సాలభంజికల సింహాసనం | Vikramarka Vijayam Movie Story In Funday | Sakshi
Sakshi News home page

సాలభంజికల సింహాసనం

Published Sun, Jun 30 2019 8:18 AM | Last Updated on Sun, Jun 30 2019 8:18 AM

Vikramarka Vijayam Movie Story In Funday - Sakshi

గిడుతూరి సూర్యం దర్శకత్వంలో రామకృష్ణ, యస్వీరంగారావు, బాలయ్య... ప్రధాన పాత్రలు పోషించిన సినిమా (1971)లోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
‘‘విక్రమార్క మహారాజా! ఊర్వశీ రంభల నాట్యాన్ని తిలకించిననాడు మీరు ఇచ్చిన తీర్పుకి మెచ్చి మహేంద్రుడు పంపిన బహుమానం 32 సాలభంజికలు గల ఈ సింహాసనం. దేవలోక పట్టాభిషేకం నాడు పరమేశ్వరుడు మహేంద్రునికి ఇచ్చిన ఈ సింహాసనపీఠం మీకు ఇవ్వబడింది. మా అందరికీ నేత్రోత్సవంగా ఈ భద్రపీఠాన్ని అనుష్ఠించండి మహారాజా!’’ అంటూ మహారాజును ఆహ్వానించాడు భట్టి.
‘జయీభవ! విజయీభవ!’ అంటూ నినాదాలు మిన్ను ముట్టాయి.
మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న సమయంలో..
‘‘ఆగండి’’ అనే అరుపు వినిపించింది.
ఎవరో విప్రుడు.
‘‘ఎవరు నువ్వు?’’ అని గట్టిగా అడిగాడు భట్టి.
‘‘నేనొక పేద విప్రుడిని. మీ నగరంలోనే ఆకలి చిచ్చుతో అలమటించిపోతున్నాను. మీరు ఆనందంగా సింహపీఠం అలంకరిస్తున్నారు. ఇది ధర్మమేనా’’ అన్నాడు ఆవేదనగా ఆ విప్రుడు.
‘‘ఏమిటి! మా రాజ్యంలో విద్యావంతులైన మీకు దారిద్య్ర బాధా? మహామంత్రి! తక్షణమే వీరికి వెయ్యి సువర్ణములు ఇప్పించండి’’ అని ఆదేశించారు మహారాజు.
సంచిలో సువర్ణములు వచ్చాయి.
కానీ పేద బ్రహ్మణుడి ముఖంలో వెలుగు లేదు.
‘‘మహారాజా! నాకొక నియమం ఉన్నది. కష్టార్జితమైన ధనమే నేను దానంగా స్వీకరిస్తాను’’ అన్నాడు నిర్మొహమాటంగా.
‘‘తమ శౌర్యప్రతాపాలతో దిక్కులు జయించి పరిపాలిస్తున్న మహారాజు కష్టార్జిత ధనం కాదా ఇది’’ ఆశ్చర్యపోయాడు భట్టి.
విక్రమార్క మహారాజులు మాత్రం విప్రుడి మాటలకు కోపం తెచ్చుకోకపోగా ఏదో బోధపడినట్లు శాంత స్వరంతో ఇలా అన్నాడు:
‘‘నిజమే ఇది మా కష్టార్జిత ధనం కాదు. ఇది ప్రజాధనం. మా విజయ పరంపరకు కారకులు సామాన్య సైనికులు. మా ధనాగారం నిత్యం పెంపొందించినవారు చెమటోడ్చినవారు కష్టజీవులు. రెండు ఘడియల గడువు ఇవ్వండి. సామన్యపౌరుడిగా కాయకష్టం చేసి ధనం సంపాదించి మీకు ఇస్తాను’’
‘‘ఆ రెండు ఘడియలూ సింహసనంపై కూర్చొనే అవకాశం నాకు ఇవ్వండి’’ అడిగాడు ఆస్థాన విదూషకుడు.
‘‘విదూషకా! అలాగే. నీ పరిపాలన చూసి వినోదిస్తాను’’ అన్నారు మహారాజు.
‘‘కాదు విచారిస్తారు. నా పరిపాలనలో కష్టపడి డబ్బు సంపాదించాలనుకునే మీలాంటి వారికి ఎలాంటి  ఉద్యోగం లభించకూడదని శాసనం జారీ చేస్తాను. అప్పుడు ఎలా సంపాదిస్తారో నేనూ చూస్తాను’’ అన్నాడు విదూషకుడు.
‘‘నీ పరిపాలన ప్రారంభించు’’ అని విదూషకునికి సింహాసనం చూపించాడు మహారాజు.
ఈలోపు ‘మహారాజా!’ అంటూ గట్టి పిలుపు వినబడింది.
విప్రుడు మాయమై దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు!
‘‘దేవేంద్రా మీరా!’’ ఆశ్చర్యంగా అన్నాడు మహారాజు.
‘‘ఇంతటి ధర్మమూర్తివై నీవు ఈ భూమండలంలో జీవించి ఉన్నంత కాలం ఈ పవిత్రపీఠం అలంకరించే అర్హత నీకు తప్ప ఎవరికీ లేదు. నీ పాలన స్వయంగా పరికించి పరమానందం పొందాను. వెయ్యి సంవత్సరాలు ఈ భద్రపీఠంపై వెలుగొందు దీవెన ఇస్తున్నాను’’ అని విక్రమార్కుడికి వరం ఇచ్చాడు దేవేంద్రుడు.
....
ఒంటరిగా కూర్చొని తనలో తాను బాధపడుతున్నాడు విక్రమార్కుడు.
‘‘అన్నగారూ... ఇంతటి మహదానంద తరుణంలో ఆలోచన నిమగ్నులై ఉన్నారు!’’ అడిగాడు భట్టి.
‘‘భట్టీ! నువ్వు లేని వెయ్యేండ్ల నిస్సారమైన జీవితం ఎలా గడపగలను!’’ తన మనసులో బాధను చెప్పాడు విక్రమార్కుడు.
ఆ మాటకు భట్టి కదిలిపోయాడు. కళ్లలో కన్నీటి పొర.
‘‘మరణంతో మీ సేవాభాగ్యం పోగొట్టుకునే ఆ దౌర్భగ్య స్వర్గారోహణ నాకెందుకు మహారాజా! భద్రకాళిని ప్రార్థించి బహుకాలం జీవించే వరం పొంది వస్తా’’ అని బయలుదేరాడు భట్టి.
∙∙ 
భుజం మీద శవంతో విక్రమార్కుడు కాళీ దగ్గరకు వెళుతున్నాడు.
ఎక్కడి నుంచో గొంతు వినిపించింది.
‘‘విక్రమార్కా! నేను భేతాళుడిని. ఈ దొంగసన్యాసిని వధించు. నేను నీకు వశం అవుతాను’’
‘‘మహారాజా! దేవికి సాష్టాంగ ప్రమాణం చెయ్‌’’ అన్నాడు దొంగ సన్యాసి.
‘‘అదెలాగో నాకు తెలియదు. చేసి చూపించండి’’ అని తెలివిగా అడిగాడు విక్రమార్కుడు.
దొంగ సన్యాసి వంగగానే మెడపై వేటు వేశాడు విక్రమార్కుడు.
అప్పుడు భేతాళుడు ప్రత్యక్షమై...
‘‘క్లీం అలా క్లీం...విక్రమార్క మహారాజా! నేనే మీకు వశం అయ్యాను’’ అన్నాడు.
‘‘మంచిది భేతాళా. ప్రపంచంలోని వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు’’ అని భేతాళుడిని ఆదేశించాడు విక్రమార్కుడు.
కొద్దిరోజుల తరువాత భేతాళుడు ప్రత్యక్షమై...
‘‘ఆ వీరసేనుని అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశా. దురంహకారంతో శపథం చేశాడు. సాలభంజికల పీఠాన్ని తాను అధిష్ఠించి మిమ్మల్ని శాసిస్తాడట. ఎంతటి దురహంకారం’’ అన్నాడు కోపంగా భేతాళుడు.
∙∙ 
వీరసేనుడు భీకరంగా తపస్సు చేస్తున్నాడు.
కాళీమాత ఎంతకీ కనికరించడం లేదు.
ఇక ఆగలేక కత్తితో కడుపులో పొడుచుకొని పేగుల్ని బయటకు తీసుకున్నాడు...
అప్పుడు కాళీమాత ప్రత్యక్షమైంది.
‘‘ఏమి కోరి ఈ తపస్సు?’’ అని అడిగింది.
‘‘ఇంద్రజాల, మహేంద్రజాల, అంజన, ఆకర్షణ, ఉచ్ఛాటన, పరకాయప్రవేశాది సమస్త విద్యలు నా హస్తగతం కావాలి. నన్ను అనుగ్రహించి పాలించు మాతా’’ అని వేడుకున్నాడు వీరసేనుడు.
‘‘కుమరా! నీవు కోరిన దివ్యశక్తులు ప్రసాదిస్తున్నాను. దుర్వినియోగం కానంత వరకు, నా ముందు ఉన్న ఈ అఖండజ్యోతి ఆరనంత వరకు నీవు ఈ శక్తులు కలిగి ఉంటావు’’ అని వరం ఇచ్చింది మాత.
వీరసేనుడిలోని గర్వం పదింతలు పెరిగింది.
పట్టలేనంత ఆహంకారంతో...
‘‘ఓరీ విక్రమార్క! ఇక నీ మృత్యురూపమును ధరింతునురా’’ అని అరిచాడు.
జవాబు: విక్రమార్క విజయం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement