సకల విఘ్నాలు తొలిగించే వినాయకుడు కాసింత విచారంగా కూచున్నాడు. ఆరేళ్ళ ధన్వి వంక చూస్తున్నాడు. ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదు. ధ్వన్వి మెల్లిగా వినాయకుడి దగ్గరికి వచ్చింది.
ఆ ఇంట్లో పూజగదిలో ఒక వినాయకుడు హాలులో ఒక వినాయకుడు వున్నాడు. హాలులో వున్న వినాయకుడు మట్టి వినాయకుడు. వినాయకచవితికి అందరూ రంగురంగుల ప్లాస్టర్ అఫ్ పారిస్‌తో చేసిన వినాయకులను తెస్తుంటే ధన్వి తండ్రితో గొడవపడి మట్టివినాయకుడినీ అదీ మట్టి వినాయకులను తయారుచేసే వారి దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎలా తయారుచేస్తున్నారో చూసి తనే తన చిట్టి చేతులతో తయారుచేసి తెచ్చుకుంది. అంతే కాదు ఆ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తానంటే ఒప్పుకోలేదు.
అలా ఆ వినాయకుడిని హాలులో పెట్టుకుని రోజూ స్కూల్‌కు వెళ్లేప్పుడు దండం పెట్టుకుని పెరట్లో పూసిన పువ్వులు పెట్టి వెళ్ళేది..ఉండ్రాళ్ళు చేసినా నైవేద్యం పెట్టి వెంటనే తినేయకుండా ఒక పూటంతా పెట్టి ఆకలితో వుండేవాళ్ళకు ప్రసాదంగా పెట్టేది. దానితో వినాయకుడికి బోల్డు ముచ్చటేసి ధన్వితో ఫ్రెండ్షిప్ చేశాడు.
ఒకరోజు పొద్దున్నే తన మట్టిప్రతిమను తుడుస్తుంటే ధన్వి చేయి వినాయకుడి కన్నుకు తగిలింది.. వెంటనే ధన్వి వినాయకుడికి ‘సారీ’ చెబుతూ ‘ఉఫ్ ఉఫ్’ అంటూ ఊదింది, తన చేయి తగిలిన వినాయకుడి కంటికి తగిలిన దెబ్బ నొప్పి తగ్గాలని.
‘థాంక్యూ ధన్వి’ అన్నాడు వినాయకుడు ధన్వికి అర్ధమయ్యే భాషలో.
‘ఎవరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?’ అడిగింది ధన్వి.
‘ కైలాసం నుంచి ..’
‘అక్కడెవరున్నారు...ఇంతకూ మీరెవరు?’
‘నేను వినాయకుడిని ...రోజూ నన్ను పూజించి వీలైనప్పుడల్లా ఉండ్రాళ్ళు పెట్టి వెంటనే తినేయకుండా.. ఆకలితో వున్నవారికి పెడతావుగా...కైకైలాసంలో మా అమ్మ పార్వతీదేవి, నాన్న పరమశివుడు వున్నారు కదా.. వాళ్ళ బిడ్డను... నా గురించి పుస్తకాల్లో చదువుకోలేదా?’
ధన్వి కళ్ళు పెద్దవి చేసి ‘మీరు లార్డ్ వినాయకులా... నిజమా..ప్రామిస్’ అంది తన చేతిని మట్టి విగ్రహం ముందు చాచి... వీనుల విందుగా తల్లి చిన్నప్పుడు నేర్పిన వినాయకస్తోత్రం చదువుతూ...
వెంటనే మట్టి విగ్రహంలో వున్న చేయి ముందుకు కదిలింది కరచాలనం చేస్తున్నట్టు...
‘ఓహ్ మై గాడ్ ’ అంది గుండెల మీద చేయివేసుకుని.
‘అవును నేను మీ గాడ్‌ను’ వినాయకుడు అన్నాడు.
‘మరి ఎవరికీ కనిపించకుండా నాకే ఎందుకు కనిపిస్తున్నారు...?’ డౌట్‌తో అడిగింది.
‘అందరూ నన్ను వాళ్ళ కోరికలు తీర్చమని మొక్కుతారు..పూజ కాగానే నేను తిన్నానో లేదో ఆలోచించకుండా నైవేద్యాన్ని తీసేసుకుంటారు...నువ్వు మాత్రం ఏ వరమూ కోరుకోవు. భక్తితో పూజ చేస్తావు, నా విగ్రహాన్ని శుభ్రం చేస్తావు. రోజూ పలకరిస్తావు.
అందరిలా రంగురంగుల విగ్రహాలు కాకుండా మీ పెరట్లోని మట్టితో నీ చిట్టి చేతులతో నన్ను తయారు చేస్తావు. నన్ను నీళ్లలో నిమజ్జనం చేయకుండా పూలకుండీలో నా విగ్రహాన్ని తడిపి తిరిగి మట్టిగా మార్చి పూలమొక్క నాటి.. పూలు పూచిన తరువాత ఆ పూలను నాకు భక్తితో సమర్పిస్తావు.
రోజూ నేను అడగక ముందే నా విగ్రహం దగ్గర కూచోని కబుర్లు చెబుతావు... తిన్నావా అంకుల్? అని అడుగుతావు... అందుకే నీకు వినిపిస్తున్నాను.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు...’ అన్నాడు.
అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది.
ఆ రోజు ధన్వి విచారంగా సీరియస్‌గా వుంది. ధన్వి లేచి వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చి ‘నేను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయలేదు. ఉదయం నుంచి అలిగాను... దగ్గరికి పిలిచి ఏమైంది ధన్వి ఫ్రెండ్? అని అడగొచ్చు కదా...’ ఉక్రోషంగా అడిగింది.
‘నువ్వు అలిగావా? నువ్వు సీరియస్‌గా వున్నావు కదా అని అడగలేదు... నాక్కూడా ఇవ్వాళ బ్రేక్‌ఫాస్ట్ లేదు. నువ్వు అలిగావని నేను భక్తులు పెట్టిన ఉండ్రాళ్ళు తినలేదు’ అన్నాడు.
‘మరి నేనెందుకు అలిగానో అడగనేలేదు?’ అంది ధన్వి.
‘ఎందుకు ఫ్రెండ్?’ తెలిసే అడిగాడు విఘ్నేశ్వరుడు
‘స్కూల్‌లో మా మిస్ హోమ్‌వర్క్ ఎక్కువ ఇస్తుంది.. బుక్స్ వీపు మీద మోస్తుంటే వీపు నొప్పెడుతుంది. మమ్మీ డాడీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించడం లేదు. నువ్వు ఎంచక్కా పార్వతమ్మ ఒళ్ళు కూచోని ఉండ్రాళ్ళు తింటావు.. స్కూల్‌లో ప్రతీ చిన్న విషయానికి పనిష్ చేస్తున్నారు. అందుకే బాధేసింది. పేరెంట్స్‌కు అర్థం కాదు. టీచర్స్‌కు అర్థం కాదు.. మరి మేము ఎవరికీ చెప్పాలి...?’ అడిగింది ధన్వి.
‘మరిప్పుడు నీ బాధ పోవాలంటే నువ్వు అలక మానాలంటే నేను ఏం చేయాలి ఫ్రెండ్ ?’
‘ఒకసారి మా పుస్తకాలు వీపు మీద మోసి చూడు.. హోమ్‌వర్క్ చేసి చూడు... మా మమ్మీ దగ్గర డాడీ దగ్గర ఉండి చూడు... తరువాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం...సారీ... నిన్ను నానా మాటలు అంటున్నాను’ లెంపలేసుకుంటూ అంది గడుగ్గాయి ధన్వి.
వినాయకుడు నవ్వుకున్నాడు.
‘నువ్వు ఎలుక అంకుల్‌తో బుక్స్ మోయించకూడదు.. హోమ్‌వర్క్ మ్యాజిక్‌తో పూర్తి చేయకూడదు’ షరతులు వర్తిస్తాయి అన్నట్టు చెప్పింది.
వినాయకుడు సరే అన్నాడు నవ్వాడు.
ఆ నవ్వులో లోకకల్యాణం వుంది.
పొద్దున్నే వినాయకుడు కైలాసం నుంచి తరలివచ్చి...« దన్వి స్కూల్ బ్యాగ్‌ను వీపు మీద మోసుకుని స్కూల్‌కు వెళ్ళాడు.
దేవుడిగా తన శక్తులు వదిలిన వినాయకుడు సాక్షాత్తు ధన్వి స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకుని నడుస్తున్నాడు. తన శక్తులు వదిలి తాను ధన్విలోకి మారిపోవడం వల్ల పుస్తకాల బరువుకు వీపు నొప్పిగా అనిపించింది.
ధన్వి వినాయకుడి పక్కనే నడుస్తూ వినాయకుడిని చూస్తోంది.
‘పాపం ..’ అనిపించింది.
వెంటనే లెంపలు వేసుకుని ‘వద్దులే అంకుల్ నీకు నొప్పెడుతుంది.. బ్యాగ్ నేను మోస్తాను’ అంది.
‘వద్దు చిట్టితల్లీ నేను వరం ఇచ్చాక మాట ఇచ్చాక తిరుగు ఉండదు’ అన్నాడు నడుస్తూనే.
వినాయకుడు ధన్వికి తప్ప మరెవరికీ కనిపించడం లేదు.
అందరూ ధన్వి తనలో తానే మాట్లాడుకుంటుదేమో అనుకున్నారు.
‘చాలా బరువుగా అనిపించింది.. చిట్టి పాపలు ఇంత బరువు ఎలా మోస్తున్నారో అనిపించింది...
స్కూల్‌లో హోమ్‌వర్క్ ఇచ్చారు... హోమ్‌వర్క్ చేస్తుంటే ప్రాణం పోతోంది.. చేతులు నొప్పెడుతున్నాయి.. ఇంటికి రాగానే ధన్విలోకి మారిపోయాడు వినాయకుడు.
బిజీగా ఆఫీస్ నుంచి వచ్చిన తల్లి ఫ్రిజ్‌లో వున్నవి తినమన్నది కూతురిని.. తండ్రి అలిసిపోయి వచ్చి పడుకున్నాడు.
పొద్దున్నే నిద్రమొహంలోనే ధన్విని నిద్ర లేపుతుంటే ధన్విలోకి మారిపోయిన వినాయకుడికి నిద్ర ముంచుకు వస్తుంది.
మళ్ళీ పుస్తకాల మోత.. హోమ్ వర్క్.. స్పెషల్ క్లాసెస్...
అలా ఒకేసారి ప్రతిబిడ్డ బాల్యంలోకి వెళ్లి చూశాడు.
భూమ్మీద చిన్నారులు పడుతున్న కష్టాలు చూసి కైలాసం వెళ్లి తల్లికి చెప్పాడు.
వినాయకుడి ముందు నిలబడింది ధన్వి. తన మొహంలో ఆనందం వుంది. మొహం ఫ్రెష్‌గా ఉంది.. ఎందుకంటే ధన్వి చేయవల్సినవన్నీ వినాయకుడే చేశాడు కాబట్టి... ఆ బాధలు వినాయకుడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి కాబట్టి.
‘సారీ అంకుల్ మీ మొహం వాడిపోయింది... రేపటి నుంచి నా హోమ్ వర్క్ నేనే చేస్తాను.. నా పుస్తకాలు నేనే మోసుకుంటాను.. మీరు దేవుడుగా... కష్ట పడకూడదు.. చేసిన తప్పుకు గుంజీలు తీస్తాను’ అంటూ గుంజీలు తీయబోతుంటే–
‘వద్దు నువ్వు నీ ఫ్రెండ్స్ అందరికోసం నీలాంటి పిల్లల కోసం నువ్వు ఆలోచించావు.. మీ బాల్యం అందంగా ఉండాలంటే ఏం చేయాలో దేవుడిగా నేను చేసి చూపిస్తాను’ అన్నాడు వినాయకుడు.
‘ఎలా అంకుల్?’ ఉత్సహంగా అడిగింది ధన్వి
‘రేపటి నుంచి మీరు పుస్తకాలు మోస్తారు.. మీ పుస్తకాల బరువు మీ టీచర్స్ మీద పడుతుంది... మీరు హోమ్ వర్క్ చేస్తారు.. మీతో హోమ్ వర్క్ చేయించిన టీచర్స్ చేతులు నొప్పెడుతాయి... ఇంకా...’ వినాయకుడు చెప్పుకుంటూ పోతున్నాడు.
ఆ రాత్రి ధన్వి ప్రశాంతంగా నిద్రపోయింది. ఈ ప్రపంచంలోని ప్రతీ బిడ్డ బాల్యం బావుంటుందన్న నమ్మకంతో.
వినాయకుడి వాక్కుకు తిరుగు ఉంటుందా?
తథాస్తు...
పొద్దున్నే ధన్విని నిద్రలేపింది తల్లి.. కానీ నిద్రమత్తు తల్లికి మొదలైంది. స్కూల్ బ్యాగ్ భుజం మీద వేసుకోగానే ధన్వి మిస్ వీపు మీద బరువు పడ్డట్టు వీపు మీద మూటలు మోస్తున్నట్టు ఫీలైంది. ఆ స్కూల్‌లో ఆ క్లాస్‌లో వున్న పిల్లల వీపుల మీద వున్న బరువులు టీచర్స్ వీపుల మీదికి ట్రాన్స్‌ఫర్ అవుతోంది.
ఆ స్కూల్ సెక్రటరీకి.. కరెస్పాండంట్‌కు కూడా... ఆ బరువు ట్రాన్స్‌ఫర్ అవుతోంది...
రాత్రి కాగానే పిల్లలు హోమ్ వర్క్ చేస్తుంటే టీచర్స్‌కు చేతులు నొప్పెడుతున్నాయి. మాములుగా కాదు.. క్లాస్ రూమ్‌లో వున్న పిల్లలు చేసే హోమ్‌వర్క్ తాలూకూ నొప్పి.. టీచర్స్‌కు భరించలేనంతగా కలుగుతోంది.
పిల్లలను ఒళ్ళో కూచోబెట్టుకుని అన్నం తినిపించని తల్లులకు ఏదో వెలితి.. అర్థం కాని వెలితి...
పిల్లలను భుజాన వేసుకుని కబుర్లు చెప్పని తండ్రులకు అశాంతి మొదలైంది.
డాక్టర్స్ దగ్గరికి టీచర్స్ స్కూల్స్ యాజమాన్యాలు క్యూ కట్టాయి
సైకాలజిస్టుల దగ్గరికి పేరెంట్స్ వలస వెళ్ళారు.
‘అంతుచిక్కని ఈ వ్యాధికి చికిత్స దొరికేవరకు పిల్లలకు హోమ్ వర్క్ ఇవ్వకండి... పుస్తకాల బరువు తగ్గించండి. ప్రస్తుతానికి మేము ఇదొక్క సలహా మాత్రమే ఇవ్వగలం’ అన్నారు డాక్టర్లు.
‘బిడ్డ ఆకలి తీర్చకుంటే తల్లి గుండెలు బరువెక్కుతాయి.. అలాగే బిడ్డను రోజూ ఒళ్ళో కూచోబెట్టుకొని లాలించకపోతే సైకలాజికల్‌గా ఇలా అవుతుందేమో.. మీ పిల్లలతో టైం స్పెండ్ చేసి చూడండి’... సైకాలజిస్టులు చెప్పారు.
వినాయకుడే వాళ్ళలోకి దూరి వాళ్ళతో చెప్పించాడు!
‘ప్రభుత్వం కాంట్ బట్ పొజిషన్‌లో... విద్యాసంస్థలు మస్ట్ అండ్ షుడ్ పొజిషన్‌లో పుస్తకాల బరువు హోమ్ వర్క్ తలనొప్పి తగ్గించాయి.
ధన్విని ఒళ్ళో కూచోబెట్టుకుని చాలారోజుల తరువాత తన బిడ్డకు అన్నం కలిపి తినిపించి పెందరాళే పడుకోబెట్టగానే రిలీఫ్‌గా అనిపించింది తల్లికి.
కూతురిని వీపున ఎక్కించుకుని కబుర్లు చెబుతూ స్కూల్ విశేషాలు అడుగుతూ ప్రతీ వీకెండ్ జాలీగా ఎంజాయ్ చేద్దామని చెప్పాడు తండ్రి.
ఇది ఒక ధన్వి ఇంట్లోనే కాదు ప్రతీ ఇంట్లోనూ జరుగుతోంది.
పిల్లలు సరదాగా సంతోషంగా స్కూల్‌కు వెళ్తున్నారు... అమ్మానాన్నలతో సాయంత్రాలు గడుపుతున్నారు... శిక్షణ పేరుతో శిక్షలు.. చదువుల పేరుతో పనిష్మెంట్స్ లేవు... ఆల్ హ్యాపీస్!
‘థాంక్యూ ఫ్రెండ్. ఇంతకూ నువ్వేం చేశావ్?’ వినాయకుడిని అడిగింది పొద్దున్నే పెరట్లో పూలు తెచ్చి వినాయకుడి ముందు పెట్టి కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ... దన్వి.
‘మీరు పడుతున్న బాధలు చూశాను.. బాల్యం అందమైనది కదా.. అందుకే మీరు నవ్వుతూ ఉండాలి.. నవ్వడం అంటే ఆనందంతో.. సంతోషంతో... కేవలం పెదవులతో కాదు. అందుకే తనేం చేశాడో చెబుతూ ..
‘ఈ కథ విన్నా... చదివినా ఇలా పిల్లలను సంతోషపెట్టినా వారికీ నవ్వు శాశ్వతంగా వరంగా మారుతుంది.’ అన్నాడు వినాయకుడు.
రెండు చేతులూ జోడించి భక్తితో వినాయకుడికి కృతజ్ఞతలు చెబుతూ అంది ధన్వి.. సంతోషంగా ఆనందంగా నవ్వుతూ.
ఓహో...అదా విషయం!
- విజయార్కె
Comments
Please login to add a commentAdd a comment