ఆరో యువకుడి కోరిక | Short Story For Kids | Sakshi
Sakshi News home page

ఆరో యువకుడి కోరిక

Published Sun, Sep 22 2019 9:14 AM | Last Updated on Sun, Sep 22 2019 9:14 AM

Short Story For Kids - Sakshi

అనగనగా ఓ రాజు. అతని దగ్గర ఓ మంత్రి. చుట్టుపక్కల ఆయన దయాదాక్షిణ్యాలతో నడిచే ప్రాంతాల నుంచి పన్నులు వసూలు చేయడానికి తన మంత్రిని పంపుతుంటాడు. మంత్రి ఓ నలుగురు భటులతో పన్నుల వసూలుకు పోతుంటాడు. తిరిగి వస్తున్నప్పుడు మంత్రి, అతని అంగరక్షకులు ఓ అడవి గుండా రావాల్సి ఉంటుంది.
ఓసారి వీరిలా పన్నులు వసూలు చేసి వస్తుండగా అడవి మార్గంలో దోపిడీ దొంగలు మంత్రిని, భటులను బెదిరించి వారి నుంచి డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మంత్రి మనసులో దేవుడిని ప్రార్థిస్తాడు తమను కాపాడమని.
ఆ ప్రార్థన భగవంతుడి చెవిన పడిందో ఏమోగానీ ఎక్కడి నుంచో ఆరుగురు యువకులు అక్కడికి వస్తారు. మంత్రిని, అతని అంగరక్షకులను కాపాడుతారు.
మంత్రి ఆ ఆరుగురు యువకులను మెచ్చుకుని తమతో రాజు వద్దకు తీసుకుపోతారు.
రాజుకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు మంత్రి.
రాజు వారిని కొనియాడుతూ, మీరేం కోరుకున్నా ఇస్తానని మాటిస్తాడు.
మొదటి యువకుడు తనకు బోలెడంత డబ్బు కావాలని కోరుకుంటాడు.

రెండో యువకుడు తానూ, తన కుటుంబసభ్యులు హాయిగా నివసించడానికి ఓ ఇల్లు కావాలని కోరుతాడు.
మూడోవాడు తానుంటున్న గ్రామంలో రోడ్లను బాగు చేయాలని కోరుకుంటాడు.
నాలుగో యువకుడు తాను ఇష్టపడుతున్న ఓ ధనికుడి కూతురితో తనకు వివాహం జరిపించాలని కోరుకుంటాడు.
అయిదో యువకుడు తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చాలని కోరుతాడు.
అయిదుగురు యువకులకూ వారు వారు కోరుకున్నది ఇస్తానని హామీ ఇస్తాడు రాజు.
ఇక ఆరవ యువకుడి వంక చూసి ‘నీకేం కావాలి’ అని అడుగుతాడు రాజు.
యువకుడు అడగడానికి ముందుగా కాస్తంత జంకుతాడు.
అయితే రాజు ఎటువంటి జంకూ గొంకూ లేకుండా ఏది కావాలన్నా అడుగు ఇస్తానంటాడు. మాట తప్పనని అంటాడు.

అప్పుడు ఆ యువకుడు తనకు నగానట్రా ఏవీ అక్కర్లేదంటాడు. ఏడాదికి ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ఓ వారమో లేక పది రోజులో ఉండాలి. నాకు అంతకన్నా మరేమీ వద్దంటాడు.
రాజు ఇంతేగా అంటూ అతని కోరికకు సరేనని ఒప్పుకుంటాడు.
అయితే ఆ తర్వాతే ఆ యువకుడి కోరికలో దాగి ఉన్న ఉద్దేశం అర్థమైంది.
అవును...ఆ నిజమేమిటంటే,
రాజు అతనింటికొచ్చి ఉండాలంటే అతని ఇల్లు బాగుండాలి. ఆ ఊరికి వెళ్ళే రహదారులన్నీ బాగుపడతాయి. అలాగే అతనున్న సమయంలో అతనికోసం పనివాళ్ళు కావాలి. ఈ క్రమంలో అతనికీ ఓ అర్హత లభిస్తుంది.
ఇలా ఉండగా, మొదటి ఐదుగురూ కోరుకున్నవన్నీ కలిపి ఈ ఆరవ యువకుడు ఒక్క మాటతో తీర్చుకోబోతున్నాడు తన కోరికను. అతని ఉద్దేశాన్ని గ్రహించిన రాజు ఆ యువకుడి తెలివితేటలను గ్రహించి అతనికే తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు.
ఈ కథ వల్ల తెలుసుకోవలసిందేమిటంటే రాజే మన పరమాత్మ అనుకుందాం. సహజంగా అయితే అందరూ దేవుడిని కోరుకునేదేమిటంటే ఆ అయిదుగురి యువకుల్లా తమకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు.
కానీ ఆరో యువకుడిలా దేవుడే మనతో ఉండాలని కోరుకుంటే మిగిలినవన్నీ తానుగా అమరుతాయి అని గ్రహించాలి.
- యామిజాల జగదీశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement