నా కొడుకు సుందరాంగుడు | Mother And Son Telugu Short Story | Sakshi
Sakshi News home page

సుందరాంగుడు

Published Sun, Feb 16 2020 11:45 AM | Last Updated on Sun, Feb 16 2020 11:45 AM

Mother And Son Telugu Short Story - Sakshi

శనివారం సాయంత్రం–
మీసాలాయన కయ్యి కాడికి పోయి పచ్చ గడ్డి కోసుకొని అప్పుడే ఇంటికి వచ్చింది అచ్చెమ్మక్క. గంప దించీ దించక ముందే రాతి గుంజలకు కట్టి వున్న రెండు ఆవులూ గంప మీదికి ఎగబడ్డాయి. రెండింటినీ  కుడిచేత్తో రెండు దెబ్బలేసి గంపలోని గడ్డిని వాటి ముందర పోసింది. అవి ఆవురావురుమని తింటున్నాయి.
మట్టి తొట్టెలోని నీళ్లతో ముఖం కడుక్కొని పమిట కొంగుతో తుడుచుకొంటూ ఇంట్లోకి  వెళ్తోంది. 
వేప చెట్టుకింద నార మంచంపైన బడిలో రెండో తరగతి చదివే బాలడు బల్లికగా బలహీనంగా పడుకొని వున్నాడు. గబ గబా కొడుకు దగ్గరకు పోతూ వుంటే వాడి స్కూలు బ్యాగు ఆమె  కాళ్ళకి తగిలింది.
 బ్యాగులోని స్టీలు కారియర్‌ మిలమిలా మెరుస్తూ  వుంటే మూత తీసి చూసింది. క్యారియర్లో తెల్లారి పెట్టి పంపిన గోగాకు వూరిబిండి, అన్నం ఎట్ల బెట్టింది అట్లే వుంది. 
‘ఏమయ్యిం దబ్బా నా బిడ్డకి’ అనుకొంటూ వాడి ముఖంపై చేయి పెట్టి చూసింది. 
‘‘కాళ్ళు సలుపులే అమ్మా, సచ్చుగా వుందే అమ్మా’’ అని చుట్టుకొని చుట్టుకొని పడుకొన్నాడు. బాలడి ముఖం గాండ్రించుకొని వుంది. కళ్ళు కొంచెం పసుపు రంగులో వున్నాయి. కింది కనురెప్పలు లాగి చూసింది. రక్తం అంతంత మాత్రమే వుంది.
అచ్చెమ్మ వెనకే వచ్చిన నల్ల రంగు తెల్ల చుక్కల ఇంటి కుక్క బాలడికి ఒళ్ళు బాలేదని తెలిసి ఇద్దరి ముఖాలు చూస్తూ నాలుక బయటికి పెట్టి నాలుకను ఆడిస్తూ నిలబడింది.
అప్పుడే పాలల్లో తోడు వేయడానికని పెరుగుకోసం వచ్చిన పార్వతక్క ‘బాలడికి పసికర్లు పసిరికల మాదిరి వుంది. పాకాల పక్కన కొట్టాలలో చేతి మణికట్టు పైన వేడి కమ్మితో రూపాయ బిళ్ళంత కాలుస్తారంట. అది బాగా పుండై చీము పట్టి ఎండిపోతే పసికర్లు కూడా బాగై పోతుందంట...’ అని ఇంకా ఏదో చెప్పబోతోంది పార్వతక్క.

సర సర వచ్చిన అచ్చెమ్మక్క గట్టిగా తన రెండు చేతుల్తో పార్వతక్క నోరు గట్టిగా మూసేసింది. ‘పాపిష్టి పార్వతీ, వచ్చినదానివి వచ్చిన పని చూసుకొని పోకుండా నా బంగారంలాంటి కొడుకును కాల్చుకోమంటావా? నా బిడ్డను నా కండ్ల ముందర కాలుస్తుంటే నా ప్రాణం నిలబడుతుందా? ఈ నా ప్రాణం వుంటే ఎంత? పోతే ఎంత? నా కొడుకు సల్లగా వుండాల. వాడిని చీమ కుట్టినా నన్ను తేలు కొట్టినంత బాధ పడతాను. ఇట్టాంటి మాటలు ఎప్పుడూ చెప్పబాక. కడుపులో కత్తెర పెట్టుకొని నోట్లో చక్కెర పొసే మనిషిగా ఉండావు’ అని తిట్టేసి ఇంట్లోకి  సర సరా పోయి తోడు కోసం పెరుగు తెచ్చి ఇచ్చింది.
‘తప్పై పోయిందిలే అచ్చెమ్మక్కా, రాసపల్లి రాచకొండ నారాయణమ్మ ఆకు పసరు మందు ఇస్తుందంట. మూడు వారాలకే పసిపిలకాయలకు పసికర్లు పోయి చెంగుచెంగుమని పరుగులు తీస్తారంట. పోరాదా, ఆకు పసరు తినిపించరాదా’ అంటూ చెప్పి వెళ్లి పోయింది.
రాత్రంతా నిద్ర లేదు అచ్చెమ్మకు. బిడ్డ పక్కనే కూర్చొంది. గంట గంటకీ బాలడి కనురెప్పలు తెరిచి తెరిచి చూసింది. కండ్లు తెల్లగున్నాయా, పసుపు రంగుకు మారినాయా అని చూసింది. వాడు కడుపు నొప్పికి ఆ పక్కకీ ఈ పక్కకీ దొర్లుతుంటే  ‘‘ఏం కాదు... ఏం కాదులే నాయనా’’ అని దైర్యం చెప్పింది. తడిగుడ్డ తెచ్చి వాడి పొట్టపైన వేసింది.

ఆదివారం తెల్లారింది.
ఊర్లో కోళ్లు ఒకటి కాదు, వరసగా అయిదారు కూసినాయి.
గబగబా లేచి పెళ్ళోకి పెరట్లోకి పోయి చన్నీళ్లతో తల స్నానం చేసింది. దేముడి పటాలకు దండం పెట్టింది. మూడేళ్ళ ముందు బురద గుంటలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న మొగుడి పటానికి ముద్దబంతి పూలు పెట్టింది. బాలడిని తట్టి లేపి తడి గుడ్డతో బాలడి ఒళ్ళంతా తుడిచింది. వాడి గుడ్డలు చిన్నగా మార్చి ‘‘బాలా, రాసపల్లికి పోదాము. నారాయణమ్మ పసరు మందు తీసుకొందాము. తెల్లార్తోనే పోయి  ఎండ రాకుండా ముందే మందు తిందాము’’ అని చెప్పింది.
చిన్నగా అమ్మా కొడుకు ఈశ్వరాపురం నుంచి మైలు దూరంలో వున్న రాసపల్లి బయలుదేరినారు. కయ్యిలమ్మిట, కాల్వలమ్మిట బాలడు అడుగులో అడుగువేసుకొంటూ నడుస్తున్నాడు.
‘‘సుందరాంగుడు నా కొడుకు. వాడు నడిస్తే వుండే రాజఠీవి ఈ నాలుగూళ్ళల్లో ఎవడికి వస్తాది? ప్రాయానికి రానీ నా కొడుకు, ఊర్లో ఆడపిలకాయలు ఎగరేసుకు పోవాలని చూస్తారు. ఏ పాపిష్ఠి కండ్లు పడినాయో నా బిడ్డ మీద, ఏ చుప్పనాతి  దిష్టి తగిలిందో నా బిడ్డ మీద, సగానికి సగం అయిపోయినాడు’’ అనుకొంటూ వాడి వెనకే నడుస్తోంది అచ్చెమ్మ.

అర మైలు నడిచినారు. ‘‘కాసేపు కూర్చొంటానే అమ్మా’’ అని అడిగినాడు. ఇద్దరూ చింత చెట్టు కింద రాతి బండ పైన కూర్చొన్నారు. చింత చెట్టు ముందరే రెండు నీళ్ళ గుంటలు వున్నాయి. వాటిని ఆ చుట్టు పక్కల ఊర్లల్లో నూకలగుంట, రాగులగుంట అని పిలుస్తారు. గుంటల ఒడ్డున నత్త గుల్లలు పెండ్లి కూతుర్ల లెక్కన నడుస్తూ వుంటే బాలడు వాటినే చూస్తున్నాడు.
ఇంతలో ఒంటిమిట్ట ఊరోళ్ళవి అర డజను ఆవులు వచ్చి నూకల గుంటలో నీళ్లు తాగుతూ వున్నాయి. అప్పుడే రాసపల్లి ఆవులు పది దాకా వచ్చి అదే గుంటలో నీళ్లు తాగబోయాయి. అట్లా ఇట్లా చూసిన ఒంటిమిట్ట ఆవులు రాసపల్లి ఆవుల్ని నీళ్లు తాగనీయకుండా బుసలు కొడుతూ, కొమ్ములు విసురుతూ తరిమినాయి. ఎదురు తిరగలేని రాసపల్లి ఆవులు తోకలు ఆడించుకొంటూ పక్కనున్న రాగులగుంట కాడికెళ్ళి నీళ్లు తాగాయి. 
ఆవుల తరుముడు  చూసిన బాలడు చిన్నగా అర నవ్వు నవ్వినాడు.
దూరంగా వున్న చెరుకు తోటల నుంచి గాలి తెరలుతెరలుగా వీస్తోంది. 
‘‘సరే పోదాం పదరా బాలా’’ అనింది అచ్చెమ్మ. చిన్నగా చెట్టు పట్టుకొని లేచినాడు. 
‘‘నా వల్ల కావడం లేదే అమ్మా’’ అనినాడు.
 ఒక పక్క  కొడుక్కి దైర్యం చెబుతూ. ‘ఎట్ల చేసేదిరా కొడకా’ అని సాయానికి ఎవరైనా కనబడతారేమోనని అన్ని దిక్కులూ చూసింది. దరిదాపుల్లో ఎవ్వరూ కనబడకపోయేసరికి ‘సరే రారా నేనే ఎత్తుకొని పోతాను’ అని చెప్పి బాలడిని భుజాన వేసుకొని పది అడుగులు వేసింది. అచ్చెమ్మ వల్ల కాలేదు.
బలవంతంగా అడుగులేసుకొంటూ వెళుతుంటే ఊరినుంచి ఎద్దుల బండిలో సొరకాయలాయన వడ్ల మూటలు వేసుకొని వస్తున్నాడు. అచ్చెమ్మను చూసిన సొరకాయలాయన ‘‘అచ్చెమ్మక్కా, కాటారెడ్డి మిల్లులో వడ్లు ఆడించుకొనేదానికి అగ్రహారం పోతా ఉండా, బండిలో అబ్బిని కూర్చోబెట్టు. రాసపల్లిలో దించిపోతా’’ అనినాడు. 
‘‘కోరిన కొండ పైన వాన పడతందంటే వద్దంటామా అన్నా, నా బిడ్డను ఎక్కించుకో నీ బండిలో, నీకు జన్మ జన్మకీ రుణపడి వుంటాను’’ అని చెప్పి బాలడిని ఎద్దులబండిలో ఎక్కించి వెనకనే నడుచుకొంటూ వెళ్ళింది.

రూపాయ బిళ్ళంత బొట్టు పెట్టి ముక్కుకు రెండు వైపులా బంగారు పుడకలుబెట్టి తలకి బిచ్చాడిక్రొప్పు ముడి వేసి మూర మల్లెపూలు పెట్టి చేతినిండా బంగారు గాజులేసి ఒళ్ళంతా పసుపురాసి లక్ష్మీకరంగా వాకిట్లో నిలబడివుంది నారాయణమ్మ.
 పట్టు చీరకట్టి, మెడ పైవరకు కుట్టించుకున్న జాకెట్టుతో మెడలో నల్లపూసలతో మిలమిలా మెరుస్తోంది నారాయణమ్మ. నిండు ముత్తయిదువ కదా, నిమ్మ రంగు ఒళ్ళు కదా, ధగధగా మెరిసిపోతోంది అయిదు అడుగుల ఎత్తు వున్న నారాయణమ్మ. నవ్వుతూ పలకరించి  విషయం తెలుసుకొంది.
‘‘మూడు ఆదివారాలు రావాలి. పరగడుపున  వారం వారం ఆకు ముద్దలు మూడు మింగాలి. చల్లటి మజ్జిగ తాగాలి. ఆ రోజంతా ఉప్పులేని మజ్జిగన్నం తినాలి. పసికర్లు తగ్గేంత వరకు మాంసంగానీ శెనగనూనె గానీ వేపుళ్ళు గానీ తినకూడదు. తేలికగా జీర్ణమయ్యే తిండి తినాలి. చెడీ బడీ తినొద్దు. ఈ మూడు వారాలూ నోరు కట్టేసుకో’’  అని బాలడికి  జాగ్రత్తలు చెప్పింది. అన్నిటికీ బుద్ధిమంతుడి లెక్కన తల ఊపినాడు బాలడు.
అచ్చెమ్మ వైపు తిరిగి ‘‘నేను ఇచ్చే మందు ఆకు పేరు ఏమి అని అడగబాకండి. మందు పేరు చెబితే వైద్యం పనిచేయదని మా గురువు ఆజ్ఞ. మందు పనిచేస్తుందో చేయదో అని అనుమానం పెట్టుకోకండి. నమ్మితేనే వైద్యం పని చేస్తుంది.  వందల మంది నా మందు తిన్నారు. దేముడి దయ వల్ల అందరూ చల్లగా వుండారు. వైద్యానికి నేను పైసా తీసుకోను. డబ్బు తీసుకొంటే వైద్యం పని చేయదని కూడా మా గురువు చెప్పినాడు’’ అని గబ గబ చెప్పేసింది.

అన్నిటికీ సరేనంది అచ్చెమ్మ.
ఐదో తరగతి చదివే నారాయణమ్మ నాలుగో కొడుకు శీనడు బలహీనంగా  వున్న బాలడిని ఎగాదిగా చూసి ఆకు కోసుకొద్దామని నిక్కరు ఎగేసుకొంటూ పరుగులు తీసినాడు. ఊరికి ఎగుదాల  ముగ్గురాళ్ళ మిట్ట  కాడ కొన్ని ఆకులు కోసుకొచ్చినాడు. మోటరు బావి కాడ పారుతున్న  మంచి నీళ్ళల్లో శుభ్రంగా ఆకుల్ని కడిగి ఇంటికి తెచ్చినాడు. ఇంటి పెరట్లోని  సనికెల రాయి పైన పెట్టినాడు. నారాయణమ్మ శుభ్రంగా కాళ్ళు చేతులూ కడుక్కొని గబగబా వచ్చి ఆకును నూరసాగింది. ఇంట్లోకెళ్ళి శీనడు చెంబునిండా మజ్జిగ తెచ్చినాడు. నూరిన ఆకు పసరును  ముద్దలు  ముద్దలుగా చేసి  నారాయణమ్మ మూడు తెల్ల తమలపాకుల్లో పెట్టింది. బాలడిని  తూర్పు దిక్కుగా కూర్చోమని చెప్పి కండ్లు మూసుకొని తిరుత్తణి సుబ్రమణ్యస్వామిని మొక్కుకొని ఒక్కొక్క ముద్దా తినిపించింది. కండ్లు మూసుకొని గుటక్‌ గుటక్‌ మని మింగినాడు. 
అక్కడే కాసేపు కూర్చోమని చెప్పి ‘‘భయం లేదు,అంతా బాగైపోతుందిలే’’ అని భుజం తట్టి దైర్యం చెప్పి పంపింది.

రెండవ ఆదివారం–
అమ్మా, కొడుకు చిన్నగా నడుచుకొంటూ మందు కోసం రాసపల్లికి వెళ్తున్నారు. అలిసిన బాలడు కొంచెం సేపు కూర్చొంటానంటే ఇద్దరూ దారిలోని బ్రహ్మం గారి మఠం కాడ కూర్చొన్నారు.
అక్కడే ఒంటిమిట్ట వెంకటమ్మ తలకి గుడ్డ  చుట్టుకొని తట్ట, బుట్ట పెట్టుకొని చింత చెట్టు బెరడు, పిక్కలు ఏరుతోంది. వాటిని గోతాలకేసుకొని ఒలిచి తిరుపతికి తీసుకెళ్లి  ఎంతకో కొంతకు అమ్ముకొంటుంది.
‘గురివింద గింజా
గురివింద గింజా
పైపైకి చూస్తావు గురివింద గింజా
నీ నలుపేల చూడవు గురివింద గింజా’ అని పాడుతూ  వుంది. 
బండ పైన కూర్చొని వున్న అచ్చెమ్మ చేతికి చింతపండు ఇచ్చింది. ‘తిను, పుల్లగా తియ్యగా భలే వుంది ఈ చెట్టు పండు’ అని చెప్పింది.
‘‘లేదు వెంకటమ్మా, బిడ్డకి ఒళ్ళు బాగ లేనికాడినుంచి నా నోటికి ఉప్పూ కారం, తీపు చేదు రుచి తెలియడంలేదు. ఏడుకొండలోడి దయవల్ల నా బిడ్డ తేరుకోబోతాడా అని ఒకటే దిగులు పట్టుకొంది. తట్ట నిండా పెడితే కడుపు నిండా తినే నా కొడుకు ఆకలే కావడం లేదంటా వుండాడక్కా. చాన్నాళ్లుగా తిండి తినక నా కొడుకు సచ్చుబడి పోయినాడక్కా! ఆకలో, ఆకలో అని అరిచేటోడు ఆకలి మాట నోరారా ఎత్తడం లేదక్కా’’ అని కన్నీళ్లు పెట్టుకొంది.
 ‘‘అయ్యో ఏంది అచ్చెమ్మా, ఈరోజు వున్నట్టే రేపు వుంటుందా? రేపు వున్నట్టే ఎళ్లుండి వుంటుందా? అంతా నీ పిచ్చిగానీ, దైర్యంగా వుండు. మగ తోడు లేనిదానివి. అన్నీ మంచే జరుగుతాయిగానీ’’ అని దైర్యం చెప్పింది. 
పొగాకు తిత్తి లోనుంచి మడతలు పడిన  పదిరూపాయల నోటు తీసి అచ్చెమ్మ చేతిలో బలవంతంగా పెట్టింది.
‘‘దోవలో ఎక్కడైనా టెంకాయలు అమ్మతావుంటే లేత టెంకాయ ఒకటి కొట్టించి బిడ్డకు తాగిపించు. కడుపు చల్లబడతాది’’ అని చెప్పి పంపింది.    
రెండో వారం కూడా నారాయణమ్మ ఇచ్చే పసరు మందు తీసుకొని ఇంటికొచ్చినారు.

మూడవ ఆదివారం–
అమ్మా, కొడుకు తెల్లారేకడికి లేచి  నడుచుకొంటూ వెళ్లి కాసేపు కూర్చొందామని పసుపు కాల్వ కాడ కూర్చొన్నారు. బాలడు కాల్వ గట్టున వున్న పసుపు పచ్చని తంగేడు పూలు చూస్తూ కూర్చొన్నాడు.
రాసపల్లి మేకల గుంపు పసుపు కాల్వ కుడి పక్కనున్న కటవ మీది తుమ్మచెట్టు చుట్టూ చేరి ముండ్లు గుచ్చుకోకుండా ఒడుపుగా ఆకులు పెరుక్కొని తింటున్నాయి. వాటి వెనకే వచ్చిన ఒంటిమిట్ట మేకల గుంపును కొమ్ములతో తరుముకున్నాయి. ఒంటిమిట్ట మేకల గుంపు వెనక్కి తిరిగి చూడకుండా  పరుగులు తీసి ఎడమ పక్కనున్న తుమ్మచెట్టు దగ్గరికి పోయి నోటితో ఆకులు పెరుక్కొని నమలసాగాయి. మేకల పరుగుళ్లు చూసిన బాలడు ‘వాల్లోళ్ళ  రాజ్యం  వాల్లోళ్ళది’  అనుకొంటూ ముసిముసిగా  నవ్వినాడు.
ఇంతలో ఆముదాలను వండి ఆముదాన్ని పుత్తూరులో అమ్ముకొనేదానికి పోతా వున్న చిర్రక్క నిలబడింది.
‘‘కడుపు నిండితే కడవలు మోయు, లేకపోతే పగుల వేయు కదా నా కొడుకు. కంచం వైపు చూడటమే లేదు, మంచం వైపే చూస్తున్నాడు’’ అని చిర్రక్కతో చెబుతూ ముక్కు చీదింది అచ్చెమ్మ.
‘‘ఏమిరా బాలా, ఏనుగు మాదిరి వుండాల్సిన వాడివి ఎలుక పిల్ల మాదిరి సన్న బడిపోయినావు’’ అని అంటూ నెత్తి మీది సత్తు చెంబు కింద పెట్టింది. అచ్చెమ్మ పసికర్ల విషయం చెప్పేసరికి– ‘‘అచ్చెమ్మక్కా, నీ బిడ్డకి ఒంట్లో వేడి అయిపోయి వుంటుంది. అందుకే బిడ్డ ఇట్లా ఎండి పోతావుండాడు’’ అంటూ చేతిలోకి ఆముదం తీసుకొని తలకి కాళ్ళకి పొట్టకి రాసి ‘‘నూరేండ్లు చల్లగా ఉండురా నాయనా’’ అని దీవించి గంపనెత్తుకొని బయలుదేరింది.

చిన్నగా నడుచుకొంటూ రాసపల్లి కెళ్ళి మూడో ఆదివారం కూడా నారాయణమ్మ పసరు మందు తీసుకున్నారు. నారాయణమ్మ ఇంటకాడనే తిన్నె పైన కూర్చొన్నారు అమ్మా కొడుకు. ఎదురుగా వున్న తాటి చెట్లను చూస్తూ వున్నాడు బాలడు. గాలికి అప్పుడప్పుడు తాటి మట్టలు చిన్నగా కదులుతున్నాయి. ఇంతలో కోతుల గుంపు ఒకటి వచ్చింది. పెద్ద కోతి ఒకటి ఎక్కడినుంచో అరటిపండ్ల గెల ఒకటి పట్టుకొచ్చింది. పిల్ల కోతులు చుట్టూరా చేరి గెల లోని పండ్లు పెరుక్కొని తింటున్నాయి.
బాలడు ఎక్కడ భాగానికొస్తాడో అన్నట్లుగా అప్పుడప్పుడు బాలడి వైపు ఉరిమి ఉరిమి కోతి చూపులు చూసినాయి. ఇంతలో తాటి  చెట్టునుంచి ఒక పెద్ద  తాటిమట్ట ఒకటి కోతి గుంపుపైన ధభీమని  పడింది. అరటిపండ్లు అన్నీగబగబా  ఏరుకొని కోతులన్నీ చెల్లాచెదురుగా పరుగులెత్తాయి. కోతులు పరుగులు తీసేది చూసిన బాలడు పకపకా నవ్వినాడు. 
చాన్నాళ్లకు కొడుకు పకపకా నవ్వేది చూసిన అచ్చెమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గబగబా లేచి దోవలో తోపుడు బండి గంట కొట్టుకొంటూ వెళ్తున్న సులేమాన్‌ని ఆపింది. గాజు సీసాలోని పీచుమిఠాయి పొట్లం కట్టించి నారాయణమ్మ కొడుకు  శీనడి చేతికిచ్చింది. మిఠాయికి పైసలిచ్చి వెనక్కి తిరిగి చూసేలోగా శీనడు  పీచుమిఠాయిని గుటుక్కుమని మింగేసినాడు. 
రెండోసారి తీసిచ్చింది. సిగ్గు పడకుండా తీసుకున్నాడు. మూడోసారి తీసిస్తుంటే....
నారాయణమ్మ ఇంట్లోంచి  గబగబా వచ్చి ‘‘తినింది చాల్లేరా శీనా, కడుపు చెడిపోతుంది. ఎవరైనా ఏమైనా తీసియ్యబోతారా  అని కాసుకొని  ఉంటాడు తీసుమింగుడు’’  అంటూ కట్టె ఎత్తుకొని తరిమింది. 
 శీనడు ‘‘నాకేం తెలుసు?’’ అన్నాడు.
‘‘అచ్చెమ్మక్క ఇచ్చింది. తీసుకున్నాను. అచ్చెమ్మక్క ఇచ్చింది. తిన్నాను’’  అంటూ జారి పోతున్న నిక్కరు ఎగేసుకొంటూ చీమిడి  ముక్కు చీదుకొంటూ ఊర్లోకి పరుగులెత్తినాడు.
 ‘‘ఇంటికి పోదాం పదమ్మా’’ అని భుజాలెగరేస్తూ అడిగినాడు బాలడు. సరేనంది అచ్చెమ్మ.

ముందుగా బాలడు నడుస్తున్నాడు. వెనక అచ్చెమ్మ నడుస్తోంది. రాసపల్లి ఊరి చివరికి వచ్చారు. రేగు పండ్ల చెట్ల నుంచి నేల మీద  పడిన రేగు పండ్ల వాసన గుప్పుగుప్పుమని వస్తోంది. బాలడి నోటిలో నుంచి కొంచెం కొంచెం ఊట ఎంగిలి ఊరుతోంది. 
అయ్యోరోళ్ల భాగ్యం ఇడ్లీ అంగడి కాడ గబుక్కున ఆగినాడు బాలడు.
కొడుకు వెనకే వస్తున్న అచ్చెమ్మ దారిపక్కనున్న  అనంతమ్మ గుడి కాడ నిలబడింది. గుడిలోని  బండారు (విభూది) పెట్టుకొంది. కొడుకు బాగుండాలని పడీ పడీ మొక్కుతోంది.
ఇంతలో గట్టిగా బాలడు ‘‘అమ్మా, ఆకలే!’’ అని అరిచినాడు. బాలడి నోట ‘ఆకలి’ అనే పదం వచ్చేసరికి అచ్చెమ్మ నోట్లో తేనె పోసినట్లయ్యింది. కొడుకు దగ్గరికి  ఎగురుకొంటూ వచ్చింది అచ్చెమ్మ. ‘‘ఎన్నాళ్లయిందిరా కొడకా, నీకు ఆకలి తెలిసి. పిడికెడన్నం తిని పదిరోజులయ్యింది కదరా, నీ పసికర్లు పరారైనాయి. నారాయణమ్మ పసరు మందు భలే పనిచేసిందిరా బాలా, అంతా అనంతమ్మ చలవ....రారా కొడకా’’ అంటూ వాడిని ఎత్తుకొని గిరగిరా తిప్పింది.
వాడు అమ్మ ముందర కాసేపు కులికినాడు. రెండు మూడు పల్టీలు కొట్టినాడు. వాళ్ళ అమ్మని ఎత్తబోయినాడు. ఎత్త వద్దని  చెబుతూ అచ్చెమ్మ ‘‘బాలా, అన్ని పాములూ ఎగిరినాయని వాన పాము కూడా ఎగిరిందంట. ఆ మాదిరి వుంది నీ వ్యవహారం, ఇంకొక వారం పత్యంగా వుంటే నువ్వు కోరింది చేసి పెడ్తారా కొడకా! కావాల్సింది తిందువుగానీ’’ అనింది. 
వాడు సినిమా హీరో ఫోజులు పెడుతూ....
‘‘నాకు ఒళ్ళు బాగైపోయిందోచ్, జబ్బు గిబ్బు జాన్తానై. ఇడ్లీ ,దోసెలు తినొచ్చు. 
బెల్లం బర్ఫీ, అల్లం బర్ఫీ తినొచ్చు’’ అంటూ భాగ్యం అంగడికి పోయి రెండు ఇడ్లీలు పెట్టించుకున్నాడు. అడిగడిగి సాంబారు పోయించుకున్నాడు. భాగ్యం సాంబారు పోసింది పోసిందే....అర బకెట్‌ సాంబారు క్షణాల్లో  మాయం.
పడీ పడీ నవ్వుతోంది అచ్చెమ్మ. సాంబారు తాగుతున్న బాలడిని చూసి అంగడి భాగ్యం ముక్కు  మీద  వేలేసుకొంది.
అమ్మా కొడుకుల సంబరం చూసిన అనంతమ్మ విగ్రహం తల పైని తెల్ల చామంతులు బాలడిని ఆశీర్వదిస్తున్నట్లుగా నేల మీద రాలినాయి.
- ఆర్‌ సి కృష్ణస్వామిరాజు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement