మాయన్నగాడు నన్ను పిలవకపోతాడా..! | A Story In Funday On 18th August | Sakshi
Sakshi News home page

మాయన్నగాడు నన్ను పిలవకపోతాడా..!

Published Sun, Aug 18 2019 11:21 AM | Last Updated on Sun, Aug 18 2019 11:21 AM

A Story In Funday On 18th August - Sakshi

‘‘రేయి, సురేష్‌ యాడుండావురా తొందరగా రా అన్నం తిని బరుగోళ్లను తోలుకుని పొదురా’’ అని మా నాయిన అనగానే బయట వున్న మా యన్నగాడు ఉరుకుతా నా దగ్గరకు వచ్చినాడు.
 అప్పుడే బీరువా సందున వున్న బాల్‌ బాడ్మింటన్‌ బ్యాట్‌ మా నాయనకు కానరాకుండా అంగీ యెనకాల దాసిపెట్టుకుంటున్నా.
‘‘ఒరేయ్‌ నాయన పిలుచ్చాన్నాడు మర్యాదగా ఇద్దరం అన్నం తిని బరుగోళ్లకు పోదాం పద’’ అని మా యన్న బుసపెడుతూ చెప్తున్నాడు.
‘‘యెందిరా నువ్వు, అయిన నాయన నీకు సెప్పినాడు నాకు కాదు. నేను రాను నువ్వు పో నేను మ్యాచ్‌ ఆణ్ణికి పోవాల’’ అని గట్టిగా సెప్పిన. 
‘‘ఆ పొతావ్‌ పొతావ్‌ యెట్టాపోతావో సుచ్చా పారా ఆ బ్యాట్‌ నాది ఇట్టతా అది, లేకుంటే పోయి నాయనకు సెప్త. ఆడు బరుగోళ్ళకు రమ్మంటే రాకున్నాడు. బాడ్మింటన్‌ ఆణ్ణికి పోతనాడు అని సెప్త’’ అనేసారికి నాకు బయమేసింది.

నేను రొంచేపు ఆలోసించి  ‘‘ఆ సెప్పురా నాకేం. సెప్తే ముందు ఈ బ్యాట్‌ ఇరగొడ్తాడు. అప్పుడు ఇద్దరికీ ల్యాకుండా పోతాది’’ అనేసారికి మా యన్నగాడు పౌరుషంతో..
‘‘ఆ ఇరగొట్టని నాకేం నాకు బ్యాట్‌ ఇచ్చేవాళ్లు సాన మంది వున్నారు. పోతే ఇద్దరం తోలుకోని పోవాల లేదంటే ఇద్దరం ఇన్నే వుండాల తేల్చుకో మళ్ళా’’ అన్నాడు.
‘‘రేయ్‌ ఇద్దరు లోపల ఏం జెచ్చనారురా పిలచ్చంటే ఇనపడలేదా’’ అని నాయిన లోపలోకి వచ్చానాడు. బ్యాట్‌ పట్టుకొని వుండడం సూసినాడంటే ఇంగా  అంతే మరి ఒక్క యెటుకు  ఇరగొడ్తాడు.
మా ఇద్దరికీ ఇంతకముందే రెండు సార్లు సెప్పినాడు మా నాయన. ఈ రోజు ఎట్టాయిన సరే మ్యాచ్‌ ఆణ్ణికి పోవాల. కంపమళ్ళవురోల్లు వచ్చింటారు. మాకు వాళ్ళకు ఇప్పుడు మ్యాచ్‌ వుంది. సునీల్‌గాడు యెదురుసూచ్చవుంటాడు.
నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్లో వాళ్ళే గెలిసినారు. ఈ రోజు ఎట్టాయిన సరే వాల్ల మిందా గెలవాలని రాత్రి నేను, సునీలుగాడు, సూరిగాడు, బాబాగాడు, అనిలుగాడు కానిగ సెట్టు కింద కుచ్చోని గట్టిగా అనుకున్నాం.

ఇప్పుడే సాన టైమ్‌ అయిపోయింది. ఇడేమో ఇట్ట. రోజు మా యమ్మనే బరుగోళ్లను తోలుకొని పోతుండా. మేము ఆణ్ణికి పోతున్నాం. ఈ రోజు సేన్లో కలుపు తియ్యనికి మా యమ్మ–నాయిన పోతనారు. ఇప్పుడు యెట్టనో అర్థం కాలేదు నాకు. దిక్కు తెలియడంలేదు. నాయిన కోడెలి తీసుకుంటున్నాడు, మా యమ్మ బాటిల్లో నీళ్ళు పోసుకుంటుంది.
 నేను ఇంగా బీరువా దగ్గర మా యన్న గాడితో  కొట్టర్తనా ఇంగా లాభం లేదు అనుకోని
‘‘రేయ్‌ అన్న ఈ ఒక్క రోజుకు నువ్వు పోరా, కావాలంటే రేపు నేను పోతా. మద్యానం నువ్వు రాగానే బరుగోళ్లను నేనే యేటికి తీసుకొని పోతా. మ్యాచ్‌ ఆణ్ణీకి కంపమళ్ళవొళ్ళు వచ్చింటారురా. రేపు వంతు నాదే  ఇప్పుడు నువ్వు పోరా’’ అనేసారికి మా యన్నగాడి కళ్ళు మెరిసినాయి. ఆడు దొరికింది ఛాన్స్‌ లే అని 
‘‘సరే రా పోతా. మరి అట్టాయితే సాయంత్రం నువ్వే కోళ్ళు మూయాలా నా బదులు. దానికి నువ్వు సరే అంటే ఇప్పుడు పోతా, లేదంటే నాయినకు సెప్త ఇద్దరం కలిసి బరుగోళ్ళకు పోదాం’’ అని కళ్ళు ఎగరేసినాడు.
‘‘అమ్మ నా కొడకా రొంచెపులోనే ఎంత ప్లాన్‌ యేసినావ్‌ రా... నాయిన నిన్ను  ఊరికే తిట్టడు రా  బింగిసెవులు నా కొడకా’’ అని మనుసులో అనుకోని ‘‘సరే లే పోతా’’ అని తలకాయ ఊపిన.
‘‘ఏం జెచ్చనారురా ఆడ,  ఏరా పెద్దోడ బరుగోళ్ళకు పోతనరా లేదా ఊర్లో బరుగోళ్ళున్ని పోతనాయీ తొందరగా తిని పొదురారి’’ అని గంపలో కోడెళ్ళు, నీళ్లబాటిల్‌ పెట్టుకుంటుంది మా యమ్మ. 
‘‘ఆ వచ్చానామ్మ’’ అని మా యన్నగాడు అన్నం తిన్నికి పోయినాడు.

నేను సిన్నగా మా నాయినకు బ్యాట్‌ కానరాకుండా గోడకు అనుకోని ఇంట్లో నుంచి బైట పడి ఎగురుకుంటా కలంలోకి ఉరికినా.
కంపమళ్ళ టీమ్‌ వాళ్లతో మూడు ఆటలు ఆడి ఇంటికి వచ్చెసారికి, మా యన్నగాడు బరుగోళ్లను యెట్లోకి పిలుసుకొనిపోయి వచ్చి  గాటికి కట్టేసి దాల్లకు తిండానికి గడ్డి యెచ్చు నన్ను సూసి–
‘‘నల్లనాకోడక మధ్యానం కళ్ల ఇంటికాడా వుంటా యేటికి బరుగోళ్లను తోలుకొని పోతా అని సెప్పి అన్నే వుంటావా’’ అని నా మీదకు ఉరుముతా వచ్చి –
‘‘బ్యాట్‌ మిందా సేయెయ్యి సెప్తనా, రేపునుంచి ఎట్టపోతావో సూచ్చ’’ అని బ్యాట్‌ సేతీలో నుంచి గుంజుకున్నాడు. 
మూడు మ్యాచ్లు ఓడిపోయి ఇంటికి వచ్చిన నాకు మా యన్నగాడి మాటలు ఎక్కలేదు. ముప్పై రూపాయలు పొగుట్టుకున్న బాధే ఎక్కువ వుంది.
 ఆ అనిల్‌ గాడు సరిగ్గా ఆడక మొత్తం మూడు మ్యాచ్లు ఓడిపోయినాం. ఇంతలోనే మా యమ్మ నాయిన సేను కానుంచి వచ్చినారు. మా యమ్మ ఇద్దరికీ అన్నం పెట్టింది. తిని పడుకొని లేసేసారికి టైమ్‌ ఆరైంది. లేచ్చ లేచ్చానే  గాటివైపు సుసినా కోళ్ళకు గంపలు యెయ్యలేదు.

మా యన్నగాడు ఇంట్లో వున్నాడు ఏమో అని సూసిన బ్యాట్‌ కూడా కనపడలేదు. మా యమ్మ బయట నుంచి తిడతావుంది ‘‘ఇనా కొడుకు కోళ్ళు మూయకుండా యాడికి పోయినాడో’’ అని సరే లే వాడుకూడా ఆడుకోవాలి గదా అనుకోని నేను లేసి కోళ్ళకు గంపలేచ్చుంటే మా యమ్మ అట్ట్నే నాకెళ్ళి సుచ్చాంది. ఎప్పుడు మా యమ్మ, అన్న ఇద్దరే కోళ్ళను మూసేది. నేను మా నాయన అటు దిక్కే పోము. మా యమ్మకు పొద్దునా, మధ్యానం జరిగిన యవ్వారం తెలియదు గదా. ఇప్పుడు కూడా కోళ్ళు మూయకుంటే అంతే ఇంగా వాడు నిజంగానే నాకు అస్సలు బ్యాట్‌ ఇయ్యడూ అనుకోని కోళ్ళకు గంపలేసి మొత్తం కోళ్ళను దిబ్బలోలుంచి, బండిదొడ్లలోనుంచి, కలంలోనుంచి తోలుకొని వచ్చేసరికి నా పానం పోయింది. 
ఒక్కసారి మా యమ్మ, అన్న  మిందా జాలి యెసింది. మా ఇంట్లో వున్న అరవై కోళ్ళు రోజు ఎట్టా మూచ్చనారో, ఎంత కట్టపడ్తానారో అనిపించింది.
 నేను కోళ్ళను ఒల్పడం సూసి మా యమ్మ కూడా వచ్చి కోళ్ళను మూసింది. నేను లాస్ట్‌ మా నల్లకొడి దాని పిల్లలను మూసేసరికి మా యన్నగాడు బ్యాట్‌ తీసుకొని నన్ను సూస్తూ ఇంట్లోకి పోయినాడు.
‘‘బింగిసెవులు నా కొడకా కోళ్ళు మూయకుండా యాడికి పోయినావురా సదుకోరా అంటే సదువుకోవు గాని ఆటలు ఆణ్ణికిపొతావ్‌. ముందు  ఆ బ్యాట్‌ యిరగొట్టి పొయ్యిలో పెడితే సరిపోతుంది’’ అనేసరికి ఒక్కసారి నా గుండె వేగంగా పరిగెత్తింది మా సునీల్‌ గాడు కొట్టే బాల్‌ లాగా.

బ్యాట్‌ పోతే కష్టం. యెవ్వరు ఇవ్వరు నేను మా యమ్మ యెపే సూచ్చ నిలబడ్డ ఏం జరుగుతుందో అని. మా యన్నగాడు మాత్రం తాపీగా బ్యాట్‌ బీరువా సందున పెట్టి కాళ్ళు కూడా కడుకోకుండా మంచం ఎక్కి టీవి పెట్టినాడు. 
యెట్ట మా యమ్మ పొయ్యిలో పెట్టదు లే అనే దీమ వాడికి ఎందుకంటే మా నాయనకు తెలియకుండా లెక్క ఎగపెట్టి వాడికి బ్యాట్‌ కొనిపించింది మా యమ్మే గనక. అందరం అన్నం తిని మంచాలు బయట యేసుకొని పడుకున్నాం.
మనుసు మొత్తం నాకు పొద్దున జరిగిన మ్యాచ్‌ మీదే వుంది. అన్నీ కలిపి ఐదు మ్యాచ్లు ఓడిపోయినాం. నాది యాభై రూపాయలు మా సునీలుగాడివి ఎనభై రూపాయలు లెక్క పోయింది. రేపు ఎట్టాయిన సరే అనిల్‌ గాడిని తీసేసి గోపాల్‌ గాడిని పెట్టి మ్యాచ్‌ ఆడి వాళ్ళ మిందా గెలిసి మా లెక్క మేము సంపాదించుకోవాలి అనుకుంటూ పడుకున్నా.
రేపు కూడా సేన్లో కలుపువుందని తెలియదు నాకు. ఇంగా కలుపు తియ్యడం అయిపోలేదు సేన్లో. మా నాయన మళ్ళీ అరుచ్చానాడు ‘‘యాడవుండావ్రా  బరుగోళ్లను ఇప్పుకొని పొదురా’’ అని. 
మా యన్న నా దగ్గరకు వచ్చి ‘‘పోరా ఇనపడలేదా, నాయన నేను పోతా అని సేప్పుపో’’ అంటానాడు. మరిసిపోయినవా నిన్న సెప్పినావ్‌. ఈ రోజు వంతు నీదే పో తొందరగా అని సెప్పిందే సెప్తానాడు.
నాకు ఏడుపు వచ్చాంది. ‘‘నేను పోను’’ అని సెప్పిన నేను ఆణ్ణికి పోవాల నిన్న నాది లెక్క పోయింది.
‘‘నేను పోను నువ్వే పో’’ అని సెప్పినా మాయన్నగాడు ఇన్ల.

వాడు మా యమ్మ కాల్చే రొట్టెలా పెన్నం లాగా మూతి నల్లగాపెట్టి  గబ్బెగ్గిన నా సెతిలో వున్న బ్యాట్‌ గుంజుకున్నాడు. నాకు కోపం వచ్చింది. మా యన్న గాని మిందా కలబన్య. ఇద్దరం కలబడి కొట్టుకుంటూన్నాము. 
అన్నం తినే మా నాయన ఉరుకుతా వచ్చి మా ఇద్దరని ఇడదీసి మా యన్న గాడిని కొట్టినాడు. వాడు ఎడ్చానాడు. నన్ను కూడ యాడ కొడతాడో అని ముందుగానే గట్టిగా ఎడ్సడం మొద్దలుపెట్టినా.
‘‘.... అరగక సచ్చానారు’’ అని తిట్టి మా యన్నగాన్ని లేపి ‘‘బరుగోళ్లకు పో’’ అని దొబ్బినాడు.
వాడు ఎడ్సుకుంటూ యెప్పుడు నేనేనా పోయేది ఆడు వున్నాడుగా ఆన్నీ పొమ్మని సెప్పు అని మా నాయన ముందు గట్టిగా అరిసినాడు. నా కొడకా మళ్ళా అరుచ్చానవా అని ములకట్టే తీసుకొని కాళ్ళమిందా కొట్టేసారికీ పాపం తట్టుకోలేక గట్టిగా ఏడుసుకుంటూ బయటకు ఉరికినాడు.
ఈ నా కొడుకులకు  ఈ రోజు అన్నం పెట్టినావు అంటే నీకు వుంటాది సెప్తనా సూడు అని మా యమ్మ మిందా అరిసి  అన్నం కూడా తినకుండా బరుగోళ్లను ఇప్పుకొని పోయినాడు. 
మా యమ్మ నా యెపు సూసుకుంటూ గంప నెత్తిన పెట్టుకొని సేనుకి పోయింది. నేను అట్నే బీరువా దగ్గర కూలబడిపోయినా. రొంచేపు మా యన్నగాడు కుంటుకుంటా వచ్చి అన్నం పెట్టుకొని తింతనాడు. 
కాలు యెనక బాగం కొద్దిగా వాసింది. ఇద్దరం ఏం మాట్లాడుకోలా నేను అన్నం పెట్టుకొని తింటున్న. వాడు కాలు సూసుకుంటూ అట్ట్నే మంచం మిందా పడుకున్నాడు. 
నేను బయటకు యెల్లి మధ్యానం తిరిగి వచ్చేసారికి మా యమ్మ ఇంటికి వచ్చేసింది. ఎందుకో ఈ రోజు ముందుగానే వచ్చేసింది సేన్లో నుంచి.

‘‘ఇంగా మీ నాయిన రాలేదా?’’ అని అడిగింది నన్ను.
‘‘ఊహూ రాలేదు’’ అని సెప్పిన.
మంచంలో పడుకొని వున్న మా యన్నగాని దగ్గరకు పోయి వాసిన కాలు సూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది మా యమ్మ ..... అంతలోనే మా నాయిన ఒక్కడు ఇంటికి వచ్చినాడు. 
మా యమ్మ ఎనక ముందు సూసి ‘‘బరుగోళ్ళు యేదే?’’ అని అడిగింది మా నాయనను.
మా నాయన కోపంగా ‘‘ఆ గాడిదవోంక కాడ పడినాయిపో. పోయి తెచ్చుకో దూడపిల్ల కాలు ఇరిగింది. దానమ్మ ఒక్కసాట వుండదే యాసిరిక వొచ్చింది. కంకరరాయీ తీసుకొని విసిరిరెచ్చే దానికి కాలుకి తగిలి కిందపడింది. అట్ట్నే సిన్నగా తీసుకొని వచ్చిన పోయి తోలుకొని వచ్చుకపో’’  అని సెప్పగానే మా యమ్మ మా నాయిన యెపు సూసిన సూపు నాకు ఇంగా గుర్తుకుంది.
 సేనుకాడ నుంచి వచ్చి కాళ్ళుకూడా కడుకోకుండా ఉరుకుతా పోయింది బరుగోళ్ల కోసం. యెనిమిది నెలలా కిందట మా యమ్మ వాళ్ళ సెల్లెలు కాడ ఒక బరుగోడ్డును పట్టీచ్చింది. 
అంతకముందు మా ఇంట్లో బరుగోళ్ళు వుండేవి కావు. పాలకు ఇబ్బందిగా వుంది వుంటే మా పిన్ని మాకు ఊరికేనే పట్టీచ్చింది. ఆ బరుగొడ్డు పట్టుకొని రానికి నేను మా యన్ననే పోయింది. బాయోల్లా వెంకటేశ్వర్లతో ఎద్దులబండి కట్టించి నన్ను మా యన్నను పంపించిది మా యమ్మ. మా పిన్ని వాళ్ళ ఉరికానుంచి మా ఊరికి ఇరవై అయిదు కిలోమీటర్లు ఆ నుంచి బండికి వెనక ఆ నల్ల బరుగొడ్డును కట్టి నేను మా యన్న బండిమిందా కుచ్చోని తోలుకొని వచ్చినాం.

ఆ బరుగొడ్డు మా ఇంట్లోకి వచ్చేసరికి దానికి ఎనిమిది నెలలు. మా ఇంట్లోనే ఈనింది. బరుగొడ్డు పట్టుకొని వచ్చినప్పుడు మా యమ్మ ఆనందం సూడాల ఇంగా, ఆ బరుగొడ్డు ఈనినప్పుడు అందులోను పై దూడను ఈనినప్పుడు  మా యమ్మ సంతోషం అలివికాలేదు లే. దావన పోయే అందరకి సూపీచ్చంది. ఆ ఆనందం కొన్ని కోట్లు గుమ్మరించిన దొరికేదీకాదు. అది పెరిగి ఇంట్లో తిరుగతా వుంటే మా యమ్మ కళ్ళు ఇంత పెద్దవి సేసుకోని సూసేది. మా యమ్మ సిన్నగా దూడపిల్లను తల్లిని తోలుకొని వచ్చింది ఇంట్లోకి. మా యమ్మ కళ్ళలో ఆ రోజు రెండు సార్లు నీళ్ళు సూసిన దానికి అంతటా కారణం నేనే. 
నేను పొద్దున గమ్మునా పోయివుంటే ఇట్టవుండేది కాదు. ఇంట్లో సెంగు సెంగునా యెగురుతా వున్న దూడపిల్ల ఇప్పుడు మూలకు కూలబడిపోయింది. మా యమ్మను అన్నను దూడపిల్లను అలారొంచేపు సూసేసరికి నాకు నీళ్ళు తిరిగినాయీ కళ్ళలో.

మా యమ్మ కాళ్ళ మిందా పడాలినిపించింది. మా నాయన పాత బట్టను నీళ్ళలో తడిపి పసుపు బాగా పట్టించి సిన్న సిన్న కర్రలతో దూడపిల్ల కాలుకు కట్టినాడు. మా నాయన సేతులు వణుకుతున్నాయి, ఎంత బాధపడినాడో కట్టేటప్పుడు.
దూడపిల్ల రెండు రోజులకు గాను లేయలేదు. నేను మా యన్న కొన్ని రోజులు దాంక మాట్లాడలేదు. ఆ రోజు నుంచి మళ్ళీ యెండకాలం సెలువులు దాంక ఏ రోజు నేను మా యన్న బ్యాటు ముట్టలేదు, కలందిక్కు పోలేదు. దూడపిల్ల లేసి నడవడం మొదలు పెట్టింది కానీ దాని కాలు మాత్రం సొట్టపోయింది. దాని కాలు వైపు సూసిన పతిసారి నా మీద నాకు అసహ్యం యెసేది. అప్పట్నుంచి యే రోజు మా యన్న నన్ను బరుగోళ్లకు పోదాందా అని అడగలేదు. 
వాడు బరుగోళ్లకు పోయే పతిసారి నేను వాకిలి దగ్గర నిలబడి సూసేవాన్ని ఒక్కరోజు అయిన నన్ను పిలుచ్చాడేమో అని.
- సురేంద్ర శీలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement