ఓ మంచివాడి కథ | Funday Family Story In Sakshi | Sakshi
Sakshi News home page

ఓ మంచివాడి కథ

Published Sun, Jun 23 2019 11:57 AM | Last Updated on Sun, Jun 23 2019 11:57 AM

Funday Family Story In Sakshi

చప్పుడు విని తిరిగి చూసేడు మంచివాడు.వాళ్ల ముఖాలన్నీ ఉదయకిరణాల్లో వింతశోభతో మెరుస్తున్నాయి. ముందుకి సాగే సేనల ఎగిరే జెండాల్లా ఉన్నారు వాళ్లు. వాళ్ల భుజాల మీద మాత్రం బరువైన బండరాళ్లు తీరిగ్గా అమిరున్నాయి. వాళ్లంతా దేవుడి దండులా ఉన్నారు.

మంచివాడు– అతిచెడ్డ వాళ్లందర్లాగే– పుట్టగానే ఏడ్చేడు. చిన్నప్పుడు అమ్మ కేకలేస్తే ఏడ్చేడు. పక్కింటి పిల్లాడు కొడితే ఏడ్చేడు. దెబ్బ తగిల్తే, నొప్పిపుడితే ‘‘అమ్మా! హమ్హా!’’ అంటూ ఏడ్చేడు. చెడ్డవాళ్లు దొంగ ఏడుపులు కూడా ఏడ్చేరు. మంచివాడు అలా చెయ్యలేక కొంతగా ‘‘చిన్నప్పుడే చెడిపోయేడు వెధవ!’’బళ్లో చేరగానే మంచివాడి పలక విరగ్గొట్టేరు. అతనికి బూతు పేరు పెట్టారు. అతని పాత చొక్కాని చింపేరు. కొత్త చొక్కా మీద కరక్కాయ సిరా వొలకబోసేరు. కొన్నాళ్లయాక ఆటల్లో అతన్ని డొక్కలో తన్నేరు. పక్కలు పొడిచేరు. మండీకొట్టి మడమసీల మీద తన్ని, అతనికాళ్లు విరగ్గొట్టబోయేరు. మంచి ఆటల టీముల్లోకి అతన్ని రాకుండా చేసేరు. పెద్దయాక అతను తెచ్చుకున్న టెక్స్‌స్టుబుక్కలరువు తీసుకుపోయేరు. అతను రాసుకున్న నోట్సు ఎత్తుకుపోయేరు. అతను చదువుకునే సమయంలో డిస్టర్బ్‌ చేసేరు. అతను పడుకున్నప్పుడు వాళ్లంతా చదువుకున్నారు. ఆఖర్న, పరీక్షలో అతను రాసిన జవాబులన్నీ కాపీ కొట్టేరు.
 
మంచివాడు పరీక్షలు పాసయేక, మంచి ఉద్యోగానికి అర్జీపెట్టి వెళ్తే అధికార్లు అతణ్ణి ఎగాదిగా చూసేరు. అన్ని ప్రశ్నలూ వేసేరు. కొంతసేపు ఆలోచించేరు. నీకు పర్సనాలిటీ లేదు పొమ్మన్నారు. మంచివాడు తిరిగీ తిరిగీ ఒక చిన్న నౌఖరీలో కుదురుకొంటే, అతణ్ణి ఆఫీసరొకసారి మెచ్చుకున్నాడన్చెప్పి హెడ్‌గుమాస్తా కసురుకున్నాడు. పని పెట్టుకుని మంచివాడి చేత అరవచాకిరీ చేయించుకున్నాడు. ఆఫీసులో పెద్దలూ పిన్నలూ అంతా కలిసి, మంచివాణ్ణి, కనీసం చిల్లర లంచాలైనా తినమన్నారు; అతను తిననంటే వెక్కిరించేరు. వెర్రిపీరన్నారు, కక్షగట్టేరు, తంటాలు తెచ్చేరు, అతణ్ణి ఊరూరా తిప్పేరు. ఏ సీటుకీ పనికిరావన్నారు. ఎందుకూ కొరగానివాడన్నారు.
మంచివాడికి చాలాకాలం వరకూ పెళ్లి కాలేదు.

‘‘అంత మంచివాడికి పిల్లనిస్తారే అనుకోండి! కాని, వాడి దినమే తీర్చుకోలేనివాడు దాని దినం ఎలా తీర్చగలడు?!’’ అంటూ చాలామంది పెదవులు విరిచేసుకున్నారు.
చివరికొక మంచి ముహూర్తాన మంచివాడు ఓ అరమనిషి సైజుగల ఆడమనిషికి పుస్తెగట్టి ఆనందబాష్పాలు రాల్చేడు. ఆమెనతను ప్రేమించేడు. ఇవ్వగలిగినంత సుఖమామెకి ఇచ్చేడు. ఆవిడ కాపరానికొచ్చేక, పక్కింటికి వెళ్లి అక్కడి కోడలి నగలు చూసి కిలకిల్లాడి, ఇంటికొచ్చి విలవిల్లాడిపోయింది. ఎదుటింటి ఆడబడుచు కోకలు చూసి మురిసిపోయి ఇంటికొచ్చి గింజుకుపోయింది. తన భర్త చవట పెద్దమ్మనే నిశ్చయానికొచ్చింది. టాపు తీసి కార్లో షికారూ. అద్దాల మేడల్లో కాపురాలూ, నిలువుటద్దాల ముందు ముస్తాబులూ, డన్లప్పరుపుల మీది సుఖాలూ తల్చుకొని ఆమె తహతహలాడిపోయింది. చివరకావిడ బక్షీసుల్తో బలిసిన ఆఫీసు బంట్రోతు కుర్రాడే తన పెనిమిటి కంటే చలాకీగా ఉన్నాడనే నమ్మకానికి వచ్చింది. ఓ రోజున ఆవిడ ఓ స్టూడెంట్‌ కుర్రాడికి బట్టలిచ్చిన సొగసూ, జోడిచ్చిన పొడవూ చూసి మురిసిపోయింది. ఆ తర్వాత ఒక సాయిబుగారి మెహర్బానీ చూసి మోజుపడింది. ఒక పోయట్‌గారి కాళ్లూ కనుబొమ్మలూ చూసి మోహపడి భ్రాంతిపడింది. చివరికొక– షావుకారిగారి డబ్బుచూసి మోహపడిపోయింది.

మంచివాడికి అన్ని రహస్యాలూ తెలిసివచ్చిన తర్వాత, అందుగురించి ఏం చెయ్యాలో తెలియక, మనసు కమిలిపోగా కుమిలి కుమిలి ఏడ్చి, చీకట్లో దేవుణ్ణి ప్రార్థించి ప్రార్థించి, నొప్పితో కనురెప్పలు మూసుకుపోగా ఎలాగైతేనేం నిద్రపోయేడు. అప్పుడా మంచివాడికి భగవంతుడు కలలో, దివ్యసుందర విగ్రహంతో కనిపించి, నాలుగు చేతుల్తోనూ ఆ మంచివాణ్ణి మృదువుగా నిమిరి, కరుణాకటాక్ష వీక్షణాన్ని అతనిపై కురిపించి, మృదుమధుర హాసంతో అతణ్ణి ముద్దుగా మురిపించి, ‘‘ఈ తరువాత రాబోయే నీ ఆరువందల రెండో జన్మలో నీకు మేలు కలుగుతుంది. అందాకా కాస్త ఓపికపట్టు నాయనా!’’ అని చెప్పి అతని కలలోంచి నిద్రలోంచి జారుకున్నాడు.
అప్పుడు మంచివాడు నిద్రలో నిట్టూర్చిన నిట్టూర్పు ఆ జారుకున్న దేవుణ్ణి వెతకడానికి వెళ్లి దారి కనిపించక గాల్లో కలిసిపోయింది.

మర్నాడు మంచివాడు బాధని దిగమింగుకొని దాన్ని అరిగించుకోలేక పైకి కక్కలేక, మెల్లిగా నడుచుకుంటూ ఆఫీసుకి వెళ్తే ఆఫీసు డిప్యూటీ అతన్ని గంటసేపు తిట్టేడు. గంటపైని నాలుగో నిమిషందాకా తిట్లు తిన్నాక మంచివాడికి అలకొచ్చి మంచికోపం (మంచివాడి కోపం) వచ్చింది. దాన్తో ఆఫీసులో అంతా అతన్ని ‘‘తిరుగుబోతు’’వన్నారు. ఛార్జీలు ఫ్రేం చేసేరు, ఎంక్వయిరీ జరిపించేరు, వార్నింగిచ్చేరు.అలాగ నాలుగైదు ఎంక్వయిరీలు జరిపించేక మంచివాణ్ణి ఉద్యోగంలోంచి డిస్మిస్‌ చేసేరు. మంచివాడి స్నేహితులు ‘‘నీ కోపమే నీ కొంప ముంచింది’’ అన్నారు. విరోధస్తులు ‘‘పొగరుబోతు వెధవకి ప్రాయశ్చిత్తం జరిగింది’’ అన్నారు. చాలామంది అతనికి శౌర్యం లావన్నారు. చుట్టాలంతా అతణ్ణి ‘‘నీ బతుకేదో నువ్వు బతుకు, బతకలేకపోతే నీ ఇష్టం వచ్చింది చేసుకో! కాని, మమ్మల్ని మాత్రం– నీకు పుణ్యం ఉంటుంది చంపక’’న్నారు. అతని భార్య అతణ్ణి షావుకారుగారి కొట్లో గుమాస్తాగా చేరి కుక్కలా పడుండమంది.

మంచివాడు నీచానికి దిగలేనన్నాడు. చెడ్డపని చేయలేనన్నాడు.‘‘నువ్వెందుకూ పనికిరావు. మరి ఎలా? ఏ యేట్లో పడిచస్తావో చావు!’’ అని అంతా అతనికి ఉచితంగా సలహా ఇచ్చేరు.  మంచివాడు పళ్లు కొరికేడు, జుట్టు పీక్కున్నాడు. కడుపు మాడగా, కళ్లు మండగా, కాళ్లు పీకగా, గాలి పీలుస్తూ, నీరు తాగుతూ, ఎండ తింటూ, ఊరంతా తిరిగి తిరిగి అంధకారంలో మునిగేడు.ఊరవతల అర్ధరాత్రి చీకట్లో కొండవార బండరాతి మీద కూర్చొని మంచివాడు, ‘‘నేనేం చెయ్యడం?!’’ అంటూ గావుకేకలు వేసి దేవుణ్ణి ప్రశ్నించేడు.దేవుడు పలకలేదు. బండరాయిపక్క కొండమాత్రం ‘‘డం???’’ ‘‘డం???’’ అంటూ ప్రతిధ్వనించింది. అది విని విని మంచివాడు వెర్రిగా నవ్వేడు.ఆఖరికి అక్కణ్ణుంచి లేచి చీకట్లోంచి, కాట్లోంచి, రోడ్డుమీంచి ఊళ్లోకి వచ్చి అందర్నీ సలహాలడిగేడు. కొంతమంది నవ్వేరు. కొంతమంది నిట్టూర్చేరు.మరో నౌఖరీ చూసుకోకూడదా? దొరకదు దొరకదనీ ఫో పొమ్మనీ అంతా గెంటేశారు. షాహుకారు కూడా ‘‘ఉంపుడుగత్తె పక్కలో ఉంటే పక్కనే మొగుడెందుకు?’’ అనుకున్నాడు. అంతాకూడా, తిక్కవెధవలూ తిరుగుబోతు వెధవలూ చాకచక్యంలేని వెధవలూ మాకక్కర్లేదు పొమ్మన్నారు.

కిల్లీకొట్టు పెడితేనో?
పెట్టలేవు. పెట్టినా నడపలేవు. నీకు కిల్లీలు చుట్టడం అయినా రాదు. వచ్చినా నీ పానంతా అరువుగాళ్లు తినేస్తారు.

కిరాణాకొట్టు ఓపెన్‌ చేస్తేనో?
నీకు మదుపులేదు, చురుకులేదు. తప్పు తూనికల్తూచలేవు. దొంగసరుకు అమ్మలేవు. చిల్లర ఆఫీసర్లకి లంచాలివ్వలేవు. బీదవాళ్లకి అరువివ్వకుండా ఉండలేవు. లాభాల్తియ్యలేవు.

మరేదైనా వ్యాపారం?
నువ్వే వ్యాపారానికీ పనికిరావు. మదుపుండాలి, మాయుండాలి. రెండూ లేవు నీ దగ్గర.

రిక్షా లాగితేనో?
లాగలేవు. లాగినా రెండేళ్లలో గుండె ఆగి చస్తావు.

వ్యవసాయం? భూమెవడిస్తాడు?! చాకలి పని? బారిక పని?
నువ్వాఖరికి మంగలి పనిక్కూడా పనికిరావు. బుర్రగొరగడం కూడా ఆనెస్ట్‌గా గొరుగుతానంటావు. బుర్ర దగ్గిర నయాపైస కిట్టదు. అలాగైతే, అయినా, మాయగాళ్లు లక్షమందుండగా నీ చేత ఎవడు గీయించుకుంటాడు బుర్ర?! నీకు ఆ ఛాన్సే లేదు.


మరైతే నేనెందుకు పనికొస్తాను?
నువ్వెందుకూ పనికిరావు. దొరపని (అంటే దొంగపనే అనుకో) ఆ పనికీ పనికిరావు. అసలైన దొంగపనికి అసలే పనికిరావు– అన్నారంతానూ.
సాయంకాలం ఏడయింది. మంచివాడికి ఏడుపొచ్చింది.‘‘మరైతే నేను చావడానికి తప్ప మరి ఎందుకూ పనికిరానా?!’’ అంటూ అతను సముద్రం వైపు పరిగెట్టేడు. అక్కడ ఒడ్డున నిశ్చేష్టుడై నిలబడిపోయేడు. చీకట్లో సముద్రపు కెరటాలు ‘‘నువ్వు చావుకి’’ అంటూ పైకి లేచి, ‘‘ఫ్ఫన్కి రావ్‌’’ అంటూ గభీమని విరిగి ‘‘నువ్వు చావనూకూడా లేవుస్మా!’’ అనే అర్థంతో మాటల్ని విరిచి విరిచి అతని సుస్పష్టంగా తెలిసేట్టుగా అరిచి అరిచి చెప్పేయి.రాత్రంతా చీకటిగా బాధల పుట్టలా ఉంది.రాత్రంగా చీకటిగా రాక్షసబొగ్గుల గనిలా ఉంది. తెల్లవారింది. నిప్పురవ్వలా ఇనుడు ఉదయించేడు. నీళ్లలోంచి నిప్పుల చక్రంలా బైటికి పూర్తిగా లేచేడు. సముద్రానికీ కొండకీ మధ్య ఇసుకలో నిల్చొనే ఉన్నాడు మంచివాడు.

చీకటంతా బెదిరి చెదిరిపోయింది. ఆకాశంలో మబ్బులు తూలి తూలి పోయేయి. తెలివొచ్చిన చల్లగాలి వీచి వీచి పోతోంది. సముద్రపు కెరటాల తురాయిలన్నీ రంగురంగుల రంగుల్తో పైకి పైకి లేచేయి.అంతలో భూమి అదిరింది. ఎక్కణ్ణుంచో కోటి గొంతుల పాట వినిపించింది.చప్పుడు విని తిరిగి చూసేడు మంచివాడు.
వాళ్ల ముఖాలన్నీ ఉదయకిరణాల్లో వింతశోభతో మెరుస్తున్నాయి. ముందుకి సాగే సేనల ఎగిరే జెండాల్లా ఉన్నారు వాళ్లు. వాళ్ల భుజాల మీద మాత్రం బరువైన బండరాళ్లు తీరిగ్గా అమిరున్నాయి. వాళ్లంతా దేవుడి దండులా ఉన్నారు.‘‘మమ్మల్ని రాయిమడుసులంటారు. మేం మంచిలోకాన్ని నిర్మించడానికి వెళ్తున్నాం’’ అన్నారు వాళ్లు.
మంచివాడికి కళ్లంట ముత్యాల బిందువులు రాలేయి. అతను అతి నిర్మలంగా నవ్వేడు. వెంటనే జీవితం అనే బండరాయి తీసి భుజాన వేసుకొని పాటతో పాటు అతను అటువైపు నడిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement