితకితలు పెడితేనే కానీ నవ్వలేనంత భయపెట్టారు అత్తారింటి గురించి అనిపిస్తోంది. అందుకే వద్దు ... నాకు ఆ హోదా... ఆ పదవి అసలు వద్దే వద్దు. ‘అమ్మ’గా ఉండిపోతాను. ‘అమ్మలాగే’ ఉండిపోతాను. ‘అమ్మగానే’ నిలిచిపోతాను. నిన్నమొన్నటి దాకా మా అబ్బాయి తన స్నేహితులందరితో ‘మా అమ్మ నాకు స్నేహితురాలు. అన్నీ నేను మా అమ్మకి చెప్తాను. మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికం ఉండదు. నేను ఉద్యోగం మానేయాలనుకున్నప్పుడు కూడా అమ్మ నన్ను ఒక్క మాట అనలేదు. నీ ఇష్టంరా, నీ కెరీర్ జాగ్రత్తగా చూసుకో.. అని నన్ను ప్రేమగా చూసింది’ అంటూ నా గురించి అందరితోనూ ఎంతో మంచిగా చెప్పాడు. ‘మీ అబ్బాయి మీరు తల్లికొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటారట కదా. చాలా సంతోషం. మంచి అమ్మ మీరు, మీ అబ్బాయి కూడా మంచివాడు’ అని అందరి చేత మంచి అనిపించుకున్నాను ఇప్పటివరకు. అందుకే నేను అమ్మగానే ఉండిపోవాలనుకున్నాను. మరి అత్తగారి పదవి తప్పదు కదా. అలా ఉండాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాను. సరిగ్గా అప్పుడే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అత్తాకోడళ్ల అంచు ఖాదీ పంచెలు తయారుచేస్తారు. ఒక అంచు ఆకుపచ్చ రంగు, ఒక అంచు ఎరుపు రంగు ఉన్న పంచెలను అత్తాకోడళ్ల అంచుల పంచె అనేవారు. పంచెను ఒక కుటుంబంగా భావిస్తే, ఆ కుటుంబానికి అత్తాకోడళ్లిద్దరే వారధులుగా ఉంటారనే ఉద్దేశ్యంతోనే ఇలా తయారుచేసి ఉంటారేమోనని నాకు ఈ సందర్భంలో అనిపించింది. నిజమే కదా! ఆ పక్కన ఒకరు, ఈ పక్కన ఒకరు ఉండి, కుటుంబాన్ని ఒక చట్రంలో బిగిస్తేనే కదా ఆ బంధం బలపడుతుంది అనిపించింది. అత్తాకోడళ్లు కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పంచెలను తయారుచేశారేమో!!! అయ్యో... దారి ఎటో వెళ్లిపోతోంది... అసలు కథలోకి వద్దాం... ఇప్పుడు ఈ కొత్త పదవితో నేను చెడ్డదాన్ని అవ్వాలా అనే అంతర్మధనం మొదలైంది నాలో. అబ్బాయి పెళ్లి కుదిరిన నాటి నుంచి ఈ కారణంగానే నేను చాలా నిద్ర లేని కాటుక చీకటి రాత్రులు గడిపాను. నేను ఎందుకు అలా ఉంటున్నానో ఎవరికీ అర్థం కాలేదు. ‘కోడలు వస్తుంటే హుషారుగా ఉండాలి. ఇక ఆ అమ్మాయే అన్నీ చేసిపెడుతుంది, నువ్వు హాయిగా కాలి మీద కాలు వేసుకుని కూర్చుని పెత్తనం చలాయించు’ అంటుంటే, నాకు చాలా బాధ వేసింది. కోడలంటే అత్తగారికి సేవలు చేయడానికేనా! ఏరోజూ అత్తగారికి సేవలు చేయలేని నేను మాత్రం దర్జాగా కూర్చుని, ఆ చిన్నపిల్లతో అన్నీ చేయించుకోవాలా! ఇంతకు మించిన అన్యాయం ఉందా?’ అని నా మనసు నా ఆలోచనల మీద అనునిత్యం కొరడా ఝళిపిస్తూనే ఉంది. ‘నేను ఏనాడైనా అత్తగారికి సేవ చేయవలసిన అవసరం వచ్చిందా! అసలు మా అత్తగారికి చేయించుకునే అలవాటే లేదు. ఇంక నేను ఎందుకు చేయాల్సి వస్తుంది? నేను కూడా అలాగే ఉండాలి’. అందుకే అత్తగారు పదవి వద్దనుకున్నాను. పెళ్లికి ముందు రోజు వరకు నా దగ్గరే పడుకుని, నాతో ఎన్నో కబుర్లు చెప్పిన మా అబ్బాయి పెళ్లి చేసుకుని తీసుకువచ్చిన అమ్మాయిని వాడితో సమానంగానే చూడాలనే కనీస జ్ఞానం, సంస్కారం జన్మతః అలవడ్డాయి. అందుకే నాకు అత్తగారు పదవి వద్దనుకున్నాను. అత్తవారింట్లో కుడి కాలు పెట్టిన కోడలిని, పుట్టిల్లు మరచిపోయేలా చూడాలే కాని, నిరంతరం పుట్టిల్లు గుర్తుకు వచ్చేలా చేయడం ఎంత అన్యాయం. పాతికేళ్లు పెంచిన తల్లిదండ్రులను, తనతో సమానంగా ఆడుకున్న అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములను విడిచి, ఎవ్వరూ తెలియని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలికి ఆ ఇల్లు పుట్టిల్లులాగే ఉండాలి. తన జీవితంలో ఎక్కువ భాగం అత్తవారింట్లోనే గడుస్తుంది. అటువంటి ఆ ఇల్లు నరకంగాను, అత్తగారు యముడిలాగాను ఉంటే, ఆడపిల్లకు పెళ్లి ఎందుకు. పెళ్లి మధువులు ఒలకపోయాలే కాని, విషచషకాలు మిగల్చకూడదు. నా మనసు ఎటుపడితే అటుగా నిముషానికి ఒకలాగ ఊగిసలాడుతూనే ఉంది. ఒక్క క్షణం కూడా కుదురుగా నిలబడట్లేదు. నేను గట్టిగా పట్టి లాగి ఒక చోట కూర్చోపెడదామన్నా, నా మాట విననంటూ మొండికేసింది. ఎందుకు వినాలి? మనసుకు స్వేచ్ఛనిస్తేనే మనిషిని సక్రమ మార్గంలో పెడుతుంది!!! శాఖాచంక్రమణం అవుతోంది కదూ! వర్తమానంలోకి వద్దాం! ‘అత్తగారు పదవి వద్దంటావెందుకు. ఆ పేరుకి మంచి పేరు తీసుకురావచ్చుగా’ అని మరి కొందరు అన్నారు. అది సాధ్యపడదని నాకు తెలుసు. సూర్యకాంతం పేరు పెట్టుకోవడానికి ఎవరైనా సాహసించగలుగుతున్నారా. సూర్యకాంతం మెత్తటి మనసు ఉన్న ఉత్తమురాలని అందరికీ తెలుసు. కాని ఆ పేరు పెట్టుకోవడానికి మాత్రం ధైర్యం చేయలేరు. అత్తగారు పోస్టు కూడా అంతే. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు... ఇలాంటి పాటలు మనుషుల మనసుల్లో మర్రి విత్తనంలాగ నాటుకుపోయాయి. అవి పెద్ద పెద్ద ఊడలుగా విస్తరించాయి. వాటిని పెరికివేయడం ఆ చెట్టును సృష్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. అందుకే నేను అత్తగారు అనే పదవిని సునిశితంగా కాదు కొంచెం ఘాటుగానే తిరస్కరిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆడపిల్లకు అత్తవారిల్లు అంటే ఎన్నో జాగ్రత్తలు నేర్పిస్తారు. అంత అవసరమా. అత్తవారిల్లే ఆడపిల్లకు పర్మినెంట్ అడ్రస్ అయినప్పుడు, జీవితకాలం సద్దుకుపోతూనే ఉండాలా. స్వేచ్ఛ అక్కర్లేదా. స్వేచ్ఛను ఎవరైనా హరిస్తున్నారంటే నాకు ఎక్కడ లేని ఆవేశమూ వస్తుంది. సృష్టిలో ప్రతిప్రాణికీ స్వేచ్ఛ ఉంటుంది, కానీ కోడలికి మాత్రం ఉండకూడదా. ఇదెక్కడి న్యాయం. కోడలు మనిషి కాదా, స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా. ఇలా ఆలోచిస్తూనే ఉంది నా మనసు. అందుకే నేను అత్తగారు పదం నా దరి చేరకూడదనుకున్నాను. దగ్గరకు రాకుండా ఉండటం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇంతవరకు బాగానే ఉంది. అత్తగారు పదవి వద్దనుకోవడం, కావాలనుకోవడం నా చేతుల్లో ఉన్నదే. కాబట్టి నన్ను నేను ఎప్పటికప్పుడు తప్పులు చేయకుండా సంరక్షించుకుంటున్నాను. అయితే ఇంతలోనే ఏదో తెలియని బాధ ఒకటి నన్ను ఇబ్బందులకు గురిచేస్తోంది. నా మనసు తరచుగా తడి అవుతూనే ఉంది. ఇలా ఆర్ద్రం కావడం తప్పేనేమో. ఎంతైనా నేను కన్న కొడుకు, నేను ప్రేమగా పెంచుకున్న కొడుకు, ఇంతవరకూ నాకు మాత్రమే పంచిన తన ప్రేమను ఇప్పుడు కొత్త అమ్మాయితో పంచుకోవడాన్ని నా తల్లి మనసు అంగీకరించడానికి కొంచెం సమయం పడుతుందేమో. పంచేకొద్దీ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది, తరగదని తెలిసినా ఏదో తెలియని స్వార్థం నా ఆలోచనను కుంచించుకుపోయేలా చేస్తోంది. నెమ్మదిగా వికసించుకోవచ్చు. అసలు ఈ మాట అనటం కూడా తప్పేనేమో. అమ్మగా ఉండాలనుకున్న నేను, ఇంటికి రాబోతున్న అమ్మాయిని పరాయిపిల్లగా భావించకపోతే ఈ బాధ కూడా తీరిపోతుంది కదా అనిపించింది. ఈ సంఘర్షణ నుంచి బయటపడటానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఇలా ఈ ఆలోచనలతో నెల రోజులు గిర్రున తిరిగిపోయాయి. ఒకరోజు కల వచ్చిందో, నిజంగానే జరిగిందో తెలియదు కానీ, నాలో కొత్త ఉత్సాహం బయలుదేరింది. ఆషాఢమాసం పూరై్త శ్రావణ మాసం ప్రారంభమైంది. ఆషాఢంలో అత్తకోడళ్లు ఒకే గడప దాటకూడదని ఎవరో ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అందుకే అమ్మాయి ఆషాఢమంతా పుట్టింట్లోనే ఉండి, శ్రావణ మాసం నోములు కూడా ప్రారంభించి, వరలక్ష్మీ వ్రతానికిæ ఇంటికి వస్తోంది. నాలోని అమ్మ మనసు మరింత ఉరకలు వేయడం ప్రారంభించింది. అమ్మాయికి శ్రావణ శుక్రవారం నోముకి కావలసినవన్నీ సిద్ధం చేశాను, బంగారు నల్లపూసలు, పట్టు చీరతో పాటు, రకరకాల గాజులు, పండ్లు, పూలు తీసుకువచ్చాను. అమ్మాయికి ఇష్టమైనవన్నీ సిద్ధం చేశాను. అసలు విషయం మర్చిపోయాను, ఇంటికి వచ్చిన అమ్మాయి, అత్తగారిని ‘అత్తమ్మా’ అని కూడా పిలుస్తుంది కదా. అలాగే ఇంగ్లీషులో మదర్ ఇన్ లా అంటారు. అంటే ‘చట్టప్రకారం తల్లి’ అనే అర్థం తోచింది నాకు. నిజమే... నేను అత్తమ్మనే.. కాకపోతే అందులో మధ్యన ఉన్న అక్షరం తీసేస్తున్నాను. అంతే. మా అబ్బాయి తన ప్రేమను ఇద్దరికీ సమానం పంచినట్లే, నేను కూడా నా ప్రేమను ఆ నూతన దంపతుల మీద సమానంగానే పంచాలని నిశ్చయించుకున్నాను. నా మనసు తేలికపడింది. హమ్మయ్య. నేను అమ్మనే. అత్తగారిని కాదు, అనుకునేసరికి గుండె బరువు పూర్తిగా దిగిపోయింది. మనసు గాలిలో కాదు, ధృవ నక్షత్రం మీద హాయిగా, తేలికగా విహరించసాగింది. ఇంతలో ఎవరో తలుపు కొట్టారు, తలుపులు తీసేసరికి, మహాలక్ష్మిలా కోడలు గుమ్మంలో నిలబడింది. కోడలు కాదు, ఈ రోజు నుంచి నాకు కూతురితో సమానం. అమ్మాయిని ప్రేమగా లోపలకు తీసుకువెళ్లాను. మా అబ్బాయి నావైపు నవ్వుతూ ఆప్యాయంగా చూశాడు. - వైజయంతి పురాణపండ -
నా ముద్దుల గాడిద పిల్ల
మేము ‘కోర్ఫూ’ దీవికి వచ్చిన్పటి నుంచి చూస్తున్నాను ఈ దీవి అంతా ఎక్కడబడితే అక్కడ గాడిదలే దర్శనమిస్తున్నాయి. మొదట్లో నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాథరీనా పెళ్లికి వెళ్లినప్పుడు అతిథుల్లా వచ్చిన గాడిదలు ‘బంధుమిత్ర సపరివారంగా’... అంటే తమ రోజుల పిల్లలతో సహా గుంపులు గుంపులుగా విచ్చేశాయి. ఆ గాడిద పిల్లలు ముద్దు ముద్దుగా తిరుగుతుంటే భలే ముచ్చటేసింది. అవి నడిచే తీరూ నన్నెంతగా ఆకర్షించాయంటే ఎలాగైనా నాకంటూ ఒక గాడిదపిల్ల కావాలనింపించేంతగా, అందుకేనేమో ‘గాడిదపిల్ల కోమలం’ అని అంటారు. ఆ పెళ్లి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏదేమైనా నేనొక గాడిదను పెంచుకోవాలనే నిర్ణయానికొచ్చేశాను. మరి అమ్మను ఒప్పించడమెలా? అని ఆలోచించి, చిన్నగా అమ్మ దగ్గరకు వెళ్లి చెప్పడం మొదలుపెట్టాను. ‘‘అమ్మా! నేను ఈ దీవంతా తిరగడానికి, నా సామానులు మోసుకు రావడానికి, నా అవసరాలకు ఒక గాడిద ఎంతో అవసరం’’ అంటూ వివరించసాగాను. అయితే అమ్మ ఒక పట్టాన ఒప్పుకోకపోయేసరికి ‘‘పోనీ నువ్వు నాకిచ్చే క్రిస్మస్ కానుక అదే ఎందుకు కాకూడదూ’’ అంటూ దీర్ఘంతీశాను. దానికి అమ్మ సమాధానంగా తను ఎందుకు వద్దంటుందో దానికి కారణాలు చెప్పింది. ‘‘అబ్బో! అది చాలా ఖరీదు. పైగా ఇప్పటికిప్పుడు చిన్నపిల్లలు ఎక్కడ దొరుకుతారు చెప్పు!’’ అంటూ మాట దాటేసే ప్రయత్నం చేసింది. అయితే, నేను వదిలితేనా... ‘‘అమ్మా! మరి నా పుట్టినరోజుకు కూడా వేరే ఏమీ కొనక్కర్లేదు. క్రిస్మస్కి, పుట్టినరోజుకు కలిపి ఒక్క గాడిదపిల్ల చాలు’’ అంటూ బేరం పెట్టాను. పైగా పుట్టినరోజున నాకొచ్చే కానుకలన్నింటినీ ఓ గాడిదపిల్ల కోసం పణం పెట్టేశాను. మా అమ్మ చాలా గట్టిది. ఒక పట్టాన కరిగితేగా... నా వాదనలన్నీ విన్నాక ‘‘చూద్దాంలే!’’ అనేసింది. మా అమ్మ ఆ మాట అన్నదంటే కొంప మునిగిపోయినట్లే! ఇక దాన్ని మరచిపోవచ్చు. ఎందుకంటే గతంలో అలాంటి చేదు అనుభవాలు కోకొల్లలు. ఎందుకైనా మంచిదని నా పుట్టినరోజు దగ్గరపడుతుందనగా నా వాదనలు, అభ్యర్థనలు మళ్లీ మా అమ్మకు వెళ్లబోసుకున్నాను. అయినా మా అమ్మ అదే సమాధానమిచ్చింది ‘‘చూద్దాంలే!’’ అని. ఇక నా గాడిదపిల్ల వ్యవహారంపై ఆశలు వదిలేసుకున్నాను. ఒకరోజు ఉదయాన్నే కోస్టాస్, అదే మా పనమ్మాయి తమ్ముడు భుజం మీద పెద్ద వెదురు బొంగులు మోసుకుంటూ మా తోట వెనకాల ఉన్న ఆలివ్చెట్ల తోపుల వైపు వెడుతూ కనిపించాడు. నేను కూడా పోయి చూస్తునుకదా! చక్కగా, హుషారుగా ఈల వేసుకుంటూ నేలలో గుంతలు తీసి వెదురు బొంగులను నిలువుగా ఒక చతురస్రాకారంలో పాతేస్తున్నాడు. నేను కంచె సందుల గుండా గమనిస్తూనే ఉన్నాను ఈ తతంగమంతా. అయితే వాడెందుకా పని చేస్తున్నాడన్న విషయం అంతుపట్టలేదు! అందుకని నా కుక్క రోజర్ని తీసుకొని అటువైపు వెళ్లాను. ‘‘ఎందుకు కడుతున్నావు దీన్ని?’’ అన్న నా ప్రశ్నకు, ‘‘మీ అమ్మగారి కోసం ఒక ఇల్లు కడుతున్నా!’’ అంటూ సమాధానం వచ్చింది. కోస్టాస్ నుంచి ఆ మాట వింటూనే నాకు ఆశ్చర్యం వేసింది ‘‘మా అమ్మకీ ఇల్లు ఎందుకబ్బా?’’ మా అమ్మేం చేసుకుంటుంది? కొంపదీసి ఇల్లు వదిలేసి ఇక్కడకొచ్చి పడుకుంటుందా?’’ అని. నాకెందుకో నమ్మశక్యంగా అనిపించడం లేదు. అదే మాట వాడినడిగాను ‘‘మా అమ్మకెందుకూ ఈ గుడిసె..’’ అంటూ, వాడు అనుమానంగా నాకేసి తేరిపార చూస్తూ ‘‘ఎవరికి తెలుసు! బహుశా మొక్కలు వేస్తారో, చలికాలంలో బంగాళదుంపలు దాస్తారేమో..?’’ అంటూ భుజాలెగరేశాడు. వాడి సమాధానం నాకు రుచించలేదు! కొద్దిసేపు వాడినే చూస్తూ కూర్చునేటప్పటికి విసుగనిపించి నా రోజర్ని తీసుకుని వెళ్లిపోయాను. మర్నాటికల్లా ఆ వెదురింటికి ఒక ఆకారాన్ని తెచ్చాడు కోస్టాస్. ఆ రోజంతా ఆ వెదురుగడల మధ్య రెల్లుగడ్డితో పేనుతూ మంచి దిట్టమైన గోడలు, పైకప్పు పూర్తి చేశాడు. ఆ తర్వాతి రోజుకల్లా చక్కటి ‘రాబిన్ క్రూసో’ పొదరిల్లులా తయారయ్యిందా వెదురిల్లు. ఇక ఉండబట్టలేక మా అమ్మనే అడిగేస్తే పోలా అనుకుంటూ నేరుగా వెళ్లి అడిగేశా. ‘‘ముందుముందు దేనికైనా పనికొస్తుందని వేయిస్తున్నా’’ అంటూ ఇంకాస్త అనుమానం కలిగేట్లు గుంభనంగా సమాధానమిచ్చింది మా అమ్మ. రేపు నా పుట్టినరోజనగా ఇంట్లో అందరూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. లారీ ఏ కారణం చేతనో ‘టాంటివీ’, ‘తాలిహో’ అంటూ వేటాడేటప్పుడు ఉపయోగించే పదాలను అరుస్తూ బయటకు వెళ్లాడు. ఇక మార్గో సంగతికొస్తే తన చంకల కింద ఏవో కట్టలు పట్టుకొస్తూ హాల్లో నాకెదురు పడింది. బహుశ క్రిస్మస్కి మిగిలిపోయిన రంగు కాయితాలనుకుంటా. నేనామోను ఆశ్చర్యంగా చూస్తేంటే... నన్ను చూడగానే ఆమె కీచుమంటూ అరిచి తను దాస్తున్నదేదో నేను చూసేశానన్నట్లు తన పడకగదిలోకి పరుగెత్తింది. ఇంకా లెస్లీ, స్పైరోలకూ ఏదో అయ్యింది. తోటలో వాళ్లిద్దరూ ఏదో విషయం మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ‘వెనక సీట్లో’... అంటూ స్పైరో కోపంగా, ‘‘దేవుడిమీదొట్టు! నేనంతకు ముందే చేసేశాను మాస్టర్ లెస్లీ!’’ అంటూ సమాధానమిస్తున్నాడు. అయినా ఇంకా అనుమానంతోనే లెస్లీ వాడిని మెచ్చుకుంటూ ‘‘సరే! నువ్వా భరోసా ఇస్తే మంచిదే స్పైరో మనకేం మెప్పుదలలూ, మెచ్చుకోళ్లూ అవసరం లేదు’’ అంటూ.. నన్నక్కడ చూడగానే లెస్లీ పెద్దగా ‘‘మేమిక్కడ మాట్లాడుకుంటుంటే నీకిక్కడేం పనిరా?’’ అంటూ కేకలేశాడు. నాకైతే వాడలా అంటుంటే అవమానంగా అనిపించి దగ్గర్లో ఉన్న కొండ మీదకు పోయి దూకుదామనిపించింది. చూడబోతే ఇంట్లో వాళ్లెవ్వరికీ నేనంటే ఇష్టం లేదు లాగుంది. నాతో ఒక్కరూ సరిగా ఉండట్లేదు. ఇక నేనిక్కడ ఉండకూడదు... అనుకుంటూ రోజర్ని తీసుకుని ఆలివ్ తోపులోకి పోయి ఆకుపచ్చని తొండలను వేటాడుతూ గడిపేశాను ఆ రోజంతా. మరి ఇక ఆ రాత్రేమైందంటే!.. నేను నా గదిలో లైటార్పేసి వెచ్చగా పక్కమీదికి చేరానో లేదో.. ఆలివ్తోపు నుంచి బొంగురు గొంతులతో పాటలూ.. పెద్దపెద్దగా నవ్వులూ వినిపించసాగాయి. అప్పుడు లెస్లీ, లారీ గొంతులతో కలిసి స్పైరో కూడా పాడుతున్నాడని అర్థమైంది. అప్పుడే వరండాలో అమ్మ, మార్గోల గుసగుసలు వినిపించాయి. లారీ వేసిన జోక్‌కి మిగిలిన వాళ్లిద్దరూ పగలబడి నవ్వుతూ అమ్మను, మార్గోనూ చూడగానే భయంతో టక్కున ఆపేసినట్లున్నారు. ‘‘నిశ్శబ్దంగా ఉండండి’’ అంటూ అమ్మ ‘‘గేరీని నిద్ర లేపుతారేంట్రా!.. ఏం తాగొచ్చారు?’’ అంటూ అడిగింది. ‘‘వైన్, ద్రాక్షరసం...’’ అన్నాడు లారీ హుందాగా. ‘‘అవును వ్వై.. న్నే!’’ అంటూ లెస్లీ తర్వాత మేము డాన్స్ చేస్తుంటే స్పైరో చేశాడు. ఆ తర్వాత నేను... మళ్లీ లారీ.. డాన్స్ చేస్తుంటే ఆ తర్వాత స్పైరో చేస్తుంటే.. లారీ చేశాడు... మళ్లీ నేనూ డాన్స్ చేశాను... అంటూ తాగినవాడు మాట్లాడినట్లు ముద్దముద్దగా మాట్లాడుతూ పేలడం మొదలుపెట్టాడు. ‘‘మీరు వెళ్లి నిద్రపోవడం మంచిది’’ అని అమ్మ అంటున్నా సరే ‘‘ఇంకా తర్వాత స్పైరో డాన్స్ చేశాడు.. మళ్లీ లారీ డాన్స్ చేశాడు...’’ అంటూ లెస్లీ వదరుతూనే ఉన్నాడు. ‘‘సరే నాన్నా! వెళ్లి పడుకోరా బాబూ..!’’ అంటూ అమ్మ లెస్లీని బతిమాలుతూనే స్పైరోతో అంటోంది.. స్పైరో! నువ్వు వాళ్లను ఎక్కువగా తాగన్వికుండా చూడాల్సింది’’ అంటూ.. ‘‘స్పైరో... డాన్స్ చేశాడూ..’’ అంటూ తన రూమ్‌కి వెళుతున్నాడు కాబోలు... లెస్లీ మాట అస్పష్టంగా వినబడుతోంది. ‘‘అమ్మా! నేను వాడిని పడుకోబెడతాను... నువ్వు కంగారుపడకు. ఆ పార్టీలో నేనేమీ తాగలేదు’’ అంటూ లారీ సంజాయిషీ ఇస్తున్నా తాగినట్లు తెలుస్తోంది. కాకపోతే.. లెస్లీలా కాకుండా హుందాగా ఉండటం లారీ లక్షణం. బయట లారీ, లెస్లీ తూలుతూ, ఒకళ్ల భుజాల మీద ఒకళ్లు చేతులేసుకుని తడబడుతూ నడుస్తున్న శబ్దం నాకు వినబడుతోంది. ‘‘నేన్నీతో.. డాన్స్.. చేస్తున్నాను’’ అంటూ లెస్లీ రాగం తీస్తుంటే, వాడ్ని లారీ ఈడ్చుకెళ్లి అతని పడగ్గదిలో పడుకోబెట్టినట్లున్నాడు. కాసేపటికి ఏమీ వినబడలేదు. ‘‘సారీ మిసెస్ డ్యూరెల్!’’ అంటూ స్పైరో గొంతు ముద్దగా వినబడుతోంది. ‘‘వాళ్లని నేనాపలేకపోయాను.’’ ‘‘ఇంతకూ అది దొరికిందా?’’ అంటూ మార్గో అడుగుతోంది. ‘‘ఆ! మిస్సె మార్గో! మీరేం విచారించకండి. అది కోస్టాస్తో ఉంది’’ అంటూ జవాబిచ్చాడు స్పైరో. అలా చెప్తూ స్పైరో వెళ్లినట్లున్నాడు. అమ్మా మార్గో కూడా పడుకోవడానికి వెళ్లడం నాకు వినబడుతోంది. నాకైతే ఆ రోజంతా గందరగోళంగా గడిచినట్లనిపించింది. మా వాళ్లందరికీ ఏమైందీ రోజు.. రేపు నా పుట్టినరోజు కానుకలేమిస్తారో అనుకుంటూ.. వాళ్లు తిక్కతిక్కగా ప్రవర్తించడాన్ని తలుచుకుంటూ.. అది మరచిపోవాలనుకుంటూ.. నిద్రలోకి జారుకున్నా. మర్నాడు నిద్రలేచినా అలానే పక్క మీదనే పడుకొని ‘‘ఈరోజు ప్రత్యేకతేంటా?’’ అని ఆలోచిస్తుంటే.. అప్పుడు గుర్తొచ్చింది... ఆ రోజే నా పుట్టినరోజని. ఇక ఆ రోజంతా మా వాళ్లు ఇచ్చే బహుమతుల గురించి, నాకేమేం కావాలో అని అడుగుతారని జ్ఞాపకం వచ్చేసరికి ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది. ఇక పడక మీద నుంచి లేచి కిందకుపోయి నాకేమైనా బహుమతులు వచ్చాయేమోనని చూద్దామనుకుంటుండే సరికి హాల్లో ఏదో హడావుడిగా, గోలగోలగా ఉన్నట్లుంది. ‘‘దాని తలను పట్టుకోండీ! దాని తలను పట్టుకోండీ!’’ అంటూ లెస్లీ హుషారుగా అనడం వినిపించింది. ‘‘ఏయ్! చూడు దాన్ని ఎంత బాగా అలంకరించానో! దాన్నంతా పాడు చేస్తున్నావ్’’ అంటూ మార్గో బాధగా అరుస్తోంది. ‘‘దాని అలంకరణ సంగతి మర్చిపో’’ అంటూ లెస్లీ మళ్లీ ‘‘దాని తలను పట్టుకో’’ అన్నాడు. ‘‘రేయ్ పిల్లలూ! పోట్లాడుకోకండిరా’’ అని సర్ది చెప్తోంది అమ్మ. ఇంతలో ‘‘దేవుడా!’’ అంటూ లారీ గావుకేక పెడుతూ ‘‘నేల మీదంతా దీని పేడ పడుతోంది..’’ అంటూ చీదరింపుగా అంటున్నాడు. ఈ గందరగోళంగా వినబడుతున్న అర్థంపర్థంలేని సంభాషణల మధ్య ప్రత్యేకంగా, వింతగా ‘పిట్–పాట్‘ అంటూ ఎవరో పింగ్‌పాంగ్ బాల్‌ను నేల మీద కొడుతున్నట్లు శబ్దం వినవస్తోంది. వీళ్ల గందరగోళం, ఆ ప్రత్యేకమైన శబ్దం దగ్గరవుతున్నట్లున్నాయి. అప్పుడు నాకనిపించింది. ‘‘ఏమైందిరా నాయనా! మా కుటుంబానికీ రోజు..’’ ఈపాటికి నిద్రజోగుతూ ఉంటూ... ఉదయాన్నే టీ కోసం ఎదురు చూస్తుంటారైతే..’’ అంటూ నేను ఆశ్చర్యపడుతూ లేచి కూర్చున్నానో లేదో ఒక్కసారి ధడేల్న నా గది తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి ఓ గాడిదపిల్ల చక్కగా క్రిస్మస్ అలంకరణలతో, రంగుకాగితాలతో దాని రెండు పెద్దపెద్ద చెవుల మధ్య లాఘవంగా అమర్చబడిన మూడు పెద్దపెద్ద ఈకలతో అందంగా అలంకరించబడి చూడముచ్చటగా గెంతుతూ.. దుముకుతూ వచ్చి నా మంచం దగ్గర ఆగిపోయింది. ‘‘ఆగవే గాడిదా..! ఆగూ!’’ అంటూ లెస్లీ దాని తోకకు వేలాడుతూ అరుస్తున్నాడు. ‘‘నువ్వు నేను కష్టపడి గంటల తరబడి అలంకరించినదంతా చెడిపేసుకుంటున్నావ్!’’ అంటూ మార్గో కీచుగా అరుస్తోంది. ‘‘దీన్ని ఎంత తొందరగా బయటకు తీసుకెళితే అంత మంచిది..’’ అంటూ లారీ ‘‘ఇప్పటికే హాలంతా దీని పేడతో నిండిపోయింది..’’ ఏవగింపుగా అంటున్నాడు. ‘‘మీరు దీన్ని భయపెడుతున్నారు’’ అని మార్గో అంటుంటే లారీ.. ‘‘లేదులేదు నేనేం చెయ్యలేదీన్ని.. కాకపోతే కొంచెం ముందుకు తోశాను’’ అంటూ దీర్ఘంతీశాడు. అలా దూకుతూ వచ్చిన ఆ గాడిదపిల్ల నా మంచం దగ్గరకొచ్చి ఆగి నా ముఖంలోకి తన పెద్దపెద్ద గోధుమరంగు కళ్లను మరింత విప్పార్చుకొని చూస్తూ ఉండిపోయింది. దాన్ని అలా చూస్తుంటే అది నన్ను చూసి ఆశ్చర్యపోతుందేమో అనిపించింది. దానికి తనకు చేసిన అలంకరణ చికాకు తెప్పించింది కాబోలు... గట్టిగా తన శరీరమంతా విదిలించింది అవన్నీ కింద పడిపోయేంతగా.. అంతేనా! తన తోక పట్టుకుని వేలాడుతూ విసిగిస్తున్నాడే లెస్లీ.. వాణ్ణీ వదిలించుకోవాలనుకుందేమో.. గట్టిగా వాడి మోకాలి మీద తన వెనుక కాలితో ఒక్కతాపు తన్నింది. అంతే! ‘‘దేవుడా! ఇది నాకాలు విరగ్గొట్టింది’’ అంటూ పొలికేక పెట్టి ఒక్క కాలి మీద కుంటడం మొదలుపెట్టాడు వాడు. దానికి అమ్మ ‘‘నాన్నా లెస్లీ! దానికంత అరవక్కర్లేదనుకుంటానే!’’ అంటూ వాణ్ణి సముదాయించింది. ఏమనుకున్నాడో ఏమో లారీ నాకేసి తిరిగి ‘‘రేయ్! ఇక నువ్వు ఆ మంచం దిగిరారా బాబూ! నువ్వెంత త్వరగా దీన్ని బయటకు తీసుకెళ్తే అంత మంచిది. ఇప్పటికే ఇది ఇల్లంతా కంపు చేసింది. ఆ హాలంతా పశువుల పాకలా కంపుతో నిండిపోయిందిరా!’’ అంటూ నన్ను పక్కమీద నుంచి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మార్గో గగ్గోలు పెడుతోంది తను గంటల కొద్దీ శ్రమపడి చేసినదంతా పాడు చేసుకుందంటూ.. నా గదంతా గలభా గలభాగా ఉన్నా.. మా వాళ్లంతా గోలగోలగా ఎవరిపాటికి వారే మాట్లాడుతున్నా నాకు వాళ్ల ధ్యాసే పట్టలేదు. నా దృష్టంతా నా మంచం దగ్గర నిలబడి నన్నే చూస్తూ, చిన్నగా సకిలిస్తున్న నా గాడిదపిల్లపైనే ఉండిపోయింది. నేను చేతులు చాచి బూడిదరంగులో ముద్దొస్తున్న దాని ముఖాన్ని చుట్టేశాను. దాని స్పర్శకి నా ఒళ్లు పులకరించింది. అదెంత మెత్తగా ఉందంటే పట్టుకాయలంత మృదువుగా, అప్పుడే పుట్టిన కుక్కపిల్లంత మెత్తగా, సముద్రతీరాన ఏరుకొనే గులకరాళ్లంత నున్నగా.. ఇవే కాకుండా పట్టుకుంటే జారిపోయే చెట్లమీది కప్పలూ గుర్తొచ్చాయి. నేనలా దాని స్పర్శానందాన్ని అనుభవిస్తూ పక్కకు చూసేసరికి పాపం! లెస్లీ తన ప్యాంట్ పైకి లాక్కొని తన మోకాలిపై లేచిన బొబ్బను చూసుకుంటున్నాడు. అప్పుడు అమ్మ మా దగ్గరగా వచ్చి ‘‘నాన్నా గేరీ! నీకు ఇది నచ్చిందా?’’ అని అడిగింది. నా కళ్లు పైకెత్తి మా అమ్మ మొహంలోకి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాను. బహుశా నా మౌనమే మా అమ్మకు నాకదెంతో నచ్చిందన్న విషయం తెలిపిందనుకుంటా. ఆ గాడిదపిల్ల మంచి ముదురు గోధుమవర్ణంలో ‘చాక్లెట్’, ‘ప్లమ్’ రంగులో మంచి ఆకర్షణీయంగా ఉంది. దాని పెద్దపెద్ద చెవులు చూస్తుంటే బాగా విచ్చిన లిల్లీపూలు గుర్తొస్తున్నాయి. మరి దాని బుల్లిబుల్లి గిట్టలేమో డాన్సర్స్ బూట్లలా మెరిసిపోతున్నాయి. ఆ గిట్టపై నుంచి మోకాళ్లదాకా తెల్లని సాక్సులు తొడిగినట్లు దాని బొచ్చు, ఇక దాని వీపుపైన చూశారూ.. వెడల్పాటి నల్లని శిలువ ఆకారంలో ఉన్న మచ్చను చూస్తుంటే అది క్రీస్తును మోసుకుంటూ జెరూసెలం వెళ్లిందా అని అనిపించక మానదు. ఇంకా మిలమిలలాడే దాని కళ్ల చుట్టూ తెల్లని వలయాలు అదెక్కడి నుంచి వచ్చిందో ఇట్టే చెప్పేస్తున్నాయి... అదే... ‘గస్టోరి’ గ్రామం నుంచే అని. నేను దాన్నలాగే అపురూపంగా చూస్తుంటే, మార్గో నాకు చెబుతోంది. ‘‘నీకు కాథరీనా గాడిద గుర్తుంది కదరా! ఇది దానిపిల్లే!’’ అంటూ. ఈ పరిచయం నా గాడిదపిల్లను ఇంకాస్త ప్రత్యేకంగా మార్చేసింది. దాన్నక్కడ చూస్తుంటే అది సర్కస్‌లో నుంచి పారిపోయి వచ్చినట్లు కనబడుతోంది. దానికి ఆకలేసింది కాబోలు, అది దాని మొహం మీదికి వేలాడుతున్న రంగు కాగితాలను నోట్లో పెట్టుకుని అమాయకంగా నములుతోంది. ఇక నేను ఉండబట్టలేక పక్క మీద నుంచి కిందకు ఒక్క దుముకు దుమికాను. ఇక హడావుడిగా అమ్మనడిగాను దాన్నెక్కడుంచాలని. కచ్చితంగా ఇంట్లో అయితే కుదరదు కాబట్టి. దానికి అమ్మ ‘‘అందుకోసమే కదరా కోస్టాస్ ఇల్లు కట్టిందీ!’’ అంటూ తేల్చి చెప్పింది నవ్వుకుంటూ. నా ఆనందాన్ని అదుపులో పెట్టుకుంటూ అనుకున్నాను ‘‘మా అమ్మ నాకోసం ఎంత జాగ్రత్త తీసుకుందో! నన్ను సంతోషపెట్టడానికి నా కుటుంబమంతా ఎంత కష్టపడ్డారో కదా! ఎంత మంచి కుటుంబం ఉందో కదా నాకు... పాపం ఈ విషయాన్ని నా దగ్గర దాచి నన్ను ఆశ్చర్యపరచడానికి ఎంత కష్టపడ్డారో కదా! పాపం మార్గో ఎంతో ఇష్టంగా దాన్ని అలంకరించినట్లుంది’’ అనుకుంటుంటే... వాళ్లకి నా మీద ఉన్న ప్రేమకు నాకెంతో సంతోషం కలిగింది. అలా అనుకుంటూ నా గాడిదపిల్ల వంక చూస్తే ఎంతో సున్నితమైన, నాజూకైన చైనా పింగాణీ వస్తువులా తోచింది. ఇక దాన్ని చాలా నెమ్మదిగా, సుకుమారంగా తీసుకుని ఆలివ్తోట వైపు దారితీశాను. నెమ్మదిగా దాన్ని ముచ్చటగా ఉన్న ఆ చిన్ని వెదురింట్లోకి తీసుకెళ్లాను. ఆ వెదురింట్లో నా ముద్దుల గాడిదపిల్ల చాలా అద్భుతంగా అనిపించింది. ఆ కుటీరం దానికంటే కొంచెం పెద్దదిగా ఉంది. మళ్లీ దాన్ని ఆ కుటీరం నుంచి బయటకు తీసుకొచ్చి కొంచెం పెద్ద తాడుతో స్వేచ్ఛగా తిరగడానికి వీలుగా దాని మెడకు ఏమాత్రం ఒరుసుకోకుండా జాగ్రత్తగా కట్టేశాను. అది నడకరాని దానిలా ఊగుతూ, అటూ ఇటూ తిరుగుతూ, చిన్నగా గడ్డిపరకలు కొరుకుతూ.. నోరాడిస్తుంటే... దాన్నే చూస్తూ ‘‘ఇది కలా! నిజమా!’’ అన్న మీమాంసతో ఉండిపోయాను. దాన్ని తృప్తిగా చూస్తున్న సమయాన మా అమ్మ టిఫిన్ తినడానికి రమ్మంటూ కేకేసింది. నా కళ్లకది ఈ కోర్ఫూదీవి మొత్తానికీ అందగత్తెలా కనిపించింది. దాన్ని ‘శాలీ’ అని పిలుచుకుందామనుకున్నా. అయితే, దానికేమీ ప్రత్యేకమైన కారణమేం లేదు. టిఫిన్ చెయ్యడానికి ఇంట్లోకి వెళుతూ దాని ముఖాన్ని దగ్గరగా తీసుకుని పట్టులా మెత్తగా ఉన్న దాన్ని ముద్దాడాను. ఇంగ్లిష్ మూలం : గెరాల్డ్ డ్యూరెల్ అనువాదం: చిలకమర్తి పద్మజ -
ఒక ఖైదీ ప్రేమకథ
దొంగతనానికి ఇంట్లో జోరబడ్డాడని కేసు పెట్టి, అతడికి ఒక్క సంవత్సరం శిక్ష వేశారు. కోర్టులో ఆ ముసలివాడి ధోరణీ, నేరం జరిగిన పరిస్థితులూ వింతగా తోచినందున ఖైదీని చూడడానికి అనుమతిని సంపాదించాను. మొట్టమొదట్లో అయితే నీతో నాకేమిటి పొమ్మన్నాడుగాని, చాలా అనునయించిన తర్వాత, తన జీవితకథను చెప్పడానికి అంగీకరించాడు. ‘‘మీ ఊహ నిజమే. నేను బ్రతికి చెడినవాణ్ణి. బాగా చదువుకున్నాను. ఇంజనీరింగ్ నా వృత్తి. కుర్రతనంలో చేతిలో కాస్తో కూస్తో పైసా ఆడుతూ ఉండేది. అది పెట్టి సరదాగా బతుకుతూవుండేవాణ్ణి. ప్రతిసాయంత్రం తప్పకుండా విందుకుగాని, డాన్సుకుగాని పోతూ వుండేవాణ్ణి. రాత్రి అయ్యేసరికి తప్పతాగి ఈ లోకంలో వుండేవాణ్ణికాదు. ఆరోజు నాకు మహాజ్ఞాపకం. అప్పటి అతిసామాన్య విషయాలు సైతం పూర్తిగా గుర్తున్నాయి. అయినా, నా స్మృతిపథంలో కొంత వెలితి ఉంది. దాన్ని పూడ్చుకోవడానికి నా క్షుద్ర జీవిత శేషాన్ని వినియోగిస్తాను. నైనాతో సంబంధం వున్న ప్రతి విషయాన్నీ జ్ఞాపకం తెచ్చుకోవాలనే నా యత్నం. ఆవిడ పేరు నైనా. సందేహం లేదండీ, నైనాయే ఆవిడ పేరు! నైనా భర్తకు రైల్వేలో చిన్న ఉద్యోగం. వాళ్ళు పేదవాళ్ళు. అయితేనేమి? తన బుద్ధిసూక్ష్మత కొద్దీ దారిద్య్రముద్రాంకితులైన స్వీయజీవితపరిసరాలను నైనా సుమధురం చేసుకునేది. ఇంటి పనులన్నింటినీ స్వయంగా చక్కబెట్టుకునేది. అయినా, నైనా చేతులు పల్లవకోమలంగా వుండేవి. అతి సామాన్యమైన దుస్తులు ధరించేది. అయినా అవి స్వప్నజగత్తును స్ఫురింపజేసేవి. మీరు నమ్మండి, నమ్మకపోండి ఈ ప్రపంచం కూడా ఆమె సన్నిధానంలో స్వర్గతుల్యం అయ్యేది. నేను సైతం ఆవిడ పరిచయం ఏర్పడ్డ తర్వాత కొత్తవాణ్ణి అయిపోయాను. ఆ పుణ్యమూర్తి సందర్శన భాగ్యం వల్ల నాలోని మాలిన్యం తొలిగిపోయింది. ‘ఈ దౌర్భాగ్యుణ్ణి ప్రేమించిన పాపం ఆవిడకు చుట్టకోకుండా వుండాలి! దుర్భరమైన పరిసరాలలో, మొరటు మానవుల మధ్య బతుకుతూ వున్న నైనా, అందచందాలు, యవ్వనమూ వున్న నన్ను, ఎన్నో ప్రేమగీతాలు కంఠస్థంగా వచ్చిన నన్ను...ప్రేమించకుండా వుండలేకపోయింది. ఎప్పుడు, ఎక్కడ, ఏవిధంగా నాకు ఆవిడతో ప్రథమ పరిచయం కలిగిందో చెప్పమంటే సరిగా చెప్పలేను. విస్తృతి తమస్సును చీల్చుకుని, ఒకదానితో ఒకటి సంబంధం లేని ఆవిడ జ్యోతిర్మయ చిత్రాలు మాత్రం నాకు కనబడుతూ వుంటాయి. ఇదిగో చూడండి.. సంతోషంగా, ఆనందంగా వుంది. తన్మయత్వంలో నాటకాన్ని చూస్తూవుంది. నాపై దరహాస మధువు చిలుకుతూ వుంది... ఆ దరహాసం నాకు బాగా జ్ఞాపకం. ఆ తర్వాత ఇద్దరమూ కలిసి ఎక్కడికో వెళ్లాము. ఆవిడ నా ముఖంలో ముఖం పెట్టి ‘నాకు తెలుసు, నా ఈ సుఖస్వప్నం త్వరలోనే తెగిపోతుంది. అయినా జీవించాననే సంతృప్తి మిగులుతుందిగా! అంతేచాలు’ అని అంది. ఈ మాటలు నాకు బాగా గుర్తు. కాని ఆ తరువాత ఏంజరిగిందో తెలియదుగానీ, నైనాతో కలిసి వుండగానే ఇదంతా జరిగిందా అని అడిగితే మాత్రం ఖండితంగా ఏమిచెప్పలేను. సందేహం లేదండి, నేనే నైనాను పరిత్యంజించాను. ఇది నా దృష్టికి అతి సహజంగా కనబడింది. అప్పటి నా స్నేహితులందరూ సరిగ్గా ఇలాగే ప్రవర్తించేవారు. ఎవతో ఒక వివాహితతో నాలుగురోజుల పాటు కులాసాగా గడపడం, ఆ తర్వాత ఆవిణ్ణి తోసిపారవెయ్యడం! అందరిలా నేను కూడా నడుచుకున్నాను. తప్పు చేస్తున్నాను కదా అని అప్పటిలో నాకు తోచనైనా లేదు. డబ్బు దొంగిలించడం, అప్పులు ఎగవెయ్యడం, సి.ఐ.డీగా పనిచెయ్యడం తప్పుగాని, ప్రేమించిన వనితను పరిత్యజించడం మామూలే! నా జీవితం, నా భవిష్యత్తు వదులుకుని, ప్రేమాగీమా అంటూ ఎవర్తెనో ఒకర్తెను కనిపెట్టుకుని వుంటానా? తెగతెంపులు చేసుకుపోవడం నిజంగా బాధగా అనిపించింది. అయినా గుండె రాయి చేసుకున్నాను. నైనా భర్తకు దక్షిణాదికి ఎక్కడికో బదిలీ అయ్యిందనీ, అక్కడికి వెళ్లిన కొద్దిరోజులకే ఆవిడ చనిపోయిందని విన్నాను. అయితే, నైనాతో గడిపిన ఆ రోజులు జ్ఞాపకం వస్తే అతి బాధాకరంగా వుండేది. అంచేత, ఆవిణ్ణి గురించిన వార్తలు నా చెవిన పడకుండా తప్పించుకు తిరిగేవాణ్ణి. ఆవిణ్ణి గురించి ఆలోచించకుండా వుండాలని కూడా ప్రయత్నించేవాణ్ణి. ఆవిడ బొమ్మను దేన్నీ దగ్గర వుంచుకోలేదు. ఆవిడ రాసిన ఉత్తరాలను తిరిగి ఆవిడకే ఇచ్చేశాను. మమ్మల్ని పరస్పరం ఎరిగున్న మిత్రులు ఎవ్వరూ లేరు. ఈ కారణాల వల్ల నైనా చిత్రం క్రమక్రమంగా నా హృదయఫలకం నుంచి చెరిగిపోయింది. ఈ చోద్యం విన్నారా? క్రమక్రమంగా నైనాను నేను మరిచిపోయాను! ఆవిడ ముఖాన్నీ, ఆవిడ పేరునూ అన్నింటిని మరిచిపోయాను. ఆవిడ నా హృదయకవాటాలను తెరుచుకొని, అసలు ఎన్నడూ లోనికి తొంగైనా చూడనట్లే అయిపోయింది. ఇంత సంపూర్ణంగా విస్మరించగల తన శక్తిని చూసుకుని పురుషుడు నిజంగా సిగ్గు పడాలి సుమండీ! సంవత్సరాలు దొర్లిపోయాయి. నా వృత్తిలో ఎలా ప్రవేశించానో, ఎలా నెగ్గుకు వచ్చానో...ఆ వివరాలు మీకు అనవసరం. నైనా లేకపోయిన తర్వాత లౌకికవ్యవహారాల్ని గురించి, ధనార్జన్ని గురించీ మాత్రమే నా కలలన్నీ! ఒక సమయంలో నేను ఆశించిన విజయాన్ని దాదాపుగా పొందాను కూడా! వేలకు వేలు ఖర్చుపెట్టగలిగాను. విదేశ పర్యటన సైతం చెయ్యగలిగాను. వివాహం చేసుకున్నాను. సంతానం కూడా కలిగింది. ఆ తర్వాత చేపట్టిన ప్రతిపనీ మసికాసాగింది. వేసిన ప్లానులన్నీ తప్పిపోయాయి. భార్య చనిపోయింది. ఒంటిగాణ్ణి. పిల్లల్ని సాకలేక, వాళ్లను బంధువుల పైకి తోలివేశాను. వాళ్లు బతికి బట్టకట్టిందీ, లేందీ అయినా నాకు తెలియదు. నా అంతటి పాపాత్ముడు మరి వుండబోడుకదండీ! తర్వాత నేనేమి చేసింది వేరే చెప్పాలా? తప్ప తాగేవాణ్ణి...ఏజెన్సీ అంటూ ప్రారంభించాను. కాని దాని వల్ల ఏమీ లాభించలేదు. అప్పటికి మిగిలి వున్న కొంచెం ధనాన్ని, శక్తినీ అది మింగివేసింది. వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలనీ, తిరిగి పూర్వస్థితికి రావాలనీ జూదానికి దిగాను. దానిలో అబ్బింది ఏమిలేదు సరికదా, జైల్లో పడవలసిన యోగం కొద్దిలో తప్పిపోయింది. ఉన్న స్నేహితులు మోసం చేశారు. అక్కడి నుంచి అథఃపతనం ప్రారంభం! నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు మీరు వచ్చి చూశారే, ఈ స్థితికి దిగజారాను. ఉన్నత సంఘంలో నుంచి ఈ అగాథంలోకి తలకిందులుగా పడిపోయాను. కుళ్లు బట్టలతో ఉండే నేను ఏ మొహం పెట్టుకుని నలుగురిలో తిరగ్గలను? ఇటీవల కొన్ని సంవత్సరాల పాటు, తాగుడు లేని రోజుల్లో అప్పుడప్పుడూ ఫ్యాక్టరీలలో కూలీ చేస్తూ వచ్చాను. ఇలా కూలి చేస్తూ వుండగా, పురుగు తొలిస్తే చాలు, తిరిగి నేనూ నా తాగుడూ తయ్యార్. ఈ స్థితిలో వుండి కూడా నా పరిచయాల్ని చూస్తే నాకు అసహ్యమే! హఠాత్తుగా ఎప్పుడో అదృష్టచక్రం తిరుగుతుందనీ, తిరిగి సంపన్నుడనౌతాననీ కలలుగంటూ వుండేవాణ్ని. ఆకాశం నుంచి ఏదైనా వారసత్వం ఊడిపడుతుందనీ, ఇలాంటిదే మరేదైనా విచిత్రసంఘటన జరుతుందనీ ఊహలు పోతూవుండేవాణ్ణి. సరే, ఒకనాడు ఆకలిదప్పులతో నకనకలాడుతూ...అలా ఎందుకు వెడుతున్నానో కూడా తెలియకుండా ఒక పెరట్లోకి వెళ్లాను. వెళ్లేసరికి...‘ఇదిగో అబ్బీ! తాళాలు బాగు చేసేవాడివా?’ అని వంటమనిషి అడిగాడు. ఔనన్నాను. ఆ ఇంటి వారి రైటింగ్ టేబుల్ తాళం చెడిపోయింది, దాన్ని బాగు చేసేవాడు కావలసి వచ్చాడు. ఆ గది చిత్రపటాలతో, ఇతర అలంకారాలతో శోభయమానంగా ఉంది. పని ప్రారంభించి రిపేర్ పూర్తి చేశాను. ఇంటి ఇల్లాలు ఒక రుబుల్ ఇచ్చింది. డబ్బు చేతిలో వేయించుకున్నానో లేదో చిన్ని తెల్లటి పీఠం మీద పెట్టి ఉన్న స్ఫటికవిగ్రహం నాకంటబడింది. ఎంచేతనోగాని వెంటనే తలతిరిగినట్టయ్యింది. రెప్ప వాల్చకుండా అలాగే చూశాను. చూసి, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను...నైనా!! నైనాను పూర్తిగా మరిచిపోయానని ఇదివరకే మనవి చేశాను కదా! అయితే ఆవిణ్ణి మరిచిపోయిన సంగతిని మొట్టమొదటిసారిగా గ్రహించినది ముఖ్యంగా అప్పుడే! ఆ క్షణంలోనే! ఒక్కసారిగా ఆవిడ అమృతమూర్తి నా మనోనేత్రం ఎదుట ప్రత్యక్షమైంది. నిద్రాణాలై, నిర్జీవాలై వున్న తలపులు, స్వప్నాలు, భావనలు ఒక్కుమ్మడిగా తిరిగి లేచాయి. జీవించాయి! ఆపాదమస్తకం కంపించిపోతూ ఆ స్ఫటిక విగ్రహానికి కళ్ళు రెంటినీ అప్పగించి, ‘అమ్మా! అది ఎవరి ప్రతిమో అడగవచ్చునా?’ అని వినయపూర్వకంగా ప్రశ్నించాను. ‘అదేనా? అది అమూల్యమైంది. అయిదువందల సంవత్సరాల క్రితం, పదిహేనో శతాబ్దిలో దాన్ని చెక్కారు. చెక్కిన వాడి పేరు కూడా ఆవిడ చెప్పింది. కాని, సరిగ్గా వినబడ లేదు. ఆవిడ భర్త దాన్ని ఇటలీ నుంచి తెచ్చాడట. దాన్ని గురించి ఇటాలియన్, రష్యన్ ప్రభుత్వాల మధ్య చాలా ఉత్తరప్రత్యుత్తరాలు కూడా నడిచాయట. అయితే ఈ విగ్రహం నీ మెప్పు పొందినట్టుందే! ఖర్మం!’ అంటూ ఆవిడ చరచర వెళ్ళిపోయింది. ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాడిలా బయటికి వచ్చి పడ్డాను. ఇది వట్టి పోలిక కాదు. కేవలం అచ్చు! అంతేకాదు దాన్ని స్ఫటికశిలలో పునఃసృష్టి చెయ్యడం! నేను ఎరిగున్న ఆ స్త్రీ వదనబింబాన్ని పదిహేనో శతాబ్దంనాటి శిల్పి ఏ విధంగా సృష్టించగలిగాడో మీరు రవ్వంత చెప్పలగలరా? అచ్చంగా ఒక మాదిరినే ఉండే స్త్రీలు, ఒకరు పదిహేనో శతాబ్దంలోనూ, ఒకరు మన జీవితకాలంలోనూ వుండడం ఎలా సాధ్యం? ఏమీ సందేహం లేదు. శిల్పి చెక్కిన ఆ స్త్రీ నైనాయే! ఇద్దరూ సరిగ్గా ఒక్కటే! ఈ పోలికలు బాహ్యాకృతిలోనే కాదు...ప్రవృత్తిలోనూ, అంతరంగంలోను కూడా! ఆరోజు నా జీవితాన్ని మార్చివేసింది. నా పూర్వజీవితంలోని నైచ్యాన్నీ, నా పతనం యొక్క పరిమితినీ గ్రహించాను. పరమేశ్వరుడు నైనా అనే దేవతను పంపిస్తే, ఆవిణ్ణి గుర్తించలేకపోతినిగదా! అని తెలుసుకున్నాను. గతించినదానికి వగచి లాభం లేదు. అంచేత, అమూల్యమైన పుష్పధామం పగిలిపోతే, ఆ ముక్కల్ని చేర్చుకునేవాడిలా నైనా స్మృతి ఖండాలను పోగు చేసుకోవడం ప్రారంభించాను. అబ్బో! ఆ స్మృతిఖండాలు ఎంత స్వల్పం! ఎన్ని విధాల ప్రయత్నించినా, సంపూర్ణకృతి కుదర్నేలేదు. అన్నీ ముక్కలు, పెంకులు! కాని, వాటితోనే నా భావనావీధిలో కొత్తకొత్త ఆకృతుల్ని కల్పించుకోగలిగినప్పుడు ఎంత పొంగిపోతూవుండేవాణ్ణి! వీటిని గురించి ఆలోచిస్తూ, వీటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ గంటలకొద్దీ అలా గడిపి వేసేవాణ్ణి! నన్ను చూసి ప్రజలు నవ్వేవారు. కాని నా ఆనందం వారికేమి తెలుసు? నేను ముసలివాడినైపోయాను. తిరిగి జీవితాన్ని ప్రారంభించలేను. కాని, కనీసం నా అంతరాత్మ మాలిన్యాన్ని అయినా కడిగి వేసుకోలేకపోతానా? ఎలాగైనా సరే, ఇంకొక్కసారి ఆ శిలావిగ్రహాన్ని చూడాలనే కోరిక కలిగింది. ఆ ఇంటి చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేశాను. కిటికీలకు దూరంగా పెట్టారు ఆ విగ్రహాన్ని. అంచేత అది ఎన్నడూ నా కంట బడలేదు. ఎన్నో రాత్రులు ఆ ఇంటి ముందు గడిపేశాను. అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారో ఏయే గది ఎలా వుంటుందో అంతా నాకు తెలుసు. ఇంటి నౌఖర్లలో ఒకడితో స్నేహం కూడా చేశాను. వేసవిలో ఇంటి ఇల్లాలు బంధుమిత్రులను చూసి రావడానికి కాబోలు వెళ్లింది. అప్పటికి నా ప్రగాఢవాంఛను ప్రతిఘటించలేకపోయాను. ఇంకొక్కసారి నైనా విగ్రహాన్ని చూడగలిగితే సర్వం జ్ఞాపకం తెచ్చుకోగలననిపించింది. అలా జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ఇక నా జీవితం తరించినట్టేగా! అంచేత, నన్ను ఏ పనికైతే శిక్షించారో దాన్ని చెయ్యడానికి నిర్ణయించుకున్నాను. నా ప్రయత్నంలో నెగ్గలేక పోయానన్న సంగతి మీకూ తెలుసు! హాల్లో పట్టుకున్నారు. తాళాలు బాగు చేసేవాడిననే నెపంతో మొదట్లో ఇంట్లోకి వచ్చానని, తర్వాత ఇంటి చుట్టూ పదేపదే తిరిగాననీ, చివరకు ఎవ్వరూ లేకుండా చేసి తాళం పగలగొట్టి...ఏమైతేనేమి లెండి...కథ కంచికి వెళ్లింది! ‘‘అలా అంటే కాదు! మేము నీ తరపున అప్పీలు చేస్తాము. నిన్ను తప్పకుండా వదిలివేస్తారు’’ అని నేనన్నాను. ‘‘వృథా శ్రమ ఎందుకు బాబూ!’’ అని ముసలివాడు అభ్యంతరం చెప్పాడు. ‘‘నాకు జైలు ప్రాప్తి అయిందిగదా’’ అని ఏడ్చేవాడు. ఎవ్వడూ లేడు. పైగా, నాకు జామీను ఎవ్వరుంటారు? ఇంతేకాకుండా నైనా స్మరణ చెయ్యడానికి బయట వుంటే ఎంతో, జైల్లో వున్నా అంతే! ఇందుకు ఏమి జవాబు చెప్పాలో నాకు తోచలేదు. ఇంతలో ముసలివాడు విలక్షణమైన తన శుష్కనేత్రాలతో నన్ను తదేకంగా చూస్తూ ఇలా అన్నాడు: ‘‘ఒక్క సందేహమే నన్ను బాధిస్తుంది. నైనా అంటూ అంటూ అసలు ఒకవ్యక్తి లేదేమో! తాగుడు వల్ల కలిగిన మతిభ్రమణ కారణంగా, ఆ శిలావిగ్రహాన్ని చూసిన క్షణంలో ఈ ప్రణయగాథ అంతా నా పుర్రెలో పుట్టిందేమో!!’’ రష్యన్ మూలం : వెలెరీ బ్రూసోవ్ తెలుగు: నార్ల వెంకటేశ్వరరావు -
ఓహో! అదా విషయం!
సకల విఘ్నాలు తొలిగించే వినాయకుడు కాసింత విచారంగా కూచున్నాడు. ఆరేళ్ళ ధన్వి వంక చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదు. ధ్వన్వి మెల్లిగా వినాయకుడి దగ్గరికి వచ్చింది. ఆ ఇంట్లో పూజగదిలో ఒక వినాయకుడు హాలులో ఒక వినాయకుడు వున్నాడు. హాలులో వున్న వినాయకుడు మట్టి వినాయకుడు. వినాయకచవితికి అందరూ రంగురంగుల ప్లాస్టర్ అఫ్ పారిస్‌తో చేసిన వినాయకులను తెస్తుంటే ధన్వి తండ్రితో గొడవపడి మట్టివినాయకుడినీ అదీ మట్టి వినాయకులను తయారుచేసే వారి దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎలా తయారుచేస్తున్నారో చూసి తనే తన చిట్టి చేతులతో తయారుచేసి తెచ్చుకుంది. అంతే కాదు ఆ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తానంటే ఒప్పుకోలేదు. అలా ఆ వినాయకుడిని హాలులో పెట్టుకుని రోజూ స్కూల్‌కు వెళ్లేప్పుడు దండం పెట్టుకుని పెరట్లో పూసిన పువ్వులు పెట్టి వెళ్ళేది..ఉండ్రాళ్ళు చేసినా నైవేద్యం పెట్టి వెంటనే తినేయకుండా ఒక పూటంతా పెట్టి ఆకలితో వుండేవాళ్ళకు ప్రసాదంగా పెట్టేది. దానితో వినాయకుడికి బోల్డు ముచ్చటేసి ధన్వితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఒకరోజు పొద్దున్నే తన మట్టిప్రతిమను తుడుస్తుంటే ధన్వి చేయి వినాయకుడి కన్నుకు తగిలింది.. వెంటనే ధన్వి వినాయకుడికి ‘సారీ’ చెబుతూ ‘ఉఫ్ ఉఫ్’ అంటూ ఊదింది, తన చేయి తగిలిన వినాయకుడి కంటికి తగిలిన దెబ్బ నొప్పి తగ్గాలని. ‘థాంక్యూ ధన్వి’ అన్నాడు వినాయకుడు ధన్వికి అర్ధమయ్యే భాషలో. ‘ఎవరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?’ అడిగింది ధన్వి. ‘ కైలాసం నుంచి ..’ ‘అక్కడెవరున్నారు...ఇంతకూ మీరెవరు?’ ‘నేను వినాయకుడిని ...రోజూ నన్ను పూజించి వీలైనప్పుడల్లా ఉండ్రాళ్ళు పెట్టి వెంటనే తినేయకుండా.. ఆకలితో వున్నవారికి పెడతావుగా...కైకైలాసంలో మా అమ్మ పార్వతీదేవి, నాన్న పరమశివుడు వున్నారు కదా.. వాళ్ళ బిడ్డను... నా గురించి పుస్తకాల్లో చదువుకోలేదా?’ ధన్వి కళ్ళు పెద్దవి చేసి ‘మీరు లార్డ్ వినాయకులా... నిజమా..ప్రామిస్’ అంది తన చేతిని మట్టి విగ్రహం ముందు చాచి... వీనుల విందుగా తల్లి చిన్నప్పుడు నేర్పిన వినాయకస్తోత్రం చదువుతూ... వెంటనే మట్టి విగ్రహంలో వున్న చేయి ముందుకు కదిలింది కరచాలనం చేస్తున్నట్టు... ‘ఓహ్ మై గాడ్ ’ అంది గుండెల మీద చేయివేసుకుని. ‘అవును నేను మీ గాడ్‌ను’ వినాయకుడు అన్నాడు. ‘మరి ఎవరికీ కనిపించకుండా నాకే ఎందుకు కనిపిస్తున్నారు...?’ డౌట్‌తో అడిగింది. ‘అందరూ నన్ను వాళ్ళ కోరికలు తీర్చమని మొక్కుతారు..పూజ కాగానే నేను తిన్నానో లేదో ఆలోచించకుండా నైవేద్యాన్ని తీసేసుకుంటారు...నువ్వు మాత్రం ఏ వరమూ కోరుకోవు. భక్తితో పూజ చేస్తావు, నా విగ్రహాన్ని శుభ్రం చేస్తావు. రోజూ పలకరిస్తావు. అందరిలా రంగురంగుల విగ్రహాలు కాకుండా మీ పెరట్లోని మట్టితో నీ చిట్టి చేతులతో నన్ను తయారు చేస్తావు. నన్ను నీళ్లలో నిమజ్జనం చేయకుండా పూలకుండీలో నా విగ్రహాన్ని తడిపి తిరిగి మట్టిగా మార్చి పూలమొక్క నాటి.. పూలు పూచిన తరువాత ఆ పూలను నాకు భక్తితో సమర్పిస్తావు. రోజూ నేను అడగక ముందే నా విగ్రహం దగ్గర కూచోని కబుర్లు చెబుతావు... తిన్నావా అంకుల్? అని అడుగుతావు... అందుకే నీకు వినిపిస్తున్నాను.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు...’ అన్నాడు. అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ రోజు ధన్వి విచారంగా సీరియస్‌గా వుంది. ధన్వి లేచి వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చి ‘నేను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయలేదు. ఉదయం నుంచి అలిగాను... దగ్గరికి పిలిచి ఏమైంది ధన్వి ఫ్రెండ్? అని అడగొచ్చు కదా...’ ఉక్రోషంగా అడిగింది. ‘నువ్వు అలిగావా? నువ్వు సీరియస్‌గా వున్నావు కదా అని అడగలేదు... నాక్కూడా ఇవ్వాళ బ్రేక్‌ఫాస్ట్ లేదు. నువ్వు అలిగావని నేను భక్తులు పెట్టిన ఉండ్రాళ్ళు తినలేదు’ అన్నాడు. ‘మరి నేనెందుకు అలిగానో అడగనేలేదు?’ అంది ధన్వి. ‘ఎందుకు ఫ్రెండ్?’ తెలిసే అడిగాడు విఘ్నేశ్వరుడు ‘స్కూల్లో మా మిస్ హోమ్‌వర్క్ ఎక్కువ ఇస్తుంది.. బుక్స్ వీపు మీద మోస్తుంటే వీపు నొప్పెడుతుంది. మమ్మీ డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించడం లేదు. నువ్వు ఎంచక్కా పార్వతమ్మ ఒళ్ళు కూచోని ఉండ్రాళ్ళు తింటావు.. స్కూల్లో ప్రతీ చిన్న విషయానికి పనిష్ చేస్తున్నారు. అందుకే బాధేసింది. పేరెంట్స్‌కు అర్థం కాదు. టీచర్స్‌కు అర్థం కాదు.. మరి మేము ఎవరికీ చెప్పాలి...?’ అడిగింది ధన్వి. ‘మరిప్పుడు నీ బాధ పోవాలంటే నువ్వు అలక మానాలంటే నేను ఏం చేయాలి ఫ్రెండ్ ?’ ‘ఒకసారి మా పుస్తకాలు వీపు మీద మోసి చూడు.. హోమ్‌వర్క్ చేసి చూడు... మా మమ్మీ దగ్గర డాడీ దగ్గర ఉండి చూడు... తరువాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం...సారీ... నిన్ను నానా మాటలు అంటున్నాను’ లెంపలేసుకుంటూ అంది గడుగ్గాయి ధన్వి. వినాయకుడు నవ్వుకున్నాడు. ‘నువ్వు ఎలుక అంకుల్‌తో బుక్స్ మోయించకూడదు.. హోమ్‌వర్క్ మ్యాజిక్‌తో పూర్తి చేయకూడదు’ షరతులు వర్తిస్తాయి అన్నట్టు చెప్పింది. వినాయకుడు సరే అన్నాడు నవ్వాడు. ఆ నవ్వులో లోకకల్యాణం వుంది. పొద్దున్నే వినాయకుడు కైలాసం నుంచి తరలివచ్చి...« దన్వి స్కూల్ బ్యాగ్‌ను వీపు మీద మోసుకుని స్కూల్‌కు వెళ్ళాడు. దేవుడిగా తన శక్తులు వదిలిన వినాయకుడు సాక్షాత్తు ధన్వి స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని నడుస్తున్నాడు. తన శక్తులు వదిలి తాను ధన్విలోకి మారిపోవడం వల్ల పుస్తకాల బరువుకు వీపు నొప్పిగా అనిపించింది. ధన్వి వినాయకుడి పక్కనే నడుస్తూ వినాయకుడిని చూస్తోంది. ‘పాపం ..’ అనిపించింది. వెంటనే లెంపలు వేసుకుని ‘వద్దులే అంకుల్ నీకు నొప్పెడుతుంది.. బ్యాగ్ నేను మోస్తాను’ అంది. ‘వద్దు చిట్టితల్లీ నేను వరం ఇచ్చాక మాట ఇచ్చాక తిరుగు ఉండదు’ అన్నాడు నడుస్తూనే. వినాయకుడు ధన్వికి తప్ప మరెవరికీ కనిపించడం లేదు. అందరూ ధన్వి తనలో తానే మాట్లాడుకుంటుదేమో అనుకున్నారు. ‘చాలా బరువుగా అనిపించింది.. చిట్టి పాపలు ఇంత బరువు ఎలా మోస్తున్నారో అనిపించింది... స్కూల్లో హోమ్‌వర్క్ ఇచ్చారు... హోమ్‌వర్క్ చేస్తుంటే ప్రాణం పోతోంది.. చేతులు నొప్పెడుతున్నాయి.. ఇంటికి రాగానే ధన్విలోకి మారిపోయాడు వినాయకుడు. బిజీగా ఆఫీస్ నుంచి వచ్చిన తల్లి ఫ్రిజ్‌లో వున్నవి తినమన్నది కూతురిని.. తండ్రి అలిసిపోయి వచ్చి పడుకున్నాడు. పొద్దున్నే నిద్రమొహంలోనే ధన్విని నిద్ర లేపుతుంటే ధన్విలోకి మారిపోయిన వినాయకుడికి నిద్ర ముంచుకు వస్తుంది. మళ్ళీ పుస్తకాల మోత.. హోమ్ వర్క్.. స్పెషల్ క్లాసెస్... అలా ఒకేసారి ప్రతిబిడ్డ బాల్యంలోకి వెళ్లి చూశాడు. భూమ్మీద చిన్నారులు పడుతున్న కష్టాలు చూసి కైలాసం వెళ్లి తల్లికి చెప్పాడు. వినాయకుడి ముందు నిలబడింది ధన్వి. తన మొహంలో ఆనందం వుంది. మొహం ఫ్రెష్‌గా ఉంది.. ఎందుకంటే ధన్వి చేయవల్సినవన్నీ వినాయకుడే చేశాడు కాబట్టి... ఆ బాధలు వినాయకుడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి. ‘సారీ అంకుల్ మీ మొహం వాడిపోయింది... రేపటి నుంచి నా హోమ్ వర్క్ నేనే చేస్తాను.. నా పుస్తకాలు నేనే మోసుకుంటాను.. మీరు దేవుడుగా... కష్ట పడకూడదు.. చేసిన తప్పుకు గుంజీలు తీస్తాను’ అంటూ గుంజీలు తీయబోతుంటే– ‘వద్దు నువ్వు నీ ఫ్రెండ్స్ అందరికోసం నీలాంటి పిల్లల కోసం నువ్వు ఆలోచించావు.. మీ బాల్యం అందంగా ఉండాలంటే ఏం చేయాలో దేవుడిగా నేను చేసి చూపిస్తాను’ అన్నాడు వినాయకుడు. ‘ఎలా అంకుల్?’ ఉత్సహంగా అడిగింది ధన్వి ‘రేపటి నుంచి మీరు పుస్తకాలు మోస్తారు.. మీ పుస్తకాల బరువు మీ టీచర్స్ మీద పడుతుంది... మీరు హోమ్ వర్క్ చేస్తారు.. మీతో హోమ్ వర్క్ చేయించిన టీచర్స్ చేతులు నొప్పెడుతాయి... ఇంకా...’ వినాయకుడు చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ రాత్రి ధన్వి ప్రశాంతంగా నిద్రపోయింది. ఈ ప్రపంచంలోని ప్రతీ బిడ్డ బాల్యం బావుంటుందన్న నమ్మకంతో. వినాయకుడి వాక్కుకు తిరుగు ఉంటుందా? తథాస్తు... పొద్దున్నే ధన్విని నిద్రలేపింది తల్లి.. కానీ నిద్రమత్తు తల్లికి మొదలైంది. స్కూల్ బ్యాగ్ భుజం మీద వేసుకోగానే ధన్వి మిస్ వీపు మీద బరువు పడ్డట్టు వీపు మీద మూటలు మోస్తున్నట్టు ఫీలైంది. ఆ స్కూల్లో ఆ క్లాస్‌లో వున్న పిల్లల వీపుల మీద వున్న బరువులు టీచర్స్ వీపుల మీదికి ట్రాన్స్ఫర్ అవుతోంది. ఆ స్కూల్ సెక్రటరీకి.. కరెస్పాండంట్కు కూడా... ఆ బరువు ట్రాన్స్ఫర్ అవుతోంది... రాత్రి కాగానే పిల్లలు హోమ్ వర్క్ చేస్తుంటే టీచర్స్‌కు చేతులు నొప్పెడుతున్నాయి. మాములుగా కాదు.. క్లాస్ రూమ్‌లో వున్న పిల్లలు చేసే హోమ్‌వర్క్ తాలూకూ నొప్పి.. టీచర్స్‌కు భరించలేనంతగా కలుగుతోంది. పిల్లలను ఒళ్ళో కూచోబెట్టుకుని అన్నం తినిపించని తల్లులకు ఏదో వెలితి.. అర్థం కాని వెలితి... పిల్లలను భుజాన వేసుకుని కబుర్లు చెప్పని తండ్రులకు అశాంతి మొదలైంది. డాక్టర్స్ దగ్గరికి టీచర్స్ స్కూల్స్ యాజమాన్యాలు క్యూ కట్టాయి సైకాలజిస్టుల దగ్గరికి పేరెంట్స్ వలస వెళ్ళారు. ‘అంతుచిక్కని ఈ వ్యాధికి చికిత్స దొరికేవరకు పిల్లలకు హోమ్ వర్క్ ఇవ్వకండి... పుస్తకాల బరువు తగ్గించండి. ప్రస్తుతానికి మేము ఇదొక్క సలహా మాత్రమే ఇవ్వగలం’ అన్నారు డాక్టర్లు. ‘బిడ్డ ఆకలి తీర్చకుంటే తల్లి గుండెలు బరువెక్కుతాయి.. అలాగే బిడ్డను రోజూ ఒళ్ళో కూచోబెట్టుకొని లాలించకపోతే సైకలాజికల్‌గా ఇలా అవుతుందేమో.. మీ పిల్లలతో టైం స్పెండ్ చేసి చూడండి’... సైకాలజిస్టులు చెప్పారు. వినాయకుడే వాళ్ళలోకి దూరి వాళ్ళతో చెప్పించాడు! ‘ప్రభుత్వం కాంట్ బట్ పొజిషన్లో... విద్యాసంస్థలు మస్ట్ అండ్ షుడ్ పొజిషన్లో పుస్తకాల బరువు హోమ్ వర్క్ తలనొప్పి తగ్గించాయి. ధన్విని ఒళ్ళో కూచోబెట్టుకుని చాలారోజుల తరువాత తన బిడ్డకు అన్నం కలిపి తినిపించి పెందరాళే పడుకోబెట్టగానే రిలీఫ్‌గా అనిపించింది తల్లికి. కూతురిని వీపున ఎక్కించుకుని కబుర్లు చెబుతూ స్కూల్ విశేషాలు అడుగుతూ ప్రతీ వీకెండ్ జాలీగా ఎంజాయ్ చేద్దామని చెప్పాడు తండ్రి. ఇది ఒక ధన్వి ఇంట్లోనే కాదు ప్రతీ ఇంట్లోనూ జరుగుతోంది. పిల్లలు సరదాగా సంతోషంగా స్కూల్‌కు వెళ్తున్నారు... అమ్మానాన్నలతో సాయంత్రాలు గడుపుతున్నారు... శిక్షణ పేరుతో శిక్షలు.. చదువుల పేరుతో పనిష్మెంట్స్ లేవు... ఆల్ హ్యాపీస్! ‘థాంక్యూ ఫ్రెండ్. ఇంతకూ నువ్వేం చేశావ్?’ వినాయకుడిని అడిగింది పొద్దున్నే పెరట్లో పూలు తెచ్చి వినాయకుడి ముందు పెట్టి కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ... దన్వి. ‘మీరు పడుతున్న బాధలు చూశాను.. బాల్యం అందమైనది కదా.. అందుకే మీరు నవ్వుతూ ఉండాలి.. నవ్వడం అంటే ఆనందంతో.. సంతోషంతో... కేవలం పెదవులతో కాదు. అందుకే తనేం చేశాడో చెబుతూ .. ‘ఈ కథ విన్నా... చదివినా ఇలా పిల్లలను సంతోషపెట్టినా వారికీ నవ్వు శాశ్వతంగా వరంగా మారుతుంది.’ అన్నాడు వినాయకుడు. రెండు చేతులూ జోడించి భక్తితో వినాయకుడికి కృతజ్ఞతలు చెబుతూ అంది ధన్వి.. సంతోషంగా ఆనందంగా నవ్వుతూ. ఓహో...అదా విషయం! - విజయార్కె -
కీచైన్ ఉద్యమం
ఎప్పుడు తెల్లారుతుందా...అన్నట్లుగా చూస్తుంది ప్రీతి. అదేమిటో టైమ్ త్వరగా గడవాలనుకున్నప్పుడే... గడియారంలోని ముళ్లు అతిభారంగా కదులుతుంటాయి! ఉత్సాహం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు నిద్ర పట్టడం కష్టమేమో! తనపై ప్రేమతో ప్రీతి వాళ్ల నాన్న కొనిచ్చిన అలారం అది. ఎగ్జామ్స్ కోసం అలారం లేకుండానే మెలకువరావడం అలవాటైపోయిన ప్రీతికి అలారం అవసరం లేదు. కాని నాన్న మీద ప్రేమతో పక్కనే పెట్టుకొని పడుకుంటుంది. ఎట్టకేలకు తెల్లారింది... అనుకున్న టైమ్‌కు అలారం నిద్ర లేపింది. లేచి సాన్నం చేసి బ్లాక్ జీన్స్, చెక్స్ టాప్ వేసుకుంది. తనకి నచ్చిన పోనీ వేసుకుంది. ఫ్రీజర్ నుంచి పాలు తీసి కాఫీ చేసింది. డాడీని లేపింది. కాఫీలో పంచదార ఎక్కువైనా, తక్కువైనా డాడీ పట్టించుకోడు... ప్రీతిని మెచ్చుకుంటూనే ఉంటాడు! ఆరోజు కూడా ‘‘చిట్టితల్లీ ఎంత బాగా నేర్చేసుకుంటోంది’’ అని భార్యతో అన్నాడు. ఈమాటకు ఒకవైపు మురిసిపోతూనే... ‘‘డాడీ లేటవుతుంది. సర్ వాళ్లు అందరూ వెయిట్ చేస్తున్నారు’’ అని తొందర చేసింది ప్రీతి. ఆరోజు ప్రీతి తన కాలేజి ఫ్రెండ్స్‌తో బెంగళూరు వెళ్తోంది. ‘‘నీకు విజయ్ తెలుసా? గుర్తున్నాడా?’’ అని అడిగింది అప్పుడే తన దగ్గరకు వచ్చిన రియ. ‘‘అవును గుర్తున్నాడు’’ అన్నది ప్రీతి. ‘‘తను నిన్న యాక్సిడెంట్లో చనిపోయాడట’’ చెప్పింది రియ. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో విజయ్‌ది ప్రీతి పక్క సీటు. అంతేతప్ప ఏరోజూ మాట్లాడింది లేదు. ఒక విధంగా చెప్పాలంటే ముఖపరిచయం మాత్రమే ఉంది. అయినప్పటీకి చాలా బాధ అనిపించింది ప్రీతికి. ‘ఈమధ్య కాలంలో ఇలాంటి వార్తలు ఎన్ని వినాల్సి వస్తోంది!’ బాధగా అనుకుంది ప్రీతి. మొన్నటికి మొన్న శ్రీరాగ్! తమ పక్కింటి అబ్బాయి. పట్టుమని పాతికేళ్లు ఉండవు. పాదరసంలా చురుగ్గా ఉంటాడు. బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టం...బైక్‌పై స్పీడ్‌గా ఊరంతా చక్కర్లు కొట్టడం అంటే చాలా ఇష్టం. ‘అబ్బాయి సరదా పడుతున్నాడు. ఈ వయసులో ఇది కామనే కదా’ అని అనుకున్నాడే తప్ప తండ్రి సత్యం ఏనాడూ సీరియస్‌గా తీసుకోలేదు. అదే ఆయన పాలిటి శాపం అయింది. ఒకరోజు బైక్‌పై స్పీడ్‌గా వెళుతున్న శ్రీరాగ్ అదుపుతప్పాడు...ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు! ఒక్కగానొక్క కొడుకు. కొడుకు మరణవార్త విని సత్యం దంపతులు తట్టుకోలేకపోయారు. ‘కొడుకు లేని ఈ బతుకు ఎందుకు?’ అని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది సత్యం భార్య సరిత. కొత్తా పాతా అనే తేడా లేకుండా ఒకప్పుడు అందరితో గలగలా మాట్లాడే సత్యం ఇప్పుడు ఎవరితో సరిగా మాట్లాడం లేదు. ఎవరితో పెద్దగా కలవడం లేదు. అప్పుడప్పుడూ కొడుకు యాక్సిడెంట్‌కు గురైన చోటు దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటాడు. ఇది చూసిన వాళ్లకు కళ్లనీళ్లు ఆగవు! అమ్మ వాళ్ల కజిన్ ఒకరు తన పెళ్లికార్డులు పంచడానికి బైక్‌పై వెళ్లి యాక్సిడెంట్లో చనిపోయాడు! చిన్నప్పటి ఫ్రెండ్ రీతిక వాళ్ల నాన్న ఏదో ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి రాకుండా దారిలోనే ఆగిపోయాడు. ‘‘డ్రింక్ తీసుకున్నావు కదా...ఇంత రాత్రి వేళ వెళ్లడం ఎందుకు? ఉదయం వెళ్లొచ్చులే’’ అని చెప్పారట ఫ్రెండ్స్. ‘‘నేను డ్రింక్స్ తీసుకోవడం కొత్తా, బైక్ నడపడం కొత్తా’’ అని ఆరాత్రే బయలుదేరాడట! ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్దదిక్కులేదు.... బతకడానికి ఆధారం లేదు! ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఎన్నెన్నో యాక్సిడెంట్ విషాదాలు గుర్తుకొస్తున్నాయి ప్రీతికి. ఈ ఆలోచనలతో మనసంతా అదోలా అయిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ సర్ దగ్గర విజయ్ ప్రస్తావన తెచ్చింది. ‘‘అవునమ్మా, నాకు నిన్ననే తెలిసింది. హెల్మెట్ వేసుకొని ఉండుంటే ప్రాణాలు మిగిలేవి’’ అన్నారు రాజేష్ సర్. ‘హెల్మెట్’ అనే మాట వినబడగానే ప్రీతికి మళ్లీ శ్రీరాగ్ గుర్తుకు వచ్చాడు. ‘‘వెళితే వెళుదువుగాని ఆ హెల్మెట్ పెట్టుకొని వెళ్లరా’’ అని అప్పుడప్పుడూ అనేవాడట సత్యం. కానీ తండ్రి మాటలను శ్రీరాగ్ తేలికగా తీసుకునేవాడు. ‘‘హెల్మెట్ పెట్టుకొని బైక్ ఎక్కితే ఏం మజా ఉంటుంది డాడీ’’ అనేవాడట! బస్సులో అంతా హడావిడిగా ఉంది. ఎవరి ముచ్చట్లలో వాళ్లు ఉన్నారు. నవ్వించే వాళ్లు నవ్విస్తూనే ఉన్నారు...నవ్వే వాళ్లు నవ్వుతూనే ఉన్నారు. అందరిలో ప్రయాణ ఉత్సాహం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రీతి మాత్రం ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకపోతోంది. తనకు పదే పదే నాన్న గుర్తుకు వస్తున్నాడు. ఎప్పుడో తప్ప నాన్న హెల్మెట్ పెట్టుకోడు. ఈరోజు తనని బస్‌స్టాప్‌లో వదిలినప్పుడు కూడా నాన్న హెల్మెట్ పెట్టుకోలేదు. ప్రీతి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ‘‘డాడీ హెల్మెట్ మరిచిపోతున్నారు’’ అని గుర్తు తెస్తే అదో విషయం కాదన్నట్లు వెళ్లిపోయేవాడు. బెంగళూరు వచ్చేసింది. కొద్దిసేపటి తరువాత హెచ్.ఏ.ఏల్కి చేరుకున్నారు. అక్కడ ఎన్నో యుద్ధవిమానాలు చూసింది, వాటి చరిత్ర చదివింది ప్రీతి. ఆ తరువాత విశ్వేశ్వరయ్య మ్యూజియంకు వెళ్లారు. పిల్లలంతా బయట షాపింగ్ చేస్తున్నారు. రియ ప్రీతిని పిల్చుకొని వెళ్లింది. అక్కడ ప్రీతి కళ్లు కీచైన్‌పై పడ్డాయి. దాని మీది– ‘ఐయామ్ వెయింటిగ్ ఫర్ యూ’ అని రాసి ఉంది. వెంటనే యభై వరకు కీచైన్లను కొనింది. బెంగళూరులో కప్పన్పార్క్, బన్నర్గట్టా జూ చూసి బస్‌లో తిరుగుప్రయాణమయ్యారు. తాను బెంగళూరులో కొన్న కీచైన్‌ను తండ్రికి గిఫ్ట్‌గా ఇచ్చింది ప్రీతి. ‘‘ఎందుకమ్మా ఇదంతా!’’ అన్నాడు ఆయన. ‘‘డాడీ ఇది కీ చైన్ కాదు...మా ఎదురుచూపులు’’ అన్నది ప్రీతి. అర్థం కానట్లు చూశాడు ఆయన. అప్పుడు ప్రీతి విజయ్ గురించి చెప్పింది. విజయ్‌కి ఊహ తెలియని రోజుల్లోనే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి విజయ్‌కి సర్వస్వం అయిపోయింది. ఎండ కన్నెరుగని ఆమె భర్త మరణంతో కూలీనాలికి కూడా వెళ్లింది. అలా కూలిపనులు చేసుకూంటూనే ఆపేసిన చదువును కొనసాగించింది. డిగ్రీ తరువాత అదృష్టవశాత్తు చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొడుకును బాగా చదివించి పెద్ద హోదాలో చూసుకోవాలని కలలు కనేది ఆమె. చుట్టాలు పక్కాలతో ‘మా విజయ్’ అని కాకుండా... ‘మా కలెక్టర్’ అని మాట్లాడేది. వినే వాళ్లకు ఇది వింతగా అనిపించేది...కాని తల్లి ప్రేమ ముందు తర్కాలు పనిచేయవు కదా! ‘‘అరేయ్ నువ్వంటూ లేకుంటే మీ నాన్నతో పాటు నేను చనిపోయేదాన్నిరా. నీ కోసమే బతుకుతున్నాను నాన్నా. బాగా చదువుకో’’ అని అడగకపోయినా కావల్సినన్ని డబ్బులు కొడుకు చేతిలో పెట్టేది తల్లి. నిజానికి టెన్త్‌క్లాస్ వరకు విజయ్‌కి అమ్మ తప్ప మరోప్రపంచం తెలియదు. కాలేజి చదువుకు సిటీకి వచ్చి ఫ్రెండ్స్‌తో రూమ్ తీసుకొని ఉండేవాడు. ఇక్కడే విజయ్‌కి ‘బైక్ సోకు’ తగులుకుంది. ‘‘కాలేజిలో అందరూ బైక్‌పై స్టైల్‌గా వస్తున్నారు. నేను మాత్రం నడుచుకుంటూ కాళ్లీడ్చుకుంటూ వెళుతున్నాను’’ అని తల్లి దగ్గర తరచుగా అంటుండే వాడు విజయ్. విజయ్ పుట్టిన రోజుకు బైక్ కానుకగా ఇచ్చి కొడుకు కళ్లలో అంతులేని సంతోషాన్ని చూసింది తల్లి. కానీ అది సంతోషం కాదని... మృత్యువు అని రెండు నెలలకుగానీ ఆమెకు అర్థం కాలేదు! ప్రీతి చెప్పింది విన్న తరువాత నాన్న కంట్లో నుంచి బొటబొటమని కన్నీళ్లు కారాయి. ‘‘డాడీ, ప్లీజ్ ఇది మీ బైక్ కీస్‌కి తగిలించుకోండి’’ అంది ప్రీతి. ‘‘అలాగేనమ్మా’’ ద్రవించిన హృదయంతో అన్నాడు ఆయన. ఆరాత్రి ప్రీతి పడుకొంది కాని విజయ్ గుర్తుకు వస్తున్నాడు. మనసులో ఏవేవో భయాలు, కంటి నిండా నీళ్లు. ‘నా వంతుగా ఏదైనా చేయాలి’ ఆరాత్రి గట్టిగా అనుకుంది. కాలేజీ ‘బ్రేక్’ సమయంలో స్టేజీ ఎక్కింది ప్రీతి. ‘‘దీస్ ఈజ్ ప్రీతి. మీ అందరికి విజయ్ గురించి తెలుసు. మూడు నెలల క్రితం వరకు మనతోనే ఉన్న వ్యక్తి ఇప్పుడు లేడు. హెల్మెట్ వేసుకొని ఉంటే బతికి ఉండేవాడట. మనలో చాలామందికి బైక్‌లు ఉన్నాయి. హెల్మెట్ ధరించి నడపేవాళ్లకంటే, ధరించకుండా నడిపేవాళ్లే ఎక్కువమంది ఉన్నారు. అలాంటి వారికి నాదొక విన్నపం.. మీకంటూ ఒక ఇల్లు ఉంది...ఆ ఇంట్లో మీ కోసం ఎదురుచూసే కుటుంబసభ్యులు ఉన్నారు. మీరు చేసే తప్పుకు వారికి జీవితకాలశిక్ష విధించవద్దు. అందుకే ఈ కీచైన్. దీని మీద ‘ప్లీజ్ కమ్ హోమ్. వీ ఆర్ వెయింటిగ్ ఫర్ యూ’ అని ఉంది. నా దగ్గర ఉన్న కీచైన్లను కొందరికి ప్రెజెంట్ చేద్దామనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి’’ అన్నది ప్రీతి. చప్పట్లతో ఆ ప్రదేశం మారుమోగిపోయింది. మరుసటిరోజు మిగిలిన విద్యార్థులంతా తమ దగ్గర ఉన్న డబ్బులతో కీచైన్లను కొని రోడ్డుపై వేగంగా వెళుతున్న వారికి పంచిపెట్టారు. వారం తిరిగేలోపే కీచైన్లు పంచడం అనేది ఎన్నో కాలేజీలకు పాకి పెద్ద ఉద్యమంగా మారింది! కలలు ఎందుకు వస్తాయో, వాటిలో నిజమెంతో ఎప్పుడూ ఆలోచించలేదు ప్రీతి. కానీ నిన్న రాత్రి వచ్చిన కల గురించి మాత్రం పదే పదే ఆలోచిస్తోంది. ఆ కలలో... విజయ్ కనిపించి– ‘‘థ్యాంకూ ప్రీతి!’’ అంటున్నాడు! - వసీహా అంజుమ్ -
సాలభంజికల సింహాసనం
గిడుతూరి సూర్యం దర్శకత్వంలో రామకృష్ణ, యస్వీరంగారావు, బాలయ్య... ప్రధాన పాత్రలు పోషించిన సినిమా (1971)లోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘విక్రమార్క మహారాజా! ఊర్వశీ రంభల నాట్యాన్ని తిలకించిననాడు మీరు ఇచ్చిన తీర్పుకి మెచ్చి మహేంద్రుడు పంపిన బహుమానం 32 సాలభంజికలు గల ఈ సింహాసనం. దేవలోక పట్టాభిషేకం నాడు పరమేశ్వరుడు మహేంద్రునికి ఇచ్చిన ఈ సింహాసనపీఠం మీకు ఇవ్వబడింది. మా అందరికీ నేత్రోత్సవంగా ఈ భద్రపీఠాన్ని అనుష్ఠించండి మహారాజా!’’ అంటూ మహారాజును ఆహ్వానించాడు భట్టి. ‘జయీభవ! విజయీభవ!’ అంటూ నినాదాలు మిన్ను ముట్టాయి. మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న సమయంలో.. ‘‘ఆగండి’’ అనే అరుపు వినిపించింది. ఎవరో విప్రుడు. ‘‘ఎవరు నువ్వు?’’ అని గట్టిగా అడిగాడు భట్టి. ‘‘నేనొక పేద విప్రుడిని. మీ నగరంలోనే ఆకలి చిచ్చుతో అలమటించిపోతున్నాను. మీరు ఆనందంగా సింహపీఠం అలంకరిస్తున్నారు. ఇది ధర్మమేనా’’ అన్నాడు ఆవేదనగా ఆ విప్రుడు. ‘‘ఏమిటి! మా రాజ్యంలో విద్యావంతులైన మీకు దారిద్య్ర బాధా? మహామంత్రి! తక్షణమే వీరికి వెయ్యి సువర్ణములు ఇప్పించండి’’ అని ఆదేశించారు మహారాజు. సంచిలో సువర్ణములు వచ్చాయి. కానీ పేద బ్రహ్మణుడి ముఖంలో వెలుగు లేదు. ‘‘మహారాజా! నాకొక నియమం ఉన్నది. కష్టార్జితమైన ధనమే నేను దానంగా స్వీకరిస్తాను’’ అన్నాడు నిర్మొహమాటంగా. ‘‘తమ శౌర్యప్రతాపాలతో దిక్కులు జయించి పరిపాలిస్తున్న మహారాజు కష్టార్జిత ధనం కాదా ఇది’’ ఆశ్చర్యపోయాడు భట్టి. విక్రమార్క మహారాజులు మాత్రం విప్రుడి మాటలకు కోపం తెచ్చుకోకపోగా ఏదో బోధపడినట్లు శాంత స్వరంతో ఇలా అన్నాడు: ‘‘నిజమే ఇది మా కష్టార్జిత ధనం కాదు. ఇది ప్రజాధనం. మా విజయ పరంపరకు కారకులు సామాన్య సైనికులు. మా ధనాగారం నిత్యం పెంపొందించినవారు చెమటోడ్చినవారు కష్టజీవులు. రెండు ఘడియల గడువు ఇవ్వండి. సామన్యపౌరుడిగా కాయకష్టం చేసి ధనం సంపాదించి మీకు ఇస్తాను’’ ‘‘ఆ రెండు ఘడియలూ సింహసనంపై కూర్చొనే అవకాశం నాకు ఇవ్వండి’’ అడిగాడు ఆస్థాన విదూషకుడు. ‘‘విదూషకా! అలాగే. నీ పరిపాలన చూసి వినోదిస్తాను’’ అన్నారు మహారాజు. ‘‘కాదు విచారిస్తారు. నా పరిపాలనలో కష్టపడి డబ్బు సంపాదించాలనుకునే మీలాంటి వారికి ఎలాంటి ఉద్యోగం లభించకూడదని శాసనం జారీ చేస్తాను. అప్పుడు ఎలా సంపాదిస్తారో నేనూ చూస్తాను’’ అన్నాడు విదూషకుడు. ‘‘నీ పరిపాలన ప్రారంభించు’’ అని విదూషకునికి సింహాసనం చూపించాడు మహారాజు. ఈలోపు ‘మహారాజా!’ అంటూ గట్టి పిలుపు వినబడింది. విప్రుడు మాయమై దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు! ‘‘దేవేంద్రా మీరా!’’ ఆశ్చర్యంగా అన్నాడు మహారాజు. ‘‘ఇంతటి ధర్మమూర్తివై నీవు ఈ భూమండలంలో జీవించి ఉన్నంత కాలం ఈ పవిత్రపీఠం అలంకరించే అర్హత నీకు తప్ప ఎవరికీ లేదు. నీ పాలన స్వయంగా పరికించి పరమానందం పొందాను. వెయ్యి సంవత్సరాలు ఈ భద్రపీఠంపై వెలుగొందు దీవెన ఇస్తున్నాను’’ అని విక్రమార్కుడికి వరం ఇచ్చాడు దేవేంద్రుడు. .... ఒంటరిగా కూర్చొని తనలో తాను బాధపడుతున్నాడు విక్రమార్కుడు. ‘‘అన్నగారూ... ఇంతటి మహదానంద తరుణంలో ఆలోచన నిమగ్నులై ఉన్నారు!’’ అడిగాడు భట్టి. ‘‘భట్టీ! నువ్వు లేని వెయ్యేండ్ల నిస్సారమైన జీవితం ఎలా గడపగలను!’’ తన మనసులో బాధను చెప్పాడు విక్రమార్కుడు. ఆ మాటకు భట్టి కదిలిపోయాడు. కళ్లలో కన్నీటి పొర. ‘‘మరణంతో మీ సేవాభాగ్యం పోగొట్టుకునే ఆ దౌర్భగ్య స్వర్గారోహణ నాకెందుకు మహారాజా! భద్రకాళిని ప్రార్థించి బహుకాలం జీవించే వరం పొంది వస్తా’’ అని బయలుదేరాడు భట్టి. ∙∙ భుజం మీద శవంతో విక్రమార్కుడు కాళీ దగ్గరకు వెళుతున్నాడు. ఎక్కడి నుంచో గొంతు వినిపించింది. ‘‘విక్రమార్కా! నేను భేతాళుడిని. ఈ దొంగసన్యాసిని వధించు. నేను నీకు వశం అవుతాను’’ ‘‘మహారాజా! దేవికి సాష్టాంగ ప్రమాణం చెయ్’’ అన్నాడు దొంగ సన్యాసి. ‘‘అదెలాగో నాకు తెలియదు. చేసి చూపించండి’’ అని తెలివిగా అడిగాడు విక్రమార్కుడు. దొంగ సన్యాసి వంగగానే మెడపై వేటు వేశాడు విక్రమార్కుడు. అప్పుడు భేతాళుడు ప్రత్యక్షమై... ‘‘క్లీం అలా క్లీం...విక్రమార్క మహారాజా! నేనే మీకు వశం అయ్యాను’’ అన్నాడు. ‘‘మంచిది భేతాళా. ప్రపంచంలోని వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు’’ అని భేతాళుడిని ఆదేశించాడు విక్రమార్కుడు. కొద్దిరోజుల తరువాత భేతాళుడు ప్రత్యక్షమై... ‘‘ఆ వీరసేనుని అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశా. దురంహకారంతో శపథం చేశాడు. సాలభంజికల పీఠాన్ని తాను అధిష్ఠించి మిమ్మల్ని శాసిస్తాడట. ఎంతటి దురహంకారం’’ అన్నాడు కోపంగా భేతాళుడు. ∙∙ వీరసేనుడు భీకరంగా తపస్సు చేస్తున్నాడు. కాళీమాత ఎంతకీ కనికరించడం లేదు. ఇక ఆగలేక కత్తితో కడుపులో పొడుచుకొని పేగుల్ని బయటకు తీసుకున్నాడు... అప్పుడు కాళీమాత ప్రత్యక్షమైంది. ‘‘ఏమి కోరి ఈ తపస్సు?’’ అని అడిగింది. ‘‘ఇంద్రజాల, మహేంద్రజాల, అంజన, ఆకర్షణ, ఉచ్ఛాటన, పరకాయప్రవేశాది సమస్త విద్యలు నా హస్తగతం కావాలి. నన్ను అనుగ్రహించి పాలించు మాతా’’ అని వేడుకున్నాడు వీరసేనుడు. ‘‘కుమరా! నీవు కోరిన దివ్యశక్తులు ప్రసాదిస్తున్నాను. దుర్వినియోగం కానంత వరకు, నా ముందు ఉన్న ఈ అఖండజ్యోతి ఆరనంత వరకు నీవు ఈ శక్తులు కలిగి ఉంటావు’’ అని వరం ఇచ్చింది మాత. వీరసేనుడిలోని గర్వం పదింతలు పెరిగింది. పట్టలేనంత ఆహంకారంతో... ‘‘ఓరీ విక్రమార్క! ఇక నీ మృత్యురూపమును ధరింతునురా’’ అని అరిచాడు. జవాబు: విక్రమార్క విజయం -
ఓ మంచివాడి కథ
చప్పుడు విని తిరిగి చూసేడు మంచివాడు.వాళ్ల ముఖాలన్నీ ఉదయకిరణాల్లో వింతశోభతో మెరుస్తున్నాయి. ముందుకి సాగే సేనల ఎగిరే జెండాల్లా ఉన్నారు వాళ్లు. వాళ్ల భుజాల మీద మాత్రం బరువైన బండరాళ్లు తీరిగ్గా అమిరున్నాయి. వాళ్లంతా దేవుడి దండులా ఉన్నారు. మంచివాడు– అతిచెడ్డ వాళ్లందర్లాగే– పుట్టగానే ఏడ్చేడు. చిన్నప్పుడు అమ్మ కేకలేస్తే ఏడ్చేడు. పక్కింటి పిల్లాడు కొడితే ఏడ్చేడు. దెబ్బ తగిల్తే, నొప్పిపుడితే ‘‘అమ్మా! హమ్హా!’’ అంటూ ఏడ్చేడు. చెడ్డవాళ్లు దొంగ ఏడుపులు కూడా ఏడ్చేరు. మంచివాడు అలా చెయ్యలేక కొంతగా ‘‘చిన్నప్పుడే చెడిపోయేడు వెధవ!’’బళ్లో చేరగానే మంచివాడి పలక విరగ్గొట్టేరు. అతనికి బూతు పేరు పెట్టారు. అతని పాత చొక్కాని చింపేరు. కొత్త చొక్కా మీద కరక్కాయ సిరా వొలకబోసేరు. కొన్నాళ్లయాక ఆటల్లో అతన్ని డొక్కలో తన్నేరు. పక్కలు పొడిచేరు. మండీకొట్టి మడమసీల మీద తన్ని, అతనికాళ్లు విరగ్గొట్టబోయేరు. మంచి ఆటల టీముల్లోకి అతన్ని రాకుండా చేసేరు. పెద్దయాక అతను తెచ్చుకున్న టెక్స్స్టుబుక్కలరువు తీసుకుపోయేరు. అతను రాసుకున్న నోట్సు ఎత్తుకుపోయేరు. అతను చదువుకునే సమయంలో డిస్టర్బ్ చేసేరు. అతను పడుకున్నప్పుడు వాళ్లంతా చదువుకున్నారు. ఆఖర్న, పరీక్షలో అతను రాసిన జవాబులన్నీ కాపీ కొట్టేరు. మంచివాడు పరీక్షలు పాసయేక, మంచి ఉద్యోగానికి అర్జీపెట్టి వెళ్తే అధికార్లు అతణ్ణి ఎగాదిగా చూసేరు. అన్ని ప్రశ్నలూ వేసేరు. కొంతసేపు ఆలోచించేరు. నీకు పర్సనాలిటీ లేదు పొమ్మన్నారు. మంచివాడు తిరిగీ తిరిగీ ఒక చిన్న నౌఖరీలో కుదురుకొంటే, అతణ్ణి ఆఫీసరొకసారి మెచ్చుకున్నాడన్చెప్పి హెడ్గుమాస్తా కసురుకున్నాడు. పని పెట్టుకుని మంచివాడి చేత అరవచాకిరీ చేయించుకున్నాడు. ఆఫీసులో పెద్దలూ పిన్నలూ అంతా కలిసి, మంచివాణ్ణి, కనీసం చిల్లర లంచాలైనా తినమన్నారు; అతను తిననంటే వెక్కిరించేరు. వెర్రిపీరన్నారు, కక్షగట్టేరు, తంటాలు తెచ్చేరు, అతణ్ణి ఊరూరా తిప్పేరు. ఏ సీటుకీ పనికిరావన్నారు. ఎందుకూ కొరగానివాడన్నారు. మంచివాడికి చాలాకాలం వరకూ పెళ్లి కాలేదు. ‘‘అంత మంచివాడికి పిల్లనిస్తారే అనుకోండి! కాని, వాడి దినమే తీర్చుకోలేనివాడు దాని దినం ఎలా తీర్చగలడు?!’’ అంటూ చాలామంది పెదవులు విరిచేసుకున్నారు. చివరికొక మంచి ముహూర్తాన మంచివాడు ఓ అరమనిషి సైజుగల ఆడమనిషికి పుస్తెగట్టి ఆనందబాష్పాలు రాల్చేడు. ఆమెనతను ప్రేమించేడు. ఇవ్వగలిగినంత సుఖమామెకి ఇచ్చేడు. ఆవిడ కాపరానికొచ్చేక, పక్కింటికి వెళ్లి అక్కడి కోడలి నగలు చూసి కిలకిల్లాడి, ఇంటికొచ్చి విలవిల్లాడిపోయింది. ఎదుటింటి ఆడబడుచు కోకలు చూసి మురిసిపోయి ఇంటికొచ్చి గింజుకుపోయింది. తన భర్త చవట పెద్దమ్మనే నిశ్చయానికొచ్చింది. టాపు తీసి కార్లో షికారూ. అద్దాల మేడల్లో కాపురాలూ, నిలువుటద్దాల ముందు ముస్తాబులూ, డన్లప్పరుపుల మీది సుఖాలూ తల్చుకొని ఆమె తహతహలాడిపోయింది. చివరకావిడ బక్షీసుల్తో బలిసిన ఆఫీసు బంట్రోతు కుర్రాడే తన పెనిమిటి కంటే చలాకీగా ఉన్నాడనే నమ్మకానికి వచ్చింది. ఓ రోజున ఆవిడ ఓ స్టూడెంట్ కుర్రాడికి బట్టలిచ్చిన సొగసూ, జోడిచ్చిన పొడవూ చూసి మురిసిపోయింది. ఆ తర్వాత ఒక సాయిబుగారి మెహర్బానీ చూసి మోజుపడింది. ఒక పోయట్గారి కాళ్లూ కనుబొమ్మలూ చూసి మోహపడి భ్రాంతిపడింది. చివరికొక– షావుకారిగారి డబ్బుచూసి మోహపడిపోయింది. మంచివాడికి అన్ని రహస్యాలూ తెలిసివచ్చిన తర్వాత, అందుగురించి ఏం చెయ్యాలో తెలియక, మనసు కమిలిపోగా కుమిలి కుమిలి ఏడ్చి, చీకట్లో దేవుణ్ణి ప్రార్థించి ప్రార్థించి, నొప్పితో కనురెప్పలు మూసుకుపోగా ఎలాగైతేనేం నిద్రపోయేడు. అప్పుడా మంచివాడికి భగవంతుడు కలలో, దివ్యసుందర విగ్రహంతో కనిపించి, నాలుగు చేతుల్తోనూ ఆ మంచివాణ్ణి మృదువుగా నిమిరి, కరుణాకటాక్ష వీక్షణాన్ని అతనిపై కురిపించి, మృదుమధుర హాసంతో అతణ్ణి ముద్దుగా మురిపించి, ‘‘ఈ తరువాత రాబోయే నీ ఆరువందల రెండో జన్మలో నీకు మేలు కలుగుతుంది. అందాకా కాస్త ఓపికపట్టు నాయనా!’’ అని చెప్పి అతని కలలోంచి నిద్రలోంచి జారుకున్నాడు. అప్పుడు మంచివాడు నిద్రలో నిట్టూర్చిన నిట్టూర్పు ఆ జారుకున్న దేవుణ్ణి వెతకడానికి వెళ్లి దారి కనిపించక గాల్లో కలిసిపోయింది. మర్నాడు మంచివాడు బాధని దిగమింగుకొని దాన్ని అరిగించుకోలేక పైకి కక్కలేక, మెల్లిగా నడుచుకుంటూ ఆఫీసుకి వెళ్తే ఆఫీసు డిప్యూటీ అతన్ని గంటసేపు తిట్టేడు. గంటపైని నాలుగో నిమిషందాకా తిట్లు తిన్నాక మంచివాడికి అలకొచ్చి మంచికోపం (మంచివాడి కోపం) వచ్చింది. దాన్తో ఆఫీసులో అంతా అతన్ని ‘‘తిరుగుబోతు’’వన్నారు. ఛార్జీలు ఫ్రేం చేసేరు, ఎంక్వయిరీ జరిపించేరు, వార్నింగిచ్చేరు.అలాగ నాలుగైదు ఎంక్వయిరీలు జరిపించేక మంచివాణ్ణి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేరు. మంచివాడి స్నేహితులు ‘‘నీ కోపమే నీ కొంప ముంచింది’’ అన్నారు. విరోధస్తులు ‘‘పొగరుబోతు వెధవకి ప్రాయశ్చిత్తం జరిగింది’’ అన్నారు. చాలామంది అతనికి శౌర్యం లావన్నారు. చుట్టాలంతా అతణ్ణి ‘‘నీ బతుకేదో నువ్వు బతుకు, బతకలేకపోతే నీ ఇష్టం వచ్చింది చేసుకో! కాని, మమ్మల్ని మాత్రం– నీకు పుణ్యం ఉంటుంది చంపక’’న్నారు. అతని భార్య అతణ్ణి షావుకారుగారి కొట్లో గుమాస్తాగా చేరి కుక్కలా పడుండమంది. మంచివాడు నీచానికి దిగలేనన్నాడు. చెడ్డపని చేయలేనన్నాడు.‘‘నువ్వెందుకూ పనికిరావు. మరి ఎలా? ఏ యేట్లో పడిచస్తావో చావు!’’ అని అంతా అతనికి ఉచితంగా సలహా ఇచ్చేరు. మంచివాడు పళ్లు కొరికేడు, జుట్టు పీక్కున్నాడు. కడుపు మాడగా, కళ్లు మండగా, కాళ్లు పీకగా, గాలి పీలుస్తూ, నీరు తాగుతూ, ఎండ తింటూ, ఊరంతా తిరిగి తిరిగి అంధకారంలో మునిగేడు.ఊరవతల అర్ధరాత్రి చీకట్లో కొండవార బండరాతి మీద కూర్చొని మంచివాడు, ‘‘నేనేం చెయ్యడం?!’’ అంటూ గావుకేకలు వేసి దేవుణ్ణి ప్రశ్నించేడు.దేవుడు పలకలేదు. బండరాయిపక్క కొండమాత్రం ‘‘డం???’’ ‘‘డం???’’ అంటూ ప్రతిధ్వనించింది. అది విని విని మంచివాడు వెర్రిగా నవ్వేడు.ఆఖరికి అక్కణ్ణుంచి లేచి చీకట్లోంచి, కాట్లోంచి, రోడ్డుమీంచి ఊళ్లోకి వచ్చి అందర్నీ సలహాలడిగేడు. కొంతమంది నవ్వేరు. కొంతమంది నిట్టూర్చేరు.మరో నౌఖరీ చూసుకోకూడదా? దొరకదు దొరకదనీ ఫో పొమ్మనీ అంతా గెంటేశారు. షాహుకారు కూడా ‘‘ఉంపుడుగత్తె పక్కలో ఉంటే పక్కనే మొగుడెందుకు?’’ అనుకున్నాడు. అంతాకూడా, తిక్కవెధవలూ తిరుగుబోతు వెధవలూ చాకచక్యంలేని వెధవలూ మాకక్కర్లేదు పొమ్మన్నారు. కిల్లీకొట్టు పెడితేనో? పెట్టలేవు. పెట్టినా నడపలేవు. నీకు కిల్లీలు చుట్టడం అయినా రాదు. వచ్చినా నీ పానంతా అరువుగాళ్లు తినేస్తారు. కిరాణాకొట్టు ఓపెన్ చేస్తేనో? నీకు మదుపులేదు, చురుకులేదు. తప్పు తూనికల్తూచలేవు. దొంగసరుకు అమ్మలేవు. చిల్లర ఆఫీసర్లకి లంచాలివ్వలేవు. బీదవాళ్లకి అరువివ్వకుండా ఉండలేవు. లాభాల్తియ్యలేవు. మరేదైనా వ్యాపారం? నువ్వే వ్యాపారానికీ పనికిరావు. మదుపుండాలి, మాయుండాలి. రెండూ లేవు నీ దగ్గర. రిక్షా లాగితేనో? లాగలేవు. లాగినా రెండేళ్లలో గుండె ఆగి చస్తావు. వ్యవసాయం? భూమెవడిస్తాడు?! చాకలి పని? బారిక పని? నువ్వాఖరికి మంగలి పనిక్కూడా పనికిరావు. బుర్రగొరగడం కూడా ఆనెస్ట్‌గా గొరుగుతానంటావు. బుర్ర దగ్గిర నయాపైస కిట్టదు. అలాగైతే, అయినా, మాయగాళ్లు లక్షమందుండగా నీ చేత ఎవడు గీయించుకుంటాడు బుర్ర?! నీకు ఆ ఛాన్సే లేదు. మరైతే నేనెందుకు పనికొస్తాను? నువ్వెందుకూ పనికిరావు. దొరపని (అంటే దొంగపనే అనుకో) ఆ పనికీ పనికిరావు. అసలైన దొంగపనికి అసలే పనికిరావు– అన్నారంతానూ. సాయంకాలం ఏడయింది. మంచివాడికి ఏడుపొచ్చింది.‘‘మరైతే నేను చావడానికి తప్ప మరి ఎందుకూ పనికిరానా?!’’ అంటూ అతను సముద్రం వైపు పరిగెట్టేడు. అక్కడ ఒడ్డున నిశ్చేష్టుడై నిలబడిపోయేడు. చీకట్లో సముద్రపు కెరటాలు ‘‘నువ్వు చావుకి’’ అంటూ పైకి లేచి, ‘‘ఫ్ఫన్కి రావ్’’ అంటూ గభీమని విరిగి ‘‘నువ్వు చావనూకూడా లేవుస్మా!’’ అనే అర్థంతో మాటల్ని విరిచి విరిచి అతని సుస్పష్టంగా తెలిసేట్టుగా అరిచి అరిచి చెప్పేయి.రాత్రంతా చీకటిగా బాధల పుట్టలా ఉంది.రాత్రంగా చీకటిగా రాక్షసబొగ్గుల గనిలా ఉంది. తెల్లవారింది. నిప్పురవ్వలా ఇనుడు ఉదయించేడు. నీళ్లలోంచి నిప్పుల చక్రంలా బైటికి పూర్తిగా లేచేడు. సముద్రానికీ కొండకీ మధ్య ఇసుకలో నిల్చొనే ఉన్నాడు మంచివాడు. చీకటంతా బెదిరి చెదిరిపోయింది. ఆకాశంలో మబ్బులు తూలి తూలి పోయేయి. తెలివొచ్చిన చల్లగాలి వీచి వీచి పోతోంది. సముద్రపు కెరటాల తురాయిలన్నీ రంగురంగుల రంగుల్తో పైకి పైకి లేచేయి.అంతలో భూమి అదిరింది. ఎక్కణ్ణుంచో కోటి గొంతుల పాట వినిపించింది.చప్పుడు విని తిరిగి చూసేడు మంచివాడు. వాళ్ల ముఖాలన్నీ ఉదయకిరణాల్లో వింతశోభతో మెరుస్తున్నాయి. ముందుకి సాగే సేనల ఎగిరే జెండాల్లా ఉన్నారు వాళ్లు. వాళ్ల భుజాల మీద మాత్రం బరువైన బండరాళ్లు తీరిగ్గా అమిరున్నాయి. వాళ్లంతా దేవుడి దండులా ఉన్నారు.‘‘మమ్మల్ని రాయిమడుసులంటారు. మేం మంచిలోకాన్ని నిర్మించడానికి వెళ్తున్నాం’’ అన్నారు వాళ్లు. మంచివాడికి కళ్లంట ముత్యాల బిందువులు రాలేయి. అతను అతి నిర్మలంగా నవ్వేడు. వెంటనే జీవితం అనే బండరాయి తీసి భుజాన వేసుకొని పాటతో పాటు అతను అటువైపు నడిచాడు. -
పెళ్లంటే...
జి.లక్ష్మి ఇల్లంతా పెళ్ళి సందడి. ఇల్లుకి ఇల్లూ మనుషులకి మనుషులూ కళకళలాడిపోతున్నారు. ఎటు చూసినా హడావుడి. వచ్చే అతిథులు పోయే అతిథులు, అతిథులకి భోజన ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా ఉండాలో అంత ఆర్భాటంగానూ ఉంది ఇల్లు. పెళ్ళికూతురు పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు వగైరా వగైరా అందరూ హాల్లో చేరారు. సోఫాలు, కుర్చీలు, మంచాలు ఎటు చూసినా చీరల రెపరెపలే. అంతకుముందు రోజు రాత్రే ఎంగేజ్మెంట్ జరిగింది. ఇంక పెళ్ళి పదంటే పదే రోజులు. ఎంగేజ్మెంట్లో పెళ్ళికూతురికి కాబోయే అత్తగారు పెట్టిన సరంజామా అంతా హాల్లో ఒక పక్కగా ఉంది. పెళ్ళికూతురికి పెట్టిన చీరలు, నగలు, పెళ్ళికూతురి అమ్మ నాన్నకి పెట్టిన బట్టలు ఒకరి తర్వాత ఒకరి చేతులు మారుతూ గదిలో షికార్లు చేస్తున్నాయి. పెళ్ళికూతురికి పెట్టిన ప్రదానం చీర చూసి మూతి మూడు వంకర్లు తిప్పింది అమ్మమ్మ. ‘‘అయ్యో! ఇదేం చీరే. ఇంత సాదాసీదాగా ఉంది. పెళ్ళికూతురికి పెట్టాల్సిన చీరేనా ఇది? పెళ్ళికూతురి చీరంటే ఎంత ధగధగలాడిపోవాలి’’ అంది దీర్ఘం తీస్తూ. ‘‘మొన్న మన పద్మ ఆడబిడ్డ పెళ్ళి జరగలా! ఆ పెళ్ళిలో పెళ్ళికూతురి చీర బంగారం ముద్ద అంటే నమ్ము. ఎటు తిరిగినా అటు కళ్లు జిగేల్మన్నాయి. ఎంత లేదన్నా ఏ డెబ్భై, ఎనభై వేలో ఉంటుంది. లక్షన్నా ఆశ్చర్యపోను. అంత బాగుంది చీర. చీరంటే అదీ’’ అందుకుంది పెద్దమ్మ. ‘‘మరీ అంత కాకపోయినా కొంచెం ఫాస్ట్ కలర్ తీసుకుని ఉండాల్సింది. కలర్ గ్రాండ్‌గా ఉన్నా మంచి రిచ్ లుక్ వచ్చేది. కడితే వెలాతెలా పోయినట్టు లేదూ’’ చిన్నమ్మ అంది. ‘‘మనం సూట్ పెట్టాం. డైమండ్ రింగ్ పెట్టాం. ముంజేతి గొలుసు పెట్టాం. అనుకున్న దానికన్నా అన్నీ ఎక్కువలోనే తీశాం. మనం పెట్టినవాటికీ వాళ్లు పెట్టినవాటికీ ఎక్కడన్నా పోలిక ఉందా? పెళ్ళికూతురికి నెక్లెస్ సెట్ కొనే దగ్గరే తేలిక పడిపోయారు. ఏమన్నా మనకి పెట్టేవా? వాళ్ల పిల్లేగా ఇంక. దానికి ఉండేవేగా’’ పెద్ద మేనత్త అంది. ‘‘మేం అనడం కాదుగానీ నువ్వే చెప్పవే గీతా. చీర కానీ సెట్ కానీ నీకు నచ్చిందా? మీ అమ్మ ఎప్పుడన్నా అట్లాంటి చీర కట్టిందా? మనుషుల్ని బట్టి అన్నా కొనద్దూ? కొన్నామన్న పేరుకి కొన్నారు. పెట్టామన్న పేరుకి పెట్టారు. అవా పెట్టుపోతలంటే? మీ అమ్మకి చెబుతూనే ఉన్నాను. ఆడపిల్ల గలవాళ్లం. బోలెడు ఖర్చులుంటాయి. కాస్త ముందూ వెనుకా చూడూ అని. వినకుండా ఎంతేసి పెట్టి కొందో చూడు. ఆఖరికి ఊళ్లో పంచడానికి కూడా గ్రాండ్‌గా ఉండాలని ఎంత ఖర్చు పెట్టిందో చూడు. పెళ్ళికొడుకు తరఫువాళ్లు అయివుండీ వాళ్లు కాపీనం చూపించారు’’ చిన్న మేనత్త అంది. ‘‘పోనీ ఓ పని చేయవే బుజ్జీ. రేపు పెళ్ళికి ఎలాగూ వాళ్లకి బట్టలు పెట్టాలి కదా. నీకు పెట్టిన చీర మళ్లీ వాళ్లకే పెట్టెయ్ సరిపోతుంది’’ పెద్దమ్మ అక్కసుగా సలహా ఇచ్చింది. ‘‘ఛ. ఛ. అట్లా చేస్తే ఏం బాగుంటుంది? వాళ్లేదో పల్లెటూరువాళ్లు. తెలసో తెలియకో ఏదో కొన్నారు. దానికి ఎందుకలా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? నాలుగుసార్లు కట్టి విడిచే చీర కోసం ఇంత గుంపు చింపులు పడాలా?’’ చిన్నాయనమ్మ పెళ్ళికొడుకు వాళ్లని వెనకేసుకొచ్చింది. ‘‘పెళ్ళికొడుకుది దీని అత్తగారి ఊరని చూడవే ఎలా సమర్థించుకొస్తోందో. దాని కొడుకు పెళ్ళి జరిగినప్పుడు అది నచ్చలేదనీ ఇది నచ్చలేదనీ ఎంత తిరణాల చేసిందో మనం మర్చిపోయామనుకుంటోందేమో కర్రిది’’ నానమ్మ చెల్లెల్ని ఎగతాళి చేసింది. ‘‘నీ గోల పాడుగానూ, అటు తిరిగి ఇటు తిరిగి నాకు పెడతావేమే? నీ ఊరుకొచ్చానా? నీ సోది కొచ్చానా? ఏదో పెళ్ళిల్లు. నిష్ఠూరాలెందుకు? మనసులు బాధ పెట్టుకోకండల్లా అని అన్నాను గానీ’’ చిన్నాయనమ్మ ఉడుక్కొంది. అందరూ ఫక్కుమన్నారు. ‘‘అవన్నీ కాదుగానీ గీతమ్మా. ఇప్పటికేదో అయిపోయిందనుకో. పెళ్ళికూతురికి పెట్టాల్సిన నగలూ, చీరలూ పెట్టలా వాళ్లు. ఇదంటే ఏదో నలుగురి మధ్యనా అయిపోయింది. రేపు పెళ్ళి అంటే ఇలా కాదుగా. అందరూ పెళ్ళికూతురు పెళ్ళికూతురు అని ఎగబడి చూస్తారు. ఎలా ఉంది? ఏం నగలు పెట్టింది? ఏ చీర కట్టింది? ఎంత ఖరీదుది కట్టింది అని వంద పరీక్షలు చేస్తారు. ఆ రోజుకి నువ్వే హీరోయిన్‌వి. నువ్వే వీఐపీవి. అందర్లో నువ్వే పెట్రోమాక్సు లైటులా ధగధగలాడాలి. పెళ్ళికొచ్చినాళ్లూ అయ్యే చీరలు కట్టి, పెళ్ళికూతురూ అయ్యే చీరలు కట్టి ఇంక తేడా ఏంటంట? పెళ్ళి కన్నా అట్లా జరక్కుండా చూడు. ఆ అబ్బాయితో అప్పుడప్పుడూ మాట్లాడుతున్నావంటగా. అతనితో గట్టిగా చెప్పెయ్యి. ఇలా వివరం గివరం లేని పనులు చెయ్యొద్దని. మన లెవిలుకి తగ్గట్టు పెట్టమను ఏది పెట్టినా’’ అమ్మమ్మ చిన్నపాటి లెక్చరిచ్చింది. పెళ్ళికూతురి మొహం చిన్నబోయింది. మొహం కళ తప్పింది. కోపంతో అదురుతున్న పెదాలతో సెల్ చేతిలోకి తీసుకుంది. ‘‘ఏదో గొప్ప సంబంధం గొప్ప సంబంధం అంటే కామోసనుకున్నాను. ఇదేం సంబంధమే. ఒక్క సూట్ పెట్టడానికి అన్ని నీల్గుళ్లు నీల్గారు. మొన్న సుబ్బయ్యగారి అచ్యుతరామయ్యగారి కొడుక్కి ప్రదానానికే రెండు సూట్లు పెట్టారు. ప్రదానబ్బట్టలు వెండి పళ్లాలలో పెట్టి అందించారు. పెళ్ళికూతురి తల్లికి ఎంతవరకూ కిందా పైనా చీర సర్దుకోవడమే సరిపోయింది. కనీసం పెళ్ళికొడుకు తరఫువాళ్లని భోజనాలకు లేవండని చెప్పినాళ్లు కూడా లేరు. అదేదో ఎంత బఫేనో డఫేనో అయితే మాత్రం భోజనాలకు రండని అన్నా చెప్పొద్దా?’’ పెళ్ళికొడుకు నాయనమ్మ మొహం ముటముటలాడించింది. ‘‘మరేనే అక్కా బాగా చెప్పావు. ఎంతవరకూ వాళ్ల హంగూ ఆర్భాటం చూపించుకోవడమే గానీ అసలు ఏం మర్యాదలు చేశారని. ఆడాళ్లకు గంధం, పసుపు పెట్టడానికి ఒక్కదానికి చేతకాలా! ఊరికే ఇకఇకలూ పకపకలూ. అక్కడికి ఏదో పెద్దపట్నం నుంచీ దిగి వచ్చినట్టు. ప్రదానంలో కార్లు పెట్టేవాళ్లు కూడా ఈళ్లంత బడాయి పోరు’’ ఇరుగింటి సరోజనమ్మ వంత పాడింది. ‘‘ఊళ్లో పంచడానికి లెక్కపెట్టి మరీ మూడొందల గడపంటే మూడొందల గిఫ్టులు పంపించారు. జీతగాళ్లు నాతగాళ్లు ఉండరా ఏంటి? ఇంకో పాతికో పరకో అదనంగా పంపుకోరూ? పెళ్ళికూతురి పెద్దమ్మ అనుకుంటా సూరేకాంతంలా ఉంది. మొహం చూసి ముద్ద ఏసేరకం. లెక్కపెట్టి మరీ ఇచ్చిందమ్మా మహాతల్లి. మా బుడ్డది నాక్కూడా ఆ సంచీ కావాలని ఏడ్చి గీపెట్టింది. నా సంచీ ఇవ్వబోతే తీసుకోలా? అంత ఏడుపు చూస్తా కూడా ఇంద తీసుకో అని ఓ సంచీ పిల్ల చేతిలో పెట్టిందేమో చూడు. అయి పిల్లలకు కాదులే పెద్దాళ్లకు అని ఓ మాట అని ఊరుకుంది. ఇంతా చేస్తే అందులో ఏం ఉందని? ఓ బొచ్చె, ఓ లడ్డు, రెండు అరటిపళ్లు. దీనికే అంత కాపీనం పోయింది’’ పెళ్ళికొడుకు పిన్నమ్మ ఎత్తి పొడిచింది. ‘‘అయినా నాకు తెలీక అడుగుతానూ. పెళ్ళికొడుకు తల్లనే గానీ దీనికి ఏమంత వయసు మించి పోయిందని? అదెప్పుడు గద్వాల చీరలు కట్టాలి? ఏ ఉప్పాడ పట్టుచీరో పెడితే పోయేదానికి? ఒరే అబ్బడూ ఇప్పుడే చెబుతున్నా. ఏదో ప్రదానం కాబట్టి సరిపోయింది. రేపు పెళ్ళి కూడా ఇట్టాగే జరిగితే నీ ఇంటి గడప కూడా తొక్కనబ్బాయ్. ఇప్పుడే చెబుతున్నా. పెళ్ళికొడుకు వాళ్లం ఆ మాత్రం బెట్టుగా ఉండకపోతే తాటాకులు కట్టేస్తారు తాటాకులు’’ పెళ్ళికొడుకు అమ్మమ్మ హెచ్చరించింది. ‘‘అవునే సావిత్రీ. మనూరోళ్లకి మరీ పట్టింపులెక్కువ. మొన్న జానకిరామయ్యగారి మనవరాలి పెళ్ళిలో మర్యాదలు సరిగా లేవని మగపెళ్ళివారు భోజనాలకు లెమ్మన్నా లెగలేదట. వాళ్లని బతిమిలాడి బామాడి భోజనాలకు లేపిచ్చేసరికి తాతలు దిగొచ్చారంట. ఏదన్నా తేడా జరిగిందంటే మనూరోళ్లతో అసలు ఏగలేమే తల్లీ. నీ కొడుకు పెళ్లితో మొదలెట్టి మనవడి పెళ్లి అయ్యేవరకూ దెప్పుతూనే ఉంటారు. ఎకసెక్కాలు ఆడుతూనే ఉంటారు. నీ మంచికే చెబుతున్నా. ఎలాంటి లోటూ జరక్కుండా చూసుకో’’ పెద్దమ్మ సలహా ఇచ్చింది. ‘‘అరేయ్. పెళ్ళికూతురు, అదే ఆ పిల్ల గీతమ్మో, రేకమ్మో ఏదో నువ్వు మాట్టాడుతుంటావుగా ఆ పిల్లకు గట్టిగా చెప్పు. రేపు పెళ్ళిలో మర్యాదలు సరిగా లేకపోతే గోలైపోతుందని’’ చిన్నమ్మ హెచ్చరించింది. పెళ్ళికొడుకు మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ముక్కుపుటాలు అదురుతుండగా కోపంతో సెల్ తీసుకున్నాడు. ‘‘హలో, నేను వంశీని.’’ ‘‘చెప్పండి’’ పెళ్ళికూతురి గొంతులో ఇదివరకటి మార్దవం లేదు. ‘‘ఏం లేదు. మీతో ఒక మాట చెప్పాలి. ఫ్రీగా ఉన్నారా?’’ ‘‘ఫరవాలేదు. చెప్పండి.’’ ‘‘ఏం లేదు. నిన్న జరిగిన ఎంగేజ్మెంట్లో సరిగా మర్యాదలు జరగలేదట. పెట్టిన బట్టలూ అవీ అంత బాగులేవుట. మా వాళ్లంతా కోపంగా, అసంతృప్తిగా ఉన్నారు’’ వంశీ అన్నాడు. ‘‘మావాళ్లు కూడా అలాగే ఉన్నారు’’ గీత గొంతులో కరుకుదనం. ‘‘మీరేం అనుకుంటున్నారు దాని గురించి?’’ ‘‘అనుకోడానికేముంది? వాళ్లన్నదానిలో నాకేం తప్పు కనిపించలేదు.’’ ‘‘ఇలా అనుకుంటారనే నేను ఫోన్ చేసింది. నేను మావాళ్లకు ఒకటే చెప్పదలచుకున్నాను. మేం పెళ్లి చేసుకునేది మా కోసం. మా జీవితం కోసం. మేం సంతోషంగా జీవితం గడపడం కోసం. మీకు పెట్టే చీరల కోసం, నగల కోసం కాదు. ఇలా పేచీలు పెడితే నేనసలు పెళ్ళి మండపం గడపే తొక్కను అని. మీరే చెప్పండి. ఇది మన జీవితం. అవునా కాదా?’’ వంశీ ఆవేశంగా అన్నాడు. గీతకి ఏం అనాలో తోచలేదు. సగం సంతోషం, సగం దుఃఖంతో గొంతు ఉండచుట్టుకుపోయింది. ‘‘అన్నట్టు గీతా, మీకోసం కొన్న చీర నేనే సెలక్ట్ చేశాను. ఆడవాళ్ల చీరల గురించి నాకేం తెలుసు? అందులో ఖరీదైన చీర. నేను సెలక్ట్ చేస్తా, నీకేం తెలీదు నువ్వూరుకో అంది అక్క. కానీ మా ఇంట్లో అడుగుపెడుతున్న మీకు మొట్టమొదటగా మా తరఫున పెడుతున్న చీర. అది నేను సెలక్ట్ చేస్తేనే బాగుంటుందనిపించింది. నిజంగా చెప్పండి. చీర బాగుందా లేదా?’’ వంశీ అడిగాడు. ఎండా వానా కలగలిసిన ఇంద్రధనుస్సులా కన్నీళ్లతో నవ్వింది పెళ్ళికూతురు.