మిత్తా మాయమై పోనావా...! | Sad Ending Telugu Story By Patnaikuni Venkateswara Rao | Sakshi
Sakshi News home page

మిత్తా మాయమై పోనావా...!

Published Sun, Feb 23 2020 10:11 AM | Last Updated on Sun, Feb 23 2020 10:11 AM

Sad Ending Telugu Story By Patnaikuni Venkateswara Rao - Sakshi

కోడి కూసింది. చెంబు పట్టుకొని ఊరి గోర్జివైపు వెళ్లిన సొండి రామ్మూర్తి పెద్ద కేకేశాడు..అవురా ఇంటికేసిన తాళం అలానే ఉంది... సవరోళ్లు మాయమై పోనారని. ఇంకేం అది ఆళ్లపనే ఆళ్లకు మంత్రాలొచ్చురా..నాను మొన్ననే అనుకున్నానెస్‌..తొత్తుకొడుకులు మా ఆవుపడ్డకేసి ఒకటే సూపు సూసినాడా..అది అనంగ ఇరగబడి పోయిందెస్‌..అని వెనకనే ఉన్న పాలేసు తన అనుభవం చెప్పేశాడు. ఊరంతా మళ్లీ కలకలం..ఆ గందరగోళంలోనే కళ్లంనుంచి ఇంటికొచ్చిన ఈశ్వరుడికి వెక్కిరిస్తూ కనిపించాయి మిత్తలు తెచ్చిన పట్టుతేనె, వెదురు బియ్యం,అరటి గెలలు..రాత్రేమయ్యిందో తెలీదు..ఇల్లనుకొని వచ్చిన సవరలు ఎందుకెళ్లిపోయారో తెలీదు..తన తాతల నుంచి సాగిన స్నేహబంధాన్ని ఎవరు తెంపేశారో అర్థం కాలేదు..అయితే ఏదో అనుకోనిది జరిగిందన్నది అర్థమైంది. కంట తడిపెట్టుకున్నాడు..‘ఓరయ్యా పల్లకోరా ఏటి సిన్నపిల్లడినాగా ’అని కొడుకులు కసురుకుంటున్నా మిత్తల అమాయక మొహాలే తనను నిలదీస్తున్నట్లు ..నువ్వేం పెద్ద మనిషివయ్యా..అని చీదరించుకుంటున్నట్లు భావన గుండెను పిండేస్తోంది.

తూర్పు గాలి వీస్తోంది.రాత్రి ఎనిమిది దాటుతోంది. ఊరంతా భోజనాలు ముగించి వాకిళ్లలో కూర్చున్నారు.పిల్లలంతా ఈత చాపలు, దుప్పట్లు పట్టుకొని పరుగులు తీస్తున్నారు.అంతా ఒకటే హడావుడి. బుడబుడకల సూరిగాడి పాటట..‘ఓహ్‌ తుంగాం సూరిగాడి ఏసం కట్టి పాటెత్తుకుంటేనే ఓలప్పా సరస్వతి చెపుతోంది..అంకమ్మతో. కమ్మగా ఉంతాదే. రెక్కల రంభ కథ ఎప్పుడైనా ఇన్నావే. ఆడి మాటకేంగానీ పక్కన అంజిగాడు బుడబుడకల కుండతోటి రక్తి కట్టిత్తాడే. గతేడాది కార్తీక నోములప్పుడు భీయమ్య మామోళ్ల ఇంటికాడ ఆడించినారు కదా..నీకు ఎరికి నేదేటి అని పక్కనే ఉన్న గుణ్నమ్మ గుర్తుచేసింది.’’ ఇలా ఆడా,మగా సూరిగాడి కథకోసం వీధి అరుగుల మీద కూర్చున్నారు. ఆ రోజు అంగ ఈశ్వరుడింటికి వచ్చిన మిత్త మంగయ్య ‘ఏమిటి బావ్‌.. కథా..’ అని ఉడుకు అంబలి బువ్వలో..కాల్చిన ఎండు చేపలు, తోట కూర పులుసుతో తింటూ తనతో పాటే తింటున్న ఈశ్వరుడు కొడుకు రామ్మూర్తిని అడుగుతున్నాడు.

మంగయ్యది ఒడిశాలోని పర్లాఖిమిడికి ఓ 40 కిలోమీటర్ల దూరంలో ఉండే దారకొండల్లోని మిర్చిగూడ. కాపుగోదేవలసకు ఏటా కొడుకులు, ఇతర బంధువులతో వస్తుంటాడు.ఈ బంధం ఓ మూడు తరాలనుంచీ సాగుతోంది. కొండకోనల్లో బతుకులీడ్చే  అమాయకపు సవర గిరిజనుల గుండెల్లో నిండా ఉండేది పచ్చని అనురాగం. అల్లుకున్న ఆత్మీయత. కొండ లోతుల్లో ఉండే వారు సమీప గ్రామాల్లోని సంతలకు వచ్చినప్పుడు మైదానం ప్రాంత  రైతులను కలుస్తుంటారు. అడవి తల్లి ఇచ్చే చింతపండు, ఇప్పపువ్వు, పోడు సాగుద్వారా వచ్చే కందులు, అరటి, పుట్ట తేనె,  వంటి వాటిని కావిళ్లతో సంతలకు తెచ్చి అమ్ముతుంటారు. ఆ సంతల్లోనే రైతులతో మాటామాట కలుస్తుంది. వాటిని మమతలుగా అల్లుకొని ఎవరైనా నచ్చిన రైతు కనిపిస్తే మిత్తకడదామా (స్నేహం చేయడం) అని అడుగుతారు.

అదేదో ఒక్క నిమిషంలో అయిపోయే తంతు కాదు. ప్రతిపాదితుల మధ్య ఏళ్లపాటు.. కాదు.. కాదు కొన్ని జీవితాల పాటు సాగే స్నేహ బంధం . అందులో స్వార్థం ఉండదు. నువ్వూ, నేను అనే బేధం ఉండదు.అగ్ని సాక్షిగా ఆ బంధాన్ని శాశ్వత పరచుకుంటారు. ఇందుకు ఓ ప్రత్యేక కార్యక్రమం గూడెంలో ఏర్పాటవుతుంది. ఆ గూడెం పెద్ద ఓ చిన్న క్రతువు జరిపిస్తాడు. మిత్తకోరుకునే వారిని ఊరి మధ్యలోకి పిలుస్తాడు. చిన్న హోమం ఏర్పాటు చేసి తనకు వచ్చిన మంత్రాలను చదువుతాడు. వారి స్నేహం స్వచ్ఛంగా, అడవంత పచ్చగా,తేనంతటి  తియ్యగా సాగాలని కొండ దేవతకు మొక్కుతాడు.తాము నిత్యం ఆరాధించే ప్రకృతి దేవతలను ఆవాహనం చేసి సాక్షులుగా పిలుస్తాడు. దీంట్లో మిత్త (గిరిజన స్నేహితుడు), మైదాన ప్రాంతానికి చెందిన రైతు, వారి కుటుంబీకులు పాల్గొంటారు. ఇరువురూ అందరి సమక్షంలో బాసలు చేస్తారు. ఓ చీపురు పుల్లను తీసుకొని రెండుగా చీల్చి చెరో పక్కకు వ్యతిరేక దిశలో విసిరి వారిని ఎవ్వరూ వేరు చేయకుండా ఉండాలని దోష నివారణ సంకేతాన్ని చూపి వారి చేతులు కలుపుతాడు.

ఇలా వారు అప్పటినుంచి ఆత్మీయంగా మిత్తా అని పిలుచుకుంటారు. వారి భార్యలను మిత్తమ్మా అంటారు. ఈ క్రతువు ఇంచుమించుగా రామాయణంలో రాముడు, సుగ్రీవుడు చేసుకున్న స్నేహ ఒడంబడిక లాంటిదన్న మాట.ఈ సందర్భంగా రైతు తన సవర మిత్రునికి పంచెల చాపు, పౌడరు డబ్బా,తాను పండించిన ఉత్పత్తులను బహుమానంగా ఇస్తే, గిరిజన నేస్తం ప్రతిగా తాను స్వయంగా సేకరించిన ఇప్పపువ్వు, తేనె, వెదురు బియ్యం ఇస్తాడు. కాస్త సారా లాగించాక వారంతా అడవిలో ఓ రెండు రోజులు ఆనందంగా గడుపుతారు. అంతే కాదు..మిత్రుడ్ని సాగనంపినప్పుడు కావుళ్లతో అటవీ ఉత్పత్తులు, మామిడి బద్దలు బహుమానంగా ఇచ్చి పంపుతాడు. ఇక అక్కడినుంచి ఏటా సంక్రాంతి సమయంలో రైతు నేస్తం ఇంటికి వస్తాడు. అలా మిత్తలు వచ్చారంటే పల్లెల్లో సందడే సందడి. గిరిజన ఆహార్యంలోనే మిత్తలు తమ ఇళ్లకు వచ్చి  వచ్చీ రాని తెలుగులో తన నేస్తానికి కుశల ప్రశ్నలు వేస్తుంటే ఆ సన్నివేశం చూసేందుకు ఊరంతా గుమిగూడుతుంది. వారున్నన్ని  రోజులూ రైతులూ ఆప్యాయంగా చూసుకుంటారు. పిల్లలకూ, ఊరి పెద్దలకూ వారిని పరిచయం చేస్తుంటారు. వారూ తమ నేస్తాలతో కలసి సరదాగా సేద్యం పనుల్లో సాయం చేస్తుంటారు.

ఇలా మంగయ్య అంగ ఈశ్వరుడి ఇంటికి కొడుకులతో వచ్చాడు. అదే రోజు ఊరిలో బుడబుడకల సూరిగాడి పాట ఉండడంతో మంగయ్యా ఆ కథ వినాలని సంబరపడ్డాడు.. దీన్ని పసిగట్టిన ఈశ్వరుడు..కొడుకు కృష్ణమూర్తిని పిలచి..‘ఓరె కుష్టా..మిత్తలకి అప్పోళ్ల ఇంటి అరుగు మీద చాపేసి  కూకో పెట్రా, అక్కడైతే కథ కమ్మగా ఇంతారు.’ అని చెప్పి తాను ఊరి చివరన ఉన్న కళ్లంలో పడుకునేందుకు వెళ్లి పోయాడు. అప్పుడు రాత్రి 9 గంటలు..సూరిగాడు పాటకోసం గొంతు సవరించుకుంటున్నాడు. ఆచారం ప్రకారం ఆడ వేషం కట్టాడు...అంజి బుడబుడకల కుండను ‘టిర్రిం..టిర్రిం..డుబుక్‌..డుబుక్‌’ అని నాలుగు దరువులు వేసి కథకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఊరంతా...పాటకోసం నిశ్శబ్దం..ముందుగా గణపతి ప్రార్థన అయ్యింది. సూరిగాడి లయలో తేడా గమనించిన అంజిగాడు అవునవునూ..అంటూ సమయస్ఫూర్తిగా సవరించే ప్రయత్నం చేశాడు.

మళ్లీ హాస్యం పేరిట నాలుగు గెంతులు ..గ్రామ పెద్దలనూ, గ్రామ అమ్మవారిని పొగిడాడు. ఈ దృశ్యాన్ని మంగయ్య కొడుకులతో సహా ఆశ్చర్యంగా చూపుతిప్పుకోకుండా చూస్తున్నాడు. తమ గూడల్లో ఆడతారు, పాడతారు గానీ ఇదంతా కొత్తగా ఉంది. అందుకే అరుగు దిగీ మరీ ముందుకు వచ్చి కూర్చున్నాడు. మళ్లీ  సూరిగాడిని సరిచేసే దిశగా అంజిగాడు ఓ మోటు హాస్యం రువ్వి..‘ఆయమ్మ రెక్కల రంభ..ఓయమ్మో సజ్జవుతోంది గావాలప్పా..అందుకే పాపకు నోరు పెగల లేదు..మాట్లాడవే.. రంభా..అంటూ సూరిగాడికి పాత్రను గుర్తుచేశాడు. ఇక తప్పదనుకున్న సూరిగాడు..ఆ యొక్క రెక్కల రంభ.. అందాల సుందర రాశి..అంటూ తడబడుతూనే కథను ప్రారంభించాడు.

గొంతును సవరించుకుంటున్నా ..నాలిక తిమ్మిరెక్కి పోతోంది. ఓ గెంతు గెంతి పాటకు ఊపుతెద్దామనకున్నోడు  కాస్తా విరుచుకు పడ్డాడు. అదీ సరిగ్గా..మంగయ్య చూస్తున్న వైపే.. ఇదేదీ అర్థం కాని మంగయ్య అదీ కథలో భాగమనుకుంటున్నాడు. ఊర్లో అలజడి..ఓరె ఏమైందెస్‌..శేషయ్య కేకేశాడు.సూరిగాడు.. ఏదో చెప్తున్నాడు. ఎవరికీ అర్థం కావడం లేదు. అంజిగాడికీ ఏమీ పాలుపోవడం లేదు. ఇదేంటీ ఈడినాగా అనుకుంటూ ..తనకు సందేహం వచ్చినా బయట పడితే బడితె పూజ అవుతుందని భయపడి..మెల్లిగా అన్నాడు..ఇది గాలిపని అయ్యుంటాదయ్యా అని. ఇంతలో సూరిగాడు సవరమంగయ్య వైపు చెయ్యచూపుతూ ..ఏదో చెప్తున్నాడు.అంతా కేకలు..అరుపులు..ఇంతలో ఎవరో చెప్తే సొండి రామ్మూర్తి వచ్చాడు. మరోవైపు శాంతారావు కేకలేశాడు. ..ఒరే అది సవర దెయ్యమటరా..అని అంటే..అందరూ ఓలమ్మా సిల్లెంగెట్టేసుంటారర్రా...

సూరిగాడు ఆడేసికం ఏత్తే ఆడోళ్లే సూపు తిప్పుకోనేరు..అంటూ ఇది చేతపడి పనే అని ఎప్పుడూ శివాలేసే రెయ్య గణ్ణెమ్మ తేల్చిపడేసింది. ఇంకేటెస్‌ ..అంగోళ్లు ఇంటికి వచ్చిన సవరోళ్ల పనేనే అని పారమ్మ మద్ధతు పలికింది. ‘నాను సూసినానే ఆడు పెందిలికాడినుంచి అందరు దుక్కూ మిటుకూ..మిటుకూ మని సూత్తన్నాడే ’ అని సాక్ష్యం చెప్పేసింది. ఇంకేం ఊరంతా ఇది ఆళ్లపనే అని తేల్చి పారేశారు. అప్పటికి పరిస్థితి అర్థమైన మంగయ్య, కొడుకులూ వణికి పోతున్నారు.‘ బావ్‌..మేం మిత్తకోసం వచ్చినం..మాకేంటీ బాధ...’ అని ఏడుపు గొంతులతో అంటున్నా పట్టించుకునే వారే లేరు. ఎవరు ఎవరికి చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఆఖరికి అంతా కలసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆళ్ల ముగ్గుర్నీ ఊరి చివర ఉన్న ఓ ఇంట్లో కట్టేసి రేపు పంచాయతీ పెట్టాల అని. ఈ లోపు కొందరు సూరిగాడ్ని మోసుకెళ్లి ఓ అరుగుమీద పడేశారు. ఏం మాట్లాడితే ఏమొస్తాదో అని అంజిగాడు నోరు కుట్టేసుకున్నాడు. దీనిమీద రాత్రంతా రకరకాల కథలు..పరస్పరం నడిచాక అందరూ నిద్రలోకి జారుకున్నారు.

గదిలో బందీలైన మంగయ్య కొడుకులతోనూ చాలాసేపు మాట్లాడలేక పోయాడు. ఇప్పటికి మూడు తరాలుగా ఆ ఊరు వస్తున్నా ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ప్రేమతో వస్తే ఇలా ప్రాణాలమీదకు వచ్చిందేమిటా అని తనకు తెల్సిన దేవతలందరికీ మొక్కాడు. అడవి చీకటికి అలవాటైన ఆ కళ్లు ఇప్పుడు తప్పించుకునే మార్గాలకోసం అన్వేషిస్తున్నాయి. పులులనే ఎదిరించే తమ ధీరత్వం ఇలా బందీలై పోయిందేమిటా అని తనలో తానే ప్రశ్నించుకుంటున్నాడు. కొడుకులూ అయోమయంలో ఉండడంతో వారికి సైగలతోనే ధైర్యం చెప్పాడు. ఇంతలోనే తనకు సంకేతాలందిస్తున్నట్లుగా ఓ బల్లి చూరుపైనుంచి శబ్దం చేస్తోంది. కర్తవ్యం బోధపడింది. వేట గాడి ఎత్తుగడలా వ్యూహం పన్నాడు.

సొండి రామ్మూర్తి దెబ్బకు ఊరి చివరకు జనం అంతా పరుగెత్తారు. అందరిలోనూ ఒకటే ప్రశ్న. సవరోళ్లు ఏమైనారని ఎలా మాయమయ్యారనీ...ఈ సందడిలోనే తెలివి తెచ్చుకున్న సూరిగాడు,తోడున్న అంజి తూర్పువైపు జారుకున్నారు. ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.రాత్రి సంతబొమ్మాళి వెళ్లి తెల్లవారే వస్తున్న తామాడ రామారావుకు గట్టుచాటున వెళ్తూ..మాట్లాడుకుంటున్న అంజి,సూరిల మాటలు చెవిట్లో పడ్డాయి...‘ఓరయ్యా నువ్వు పీకలమొయ్య తాగేసి పడిపోనావని ఊళ్లో తెలిస్తే మక్కలిరగతన్నేసోళ్లు. ఆ సమయానికి సవరోళ్లు మీదకు నెపం నెట్టేసినావు గాని..నా గుండ్లో రాయిపడి పోనాది. ’ అని అంజి చెప్తుంటే అవేవీ చెవిట్లో వేసుకోని సూరి పరుగులాంటి నడకతో పొలాలకు అడ్డంబడి వెళ్తున్నాడు.

ఊర్లోకొచ్చాక రామారావు ఆ గుట్టు విప్పడంతో అంతా నోరెళ్ల బెట్టారు. మరో వైపు సవరోళ్లు తప్పించుకున్న ఇంటి చూరు వారిని వెక్కిరించింది. వర్తమానంలోకి వచ్చిన ఈశ్వరుడు.. తమ మిత్తల స్నేహాన్ని చిదిమేసిన మూర్ఖత్వాలను ఎలా ప్రశ్నించాలో తెలీక మౌనాన్ని ఆశ్రయించాడు.ఇంతలోనే గుడ్ల కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ వచ్చి ‘పెద్దయ్యా సవరోళ్లు సైనోల్లు ఇంటి పెనక ఇప్పుకొని ఎళ్లిపోనార్రా’ అని చెప్పడంతో తమ స్నేహం కాదు..కాదు పల్లెకు..అడవికీ ఉన్న తరతరాల బంధం ఎవరో తెంచేశారని కుమిలి పోయాడు..గుండె పగిలేలా రోదించాడు....ఆత్మీయత లోతులను తడుముకున్నాడు.. తమ వారి మూర్ఖత్వాన్ని ప్రశ్నించ లేక పోతున్న తన దైన్యానికి తనను తానే తిట్టుకున్నాడు.

- పట్నాయకుని వెంకటేశ్వరరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement