బీసెంట్‌ రోడ్డు | Short Story On 11th August Funday | Sakshi
Sakshi News home page

బీసెంట్‌ రోడ్డు

Published Sun, Aug 11 2019 9:02 AM | Last Updated on Sun, Aug 11 2019 9:33 AM

Short Story On 11th August Funday - Sakshi

పొద్దున్నంతా లోపలనే ఉంది.  కాసేపు ఏడ్చింది. కాసేపు ఫోన్లో ఒకరిద్దరు ఫ్రెండ్స్‌తో మాట్టాడింది!  ఇంకెవరైనా ఉంటే బాగుండు, చాలా దగ్గరగా, తన బాధ అర్ధం చేసుకునే, తన వయసుకితగ్గ తోడు.
మొహం ఉబ్బిపోయింది.  కోపం వస్తోంది. దుఃఖం తగ్గడం లేదు.  ఏం చెయ్యాలి?
సాయంత్రం నాలుగు దాటింది. మెల్లగా లేచి రెండు బక్కెట్ల నిండా నీళ్ళు పట్టుకుని గబా గబా తలస్నానం చేసింది.  పైనించి కిందికి దిగి నేలమీదకి జారి పోయే నీళ్ళలో తన బాధకూడా కరిగిపోవచ్చుకదా. ఫ్యాన్‌ కింద నిలబడి తల ఆర పెట్టుకుంది. ఆ మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి. 
ఫాన్‌ గాలికి నీళ్ళు ఆవిరి అయినట్టు, నచ్చని విషయాలు ఆరిపోతే ఎంత హాయో కదా.  ఛీ.  ఖర్మ.  ఆ కాసేపు చెవులు పూడుకు పోగూడదా.  పోనీ, కనీసం చెవులు మూసుకునే అవకాశం అయినా ఉండొచ్చు కదా.

చెవులు మూసుకోవడం కాదు, చెత్తమత్తంగా కొట్టగలిగితే,  కనీసం తిరిగి చెడా మడా తిట్టేస్తే  అప్పుడు ఎంత బావుంటుందో.  తిట్లు అంటే ఇంగ్లిష్‌ తిట్లు, నాజూకు తిట్లు కాదు.  అచ్చ తెలుగు తిట్లు తిట్టేయాలి వాడిని.  
అప్పుడుగానీ కోపం శాంతించదు. అమావాస్య మర్నాడు వచ్చే సన్నని చందమామలా చిన్న నవ్వు విచ్చుకుంది.
ప్చ్‌. కుదరదు.  చేసే ఉద్యోగం వినడం, జవాబు చెప్పడం.  అంతవరకే.  ఏం మాట్లాడిన వినాలి.  విసుక్కోకుండా, వినయంగా జవాబు చెప్పాలి. 
నిన్న వాడు వాగిన వాగుడికి లైన్‌ కట్‌ చేసి భోరుమని ఏడ్చేసింది.  అందరూ ఓదార్చారు.  అంతకన్నా వాళ్ళు చేయగలిగేదీ ఏమీ ఉండదు. 
‘అలా సెన్సిటివ్‌ గా ఉండకూడదు శాంతీ. బోల్డ్‌ గా ఉండాలి.  ఇదికాదు, ఇంకో చోటికి, ఇంకో పనికి వెళ్ళావనుకో, అక్కడా ఎదురు అవుతారు ఇలాంటి ఎదవలు’ పై అధికారి చెప్పే మాటల్లో, శాంతిలో ధైర్యం నింపే ఆలోచనకన్నా, ఆ పిల్ల ఎక్కడ ఉన్నపళాన ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతుందో అని భయం ఎక్కువ.

సినిమా స్టార్‌ కావాలంటే అర్హతలు ఏమిటో తెలుసా? నున్నటి తోలు, చురుకైన కళ్ళు, సన్నటి ముక్కు, కొద్దిగా డాన్స్, ముద్దు ముద్దు మాటలు....ఇలాకొన్ని. చాలు.  అవి మాత్రం చాలు.  అసలు ఏమీ లేక పోయినా, గ్రాఫిక్స్‌ తో ఇవాళ లేని కళలు ఉన్నట్లు, ఉన్న అవకరాలు లేనట్టు చూబెట్టవచ్చునంట. 
కానీ, కాల్‌ సెంటర్‌ లో పని చెయ్యాలంటే ఆ మనిషికి ఏ లక్షణాలు ఉండాలో  తెలుసా? చాలా గొప్ప ఓర్పు కావాలి.  మానవ మాత్రుడికి సాధ్యం కాని, లేని అనంతమైన ఓర్పు. ఏ పురాణంలోనూ, ఇతిహాసం లోనూ ఏ పాత్రకూ కనబడని సహనం కావాలి.   పైగా దానిని కృత్రిమంగా నటించి చూపడం కుదరదు.  స్వంతంగా ఉండాల్సిందే.  ఎక్కువమంది కోరుకోని,  ఎక్కువరోజులు నిలబడలేని ఈ ఉద్యోగానికి అర్హతలు అతి కష్టమైనవి.

ఫోన్‌ కాల్‌ అందుకుని జవాబులు చెప్పినందుకే పదిహేను వేలు ఇస్తారా అనుకుంది చేరక ముందు.  కానీ, తొందరగానే తెలిసొచ్చింది, శాంతి తన మనఃశాంతిని అతి చవక రేటుకి తాకట్టు పెట్టిందని.
 శాంతి పేరు డిగ్రీ కాలేజీలో రెండవ సంవత్సరంలో హాజరు పట్టీలో ఉంది.  కానీ, ఎప్పుడోకానీ తను హాజరు పలకదు.  చాలా అవసరం, ఏదైనా అసైన్మెంట్‌ ఇవ్వాలి,  ఫీజు కట్టాలి లేదా ఎవరినైనా కలవాలి అంటే పనికి శెలవు పెట్టి  కాలేజీకి వెళుతుంది. 
 గవర్నమెంటు కాలేజీల్లో నూటికి అరవై మంది పిల్లల దిగువ మధ్య తరగతి వాళ్ళు.  బైట తప్పని సరిగా ఏదో ఒక పని చేసుకోకపోతే గడవని వాళ్ళు.  అందుకే వాళ్ళ రోజువారీ హాజరుని అదే పనిగా పట్టించుకుని ఎవరూ ఇబ్బంది పెట్టరు.

‘బైటికి వెళుతున్నాను అక్కా. షాపింగ్‌కి’ పేయింగ్‌ గెస్ట్‌ హౌస్‌ ఓనరమ్మతో చెప్పింది. ఆవిడ సరే అని గానీ వద్దు అని గానీ అనకుండా ఒక రకమైన మొహం పెట్టింది.  ఎప్పుడైనా అంతే.  పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళినా, హౌస్‌కి రావడంలో ఒక పదినిమిషాలు లేటు చేసినా, ఆదివారం షాపింగ్‌కి వెళ్ళినా, గురువారం గుడికి వెళ్ళినా, నోటితో ఏమీ అనదు కానీ ఒక లాగా చూస్తుంది. 
‘హౌస్‌లో అందరి కన్యత్వానికీ, ప్రవర్తనకీ తనని తను కేర్‌ టేకర్‌ గా అనుకుంటది గావున లోపల’ శాంతికి అనుమానం.  ఆ చూపు వెంటాడుతుంది.  సందేహిస్తుంది.  చాలా అవమానిస్తుంది.  కానీ శాంతి ఈ హౌస్‌ వదిలి పోలేదు.  కాలేజీకీ, ఆఫీస్‌ కీ బాగా దగ్గర. ఉన్నంతలో తక్కువ రేటు. 

శాంతి రంగు చామన ఛాయకి తక్కువే.  ఐదడుగులకి కిందనే ఎత్తు.  బహుశా కురచ మనిషి అనొచ్చు.  ముక్కు మాత్రం ఉండవలసిన దానికన్నా కాస్త పొడవు.  కింది పెదవి ముందుకు వచ్చి ఉంటుంది.  పొట్టి గిరజాల జుట్టు.  కోల ముఖం.  ఫెయిర్‌ అండ్‌ లవ్లీ లెక్కలప్రకారం పెద్ద అందగత్తె కాదు. ఆయా లెక్కా పత్రాల జోలి లేకుండా మాట్టాడితే, కురూపి కూడా కాదు. 
సరైన తూకంలో చెప్పాలంటే, శాంతి ఒక వయసులో ఉన్న పిల్ల.  కష్టపడి పని చేసుకునే పిల్ల.  బ్యాక్‌ లాగ్స్‌ లేకుండా జాగ్రత్త పడే పిల్ల.  ఎంతవరకో అంతవరకే సావాసాల జోలికి వెళ్ళే పిల్ల. లోపల్లోపల ఏవో ఆశలు ఉన్నాయి.  అవి ఉన్నాయని, ఉండొచ్చనీ గమనించి, ఆలోచించే తీరికే లేని పిల్ల.

మన జనాల జనాభా  గణనలో కొత్త కొత్త మార్పులు చేర్చి మనుషుల స్వభావం, సమాజం, అంచనాలు అనే కాలమ్‌ ఒకటి చేర్చి రాస్తే, దాని పరంగా, శాంతి ప్రస్తుతానికి ఒక మంచి పిల్ల.
మొహానికి పల్చగా పౌడెర్‌ రాసింది.  ఎరుపు రంగు టాప్‌.  నీలం రంగు లెగ్గింగ్‌.  టాప్‌ కి కాలర్, కాలర్‌కి చిన్న చిన్న పూల పూల డిజైన్‌ ఉంది.  జుట్టు పిన్నులు పెట్టి, బాండ్‌ తో  పోనీకట్టింది. ఎత్తు మడమల చెప్పులు వేసుకుంది.

రోడ్‌ మీదికి వచ్చి షేర్‌ ఆటో కోసం చూసింది. 
నిన్న జీతం వచ్చింది. ఇవాళ శెలవు పెట్టింది.  శలవకు కారణం అనే కాలమ్‌ దగ్గర ‘అనారోగ్యం’ అని రాసింది.  ‘ఏమైంది?’ అని ఒకరిద్దరు అడిగారు.  నీరసంగా నవ్వింది.  జ్వరం కాదు. జలుబు కూడా లేదు.  

ఒక సాఫ్ట్‌వేర్‌ కనిబెట్టాలి.  మాటలు వడబోసే సాఫ్ట్‌వేర్‌.  నచ్చని మాటలు చెవి తమ్మె దగ్గరే ఫిల్టర్‌ అయిపోవాలి.  తప్పుగా ఎవరైనా మాట్లాడితే, వెంటనే వాళ్ళ కాంటాక్ట్‌ నెంబర్‌ బ్లాక్‌ అయిపోవాలి.  వాళ్ళు సరిగా మాట్లాడేదాకా, ఏ కంపెనీ కూడా వాళ్లకి ఫోన్‌ సౌకర్యం కలిగించకూడదు.  శాంతికి నవ్వొచ్చింది.  అసలు జరగని విషయాల గురించి తను ఆలోచిస్తోంది.  అంతకన్నా ఉద్యోగం వదిలేసి, వేరే పని వెతుక్కోవడం సులభం కదా. 

ప్రస్తుతానికి ఆ ఉద్యోగంలోనే ఉంది కాబట్టి, వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేసి, చివరికి తప్పదని ఇచ్చిన ఈ ‘ఒకరోజు’ శెలవుతోనే తను తెప్పరిల్లాలి.  పై వారికి తెలుసు.  కానీ వాళ్ళు కూడా ఏమీ చెయ్యలేరు.  శాంతి లాగానే, బతకడానికి ఉన్న అనేక మార్గాల్లో వాళ్లకి ఇప్పటికి వీలైనది ఇదే.
షేర్‌ ఆటో ఎందుకు?  ఇలాంటప్పుడు కాబ్‌ ఎక్కాలి.  బుక్‌ చేసింది.  ఫోన్‌ చూసుకుంటూ సెంటర్‌ లో నిలబడింది.  ఇదిగో కాబ్‌ వచ్చేసింది అని ఫోన్‌ చూబిస్తోంది. కానీ రాలేదు. 
‘నేను.  బుక్‌ చేసి ఇక్కడే నిలబడి ఉన్నాను. ఐదు నిమిషాలు అన్నారు.  ఇంకా రాలేదు’ మెల్లగానే అంది.
‘ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టలేరు.  ఇంత లోకి ఫోన్‌ చేసేస్తారు. పికప్‌ చేసుకోవడానికే కదా వచ్చేది.  ట్రాఫిక్‌ అడ్డం వస్తే ఆగుతాం.  వస్తాం కదా’ ఆటో డ్రైవర్‌ తన ఇంట్లో పెళ్ళాన్ని కసిరినట్లు కసురుతున్నాడు! 

‘ఔను.  చెప్పిన టైం కి రాలేదుకాబట్టి ఫోన్‌ చేశాను.  నీతో కబుర్లు చెప్పడానికో, పనీ పాట లేకనో ఫోన్‌ చేస్తానా?  ఏదంటే అది మాట్లాడుతున్నావేంటి?’గట్టిగా బదులు చెప్పింది.  చాలా గట్టిగా.  ఆటో అతను తగ్గాడు. శభాష్‌.  ఇంతే ఇలానే చెప్పాలి ఎవరికైనా.  శాంతి మాట్లాడితే నోరెత్తాలంటే ఎదటివాడు భయపడిపోవాలి!
కానీ మళ్ళీ అదే ఆటో ఎక్కింది.  కాన్సిల్‌ చేస్తే, డబ్బులు కట్‌ చేస్తాడు.  అటో దిగినాక వీడి మీద నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ రాసేస్తాను.  తిక్క కుదిరిపోతుంది.  ఆటోదిగిన తరవాత  ఎడమ చేతివైపు సందులోకి తిరిగింది. 

అదొక లోకం.  మహా వైభవం.  ఒకప్పుడు ఇంకా ఉండేది.  విదేశీ వ్యాపారాలు, పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌ రాకముందు ఏకచత్రాధిపత్యం ఏలిన రాజసపు ఛాయలు పూర్తిగా వెలిసిపోలేదు.
రోడ్డుకి రెండుపక్కలా షాపులు.  గోల్డు కవరింగ్‌ నగలు, వాచీలు, బట్టలు, తినుబండారాలు, చెప్పులు, కాఫీపొడి, టీపొడి, పచారీ సామాను, బేకరీలు, స్వీట్‌ మాజిక్, కాస్త పక్క సందులోకి వెళితే హాట్‌ డ్రింక్స్‌.........ఇంకా ఏవేవో.  రోడ్డుకి మధ్యలో బారుగా సైకిళ్ళు మోటారు సైకిళ్ళు సెంట్రల్‌ పార్కింగ్‌ చేసి ఉన్నాయి.  వాటిని ఆనుకుని, ఏఏ వస్తువులు పెద్ద పెద్ద షాపుల్లో పెద్ద పెద్ద రేట్లకి అమ్ముతారో, అవే వస్తువులు చిన్న చిన్న బళ్లమీద చిన్న చిన్న రేట్లకి అమ్ముతున్నారు.  శాంతి పెద్ద బోర్డుల వంక చూడలేదు.  చిన్న తోపుడు బండ్లసమీపానికి కూడా వెళ్ళలేదు.  మధ్యలో నిలబడింది.  అందర్నీ చూస్తోంది.  ఎందుకు అలా నిలబడింది?  ఏమిటి చూస్తోంది.  ఏమిటి చూస్తోందో! 

ప్రతి మనిషి మనసులో ఏవుందో మనం అన్నీ తెలుసుకోగలమా?  ఆ లోకాన్ని చూస్తోంది. ఏదో వెతుకుతోంది.  ‘వెదకుడి దొరకును’.  బైబిల్‌ వాక్యం గుర్తు చేసుకంది.  నీకేం కావాలి?  అక్కడ దొరకనిది ఉండదు. 
కానీ, ఆ దోవన వచ్చిపోతున్న జన సముదాయం కేవలం వస్తువులకోసమే వచ్చినట్టు కనబడటం లేదు!
ఎత్తు కోణాకారం వెదురు గంపలో తీరిగ్గా సర్ది పెట్టిన మరమరాలూ మసాలాలూ చిన్న బట్టల షాపులో వెదజల్లి ఉన్నాయి.  బక్క పలచటి ఆడ మనిషి కోపంగా ఊగిపోతోంది.
‘ఇస్తాను కదా.  నెమ్మదిగా అడిగి తీసుకో.  అరవడం ఎందుకు?  ఇలా వెదజల్లడం ఎందుకు?  ఇప్పుడు నష్టం ఎవరికి?  నాకా?  నీకా?’ షాప్‌ లో నేల పడిన వాటిని చిమ్మేస్తూ అతను కేకలు పెడుతున్నాడు. 

బైట నిలబడిన మరమరాల గంపగలామె ఏదేదో తిడుతోంది.
ఆమె ఎందుకు కోపంగా ఉంది?  అతను ఏమని ఉంటాడు?  డబ్బులు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పించాడా?  లేక ఏదైనా అనకూడనిది మాట్టాడాడా? ఆమెకు  కోపం తెప్పించాడా? వాడు ఏమైనా అననీ అనకపోనీ. ఆమెకి కోపం వచ్చింది.  కోపం చూపాలనుకుంది.  చూబెడుతోంది.  ఎంత అదృష్టమో కదా.  శాంతి ఆమె వంక ముచ్చటగా చూసింది.
తల నుంచి పాదాల దాకా ఏ సింగారానికైనా వస్తువులు దొరికే ఒక చిన్న బండి.  అది అతనిది.  అతనెవరు?  ఎవరో. 

శాంతికి లాగానే, ఎర్ర చొక్కా, నీలం ఫాంటు వేసుకొని ఉన్నాడు.  బట్టల రంగు ఒకటే గానీ, మెటీరియల్‌ వేరు.  కుట్టిన విధానం కూడా వేరు.  చుట్టూ ఐదారుగురు ఆడపిల్లలు చేరారు.  చమ్కీ గాజులు, బొట్టు బిళ్ళలు, రంగు రంగుల గోళ్ళ రంగులు చూస్తున్నారు.  ఏ వస్తువైనా ఇరవై రూపాయలు.
‘పది రూపాయలకి ఇస్తావా?
‘రాదు’
‘ఓ ముద్దు కూడా ఇస్తాను’ ఒకపిల్ల దూకుడుగా ఉంది.  భయం లేదా?  లేదా ఇక్కడ దేనికీ  భయపడనక్కరలేదా? ఏదైనా అనేసేయోచ్చా?  నిజానికి అతను ముద్దు వచ్చేంతవాడు కాదు.  కానీ, అవసరానికి అందంతో పని లేదు.  ఆ పిల్ల ఎంత లోటుపడిఉందో. వినీ విననట్టు వేరే వైపు సర్దుకుంటున్నాడు.  అతనికి పెళ్లి అయిందో లేదో?  ఎవరైనా ముద్దు పెట్టారో లేదో.

 నిజంగా వినలేదా?  ఎన్నోసార్లు విని విసిగిపోయాడా?  అబ్బా, వినకుండా ఉండొచ్చు, జవాబు చెప్పకుండా నిర్లక్ష్యం చేయొచ్చు.  అతన్ని ఆ పిల్ల నిజంగా ముద్దు పెట్టుకుంటే ఏం చేస్తాడో?  తెల్లబోతాడా?  చిరాకు పడతాడా?  షాక్‌ తింటాడా?  శాంతి ఊహించుకుని నవ్వుకుంది.
వూరంతటిలో బోలెడు బ్రాంచిలు ఉన్న స్వీట్‌ మంత్ర షాపులోకి వెళ్ళింది.  పైకి మెట్లు ఉన్నాయి.  మెట్లెక్కింది.  ఊళ్ళో చాలా పెద్ద హోటళ్ళు ఉంటాయి.  అక్కడ కాఫీ వంద రూపాయలు.  కొందరు స్టేటస్‌ కోసం అక్కడికి వెళతారు.  మిగిలినవాళ్ళంతా ఇక్కడికి వస్తారు.  ఆ మిగిలిన వాళ్ళలో కూడా చాలా విభజనలు.  చిన్న చిన్న వాళ్ళు రోడ్డు పక్కన బండి మీద అమ్మే స్వీట్లు కొంటారు.  మరీ దరిద్రం, కనీసం ఇరవై కూడా లేదా? గులాబీ రంగు పీచు మిఠాయే గతి.  అంటే, కొందరు కాస్త గొప్పోళ్ళు కూడా ఇష్టం మీద అలా చవకైనవి కొనుక్కుని తింటారు.  అటు మరీ స్టార్‌ హోటల్‌ కి పోలేని, లేదా బొత్తిగా రోడ్డు పక్కన బండి మీదివి కొనడం సరికాదు అనిపించిందనుకో, ఇలా ఈ బజారులో, ఈ ఫలానా షాపులోకి నడిచి వచ్చేయొచ్చు.   ఇలానే ఠీవిగా మెట్లు ఎక్కి పైకి వెళ్లి ఏం కావాలో ఆర్డర్‌ చెబుతారు.  వెయిటర్లు, మిఠాయిలైతే కిందినుంచి, ఫాస్ట్‌ ఫుడ్స్‌ అయితే పైన ఉన్న కిచెన్‌ నుంచి తెచ్చి ఇస్తారు.

పార్సిల్‌ ఆర్డర్‌ చెప్పింది.  రాసుకున్నాడు.  చుట్టూ నాలుగైదు టేబుల్స్‌.  జనం కూడా పల్చగా ఉన్నారు.  ఒక టేబుల్‌ దగ్గర ఒకబ్బాయి ఎదురగా కూచున్న అమ్మాయికి ఏవేవో గొప్పలు చెబుతున్నాడు.  

ఆపిల్ల, అవన్నీ నిశ్శబ్దంగా వింటూ మధ్య మధ్య ఆశ్చర్యపోతూ, పాతకాలం పిల్లలాగా అవసరం లేకపోయినా,  అప్పుడప్పుడూ సిగ్గుపడుతోంది.  ఇంకోబల్ల దగ్గర తల్లి ఇద్దరు పిల్లలు.  వాళ్ళు పేచీలు పెడుతూనే జాలీగా తింటున్నారు.  తల్లి సంతోషంగా, గర్వంగా ఉంది.  పెద్ద బల్ల చుట్టూతా స్టూడెంట్స్‌ ఉన్నారు.  అబ్బాయిలూ, అమ్మాయిలూ కలిసి వచ్చారు.  చీకూ చింతా లేనట్టు, ఇక్కడ కూచోడం తప్ప ప్రస్తుతానికిగానీ, లేదా ఒక గంట తరవాత గానీ ముఖ్యమైన పనే లేనట్టున్నారు. 
పదినిమిషాలు గడిచాయి.  ఇరవై నిమిషాలు గడిచాయి.  ఆర్డర్‌ రాలేదు. వెయిటర్ని పిల్చింది.
‘చేస్తున్నారు మేడం’
మళ్ళీ పది ఇరవై నిమిషాలు గడిచాయి.  ఇంతసేపటి తరవాత కూడా ఆర్డర్‌ రాలేదు.  సహనం తగ్గింది. 
‘మీరు చెప్పిన ఆర్డర్కి టైం పడుతుంది మేడం.  ఇంకోటి ఉంది.  తెమ్మంటారా?’
‘ఎంత టైం పడుతుంది?  ముందు చెప్పాలి కదా వెంటనే చెయ్యడం కుదరదని’
‘అంటే, స్టాఫ్‌ ఇవాళ తక్కువ మంది ఉన్నారు.  ఇంకో ఐటెం రెడీగా ఉంది.  తెమ్మంటారా?’

‘వాట్‌ నాన్సెన్స్‌ ఇస్‌ దిస్‌?  ఇంత సేపు కూచోపెట్టి ఇప్పుడు అది లేదు, ఇది ఉంది అంటారేంటి?  అసలు ఆర్డర్‌ కాన్సిల్‌ చేసేస్తున్నాను.  నాకు ఏమీ వద్దు.  నేను పే చేసిన మనీ తిరిగి ఇచ్చేయండి’ శాంతి ఇంగ్లీష్‌ లో మాట్టాడింది.
‘ఆన్లైన్‌ పేమెంట్‌ వెళ్ళిపోయింది మేడం.  తిరిగి ఇవ్వడం కుదరదు.  మీరు ఇంకేదైనా తీసుకోండి’ ఆతను ఆమె ఇంగ్లీష్‌కి స్పందించిన దాఖలా లేదు!
‘దిస్‌ ఇస్‌ టూ మచ్‌.  ఐ జస్ట్‌ కాంట్‌ అండర్‌స్టాండ్‌ వాట్‌ యు మీన్‌.  డబ్బులు ముందు ఇచ్చిన పాపానికి మాకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏ చెత్త పెడితే ఆ చెత్త తినాలా?’
‘మేడం, మీరు కూచోండి.  నేను  రెడీ చేయిస్తాను’ పైన జరుగుతున్న గోలకి కిందినుంచి వచ్చిన మేనేజెర్‌ శాంతిని కళ్ళతో అంచనా వేస్తూనే చెప్పాడు.
‘ఐ విల్‌ కంప్లైంట్‌ టూ  యువర్‌ మెయిన్‌ ఆఫీస్‌.  పరమ దరిద్రపు సర్వీసు.  తెలీక వచ్చాను’ సుమారు పావుగంట తరవాత ఆర్డర్‌ వచ్చేదాకా శాంతి తిడుతూనే ఉంది.  పక్క టేబుళ్ళ వాళ్ళు వింటూనే తింటూ ఉన్నారు.
‘ధాంక్‌ యు మేడం’ తాపీగా పార్సిల్‌ పాకెట్‌ శాంతి చేతికి ఇచ్చి మావూలుగా అన్నాడు.  అతనివంక కోపంగా చూస్తూ శాంతి పాకెట్‌ విసురుగా లాక్కుంది.  అతను అభావంగా ఉన్నాడు.  అతని రెండు కళ్ళలో శాంతి ప్రతిబింబాలు ఉన్నాయి.

బైటికి వచ్చి ఏదైనా నూట యాభై అని అట్టమీద పెన్నుతో రేటు వేసివున్న బండి మీద ఒక జీన్స్, సరిపడా టాప్‌ కొన్నది.  సెంటర్లో వినాయకుడి గుడి దగ్గర దణ్ణం పెట్టుకుంది.  గుడికి వెళితే ఒక్క నిమిషమైనా కూచోవాలి అంటారు.  అది చాలా చిన్న గుడి.  అయినా ఒక పక్కగా అరుగుమీద కూచుంది.    
ఫోన్‌ తీసింది.  రెండు కంప్లైంట్స్‌ రాయాలి.  ఒకటి ఆటో అతనిమీద.  రెండోది స్వీట్‌ మంత్ర సర్వీస్‌ మీద.  వరస్ట్‌ సర్వీస్‌.......ఆటో డ్రైవర్‌ గురించి రాసింది.  మళ్ళీ ఎందుకనో తీసేసింది.  వెరీబాడ్‌ సర్వీస్‌.......స్వీట్‌ మంత్ర పేజీలో రాసింది.  అది కూడా డిలీట్‌ చేసింది.  ఒక్క నిమిషం కళ్ళుమూసుకుంది. ప్రశాంతంగా ఉంది.  లేచి దేవుడిని మళ్ళీ ఓసారి చూసి అలవాటు ప్రకారం రెండు చెంపలూ వేసుకొని వెనక్కి తిరిగింది. 
(కోటి సుల్తాన్‌ బజార్, జగదాంబ సెంటర్, సూపర్‌ మార్కెట్, లేకపోతే పాత రోజుల్లో సంత.  బాధనీ, సంతోషాన్నీ సమాంతరంగా పంచుతూ, మార్కెట్లు నిరంతరాయంగా తెరవబడే ఉన్నాయి)
ఎం.ఎస్‌.కె.కృష్ణజ్యోతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement