కథ: అప్పువడ్డది సుమీ... | Sakshi Magazine Funday: Joopaka Subhadra Telugu Story | Sakshi
Sakshi News home page

కథ: అప్పువడ్డది సుమీ...

Published Mon, Nov 21 2022 6:51 PM | Last Updated on Mon, Nov 21 2022 6:55 PM

Sakshi Magazine Funday: Joopaka Subhadra Telugu Story

నాకు కరోనొచ్చి సావు మంచాలకెల్లి లేసొచ్చిన. కరోన కష్టకాలం నుంచి జనమంత బైటికొస్తుండ్రు యిప్పుడిప్పుడే. కరోన రువ్వడి సల్లబడ్డది. మా నలుగురక్కలు నన్ను సూడనీకొచ్చిండ్రు వూరి నుంచి.

మా లచ్చక్క, రాజక్క, దుర్గక్క, సమ్మక్కలు సంచులు కిందవెట్టి, పక్కనున్న పంపుకాడ కాళ్లు కడుక్కొని నన్ను సూడంగనే మా పెద్దక్క సమ్మక్క మొకాన కొంగుబెట్టి సోకాలు బెట్టింది నన్ను బట్టుకొని.

‘నువ్వు డిల్లీకుల్లిగడ్డ సెల్లో... ఓ సెల్లా గిది వూరన్నగాకపాయె సెల్లో... ఓ సెల్లా... గిది వాడన్నగాకపాయె సెల్లో... ఓ సెల్లా... మేమే తొవ్వకద్దుము సెల్లో... ఓ సెల్లా... మాకు గావురాల సెల్లెవు సెల్లో... ఓ సెల్లా

మా సిన్నా సెల్లెవూ సెల్లో... ఓ సెల్లా... గీ కరోన గాలిపోవు సెల్లో... ఓ సెల్లా... నీకెట్లా అచ్చే సెల్లో.. ఓ సెల్లా’
గిట్లా వల్లిచ్చుకుంట ఏడిస్తే... దుక్కమ్‌ రానోల్లగ్గూడ దుక్కమెగదన్నుతది. మా అక్కలందరు కండ్లు దారలు గట్టంగ ఎక్కెక్కిపడి ఏడుస్తుండ్రు. నేంగూడ నా దుక్కాన్ని కలుపుకున్న. మల్లా సదుమాయించుకొని..

‘అరే పెద్దక్కా ఏడువకే నాకేమైంది? మంచిగనే వున్న’ అని ఆమెతోని అందరక్కల్ని వూకించిన. శోకాలు బెట్టిన పెద్దక్కను కుర్సిల కూసోబెట్టి నీల్లు తాగిపిచ్చి మొకమంత కొంగుతోని తూడ్సిన. అందరక్కలు నీల్లు తాగి నిమ్మలమైండ్రు. 

నా కాళ్లు సేతులు ఒత్తి సూసి మా లచ్చక్క ‘ఏంది సెల్లె గింత మెత్తగైనవు? కండ్లు, పండ్లెల్లి మనిషంత బొక్క బొక్కయినవు’ అన్నది.
‘గీ కరోన పాడువడ పల్లెలల్ల దాని రువ్వడి సూపియ్యలే’అన్నది దుర్గక్క.
‘దాని రువ్వడంత పట్నాల మీన్నే సూపిచ్చింది’ అన్నది రాజక్క.

తర్వాత వూరి ముచ్చట్లు, సుట్టాల ముచ్చట్లు మాట్లాడుకుంట అన్నం కూర వండుకొని తిని సాపలేసుకొని గోడకొరిగి పుర్సత్‌గ కూసున్నము. మేము ఆరుగురక్క సెల్లెండ్లము. ఒక అక్క సచ్చిపోతే అయిదుగురం మిగిలినం. మా నలుగురక్కలకు పదేండ్ల లోపల్నే పెండ్లయింది.. ఎవ్వరు సదువుకొలే. సిన్న బిడ్డెనని నన్ను సదువుకు తోలిండ్రు మా తల్లిదండ్రులు.

వాల్లను మా వూరు పక్క పక్కన పల్లెలకే యిచ్చి పెండ్లిజేసిండ్రు. నేనే సదువు, ఉద్యోగంతోటి దూరంగ హైద్రాబాదొచ్చిన. మా వూరికి ఎప్పుడోసారి బొయొస్త. కాని మా అక్కలు పక్క పక్కనే వున్నమని వూకూకె మంచికి సెడ్డకు, పండుగ పబ్బాలకు, కలుపుకోతల పనులకు కూలిగ్గూడ మా వూరికి పోతుంటరు. అట్లా వాల్లకు వూరందరితోని మంచి మాటుంటది.

వూల్లె జరిగిన సంగతులన్ని ప్రత్యక్షంగనో, పరోక్షంగనో తెలుస్తుంటయి. కరోన లాక్‌డౌన్‌లతోని నేను రెండేండ్లాయె వూరి మొకం జూడక. మా వూరి నుంచి ఎవరొచ్చినా నాకు దెల్సిన వూరోల్ల గురించి పేరుపేరున అడుగుత. యిగ మా అక్కలైతే నా కండ్ల ముందు జరిగినట్లు సినిమా ఏసి సెప్తరు. ఎవరెవరు ఎట్లా బాగుపడ్డది ఎట్లా నష్టపోయింది,

సావులు, బత్కులు, పుట్టుకలు, పంచాదులు సెడావులు, బూముల సంగతులు, గొడ్డు గోదా, పంట ఫలం, కుక్క నక్కల కాన్నుంచి సెట్టు సేమల దాకా సెప్తరు మా అక్కలు. మా రాజక్క చెప్తే నాకు సమ్మంగుంటది. మా రాజక్క ముచ్చట చెప్పితే... మూతి మూరెడు సాగదీసి యింటరు ఎవరైనా.

‘అక్కా... గా బూడిది దురుగవ్వ బాగున్నదా, గప్పుడెప్పుడో పాంగరిసిందన్నరు, గిప్పుడెట్లున్నది?’
‘ఆ... మంచిగనే వున్నది.’
‘గా వూరుగొండ సమ్మన్న ఎట్లున్నడక్కా...’
‘ఆడా..? ఆనికేమైంది సెల్లె, సింతపిక్కె వున్నట్టున్నడు. ఆడు మన పెద్దన్న తోటోడట. ముగ్గురు పెండ్లాలను సేస్కున్నా ఎవ్వతి సంసారం జెయ్యకపాయె. గిప్పుడొక్కడే అండ్క తింటండు.’

‘ఏందింటడోనే! గంత గట్టిగున్నడు సాకి బండున్నట్టు’ మా లచ్చక్క.
‘ఏందింటడు, కూట్లెకు వుప్పులేనోడు ఏందింటడు. గీల్ల సంగతేమోగని సెల్లే... నీకో ముచ్చట సెప్పాలె. మన వూల్లె ఆరోల్ల పూలక్క యెరికే గదా. గామె సావు ఏ పగోనికి రావద్దు. ఏం బత్కు, ఏం సావు. పుట్టి బుద్దెరిగినకాన్నుంచి గసోంటి సావు జూల్లే...’

‘అవు, వొయిసుల యెట్లుండె. ఆగిందా!’ అన్నది సమ్మక్క.
‘ఏ... నన్ను సెప్పనీయుండ్రి, మద్దెల రాకుండ్రి. నేనప్పుడు వూల్లెనే వున్న. ఆరోల్ల పూలక్క సచ్చిపోయినప్పుడు మీరెవ్వల్లేరు వూల్లె. నన్ను సెప్పనియ్యుండ్రి’ అని మల్లా సెప్పుడు మొదలుబెట్టింది రాజక్క.

‘ఆరోల్ల పూలమ్మంటె ఎంత సక్కదనంగుండె. మెడనిండ సొమ్ములు, సెవునిండ సొమ్ములు బెట్టుకొని అంచు సీరె గోసిబెట్టి, కాళ్లకు పట్టగొలుసులు దానిమీద కడెమ్, ఆ కడెమ్‌ మీద తోడాలు గీటినే కాళ్లకు మూడు తెగలంటరు పల్లెల. గట్ల కాల్లకు మూడు తెగలు బెట్టుకొని గల్లర గల్లర నడ్సుకుంట పోతాంటే... నిల్సుండి సూసేది ఆడోల్లు, మొగోల్లు.

గసోంటి పూలక్కకు పెండ్లిజేస్తె ఏమైందో ఏమో యిడుపు కాయితాలయి తల్లిగారింటి కాన్నే వుండే. అన్నదమ్ములు లేరు, నఅక్కసెల్లెండ్లు లేరు. ఒక్కతే పుట్టింది వొన్నలక్కోలె. ఆల్లకు యిల్లు, బూములు జాగలు గూడ మంచిగనే వున్నయి. గవ్వి కౌలుకిచ్చి తల్లిబిడ్డలు యే లోటు లేకుంట మంచిగనే బత్కిండ్రు.

అయితే సెల్లే... గామె రూపురేకలు సూడలేక వూరు గాడ్దులు కుక్కలు బడ్డట్టు ఆమెన్క బడేది. తల్లి గూడ ఆ మద్దె సచ్చిపొయింది. వొక్కతే వుండేది. మనోల్లు కనవడితె దూరముండుండ్రి, దూరముండుండ్రి... అని దూరం గొట్టినా, మాటయితె మంచిగనే మాట్లాడేది. గసోంటామెకు ఏందో ఎయిడ్స్‌ బీమారట. ఏ మందులకు, మాకులకు తిరుగని రోగమట సెల్లే...

ఔగోలిచ్చింది. పెట్టెడు పెట్టెడు సూదులు మందులు వాడినా తగ్గలే.
ఎయిడ్స్‌ రోగమని తెలువంగనే యెప్పటికి మంది వుండే ఆమె యింటికి ఒక్క పురుగు గూడ పోవుడు బందైంది. ఆ బీమారి వూరికి గూడ అంటుతదని యిండ్లకు తాళమేసి పొయిండ్రు ఆమె యింటి పక్కలోల్లు, యెన్క పక్కలోల్లు. ఆమెతోని సుకపడ్డోల్లు ఆయిపడ్డోల్లు, ఆమె సొమ్ముదిన్నోల్లు, ఆమె సుట్టు దిరిగిన వూరోల్లంత ఆమెకు మొండి జబ్బని తెల్సి ఆమె అంటుకు బోవుడు సొంటుకు బోవుడు పురంగ బందువెట్టిండ్రు.

గియన్ని గామెను ఎయిడ్స్‌ జబ్బుకన్న బగ్గ కుంగగొట్టినయి. ఆ జబ్బు పాడువడ బగ్గ తిరగబెట్టింది. ఆమె దాపున నీల్లిచ్చే దిక్కులేదు, నిలవడే దిక్కులేదు. మన అంబేద్కరు యూత్‌ పోరగాండ్లే అప్పుడో యిప్పుడో పొయి మందులు, గోలీలు, సరుకు సౌదలు పందిట్ల బెట్టొచ్చేటోల్లు ఛీ ఆమెకు అంటు ముట్టు బాగ పట్టింపు.

గట్ల మంచంబట్టిన మనిషి యెన్నడు సచ్చిపొయిందో ఏమో యింట్లకెల్లి వాసనత్తే తెలిసింది. దూరమున్న రొండిరడ్లోల్లు దప్ప అందరు వూరోల్లంత తాలాలేసి యెల్లిపోయిండ్రు. గీ బీమార్‌ రాకముందు పూలక్క యింటికి సాకలోల్లు బట్టల కోసం బొయేది. బైట వూడ్సి సల్లనీకి మాదిగోల్లు బొయొచ్చేది.

పూలక్క ఔసలి వెంకటయ్య యింటికి వూకె బొయేది. ఈ నగ, ఆ నగ, ఆ డిజైన్‌, ఈ డిజేన్‌  గిట్ల సేపిచ్చుకునేది. యిగబోతే సాలోల్లు తీరు, తీరు సీరెలు దెచ్చేది. గంగసరం సీరెలు, రాంబానం సీరెలు ఎయ్యి కొత్తగెల్లుతె అయి తీస్కపొయేది పూలక్క యింటికి. ఎప్పుడన్న దేవునికి జేసుకుంటె గౌండ్ల సారన్నోల్లు కల్లు దీస్కపొయేది.

యిగ ఆమె తల సమరు బెట్టిచ్చుకునేదానికి మంగలి కొమ్రమ్మను పిల్సుకునేది. కాలునొచ్చినా, సెయినొచ్చినా కొమ్రమ్మే పూలక్కకు వైదిగం జేసేది. యిగ బైటి పైనం బోవాలంటె ఆటో దెప్పిచ్చుకొని పోయేది. పూలక్కకు ఎయిడ్స్‌ రోగమొచ్చిందని తెలువంగనే అందరు బందైండ్రు, వొక్క మాదిగోల్ల లసుమక్కదప్ప. లసుమక్క పూలక్క ఇంటి బైట వూడ్సి సల్లుడు బందు వెట్టలే. ఆల్లీల్లు ‘లసుమక్కా ఎందుకు బోతవు పిల్లల తల్లివి. నీకా బీమారంటితె ఎట్లా? బందువెట్టు’ అంటే...

‘అందరు బందయితెట్ల? పాపం! దిక్కులేని ఆడామె. రాణిలెక్కన బత్కిన మనిషి, గిప్పుడు గీ గతాయె. యెన్కనో ముందట్నో అందరం బొయేటోల్లమే’ అని అప్పుడప్పుడు పూలక్క యింటి ముందట వూడ్సి సల్లి పొయేది లసుమక్క.

అయితే ఓనాడు ఆ పూలక్క యింట్ల నుంచి వాసనచ్చేటాలకు ఉపసర్పంచి, ఒకరిద్దరు వూరి పెద్దమనుసులు మన వాడకచ్చిండ్రు. ‘ఆరోల్ల పూలమ్మ సచ్చిపొయింది. మీరే వొచ్చి అర్జెంటుగ తీసెయ్యాలె మైసా’ అని పెద్దతనమున్న మన మైసు నాయినకు సెప్పిండ్రు.

యిగ మన మైసు నాయిన యూత్‌ పోరగాండ్లను పిల్సి సెప్పిండు వూరు పెద్ద మనుసులు వచ్చిన సంగతి.
‘పెద్దయ్యా యిప్పుడు ఎవలింట్ల పశువు సచ్చినా వాల్లే పారేసుకోవాలె అనుకున్నమా, అయినా మనోల్లల్ల మెల్లగ ఎవలో తెల్వకుంట గా పనిని సేత్తనే వున్నరు. యిప్పుడు సచ్చిపొయినామె పశువుగాదు తీసేయనీకి. ఆమె మనల ఏందిరా, ఏందే అని మాట్లాడినా, దూరంగొట్టినా ఆమింటికి మన లసుమవ్వ పొయి వూడ్సి సల్ల బోయింది మానవత్వంతోని.

యిప్పుడు వాళ్ళు మనిషి సచ్చిపొయిందని మమ్ముల తీసేయమంటుండ్రు గొడ్డును తీసేయమన్నట్లు. సచ్చిపోయినామె మనిషి. ఆమెకు మంచిగ సావు జెయ్యమని సెప్పు వాళ్ళ సూదరి కులపామే గదా! మన దగ్గెరికొచ్చి గట్లా తీసేయ మనుడేమ్మానవత్వమే? అసలు మనమే ఎందుకు తీసెయ్యాలె, ఏందీ శాపాలు మనకు?’ బాదగన్నడు యూత్‌ లీడర్‌ రాజేష్‌.

ఇంతల ఆ పెద్ద మనుషులు మన పొరగాల్లతోని ‘ఆ పూలమ్మ మంచిగ సత్తే... వూల్లె సూదరోల్లము మేమే సేద్దుము. కానామె డేంజర్‌ రోగంతోని సచ్చిపొయింది. సర్పంచి పత్తకు లేడు. వూరోల్లు చానమంది తలుపులు తాళాలు బెట్టుకొని ఎటో పొయిండ్రు భయపడి. వూల్లె అందరు అదురు బిత్తులోల్లు అగుపడ్తలేరు. గిసోంటి పనులు మా కంటె అలువాటు లేదు. మీకలువాటే గదా! జెర వూరును కాపాడుండ్రి బిడ్డా’ అన్నడు వూరిపెద్ద బతిలాడినట్లు. 

‘గిసోంటి సావులు జేస్తే మీకు దేవలోకం దొర్కుతది’ అన్నడు.
‘మీరు గూడ అలువాటు జేసుకొండ్రి. గా దేవలకమేందో మీరే పొందుకోవచ్చు గద సావుజేసి’ ఓ యూత్‌ పిలగాడు అందుకున్నడు.

సూదరోల్ల యూత్‌ పిలగాండ్లు వూల్లే శాన తక్కువ మంది కనబడ్తరు. సదువులకు, కొలువులకు సిటీలల్ల వున్నరు. ఈ యూత్‌ పిల్లలే పది, పన్నెండుకాన్నె ఆగి పోయుంటరు. కొద్దిమంది అంబేద్కర్‌ సంగాలు బెట్టిండ్రు. కొద్దిమంది రాజకీయ పార్టీలల్ల తిరుగుతుండ్రు. కొంతమంది సుతారి పనికి, రంగులేసే పనులకు బొయొస్తుంటరు. వూర్ల కంటె వాడల యూత్‌ పిలగాండ్లు బాగ కనబడ్తరు. యిగ యీ పూలక్క సచ్చిపోయిందంటే... మొత్తమే యెల్లిపోయిండ్రు వూర్ల మనుషులు.

‘వూరి నుంచి పెద్ద మనుషులొచ్చిండ్రని గూడెమ్‌ యూత్‌ పోరగాండ్లు బాగనే కూడిండ్రు. బతికున్నపుడు మమ్ముల అంటుకోరు ముట్టుకోరు. సచ్చిపొయినంక ముట్టుకుంటె అంటుగాదా? గా ఎయిడ్స్‌ పీనుగను ముట్టుకుంటే... బొందకాడికి మోస్కపోతే... ఆ జబ్బు మాకంటదా? మేం జావమా? మీరంత మంచిగ సల్లగుండాలె. మేం జావాలె.

మావోల్లు గిట్ల సత్తే... మానవత్వంగ వూరు మనుషులు మాకు సావుజేత్తరా! వూల్లె ఎవ్వల్లేనట్లు గొడ్డు సచ్చినా, గోదసచ్చినా మా గూడెమ్‌కే ఎందుకొస్తరు? మీక్కాల్లు లేవా, సేతుల్లేవా? మీరు, మేము తల్లి కడుపుల్నుంచి వచ్చినోల్లమే గదా! మీకో రివాజు, మాకో రివాజా యేందిది? ఏందీ శాపము’ అని యూత్‌ పిలగాండ్లు నపరో తీరుగ మాట్లాడిండ్రు. ఆ గుంపుల మన ఎల్లు పెద్దవ్వ ఇంక మన ఆడోల్లు గూడున్నరు.

ఏదన్నా, ఏమన్నా వూరి పెద్దమనుషులు నొట్లే నాలికె లేకుంటనే వున్నరు. దండాలు పెట్టుకుంట ‘మీరులేని వూరున్నాదిరా బిడ్డా! దర్మాత్ములు, వూరు మీకు ఋణపడి వుంటది’ అని గోసారిండ్రు.

యూత్‌ పిలగాండ్ల మాటలు యిని, ‘అరే పోరగాండ్లు గయన్ని నివద్దే. మీరన్నదాంట్లె ఏమి తప్పులేదు. సూదరిబిడ్డె, దిక్కులేని పచ్చి, వూరంత తాళాలేసుకొని పొయిండ్రు. వూల్లె ఏ ఆపతొచ్చిన మనమేనాయె. ఏంజేత్తమ్‌. వూరి పెద్దమనుషులు పబ్బతి బడ్తండ్రు. ఓ... యింతకన్నెక్కువ పురుగులు, గుట్టంత ఆసిన కోమటీరయ్యను యేడికాడికి తోల్లు వూడిపోతాంటె పురుగులు లుక్కలుక్క పార్తాంటె ముక్కులు పలిగిపోయే వాసనల బొందవెట్టి రాలేదారా!

పాపం, కోంటీరయ్యకు పిల్లల్లేరు, జెల్లల్లేరు. గిట్లనే సచ్చిపోతే మన పోరగాండ్లే సావుజేసిండ్రు గద’ అని, ‘కోంటీరయ్య బతికున్నపుడు వూల్లె పావుల పైసలది రూపాయికి అమ్మి యేంగొంచబొయిండు? సత్తె బొందవెట్ట దిక్కులేకుంటె మనోల్లే యెత్కపొయిండ్రు యేంబాకో, ఏం ఋడమోరా బిడ్డా! బతికున్నపుడు మన నీడ గూడ తాకనియ్యరు. మనల్ని మన్సులోలె గూడ సూడరు.

గానీ గీల్లు యెత్తువడి సత్తె, వాసనబడి సత్తె మన సేతులకెల్లి సావు జెయ్యాలె. యిసోంటియి గిట్లా శాననే జేసినంరా బిడ్డా! అయినా మనం గిట్లనే వున్నము. కోంటీరయ్యకు పురుగులు మండెలుంటే బరాయించుకొని సావు సెయ్యలేదా! సేసినందుకు ఏమిత్తరు యెట్టిసేత’ అని సమజు జేసింది ఎల్లవ్వ యూత్‌ పిలగాండ్లను.

‘సరె ఎల్లవ్వా యెవల పాపం వాల్లకే. ఎవ్వలు లేనామే, యిసోంటియి యెన్ని సావులు జేసిండ్రు మనోల్లు. సావు జేత్తె సత్తమా, సత్తె సత్తిమి తియ్‌’ అని రాజేషు గిట్ల పది మంది దాకా పోనీకి తయారైతూ ‘చత్‌ మనకే ఎందుకురా గీ బరువు, గీ దర్మము?’ అని గునుక్కుంట బైలు దేరిండ్రు.

‘అరే పొరగాండ్లు... గిట్లనేనా పోయేది పాత సినిగిన బట్టలేసుకొని తల్కాయకు ముక్కులకు గుడ్డలు జమాయించి కట్టుకొని పోండ్రి. పీనుగను బొందబెట్టినంక యేస్కున్న బట్టలన్ని గుంటదీసి తల్గవెట్టి ఆ గుంట కూడిపి, సెర్ల తానం జేసిరాండ్రి. యిదివరకు గిట్ల జెయ్యక యిండ్లల్లకొచ్చి వారం పది రోజులు జెరాలొచ్చి పన్నెరు’ అని ఎల్లవ్వ సెప్పంగనే అట్లనే బందవస్తుగ పొయిండ్రు వూల్లెకు.

సగమూల్లెకు పోంగనే ముక్కులు పలిగే వాసన యిసిరిసిరి కొడ్తంది. వూరి పెద్దమనుషుల్ని నాలుగు సాపలు దేండ్రి పీనుగును సుట్టి యెడ్ల బండ్లేసి తీస్కపోతమని చెప్తే... యిద్దరెడ్లబండి తయారుజేసిండ్రు, యిద్దరు ముగ్గురు సాపలుదెచ్చి లోపటికి పోనీకి వశంగాకుంటే... బైటకురికొచ్చిండ్రు సాపలాడపారేసి.

‘గుడంబ తాగితేనే ఆ వాసన తెల్వది, పార తమ్మి’ అని కర్రె మల్లన్న యెగేసి తీస్కపొయిండు. కొద్దిమంది అంబేద్కర్‌ యూత్‌ పోరగాండ్లకు తాగుడలువాటు లేకుంటే... ‘అరే తమ్మి గిసోంటి పనులు జేసేకాడ ఒళ్లు తెలువకుంట తాగితేనేగాని సెయ్యలేమురా’ అని సమజుజేసిండు. 

నలుగురు బొంద దవ్వబొయిండ్రు. ఎప్పుడు తవ్వేంత తవ్వుతాంటె... ‘ఎయిడ్స్‌ బీమారి మనిషి గదా! డబల్‌ దవ్వాలట. లేకుంటె వూరికి, వాడకి డేంజరని చెప్పిండు మన పెద్ద మాదిగ’ అని తవ్వి బొందకాడ యిద్దరు కావలున్నరు. 

బొంద తవ్వినంక పీనుగొచ్చేదాక కావలుండాలె, తవ్వి యిడ్సిపెట్టి రావొద్దు అనంటరు మనోల్లు. ఎక్కన్నయినా బూమి వున్నోల్లను ఆల్ల బూమిల్నే బొందవెడ్తరు. లేనోల్లను సెరువుకుంట్ల వెడ్తరు. పూలక్కను ఆమె సెల్కల్నే బొందదవ్విండ్రు. బండ్లె పూలక్క పీనుగొచ్చేటప్పుడు గూడెం అంతా బైటికొచ్చి సూసినం. బతికున్నపుడు ఆమె యెట్లుండె అని బాగా యాజ్జేసుకొని కొద్దిమందిమి ఏడ్సినం.

దిక్కుమొక్కులేని సావాయెనని దుక్కపడ్డం. కొందరాడోల్లము ఏదయితె అదయితదని బొందదాక పొయినం.
బండి మీద తీస్కచ్చిన పీనుగను పైలంగ బొందలబెట్టి మట్టేసుకుంటా... ‘పూలవ్వా ఏమి సావునీది. బత్కి వున్నపుడు ఆమెడ తరిమితివి, దూరంగొడితివి. గిప్పుడు గాల్లే నిన్ను మోసి, సావు జేత్తండ్రు.

నీ బొందల మట్టేత్తండ్రు. నీ ఆత్మ ఎంతేడుస్తందో! నీ వూరోల్లొక్కరు రాకపాయె. గీల్ల సావులు మన సావులకత్తన్నయి. గీల్లు మనకు తరాల తంతెల కాన్నుంచి బడ్డ రునము, బాకి.. యెన్నడు దీరుస్తరో!’ అనుకుంట వేదనపడి బొంద మొత్తం కూడిపి యేస్కున్న బట్టల్ని తలుగబెట్టి సెర్ల తానం జేసి సావుజేసినోల్లందరు యింటిమొకం బట్టిండ్రు.

పాపం! శాన రోజులు యీ సావుజేసినోల్లు బువ్వతినక పొయిండ్రు. ఎంతయినా మనయి ఆర్తిగల్ల పుట్కలే. గీ మన ఆడోల్లు దొరోనితోని తన్నులవడ్డా – యిగ్గులవడ్డా... ఆడు సచ్చిపోతె ఇంకా మన ఆడోల్లు  బొయి యేడ్సి అత్తరు’
‘అర్లికల్ల దర్మంగల్లోల్లు మరి’ అని అందరం నారాజైనం.
- జూపాక సుభద్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement