కథ: కథలు పిల్లలందు... నరసయ్యను లోకానికి పరిచయం చేద్దాం! | Funday Magazine: Datla Devadanam Raju Telugu Story Kathalu Pillalandu | Sakshi
Sakshi News home page

కథ: కథలు పిల్లలందు... నరసయ్యను లోకానికి పరిచయం చేద్దాం!

Published Tue, Oct 11 2022 4:33 PM | Last Updated on Tue, Oct 11 2022 4:44 PM

Funday Magazine: Datla Devadanam Raju Telugu Story Kathalu Pillalandu - Sakshi

‘నేటి తరం పిల్లలున్నారే.. గడుగ్గాయలు. గ్రహణశక్తి ఎక్కువ. ఇట్టే నేర్చేసుకుంటారు. పదునైన చురుకైన మెదడు వారి సొంతం. ఇదే అదను– వాళ్ల మెదళ్ల లోకి కథల్ని ఒంపాలి. కథలంటే ఇష్టం కలిగించి రాసే పని పట్ల దృష్టి కలిగించాలి’ గట్టిగా అన్నాడు సుందరం. సత్యం, నేను అంగీకారంగా తలలూపాం.
∙∙ 
రామకృష్ణ సేవాసమితి. వేట్లపాలెం. విశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టాం. వేసవి ఎండ పేట్రేగిపోతోంది. జోళ్లు బయట విడిచి వెళ్లినందున కాళ్లు చురుక్కుమంటున్నాయి. ఉదయం పదిన్నరకే వేడి దంచేస్తోంది. సుందరం తణుకు నుంచి అప్పటికే వచ్చేశారు. ఆయనిది సమయపాలన. 

హాలులోకి ప్రవేశించగానే ఏసీ చల్లదనం. హయిగా ఉంది. పిల్లలు బుద్ధిగా కూర్చున్నారు. సుందరం మాట్లాడుతున్నారు. మమ్మల్ని చూసి వేదిక మీదకు ఆహ్వానించి పరిచయం చేశారు. ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. 

‘...అలా ఎందరో వీరుల త్యాగాలు, బలిదానాలతో మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. ఇది భారత స్వాతంత్య్ర అమృతోత్సవ ఘడియలు. అంటే ఇప్పటికి డెబ్బై అయిదేళ్లయ్యిందన్న మాట. ఆనాటి కాలంలోని గొప్ప సంఘటనల్ని ఈతరం విద్యార్థులైన మీరు తప్పక తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుంటే మన దేశం పట్ల గౌరవం, భక్తి కలుగుతాయి. త్యాగనిరతి అంటే ఏమిటో తెలుస్తుంది.

మీ స్పందనల్ని కథారూపంలో రాయాలి. రాయగలరు. రాస్తారు కదూ. మా రాకకు కారణం అదే. రేపటి దేశపౌరులు మీరు. ఉన్నత భావాలు, ఉత్తమ సంకల్పాలు మన దేశాభివృద్ధికి తోడ్పడతాయి. అందుకే కథారచన కార్యశాల ఏర్పాటు చేశాం. మంచి ఉద్దేశం మంచి ఫలితాల్ని ఇస్తాయని నమ్ముతాం. ముందుగా తెలుగు పండితుడిగా ఉద్యోగ విరమణ చేసిన సత్యంగారు మాట్లాడతారు. సావధానంగా వినండి’ అని మైకును అందించారు. 

పిల్లలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. వేదిక వెనుక విద్యుత్తు వెలుగుల్లో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, శారదాదేవి చిత్రాలు కాంతివంతంగా ఉన్నాయి. హాజరైన వారిలో ఆడపిల్లలే ఎక్కువ. చివర గోడ పక్కన కూర్చున్న కుర్రాడొకడు చేయి అడ్డం పెట్టుకుని చిన్నగా నవ్వుతున్నాడు. అక్కడే నిలుచుని ఉన్న టీచరు కాబోలు ముక్కు మీద వేలు పెట్టి ‘ఉస్‌’ అనడంతో నిశ్శబ్దం ఆవహించింది. 

సమాజ హితం కోసమే సాహిత్యమనే భావం గల ఒక సంస్కృత శ్లోకంతో సత్యం ఉపన్యాసం ప్రారంభించారు. ఆవు – పులి కథ, అనగనగా ఒక రాజు.. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు కథ, మూడు చేపల పంచతంత్రం కథలు చెప్పారు. తెలుసున్న దానిలోంచి తెలియనిది బోధించడమే కదా అసలైన పాఠం.

విమాన గమనానికి అన్వయించి కథకు సంబంధించిన ప్రారంభం, కథనం, ముగింపు గురించి చెప్పడంతో పిల్లలు శ్రద్ధగా విన్నారు. సత్యం ప్రసంగ పాఠంలోని ప్రధాన విషయాల్ని విడమరచి వివరించారు సుందరం. ‘శివంగారిని  మాట్లాడవలసిందిగా కోరుతున్నాను’ సుందరం ప్రకటించడంతో మైకు అందుకున్నాను.

వ్యక్తిగత అనుభవంలో కథ పట్ల ఆసక్తి కలిగించిన చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రేరణ కలిగించిన పుస్తకాల గురించి మాట్లాడాను. కాళ్లూ చేతులూ లేకపోయినా నికోలస్‌ జేమ్స్‌ వుయిచిచ్‌ సాధించిన విజయాల్ని స్ఫూర్తి కలిగించడం కోసం చెప్పాను. నోటితోనూ కాళ్లతోనూ పెయింటింగు గీసే చిత్రకారుల గురించి కూడా తెలియజేశాను. అంగవైకల్యాన్ని సైతం జయించి వివిధ రంగాల్లో రాణించిన వారి జీవితాలు ఆదర్శప్రాయమయ్యాయని తెలిపాను.

మనలో అంతర్లీనమైన శక్తి దాగి ఉంటుందని దాన్ని వెలికితీస్తే కళల్లో అద్భుతాలు సాధించవచ్చని చెప్పాను.  సుందరం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌తో కథలు రాయాల్సిన స్వాతంత్య్ర పోరాటాల గురించి వివరించి దిశానిర్దేశం చేశారు. స్వాతంత్య్రోద్యమం తొలి తరం వీరుల జీవితాలకి కథారూపం ఇమ్మని కోరారు. లంచ్‌ విరామం.
∙∙ 
మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. 
‘పాల్గొని రాయడం ప్రధానం.. మేలు కీడుల సంగతి తర్వాత చూసుకోవచ్చు’ అనడంతో పిల్లలు ఉత్సాహంగా కథలు రాయాలనే ఉత్సుకత చూపించారు. ఇరవై తొమ్మిది మంది హాజరై కథలు రాశారు.

ఉద్వేగ సంచలనం. ఒడిలో ప్యాడ్‌లు పెట్టుకుని శ్రద్ధగా గువ్వల్లా ముడుచుకుని అక్షరాల్ని పండించారు. పదాల ఊహలకు మొగ్గ తొడిగారు. వాక్యాల్ని గుండెలకు హత్తుకున్నారు. పేరాల్ని కంటికి ఇంపుగా పేర్చారు. మొత్తమ్మీద కథనం ఆలోచనలకి పదును పెట్టింది. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూనే రాశారు.

నిజంగా కథలేనా అవి? మాలోనూ ఉత్కంఠ. తొందరగా వాటిని చూడాలనే ఆతురత. సృజన అనేది నేర్పితే వచ్చేదా? వారి అభిరుచుల చిట్టాలోకి రచనావ్యాసంగం చేర్చడం సాధ్యమేనా? 

ఎండ సిమెంటు చప్టాను పెనంలా మార్చింది. అడుగేస్తే పాదాలు కాలిపోతున్నాయి. మా కోసం ప్రత్యేకంగా పరచిన తివాసీలను దాటి ఆదమరుపున నడిచినందుకు నా కాళ్లు మండాయి.

సాయంత్రమైనా వేడి తీవ్రత తగ్గలేదు. ముగ్గురం కథలు పంచుకున్నాం. అతిథిగృహం అని గుమ్మం పైభాగంలో రాసి ఉన్న గదికి చేరుకున్నాం. తలో మూల సర్దుకున్నాం. వాళ్లు రాసిన కథలన్నింటి గురించి చెప్పడం కుదరదు. వింతగానో విచిత్రంగానో విస్మయంగానో అనిపించిన వాటి గురించి తప్పక చెప్పి తీరాలి.

జోస్యం చెప్పే చిలుక బొత్తి లోంచి మధ్యలో ఒక కార్డు తీసుకున్నట్టు కథల్లోంచి ఒక కాగితం లాగాను. చూశాను. ఆశ్చర్యపోయాను. రెండు చిన్నకొమ్మలు.. అటూ ఇటూ రెండు చిలకల బొమ్మలున్నాయి. మాట్లాడుతున్నట్లుగా ముక్కులు తెరచి ఉన్నాయి. వాటి కింద మొదటి చిలక, రెండో చిలక అని రాసి ఉంది. 

మొదటి చిలక అంటోంది ‘ఇక్కడకు ఎందుకు వచ్చావు?’
‘మా అమ్మ వెళ్లమని బలవంతం పెట్టింది. వచ్చాను’ రెండో చిలక సమాధానం చెప్పింది. 
‘అమ్మ ఎందుకు బలవంతం పెట్టింది?’

‘ఇంట్లో అల్లరి చేస్తున్నావు. ఉబుసుపోవడం లేదు అంటున్నావు కదా.. వెళ్లు’ అంది. 
‘ఎందుకు ఉబుసు పోవడంలేదు? చదువుకోవచ్చు. ఏదైనా కొత్తది నేర్చుకోవచ్చు. ఇక్కడికొస్తే కథలు చెబితే వినొచ్చు. ఆనక ఇంచక్కా కథ రాయొచ్చు కదా’

‘అందుకే కదా వచ్చాను. ఏం ఇది కథ కాదా?’ నవ్వుతూ అంది రెండో చిలక. చివర  సమాప్తం అనీ ప్రారంభంలో శ్రీరామ అనీ రాసింది. పేరు చూశాను. భారతి, పదోతరగతి...
నవ్వుకుని మరో కాగితం అందుకున్నాను. 

‘కథలు వింటాను. రాయను. చదవను’ వంకర వంకరగా  పెద్ద అక్షరాలు. అంతే.. ఇంకేమీ లేదు. పేరు చూశాను. వీరయ్య, తొమ్మిదవ తరగతి. చటుక్కున గుర్తొచ్చాడు. వెనుకవైపు గోడ వార ఒకడు రాయడం మానేసి అట్ట ఒడిలో పెట్టుకుని దాని చుట్టూ చేతులేసి కూర్చున్నాడు. దిక్కులు చూడటం గమనించాను. ‘ఏమిటి సంగతి’ అని కంటితో సైగ చేశాను. పెన్ను తీసుకుని రాస్తున్నట్టు కనిపించాడు. కథలు వినడం ఇష్టం అంటున్నాడు కదా ఎన్ని కథలు విన్నాడో అడగాలి. పోనీ కథలేమైనా చెబుతాడేమోనని తెలుసుకోవాలి. 

పిల్లలు రాసిన కథలు చదవడం వింత అనుభవం. రాతలో కొన్ని ఇంగ్లిషు పదాలు దొర్లాయి. వాటికి ప్రత్యమ్నాయ తెలుగు పదాలు చెప్పాలి. ఆధునిక విజ్ఞానంతో కూడిన ఊహాశక్తి వాళ్లది. మార్కులేసి సుందరానికి అప్పగించి బయట వరండాలోకి వచ్చాను.
వీరయ్య కనిపించాడు. దగ్గరకు రమ్మని చేయి ఊపాను. భయపడుతూ వచ్చాడు. నవ్వుతూ మాట్లాడుతూ భుజం మీద చేయి వేసి దూరంగా తీసుకెళ్లాను. 

‘మీ ఇల్లెక్కడా?’ 
‘దగ్గర్లోనే... సారూ... మా ఇంటికి రారూ?’ అన్నాడు. 
సభకు ఇంకా సమయం ఉంది. సరే పదమని నెమ్మదిగా నడుచుకుంటూ వీరయ్య ఇంటికి చేరాను. 
పాతకాలం నాటి ఇల్లు. చిల్ల పెంకులు. ఒక పక్క కూలిపోయినట్లుంది. ఇంటిని ఆనుకుని గుంజకు కట్టి ఒక ఆవు ఉంది. చిన్న గడ్డిమేటు. పేడకళ్లు ఎత్తి దూరంగా పారేసి

ఎండు గడ్డి ఆవు ముందు వేస్తున్నాడు ఒకాయన. ‘మా నాన్న’ అని పరిచయం చేశాడు. పక్కనే ఉన్నావిడను ‘అమ్మ’ అన్నాడు.
కూలిపని నుంచి అపుడే వచ్చినట్టున్నారు అమ్మా నాన్నలు. 

‘రండి... బాబూ’ ఇంటి లోపలకు రమ్మని పిలిచారు. వసారాలో కుర్చీ లేదు. చిన్న స్టూలు. దాని మీదే కూర్చుని కుశల ప్రశ్నలేశాను. బిడియంగా వినయంగా సమాధానాలు ఇచ్చారు. 

స్వాతంత్య్ర పోరాటం.. త్యాగధనులు.. డెబ్బై అయిదేళ్ల పండుగ.. పిల్లలకు అవగాహన కలిగించే ఉద్దేశం.. మాటల్లో చెప్పబోయాను. నిజానికి అంతంత పెద్ద విషయాలు చెప్పే సందర్భం కాదు. మనసులోంచి తన్నుకొచ్చిన ఉబలాటం ఆగనీయలేదు. వీరయ్య తండ్రి కిట్టయ్య ఆశ్చర్యకరంగా ఏమిటేమిటో చెప్పేస్తున్నాడు. మౌనంగా ఉండిపోవడం నా వంతయ్యింది. 

‘ఇలా రండి.. బాబుగారూ’ అంటూ ‘చిటికెలో వచ్చేస్తాను’ అని బయటకు పరుగెట్టి నిచ్చెనతో వచ్చాడు. నేల సిమెంటు గచ్చు. గరుకుగా ఉంది. గబగబా అటుకెక్కాడు. నెమ్మదిగా అపురూపంగా ఒక ట్రంక్‌పెట్టెను కిందికి దించాడు. గుమ్మం దగ్గరకు తీసుకొచ్చాడు. దాని చుట్టూ మైకా కాగితం చుట్టి ఉంది. ఆ పెట్టెకు ముమ్మారు చేతులు జోడించి దండం పెట్టాడు. భక్తిభావంతో కళ్లకు అద్దుకున్నాడు.

చెమర్చిన కళ్లతో చూస్తూ తాళం తీశాడు. లోపల అనేక వస్తువులు. అన్నీ పాతకాలం నాటివి. వెలసిన ముఖమల్‌ తలపాగ.. చివికిన కాషాయరంగు పంచె.. వంకీలు తిరిగిన జోళ్లు.. సొట్టలు పడిన చిన్న కంచం.. ఇత్తడి మరచెంబు, ఇత్తడి గ్లాసు.. ముట్టుకుంటే చినిగిపోయే వార్తా కటింగులు.. పొందిగ్గా చక్కగా సర్ది ఉన్నాయి. అత్తారబత్తంగా ఒక్కో దాన్నీ బయట పెట్టాడు.

పెళ్లాం పైటకొంగు ముఖానికి అడ్డం పెట్టుకుని దూరంగా నిలబడి ఉంది. తర్వాత తెలిసింది. మూగదంట. ఆ పిల్లకు దిక్కెవరని జాలిపడి పెళ్లి చేసుకున్నాడంట. వీరయ్య ముఖంనిండా నవ్వు పులుముకుని చూస్తున్నాడు. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నాడు? ఏం మాట్లాడబోతున్నాడు? అంతుపట్టడం లేదు. 

కిట్టయ్య కళ్లప్పగించి తనివితీరా చూసుకున్నాడు. అతనిలో అలౌకిక ఆనందం. ముఖంలో వెలుగులు.
‘ఏమనుకోకండి? నా మాటలు కాసేపు వినండి, బాబూ.. కూడుకు కరువైనా వీటిని చూసుకునే బతుకుతున్నాం. మా ముత్తాత ఆస్తులు కూడబెట్టలేదు. అమరుడై మాకొక గౌరవ వారసత్వ సంపదను అందించాడు. నేనూ చదువుకున్నవాడినే. ఇపుడు చదువునే మరచిపోయినవాడిని.

కూలి పనులే జీవనాధారం. మీరు నమ్మరు.. బీఈడీ చదివాను. ఉద్యోగం లేదు. కొన్నాళ్లు ప్రయివేటు స్కూలులో పాఠాలు కూడా చెప్పాను. కరోనా మమ్మల్ని రోడ్డున పడేసింది. తర్వాత తాపీ పని చేశాను. ఇళ్లకు రంగులేశాను. ఏది పడితే అది చేశాను. సిగ్గు పడలేదు’ చెప్పడం ఆపాడు. 

ఆశ్చర్యపోయాను. కిట్టయ్య మాటల్ని అక్షరాల్లో యథాతథంగా చెప్పను. కిట్టయ్య చెప్పిన తన ముత్తాత నరసయ్య వీరోచిత గాథను కథనంగా చెబుతాను. చదవండి. అలాగే బావుంటుంది. చదువుతూ దృశ్యాన్ని ఊహించుకోండి. 
∙∙ 
నరసయ్య ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్‌ అనుకుంటూ కండలు పెంచాడు. నరనరాన అమిత దేశభక్తి. పరాయి పాలనను అంతమొందించడానికి శారీరకశక్తి అవసరం అనుకున్నాడు. వస్తాదుగా మారాడు. 

శాసనోల్లంఘన కాలం. మహాత్మాగాంధీని అరెస్టు చేశారు. నిరసన జ్వాలలు చెలరేగాయి. ప్రజలు ఉద్యమించారు. వందేమాతరం నినాదం ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తోంది. జెండా ఎగరేయడం ఆత్మగౌరవ ప్రతీకగా మారింది. ఎందరో త్వాగమూర్తులు బ్రిటిష్‌ సామ్రాజ్యవాద తుపాకులకు బలైపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జెండా ఎగరేసి తీరాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు నరసయ్య. తన నిర్ణయాన్ని ముందుగా అందరికీ తెలియజేశాడు. ఆ విషయం పరపాలకులకు తెలిసిపోయింది. ఆ చోటును పోలీసులతో నింపేశారు. 

నరసయ్య వెనకడుగు వేయలేదు. ఎవరెంత వారించినా వినలేదు. దేశం కోసం త్యాగం చేసే అదృష్టం తనది అనుకున్నాడు. చెప్పిన సమయానికి జెండా స్తంభం దగ్గరకు చేరుకున్నాడు. 

లాఠీలు నరసయ్య ఒంటి మీద విరుచుకు పడ్డాయి. చలించలేదు. పంటి బిగువున బాధను దిగమింగుకున్నాడు.  జెండా చేబూని ముందుకే సాగాడు. దెబ్బలకు చేయి అడ్డం పెట్టుకుని కాచుకుంటూ నడిచాడు. స్తంభాన్ని కౌగిలించుకున్నాడు. శరీరం రక్తసిక్తమైంది. స్తంభం ఎక్కడం ప్రారంభించాడు. పోలీసులు తమ ప్రతాపం చూపించారు. లెక్క చేయలేదు. ఎట్టకేలకు జెండాను శిఖరాగ్రాన నిలిపాడు. దిక్కులుపిక్కటిల్లేలా ‘వందేమాతరం’ అని నినదించాడు. అంతే.. అంతెత్తు నుండి కింద పడిపోయాడు. స్పృహ తప్పింది. కాసేపటికి ప్రాణం గాలిలో కలిసిపోయింది.
∙∙ 
‘మా ముత్తాత పౌరుషం గురించి తాత చెప్పేవారు తర్వాత మా నాన్న చెప్పేవారు. అవి వింటూ పెరిగాను. ముత్తాత వాడిన వస్తువులే మా ఆస్తులు. భద్రంగా దాచుకుని కాపాడుకుంటున్నాం. మీ లాంటి వారికి చూపించుకుంటూ ఆనందిస్తున్నాం. దేశం కోసం ఆత్మార్పణం చేసిన త్యాగమూర్తి మా ముత్తాత. అమృతోత్సవం నాడైనా నరసయ్య గురించి కాసింత మాట్లాడండి. ఇప్పటి పిల్లలకు చెప్పండి, సార్‌’ కిట్టయ్య గర్వంగా చెబుతూ నా ముఖం కేసి చూశాడు. 

‘తప్పకుండా. ఇప్పటి కార్యక్రమమే అది. ఆ పెట్టెను సభావేదిక దగ్గరకు తీసుకురండి. మీ వాడు కథ వినడమే తప్ప రాయనని చెప్పాడు. వాడి చేత మీ ముత్తాత కథను రాయిస్తాను. మీరే చూడండి’ అని వీరయ్యను దగ్గరకు రమ్మన్నాను. 

వీరయ్య వెంటనే  ‘ఇవన్నీ మళ్లీ తిరిగిచ్చేస్తారు కదా’ అనుమానం వ్యక్తపరచాడు. ‘మేము బయటకు ఇవ్వం. ఏటా నరసయ్య గారి పుట్టినరోజున మేం వాటిని బయటకు తీసి పూజిస్తాం. మా నాన్న పాట కూడా పాడతాడు’ అన్నాడు. 

‘మీ ఆస్తిని ఎవరూ దొంగిలించలేరు. భయపడకు. నరసయ్యను లోకానికి పరిచయం చేద్దాం’
సుందరానికి విషయం చెప్పి కథాకార్యశాలలో ముగింపు సభలో కిట్టయ్యను సత్కరించాం. పిల్లల్నీ నరసయ్య కథ రాయమన్నాం. రాసిన వారందరికీ బహుమతులు ఉంటాయని చెప్పాం.
అది సరే. విశేషాల్ని పొందుపరుస్తూ నేనూ కథ రాశాను. అది ఇదే. ఇదొక పాఠంగా ఈ కథను పిల్లల చేత చదివింపచేస్తాను.
-దాట్ల దేవదానం రాజు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement